Site icon Sanchika

ఝలక్

[అనుకృతి గారు రచించిన ‘ఝలక్’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]కొ[/dropcap]త్త ఇంగ్లీష్ లెక్చరర్ జాయిన్ అవుతోందని తెలిసి ఎలా వుంటుందోనని అందరిలో కుతూహలం కలిగింది. ముఖ్యoగా ఇంగ్లీష్ హెడ్ కామేశ్వరి, ఎకనామిక్స్ మార్గరెట్‌కి. వీళ్లిద్దరూ నిత్య శంకితులు, ఎవరి ఇంటిగ్రిటీ మీద నమ్మకo లేనివాళ్లు. అందుకే ఇద్దరికీ బాగా జత కుదిరింది. వాళ్లిద్దరికీ పనికంటే, పనిచేసేవాళ్ళలో తప్పులెన్నటం అలవాటు.

అరవింద జాయిన్ అయినప్పుడు, ఆమె ప్రొఫైల్ చూసి ప్రిన్సిపాల్ సిద్ధేశ్వర్ చాలా సంతోషపడ్డాడు. అది లీడ్ కాలేజీ జిల్లాలో. త్వరలో NAAC Accreditation కి సిద్ధమౌతోంది. ఈ సమయంలో మంచి అనుభవo, computer savvy అయిన అరవింద లాంటి వాళ్ళ సర్వీసెస్ కాలేజీకి చాలా అవసరం. తన అవసరాన్ని గుర్తించి ఆమెని ఇక్కడికి పోస్ట్ చేసిన కమిషనర్‌కి కృతజ్ఞలు తెలిపాడు వెంటనే.

“మాడం, రేపటినుండి ప్రిన్సిపల్స్‌కి NAAC ట్రైనింగ్ వుంది, నేను వచ్చాక మిమ్మల్ని స్టాఫ్‌కి పరిచయం చేస్తాను” అంటూ ఆమెని కామేశ్వరిని పిలిచి పరిచయం చేసాడు. అరవిందని చూసాక కామేశ్వరిలో జెలసి లాంటిదేదో కలిగింది. తాను చాలా బావుంటానని కామేశ్వరి నమ్మకo. అరవిందకి 35 వుంటాయేమో. తెల్లగా, పొడవుకు తగ్గ లావుతో ఆకర్షణీయంగా వుంది, పైగా PhD కూడా వుంది ఆమెకి. అంతకు ముందు అనుభవం గురించి అడిగినప్పుడు, టీచర్‌గా చేశానని చెప్పింది విని పెదవి విరిచింది కామేశ్వరి.

సైన్స్ విభాగాలకు సెపెరేట్ స్టాఫ్ రూమ్స్ వున్నాయి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ విభాగాలకు ఆర్ట్స్‌కి విశాలమైన స్టాఫ్ రూమ్ వుంది. అరవిందని లంచ్ టైములో అందరికి పరిచయం చేసింది కామేశ్వరి మార్గరెట్ నిశితంగా చూస్తోంది అరవిందకేసి.

“సర్వీస్‌లో ఇంత లేటుగాజాయిన్ అయ్యారేం?” ప్రశ్నించింది.

“MA ఇంగ్లీష్ లిటరేచర్ డిస్టింక్షన్ పాస్ అయ్యాను. తర్వాత M.Phil., తర్వాత PhD చేసాను, నెట్ క్వాలిఫై అయినా కూడా , ఎలక్షన్స్ ఇంకా రకరకాల కారణాల వలన పోస్టింగ్ లేట్ అయ్యింది, టీచర్ గా పని చేసాను. ఇప్పుడు ఇక్కడ పోస్ట్ చేశారు”

“కానీ, 36 ఏళ్ళు అంటున్నారు, మీకు రిటైర్ అయ్యేసరికీ ఫుల్ పెన్షన్ రాదు” అంది కొంచం అవహేళనగా. నవ్వింది అరవింద.

“పిల్లలెంతమంది?”

“ముగ్గురు”

“ఓ, ఏం చదువుతున్నారు?”

“పెద్దబాబు అజయ్ లండన్ బిజినెస్ స్కూల్ ఫైనల్ సెమిస్టరులో వున్నాడు. సంజయ్ రెండవ వాడు, ఎయిమ్స్, ఢిల్లీలో చదువుతున్నాడు. మా అమ్మాయి నేహా ఢిల్లీ లోనే CA, మొన్ననే జాయిన్ అయ్యింది. మా వారు ఇండియన్ నేవీ నుండి రిటైర్ అయ్యారు.”

ఆమె చెబుతున్నప్పుడు మిగతా స్టాఫ్ మెంబెర్స్‌కి ఆశ్చర్యం, అడ్మిరేషన్ కలిగాయి. ఇంకా ఏమి అడిగేదో మార్గరెట్ కానీ , అటెండర్ వచ్చి ప్రిన్సిపాల్ రమ్మంటున్నారని చెప్పాడు..

“రాగానే పని చెబుతున్నానని అనుకోకండి మాడం, నాది సైన్స్ బ్యాక్‌గ్రౌండ్. ఈ రిపోర్ట్ కమిషనర్‌కి సబ్మిట్ చెయ్యాలి, ప్లీజ్, కొంచం టైపు చేసి పెడతారా?” అడిగారు అరవిందని.

“సర్, మీరలా రిక్వెస్ట్ చేయవద్దు, ఏ వర్క్ అయినా చేస్తాను, నాకు అలవాటే, మీరు తెలుగులో రాసింది ఇవ్వండి, ఇప్పుడే చేసి ఇస్తాను” అంది నమ్రతగా.

ఆయన మొహంలో ఎంతో రిలీఫ్ కనిపించింది. ఆయన ఇచ్చిన పది పేజీలు ఆసాంతం చదివి, కొన్ని సందేహాలు క్లియర్ చేసుకొని, లాప్‌టాప్‌లో అత్యంత వేగంగా టైపు చేయనారంభించింది. ఆమె వేగానికి ఆయన ఆశ్చర్యపోయాడు. పావుగంటలో ట్రాన్స్‌లేషన్ చేసిన మాటర్‌ని ఆయనకు చూపించింది.

“చాలా థాంక్స్ అమ్మా,” అన్నారాయన.

“కాలేజీ వర్క్ ఏదైనా చేస్తాను సర్, మీరలా థాంక్స్ చెప్పవద్దు” అంటూ సెలవు తీసుకొంది.

***

సిద్ధేశ్వర్ జాయిన్ అవగానే కామేశ్వరిని పిలిచి అరవిందకి 3 గంటల తర్వాత classes ఏమి లేకుండా టైం టేబుల్ మార్చమన్నాడు.

కామేశ్వరికి చాలా కోపo వచ్చింది, “నిన్నగాక మొన్న జాయిన్ అయ్యింది, అనుభవo డిగ్రీ కాలేజీ లెక్చరరుగా అనుభవo లేదు. ఒక టీచర్ అంతే, ఎందుకింత ఇంపార్టెన్స్ ఆవిడకి, నాకు తెలియక అడుగుతాను” అంది కోపంగా,

సిద్ధేశ్వర్ ప్రశాంతంగా అన్నాడు, “నాకు పనిచేసేవాళ్ళు కావాలి, మిమ్మల్ని చాలాసార్లు రిక్వెస్ట్ చేసాను, మీరు కాలేజీ టైమింగ్స్‌కి ఒక్కనిమిషం కూడా ముందురారు, అయిదు తర్వాత ఒక్క నిమిషం వుండరు, ఆవిడ ఒక గంట సాయంత్రo ఉండాల్సి వచ్చినా వుంటున్నారు, పైగా మీరు సిస్టం టచ్ చెయ్యరు కదా” వ్యంగ్య౦గా అన్నాడు.

“రామ్ కుమార్ వున్నారు కదా, ఆయనవి ఎన్ని లెటర్స్, articles ఇంగ్లీష్ పేపర్స్‌లో పబ్లిష్ అయ్యాయని తెలుసు కదా, మీరు కావాలనే సీనియర్స్‌ని ఇన్సల్ట్ చేస్తున్నారు.”

“పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదనీ మీకు తెలుసు, ఆయననీ అడిగాను, కుదరదన్నాడు, నాకు చాలా సమస్యలున్నాయి, మీరు కొత్తవి తేవద్దు, ఈ సమయంలో నాతో కలిసిరాని వాళ్ళని, పని చెయ్యని వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయటానికైనా కమీషనర్ వెనుకాడరని మీకు తెలుసు. వెళ్లి నేను చెప్పినట్టు చేయండి” అధికార స్వరంతో అన్నాడు.

“NAAC అంటే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్, 1994లో యూజీసీ ఎస్టాబ్లిష్ చేసింది. అది బెంగుళూర్‌లో వుంది. NAAC ఇచ్చే గ్రేడ్‌తో విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ లభిస్తుంది. కాలేజీకి ఫండింగ్ వచ్చి ఫెసిలిటీస్ పెరుగుతాయి. ఒకసారి ఇచ్చిన గ్రేడ్ వాల్యూ ఐదేళ్లు ఉంటుంది. అయిదేళ్ల తర్వాత అసెస్మెంట్ అవుతుంది. A+, A++ గ్రాడ్స్ అత్యుత్తమయినవి. దీనికి సమిష్టి కృషి అవసరం. నిరంతరం తాము పనిచేసే విద్యాసంస్థ అన్ని రంగాల్లో ప్రోగ్రస్ అయ్యేలా పని చేయాలి. ఇది ఒక్క రోజులో సాధ్యం కాదు.

ఉద్యోగ అవకాశాలు పెరిగేలా చూడాలి. ప్రతి ఐదేళ్లకు పురోగతి అన్ని రంగాల్లో చూపాలి, లేకపోతే సాధించిన గ్రేడ్ పోవచ్చు. టెక్నికల్‌గా ఎదగాలి, స్టడీ ప్రాజెక్ట్స్, మాడ్యుల్స్ తయారు చేయాలి గ్రేడ్‌ని బట్టి ఉద్యోగ అవకాశాలు, నిధులు ఉంటాయి. NAAC కి వెళ్ళటమంటే నిరంతర సాధన, అందుకే ప్రతి ఒక్కరు అందరితో కలిసి నడవాలి.” సిద్ధేశ్వర్ స్టాఫ్ మీటింగ్‌లో చెప్పాడు.

“ఎప్పటికప్పుడు మన ప్రోగ్రెస్‌ని అప్‌డేట్ చేసి పంపాలి, దీనికి ఇంగ్లీష్ డ్రాఫ్టింగ్ perfect గా ఉండాలి, ఇందుకే మేము ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ మీద చాలా ఆధారపడాల్సి వస్తుంది, రెండేళ్లు ఎటువంటి ప్రోగ్రెస్ లేదు, అందుకే నన్ను ఆరు నెలల క్రితం ఇక్కడికి పోస్ట్ చేశారు. మీరు నాకు సంపూర్ణ సహకారం ఇస్తారని ఆశిస్తాను” అంటూ ముగించాడు.

***

రెండు రోజుల కసరత్తు తర్వాత టైం టేబుల్ మారింది. సైన్స్ నుండి ఇద్దర్నీ, కామర్స్ నుండి ఇద్దర్నీ, టీం చేసి, సీనియర్ గోపాల్రావుని కో ఆర్డినేటర్‌గా, ‘కమిటీ హెడ్డు’గా,  నియమిస్తూ స్టాఫ్‌కి నోటీసు పంపాడు. ఎక్కువమంది తమ మీద భారం వేయనందుకు చాలా సంతోష పడ్డారు.

అరవింద లేని సమయంలో కామేశ్వరి మిగతా స్టాఫ్‌తో అన్నది, “మనం క్లాసెస్ రెగ్యులర్‌గా తీసుకొందాము, మనకేమి స్టడీ ప్రాజెక్ట్స్ ఉంటాయి?, మీరు కామ్‌గా ఊరుకోండి” అని చెప్పింది.

ఒక వారం చూసాడు సిద్ధేశ్వర్, తర్వాత కాంట్రాక్టు ఫాకల్టీకి మీటింగ్ పెట్టి, మీరు ఎవరు మార్గదర్శకంగా ఉంటే వాళ్ళను ఫాలో అవ్వండి, లేకపోతే మీరు ట్రాన్స్‌ఫర్ ఆర్డర్స్ తీసుకోవాల్సి వస్తుంది అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు వాళ్లిద్దరూ అరవింద గైడెన్స్‌లో చేయాల్సినవన్నీ నేర్చుకొని, పిల్లలతో స్టడీ ప్రాజెక్ట్స్ చేయిస్తూ ముందుకు పోతున్నారు.

కామేశ్వరికీ, మార్గరెట్‌కీ ఈ విషయం ఎంత మాత్రo మింగుడు పడలేదు. పైగా ఆమె టీచ్ చేసే పద్ధతి మీద కూడా ప్రిన్సిపాల్‌తో కంప్లైంట్ చేసింది. డిపార్ట్‌మెంట్‌లో ఇద్దరు గెస్ట్ ఫాకల్టీతో కలిపి, మొత్తం అయిదుగురు వున్నారు. రామ్ కుమార్‌ది గోడమీద పిల్లి వాటం, తనకు లాభం లేని విషయాలని పట్టించుకోడు. డిగ్రీ స్టూడెంట్స్ ఎవరు లాంగ్వేజ్ క్లాస్‌లో టెక్స్ట్ బుక్స్ తీసుకురారు, కేవలం పాస్ అయితే చాలు అన్న ధోరణిలో వుంటారు. ఎందుకంటే మూడు భాషలలో వచ్చిన మార్క్స్ టోటల్‌లో కలవవు కనుక. వాళ్ళకి సబ్జెక్టు ఇంటరెస్ట్ కలిగేలా, ప్రతి పాఠాన్ని పవర్ పాయింట్ చేసి అర్థం అయ్యేలా టీచ్ చేస్తున్నది. ఆమె తన స్వంత పోర్టబుల్ ప్రొజెక్టర్ వాడుతున్నది. ఇది కామేశ్వరికి కంటగింపుగా మారింది. నెల లోపే ఆమె స్టూడెంట్స్ ప్రేమని పొందగలిగింది. ఆమె పద్ధతిలో స్టూడెంట్స్ క్లాస్ రూంలో చాలా ఆక్టివ్‌గా వుంటున్నారు.

ఇవన్నీ భరించలేక పోతోంది కామేశ్వరి. ఆ రోజు ఫైల్ మర్చిపోయి మళ్ళీ వెనక్కు రావాల్సి వచ్చింది అరవిందకి. రూంలో కామేశ్వరి, మార్గరెట్ చిన్నగా మాట్లాడుకొంటున్నారు.

“ఇప్పట్నించీ ఆరింటిదాకా ప్రిన్సిపాల్ రూంలో ఉంటుంది, చుట్టూ ఆఫీస్ వెధవలు. కమిటీ వాళ్ళు, ప్రిన్సిపాల్, మొత్తానికి అంతా మొగవాళ్లే, బాగానే ఎంజాయ్ చేస్తున్నది.”

“పాపం, రిటైర్ అయిన ముసలి మొగుడు, పైగా రెండో భార్య, లేకపోతే అంత పెద్ద పిల్లలు ఎక్కడనించి వస్తారు? ఇంట్లో ఎలాగూ సుఖం లేదు, ఏదోలే పాపం ఎంజాయ్ చెయ్యనీ” మార్గరెట్ అంటున్నది.

తల తిరిగి పోయింది అరవిందకి. మొదటిసారి షేక్‌స్పియర్ లైన్ ‘the motiveless malignity’ కి అర్థం తెలిసింది, వీళ్ళ కింత అకారణ ద్వేషమేమిటి తనంటే? తనను తాను సంబాళించుకోవటానికి కొంచెం సమయం పట్టింది ఆమెకు.

అరవింద హఠాత్తుగా ప్రత్యక్షం అయ్యేసరికి, ఇద్దరూ షాక్ తిన్నట్టు చూసారు ఆమెకేసి. అదేమీ పట్టించుకోకుండా ఫైల్ తీసుకొని వెళ్ళిపోయింది అరవింద.

ఆ సండే తన డిపార్ట్‌మెంట్ మెంబర్స్‌నీ, NAAC టీంని, ప్రిన్సిపాల్‌నీ మిగతా లేడీ స్టాఫ్‌నీ భోజనానికి పిలిచింది. అంతా కలిపి ఇరవై మంది దాకా అయ్యారు. అందరికీ కుతూహలంగానే వుంది. పల్లెటూరు కానీ, టౌన్‌కి పది మైళ్ళ దూరం లోనే వున్నది. వాళ్లకి గేట్ దగ్గిరే తెల్లటి లాల్చీ, పైజామాలో వున్న ఒక పెద్దాయన వాళ్ళని స్వాగతించాడు “రండి, రండి” అంటూ. మార్గరెట్‌ని చేత్తో పొడిచింది కామేశ్వరి.

ఆయనకు డెబ్భై దాకా ఉంటాయి, మనిషి మాత్రo స్ట్రాంగ్‌గా వున్నాడు. అరవింద కూడా బయటకు వచ్చి, అందర్నీ లోపలికి తీసుకు వెళ్ళింది. అత్యంత ఆధునికంగా, అన్ని సౌకర్యాలతో వున్న డూప్లెక్స్ ఇల్లు అది. పనమ్మాయి నిమ్మరసం గ్లాసులలో తీసుకు వచ్చింది, అరవింద తానే ఎంతో మర్యాదగా సర్వ్ చేసింది. చాలా పెద్ద హాల్. అది, ఎవరికీ ఇబ్బంది లేకుండా దివాన్ సెట్స్, సోఫాలలో సర్దుకున్నారు. ఆ ఇంటి అలంకరణ, చాలా కళాత్మకంగా వున్నది.

లోపల్నించి ఎంతో హుందాగా వున్న ఒక పెద్ద వయసు ఆవిడ వచ్చి అందర్నీ పలకరించింది. ఆవిడ “అమ్మాయి రోజూ మీ అందరి గురించి చెబుతోంది. రాగానే ప్రిన్సిపాల్ గారు తన మీద పెట్టిన నమ్మకం చూసి మేము చాలా సంతోషించాము. మావారు మిలిటరీలో పని చేశారు, ఆయనకు వ్యవసాయం అంటే చాలా ఇష్టo, అందుకే మా ఇంటి అవసరాల కోసo కూరగాయలు, పండ్లు మేమే పండిచుకొంటాము. మేము అయిదేళ్ల క్రితమే వచ్చి ఈ ఇల్లు కట్టి వ్యవసాయం ప్రారంభించాము.”

అంతలో గుమ్మంలో, వాకిట్లో చూసిన పెద్దమనిషి లోపలికి వచ్చాడు.

అరవింద “మా మామగారు పరమేశ్వర్, అత్తయ్య శోభ. మామయ్య ఇండియన్ ఆర్మీలో మేజర్‌గా పని చేసి రిటైర్ అయ్యారు.” మార్గరెట్ కామేశ్వరి మొహాల్లో నెత్తురు చుక్క లేదు. అందరూ గౌరవ సూచకంగా లేచి నిలబడ్డారు. అందరికీ గోబీ మంచూరియా స్టార్టర్స్ సెర్వ్వ్ చేసింది అరవింద.

పైన మేడమీద నుండి దిగివస్తూ “మాస్టార్లకి ఇంత మైల్డ్ స్వాగతమా” నవ్వుతూ వచ్చాడు గౌతమ్. నలభై దాటినా ఎంతో హుందాగా, మిలిటరీ హెయిర్ కట్‌తో ఒక సైనికుడు ఎలా ఉండాలో అంతే అందంగా, మిలిటరీ శరీర సౌష్టవ౦తో హుందాగా వున్నాడు

గౌరవ సూచకంగా మళ్ళీ అందరూ లేవబోయారు. గౌతమ్ “నో ఫార్మాలిటీస్” అంటూ వారించి అందరికీ నమస్కరించాడు. సోఫా ప్రక్కన నిలుచున్న అరవిందకు దగ్గరిగా నుంచున్నాడు. ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’లా వున్న ఆ జంటని అంతా అడ్మయిరింగ్‌గా చూస్తున్నారు, ఒక్క మార్గరెట్, కామేశ్వరి తప్ప.

“రోజూ కాలేజీ విషయాలు చెబుతుంది నాతో. రాగానే ప్రిన్సిపాల్ గారు ఆమెపై ఎంతో నమ్మకముంచి నందుకు చాలా సంతోషంగా వుంది. అరవింద మా ఇంటికి కోడలిగా వచ్చినప్పుడు ఇరవై రెండేళ్లు. నా సీనియర్ విశాల్ నాకు చాలా ఆప్త మిత్రుడు. సామాన్యంగా ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో యుద్దాల్లో ప్రాణాలు కోల్పోతారు, కానీ విశాల్, ఆయన భార్య అనూహ్యంగా గోవాలో shopping కి వెళ్లి యాక్సిడెంట్‌లో మరణించారు. చనిపోయేముందు తన పిల్లల బాధ్యత నాకు, మా పేరెంట్స్‌కి అప్పగించాడు. నాపై ఆ ఇద్దరి పిల్లల బాధ్యత ఉందని తెలిసినా, నాతో పెళ్ళికి ఒప్పుకొంది. తను వాళ్ళని స్వంత తల్లి కంటే ఎక్కువగా ప్రేమించి, పెద్ద చేసింది. తను ఏ విషయమైనా అంతేనండీ, ఎంతో చక్కగా నిర్వర్తిస్తుంది. నాకు ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా అక్కడ నేవీ స్కూల్స్‌లో, తర్వాత +2 లెవెల్‌లో పనిచేస్తూనే PhD చేసింది. ఇన్ని చేసిన అరవింద మూడేళ్ళ క్రితం ఈ పోస్ట్ వచ్చింది. అరవింద నా భార్యగా వచ్చిన క్షణ౦ నుండీ నాకు అన్ని విషయాలలో సపోర్ట్ చేసింది. ఇరవై ఏళ్లకే సర్వీస్‌లో చేరిన నాకు ఇంకా ఆ హెక్టిక్ డ్యూటీ నుండి రిలాక్స్ అవ్వాలనుకొన్నాను. నాన్నగారు ఈ భూమిని ఎప్పుడో కొన్నారు, ఇప్పుడు ఇలా ప్రశాంతంగా జీవించడానికి అరవింద వుద్యోగం మూలాన ఇది సాధ్యమయింది. అందుకే నేను రిటైర్మెంట్ తీసుకొన్నాను, మీ అందరికి తెలుసుగా ఇక్కడికి నలభై మైళ్ళ దూరంలో ఎయిర్‌పోర్ట్ వస్తుందని, నేను అడ్మినిస్ట్రేటివ్ సైడ్ సెలెక్ట్ అయ్యాను. త్వరలో జాయిన్ అవుతాను.” చెప్పాడు గౌతమ్.

హాట్ డ్రింక్స్ జెంట్స్‌కి, లేడీస్‌కి ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ అయ్యాక, చక్కటి భోజన౦ ఏర్పాటు చేశారు గార్డెన్‌లో. వెళ్ళేటప్పుడే అందరికీ చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చింది అరవింద. అరవింద తమ ఇద్దరి మాటలు వినిందనీ, అందుకే ఈ విధoగా జవాబిచ్చిందనీ అర్థమై సిగ్గుతో తలవంచుకొన్నారు కామేశ్వరి, మార్గరెట్.

Exit mobile version