Site icon Sanchika

ప్రాంతీయ సినిమా -8: జాలిగొల్పే ఝాలీవుడ్

[box type=’note’ fontsize=’16’] దేశ చరిత్రలో ఒక భాషలో నిర్మించిన మొట్ట మొదటి చలన చిత్రం విడుదల కాకపోవడం ఎక్కడా జరగలేదంటూ; పలికే మాటలు, పాడే పాటలు మాత్రమే స్థానికం, మిగతా కథా కథనాలూ, నేపధ్యాలూ సమస్తం బాలీవుడ్ మసాలాల్లోంచి అరువుదెచ్చుకుంటున్నవే అంటూ ఝార్ఖండ్ ప్రాంతీయ సినిమాలని విశ్లేషిస్తున్నారు సికందర్జాలిగొల్పే ఝాలీవుడ్” అనే ఈ వ్యాసంలో.  [/box]

[dropcap]ప్రాం[/dropcap]తీయ సినిమాల వరసే మారిపోయింది. పేరుకు స్థానిక భాష తప్ప ప్రాంతీయమనేది ఏమీ వుండడం లేదు. ఎక్కడెక్కడి ప్రాంతీయ సినిమాలూ – ఉత్తరాదిలోనైతే హిందీ కమర్షియల్స్‌కి, దక్షిణాదిలో నైతే తెలుగు, తమిళ కమర్షియల్ సినిమాలకి అనుకరణలుగా, కృత్రిమంగా మారిపోయాయి. ప్రాంతీయ సినిమాలు వాటి స్థానిక జీవితాల్ని, సమస్యల్నీ చర్చించే వాస్తవిక కథా చిత్రాలనే గుర్తింపునే కాదు, మొత్తం వాటి అస్థిత్వాన్నే కోల్పోక తప్పని పరిస్థితులేర్పడ్డాయి. ఆయా ప్రాంతాల ప్రేక్షకుల అభిరుచుల్లో వచ్చిన మార్పులే ఆ పరిస్థితులకి కారణమవుతున్నాయి. ప్రపంచీకరణకు పూర్వం వున్న తరం చూసిన జీవితం, ఎదుర్కొన్న సమస్యలూ వేరు. ప్రపంచీకరణ అనంతర తరానికి దృష్టి కానుతున్న విషయాలు వేరు. ఈ దృష్టికి జీవితాలూ, సమస్యలూ కాదు – ఆనందాలూ సుఖ సంతోషాలే కనపడుతున్నాయి. అందుకని సినిమాలంటే ఫక్తు ఎంటర్ టైనర్లే కావాలి. దీన్ని ముందుగానే గమనించి బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలు సొమ్ము చేసుకోవడం మొదలెట్టాయి. ఎంత కమర్షియల్ సినిమాలైనా వాటిలో కూడా అప్పుడప్పుడు సామాజిక కథా చిత్రలనేవి వచ్చేవి. ఐతే ప్రపంచీకరణా, తరం మారిన ప్రేక్షకుల అభిరుచుల్లో వచ్చిన మార్పులూ కలగలిసి, 2000 నుంచీ హిందీ తెలుగు తమిళ సినిమాలు ఫక్తు కాలక్షేప పాప్ కార్న్ ఎంటర్ టైనర్లుగా మారిపోయి పల్లెపల్లెకూ దూసుకెళ్ళడం మొదలెట్టాయి. వందల కోట్ల బడ్జెట్లతో పల్లెల్లో ఈ సినిమాలు కళ్ళు మిరుమిట్లు గొల్పుతూంటే ఇంకెక్కడి ప్రాంతీయ వాస్తవిక కథా చిత్రాలు! అవి కూడా స్థానికతని వదులుకుని ప్రపంచీకరణకే జైకొడుతూ, నల్గురితో పాటు (బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్) నారాయణా అని పిచ్చ కామెడీ ఎంటర్‌టైనర్ల బాట పట్టేశాయి.

ప్రాంతీయ సినిమాలు ఇంకెంత దిగజారాల్సి వచ్చిందంటే, తమదో (కమర్షియల్) పరిశ్రమ అనీ, కమర్షియల్ సినిమా పరిశ్రమల తరహాలోనే తమకూ అలాటి పేరుండాలనీ – బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లని కాపీ కొడుతూ చోలీవుడ్ (ఛత్తీస్‌ఘర్), టులువుడ్ (కర్ణాటకలో తుళు జిల్లాలు), మాలీవుడ్ (మీరట్) అంటూ ట్రెండీ పేర్లు పెట్టేసుకుంటూ పోతున్నారు. అలా పేరు పెట్టుకుని విరాజిల్లుతున్నదే ఇప్పుడు ఝాలీవుడ్ పరిశ్రమ. ఆల్రెడీ అస్సాం ప్రాంతీయ సినిమా పరిశ్రమకి ‘జాలీవుడ్’ అనే పేరుంది. తమది ఝార్ఖండ్ ప్రాంతం కాబట్టి- ‘ఝాలీవుడ్’ అవుతుందని ‘జ’ కు వత్తు ఇచ్చేసి తేడా చూపించారు ఝార్ఖండ్ వాసులు. 1995 లోనే ప్రముఖ స్టేజి నటుడు సుశీల్ అంకన్ ఈ నామకరణం చేశాడు. మరో వైపు ఝార్ఖండ్ ప్రాంతీయ సినిమాకి ‘ఛోటా నాగపూర్ ఫిలిం ఇండస్ట్రీ’ అనే పేరుకూడా వుంది.

ఝార్ఖండ్ 2000లో బీహార్ నుంచి విడిపోయిన రాష్ట్రం. బీహార్‌తో బాటు, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌ఘర్, ఒరిస్సా రాష్ట్రాలు సరిహద్దులుగా వున్నాయి. రాంచీ రాజధానిగా వుంది. ప్రకృతి వనరులు పుష్కలంగా వున్న ఆదివాసుల రాష్ట్రమిది. దేశంలో 40 శాతం ఖనిజ సంపద ఈ రాష్ట్రంలోనే వుంది. 24 జిల్లాల్లో 90 థియేటర్లున్నాయి. సుమారు నాలుగు కోట్ల జనాభాలో 60 శాతం మంది హిందీ మాట్లాడతారు. మరో ప్రధాన భాష నాగపురీ. చుట్టుపక్కల రాష్ట్రాల భాషలు కలగలిసిన మాండలికమిది. ఇదే గాక ఇంకొన్ని సంథాలీ, హో, ఉరోన్, ఖోర్తా మొదలైన మాండలికాలున్నాయి. ఈ మాండలికాలన్నిట్లో వీలుని బట్టి సినిమాలు నిర్మించే పరిశ్రమే ఝాలీవుడ్. ఐతే నాగపురీ మాండలికంలోనే ఎక్కువ సినిమాలు నిర్మిస్తారు.

  

అలా మొట్టమొదటి నాగపురీ చలనచిత్రం 1988లో దృశ్యంతర్ ఇంటర్నేషనల్ బ్యానర్ పైన వినోద్ కుమార్ అనే ఔత్సాహికుడు నిర్మించి దర్శకత్వం వహించాడు. దీని పేరు ‘ఆక్రంత్’. అప్పటికింకా బీహార్ లో కలిసివున్న ఝార్ఖండ్‌లో అడవుల నరికివేత, కూలీల వలసలు, అవినీతీ అక్రమార్జనలూ లాంటి విషమ సమస్యల మీద వాస్తవిక కథా చిత్రం నిర్మించాడు. రాంచీ, రాజాడేరా, ముంబాయిలోని బోరివిలీ ప్రాంతాలతో బాటు, ఫిలిం సిటీ స్టూడియోలో నిర్మాణం పూర్తిచేశాడు. అప్పటి బాలీవుడ్ పాపులర్ విలన్ సదాశివ్ అమ్రపుర్కర్ బాటు, ఝార్ఖండ్ ప్రాంతీయులు శ్రీలా మజుందార్, షకీలా మజీద్‌లు నటించారు.

ఐతే ఇంతా చేసి ఇది విడుదల కాలేదు. దేశ చరిత్రలో ఒక భాషలో నిర్మించిన మొట్ట మొదటి చలన చిత్రం విడుదల కాకపోవడం ఎక్కడా జరగలేదు. రెండేళ్ళ తర్వాత 1990 లో దూరదర్శన్ లో మాత్రమే ఈ తొలి నాగపురీ మాండలిక వాస్తవిక కథాచిత్రం వెలుగు చూసింది. ‘టైమ్’ మ్యాగజైన్ కూడా మూవీని ప్రస్తావించాకానే ప్రచారం జరిగి థియేటర్లలో విడుదలకి నోచుకుంది.

దీని తర్వాత 1994లో ధనంజయ్ నాథ్ తివారీ ‘సోనాకర్ నాగపుర్’ తీశాడు. పౌరుల ఆత్మగౌరవం, పౌరబాధ్యతలు కథాంశంగా దీన్ని నిర్మించాడు. ఇది బాగానే ఆడింది. తర్వాత రవి చౌధురి అనే దర్శకుడు ప్రీత్ అని అనే కాల్పనికం తీస్తే ఫ్లాప్ అయింది. తర్వాత 1999లో ప్రవీర్ గంగూలీ అనే బెంగాలీ అతను దర్శకత్వం వహించిన ‘సజనా అనాడీ’ కాల్పనికం హిట్టయ్యింది. ఇలా 1988 – 1999 మధ్య నాలుగే ఝాలీవుడ్ సినిమాలు వెండి తెరకెక్కాయి.

2000లో ఝార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటయ్యింది. అయినా అప్పటికీ మన రాష్ట్రం, మన సినిమా అనే భావం ప్రజల్లో ఏర్పడలేదు. 2001లో ఆభాస్ శర్మ అనే దర్శకుడు ప్రేక్షకుల్ని ఆకర్షించడానికి రూటు మార్చి. ‘గుయా నంబర్ వన్’ (వీరుడు నంబర్ వన్) అనే మసాలా తీసినా అట్టర్ ఫ్లాపయ్యింది. ఇలాకాదని 2003, 2004 లలో అశోక్ శరణ్ అనే మరో కొత్త దర్శకుడు, పూర్తి బాలీవుడ్ ఫార్ములాతో ‘బ్లాక్ ఐరన్ మాన్ బిర్సా’, ‘ఊలుంగాన్ ఏక్ క్రాంతి’ అనే అనే రెండు కమర్షియల్స్ తీస్తే, అప్పుడు నాగపురి సినిమాలకి అలవాటయ్యారు ఝార్ఖండ్ ప్రేక్షకులు.

దీంతో ఝాలీవుడ్ సినిమాలు ఎలా నిర్మించాలో సులువు తెలిసిపోయింది. ఇలా ఝాలీవుడ్‌కి బాలీవుడ్‌ని సంకరం చేసి హృషికేశ్ మిశ్రా ‘పియా తోసే మైనా లగే’ అనీ, యుగళ్ కిషోర్ మిశ్రా వచ్చేసి ‘జుగ్నీ’ అనీ తీసి విజయాలు సాధించారు. అప్పటినుంచీ ఝార్ఖండ్ సినిమాలు పూర్తిగా వాటి ఐడెంటిటీని కోల్పోయాయి. పలికే మాటలు, పాడే పాటలు మాత్రమే స్థానికం, మిగతా కథా కథనాలూ, నేపధ్యాలూ సమస్తం బాలీవుడ్ మసాలాల్లోంచి అరువుదెచ్చుకుంటున్నవే. ఝార్ఖండ్ జానపద నృత్యాల్ని చూపినా ప్రేక్షకులు భరించే స్థితిలో లేరు. వాళ్లకి ‘బొంబయ్యా’ (బాలీవుడ్) మసాలా మాస్ డాన్సులే కావాలి.

ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ పుణ్యమా అని డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిలిమ్స్, మ్యూజిక్ ఆల్బమ్స్ వెల్లువెత్తుతున్నాయి. ఝాలీవుడ్‌ని ఆశ్రయించి సమాంతర పరిశ్రమలుగా ఇవి కొనసాగుతున్నాయి. ఇంకా ఇప్పుడు చూస్తే బాలీవుడ్‌నే కాదు, భోజ్‌పురి సినిమా రీతుల్ని కూడా కాపీ కొడుతున్నారు దర్శకులు. బరితెగించి అంగాంగ ప్రదర్శన చేసే చవకబారు చిత్రీకరణలకి పాల్పడుతున్నారు. గత పన్నెండేళ్ళుగా పాపులర్ హీరోగా కొనసాగుతున్న దినేష్ దేవా నటించిన ‘బుంగారే బుంగా’ ఇలాటిదే. ఐతే సినిమాలు ఎలా తీసినా, ఝార్ఖండ్‌లో సినిమాలు తీస్తూనే వుండాలని ఒక పట్టుదల కనబరుస్తున్నారే, అదే గణించదగ్గ గొప్ప విషయమని ప్రముఖ ఝాలీవుడ్ దర్శకుడు శ్రీ ప్రకాష్ సైతం అనేశారు.

రాష్ట్రంలో 90 థియేటర్లున్నా, మల్టీప్లెక్సులు రాజధాని రాంచీలోనే వెలిశాయి. జిల్లాల్లోని థియేటర్లు పాతబడ్డాయి. అయినా జనం బాగానే పోతున్నారు. బీహార్లో కలిసున్నప్పట్నుంచీ ఈ ప్రాంతం హిందీ సినిమాలకి పెద్ద మార్కెట్టే. దీంతో ఝాలీవుడ్ సినిమాలు పోటీ పడాల్సిందే. స్థానిక ఝాలీవుడ్ పరిశ్రమాభివృద్ధికి ప్రభుత్వాలు అందిస్తూ వస్తున్న సహకార మేమిటంటే, వీలైనంత వినోద పన్ను వాటినుంచి లాక్కోవడమే. ఏడాదికి రెండు మూడు సినిమాలుకూడా నిర్మించలేని పరిస్థితుల్లో స్థానిక టాలెంట్ బాలీవుడ్ బాట పడుతున్నారు. రాజధాని రాంచీ రహదారుల వారగా ఎన్నో సినిమా కంపెనీలు కన్పిస్తాయి. వాటిలో ఏర్పాటు చేసుకున్న స్టూడియోలూ కన్పిస్తాయి. కానీ ఉత్పత్తి జరిగేది మాత్రం షార్ట్ ఫిల్ములు, మ్యూజిక్ ఆల్బమ్స్, పెళ్లి వీడియోలూ…

2016లో అగ్గిమీద గుగ్గిలం అన్నట్టు ముఖ్యమంత్రి రఘుబార్ దాస్ ఒక విధాన ప్రకటన చేసి ఎర్రతివాచీ పర్చారు. అది ఝాలీవుడ్ కోసం కాదు. కొండకోనలూ, వాగు వంకలూ, జలపాతాలూ, మావోయిస్టులు లేని అడవులూ, ప్రకృతి అందాలూ సమృద్ధిగా గల ఝార్ఖండ్ వచ్చి షూటింగులు జరుపుకోండి, రెండు కోట్లు సబ్సిడీ ఇస్తాం, రాంచీలో షూట్ చేస్తే 50 లక్షలు ఇస్తాం – అనీ ఆ విధాన ప్రకటన. ఇది పట్టుకుని బాలీవుడ్డీయులు క్యూలు కట్టేస్తున్నారు. ముఖేష్ భట్ తీసిన ‘బేగం జాన్’ ఇలా లాభపడిందే. అంతేగాక సింగిల్ విండో స్కీములో షూటింగులకి అవసరమైన అన్ని అనుమతులూ, హోటళ్ళలో వసతులూ, భద్రతా చర్యలూ వగైరా సమస్తం వెంటనే సమకూర్చేస్తున్నారు అధికారులు. ఉడాన్, ఎం ఎస్ ధోనీ – ది అన్ టోల్డ్ స్టోరీ, రాంచీ డైరీస్, రాక్ ఆన్ రాంచీ, రాజ్ కహినీ… ఇలా హిందీ సినిమాలు ఇక్కడ షూటింగులు జరుపుకున్నవే.

2012 లో అప్పటి ముఖ్యమంత్రి అర్జున్ ముండా ఫిలిం సిటీని ప్లాన్ చేశారు. అది కాగితాల మీదే వుండి పోయింది. ఇప్పటి ముఖ్యమంత్రి విధాన ప్రకటనలో ఝాలీవుడ్ పరిశ్రమకి కల్పించాల్సిన అండదండల గురించి ప్రస్తావించక పోలేదు. ఐతే ఇవీ కాగితాల మీదే వుండిపోతున్నాయి. ‘మేకిన్ ఝార్ఖండ్’ అంటూ ఇటీవల 20 బాలీవుడ్ సినిమాల షూటింగులకి అనుమతులు కూడా ఇచ్చేశారు.

Exit mobile version