[box type=’note’ fontsize=’16’] “విద్యార్థుల్ నిజ భక్తితో ప్రణతులన్ వేవేలుగా జేయ, వారుద్యుక్తంబగు వేళలివ్వె ఛవితో నొజ్జల్ ప్రకాశింపగాన్” అంటున్నారు జిజ్ఞాసువు అనే పద్య కవితలో బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి. [/box]
శార్దూల విక్రీడితము
***
ప్రాచీనామృత సారమై చెలగు విద్వత్తెల్ల పొంగారగా
ప్రాచుర్యంబగు కావ్యముల్ మనకునై ప్రాప్యంబుగా నుండియున్;
రోచిష్ణుండగు నేటి పాఠితుడు ప్రారూఢంపు సుజ్ఞానమున్
క్వాచిత్కంబుగ మాత్రమే పడయు, వే కాఠిన్యముల్ వ్రేల్చగా.
ఈ కావ్యంబునకర్థమేమొ, వివరంబేమున్నదో యేమొకో
సాకల్యంబుగ చెప్పమంచు నడుగన్; చాపల్యముల్ చూపుచున్
లోకుల్ చెప్పక నూరకుందురు, మహా లుబ్ధుల్ సుమా! యజ్ఞలన్
పోకార్చంగను నెంచరేలొ, పఠితల్ పోవంగ దిక్కున్నదే?
బాల్యంబందున నిచ్ఛలేకొ, సరియౌ ప్రావీణ్యముల్ లేకొ, చా
పల్యంబందున మున్గియుండ, తగు నభ్యాసంబులున్ చాలకో,
లౌల్యంబన్నది పోవఁ జేయు దరికిన్ లంఘింప వాంఛించి, కై
వల్యంబన్నది యిచ్చు విద్యలను నేర్వన్, తప్పె యత్నించుటల్?
కౌమారంబది దాటిపోయెనెపుడో, కాయంబు నిర్వీర్యమై
యేమార్చంగను వ్యాధి వచ్చునెపుడో, యేమున్నదో భావిలో,
మోమాటమ్మును వీడి జ్ఞాన నిధికై, మోక్షంబు లక్ష్యంబుగా,
నే మాత్రమ్మిక నాలసించక, సదా యీ ధ్యాసలో నుండుచో,
విద్యల్ కోటులు నేర్పగా కరుణతో, విజ్ఞానమంతంతయై
సద్యోగంబులు కల్గవే, పదులుగా సత్కారముల్ కీర్తులున్?
విద్యార్థుల్ నిజ భక్తితో ప్రణతులన్ వేవేలుగా జేయ, వా
రుద్యుక్తంబగు వేళలివ్వె ఛవితో నొజ్జల్ ప్రకాశింపగాన్.