జినదత్తుడనే కథకుడూ..

0
2

[శ్రీధర బనవాసి గారు కన్నడంలో రచించిన కథని అనువదించి అందిస్తున్నారు శ్రీ రంగనాథ రామచంద్రరావు.]

[dropcap]గ[/dropcap]త రెండేళ్లుగా తానొక కథను పూర్తిగా రాయలేకపోయానన్న బాధ జినదత్తుడనే కథకుడిని వేధిస్తోంది. ఈ మధ్యని రోజులలో అతనిలో జరుగుతున్న మానసిక కల్లోలాలు చెప్పకోలేనివి. అవి కథలుగానే బయటికి రావాలి.

కథకుడి అంతరంగంలో ఒక కథ పుట్టడం అంటే అంత సులభం కాదు. అంతరంగంలో అతను అంత తపస్సు చేయాలి. తపస్సు అంటే అంతరంగంలో అతను మౌనంగా ఉండి క్షణక్షణమూ లోకాన్ని గ్రహిస్తూ వుండాలి. అలా గ్రహించినప్పుడే కథకుడి అంతరంగంలో కథా బీజం పుడుతుంది, అది తర్వాత మొలకెత్తి, చిగురించి ఒక రూపాన్ని పొంది పాఠకుడి అంతరంగాన్ని చేరుతుంది. ఇలాగే ఒక కథ ఒక అంతరంగంలో పుట్టి మరో అంతరంగంలో చేరడం. కథకుడి సార్థకమైన జీవితం దాగివుండేది కూడా అక్కడే. అలాంటి కథకుడిగా తాను రూపొందినందుకు తనకు గర్వంగా ఉంది – అని గతంలో సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నప్పుడు జినదత్త స్వయంగా ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకున్న మాట ఇది!

అలాగైతే తానే చెప్పుకున్నట్టు తన లోపల ఒక కథ పుట్టాలంటే, అంతరంగంలో తపస్సు చేసుకోవాల్సిందే. ఇప్పుడు తనలో కథ పుట్టటం లేదంటే, తనలోని తపస్వి ఎక్కడికి పోయాడు? బయటి ప్రపంచాన్ని గ్రహిస్తున్న నా అంతరంగం ఈరోజు ఎందుకు మౌనంగా ఉంది? తను కథ రాయలేకపోతున్నాడన్న చేదునిజం ఎంత బాధను కలిగిస్తుందో కదా! అయ్యో, నాలోని కథకుడు చనిపోయాడా? ఎక్కడికైనా పారిపోయాడా? అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు..? అతన్ని వదిలి తాను ఉండటం అసాధ్యం. విజయాన్ని, అభిమానాన్ని, గౌరవాన్ని, ప్రేమను అందించిన తనలోని మహాతపస్వి ఇప్పుడు ఎక్కడ దాగివున్నాడు? గత రెండేళ్లలో తన తదుపరి పుస్తకం గురించి ఎంత మంది అడిగారో? పత్రికలవాళ్లు కథను ఎప్పుడు పంపుతారని ఎన్ని సార్లు ఫోన్ చేశారో? ప్రస్తుతం తనకు కథ రాయటానికి సాధ్యం కావటం లేదని సూటిగా చెప్పటానికి మనస్కరించడం లేదు. తనలోని ఈ న్యూనతను వాళ్ల దగ్గర ఎలా చెప్పుకోగలడు? వింటే నవ్వరా? ఇంకా తనకు నలభై ఐదేళ్లే. సాహిత్య సృజనాత్మకత ఉప్పొంగి ప్రవహించే వయస్సు. గొప్పగొప్ప సాహితీవేత్తలు నలభై ఏళ్ల ప్రాయంలోనే అత్యంత గొప్ప కృతులను అందిచినపుడు ఛ.. తనకేమైంది, ఈ వయస్సులోనే కథకుడనే పదవి నుంచి నివృత్తి అవుతావా? అని అడిగితే.. తానేమి చెప్పాలి.. తన దగ్గర సమాధానం లేదు. లోపలి బాధను చెప్పుకుంటే సరిపోతుందా? అని మనసుకు నచ్చజెప్పినా, మనస్సు మరింత మరుగుజ్జు అవుతుంది. తనలోని కథకుడు పారిపోయాడని చెబితే తన జీవితం కుక్క ముట్టిన కుండలా అయిపోదా? జీవితం ఇంత త్వరగా రుచిని కోల్పోతుందని అనుకోలేదు. అలాంటి జీవితాన్ని ఇప్పుడు ఎదుర్కోవాల్సివస్తుంది. ఏం చేయాలి? రచయిత రాయకపోతే జీవితం లేదు. కథను రూపొందించడం తనలాంటి కథకుడి కర్తవ్యం. ఈ కర్తవ్యమనే పట్టం నుంచి విముఖుడవుతున్నాడా?

***

ఇటీవలి కాలంలో ప్రముఖ కథారచయితగా గుర్తింపు పొందిన జినదత్త ఉపాధ్యాయను ఒక కొత్త విచారం వేధించసాగింది. కథను రాయడానికి ప్రేరణ పుట్టించేటటువంటి ఒంటరితనాన్ని అతను ఎక్కడో ఒకచోట పోగొట్టుకున్నాడు. అలాగైతే లోపలి ఒంటరితనం ఎక్కడికి పోయింది. లోపలి శూన్యమనస్థితి వేడుకున్నట్టల్లా పిచ్చి గుర్రంలా పరుగెత్తుతున్న మనస్సును అతను నిగ్రహించి తన జీవితోద్దేశం నుంచి విముఖుడు కావటానికి ప్రయత్నిస్తున్న జినదత్త స్థితి కథ అయితే చాలా విచిత్రమైంది. ఇప్పుడు తను ఎదుర్కొంటున్న విచిత్రమైన సమస్య నుంచి ఎలా తప్పించుకోగలడు? పారిపోయిన తనలోని తపస్విని ఎక్కడని వెతకాలి? అతను రాకపోతే తనలో కథకుడు పుట్టలేడు. అతను లేని తనను అందరూ కథకుడని ప్రేమ, గౌరవవాలతో మాట్లాడినప్పుడు ఏదో ఒక విధమైన హింసలా అనిపించేది. అతను ఉన్నప్పుడు ప్రేమాభిమానపు మాటలను వినటానికి చాలా సంతోషం కలిగేది. కానీ ఈరోజు ఆ మాటలు విన్నప్పుడల్లా అపథ్యమనిపించే మానసిక చికాకు కలుగుతోంది. అప్పుడప్పుడు తన స్నేహితులు పిలిచే విందు భోజనాలకు, సాహితీ సమావేశాలకు, పుస్తకావిష్కరణలకు, పురస్కార ప్రదానోత్సవాలకు, చర్చావిమర్శల కార్యక్రమాలకు వెళ్లటానికి ఎందుకో మనస్కరించటం లేదని జనదత్త లోలోపల కుమిలిపోయేవాడు. తనది కాని మాటలు విని బాధపడడం కంటే ఇంట్లోనే కూర్చొని బయటి ఒంటరితనాన్ని అనుభవించడం శ్రేయస్కరమని అతనికి అనిపించింది.

ప్రియమైన జినదత్తకు ఆశీస్సులు.

ఈ మధ్య రోజులలో నువ్వు అనుభవిస్తున్న మానసిక వేదనను ఒక లేఖ ద్వారా మాకు నివేదించుకున్నది నేను అర్థం చేసుకున్నాను. నువ్వు ఎదుర్కొంటున్న సమస్య మాలాంటి ఆధ్యాత్మిక సాధకులనూ కూడా వేధించే సమస్యే. ఒక కథకుడు వేరు కాదు, నాలాంటి సర్వసంగ పరిత్యాగి అయిన ఆధ్యాత్మిక గురువు వేరుకాదు. లోలోపల ఇద్దరూ తాపసులే. ఇద్దరి అన్వేషణ కూడా ఒకటే. అంతర్గత తపోసాధనలో అనుభవించినది మాత్రమే నేను ప్రజలకు ఇవ్వగలను. నువ్వు నీలోని పాత్రల అలజడిని, కథారూపంలో తీసుకువస్తే, నేను నా ప్రవచనాల ద్వారా లోపలి అనుభవాన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి అందిస్తాను. అందువల్ల ఈ రోజుల్లో నువ్వు నీలోని తపస్విని కోల్పోయాననే చింతలో మానసికంగా చాలా బాధపడ్డావు. భయపడకు. హిమాలయాల్లో ఉన్న సాధకులకూ కూడా నీకున్న సమస్య తప్పదు. వాళ్లు కూడా ఇలాంటి చింతలో బాధపడుతున్నారు. ఇది కేవలం వచ్చిపోయే అశాశ్వతమైన సమస్య మాత్రమే. ఇప్పటి నీ పరిస్థితి. నుంచి చింతించకు. నీలోని తపస్వి ఈ ప్రపంచానికి ఇంకా ఏదైనా కొత్తదనాన్ని అందించాలనే తపనతో ఎక్కడికో ఒక చోటికి వెళ్లివుండొచ్చు. దాని అనుభవం దొరికిన తర్వాత నీలో మళ్లీ వచ్చి చేరుకుని, నీ ద్వారా గొప్ప కథలను రాయించవచ్చు.

భయపడకు. నీ సమస్యకు కొన్ని నెలల్లో సమాధానం దొరుకుతుంది. ప్రతిరోజూ నిన్ను నువ్వు పరీక్షించుకోవటం మరవకు. తెలిసో తెలియకో చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెందు, నీలోని భగవంతుడిని ఎల్లప్పుడూ వేడుకుంటూ ఉండు. క్షమాపణ దొరికితే మనసు తేలికవుతుంది.. గుర్తుంచుకో.

నీ తదుపరి గొప్ప కృతి కోసం ఎదురు చూస్తుంటాను.

ఇట్లు

మునిశ్రీ చరణసాగర

గురు సన్నిధానానికి తన సమస్య గురించి రాసిన ఉత్తరానికి సమాధానం దొరికినట్లుంది. గురువుగారి ఉత్తరంలోని మాటలు జినదత్త మనసును కాస్త తేలికపరిచాయి. అవును తనలోని కథకుడు ఏదో కొత్త వస్తువు అన్వేషణలో ఉండొచ్చు. అది అతనికి ఈ ప్రపంచంలో దొరక్కపోవటంతో మరో ప్రపంచంలో వెతుకుతూ ఉండొచ్చు. అతని అన్వేషణ ఏమైవుండొచ్చు? ఆ అన్వేషణకు కారణం ఏమైవుండొచ్చు? ఇంతకు ముందు తనకు చెప్పకుండా ఎక్కడికీ వెళ్లినవాడు కాదు! ఈరోజు చెప్పకుండా వెళ్లిపోయాడు. అలాగైతే అతను తన మీద అలిగి వెళ్లివుండొచ్చా? అతనికి కోపం వచ్చేవిధంగా తానేమైనా బ్రతుకుతున్నాడా? గురువుగారు చెప్పినట్లు తనను తానే ఎందుకు పరామర్శించుకోకూడదు? ఇన్ని సంవత్సరాలుగా తనలో కుళ్లిపోతున్న ఆ మాలిన్యం గురించి ఎన్నడూ ఆలోచించినవాడిని కాదు.. బాల్యం, యవ్వనం, చదువు, స్నేహితులు, అమ్మాయిలు, సంభోగం, మోసం, అబద్ధాలు, వంచన, అవమానం, పరువు, పెళ్లి, సంతానం లేకపోవడం, విడాకులు.. ఒకటా.. రెండా..!

అవును.. గుర్తుకొస్తోంది. ఆమె మాటలు ఇప్పుడు అర్థమవుతున్నాయి. ఆమెను తాను దూరం చేసుకోకుండా ఉండాల్సింది. ఆమె ఒక భ్రమ అని భావించాడు. ఇప్పటికీ ఆమె తనలో భ్రమనా? వెంటాడే మాయనా? ఈ ద్వంద్వం వేధిస్తూనే ఉంది. తనలోని కథకుడికి ఆమె సామీప్యం చాలా ఇష్టమైంది. ప్రతీ క్షణమూ ఆమె కోసం తహతహలాడేవాడు. ఆమె అంతరంగంలో ఉన్నదాన్ని అతను ఎంతగా ప్రేమించేవాడో..! ఆమెను కౌగిలించుకుని, మనసులోని కామదాహం ఖాళీ అయ్యేంతవరకూ ముద్దాడిన తర్వాత కూడా, ఆమెను మరింత బిగువుగా కౌగిలించుకోమని చెప్పేవాడు. తన జినదత్త కథల సంపుటిలోని ‘నీ మాయలోనూ’ కథలోని ప్రధాన పాత్ర ఆమే. తనకు, ఆమె శరీరాన్ని అనుభవించే కేవలం ఆడదైంది. అద్భుతమైన సౌందర్యవతి, తనలోని రచనా ఆకర్షణకు తన దాసి అయిపోయింది. కోరినప్పుడల్లా లేదనకుండా పక్కను పంచుకునేది. తాను ఆమె అమాయకత్వాన్ని, సౌందర్యాన్ని కేవలం దుర్వినియోగం చేసుకునేవాడు. తానెంతటి స్వార్థపరుడో ఆమె దూరమయ్యాకే తనకు అర్థమైంది. అక్రమసంబంధంలో కొన్ని నిమిషాల సంభోగం తర్వాత ఏర్పడే అపరాధ భావనలా ఆమె ప్రశ్నార్థకంగా వేధిస్తూనే ఉండేది, కానీ తనలోని కథకుడికి, ఆమె మాయాలా వేధించేది. ఆమెతో సంబంధాన్ని కొనసాగించాలా లేక విచ్ఛిన్నం చేసుకోవాలా అనే సందిగ్ధమే కథకుడిని సగం గాయపరుస్తుంది.

అర్ధరాత్రి దాటిన ఒక గంట సమయం, పున్నమి చంద్రుడిని తానింకా ఆస్వాదిస్తూనే ఉన్నాడు. ఎందుకో పౌర్ణమిని చంద్రుడిని అంత తదేకంగా చూసినా, తన హంసప్రభలాంటి వెలుగులో కూడా, అతను పాలలా పల్చగా కనిపించక, గట్టి పెరుగులా కనిపిస్తున్నాడు. పూర్ణచంద్రుడి మీద చిన్నగా లేని కోపం పుట్టుకొచ్చింది. ఆ క్షణంలో అతని సౌందర్యం రుచించలేదు. దృష్టిలానే సృష్టి అన్న మాట గుర్తొచ్చింది. అలాంటప్పుడు నాకు చంద్రుని సౌందర్యంలో తనకు బలహీనమైన బింబం కనిపిస్తుంటే ఎందుకో నా మనస్సే పగిలిన అద్దం అయివుండొచ్చునని అనిపించసాగింది. అలాగైతే తన మనోదౌర్బల్యానికి చంద్రుడిని నిందిస్తే ఆ తప్పు తనదికాదా ? చంద్రుడు కూడా సూర్యుప్రభ అంతే శక్తిని ఇచ్చేవాడు. ఇన్నేళ్లుగా తనలోని కథకుడికి ప్రేరణ కలిగించేవాడు. ఇప్పుడు అతని సామీప్యం కూడా చికాకు కలిగిస్తోంది. పదా, లోపల పక్క కూడా చేయూపి పిలుస్తోంది. ఆమె తనను కౌగిలించుకోవడానికి ఎదురుచూస్తోంది. ఆమె మృదువైన, కొమలమైన దేహం తన శరీర స్పర్శ కోసం వేచివుంది. నిద్ర పట్టడం లేదని పూర్ణచంద్రుడిని చూస్తూ కూర్చుంటే, ఆమె సాంగత్యాన్ని నువ్వు వయసు దాటిన తర్వాత అనుభవిస్తావా? పూర్ణ చంద్రునికి వయస్సు మీరటం అంటూ ఉందా..! అతను తాను చనిపోయేవరకూ ఇదే సౌందర్యంతో శోభిస్తాడు. అతనికి ఉన్న అదృష్టం తమకెక్కడా? వద్దు, పడక ముంగిట్లో కొండంత నిద్ర నీ రాక కోసం ఎదురుచూస్తోంది. దాన్ని నిరాశపరచకు అని బుద్ధి మంచం వైపు చేయూపి చూపిస్తోంది.

అవునవును.. తాను తప్పు చేస్తున్నాడు. ఆమెతో తాను శారీరక సుఖం అనుభవించక ఎన్నో నెలలు గడిచాయి. దూరప్రాంతంలో ఉద్యోగం.. రోజంతా ప్రయాణం, సంపాదించాల్సిన అనివార్యత ఇప్పుడు అంటుకుంది. మొదట్లో తానొక్కడినే.. తనను తాను పోషించుకుంటే చాలు.. కానీ ఇప్పుడు తనకు తోడుగా మరో జీవి చేరింది. మళ్లీ లోపల నుండి ఆమె పిలవడం వినిపించింది. చాలా రోజులుగా రాత్రిళ్లు ఒంటరిగా పడుకోవటంతో విసిగిపోయిన ఆమె తన సాన్నిహిత్యం కోరుతోంది. “అరే. వస్తున్నానే..” అంటూ లోపలికి వెళ్లేసరికి అప్పటికే ఆమె సగం నిద్రలో వుంది. నేను వస్తానని, ఆమె దేహాన్ని కౌగిలించుకుంటానని.. చాలా రోజులుగా బాకీ వున్న శారీరక ఆకలిని తీరుస్తాననే కలవరింతలోనే ఆమె కళ్లు మూసుకుని నిద్రలోకి జారివుండొచ్చు. అవును, తనను ఈమె తప్ప ఇంకెవరు ఇంతగా ప్రేమిస్తారు? తన శరీరం ఆమె పడుకున్న గదికి చేరుకోకపోయినా, నా మనస్సు అప్పటికే ఆమె పక్కను చేరి ఆమె నగ్న శరీరం పక్కన పడుకుంది. ‘థూ.. ఎంత సిగ్గులేని మనిషివి! నేనింకా ఇక్కడే ఉన్నాను, కొంచెం కూడా నీకు ఓపికే లేదు. నన్ను వదిలి నువ్వు పారిపోతున్నావా.. నీ వల్లనే ఆ కథకుడు పారిపోయాడు’ అని బుద్ధి ఆ క్షణంలో లేని కోపాన్ని మనసుకు చూపించింది. ఏం చేయను మిత్రమా.. కామం విషయంలో నన్ను కంట్రోల్ చేయడం కొంచెం కష్టమే.. నా ఆత్రుతను అపార్థం చేసుకోకు..’ అని మనసు తన బలహీనతను చెప్పుకుంది. మంచం కింద పడి ఉన్న ఆమె చీర, లంగా, బ్లౌజు, కాళ్లకు తగిలినపుడు వాటిని అందుకుని తన ముఖానికి పట్టుకున్నప్పుడు ఆమె దేహం నుంచి వస్తున్న వాసనను పూర్తిగా పీల్చుకున్నట్టు అనిపించి, సగం సంభోగాన్ని అప్పటికే అనుభవించినట్లు అనిపించింది. తన దుస్తులను ముఖానికి పట్టుకున్న తనను చూసి ఆమె కిసుక్కున నవ్వింది. ఆమె నవ్వులోనూ ఎంత ప్రేమ.. ‘నువ్వు నిద్రపోవటం లేదా?’ అని సిగ్గుతో ఆమె చీరను పక్కన పెట్టి అడిగితే ఆమె జవాబు ఇవ్వలేదు. ఆమె తన వైపే చూస్తోంది. ఆమె కళ్లు తనలో ఏదో వెతుకుతున్నాయి. తన కళ్లకు ఆమె కళ్లు ఆకర్షణీయంగా మెరుస్తూ కనిపించాయి. ఆమెని చూడగానే తనలో ఉన్మాదపు బుగ్గ ఫౌంటెన్ లా చిమ్మింది. కప్పుకున్న బెడ్ షీట్ ఆమె తొలగించినపుడు ఆమె నగ్న శరీరం ఒక్కక్షణం తనను మూగవాణ్ణి చేసింది. మాటలు బయటకు రాలేదు. ఆ క్షణంలో కళ్లు చెమర్చాయి. ఇప్పటి వరకు ఆమె శరీరాన్ని తన కళ్ళు ఎన్నిసార్లు చూశాయో..? ఆమె శరీర వాసనను తన ముక్కు ఎన్నిసార్లు ఆఘ్రాణించిందో..? ఇప్పటికీ దాని స్పందన కొత్తగానే ఉంది. అది ఒక క్షణక్షణమూ కూడా వేడుకుంటుంది. తాను స్త్రీ అనే మాయలో చిక్కుకున్నాడుకదా..! ఇది ఎందుకో సమీప భవిష్యత్తులో చాలా ప్రమాదకరమైనదిగా కనిపిస్తుందని లోలోపల అనిపించినప్పటికీ, దాని నిర్దిష్టమైన ఆలోచన ఎందుకో రుచించడం లేదు. అందువల్ల ఆమె మనోహరమైన కళ్లు నాలో ఒక భ్రమను సృష్టించాయి. ఆ భ్రమలో తన ఉనికిని కోల్పోయి అనామకుడిలా వచ్చిన ఉద్దేశ్యాన్ని మరిచి జీవిస్తున్నట్లు అనిపించింది. ఆమె సమీపంలో తనలోని మరో ప్రపంచం తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ కూర్చుంది. మనస్సు ఆమె శరీరాన్ని, తన సుఖాన్ని కోరుకుంటూనే ఉంది. ఎందుకో ఆమె మనసనే మాయను తనలోని మనసున్న మగవాడు అతిగా ప్రేమించాడు. ఆమె సమీపాన్ని ప్రతి క్షణం కోరుకుంటున్నాడు. అతను ఆమెకు దూరంగా ఉన్నప్పుడు కూడా తనను చెడ్డ బలిపశువుగా చేసి ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నాను. మనసు ఆరోగ్యంగా లేకుంటే బుద్ధి ఎలా చురుకుగా ఉంటుంది? ఆ రాత్రి అదే భ్రమలో ఆమె శరీరాన్ని అనుభవిస్తూ నిద్రలోకి జారుకున్నప్పటికీ, తనలో జరుగుతున్న అంతరంగిక పోరాటం, కథకుడు లేకపోవడంతో తన రచన ఆగిపోయిందన్న విచారం శరీరాన్ని క్షణక్షణమూ హింసిస్తూనే ఉంది. రాత్రి క్షణాలు పరుగెడుతూనే ఉన్నాయి. చీకటి కమ్ముకుంది. పున్నమి చంద్రుని బక్కటి బింబం తన విరిగిన మనస్సుకు రూపకంలా ఉంది. తెల్లవారుజామున నిద్రలేవగానే సూర్యుడు ఇంటి కిటికీలోంచి దూరి వచ్చి లేపేశాడు. కళ్లు ఇంకా ఆమె సౌందర్యాన్ని నింపుకుంటూనే ఉన్నాయి. కళ్లు తెరవడానికి మనస్కరించడం లేదు. సూర్యునికి తన కళ్లు తెరిపించాలని పట్టుదల. తన కిరణాలను మరింత తీక్షణంగా పంపి కళ్లను చెదరగొడుతున్నాడు. లోపల రాత్రి అందాల అవగాహన సాగిపోతుంటే సూర్యకిరణాలు ముందరి క్షణాల అందాన్ని చూపించాలని తహతహలాడుతున్నాయి. తనలోని వ్యక్తి ఎందుకో అయోమయంలో చిక్కుకున్నాడు. రాత్రి చంద్రుని వంకర బింబం, ఉదయపు సూర్యుడి ప్రేరణ బింబం ఇప్పటివరకు సజీవంగా ఉంచినట్లు అనిపించింది. మెలకువ వచ్చి పక్కకు తిరిగి పడుకున్న ఆమె వైపు దృష్టి మళ్లింది. ఎవరూ నిద్రపోలేదు. ఆమె ఎక్కడికైనా వెళ్లిందేమోనని గది మొత్తం పదేపదే వెతికాడు. ఆమె జాడ లేదు. తన ముక్కు ఆమె దిండును వాసన చూసినా, ఎందుకో నిరాశతో దూరంగా జరిగింది. రాత్రి పున్నమి వెలుతురులో తాను చిక్కుకుపోయిన మాయ ఏది? అనామికలాగా వచ్చి పిచ్చి ఆలోచనలు కలిగించే ఆమెను మరిచిపోవడానికి సాధ్యం కావటంలేదు. ఆమె తనను ఎందుకు ఈ విధంగా వేధిస్తోంది? ఆమె వల్ల తనలో ఉన్నవారు చాలా బాధపడ్డారు. ఆమె ఉనికి నూటికి నూరుపాళ్లు నిజం. ఆమె ఉనికి దగ్గర్లోనే ఉంది, ఆమె దగ్గరినుంచి దూరమైన మనసు విచిత్రంగా ప్రవర్తిస్తోంది. అతడిని సమాధానపరచడం సాధ్యంకానేలేదు. కిటికీ తలుపు తీసి సూర్యుడిని మళ్లీ చూశాను. అతని తీవ్రమైన కాంతిలోనూ నల్లటి మచ్చలు కనిపించసాగాయి. అయ్యో.. పాలలాంటి చంద్రుటిలోనూ వంకర బింబం చూసినట్లు, ఇప్పుడు స్ఫూర్తినిచ్చే సూర్యుడిలోనూ నల్లటి మచ్చలు.. తనకేమైంది? తానొక కవి, కథకుడు ప్రకృతిని ఆస్వాదించేవాడు, ఆరాధించేవాడు.. తనకు ఎందుకిలా అనిపిస్తోంది? స్త్రీ మాయలో చిక్కుకుని తనలోని సృజనాత్మక వ్యక్తిని కోల్పోతున్నాడా? స్త్రీ అందానికి ప్రతీక కాదా? ఆమె కూడా ప్రకృతిదే కదా! ఆమె సౌందర్యం కథకుడికి స్ఫూర్తినిస్తుండేదే తప్ప, అతన్ని చంపేదికాదు. అలాంటప్పుడు తనకెందుకు ఇలాంటి నిర్బంధం.. ఈ నిర్బంధం నుంచి తాను తప్పుకోలేడా? ఎందుకో తనలోని సత్వాన్ని కోల్పోయడని అనిపించసాగింది. రాత్రీపగళ్లు రెండూ దేశాల మధ్య జీవితం ఎందుకో ఎటు నుంచి ఎటో సాగుతున్నట్లు జినాదత్తకు అనిపించసాగింది.

ఇప్పుడు తనలోని శూన్యమైన మనసు లోపల ఒంటరితనాన్ని సృష్టించి, కథ రాయడానికి ప్రేరణ కలిగిస్తేనే ఇప్పుడు అంటుకుని ఉన్న జీవితం నుండి విముఖుడవ్వటానికి ప్రేరణ ఇస్తుందని అనిపించసాగింది. ఆధ్యాత్మిక ప్రపంచంలో కర్మఫలానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కర్మఫలాల గురించి విస్తృతంగా చదివిన జినదత్తకు తనకు అంటుకున్న ఈ బాధ వెనుక ఈ జన్మలోని కర్మఫలం లేదా గత జన్మలోని కర్మఫలం కారణమైవుండొచ్చా? తల్లిదండ్రులు చేసిన కర్మఫలంలో పిల్లలకూ వాటా ఉందట, అలాంటప్పుడు కన్నవారి కర్మఫలాలు ఈ మధ్య కాలంలో అంటుకునివుండొచ్చా? కర్మఫలానికి సంబంధించిన ప్రశ్నలు వేధించిన కారణంగానే తన ఆధ్యాత్మిక గురువు మునిశ్రీ చరణసాగరగారికి తాను రాసిన లేఖలో తన సమస్యను చెప్పుకున్నాడు. ఆయన ప్రత్యుత్తరంలో కర్మఫలం గురించి ఒక్క అక్షరం కూడా కనిపించలేదు. మళ్లీ మనసుకి దిక్కు తోచకుండాపోయింది. బుద్ధి యథావిధిగా మౌనానికి లొంగిపోయింది. ఆ క్షణంలో శరీరం లోపల ఎప్పుడూ అనుభవించని నిర్లిప్త భావన ఏర్పడసాగింది. ఈ భావాలు నాలోని కథకున్ని చంపేశాయి. అప్పుడే అతను నా బాధలకు కారణాలు వెతుక్కుంటూ దూరంగా వెళ్లాడు. ఇదే విషయాన్ని మునిశ్రీ చరణసాగరగారు తన లేఖలో నొక్కి చెప్పారు. నీలోని కథకుడు ఏదో కొత్తదనాన్ని వెతుక్కుంటూ కనిపించని ప్రపంచానికి వెళ్లాడు. ఆ ప్రపంచాన్ని అనుభవించి మళ్లీ నీ శరీరంలో చేరుతాడు. అతను నిన్ను వదిలిపోయిన అయోమయంలో నీలో ఎన్నో మానసిక కల్లోలాలు సృష్టించి వెళ్లాడు. నీలోని కథకుడు మళ్లీ కొత్త అనుభవంతో తిరిగి వస్తాడు. నీ నుండి ఒక గొప్ప కథ రాబోతోంది. ఆందోళన వద్దు, ఓపిక పట్టు.. మళ్లీ నిన్ను నువ్వు పరామర్శించుకో.. పదేపదే సూర్యచంద్రులను చూస్తూ వుండు.. కవిని, కథకుడిని వీళ్లిద్దరూ ప్రేరేపిస్తునే ఉంటారు. మరిచిపోకు. ఉత్తరం ద్వారా కాకుండా ఇంతకు ముందు ఒకసారి గురువుగారు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.

***

కాలికి చక్రం కట్టుకుని తిరిగిన జీవితం కొన్నిసార్లు తనకు విసుగేసింది. ఇకపై ఈతిరగడం చాలు, ఒక చోట స్థిరంగా ఉందామని జినదత్త మానసికంగా దృఢమైన నిర్ణయం తీసుకున్నప్పటికీ, అతను పనిచేస్తున్న ఎన్డీఓ సంస్థ మాత్రం దీనికి అంగీకరించినట్లు కనిపించలేదు. మంచి పదవిలో ఉన్న మీరు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.. మీకు జీతం తక్కువైందా? కావాలంటే చెప్పండి.. ఇప్పుడున్న జీతం కంటే ఇరవై శాతం ఎక్కువ పెంచుతాం, మీరు తిరుగుతూవుండాలి. ఊరూరూ తిరుగుతూవుండాలి. మేము ఇచ్చిన సమీక్షా నమూనాను బలోపేతం చేసియివ్వాలి. ఈ సమయంలో మీలాంటి అనుభవజ్ఞుడిని కోల్పోవడానికి సంస్థ సిద్ధంగా లేదని చెప్పి, ఒక చోట స్థిరపడాలన్న జినదత్త కోరికపై చన్నీళ్లు చల్లారు. ఉద్యోగం చేయడానికి ఒప్పుకోవాల్సిన పరిస్థితి అతనికి ఏర్పడింది. ఆ రోజు అత్యవసరంగా చన్నరాయపట్నం వెళ్లాల్సిన అవసరం ఉండడంతో జినదత్త ఉదయం ఐదు గంటలకే లేచి బస్టాండ్ చేరుకున్నాడు. మనసులో వందలాది ఆలోచనల గందరగోళాలు వేధిస్తున్నప్పటికీ, దాన్ని ఉద్యోగ విషయంలో చూపించకుండా తన ముఖానికి అంటిన మసిని తానే తుడుచుకుని, ఇతరులకు కనీకనపడనట్లుగా ఉండవలసిన జీవితం అతనిది.

తెల్లవారుజాము ఇంకా మసక వెలుతురు.. సూర్యోదయం కావడానికి కొన్ని క్షణాలు ఉన్నాయి. బస్టాండ్లో చన్నరాయపట్టణానికి వెళుతున్న బస్సులో ఇంకా చీకటి కమ్ముకోలేదు. బయలు దేరడానికి ఇంకో పది నిముషాలని చెప్పి డ్రైవర్ అటువైపునున్న హోటల్ వైపు చాయ్ తాగడానికి వెళ్లాడు.

బస్టాండులో ఎలాంటి కోలాహలం లేదు. నిశ్శబ్ద మౌనానికి సాక్షిలా ఉంది. పక్క సీట్లో ఎప్పుడో వచ్చి కూర్చున్న వ్యక్తిని చూడగానే జినదత్త కాస్త భయపడ్డాడు. ముఖాన్ని చిరిగి గుడ్డతో కప్పుకున్న వయస్సుదాటిన వ్యక్తి, స్నానం చేయకుండా ఎన్ని రోజులయ్యాయో..! బీడి కాల్చుతూ కిటికీలోంచి పొగను బయటికి వదులుతున్నాడు. ముఖాన్ని ముచ్చుకుని వుండటంతో అతని ముఖం అస్పష్టంగా ఉంది. ఆ వ్యక్తిని మరోసారి చూడాలని జినదత్త మనసు చెబుతూనే ఉంది. ఓరకంట చూసి అతని శరీరాకృతిని తన మనసులో నిలుపుకుంటున్నప్పుడు సహజంగానే ఆ వ్యక్తి ఎందుకో ఆప్తుడిలా కనిపించాడు. ముదురు నీలిరంగు రగ్గు, చేతిలో బీడీ, ముడతలు పడిన చర్మం, లావు మీసాలు, పెరిగిన గడ్డం.. అవును ఈ మనిషిని నేను చూశాను. ఛీ.. ఛీ.. ఎందుకో గుర్తురావటం లేదు. మతిమరుపు కూడా నన్ను బాధిస్తోందా? అయ్యో, జినదత్తా, నీకేమైంది..? అని తనలో తనే గొణుగుకోవడం మొదలుపెట్టాడు. హఠాత్తుగా ఆ పాత్ర గుర్తొచ్చింది. కథ గుర్తుకు వచ్చింది. ‘హళూరులోని ఒక బుద్ధుడు’ కథలోని తిమ్మప్ప పాత్రలా ఇతను కనిపించడం లేదా? మరోసారి చూపులు అతని వైపు మళ్లాయి. చూడటానికి తాను సృష్టించిన తిమ్మప్పలాగే ఉన్నాడు. చూడటానికి కథలో అతన్ని వర్ణించినట్లే కనిపిస్తున్నాడు. ఇదేమి మాయ..! జినదత్త తాను రాసిన ‘హళూరులోని ఒక బుద్ధుడు’ కథలో తిమ్మప్పను ఊరి ప్రజలు రాళ్లతో కొట్టి చంపిన సంఘటనతో కథ అంత్యమవుతుంది. అలాంటప్పుడు హళూరులో తిమ్మప్ప ఏం చేశాడు? అతని కథను మరోసారి గుర్తుకు తెచ్చుకోవలసి వచ్చింది.

హళూరులోని కుమారేశ్వరాలయం ప్రాంగణమే తిమ్మప్ప నివాసం. దేవాలయం వెనుక భాగంలో కట్టుకున్న గుడిసెలో ఉండేవాడు. భిక్షం అడిగి తెచుకున్నదే భోజనమైతే, రాత్రి కుమారేశ్వరుడి దేవాలయం అరుగుమీద పడుకునేవాడు..! హాళూరులోని ఆ దేవాలయంలోనే తన జీవితంలోని అధిక భాగం గడిపిన అతను ప్రతి రాత్రి శివనామాన్ని జపించకుండా పడుకునేవాడు కాదు. అతని భక్తికో, అమాయకత్వానికో, మంచితనానికో ఏమో కుమారేశ్వర స్వామి తిమ్మప్ప కలలో ప్రతిరోజు వచ్చేవాడు. రాను రామా అతనితో మాట్లాడసాగాడు. తిమ్మప్పకు మొదట్లో తాను శివుడితో మాట్లాడుతున్నాడా అని అనుమానం వేధించినా, చివరికి అవును.. నిజంగానే శివుడితో మాట్లాడుతున్నాడని నిర్ధారించుకున్నాడు. ఈ నిజం చాలా సంవత్సరాలు అతనిలోనే ఉండిపోయింది. తాను శివునితో ప్రతిరోజూ మాట్లాడుతున్నానని గ్రామస్థుల ముందు చెప్పినా ఎవరూ నమ్మలేదు. అతని ముఖం చూసి పకపకా నవ్వారు. దేవాలయం పూజారికి చెప్పినా ఆయన కూడా నమ్మలేదు. ‘ఇన్ని సంవత్సరాలుగా శివుడి పూజలు చేస్తున్నాను.. నాతో మాట్లాడని ఆ శివుడు నీలాంటి వాడితో మాట్లాడతాడా? పో పోరా పిచ్చివాడా..’ అని తిట్టి – శివశివా.. ఎలాంటి కాలం వచ్చిందయ్యా.. దేవుడి గురించి కూడా ఇంత తేలిగ్గా మాట్లాడుతున్నారుకదా?’ అని పూజారి గొణుక్కుంటూ వెళ్లిపోయాడు. హళూరు ప్రజలు తిమ్మప్పకు పిచ్చి ఎక్కువైందని మాట్లాడుకోసాగారు. అయినా తిమ్మప్ప మాత్రం తాను రోజూ రాత్రి శివుడితో మాట్లాడటం మాత్రం మానలేదు. ఒకసారి ‘నేను నీతో ప్రతిరోజూ మాట్లాడతాను. కబుర్లు చెబుతాను. ఈ విషయం ఊరివారికి చెబితే ఎవరూ నమ్మటం లేదు. నువ్వు మాట్లాడనే మాట్లాడవంట. నువ్వు మూగవాడివట, ఇలా ఏవేవో మాట్లాడుతున్నారు..’ అని శివుడిని కూడా ప్రశ్నించాడు. దానికి తిమ్మప్పతో హళూరు కుమారేశ్వరుడు ‘చూడు తిమ్మప్పా.. ఎవరెవరి కర్మలకు తగినట్లు వారి జీవితంలో వెలుగు పుడుతుంది. హాళూరు ప్రజల చీకట్లు ఇంకా తగ్గలేదు.. ఆ చీకట్లు కమ్ముకున్నంతవరకూ వారికి దక్కేది దక్కుతూనే ఉంటుంది’ అని చెప్పాడు.

తిమ్మప్ప అనే అమాయకుడికి శివుడి మాటల్లోని అంతరార్థం కాస్తోకూస్తో అర్థమైంది. అతను మళ్లీ ప్రశ్నించలేదు. అయినా కుమారేశ్వరునితో రోజూ మాట్లాడుతున్న విషయాన్ని ప్రజలకు చెప్పడం ఆపలేదు. ప్రజలు అతన్ని ఎగతాళి చేయడం ప్రారంభించారు. ‘అవునా.. ఈరోజు శివుడు ఏం చెప్పాడు? ఇప్పుడు శివుడు ఏం చేస్తున్నాడు? నీ శివుడు సమయానికి సరిగ్గా భోంచేస్తున్నాడా? నా భార్య బంగారు గొలుసు దొంగతనం జరిగింది. ఎవరు దొంగిలించారని శివుడిని అడుగుతావా? శివుడితోపాటు పార్వతీదేవి కూడా కలలో వస్తుందా? అమ్మవారు ఎలాంటి చీర కట్టుకుంది.. ఎంత బంగారం ఒంటిమీద వేసుకుంది?’ అంటూ శివుడి గురించి రకరకాల ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. అయినా కూడా తిమ్మప్ప తాను చెబుతున్నది అక్షరాలా శివనామమంత సత్యమని వాదించేవాడు.

***

ఇలా ఒకసారి శివరాత్రి మహాపూజ కోసం కుమారేశ్వర స్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. తెల్లవారుజాము నుంచే అభిషేకంతో ప్రారంభమై అనేక పూజలు, హవనాలు ఆలయంలో జరుగుతున్నాయి. ఆ రోజు సర్వాలంకారభూషితుడైన కుమారేశ్వరుడిని చూడగానే అతని కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘పరమేశ్వరా.. ఎంత అందంగా కనిపిస్తున్నావుకదా తండ్రీ..! నా దిష్టి నీకు తగిలేలా ఉంది’ అని అంటూ బయట నిల్చున్నవాడు గర్భగుడి వైపు పరిగెత్తసాగాడు. ‘తండ్రీ! ఈ జీవిని నీ పాదాల చెంత చేర్చుకో.. నీ కైలాసాన్ని చూడ్డానికి ఈరోజే పరుగు పరుగున వస్తాను..’ అని అంటూ వేగంగా అడుగులు వేస్తున్నాడు. చుట్టూ ఉన్న జనం కళ్లు మూసుకుని, చేతులు జోడించి మహామంగళారతి కోసం ఎదురుచూస్తున్నారు. తిమ్మప్ప తన పాటికి తాను భక్తులను పక్కకు జరుపుతూ గర్భగుడిలోకి దూరటం నివ్వెరపోయి చూస్తున్నారు. ‘శివ శివా.. హరహర మహాదేవ్.. కుమారేశ్వర్ మహరాజ్ కీ జై..’ అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. గంటానాదాల హాళూరు మొత్తం వినిపించసాగాయి. వీటన్నిటి మధ్య గర్భగుడిలోకి ప్రవేశించిన తిమ్మప్ప, మార్కండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నట్లు, ఈ కుమారేశ్వరుడిని గట్టిగా కౌగిలించుకున్నాడు. ‘తండ్రీ, పరమేశ్వరా, ఈ జన్మ చాలు. నన్ను నీ పాదాల దగ్గర చేర్చుకో. నువ్వు రోజూ నాతో మాట్లాడుతున్నావు.. కబుర్లు చెబుతున్నావు. అయితే జనం నువ్వు మాట్లాడుతావు అని చెప్పినా వినటం లేదు. నన్ను పిచ్చివాడని పిలుస్తున్నారు. చాలు శివా. ఈ జీవితం విసుగొచ్చింది. నీ పాదాలకు నన్ను చేర్చుకో..’ – అని వేడుకుంటూ కుమారేశ్వరుడిని కౌగిలించుకున్నాడు. తిమ్మప్ప గర్భగుడిలోకి దూరడం నివ్వెరపోయి చూసిన భక్తుల రక్తం ఉడికిపోయింది. జపిస్తున్న శివనామం ఆగిపోయింది. శివలింగాన్ని కౌగలించుకున్న తిమ్మప్పను చూసిన మహిళలు నోటిపై చేతులు అడ్డంగా పెట్టుకుని ‘శివశివా..’ అని గొణుక్కున్నారు. అప్పటికే గుంపులో అరుపులు మొదలయ్యాయి.

‘థూ.. ఆ చిన్నజాతి తిమ్మప్ప గర్భగుడి లోపలికి దూరాడు చూడండ్రా..’

‘లాగండ్రా వాణ్ణి.. వాడి పిచ్చి ప్రకోపించినట్లుంది..!”

‘ఈ లం..కొడుకు ఎప్పుడు గుడిలోకి దూరాడో…?”

భక్తులు మాట్లాడుకుంటూనే ఉన్నారు.

గర్భగుడిని శుభ్రం చేసేవారు, పూజారి తప్ప ఎవరూ గర్భగుడిలోకి వెళ్లరు. తిమ్మప్పకి ఉన్న ధైర్యం ఆ భక్తులకు లేదు. ‘అయ్యో, శివుడి పూజ పాడైపోయింది. మడిమైల తెలియని ఈ మనిషిని లాగి బయటికి తోయండి..’ అంటూ పూజారి గర్భగుడి నుంచి బయటకు వచ్చి కేకలు వేశాడు.

పూజారి మాట కోసం ఎదురుచూస్తున్న భక్తులలో ముగ్గురు నలుగురు వ్యక్తులు లోపలికి దూరి శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్న తిమ్మప్ప జబ్బలు పట్టుకుని లాగసాగారు. చేతులు వదులుకోలేదు. ఇంకా గట్టిగా లాగారు, తిమ్మప్ప చలించలేదు. ‘శివ శివా.. హరహర మహాదేవ్’ అని కేకలు పెడుతూ మరింత బలంగా లాగారు. తిమ్మప్ప శివలింగాన్ని విడిచిపెట్టేలా కనిపించలేదు.

‘పరమేశ్వరా, నువ్వే నాకు గతి.. నీ దగ్గరికి నన్ను పిల్చుకోస్వామి’ – తిమ్మప్ప ఈ మాటల్నే పఠిస్తున్నాడు.

‘అయ్యో.. ఈరోజు ఏం జరగకూడదని అనుకున్నామో అదే జరుగుతోంది. ఈ ఊరికి ఏం కీడు ఎదురుచూస్తుందో..! ఇంకా ముగ్గురు నలుగురు రండయ్యా.. ముందు ఈ లం..కొడుకును ఎత్తి బయట పడవేయండి..’ అని పూజారి గర్భగుడి బయట నిలబడి అరవసాగాడు. బయట ఉన్న ముగ్గురు నలుగురు హెూమానికి తెచ్చిన కట్టెలు పట్టుకుని గర్భగుడిలోకి దూరారు. తిమ్మప్ప కౌగిలి మరింత బిగువైంది. ‘శివా.. శివా.. నన్ను త్వరగా పిల్చుకోస్వామి..’ అంటూ అతని శివనామస్మరణ మరింత పెరిగింది.

శివరాత్రినాడు హళూరు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కుమారేశ్వరుని ఆలయానికి పోటెత్తారు. భక్త మార్కండేయుడి కథ విన్నవారంతా శివలింగాన్ని ఆలింగనం చేసుకున్న తిమ్మప్పను చూసి బెదిరిపోయారు. వాళ్లంతా ‘అయ్యో.. ఆ ముండాకొడుక్కు పిచ్చి ఎక్కువైందిరా..” అని అరవసాగారు.

‘ఓ కలియుగ మార్కండేయుడిని అక్కడ చూడండయ్యా’ అని ఒకరంటే, ‘చీ, ఆ పిచ్చివాడిని మార్కండేయుడని అంటున్నారుకదా..’ అని గుంపులోంచి మరో కంఠం వినిపించింది.

మొత్తానికి శివలింగాన్ని గట్టిగా కరుచుకున్న తిమ్మప్ప బాహుబలాన్ని బలహీనపరిచి, అతన్ని బరబరమని లాక్కుంటూ వచ్చారు. తిమ్మప్ప, ‘అయ్యో.. అమ్మా.. వదలండ్రా.. శివా నన్ను కాపాడు..!’- అని కన్నీరు పెడుతూ, కేకలు పెడుతున్నాడు. అతడిని ఈడ్చుకుని వచ్చినవారికి అతని కేకలు వినిపించలేదు. ప్రజల కోలాహలం ఎక్కువైంది. ఇలా ఊరి జనం నడుమ తిమ్మప్ప అనే భక్తుడిని ఈడ్చుకుని వచ్చినపుడు ప్రజల చేత ఎన్ని దెబ్బలు తిన్నాడో తెలీదు..! నేలమీద పడదోసి అతన్ని ఈడ్చుకుంటూ రావటంతో తిమ్మప్ప తల పగిలి రక్తం కారసాగింది. హెూమం కోసం పెట్టిన కట్టెలతో కొట్టసాగారు. ఇలా కట్టెలతో దెబ్బలు పడినప్పుడంతా ‘శివా.. ‘శివా’ అని ఆర్తనాదాలు చేస్తూనే ఉన్నాడు. కొట్టేవాళ్లకి కనికరం ఉన్నట్టు కనిపించడం లేదు. చూస్తున్న వాళ్ళకి తిమ్మప్ప మీద కూడా జాలి కలగటం లేదు. ‘ఆ పిచ్చివాడిని చంపండ్రా.. వదలకండి’ అని గుంపులోంచి ఒక కంఠం కేక పెట్టింది. ‘పాపం అతడ్ని కొట్టకండి.. ఆ పిచ్చివాడు పసివాడితో సమానం. అతనికి తాను ఏం చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో తెలీదు.. వదిలేయండి.. కొట్టింది చాలు..’ అని తిమ్మప్ప పరంగా చెప్పేవారి ఒక్క కంఠం కూడా ఆ గుంపులో వినిపించనే లేదు.

భక్తులు ‘శివ శివ హరహర మహాదేవా’ అని కేకలు వేస్తూ దర్శనం కోసం క్యూలో నిల్చున్నారు. ‘భక్తాదులు.. ఇక్కడ గమనించాలి. ఈ క్షణం వరకూ ఇక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ తిమ్మప్ప మనందరినీ కాపాడే కుమారేశ్వరస్వామిని ముట్టుకుని అపవిత్రం చేశాడు. ఇది ఊరికి మంచిది కాదు. మనకు కూడా మంచిది కాదు. శివుడికి మళ్లీ అభిషేకం చేసి, పూజ చేయాలి. నేను స్నానం చేసి, మడి కట్టుకుని వచ్చేవరకూ, దేవుడిని ఎవరూ చూడకూడదు. దైవ దర్శనానికి వచ్చినవాళ్లు తిరిగి వెళ్లిపోండి. మళ్లీ మధ్యాహ్నం రండి’ – అని చెప్పి అర్చకుడు గర్భగుడికి తాళం వేసి నది వైపు వేగంగా అడుగులు వేశాడు. శివుడి దర్శనం కోసం దూరం నుంచి వచ్చిన జనానికి కడుపులో మంట మరింత పెరిగింది. శివుడి దర్శనం చేయకుండా ఫలహారం కానీ, టిఫిన్ కానీ చేయకూడదు. ఉదయం నుంచే శివరాత్రి ఉపవాసం, జాగరణ మొదలైందికదా అని భక్తులు లోలోపల వ్యథ చెందసాగారు. ఈ విషయం హళూరుకు చేరింది.

‘హాలూరికి ఎలాంటి కీడు జరుగబోతోందో? అని జనం నోటికి వచ్చినట్లు మాట్లాడుకోసాగారు. తిమ్మప్పను దూషించసాగారు. శాపనార్థాలు పెట్టసాగారు. ‘ఇంత కాలం ఇలాంటి పిచ్చివాడిని హాళూరులో ఉండనివ్వడమే తప్పు. ఇలాంటి పిచ్చివాళ్లు ఊరికొకరు ఉంటే ఊరు అభివృద్ధి అయినట్టే?..’

గుడి బయట అనాథలా రక్తపు మడుగులో పడివున్న తిమ్మప్పను ఎవరూ చూడటమే లేదు. చూసినవారు రాళ్లు రువ్వారు. మట్టిని విసిరారు. దీని గురించి ఎలాంటి ధ్యాసే లేని తిమ్మప్ప చచ్చాడో? బతికాడో? అనే స్పృహ కూడా లేకుండా నేలకు అంటుకుపోయాడు. కాళ్లూచేతులు కదలడం లేదు. శరీరంలో కదలిక లేదు. అతని చుట్టూ రాళ్లు రాశిగా పడివున్నాయి. ఆ రాళ్లకు అంటిన రక్తం ఇంకా పచ్చిగా ఉంది. అతనే వేడుకున్నట్లు శివుడి పాదాలను చేరకున్నాడా..! హాళూరులోని ఒక బుద్ధుడిలా ఉండే తిమ్మప్ప శివుడితో మాట్లాడేవాడనే సత్యాన్ని ఆ ఊరివారు చివరి వరకు అంగీకరించలేదు. దేవుడిని నమ్మినవాడికి ఇలాంటి శిక్ష?

***

‘హళూరులోని ఒక బుద్ధుడు’ కథలో ప్రధాన పాత్రధారి వడ్డెర తిమ్మప్ప ఈరోజు తాను కూర్చున్న బస్సులో పక్కసీటులో కూర్చున్నాడు. తాను సృష్టించిన ఆ పాత్ర మళ్లీ తన కళ్ల ముందుకొచ్చింది. ఇది ఎంత ఆశ్చర్యమో? ఓరకంట పక్కనున్న సీటులో కూర్చున్న అతను జినదత్తనే చూస్తున్నాడు. అతని ముఖంలో కోపం, రోషం, ఆక్రోశం మొత్తం కూడగట్టుకుని కూర్చున్నాయి. అతనితో మాట్లాడటానికి జినదత్తుడికి భయం వేసింది. తిమ్మప్ప కచ్చితంగా తనను చంపివేసేలా చూస్తున్నాడు. అతని కళ్లలో ఆ నిప్పు కనిపిస్తోందని మనస్సులో అనుకున్నాడు. ఏం చేయాలి? బస్సు నుంచి దిగిపోవాలనే ఆలోచన.. దిగటానికి ధైర్యం చాలక గుండెను చిక్కబట్టుకుని, కిటికీ వైపు ముఖం తిప్పి, కిటికి గట్టుమీద తలవాల్చాడు. తిమ్మప్ప గురించి ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. అతని పాత్రను జీవితంలో తాను ఎక్కడా చూడలేదు. చూసి ఉంటే ఈపాటికి గుర్తొచ్చేవాడు. అయితే అనుకోకుండా ఆ పాత్ర నిజంగానే ఉండి తాను దాన్ని ఉపయోగించుకుని ఉంటే ఈ భుయం ఉండేదికాదు. కానీ ఇతను నేను సృష్టించినకథలో ఒక కల్పిత పాత్ర. ఆ పాత్రధారే మళ్లీ నా ఎదుటికి వచ్చాడంటే ఆందోళన కలగకుండా ఉండదు.

‘అయ్యా, కథా రచయితగారూ.. దయచేసి మీ ముఖాన్ని మా వైపు తిప్పండి, నేను మీ కల్పిత పాత్రను. నన్ను వడ్డెర తిమ్మప్ప అని పిలుస్తారు’ అని అటువైపు నుంచి ముక్కలైనట్లున్న ధ్వనిలో అతని మాటలు వినిపించాయి. జినదత్త అతను తననే పిలుస్తున్నాడని భయంతో అతని వైపు తిరిగాడు. తనపై అలుక, కోపం, అతనికి ఉన్నాయని అప్పటికే అర్థమైంది. ‘అదికాదు స్వామీ, నా పాత్రను సృష్టించి, ఆ పరమ శివుడే నాతో మాట్లాడే అదృష్టాన్ని కల్పించి, చివరికి నన్ను ఆ ఊరివాళ్ల చేత చంపించారు కదా.. ఇదేమి న్యాయం..? మీరు చేసినదానికి ఆ పరమశివుడు కూడా మెచ్చుకోడు. నాతో మాట్లాడుతున్న శివుడు ఊరి జనం ముందు ఎందుకు మాట్లాడేలా చేయలేదు..? ఆఖరికి ఆ శివుడిని రాతిదేవుడిగా మార్చి, నన్ను ఒక జంతువుగా చేసి, ప్రజల చేత కొట్టించి, చంపి, ఆ పాపాన్ని మీకే అంటించుకున్నారు కదా స్వామి.. ఇది మీకు సమంజసంగా ఉందా? నన్ను కథ చివర్లో ఊరివాళ్లు రాళ్లు, కర్రలతో ఎలా కొట్టి చంపారో, మిమ్మల్ని కూడా అదే విధంగా అదే తీరులో కొట్టి చంపితే నా బాధ, వ్యథ మీకు అర్థం అవుతుంది?.. చాలా అన్యాయం చేశారు. నా పాత్రను చంపేశారు కదా? కచ్చితంగా శివుడు మిమ్మల్ని మెచ్చడు..’

జినదత్తను చూడగానే తిమ్మప్ప తనలోని బాధను వెళ్లబోసుకుంటూనే ఉన్నాడు.

‘అలా కాదు తిమ్మప్పా, నువ్వు శివుడితో మాట్లాడుతున్నావని నీకు మాత్రమే తెలుసు. దీన్ని జనం నమ్ముతారా? అందులోనూ ఈ కలియుగంలో దేవుడు మాట్లాడుతాడని చెబితే ఎవరైనా నమ్ముతారా? ప్రజల అజ్ఞానం గురించి నేను ఏమి చెప్పను?.. అందువల్ల నీలోని శక్తి నువ్వు చనిపోయిన తర్వాత కూడా వాళ్లకు తెలియదు. నువ్వొక పిచ్చివాడివని అనుకుని జనం నిన్ను కొట్టి చంపారు. నీ పాత్రకు నేను న్యాయం చేయలేకపోయిండొచ్చు. అది నీ దృష్టిలో మాత్రమే. నా దృష్టిలో, నువ్వు దేవుడితో మాట్లాడటమే ఒక భ్రమ. నువ్వు సృష్టించుకున్న భ్రమాలోకంలో నువ్వు శివుడితో మాట్లాడుతున్నావని కల్పించుకుంటున్నావు. అంతే..! తిమ్మప్పా, నువ్వు అనుకున్నట్టు నీ పాత్ర అలా లేదు. నువ్వు మాట్లాడుతున్న పరమశివుడు కూడా నా కల్పితమే..! అందువల్ల నీ పాత్రకు నేనేమీ అన్యాయం చేయలేదు’ అని జినదత్త తిమ్మప్పకు చెప్పాడు.

‘లేదు లేదు.. దీనికి నేను అంగీకరించను. మీరు మీ ఊహకు తగినట్లుగా పాత్రలను సృష్టించవచ్చు, చంపవచ్చు అని అనుకుంటే ఆ పాత్రలు అనుభవించే బాధ శాపంగా మీకు తగలకుండా ఉండదు. చూస్తుండండి.. నన్ను కథలో అత్యంత దారుణంగా చంపించారు.. మీరు రాసిన విభిన్న కథల్లో ఏ ఏ పాత్రలను సృష్టించారో, వాటి ద్వారా వాటికి ఇష్టం లేనివి ఎన్ని చేయించారో .. ఆ పాత్రలన్ని మిమ్మల్ని వేధించకుండా ఉండవు. మీ మాటలతో నేను సంతృప్తి చెందలేదు. ఇప్పుడు నేను వెళ్లొచ్చు. నేను మళ్లీ వస్తాను. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నానే ఉంటాను.. నా ప్రశాంతతను దోచుకున్న మిమ్మల్ని మాత్రం ఊరికే వదలను. చూస్తూ వుండండి.. నన్ను చంపించినట్లు మీ మనసును కూడా చిత్రహింసలు పెట్టి చంపుతాను, చూస్తుండండి’ – అని తిమ్మప్ప జినదత్తని చూస్తూనే తిడుతూనే ఉన్నాడు.

తిమ్మప్ప మాటలకు జినదత్త జవాబిచ్చే ధైర్యం చేయలేదు. కథకుడి కల్పన గురించి, స్వేఛ్ఛ గురించి ఆ పాత్రకు ఏమి తెలుసు? ఒక కథలోని పాత్రలన్నీ కథకుడు చెప్పినట్టే వినాలనే వాస్తవం తిమ్మప్పలాంటి వ్యక్తికి ఎలా అర్థమవుతుంది. ఈ విషయం అతనికి వివరించి చెప్పినా, అర్థం చేసుకుంటాడా? అతనొక మూర్ఖుడు. తాను పుట్టించిన తన ఊహా శిశువుకాదా? అతను ఏమైనా మాట్లాడనీలే.. కోపం, ఆక్రోశం, కలవరం, జుగుప్స, అసూయ – ఇవేకదా ప్రతిపాత్ర వెనుక ఉండే శక్తులు. ఆ రోజు వచ్చి తన పాత్ర గురించి ప్రశ్నించిన తిమ్మప్పను జీనదత్త గంభీరంగా తీసుకోనేలేదు. అతనితో తాను మాట్లాడలేడని చెప్పి జినదత్త కిటికీ వైపు తిరిగి నెమ్మదిగా కళ్లు మూసుకున్నాడు. తిమ్మప్ప మాత్రం నిస్సహాయంగా జినదత్త వైపు చూస్తూ ఉండిపోయాడు. తన బాధను కథకుడు కూడా అర్థం చేసుకోలేదని ఆ పాత్ర కూడా బాధ పడుతూనే ఉంది.

***

ఉదయం ఏడు గంటలైంది. అప్పుడే సూర్యుని కాంతి ఆకాశంలో ప్రసరిస్తూ ఉంది. పొద్దున్నే తొందరగా లేచిన జినదత్తకు చిన్నగా కునుకు పట్టింది. బస్సు అప్పటికే ప్రయాణపు దారిలో ఉంది. కండక్టర్ వచ్చి లేపగానే తాను వెళుతున్న పని గుర్తొచ్చింది. అప్పటికే బస్సు జనంతో నిండిపోయింది. లేచిన వెంటనే ముందుగా ప్రక్క సీటులో కూర్చున్న వ్యక్తి వైపు చూపులు వెళ్లాయి. గంట క్రితం తనను ప్రశ్నించిన తిమ్మప్ప అక్కడ కనిపించలేదు. కొత్తగా పెళ్లయినట్టున్న ఒక జంట పక్క సీటులో కూర్చొని తమ మాటల లోకంలో మునిగిపోయారు. తిమ్మప్ప ఇదే బస్సులో ఎక్కడైనా కూర్చున్నాడా అని జీనదత్తకి అనుమానం వచ్చి, లేచి నిలబడి బస్సులో కూర్చున్న వాళ్లనంతా చూశాడు. తిమ్మప్ప ఎక్కడా కనిపించలేదు. అతని పీడ అక్కడితో ముగిసిందని అనుకోలేకపోయాడు. జినదత్తకు తన కథల్లో తిమ్మప్పకి చేసిన జరిగిన అన్యాయంలా ఇంకా ఏ ఏ పాత్రలు వచ్చి తనను వేధిస్తాయోననే భయం జినదత్తలో మొదలైంది.

తన కొడుకుతో శారీరక సంబంధాన్ని కలిగిన లలితాదేవి తనను వేధించకుండా ఉండదు. ఆమెకు తన కొడుకని తెలిసినప్పటికీ, కామదాహాన్ని నియంత్రించుకోలేక నలిగిపోయిన కొడుకుతో సుఖాన్ని అనుభవించే లలితాదేవి పాత్ర తన మానసిక వికారంలా కనిపించినా ఆమె నిస్సహాయతను కథపొడవునా చిత్రించి దొరికిన ప్రతి స్త్రీని అనుభవించే వికృత కాముకుడిలా ఉన్న కొడుకులో పరివర్తన తీసుకుని రావడానికి తన దేహ త్యాగం కన్నా వేరే దారి కనిపించక కుమిలిపోయే మనస్సు ఆమెది. ఆమె చేసిన తప్పును మరుగుపరిచేలా కథలో సృష్టించాడు. అయితే ఆమెకు తన కొడుకుతో సంబంధాన్ని పెట్టుకున్న నింద ఆంటుకుంది కదా. పాఠకులు తనను ఎంతగా దూషించవచ్చో అన్నది తనను వేధించకుండా ఉండదు. ఆమె ఎప్పుడు వస్తుందో? తనను ఏమని ప్రశ్నిస్తుందో?

ఒక కథారచయితగా, నా పాత్రలను ఎలా కావాలంటే అలా సందర్భానికి అనుగుణంగా ఉపయోగించుకుని పాఠకుల అంతరంగాన్ని చేరుకునే ప్రయత్నాన్ని తాను చేయడానికి శ్రమించాడే తప్ప తన స్వార్థాన్ని, ఆక్రోశాన్ని, ఆంతరంగంలోని మురికిని పాత్రల ద్వారా చెబుతూ పాఠకులు మెచ్చుకునేలా చేసినా, కథకుడిగా తాను బాధ్యతను మరువలేదని జినదత్తుని అంతరంగపు వాదన. ప్రతి కథ ద్వారా కథా శిల్పాన్ని విచ్ఛిన్నం చేయడానికి తాను ప్రయత్నించినప్పటికీ, దీన్ని మరో కథకుడు మాత్రం తన కథాశిల్పాన్ని అర్థం చేసుకోవాలి. అందువల్లనే తన పాత్రలు పాఠకులకు నచ్చుతాయి, వారిని ఆందోళనకు గురిచేస్తాయి, కన్నీళ్లు పెట్టిస్తాయి, తమ నిస్సహాయతను వ్యక్తం చేస్తాయి. విమర్శకులు వీటినేకదా తన కథలలోని ప్రత్యేకతగా గుర్తించేవారు.

***

చన్నరాయపట్టణంలో వీలైనంత త్వరగా పనులన్నీ ముగించుకుని రాత్రికి శ్రావణబెళగొళకు చేరుకోవాలని జినదత్త ఆలోచన. ఆ ప్రకారమే చన్నరాయపట్టణం చుట్టుపక్కల ఐదారు గ్రామాలను చుట్టి రాత్రి శ్రావణబెళగొళకు వచ్చేసరికి పదకొండు గంటలైంది. పగలంతా వచ్చి వేధించిన ఏ పాత్ర అయినా రాత్రి మళ్లీ రావచ్చునని ఎదురుచూసిన జినదత్తకు ఆ రాత్రి తనని ప్రశ్నించడానికి కానీ, తనతో మాట్లాడడానికి కానీ ఎవరూ రాలేదు. ఆ రాత్రి గాఢనిద్రకు లొంగిపోయి అతను ఉదయపు వెలుగును చూసేసరికి దాదాపు పదకొండు గంటలైంది. కిటికీ తెరిచి సూర్యుని వైపు చూసినప్పుడూ, తనను వేధిస్తున్న ఆ చింతలు మాత్రం పదే పదే గుర్తొస్తూనే ఉన్నాయి. తనలో ఉన్న కథకుడు ఉండివుంటే తాను సృష్టించిన పాత్రలకు మరింత ఘాటుగా స్పందించి జవాబులు ఇచ్చేవాడో ఏమో? కానీ నేడు అతను లేకుండా, అతను ఉన్నాడనే తప్పుడు నమ్మకంతో సమాధానం చెప్పినా, సమంజసం అనిపించడం లేదు. ఆ సమాధానం అంగీకరించేలా లేదు. ఏం చేయాలి? అతను వచ్చేదాకా ఈ రోజులను గడపాలి. రోజులను గడుపుకుంటూ పోవాలి. కథారచయితగా జీవించిన తర్వాత ఈ విధమైన జీవితాన్ని తప్పనిసరిగా అంగీకరించాలన్నది అతను కనుగొన్న సత్యం.

దాదాపు పదకొండు గంటల సమయంలో జినదత్తుడు కొండపైకి చేరుకుని, అక్కడ ఉన్న ఋషులకు పూలుపళ్లు సమర్పించి ఆశీస్సులు పొంది, ఎప్పటిలా తనకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిచ్చే బాహుబలి మందహాసాన్ని చూస్తూ కూర్చున్నాడు. బాహుబలి ముఖంలో మందహాసం తన జీవితానికి ఒక భరోసాను ఇస్తుందనే అతను ప్రతి నెలా ఆయన ముందు గంటల తరబడి కూర్చుని అతడినే చూస్తూ జీవితంలో ఉత్సాహాన్ని నింపుకునేవాడు.

ఆ రోజు బాహుబలి కళ్లు మనోహరంగా మెరుస్తున్నాయి. ముఖంలోని మందహాసం వందరెట్లు పెరిగింది. ఉరుములు, మెరుపులు, వర్షం, గాలికి భయపడకుండా దృఢంగా పెనుశిలలా నిలబడిన బాహుబలి నేపథ్యపు కథ, జైన పురాణాల కథలను లోతుగా అధ్యయనం చేసిన జినదత్త, ప్రతి కథలోని పాత్రల కల్పనను బాహుబలిని చూస్తూ సృష్టించేవాడు. ఆ రోజు కూడా అదే దృష్టితో శ్రావణబెళగొళకు వచ్చిన అతను బాహుబలిని ఆరంగా, ఆత్మీయంగా చూస్తూ, తనలోని కథకుడిని మళ్లీ వచ్చి తనలో చేరేలా చేయమని నిర్లిప్తంగా వేడుకుంటున్నాడు. బాహుబలి దృష్టి ఎప్పటిలాగే మానవ లోకంపై ఉన్నట్లు కనిపిస్తోంది. అతని అంతరంగం బాహుబలి మందహాసాన్ని ఆస్వాదిస్తూనే ఉంది.

‘జినదత్త కథలు’ సంపుటి అప్పటికే పది ముద్రణలు చూసింది. కొత్త పబ్లిషర్లతో చర్చలు, ఢిల్లీలో జరిగబోయే జాతీయ సాహిత్య సదస్సుకు వెళ్లడం, తన గురువులు, సాహితీవేత్తలు బెళవలు సత్యనారాయణ శైణైగారి అభినందనా గ్రంథానికి ముందుమాట రాయడం, ‘నీ మాయలోపలా’ కథ హక్కును తీసుకుని సినిమా నిర్మించడానికి అనుమతి కోసం ఎదురుచూస్తున్న మాల్గాడి ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ వారితో చర్చలు జరపడం, ఇలా ఇంకా చాలా పనులు వరుసగా జినదత్త కోసం ఎదురుచూస్తున్నాయి.

జినదత్తకు తన సమస్య అర్థమైంది. మళ్లీ కథారచయితగా మారతాడనే స్పూర్తి అతడికి బతకాలనే ధైర్యాన్ని ఇచ్చింది. కథకుడి ఆగమనం కోసం జినదత్త ఊపిరి బిగపట్టుకుని మళ్లీ వస్తాడనే నిరీక్షణలో ఎదురుచూడసాగాడు. ఆతను ఎక్కడున్నాడో, ఏ అనుభవంతో తిరిగి వస్తాడో..! అనే ప్రశ్నలు నిరంతరం..

ప్రముఖ కథకుడు జినదత్త ఉపాధ్యాయ తదుపరి కథ ఇంకా రావలసి ఉంది.

కన్నడ మూలం: శ్రీధర బనవాసి

అనువాదం: రంగనాథ రామచంద్రరావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here