[శ్రీ సముద్రాల హరికృష్ణ రచించిన ‘జోడు నిజాలు!!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]కాం[/dropcap]తి కంఠీరవి, దీపంతో నవ్వుతు తేల్చేసింది,
నా మేలే లేకుంటే నీ ఇల్లే, ఓ చీకటి కొట్టని!
**
కోపించని దీపం సన్నగ ఠీవిగ చెప్పేసింది.
“ఆపాపిక, నే లేందే నిన్గాలే గుటుక్కుమంటుంది”!!
**
చీకటితో కిరణం గీరగ సవా ల్విసిరింది.
“నేనంటే హడల్, నే వస్తూనే నువ్ మటుమాయం”!
**
ఏ కినుకా లేకుండా ఆ శ్యామాంగన చెప్పింది
“భయమేమీ కాదోయ్, పర రాజ్యంలో నే నెందుకని”?!
**
తెలుపక్కాయ్ నలుపమ్మాయిని గేలి చేసింది
“నే రంగంలో దిగితే, నీ అడ్రస్ గల్లంతే తెల్సా”!
**
నల నల్లని చెల్లెలు మెలమెల్లగ చెప్పింది
“నాదీ అమృత బీజం, నీ చాటున నాదేగా స్థానం”!
**
గెల్పు తాఖీదు జారీ, నడుమొంగిన ఓటమికి-
“నా చాయల ఎప్డైనా కనబడ్డావో, ఖబడ్దార్”!!
**
కదనానుభవ మెడళ్ళ ఓటమి రావ్ అన్నాడు
“వెర్రబ్బాయ్, నే వెళ్తేనే నీ కొచ్చేది, గోదా ఎంట్రీ”!
**
ఎండల మండేశం అన్నాడు రాలే చినుకులతో
కణమైనా మిగల్చ కావిరి చేస్తా, జాగ్రత్తని!
**
ఏ వేడిమి నోపని శాంతుడు ఆ వానప్పన్నాడు,
“ఆవేశం వద్దన్నాయ్, నువ్పీల్చిన నీటిని నేనే”!!
**
నిప్పన్నది, “ఆవారాగా తిరగటమేనా గాలీ?!
ఎప్పటికైనా ఆటలు ఆపి, నిలకడ నేర్చేవా”?!
**
గాలన్నది, “ఈ లోకమే లేదు, నే నాడకపోతే!
నిన్నార్పాలన్నా, పెంచాలన్నా నేనొక్కడినే నోయ్”!
**
నిజమన్నది సూటిగ,”అబధ్ధమా ఏం బుధ్ధివే?
ఉన్నది లేదంటావ్, లేనిది వుందంటావ్, శాడ్”!
**
బద్ధకమే లేనీ శ్రమజీవి-అబధ్ధమన్నది
“నువ్ వచ్చే లోగా, నే ఖండాలే దాటేస్తా, రాజేస్తా”!!
**
రవి బింబం శోభిస్తూ, చంద్రుడి నో ప్రశ్నడిగింది
వచ్చే పోయే ఈ బుధ్ధేవిటి, పక్షానికోసారని!
**
సరదాల చంద్రమ్మావయ్యన్నాడు, “ఇది తెలుసా?!
మండించీ నువ్పోతే, వెన్నెల పంచేదీ, నేనేనోయ్”!!
**
శివుడన్నా డా పార్వతితో, సిత దరహాసంతో,
“ఉమా! తెలుసా కొమ్మా, నే లేక, నీవు లేవు సుమ్మా”!
**
లేనవ్వుల చూపులతో బదులిచ్చిం దా శాంభవి
“నీ లోనే నేనుండ- వేరేమి, ఒకటేమి, హే శంభో”!
**
కానిది ఏదీ, వివ్వింతల హరిశ్చంద్రీయ రసకందంలో!
నరుడా, అబధ్ధవరుడా, మారేదేం లేదులే నీ స్థానంలో!