ప్రాంతీయ సినిమా -3: జాలీవుడ్‌కి కొత్త జాయ్!

    0
    5

    [box type=’note’ fontsize=’16’] “దేశంలో ఇతర భాషల్లో సినిమా చరిత్రలు పౌరాణికాలతో ప్రాణం పోసుకుంటే, అసోంలో  అభ్యుదయవాదంతో సినిమా చరిత్ర శ్రీకారం చుట్టుకుంది” అంటూ జాలీవుడ్ సినిమాలను విశ్లేషిస్తున్నారు సికందర్. [/box]

    [dropcap]దే[/dropcap]శంలో ఇతర భాషల్లో సినిమా చరిత్రలు పౌరాణికాలతో ప్రాణం పోసుకుంటే, అసోంలో  అభ్యుదయవాదంతో సినిమా చరిత్ర శ్రీకారం చుట్టుకుంది. అసలు భారతీయ సినిమాలకి మొట్ట మొదటి స్క్రీన్ ప్లే కళాకారులెవరో చెప్పుకోవాలంటే, నాటక రంగ కళాకారులే. సినిమాలు పుట్టడానికి పూర్వం ఆ కళాకారులు కష్టపడి వివిధ పురాణ కథలకి నాటకాలుగా దృశ్యరూపం కల్పించి ప్రదర్శిస్తూంటే,  ప్రేక్షకులు గంటల తరబడి అలా కూర్చుని చూస్తూండి పోయేవాళ్ళు. సినిమాలు ప్రాణం పోసుకుంటున్నప్పుడు,  చిత్రీకరించడానికి అవే పౌరాణిక నాటక దృశ్య రూపాల మీద ఆధారపడి, వాటిని స్టేజి మీద చిత్రీకరించి వెండి తెర మీద ప్రదర్శించడం మొదలెట్టారు. కాలం గిర్రున తిరిగి ఇవ్వాళ ఆడియో పంక్షన్స్‌ని  మీడియా చిత్రీకరించి ప్రసారం చేస్తున్నట్టు.

    అలాటిది అసోంలో, సినిమా కంటూ స్వయంగా కథని సృష్టించుకుని, స్క్రీన్ ప్లే కూడా రాసుకుని – అదికూడా ఏ పౌరాణికమో కాకుండా – చరిత్ర నుంచి తీసుకున్న ఒక అభ్యుదయ భావాల గాథతో,  మొట్ట మొదటి అస్సామీ చలన చిత్రరాజం తీశారు.

    రూప్ కన్వర్ జ్యోతీప్రసాద్ అగర్వాలా అభ్యుదయ వాది, దార్శనికుడు, కవి, నాటక రచయిత, సంగీత దర్శకుడు, స్వాతంత్ర పోరాట యోధుడు. 1935 లో ఈయన చిత్రలేఖా మూవీటోన్ అనే సంస్థని స్థాపించి, ‘జోయ్ మోతీ’ అనే చారిత్రికం తీసి అస్సాం చలనచిత్ర పితామహుడుగా నిల్చిపోయాడు. అసోం  చాలా వెనుకబడి వుండేది. సరైన సాంకేతికులు కూడా వుండే వాళ్ళు కాదు. దీంతో అగర్వాలా ఈ సినిమా నిర్మాణంలో మరికొన్ని పాత్రలు   తనే పోషించాడు – నిర్మాత, రచయితా, దర్శకుడుగానే కాక –  కూర్పు, కళాదర్శకత్వం, నృత్య దర్శకత్వం, సంగీత దర్శకత్వం, గీత రచన, వస్త్రాలంకరణ మొదలైనవన్నీ తన భుజనే వేసుకు మోశాడు. 1935 మార్చి పదవ తేదీ విడుదల చేశాడు. అప్పట్లోనే అరవై వేల రూపాయలు వ్యయమైన ఈ తొలి అస్సామీ చలనచిత్రం ఆర్ధికంగా నష్టపోయింది. అప్పటి అనేక భారతీయ సినిమాల నెగెటివ్ లకి లాగే దీని నెగెటివ్ సైతం కాలగర్భంలో కలిసిపోయింది. అల్తాఫ్ మజీద్ రిజా అనే పాత్రికేయుడు ఎక్కడెక్కడో దొరికిన నెగెటివ్ ఖండికల్ని కూర్చి,  సబ్ టైటిల్స్ వేసి, ఓ అరకొర ‘జోయ్ మోతీ’ కి రూపం కల్పించాడు. 1995 లో అర్నాబ్ జాన్ డేకా అని డాక్యుమెంటరీల నిర్మాత ముంబాయిలోని ఒక స్టూడియోలో  ‘జోయ్ మోతీ’ పూర్తి స్థాయి నెగెటివ్ ని కనుగొని ప్రపంచాని కందించాడు.

     అసోంలో 17 వ శతాబ్దపు  అహోం రాజ్యపు యువరాణి సోతి జోయ్ మోతీ వీరగాథ ఇది. అప్పట్లోకథానాయిక ప్రధాన పాత్రగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా నిర్మించాలని ఎవరూ సాహసించలేదు  మొత్తం దేశంలో. అలాటిది అగర్వాలా దేశభాషల్లో మొట్ట మొదటి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ తీసేశాడు.

    అగర్వాలా తర్వాత రెండేళ్ళకి ‘ఇంద్రమాలతి’ అనే ఒకే సినిమా తీశాడు. ప్రసిద్ధ గాయకుడూ, సంగీతదర్శకుడు భూపేన్ హజారికా ఇందులో హీరోగా నటించాడు. 1940 నుంచీ 1956 వరకూ రెండు మూడేసి సినిమాలు చొప్పున నిర్మాణమయ్యేవి. ఈ కాలంలో అసిత్ సేన్ ‘బిప్లబి’, ఫణి శర్మ,’సిరాజ్’ వంటి అతికొద్ది మంచి సినిమాలొచ్చాయి. 1956లో దర్శకుడుగా భూపేన్ హజారికా ప్రవేశంతో అసోం  సినిమాల కొత్త శకం ప్రారంభమయ్యింది. దర్శకుడుగా ఆయన 1956 లో  ‘ఎరా తరోర్ సుర్’ ప్రారంభించి, 1988 లో ‘సిరాజ్’ వరకూ 14 సినిమాలూ తీశాడు.

    అసోం  చలనచిత్ర రంగం అతి చిన్నది. ఇప్పటికీ ప్రదర్శించడానికి  45 థియేటర్లే వున్నాయి. ఇందులోనే బాలీవుడ్ హిందీ సినిమాలకి చోటు కల్పించాలి. తెలుగులో తెలుగు సినిమాలతోనే పోటీ వుంటుంది. ఓడిశా, అసోం, ఛత్తీస్ ఘడ్ లవంటి చిన్న చిన్న రాష్ట్రాల్లో మాత్రం అక్కడి ప్రాంతీయ సినిమాలు బాలీవుడ్ మెగా సినిమాలతో పోటీ పడాలి. పోటీ పడలేక వెలవెలబోవాలి. నష్టాల వూబిలో కూరుకుపోవాలి. అసోం సినిమాలు ఈ మధ్య కాలంలో వరకూ కమర్షియల్ సినిమాల బాట పట్టిందీ లేదు. కళాత్మక సినిమాల ప్రపంచంలోనే వుండిపోయాయి.  దేశవిదేశాల చలచిత్రోత్సవాల్లో పురస్కరాలు పొందుతూ మనుగడ సాగిస్తూ వచ్చాయి. 1960 ల నుంచి 2000 వరకూ కొనసాగిన ఈ ధోరణి కాస్తా,  ఇక బాలీవుడ్ శైలి కమర్షియల్ సినిమాలు తీసే వైపుకు మొగ్గిపోయింది. అసలు 1935 నుంచీ 2000 మధ్య కాలంలో తీసిన సినిమాలు వంద కూడా లేవు. 2000 లనుంచి ఈ స్తబ్ధతని తీర్చాలంటే ఇక కమర్షియల్స్ వైపు మొగ్గాలని కళ్ళు తెరచింది జాలీవుడ్ – పేరుకే జాలీవుడ్ గానీ జాలీగా  గడిపిందేమీ లేదు ఇంతకాలం.

    దేశంలో అన్ని భాషా చలనచిత్ర రంగాల పరిస్థితీ  ఇదే -2000 నుంచీ ప్రపంచీకరణ ప్రభావానికి లోనై కళా కాంతుల్ని మార్చుకోవడం – ఒక కొత్త వొరవడితో. అసోంలో తమ రాష్ట్రంలో తమ స్థానిక భాషా చలన చిత్రాల్ని ఫక్తు కమర్షియల్స్ గా మార్చుకుని, తీసి ప్రదర్శించుకుందామన్నా, అదే ప్రపంచీకరణ పుణ్యమా అని వున్న కొద్ది పాటి థియేటర్లు కార్పొరేట్ సంస్థల మల్టీ ప్లెక్సుల కిందికి మారిపోతూ- అసోం సినిమాల ప్రదర్శనకి బతిమిలాడుకోవాల్సి వస్తోంది. కార్పొరేట్ యాజమాన్యాలు హిందీ సినిమాలకే ప్రాధాన్యమిస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఏమీ చేయలేక పోతోంది.
    కమర్షియల్ గా మారిన కొత్త శకంలో కూడా,  2010 వరకూ, ఏడాదికి మూడు సినిమాలకి మించి నిర్మించలేని పరిస్థితులు ఇందువల్ల దాపురించాయి. 2011లో 4, 2012లో 6… ఇలా పెంచుకుంటూ వచ్చి,  2017లో 24 సినిమాలు తీసే స్థాయికి ఎలాగో చేరుకున్నారు బాలీవుడ్ పెద్దన్న సరసన. 2017లో బాలీవుడ్‌కి గట్టి జవాబు కూడా ఇచ్చారు ‘మిషన్ చైనా’తో. అనూహ్యంగా ఆరుకోట్ల కలెక్షన్లు రాబట్టి!

    గాయకుడు, నటుడు, దర్శకుడు జుబిన్ గర్గ్ తీసిన రోమాంటిక్ యాక్షన్ ‘మిషన్ చైనా’ అసోంలోనే కాదు, దేశంలో మరికొన్ని ప్రధాన నగరాల్లో మల్టీ ప్లెకుల్లో ఘన విజయం సాధించింది. ఓవర్సీస్ మార్కెట్లో కూడా సొమ్ములు చేసుకుంది. అసోం చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ (2 . 5 కోట్లు) తో తీసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఏడు కోట్లు అర్జించింది. ఇక స్థానిక ప్రేక్షకుల్ని ఆకర్షించాలంటే యాక్షన్ బాట పట్టాలని యువదర్శకులు విరివిగా సన్నాహాలు చేస్తున్నారు. అయితే 2013 లోనే ఒక యువ దర్శకుడు కేన్నీ బాసుమతారీ అనే అతను  కేవంలం ఏడు లక్షల బడ్జెట్ తో  ‘లోకల్ కుంగ్ ఫూ’  అనే యాక్షన్ తీసి సంచలనం సృష్టించాడు. ఇది  30  లక్షలు వసూలు చేసింది.

    ఈ సంవత్సరం అప్పుడే తొమ్మిది సినిమాలు ప్రారంభమైపోయాయి. వీటి టైటిల్స్ ని గమనిస్తే ఇక అసోం సినిమాల సరళి తెలిసిపోతుంది. అమెజాన్ అడ్వెంచర్, మార్క్ షీట్, క్యాలెండర్, రక్తబీజ్., హోసా ప్రేమ్… ఇలా బాలీవుడ్ ని సవాలు చేసే వినూత్న ధోరణిలో యూత్ కోసం యూత్ తీసుకుంటున్న సినిమాలుగా మారిపోయింది పరిస్థితి. ఇలా మారాకే నాల్గు డబ్బులొస్తున్నాయి. సినిమాల్లో మాతృభాషని ఈ రకంగానైనా బతికించుకుంటున్నారు. జాలీవుడ్ పేరు నిలుపుకుంటూ జాలీగా గడుపుతున్నారు.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here