Site icon Sanchika

జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-10

[box type=’note’ fontsize=’16’] జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

రాజ్యమా సంతేర్భావి కశ్మీరేషు తవేతి సః।
స్వప్నే వాక్యుదయా తత్ర మహాదేవ్యా భ్యషిచ్యతి॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 139)

[dropcap]ఇ[/dropcap]క్కడి నుంచి జోనరాజు రాజతరంగిణి చదువుతూంటే, విషయాలు తెలుసుకుంటుంటే పట్టరానంత వేదన కలుగుతుంది. నిస్సహాయత వల్ల కలిగే వేదన  అది.

షాహమీరుడు ఓ రోజు వేటకు వెళ్ళాడు. చాలాసేపు వేటాడేడు. వేటాడి అలసిపోయాడు. కళ్ళు మూతలు పడ్డాయి. అడవిలో చెట్టు నీడన నిద్రించాడు. నిద్రలో అతనికి కల వచ్చింది. ఆ కలలో అతనికి దేవత కనిపించింది. అతని వంశం వారు భవిష్యత్తులో కశ్మీరుపై రాజ్యం చేస్తారని తీయటి తేనెలొలికే స్వరంతో చెప్పింది. ఈ కల కథను జోనరాజు కల్పించి రాజతరంగిణిలో పొందుపరిచాడా? లేక, ప్రచారంలో ఉన్న కథను రాజతరంగిణిలో చేర్చాడా? అన్నది చర్చనీయాంశం. కానీ భారతీయ మనస్తత్వంలోనే ఒక వైచిత్రి ఉంది. ప్రతి అంశానికి దైవ అనుమతి, అనుగ్రహాలను వాంఛిస్తారు. ఒక మందిరం కట్టాలంటే, స్వామి కలలో కనబడి నేను ఫలానా చోట భూమిలో ఉన్నానంటాడు. వెళ్లి చూస్తే స్వామి విగ్రహం ఉంటుంది. మందిరం వెలుస్తుంది. ఇలాంటి కథలు భారతీయ సామాజిక జీవనంలో కోకొల్లలు. భగవంతుడు కలలో కనబడి అంకితం కోరతాడు. భవిష్యత్తు చెప్తాడు. రాజ్యం నిర్మించమంటాడు. తన పూజ చేయమంటాడు. ఇలాంటి కథలు, గాథలు కోకొల్లలు. ఒక రకంగా, ఇలాంటి గాథలు ఒక చర్యకు సామాజిక ఆమోదాన్ని కలిగిస్తాయి. సకల జనుల సంశయాలను వెనక్కు నెట్టి కార్యాన్ని సఫలం చేస్తాయి. ఒక ప్రామాణికతను కల్పిస్తాయి. సుల్తాను కూడా కశ్మీరుపై ఇస్లామీయుల పాలనకు ప్రామాణికతను వాంఛించి ఉండవచ్చు. లేదా, ఇస్లామీయుల పాలనను సామాన్య ప్రజలు స్వీకరించేటట్టు మానసికంగా సిద్ధం చేయటం కోసం ఇలాంటి గాథ ప్రచారంలోకి వచ్చి ఉండవచ్చు. ‘దేవతనే కలలో కనబడి చెప్పింది. మనం మానవ మాత్రులమెవరం దైవ నిర్ణయాన్ని వ్యతిరేకించేందుకు? కాదని అనేందుకు’ అన్న భావన సమాజంలో వ్యాపించి, ఇస్లామీయుల పాలన పట్ల ప్రజలలో నిరసన తగ్గించేందుకు ఇలాంటి కథ ప్రచారంలోకి వచ్చి ఉండవచ్చు. అలా ప్రచారంలో ఉన్న గాథనే జోనరాజు స్వీకరించి ఉండవచ్చు. ఏది ఏమైనా భారతీయ సమాజంలో ఇలాంటి స్వప్నాల గాథలకు కొదవ లేదు. కశ్మీరం ఇందుకు భిన్నం కాదు! తనకు వచ్చిన కలను ఆధారం చేసుకుని తన మొత్తం కుటుంబంతో షాహమీరుడు శక సంవత్సరం 1235, అంటే క్రీ.శ. 1313వ సంవత్సరంలో కశ్మీరంలో అడుగుపెట్టాడు. సూహదేవుడు అతడిని ఆదరించాడు. జీవికను చూపించాడు.

జోనరాజు చెప్పింది ఇంతే. కానీ అప్పటి పరిస్థితుల గురించి పరిశోధకులు ఊహించింది, పర్షియన్ రచనలలో ఉన్న దాన్నీ గమనిస్తే, ఎందుకని షాహమీరుడుని సూహదేవుడు ఆదరించాడో ఊహించే వీలు చిక్కుతుంది. .

సూహదేవుడు కశ్మీర రాజ్యాన్ని సుస్థిరం చేసినా, అంత వరకూ ఇతరుల అధికారంలో ఉన్న కశ్మీర ప్రాంతాలను తిరిగి కశ్మీరంలో భాగం చేసినా, అతని సామ్రాజ్యానికి దాడుల భయం పోలేదు. అందుకని విభిన్న ప్రాంతాలలో వీరులుగా పేరు పొందిన వారిని కశ్మీరుకు ఆహ్వానించి, వారికి   సదుపాయాలు కల్పించి, తనకు విధేయులుగా చేసుకోవటం ద్వారా అవసరం పడినప్పుడు ఆ వీరులు తన తరఫున యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉంటారని, తద్వారా కశ్మీరాన్ని సురక్షితం చేయవచ్చని సూహదేవుడు ఆలోచించాడు. అందుకని ఖాసా వీరుడు, తురుష్క మతం స్వీకరించిన ‘షాహమీర్’ను కశ్మీరుకు ఆహ్వానించాడు. సూహదేవుడు అతడిని ‘అందర్‍కోట్’ కోటలో నియమించాడు.

పర్షియన్ చరిత్ర రచయితలు ‘దారావతి’ వద్ద ‘షాహమీర్’కు భూమిని ఇచ్చాడని రాశారు. అయితే ‘బహరిస్తాన్-ఇ-షాహి’, ‘మజ్మూష్-ఇ-తవారఖ్’ వంటి పర్షియన్ రచనలు ‘షాహమీర్’ కశ్మీరులో అడుగుపెట్టిన మూడు నాలుగు వందల ఏళ్ళ తరువాత చేసిన రచనలు. జోనరాజు రాజతరంగిణి ఇతర అన్ని రచనల కన్నా ముందు చేసిన రచన. కాబట్టి మిగతా రచనల కన్నా జోనరాజు రచనను ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుంది. జోనరాజు ‘షాహమీర్’ను  ఉన్నత స్థానంలో నియమించాడనే  అని మాత్రమే రాశాడు. ఎక్కడో రాయలేదు. చరిత్ర రచయితలు షాహమీర్ ను అందర్‌కోట్ వద్ద ఉన్న కోటకు నియమించాడని అభిప్రాయపడుతున్నారు.

‘అందర్‍కోట్’ చారిత్రకంగా ప్రాధాన్యం కల ప్రాంతం. జయాపీడుడి రాజధాని ఈ ప్రాంతం. దగ్గరలో ఊలూరు సరస్సు ఉంది. ఈ ప్రాంతంలో జయాపీడుడు అనేక బౌద్ధ ఆరామాలు నిర్మించాడు. మందిరాలు నిర్మించాడు. ఇప్పుడు ఇవన్నీ శిధిలాలుగా మిగిలి ఉన్నాయి. ఇంకా గోడలు నిలిచి ఉన్న కేశవ మందిరం పై కొన్ని శిల్పాలు కనిపిస్తాయి. ఇక్కడి మందిరాలు, ఆరామాలన్నీ క్రీ.శ. ఎనిమిదో శతాబ్దంలో నిర్మితమైనవి. ప్రస్తుతం ‘అందర్‍కోట్’ చేరాలంటే బారాముల్లా నుంచి గంట ప్రయాణం చేయాల్సి ఉంటుమ్ది. ‘అందర్‍కోట్’ ప్రాచీన నామం ‘జయపురం’ .

జోనరాజ రాజతరంగిణిపై వ్యాఖ్యానించిన వారిలో శ్రీకాంత్ కౌల్‍ను ప్రథమంగా పేర్కొంటారు. ఈయన ప్రకారం సూహదేవుడు తన అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు కశ్మీరు బయట ఉన్న కిరాయి వీరులకు (Mercenaries) జీవిక కల్పిస్తానని వాగ్దానం చేసి కశ్మీరుకు రప్పించాడు. వారికి కశ్మీరులో నివాసాలు ఏర్పాటు చేశాడు. తద్వారా అవసరమైతే తన కోసం పోరాడే కిరాయి వీరులను తయారు చేస్తున్నాడని అభిప్రాయపడ్దాడు. తనను వ్యతిరేకించే డామరులు (థార్‌లు), లావణ్యుల (లోన్‍లు)ను ఎదుర్కునేందుకు  ఈ కిరాయి వీరులను ఉపయోగించాడని రాశారాయన.

దిగంతరా దుసాగత్య బహవో వ్యక్తి లిప్యయా।
తమాశ్రయన్మహీపాలం పుష్పద్రుమమివాలయః॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 131)

‘దిగంతాల నుంచి పలువురు, తుమ్మెదలు పూవుపై వాలినట్టు కశ్మీరు వచ్చి రాజును ఆశ్రయించారు. రాజు  వారికి తన ఆస్థానంలో ఉద్యోగాలనిచ్చాడు’ అన్న ఈ శ్లోకాన్ని ఆధారంగా తీసుకుని, శ్రీకాంత్ కౌల్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.

“It appears from Jonarāja’s poetical language that Sühadeva was munificent in providing means of subsistence to outsiders, who had entered the valley in search of employment. In fact the outsiders were mercenary recruits, refugees, and travellers patronized equally by the King and his rivals, the Dämaras, in order to increase the number of their own retainers.” [Jonaraja Rajatarangini by Srikanth Kaul, Page No.84]

ఈ అర్థం జోనరాజు శ్లోకంలో లేదు. జోనరాజు శ్లోకాన్ని ప్రాతిపదికగా తీసుకుని, ఆ కాలంలో కశ్మీరులో నెలకొని ఉన్న పరిస్థితులను ఆధారం చేసుకుని, ఆ కాలం నాటి ఇతర రచయితల రచనలను పరిశీలించి ఈ నిర్ణయానికి వచ్చాడు శ్రీకాంత్ కౌల్. సూహదేవుడు కశ్మీరాన్ని ఒక్కటి చేశాడు కానీ శత్రువులను సంపూర్ణంగా నాశనం చేయలేదు. తాత్కాలికంగా వారిపై విజయం సాధించాడంతే. పైగా, స్వతహాగా, సూహదేవుడు జడుడు. భయస్తుడు. కాబట్టి, పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎదుర్కునేందుకు సంసిద్ధం అవుతాడు. సూహదేవుడిని దెబ్బ తీసేందుకు డామరులు, లావణ్యులు, తురుష్కులు వంటి వారు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాబట్టి, పోటీ పడి సూహదేవుడితో సహా అతని శత్రువులు కూడా తమ సైనిక శక్తిని, తమ వైపు పోరాడే కిరాయి వీరులను కశ్మీరుకు ఆహ్వానిస్తూనే ఉన్నారు. అలా కశ్మీరుకు వచ్చిన కిరాయి వీరుడు షాహమీర్,  తరువాతి తరంవారు  భవిష్యత్తులో  కశ్మీరు సుల్తాన్ అయ్యారు. ఇది కశ్మీర చరిత్రనే కాదు, భారతదేశ చరిత్ర కూడా. పొట్ట చేత పట్టుకుని, ప్రాణాలు అరచేత పట్టుకుని దేశం వచ్చి ఆశ్రయం కోరిన వారు, లేదా వారి వంశం వారు దేశానికి పాలకులయ్యారు. బానిసలు, దేశాధికారులు అయ్యారు. వ్యాపారం కోసం వచ్చినవారు దేశాన్ని పాలించారు. కిరాయి హంతకులు దేశ పాలకులు అయ్యారు. దేశవ్యాప్తంగా జరిగిందిది. కశ్మీరంలోనూ ఇదే జరిగింది.

‘అతిథి దేవోభవ’ అన్న నమ్మకం, అందరినీ హృదయ పూర్వకంగా ఆదరించే లక్షణం భారతజాతికి ఇచ్చింది. ప్రతి ఒక్కరిలోనూ దైవాన్ని దర్శించి తనతో సమానంగా భావించే లక్షణాన్నిచ్చింది. దాంతో ప్రతి ఒక్కరినీ ఆహ్వానించి, ఆదరించారు భారతీయులు. అతిథులు అందరూ దేవుళ్ళయినా, ఆ దేవుళ్ళలో ‘తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే’ దేవుళ్ళుంటారని గ్రహించలేకపోయారు. అతిథి హోదాను అనుభవిస్తూ, అవకాశం లభించగానే అధికారాన్ని అందుకున్నారు  అతిథి దేవుళ్లు. కశ్మీరులో ఇకపై సంభవించే పరిణామాలు ఈ నిజాన్ని నిరూపిస్తాయి. ఇలా దేశానికి వచ్చిన వారు అధికారాన్ని అందుకోవటం భారతీయుల అమాయకత్వాన్ని, మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తుంది.  ప్రతివారినీ నమ్మే అమాయకత్వంతో పాటు, నమ్మినవారు వెన్నుపోటు పొడుస్తారనే గ్రహింపు లేని మూర్ఖత్వం కూడా భారతీయ చరిత్ర పలుమార్లు నిరూపిస్తుంది. దానికి తోడు సరైన సమయానికి దూరదృష్టి లేని రాజులు, ధైర్యం లేని పాలకులు ఉండటం కూడా భారతదేశ చరిత్రలో కనిపిస్తుంది. అంటే, విధి ఈ దేశం విదేశీయుల పాలపడాలని నిర్ణయించి, అందుకు తగ్గ పరిస్థితులు కల్పించినట్టనిపిస్తుందన్న మాట.

సూహదేవుడు తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నాలన్నీ చేస్తున్న సమయంలోనే అతడి రాజ్యాని అస్థిరం చేసి, అల్లకల్లోలం చేసి, రాజ్యంలో పొంచి ఉన్న కిరాయి వీరులు సింహాసనం అందుకునే పరిస్థితులు కల్పించే వీలునిచ్చే సంఘటనలు మరో వైపు రూపుదిద్దుకుంటున్నాయి.

దులచాఖ్యః కర్మసేన చక్రవర్తి చమతా పతిః।
కశ్మీరాన్య తదైవా గాత్సిహో మృగగుహమివ॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 142)

‘కర్మసేన’ అనే రాజు సేనాపతి ‘దులాచ’ కశ్మీరుపై దాడికి వచ్చాడు. లేళ్లు నివసించే గుహ లోకి సింహం దూరినట్టు కశ్మీరంలో అడుగుపెట్టాడు దులాచ.

కశ్మీరుపై దులాచ దాడి వల్ల కలిగిన అల్లకల్లోలం, సర్వనాశనం, పరదేశం నుంచి కశ్మీరానికి వచ్చిన కిరాయి వీరులు రాజ్యాన్ని ఆక్రమంచి కశ్మీరును సంపూర్ణంగా రూపాంతరం చెందించే ఇస్లామీయుల పాలనకు దారి సుగమం చేసింది. ఎందుకంటే, దులాచ దాడికి రాగానే సూహదేవుడు ప్రాణాలు అరచేత పట్టుకుని కశ్మీరాన్ని వదిలి పారిపోయాడు. ఈ సందర్భంగా చేసిన వర్ణనల్లో  జోనరాజు కార్చిన కన్నీళ్లు, వేదనలు  కనిపిస్తాయి.

(ఇంకా ఉంది)

Exit mobile version