[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
రక్షంస్తట స్థానుద్వేగర హితో జల వర్జితః।
అల్లేశ్వరాంబుపూరః స ప్రజాశ్చిత్ర మతారయత్॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 247)
[dropcap]ఉ[/dropcap]దయన దేవుడు కశ్మీర రాజయ్యాడు. కోటరాణిని రాణిగా చేసుకున్నాడు. కానీ ఉదయన దేవుడిని ఓ వైపు నుంచి షాహమీర్ భయం, మరోవైపు నుంచి లావణ్యుల శక్తి భయపెడుతూనే ఉంది. షాహమీర్‌ను శాంతింపజేసేందుకు అతని సంతానానికి క్రామరాజ్యంలో ఉన్నత పదవులనిచ్చాడు. ఇది లావణ్యులకు ఆగ్రహం కలిగించింది. వారు రాజును చీకాకు పరచసాగారు. ఇదంతా గమనించిన కోటరాణి రాజ్యాన్ని సుస్థిరం చేయాలని ప్రయత్నించింది. ఓ వైపు షాహమీర్‍ను అదుపులో పెడుతూ మరో వైపు లావణ్యులను సంతృప్తి పరుస్తూ రాజ్యానికి సుస్థిరతను సాధించాలని ప్రయత్నించింది. ఇంతలో మంగోలు దుల్చా లాగే, ‘అచలుడు’ కశ్మీరంపై దాడి చేశాడు.
ముస్లిం చరిత్ర రచయితలు అచలుడు ‘తుర్కిస్తాన్’ వాడు, మంగోలు అన్న అభిప్రాయాలు వ్యక్తపరిచారు. కానీ కశ్మీరీ చరిత్ర రచయితలు అచలుడు, కోటరాణి సోధరుడు ‘రావణ్ చంద్’ కొడుకని చెప్తారు. అయితే, అచలుడి సైన్యంలో అధికులు ‘మగ్ధపురా’నికి చెందిన ‘తుర్కులు’ అని రాశారు. బహరిస్తాన్-ఇ-షాహి, తారీక్- ఇ-నారాయణ్ కౌల్ ల ప్రకారం అచలుడి సైన్యం అంతా ఇస్లామీయులు. కశ్మీరు దక్షిణ మార్గం ‘హుర్టూర్’ నుంచి కశ్మీరుపై అచలుడు దాడి చేశాడు.
అయితే మరో అభిప్రాయం ప్రకారం పర్షియన్ లో స, మ – పదాల నడుమ అభేదం కాబట్టి ‘ముగ్ధపుర’ అన్నది ‘సుగ్ధపుర’ అనీ, ఇది ‘సమర్‍ఖండ్’ మరో పేరు అనీ, అచలుడు ‘తుర్కు’ అని అంటారు. కానీ ‘అచలుడు’ అన్న పేరే అతను ముస్లిం కాదన్న ఆలోచనకు బలం ఇస్తుంది. ఏది ఏమైనా అచలుడు పెద్ద సైన్యం, అదీ ముస్లింలు అధికంగా ఉన్న సైన్యంతో కశ్మీరుపై దాడి చేశాడు.
అథ ముగ్ధపుర స్వామి దత్తనీ కివ్య హంకృతః।
కశ్మీరానచలోవిక్షద్దలాద్ దుల్చా ఇవాపరః॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 232)
రాజతరంగిణిలో ‘ముగ్ధపుర’ అని స్పష్టంగా ఉండడంతో, ముగ్ధపురమే సమర్‍ఖండ్ అనీ, అచలుడు ముస్లిం అన్న వాదన వీగిపోతుంది. ‘దుల్చా ఇవాపరః’ అనటంతో పలువురు అచలుడు మంగోలు అని భావించారు. కానీ ‘మరో దుల్చా లాగా’ పెద్ద సైన్యంతో అచలుడు కశ్మీరుపై విరుచుకు పడ్డాడని అంటున్నాడు జోనరాజు. దుల్చా దాడి చేసినప్పుడు ఉదయన దేవుడి సోదరుడు సూహదేవుడు రాజు. అచలుడు దాడి చేసినప్పుడు ఉదయన దేవుడు రాజు. సూహదేవుడి లాగే ఉదయన దేవుడు కూడా భీరువు. అప్పుడు కూడా రాజ్యం అస్థిరంగానే ఉండేది. ఇప్పుడూ రాజ్యం అస్థిరంగా ఉంది. అందుకని ‘దుల్చా’లా అచలుడు దాడి చేశాడన్నాడే తప్ప, ‘దుల్చా’లా ‘అచలుడు’ మంగోలు అన్న ఉద్దేశంతో కాదు.
అచలుడి సైన్యం కశ్మీరు నలువైపులా అరాచకం సృష్టించటం ప్రారంభించింది. మళ్ళీ కశ్మీరం అల్లకల్లోలం అయింది. ఈ సందర్భంలో ‘అచలుడు’ అన్న పదం ఆధారంగా చమత్కారభరితమైన శ్లోకం రాశాడు జోనరాజు. అచలుడు అంటే పర్వతం. పురాణాల ప్రకారం పర్వతాలకు ఒకప్పుడు రెక్కలుండేవి. దాంతో అవి ఇష్టం వచ్చినట్టు ఎగురుతూ, ఎక్కడబడితే అక్కడ దిగుతూ జనజీవితాన్ని అల్లకల్లోలం చేసేవి. ప్రజలను రక్షించటం కోసం ఇంద్రుడు పర్వతాల రెక్కలను కత్తిరించాడు. ప్రజలను వాటి బెడద నుండి కాపాడేడు. కానీ ఉదయన దేవుడు అచలుడితో, ఇంద్రుడు అచలాలతో ప్రవర్తించినట్లు నిర్ణయాత్మకంగా వ్యవహరించి అదుపులో పెట్టలేదు అంటాడు.
అచలుడి సైన్యం ‘భీమానక్’ ప్రాంతం చేరేసరికి, యుద్ధంలో ఓడిపోయిన ఉదయన దేవుడు ప్రాణాలు అరచేత పట్టుకుని భౌట్టదేశం పారిపోయాడు. అదేమి దురదృష్టమో కానీ, కశ్మీరులో భారతీయ రాజుల పాలన అంతమయ్యే సమయానికి రాజ్యానికి వచ్చిన ఇద్దరు రాజులు, సూహదేవుడు, ఉదయన దేవుడు, యుద్ధాలు రాగానే, దేశం వదిలి పారిపోయారు. దేశంలో పొంచి ఉన్న అవాంఛనీయ దుష్టశక్తుల బారిన ప్రజలను వదిలేసి వారి ప్రాణాలు వారు కాపాడుకున్నారు. సూహదేవుడు కశ్మీరు వదిలి పారిపోయిన తరువాత రింఛనుడు సింహాసనాన్ని హస్తగతం చేసుకున్నాడు. అయితే, ఉదయన దేవుడు పారిపోయిన తరువాత దుష్టశక్తులు సింహాసనాన్ని కాజేయకుండా ‘కోటరాణి’ అడ్డుగా నిలిచింది. ఈ సందర్భంగా కోటరాణి వ్యక్తిత్వం గురించి కాస్త చర్చించుకోవాల్సి ఉంటుంది.
రింఛనుడు రామచంద్రుడిని చంపి అతని కూతురు కోటరాణిని వివాహం చేసుకున్నది ప్రజల ఆగ్రహం నుంచి తప్పించుకునేందుకు. తాను బౌద్ధుడయినా కశ్మీరు అమ్మాయిని పెళ్ళి చేసుకోవటం ద్వారా కశ్మీరీ ప్రజల ఆమోదం పొందాలని ప్రయత్నించటంలో భాగం ఈ వివాహం. తన తండ్రిని చంపిన రింఛనుడిని వివాహం చేసుకున్న కోటరాణి అతడిని తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నించింది. ఆ సమయంలో ఆమెకు రింఛనుడిని స్వీకరించటమో, ప్రాణత్యాగం చేయటమో తప్ప మరో మార్గం లేదు. ప్రాణత్యాగం వల్ల లాభం లేదు. రింఛనుడిని ఆమోదించటం వల్ల కశ్మీరు పాలనలో ఆమెకు భాగస్వామ్యం వస్తుంది. ప్రజల బాగోగులు చూసే వీలు చిక్కుతుంది. ‘కోటరాణి’ ప్రతి చర్య కశ్మీరు సంక్షేమం, ప్రజల బాగోగులు చూడడం అన్న అంశాల ప్రాధాన్యంగా సాగుతుంది. రింఛనుడిని భారతీయ ధర్మం వైపు మళ్ళించాలని ప్రయత్నించింది. ఆ ప్రయత్నం సఫలం కాలేదు. తాను మాత్రం మతం మారలేదు. భర్త ఏ మతం స్వీకరిస్తే, భార్యది అదే మతం అవుతుందన్న ఆలోచనను తిరస్కరించింది. రాజ్యం కాజేయటనికి షాహమీర్ సిద్ధంగా ఉన్నాడని గ్రహించి ఉదయన దేవుడిని కశ్మీరుకు ఆహ్వానించింది. అతడి భార్యగా ఉండేందుకు సిద్ధపడింది.
ఉదయన దేవుడు భక్తుడు. ధార్మికుడు. రాజ్యపాలన వ్యవహారాలు తెలియవు. అతడిని రాజుగా సింహాసనంపై కూర్చుండబెట్టి పరోక్షంగా తాను రాజ్యం చేయటం ఆరంభించింది. ప్రజల బాగోగులు చూడడం ఆరంభించింది. కానీ షాహమీర్ ద్వారా పొంచి ఉన్న ప్రమాదాన్ని గ్రహించింది. షాహమీర్ శక్తిని, కుయుక్తులను గ్రహించింది. అతడిని అదుపులో ఉంచుతూ, అతడికి ప్రత్యామ్నాయ శక్తిని తయారు చేయటం ఆరంభించింది. ఈలోగా అచలుడి రూపంలో కశ్మీరుపై ఉపద్రవం వచ్చి పడింది. ఉదయన దేవుడు రాజ్యం వదిలి పారిపోయాడు. కోటరాణి రంగంలోకి దిగింది. సైన్యంతో అచలుడిని ఎదుర్కుంది. పోరాడింది. కానీ, అచలుడి సైన్యం ముందు తన సైన్యం శక్తి నిలవదని గ్రహించింది. వెంటనే పథకం మార్చింది.
ఉదయనుడు పారిపోయాడు కాబట్టి, రాజసింహాసనం అధిష్ఠించేందుకు అసలైన వారసుడు అచలుడేనని, సింహాసనం స్వీకరించమని వర్తమానం పంపింది. ‘సింహాసనం నీదే అయినప్పుడు, నీకిక సైన్యం ఎందుకు. నీ వెంట ఉన్న సైన్యాన్ని వెనక్కి పంపేయ’మని వర్తమానం పంపింది. అచలుడు కోటరాణిని నమ్మాడు. తన వెంట ఉన్న తురకల సైన్యాన్ని వెనక్కు పంపేశాడు.
కాబోయే రాజు కశ్మీర రాజధానికి వస్తున్నాడన్న నెపంతో దారంతా సంబరాలు, ఉత్సవాలు ఏర్పాటు చేసింది. అచలుడు ఆ ఉత్సవాలలో మునిగి తేలుతున్న సమయంలో, కశ్మీరు సింహాసనంపై, తనపై అసంతృప్తితో ఉన్న రింఛనుడి బంధువులను తాత్కాలికంగా నిలిపింది ప్రజల రక్షణ కోసం. తను అచలుడిని దారిలో సంబరాలు, ఉత్సవాల నడుమ కలిసింది. అవకాశం చూసి అతడిని మట్టు పెట్టింది. అచలుడి మరణానికి అతని సమర్థకులంతా – భర్తను కోల్పోయిన తరువాత కలిగే సంతానాన్ని చూసి విలపించే భార్యలా – దుఃఖించారంటాడు జోనరాజు. ఇక్కడే ‘కోటరాణి’ గొప్పతనం తెలిసేది. రాజు రాజ్యం వదిలిపోయినా బెదరలేదు. తన పట్ల అంసంతృప్తితో ఉన్న వారికి రాజ్యం అప్పగించి వారి విశ్వాసం చూరకొంది. రాజ్యంలో అప్పటికే షాహమీర్ వల్ల ముస్లిం ఆధిక్యం నెలకొంది సంఖ్యాపరంగా. ఈ ప్రమాదాన్ని గ్రహించిన కోటరాణి, అచలుడి వెంట సైన్యంలో ఉన్న ఇస్లామీయులందరినీ అచలుడిని నమ్మించి, వెనక్కు పంపేసింది. అచలుడి అడ్దు తొలగించుకుంది. తాత్కాలికంగా కశ్మీరు అధికారం అప్పగించిన రింఛనుడి వారసులను గౌరవించి పంపేసింది. మళ్ళీ కశ్మీరు సింహాసనం అధిష్ఠించింది.
కష్టాలు వస్తే బెదిరిపోయి, సుఖాలు వస్తే కన్నూ మిన్నూ కానక ప్రవర్తించే వారికీ కోటరాణికీ ఎంతో తేడా ఉంది. ఎన్ని కష్టాలు, ఎటువంటివి వచ్చినా ఆమె బెదరలేదు. మోసంతో తన తండ్రిని చంపిన రింఛనుడినీ దూరదృష్టితో స్వీకరించింది. స్వంత కొడుకును పక్కనపెట్టి ఉదయన దేవుడి సంతానాన్ని వారసుడిగా స్వీకరించింది. శత్రువు దాడి చేయగానే ఉదయన దేవుడు రాజ్యం వదిలి పారిపోయినా బెదరలేదు. శక్తిమంతుడైన శత్రువును తిన్నగా ఎదుర్కునేంత శక్తి లేదని గ్రహించి మాయోపాయంతో అతడి అడ్డు తొలగించుకుంది. శత్రువుల బెడద తొలగగానే రాజ్యానికి తిరిగి వచ్చిన రాజును తలవంచి గౌరవంగా స్వీకరించింది. చీకటిని తొలగించే చంద్రుడిని తలవంచి శిరస్సుపై ధరించే తూర్పు కొండల్లా, రాజ్యానికి తిరిగి వచ్చిన రాజును గౌరవంగా ఆహ్వానించింది కోటరాణి అంటాడు జోనరాజు.
ఉదయాద్రిభువా పూర్ణః శశీవాథ స కోటయా।
భేరింఛనా తమోనాశీ శిరసాధారి సాదరమ్॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 241)
భౌట్టరాజ్యం వదిలి కశ్మీరంలో అడుగుపెట్టిన ఉదయన దేవుడు ముందుగా తుషార లింగానికి అభిషేకం చేశాడు. రాణి తాత్కాలికంగా అధికారం అందించిన ఖేరింఛనుడిని పంపేశాడు. మళ్ళీ కోటరాణి రాజ్యం ఆరంభమయింది కశ్మీరంలో. ఉదయన దేవుడు నామమాత్రపు రాజు.
ఇకపై కశ్మీర్ రాజకీయాలు – ప్రాబల్యం పెంచుకుని శక్తిమంతుడవుతున్న షాహమీరు ఎత్తులకు, రాజ్యం ఇస్లామీయులకు దక్కనివ్వకుండా కాపాడాలని కోటరాణి వేసే పై ఎత్తుల చుట్టూ తిరుగుతాయి. కశ్మీరంపై రాజ్యం చేసిన చివరి భారతీయ రాణి కోటరాణి. రాజులు అసమర్థులై రాజ్యాన్ని పరాయి వారికి అప్పగిస్తుంటే, రాణి ఆ రాజ్యంలో భారతీయ రాజుల పాలనను కొనసాగించాలని తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుండటం భారతదేశ చరిత్రలో ఒక విషాదకరమైన వైచిత్రి. ఓ వంక భారతీయ మహిళల ఔన్నత్యానికి, సాహసానికి, ధర్మభక్తి, దేశభక్తులకు మనస్సు ఉప్పొంగుతున్నా, మరో వైపు పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించని రాజుల దైన్యానికి బాధ కలుగుతుంది. ప్రపంచంలో మహిళా నాయకులు ఎందరో ఉండవచ్చు కానీ కోటరాణిలా ధర్మదీక్ష, దేశభక్తి కల మహిళా నాయకులు మాత్రం ఎవ్వరూ లేరని నిశ్చయంగా చెప్పవచ్చు. ఇతరులు తమ సింహాసనాన్ని, అధికారాన్ని రక్షించుకునేందుకు పోరాడారు. కానీ కోటరాణి, కశ్మీరంపై భారతీయ అధికారాన్ని కొనసాగించటం కోసం ప్రాణాలు పణంగా పెట్టి ప్రయత్నించింది. అవసరమైతే, ఇస్లామీయుడి ద్వారా జన్మించిన వారసుడిని పక్కన పెట్టి మరీ భారతీయుడి ద్వారా జన్మించిన వారసుడి హక్కు కోసం పోరాడిన అరుదైన వీరనారి కోటరాణి.
కోటరాణి రాజ్యాన్ని సుస్థిరం చేస్తూ, ప్రజలకు శాంతినివ్వాలని ప్రయత్నం చేస్తున్న సమయంలో షాహమీర్ రాజ్యం కోసం ‘మానసిక యుద్ధం’ ఆరంభించాడు. ఉదయన దేవుడు బలహీనమైన వ్యక్తిత్వం కలవడన్నది స్పష్టంగా తెలుస్తోంది. రాణికికి ఉదయన దేవుడికి సంతానం కలిగింది. అతడికి రాజ్యం అప్పచెప్పాలన్నది ఉదయన దేవుడి కోరిక. కోటరాణి కోరిక కూడా అదే. అయితే రింఛనుడు సుల్తాన్ సద్రుద్దీన్‍గా మారి, తన సంతానం ‘హైదర్’ బాధ్యతను షాహమీర్‍కు అప్పగించాడు. షాహమీర్ హైదర్‍ను ముద్దు చేసినప్పుడల్లా ఉదయన దేవుడి గుండెలు భయంతో గుబగుబలాడేవి. ఎందుకంటే, ‘నువ్వు అధిష్ఠించిన సింహాసనానికి అసలు వారసుడు హైదర్’ అని షాహమీర్ హెచ్చరిస్తున్న భావన కలిగేది ఉదయన దేవుడికి. కానీ రాణికి తన సంతానం పట్ల అపారమైన ప్రేమ.
దేవ్యాస్తు సమదృష్టి త్పాత్పుత్ర యోరు భయోరపి।
రాజ్బోద్య వ్వోపి షహ్మేరో న భయేన స పస్సుశో॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 244)
రాణి తన సంతానాన్ని సమదృష్టితో చూడటంతో రాజు ఎవరికీ హాని తలపెట్టలేకపోయాడు. షాహమీరు పట్ల ద్వేషభావం, వైరం ఉన్నప్పటికీ రాణి భయం వల్ల ఉదయన దేవుడు షాహమీరుని ఏమీ అనలేకపోయాడు. కేవలం కోటరాణి భయం వల్లనే కాదు, అచలుడు కశ్మీరంపై దాడి చేసినప్పుడు ప్రజలనేకులకు షాహమీర్ అభయం ఇచ్చాడు. అతడి రక్షణలో ప్రజలు భద్రత పొందారు. ఈ సందర్భంగా జోనరాజు ఒక అద్భుతమైన, వ్యంగ్యాత్మకమైన, నర్మగర్భితమైన శ్లోకం రాశాడు.
అచలుడు దాడి చేసిన భయంకరమైన సమయంలో, ప్రజలు భయంతో, షాహమీర్ దగ్గర రక్షణ పొందారు. షాహమీర్ రాజును గడ్డిపోచ కన్నా హీనంగా చూసేవాడు. రాజు కళ్ళ ముందు హైదర్‍ని నిలిపి, రాజును భయపెట్టేవాడు. గ్రద్దను చూపి పిట్టను వణికించినట్లు, హైదర్‍ని చూపి ఉదయన దేవుడిని బెదిరించేవాడు షాహమీర్. అంటే, ఏ రకంగా షాహమీర్ రాజును బలహీనం చేస్తున్నాడో తెలుస్తుంది. హైదర్‍ను అడ్డు పెట్టుకుని రాజు, రాణిల నడుమ భేదాభిప్రాయలను సృష్టించాలని ప్రయత్నించటం తెలుస్తుంది. ఇలా రాస్తూ హఠాత్తుగా ఒక గమ్మత్తయిన శ్లోకం రాశాడు జోనరాజు. అల్లాను నమ్మే షాహమీర్ ప్రజల రక్షకుడవటం అత్యంత ఆశ్చర్యకరం. ఎండిన నది ఒడ్డు ప్రజలకు ఆశ్రయం అయినట్టు, అల్లాను నమ్మే షాహమీర్ భయభ్రాంతులైన ప్రజలకు రక్షణనిచ్చాడు.
(ఇంకా ఉంది)