Site icon Sanchika

జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-24

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

షహ్మేరో మత్సుత ద్వారా సామ్రాజ్యం స్వీకరోతు మా।
ఇతి జ్యాయాంస మాత్స్రుజ్య బాలత్వాంచ పరం సుతమ్॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 265)

ఉదయన దేవుడు మరణించిన విషయం బయటకు పొక్కకుండా నాలుగు రోజులు ఆపింది కోటరాణి. ఈ నాలుగు రోజులలో పరిస్థితులను అదుపులోకి తెచ్చుకుంది. ఆమెకు రింఛనుడి వలన కలిగిన సంతానం హైదర్, షాహమీర్ సంరక్షణలో ఉన్నాడు. ఎక్కడ హైదర్‍ను పావులా చేసుకుని షాహమీర్ రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకుంటాడోనని కోటరాణి తన స్వంత తనయుడిని త్యజించింది. ఉదయన దేవుడి వల్ల కలిగిన పిల్లవాడు ఇంకా బాలుడే. కాబట్టి అతడిని సింహాసనంపై కూర్చుండబెట్టి లాభం లేదు. అది పిల్లవాడి ప్రాణాలకు ప్రమాదకారి అవుతుంది. ఉదయన దేవుడి మరణం తరువాత కోటరాణి పరిస్థితి భయానకమైనది.

షాహమీర్ పద్ధతి ప్రకారం శక్తిమంతుడై సింహాసనం హస్తగతం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. పైగా రింఛనుడి వారసుడు ‘హైదర్’ అతని సంరక్షణలో ఉన్నాడు. కాబట్టి ఉదయన దేవుడి మరణం తరువాత సింహాసనానికి అసలు వారసుడు ‘హైదర్’ అని షాహమీర్, సింహాసనంపై హైదర్‍ని కూర్చోబెట్టి, అధికారం చలాయించవచ్చు. కాదనే వీలు కోటరాణికి ఉండదు. అదే జరిగితే, కోటరాణి ఉదయన దేవుడిని వివాహమాడి, సింహాసనం సుల్తానుల పరం కాకుండా కాపాడేందుకు చేసిన త్యాగం వ్యర్థమవుతుంది. ఉదయన దేవుడి వల్ల కలిగిన సంతానాన్ని సింహాసనంపై కూర్చుండబెట్టి, అతను ఎదిగే వరకు కోటరాణి రాజ్యం చేయవచ్చు. కాని, బాలుడని హైదర్‍ని పక్కనబెట్టి, ఉదయన దేవుడిని ఆహ్వానించి రాజ్యం అప్పజెప్పింది గతంలో. అప్పుడు బాలుడు రాజు కావటం అభ్యంతరకరం. ఇప్పుడు ఎందుకు కాదు? అని షాహమీర్ ప్రజలను రెచ్చగొట్టే వీలుంది. పైగా, షాహమీర్ ఇప్పుడు శక్తిమంతుడు. వివాహాల ద్వారా, పలు ఇతర సంబంధాల ద్వారా కశ్మీరు లోని శక్తిమంతులందరినీ తన వైపు తిప్పుకుని అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు సింహాసనం కబళించేందుకు. కాబట్టి, కోటరాణి ఇప్పుడు ఏం చేసినా ఎంతో జాగ్రత్తగా, ఎవరూ ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తకుండా చేయాలి. ప్రజల అభిమానం చూరగొనాలి. వారి మద్దతు పొందాలి. అందుకని కోటరాణి, ఉదయన దేవుడి మరణ వార్త బయటకు పొక్కకుండా దాచి, శక్తిమంతులయిన లావణ్యులతో మంతనాలు ఆరంభించింది. వారి మద్దతు కూడదీసుకుంది. తనను రాణిగా ప్రకటించుకుంది. కశ్మీర సింహాసనం అధిష్ఠించింది. కశ్మీరును పాలించిన చివరి మహిళ కోటరాణి. అలాగే, కశ్మీరుపై అధికారం నెరపిన చివరి భారతీయ రాజు కోటరాణి.

కోటరాణి తనను తాను రాణిగా ప్రకటించుకుని పగ్గాలు చేపట్టటం వెనుక తన సంతానం భవిష్యత్తుపై ఆలోచన కూడా ఉంది. ‘హైదర్’ పెద్దవాడయ్యాడు. ఇప్పుడు అతడు బాలుడని పక్కన పెట్టే వీలు లేదు. పైగా ‘హైదర్’పై షాహమీర్ ప్రభావం అధికంగా ఉంది. కాబట్టి, సింహాసనంపై ‘హైదర్’ తన హక్కును ప్రకటించే కన్నా ముందే కోటరాణి సింహాసనం తనదిగా చేసుకోవాల్సి ఉంటుంది. ‘హైదర్’ సింహాసనానికి వస్తే, ఉదయన దేవుడి వల్ల కలిగిన సంతానం ప్రాణం ప్రమాదంలో పడుతుంది. ఎందుకంటే, రాజ్యానికి మరో వారసుడు సిద్ధంగా ఉండడం ఏ రాజూ, ముఖ్యంగా, ‘సుల్తాన్’ సహించడు. దానికి తోడు శక్తిమంతుడయిన షాహమీర్‍కు సింహాసనంపై కన్నుందని కోటరాణి గ్రహించింది. షాహమీర్ సింహాసనాన్ని అధిష్ఠించాలంటే, అతడు ముందుగా చేయవలసిన పని, రాజ్యానికి వారసులుగా ఉన్నవారి అడ్డు తొలగించుకోవటం. ఈ రకంగా కోటరాణి ఇద్దరు కొడుకుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. అయితే, కోటరాణి ‘వృద్ధత్వ దోషేణ’ అన్నాడు జోనరాజు. వృద్ధత్వం వల్ల కూడా విసిగి, లావణ్యుల సహాయంతో తనని రాణిగా ప్రకటించుకుంది. నిజానికి కోటరాణి రాణిగా అయినప్పుడు అంత వృద్ధురాలు కాదన్న ఆలోచన తరువాత జరిగిన సంఘటనలు నిరూపిస్తాయి.

కోటరాణి కశ్మీర సింహాసనం అధిష్ఠించటాన్ని ఎవ్వరూ వ్యతిరేకించే వీలు లేదు. ఎందుకంటే, ఉదయన దేవుడి భార్యగా, సింహాసనం అధిష్ఠించే హక్కు ఆమెకు ఉంది. ఆమె రాణిగా ఉన్న సమయంలో అందరికీ సహాయం చేసింది. ప్రజల బాగోగులు చూసుకుంది. దాంతో ఆమెకు ప్రజల మద్దతు కూడా ఉంది. కాబట్టి, ఆమె రాణిగా అవటాన్ని ఎవరూ అభ్యంతరపెట్టలేకపోయారు. ఆమె రాణి కావటం వల్ల కశ్మీరుపై భారతీయ రాజుల అధికారం కొనసాగుతుంది. ఆమె దీర్ఘకాలం రాజ్యం చేస్తే, ఉదయన దేవుడి వల్ల కలిగిన సంతానానికి రాజ్యం దక్కుతుంది. తద్వారా కశ్మీరు పరాయి పాలనలోకి వెళ్ళకుండా భారతీయ రాజుల పాలనలోకే వెళ్తుంది. చరిత్ర రచయితలు కోటరాణి వ్యక్తిత్వాన్ని తక్కువ చేయాలని చూశారు. కోటరాణికి సామ్రాజ్య కాంక్ష ఉందని, అధికార దాహం అధికం అనీ, స్వార్థపరురాలనీ, దూరదృష్టి లేనిదనీ వ్యాఖ్యానించారు.

“Evidently, Kota Rani appears to have been grossly selfish, ambitious and very foolish too. Her interests were immediate and not remote”. [History of Muslim Rule in India, Page 86]. కశ్మీరు ప్రజలను బానిసలుగా అమ్మి, ఐశ్వర్యవంతుడై, సింహాసనంపై కన్నేసిన వారిని గొప్పవారని పొగిడిన చరిత్ర రచయితలు, కశ్మీరు విదేశీయుల పాలనలోకి వెళ్ళకూడదని సర్వం త్యాగం చేసిన కోటరాణిని  ‘grossly selfish, ambitious and very foolish’  అని తీర్మానించారు. రింఛనుడు సుల్తాన్ సద్రుద్దీన్‍గా మారటంతో అతని పాపాలన్నీ ప్రక్షాళన అయ్యాయి. షాహమీర్ కశ్మీరులో ఇస్లాం రాజ్యం స్థాపించటం వల్ల పవిత్రుడయ్యాడు. కశ్మీరులో భారతీయుల పాలనను సజీవంగా నిలపాలని ప్రయత్నించిన కోటరాణి ,  ‘grossly selfish, ambitious and very foolish’.  ఇదీ భారతదేశ చరిత్ర రచించిన విధానం!

సింహాసనం స్వీకరించే ముందే కోటరాణి తన మకాంను ఇంద్రకోటకు మార్చింది. ఇంద్రకోటను జయాపీడపురం అనేవారు. ఇస్లామీయుల పాలనలో ఇది ‘జయపుర్’‍గా  మారింది. ఇప్పుడు దీని పేరు ‘సఫాపోర్’. ఇక్కడ మానసబల్ సరస్సు ఉంది. తాను సింహాసనం స్వీకరించటం షాహమీర్‍కు సవాల్ వంటిదని రాణికి తెలుసు. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుని సింహాసనం స్వీకరించింది. కోటరాణి అధికారం స్వీకరించి   పాలించటాన్ని వర్ణించేందుకు జోనరాజు గమ్మత్తయిన ఉపమానాన్ని వాడేడు. ‘అస్తాన్త్వయత్ స్వయం భూమిం విధవాం స్వాం సఖీమివ’ (జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 267) అన్నాడు. భూమి కూడా తనతో పాటుగా భర్తను కోల్పోయిన స్త్రీ అయినట్టుగా, స్నేహితురాలయినట్టుగా, సాంత్వననిచ్చిందట కోటరాణి. భూమిని ‘co-widow’ గా ‘విధవాం స్వాం సఖీమివ’ అనటంలో చమత్కారం ఉంది. భవిష్యత్తు గురిచిన సూచన ఉంది.

రాణి భర్తను కోల్పోయింది. సంప్రదాయం ప్రకారం రాజును ‘భూవిభుడు’ అంటారు. రాజు మరణించాడు. అందువల్ల భూమి కూడా భర్తను కోల్పోయింది. అందుకని రాణి భూమి ఇద్దరూ ఒకరికొకరు సాంత్వన నిచ్చుకున్నారు. రాణి భూమిని –  భర్తని కోల్పోయిన స్త్రీగా భావించి సాంత్వన నిచ్చింది. భర్తను కోల్పోయిన స్త్రీకి రక్షణ ఉండదు. దుష్టులు ఆమెపై కన్నేస్తారు. రాజ్యంపై షాహమీర్‍కు కన్ను ఉంది. రాజ్యభారాన్ని స్వీకరించటం వల్ల భూమిని షాహమీర్ నుంచి కాపాడి సాంత్వన నిస్తోంది కోటరాణి. ఇక్కడే అసలు సత్యం దాగుంది. షాహమీర్ రాజ్యంపైనే కాదు, కోటరాణిపై కూడా కన్నేశాడు. భూమిని కాపాడటం అంటే  పరోక్షంగా కోటరాణి షాహమీర్ నుంచి తనని తాను కాపాడుకోవటం.

చరిత్ర రచన భారతీయుల దృష్టిలో సృజనాత్మక ప్రక్రియ. విదేశీయుల దృష్టిలో చరిత్ర రచనలో సృజనాత్మకత అవసరం లేదు. నిజాలు అనుకున్నవి,  ‘cold facts’ మాత్రమే వాళ్ళకు కావాలి. ప్రతి దాన్నీ అంకెలలో కుదించాలని చూస్తారు. కానీ అంకెలకు మనస్సుండదు. భావాలుండవు. వేదనలుండవు. చరిత్రను ఇలా భావ రహితంగా, రస రహితంగా రచించటం విదేశీయుల పద్ధతి. కానీ భారతీయుల దృష్టిలో చరిత్ర జీవం లేని అంకెలు కాదు. జీవంతో తొణికిసలాడుతూ రసమయమై భావి తరాలకు జీవన గతిని, సమాజ గతిని, మానవ మనస్తత్వాన్ని, విధి వశమైన జీవన విధానాన్ని గ్రహింపజేస్తూ తమ తమ జీవితాలను సన్మార్గంలో ప్రయాణింపజేసే వీలునిస్తుంది. అందుకే భారతీయులు చరిత్రను రచించలేదు. చరిత్ర కావ్యాలు సృజించారు. అంకెల వెనుక దాగి ఉన్న మనస్సును ప్రదర్శించారు. ఈ కావ్యాలను రస విహీనమైన దృష్టితో చూస్తే అవి అర్థం కావు. జోనరాజు వాడిన ‘విధవ’ ఉపమానం ఎంతో అర్థాన్ని  తనలో పొదుగుకుని ఉంది. ఈ అర్థం భవిష్యత్తులో జరిగిన సంఘటనలను తెలుసుకుంటే తేటతెల్లం అవుతుంది.

అనుక్షణం గుర్తు పెట్టుకోవాల్సినదేమిటంటే, జోనరాజు తన రాజతరంగిణిని సుల్తానుల ఖడ్గనీడలో రచించాడు. కాబట్టి, కొన్ని విషయాలను స్పష్టంగా, ఉన్నదున్నట్టు చెప్పలేడు. వాటిని ఇలాగే నర్మగర్భితంగా చెప్తాడు. అర్థం చేసుకోవటం మీద ఆధారపడి ఉంది. షాహమీర్ ధూర్తుడు. ‘రాజ్యంపైనే కాదు రాణిపైన కూడా కన్నేశాడు’ అని స్పష్టంగా చెప్పడు. బహుశా, ఇందువల్లనే కోటరాణి ఉదయన దేవుడిని వివాహమాడిందేమో అన్న ఆలోచన కలుగుతుంది. ఉదయన దేవుడు జీవించినంత కాలం షాహమీర్ కోటరాణి దరిదాపులకు కూడా రాలేడు.

గతంలోనూ కశ్మీరులో పలు సందర్భాలలో మహిళలు అధికారం చేపట్టారు. యశోవతి, దిద్దారాణి, రాణి సుగంధా దేవి వంటి వారు రాజ్యాధికారం చేపట్టినప్పుడు ప్రజలలో ఎలాంటి నిరసనా ప్రకటితమవలేదు. పైగా ప్రజలు వారి పాలనను సంబరాలతో ఆహ్వానించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కశ్మీరులో ఇస్లాం ప్రభావం పెరిగింది. ప్రజల నుంచి రాణి పట్ల వ్యతిరేకత ప్రదర్శితమవలేదు కానీ, అధికారంపై ఆశ ఉన్నవారు ఒక మహిళ తమను పాలించటం, అధికారం చలాయించటం పట్ల నిరసన ప్రదర్శించారు. కానీ పెద్ద సంఖ్యలో మంత్రులు, ఇతర శక్తిమంతులు, గతంలో రాణి తమకు చేసిన సహాయాలను, ఉపకారాలను గుర్తు తెచ్చుకుని ఆమె అధికారాన్ని ఆమోదించారు.

పూర్వోపకార స్మరణాచ్ఛ హమేరా దయో ఖిలాః।
తాం ప్రాణమన్న మాత్యా స్వాశ్చంద్రీ మివ నవాం కలామ్॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 268)

‘పూర్వోపకార స్మరణా’, గతంలో చేసిన ఉపకారాలను స్మరించి షాహమీర్‍తో సహా ఇతర మంత్రులు, కోటరాణికి చంద్రవంకకు ప్రణామాలు ఆచరించినట్లు ప్రణామాలు ఆచరించారు. ఆమె మహిళ అవటం వల్ల ‘చంద్రవంక’ అన్న ఉపమానం వాడి ఉండవచ్చు. లేదా, భవిష్యత్తులో జరగబోయేదాన్ని సూచిస్తూ వాడి ఉండవచ్చు. ఏదైమైనా, తాత్కాలికంగా పైకి అందరూ కోటరాణిని రాణిగా ఆమోదించారు. కానీ ‘ఒక మహిళ తమను పాలించటం ఏమిటి?’ అన్న ఆలోచన రగులుతోందన్నది జోనరాజు సూచించాడు. కశ్మీరు చరిత్రలో ఎన్నడూ లేని మహిళ పాలన పట్ల అహం ప్రదర్శించే సంకుచితత్వం, కశ్మీరులో ప్రదర్శితమవటానికి ప్రధాన కారణం మారుతున్న కశ్మీర సామాజిక స్వరూపం. బౌద్ధం కానీ, భారతీయ ధర్మం కానీ ఒకే కొమ్మ వేర్వేరు శాఖలు. కానీ ఇస్లాం వీటికి పూర్తిగా విరుద్ధం. అలాంటి విరుద్ధమైన వృక్షం కశ్మీరులో వ్రేళ్ళూనుకొని ఇతర వృక్షాలను అదృశ్యం చేస్తూ ఆధిక్యం సాధిస్తున్న తరుణం అది. అందుకే అంతవరకూ కశ్మీరులో కనబడని సంకుచితత్వం – కోటరాణి, రాజ్యాధికారం చేపట్టిన తరువాత కనబడింది. భారతీయ సమాజంలో కనబడే ప్రతి వికృతికి సనాతన ధర్మాన్ని కారణంగా చూపటం ఆనవాయితీ అయింది. భారతీయ సామాజిక పరిణామ క్రమాన్ని, విదేశీ దాడులతో అతలాకుతలవుతూ  వారి ప్రభావంతో సమాజం రూపాంతరం చెందిన విధానాన్ని అధ్యయనం చేస్తే, ప్రస్తుతం జరుగుతున్న దుష్ప్రచారాల అసలు స్వరూపం బోధపడుతుంది. ఒక నదీ జలం ఎంతగా మలినాలమయం అయిందో గ్రహించాలంటే దాని ప్రవాహ మార్గంలో వచ్చి చేరిన మలినాలను  పరిశీలించాల్సివుంటుంది.

ఎండాకాలంలో పడే వర్షం ఎలాగయితే వాతావరణంలోని దుమ్ము, ధూళిని శుభ్రం చేసి మొక్కలకు జీవాన్ని ప్రసాదిస్తుందో  అలాగే  కోటరాణి పాలన కశ్మీరు ప్రజలకు ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. కానీ, కోటరాణికి ప్రమాదం పొంచి ఉందని తెలుసు. షాహమీరు తనకు మద్దతునివ్వటం తాత్కాలికమేనని, అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడనీ తెలుసు. అందుకని షాహమీరును ఎదిరించి, అతడికి దీటుగా, ప్రత్యామ్నాయంగా నిలిచేవాడి కోసం వెతకటం ప్రారంభించింది. ఆమె దృష్టి భట్ట భిక్షణుడిపై నిలిచింది.

షహ్మేరాత్ స్వాదయభ్రంశ శంకిణీ భట్ట భిక్షణమ్।
తదుద్రేక వినాశాయుద్ధం మౌనం దేవీ వినాయ సా॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 270)

షాహమీరు దూకుడుకు అడ్డుకట్ట వేసి, తన రాజ్యాన్ని సురక్షితం చేసేందుకు కోటరాణి భట్ట భిక్షణుడిని ఆదరించింది. అతడికి ప్రాధాన్యం ఇచ్చింది. ఇది షాహమీరుకు ఆగ్రహం కలిగించింది.

భట్ట భిక్షణుడిని రాణి ఆదరించటం వల్ల షాహమీరుకు రాణి తన ప్రాధాన్యం తగ్గించే ప్రయత్నంలో ఉందని అర్థమయింది. భట్ట భిక్షణుడి సహాయంతో రాణి చక్కగా పాలించటం, అన్ని అడ్డంకులను దాటుకుంటూ సాగటం షాహమీరుకు కలవరం కలిగించి ఉంటుంది. దాటటం కష్టమైన సాగరాన్ని పడవ సహాయంతో దాటినట్టు, భిక్షణుడి సహాయంతో రాణి అన్ని అడ్డంకులను దాటుతూ ముందుకు సాగింది అంటాడు జోనరాజు.

రాణి భట్ట భిక్షణుడికి ప్రాధాన్యం ఇవ్వటం షాహమీర్‍లో అసూయను కూడా కలిగించి ఉంటుంది. షాహమీర్‍కు కోటరాణిపై కన్ను ఉన్నదని జోనరాజు ప్రత్యక్షంగా చెప్పకున్నా, పరోక్షంగా తెలుస్తూనే ఉంది. రింఛనుడు రాణిని, హైదర్‍ను షాహమీర్ సంరక్షణలో ఉంచినప్పటి నుంచీ షాహమీర్ కోటరాణిపై మనసు పడ్డాడనిపిస్తుంది. ఒకసారి ఉదయన దేవుడిని అడ్డు వేసుకుని తప్పించుకుంది రాణి. ఉదయన దేవుడి అడ్డు తొలగిందనుకునే లోగా భట్ట భిక్షణుడు తెరపైకి వచ్చాడు. భట్ట భిక్షణుడిని రాజ్యవ్యవహారాల కోసం రాణి ఉపయోగిస్తున్నా, రాణి పొందుకోసం తపిస్తున్న షాహమీర్, వారి నడుమ నెల కొంటున్న సాన్నిహిత్యాన్ని ఊహించుకుని, రగిలిపోవటం సహజం.

అంతః సహేన షాహ్మేరస్తద్దత్తం భిక్షనోదయమ్।
మానవంతః సహన్తే హి చ్ఛాయాసామ్యం కధంచన॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 272)

జోనరాజు కావ్య నిర్మాణ దక్షత, పదాల వాడకంలో కనిపిస్తుంది. ఒక్కో  పదాన్ని, పోలికలను ఎలా వాడతాడంటే, ప్రస్తుతం సందర్భంలో ఒదుగుతుంది. కానీ జరిగింది తెలుసుకుని మళ్ళీ చదివితే, పదాల వాడకం గమనిస్తే, జరుగుతున్న దాన్నే కాదు, జరగబోయేదాన్ని కూడా జోనరాజు సూచనప్రాయంగా పొందుపరచటం తెలుస్తుంది. చరిత్ర రచన భారతీయుల దృష్టిలో ఒక సృజనాత్మక ప్రక్రియ. యాంత్రిక రచన కాదు.

భిక్షణుడి ఆధిక్యాన్ని షాహమీర్ సహించలేకపోయాడు. భిక్షణుడి ఎదుగుదలకు కోటరాణి సహాయం చేయడం భరించలేకపోయాడు. తన నీడతో సమానత్వాన్ని ఎవరైనా భరించగలరా? అంటాడు జోనరాజు. జోనరాజు వాడిన ఈ ‘ఛాయాసామ్యం’ అన్న పదం పలు అర్థాలనిస్తుంది. ఒక కావ్య రచనలో గొప్పతనం ఇలాంటి పరిస్థితులలోనే ప్రస్ఫుటం అవుతుంది. ఒక పదం వాడటం ద్వారా పలు అర్థాలను స్ఫురింపజేయటం, ఆ అర్థాలన్నీ సందర్భోచితంగా ఉంటూ భవిష్యత్తులో సంభవించే సంఘటలనల అర్థాన్ని వివరించేట్టు రచించటం సామాన్య విషయం కాదు.

(ఇంకా ఉంది)

Exit mobile version