Site icon Sanchika

జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-25

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

ఏకస్మిన్ శయనే రాత్రిమతి వాహ్య తయా సమమ్।
స ప్రాతరుద్ధితో జాతు తీక్ష్ణైర్దేవీ మరోధయత్॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 305)

కోటరాణికి షాహమీర్ అంటే భయం అన్నది ఆమె చర్యల్లో స్పష్టంగా తెలుస్తుంది. అందుకే ‘హైదర్’ను సింహాసనంపై కూర్చోబెట్టలేదు. ఉదయన దేవుడి మరణం తరువాత కోటరాణి భయం – ఉదయన దేవుడి సంతానాన్ని సింహాసనంపై కూర్చోబెడితే షాహమీర్ ‘హైదర్’ అసలు వారసుడని గోల చేస్తాడన్నది. అందుకని తానే రాజ్యాధికారం చేపట్టింది. ఆమె వల్ల గతంలో పొందిన లాభాలను దృష్టిలో ఉంచుకుని షాహమీర్‍తో సహా, ఇతర మంత్రులు కూడా కోటరాణిని రాణిగా ఆమోదించారు. కానీ కుట్రలు సాగుతూనే ఉన్నాయి. ‘షాహమీర్’ను అదుపులో పెట్టేందుకు అతనికి ప్రత్యామ్నాయంగా భట్టభిక్షణుడిని చేరదీసింది కోటరాణి. ఇది షాహమీర్‍కు ఆగ్రహం కలిగించింది. షాహమీర్ తన ఆగ్రహాన్ని ప్రదర్శించలేదు. కానీ కోటరాణిని రాణిగా కొనసాగిస్తే ప్రమాదం అని మాత్రం గ్రహించాడు. కోటరాణిని ఇలాగే పని చేయనిస్తే, ఆమె తనకే ఎసరు పెడుతుందని అర్థం చేసుకున్నాడు. అందుకని తన శక్తిని ప్రదర్శించటం ద్వారా, రాణిని అదుపులో పెట్టాలని నిశ్చయించాడు. ముందుగా, తనకు ప్రత్యామ్నాయంగా నిలిపిన భట్టభిక్షణుడి అడ్డు తొలగించుకోవాలని నిశ్చయించాడు.

షాహమీర్ అనారోగ్యం నటించాడు. తాను మరణశయ్యపై ఉన్నట్టు నటించాడు. వర్తమానం అందుకున్న రాణి, అతడిని పరామర్శించేందుకు భట్టభిక్షణుడిని పంపింది. భట్టభిక్షణుడు, అవతార అనే అతనితోనూ, కొందరు సైనికులతో ‘షాహమీర్’ను పరామర్శించేందుకు వెళ్ళాడు.  షాహమీర్ ఇంటి బయట నిలబడ్డవారు షాహమీర్ అవసాన దశలో ఉన్నాడని, అతనికి ఎలాంటి మందులు ఇవ్వాలన్న విషయాలు చర్చించుకుంటున్నారు. వీరు భట్టభిక్షణుడితో వచ్చిన వారిని లోపలకు పోనీయకుండా అడ్డుకున్నారు.

తౌ భిక్షణావతారా ద్వౌ తత్సమీపమ విక్షతామ్।
సాంకట్యాదివ తత్ప్రాణ రక్షిణ్యో దేవతా నమ్॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 277)

వారిద్దరూ – భట్టభిక్షణుడు, అవతారలు షాహమీర్ గదిలోకి అడుగుపెట్టారు. కానీ అ రోజు వారి ప్రాణాలను కాపాడే దేవతలు వారి వెంట ఆ గదిలో అడుగుపెట్టలేదు. బహుశా  దేవతలకు ఆరోజు ఆ  గదిలోకి ప్రవేశం లభించలేదేమో అంటాడు జోనరాజు.

ఇక్కడే, భారతీయుల అమాయకత్వం, శత్రువుని అమాయకంగా నమ్మి మోసపోయే తత్వం తెలుస్తాయి. షాహమీర్‍కు రాజ్యంపై కన్నుందని తెలుసు. షాహమీర్‍కు భట్టభిక్షణుడంటే కోపం అనీ తెలుసు. అయినా, షాహమీర్ అవసాన దశలో ఉన్నాడని తెలియగానే, నమ్మి, అతడిని పరామర్శించేందుకు వెళ్ళాడు భట్టభిక్షణుడు. అంటే, మనుషుల్లోని కౌటిల్యం, కుట్రలు, కుతంత్రాలను దర్శించలేని అమాయకత్వం లాంటి మూర్ఖత్వం అన్నమాట. ఎదుటివాడి కల్లబొల్లి కబుర్లకు  నమ్మి,  లొంగి, నష్టపోవటం భారతదేశ చరిత్రలో అడుగడుగునా కనిపిస్తుంది. చివరికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా ‘హిందీ చీనీ భాయి భాయి’ అన్న చైనా వాడి కబుర్లు నమ్మి మోసపోయాం. మోసగాడిని నమ్మటం, మోసపోవటం, మన చరిత్రలో అడుగడుగునా కనిపిస్తుంది. కోటరాణి కూడా మరణశయ్యపై ఉన్నానన్న షాహమీర్ కబుర్లు విని మోసపోయింది. అదృష్టవశాత్తు ఆమె స్వయంగా వెళ్ళలేదు. అంటే, భట్టభిక్షణుడికి రాణి ప్రాధాన్యం ఇవ్వటం పట్ల తనలో రగులుతున్న క్రోధాన్ని షాహమీర్ ఎక్కడా ప్రదర్శించలేదన్న మాట. మనసులో అసూయను బయటపడనివ్వలేదన్న మాట. తనకు భట్టభిక్షణుడి పట్ల క్రోధం ఉందని, అతడి అడ్డు తొలగించుకోవాలని అనుకుంటున్నాడన్న విషయం ఎవ్వరికీ తెలియనివ్వలేదన్న మాట. ఈ విషయాన్ని జోనరాజు అత్యంత సుందరంగా చెప్తాడు. మామూలుగా అయితే, షాహమీర్ ధూర్తుడని, మోసగాడు అనీ దూషించాలి. నమ్మించి వెన్నుపోటు పొడిచినవాడని విమర్శించాలి. కానీ షాహమీర్ సుల్తాన్ అయ్యాడు. కశ్మీరులో భారతీయుల పాలనకు చరమగీతం పలికి ఇస్లామీయుల పాలనకు తెరతీసినవాడు. ఇస్లామీయుల దగ్గర ఆశ్రయం పొందుతూ, వారి పాలనకు ఆద్యుడయిన షాహమీర్‍ను ధూర్తుడని జోనరాజు బ్రతికి బట్టకట్టలేడు. అందుకని అందమైన ఉపమానాలతో షాహమీర్ ప్రవర్తనను వర్ణించాడు.

ముందు శ్లోకంలో ‘తన నీడతో సమానత్వం ఎవ్వరూ సహించరు’ అని భట్టభిక్షణుడి ఆధిక్యతను షాహమీర్ సహించటం లేదన్న నిజాన్ని చూచాయగా చెప్తాడు. తరువాత శ్లోకంలో ఉపమానం వాడేడు.

తత్సర్యతో ధూమతాపాది లక్షణం జాతవేదసః।
ధీమతోస్య న కిన్చిత్తు రోషలింగమలక్ష్యత్॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 273)

సాధారణంగా వేడి ద్వారా, పొగ ద్వారా నిప్పు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. కానీ ధీమతుడయిన షాహమీర్ తనలో రగులుతున్న కోపాన్ని ఏ మాత్రం ప్రదర్శించలేదు అంటాడు జోనరాజు. నిప్పును దాచటం కష్టం. అలాగే అసూయ, క్రోధాన్ని దాచటం కష్టం. కానీ షాహమీర్ తన క్రోధాన్ని దాచిపెట్టాడు. క్రోధాన్ని ప్రదర్శించే అవకాశాన్ని కల్పించుకున్నాడు. అనారోగ్యం నటించాడు. భట్టభిక్షణుడిని తన దగ్గరకు రప్పించుకున్నాడు.

గదిలోకి అడుగుపెట్టిన భట్టభిక్షణుడు, అవతారులతో తన అనారోగ్యం గురించి ఆరోపణలు చేస్తూ మాట్లాడేడు. అవకాశం చూసుకుని, వారి ఆయుధాలను వారి శరీరంలోనే దింపాడు. అంటే, బహుశా ఆయుధాలు తీసి ముందు పెట్టమని ఉంటాడు. అనారోగ్యంలో ఉన్నవాడి నుంచి ఎలాంటి ప్రమాదం శంకించని వారు అలాగే చేసి ఉంటారు. వీలు చూసుకుని, వారి ఆయుధాలతో వారినే చంపి ఉంటాడు. ఇదే సమయానికి, భట్టభిక్షణుడి వెంట వచ్చినవారిని లోపలకు రానీయకుండా బయటే అడ్డుకున్నారు. వారి పరిస్థితి ఏమయిందో జోనరాజు చెప్పలేదు కానీ, వారిని చంపి అయినా ఉంటారు, లేక, వారు లొంగిపోయి షాహమీరు పక్షం వహించి ఉంటారు. మొత్తానికి భట్టభిక్షణుడిని చంపటం ద్వారా  షాహమీరు  మెదడులోని రోగం తగ్గిపోయిందట.

షాహమీరు కొట్టిన దెబ్బకు భట్టభిక్షణుడు, అవతారుల తలల నుంచి రక్తం కారింది. వారి కళ్ళ నుంచి నీళ్ళు కారేయి. వారి ప్రాణాలు వారి శరీరాన్ని వదిలి వెళ్ళాయి. వాళ్ళ ప్రాణాలతో పాటు షాహమీరుకు వారి పట్ల ఉన్న క్రోధం, ద్వేష భావనలు షాహమీరును వదిలి వెళ్ళాయి అంటాడు జోనరాజు. గమనించాల్సింది ఏమిటంటే, షాహమీరు వారిని  తలపై మోది  చంపాడు. మనశ్శాంతిని పొందాడు అని రాయవచ్చు. కానీ ఇంత విపులంగా వారి మరణాన్ని వర్ణించడం జోనరాజు కావాలని చేశాడనని అనిపిస్తుంది. షాహమీరును క్రూరుడు, మోసగాడు, కోటరాణికి అన్యాయం చేసినవాడు అని తిట్టలేడు. కాబట్టి అతనెంత క్రూరుడో, ఎలా చంపాడో విపులంగా వర్ణించటం ద్వారా షాహమీరు క్రౌర్యం, దౌష్ట్యం, నైచ్యాలను కసి తీరా జోనరాజు ప్రదర్శించాడనిపిస్తుంది.

సిరభిం శోణితం వాష్పం హుశాంగైః సకలైరసూన్॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 279)

అనారోగ్యం నుంచి బయటపడ్డవాడు తలస్నానం చేసినట్టు, షాహమీర్ వారి రక్తంతో స్నానం చేసినట్టయ్యాడు. అంటే, ‘అసూయ’ అనే అనారోగ్యం నుంచి బయటపడ్డ షాహమీర్ వారిద్దరి రక్తంతో స్నానం చేసినట్టు, అతని శరీరమంతా రక్తమయం అయిందన్న మాట. చనిపోయిన వారిద్దరి తలలూ రెండు పాత్రలలా ఉన్నాయట. తలలో అయిన గాయాలు దీపం గుర్తుల్లా ఉన్నాయి. అంటే, షాహమీర్ వారి తలలపై గాయం చేసి చంపాడన్న మాట. పాత్రపై దీపం కొన్నాళ్ళు అలా క్రమం తప్పకుండా వెలిగిస్తుంటే, ఆ పాత్రపై దీపం గుర్తు పడుతుంది. దీపం ఉన్నంత మేరా నల్లగా అవుతుంది. అలా, షాహమీర్ కొట్టిన దెబ్బ దీపం గుర్తు అయితే, వాళ్ళ తలలు పాత్రలు. అంత దెబ్బ కొట్టాడన్న మాట షాహమీర్. అందుకే రక్తంలో స్నానం చేసినట్టు అయ్యాడు షాహామీర్.  అతని శత్రువుల తలల నుంచి రక్తం విరజిమ్మింది, కళ్ళ నుంచి నీళ్ళు కారాయి.

రక్తార్ద్రత్రణ దీపాకపూర్ణ పాత్రభత్ చ్ఛిరః।
రోగ మోక్షోచితం స్నానం స తయోః శోణితౌర్యధాత్॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 280)

భట్టభిక్షణుడి మరణ వార్త వింటూనే రాణి క్రోధంతో ఊగిపోయింది. షాహమీరుపై దాడి చేసి అతడిని శిక్షించాలని అనుకుంది. ఆమెకు ఆ శక్తి ఉంది కూడా. కానీ ఆమె చుట్టూ ఉన్నవారు ఆమెను వారించారు. వారంతా షాహమీరు సమర్థకులు. దుష్టబుద్ధులు. షాహమీరును రాణి దండిస్తే, వీరి పరిస్థితి ప్రమాదంలో పడుతుంది. అందుకని, షాహమీరుపై దాడికి వెడలకుండా ఆమెని ఆపారు. “ఓ బ్రాహ్మణుడి మరణం వల్ల కలిగిన బాధను తగ్గించుకునేందుకు షాహమీరుపై దాడి చేస్తే, క్రోధంతో షాహమీరు ప్రజలను చంపుతాడు. అనవసరమైన రక్తపాతం సంభవిస్తుంది.” అని ఆమెను ఆపారు. ఈ రకంగా వారు షాహమీరును కాపాడారు. అందుకే వారిని దుష్టబుద్ధులు అన్నాడు జోనరాజు. ఈ సంఘటన ఎంతగా షాహమీర్ రాజ్యంపై పట్టు బిగించాడో చెప్తుంది. ఎందుకని, రాణి షాహమీరు అధికారం తగ్గించాలని ప్రయత్నించిందో స్పష్టమవుతుంది.

షాహమీరు ద్రోహం మరచిపోవాలని రాణి పాలనపై దృష్టి పెట్టింది. ఎలాగయితే నీరు పంటలకు శక్తినిస్తుందో, రాణి, అలా ప్రజలకు ధనాన్ని అందజేసింది. చంద్రుడు నీలి కలువలకు ఎలాంటి వాడో, కశ్మీరుకు కోటరాణి అలాంటిది. శత్రువులకు ఆమె శ్వేత కలువలకు సూర్యుడి లాంటిది. అయితే, రాణి ఎంత చక్కగా పాలించేది అయినా, నేరం చేసిన వాడిని శిక్షించకపోతే, నేరం చేసిన వాడి ధైర్యం పెరిగిపోతుంది. నేరం చేసినా ఏమీ కాదన్న విశ్వాసం ఇతరులలో కలగటంతో, నేరాలు పెరిగిపోతాయి. రాజు అధికారం పట్ల చులకన అభిప్రాయం కలుగుతుంది.

భట్టభిక్షణుడు రాణికి సన్నిహితుడు. అతడిని హత్య చేసిన తరువాత కూడా, రాణి షాహమీరుపై చర్యలేమీ తీసుకోకపోవటం షాహమీర్ ప్రాబల్యం పెంచింది. రాణి బలహీనమైనది, శక్తిహీన అన్న అభిప్రాయం కలిగించింది. ఫలితంగా ‘కంపనాధిపతి’ సైన్యంతో యుద్ధానికి వచ్చాడు. రాణి ససైన్యంగా అతడిని ఎదుర్కొంది. కానీ కంపనాథిపతి కోటరాణిని బందీ చేశాడు. కారాగృహంలో పెట్టాడు. కంపనాధిపతి కోటరాణిని కారాగారంలో బంధించటాన్ని జోనరాజు ‘పిట్టను దాని గూటిలోనే పట్టి, పంజరంలో బంధించినట్టు కంపనాధిపతి కోటరాణిని కారాగారంలో బంధించాడు’ అని అంటాడు.

కోటరాణిని కంపనాధీశుడి నుంచి రక్షించేందుకు ఆమె మంత్రులలో శ్రేష్ఠుడయిన కుమారభట్టు బయలుదేరాడు. అతడు తన శిష్యులలో రాణిని పోలి ఉండే శిష్యుడిని వెంట తీసుకెళ్ళాడు. కుమారభట్టు తిన్నగా కంపనాధీశుడి దగ్గరకు వెళ్ళి అతడి తెలివిని, ధైర్యాన్ని, శక్తిని పొగిడాడు. అతని రూపాన్ని పొగిడాడు. అతడి  శౌర్యాన్ని పొగిడాడు. “ఓ మహిళ ఆజ్ఞలను తల వంచుకుని పాటిస్తూ సిగ్గుతో మూలుగుతున్న మా మగతనాన్ని మీరు నిలబెట్టారు. మీరు అనుమతిస్తే, నేను కారాగరంలో రాణిని కలిసి, ఆమెకు నచ్చజెప్తూ, ఓదారుస్తూ, బుద్ధి చెప్తాను. ఆమె ధనం ఎక్కడ దాచిందో తెలుసుకుని మీకు చెప్తాను. ఆమె చాలా ధనం దాచింది. మహిళ కదా, దాచిన ధనాన్ని వదులుకోలేకపోతోంది.” అంటూ కంపనాధీశుడికి సంతోషం కలిగించే మాటలన్నాడు. ముఖ్యంగా ‘ఓ మహిళ ఆజ్ఞలను తల వంచుకుని పాటిస్తూ సిగ్గుతో మూలుగుతున్న మా మగతనాన్ని మీరు నిలబెట్టారు’ అన్న మాటలు కంపనాధీశుడికి నచ్చాయి. రాణిని కలిసేందుకు అనుమతినిచ్చాడు.

తన వెంట ఉన్న శిష్యులతో సహా రాణిని కలిసాడు కుమారభట్టు. కుమారభట్టు వెంట ఉన్న పిల్లవాడు రాణి దుస్తులు ధరించాడు. రాణి పిల్లవాడి దుస్తులు ధరించింది. అతడి వెంట చెరసాల బయటకు నడిచింది. ఆ సాయంత్రం కూడా రాణి విడుదల కోసం ఎదురుచూస్తూ సిద్ధంగా ఉన్నదంటాడు జోనరాజు. ఈ సందర్భంగా గమ్మత్తయిన భావంతో శ్లోకాలు రాశాడు జోనరాజు.

తాను భట్టభిక్షణుడిని చంపటంతో సహా, తన ఇతర చర్యల గురించి ఆలోచించాడట షాహమీర్. తన పని లోని మంచి చెడులను విశ్లేషించాడు అంటాడు జోనరాజు. ఈ శ్లోకం సందర్భంలో ఒదగదు. ఎందుకంటే, తరువాతి శ్లోకంలో కోటరాణికి షాహమీరుతో శత్రుత్వం లేదు, అతడి పట్ల సమర్థన కూడా లేదు అని రాశాడు జోనరాజు. పునరాలోచన, విశ్లేషణ లేని శత్రుత్వం నష్టదాయకం అని వ్యాఖ్యానిస్తాడు జోనరాజు. దీని తరువాతి శ్లోకంలో రాణి, జయాపీడపురం వెళ్ళగానే షాహమీర్ కశ్మీరును ఆక్రమించాడు అని రాస్తాడు. ఇక్కడ జోనరాజు ఏదో చెప్పాలనుకుని ఎంత నర్మగర్భంగా చెప్తాడంటే, అసలు అర్థం మరుగున పడిందని అనిపిస్తుంది. ఏది ఏమైనా భట్టభిక్షణుడి హత్య తరువాత షాహమీర్ రాణిని ప్రశాంతంగా ఉండనివ్వలేదన్నది స్పష్టమవుతోంది. కంపనాధీశుడు కూడా షాహమీరుకు సన్నిహితుడు. అతడి ద్వారా రాణిని బందీ చేయించి అవమానించాడు. ఆ సందర్భంలో కుమారభట్టు వాడిన ‘మహిళ ఆజ్ఞ’, ‘పురుషత్వం’ వంటి పదాలను పరిగణనలోకి తీసుకుంటే, ఎంతగా మహిళ పాలన పట్ల నిరసన శక్తిమంతులయిన వారిలో ప్రచారం  జరిగిందో ఊహించవచ్చు. ఏ రకంగా ప్రజాభిప్రాయాన్ని తన వైపు తిప్పుకుంటున్నాడో అర్థం చేసుకోవచ్చు. కోటరాణి కారాగారం నుంచి తప్పించుకోవటం షాహమీర్ ఊహించి ఉండడు. ఆమె తప్పించుకోవటంతో ఆమె పై దాడులు అధికం చేసి ఉండవచ్చు. కశ్మీరు రాజధానిలో కోటరాణి మనుగడ కష్టమైపోయి ఉండవచ్చు. అందుకని ఆమె జయాపీడపురానికి తన నివాసాన్ని మార్చి ఉండవచ్చు. జయాపీడపురంలో గతంలో పలుమార్లు కశ్మీర రాజులు ప్రమాద సమయాల్లో తల దాచుకున్నారు. ప్రస్తుతం ‘ఆంద్రకోట్’గా పిలుస్తారు జయాపీడపురం ప్రాంతాన్ని. రాణి జయపీడపురం వెళ్ళగానే షాహమీర్ కశ్మీర రాజధానిని ఆక్రమించటం, షాహమీర్ కోటరాణిని చీకాకు పరుస్తున్నాడనీ, దాదాపుగా ప్రత్యక్షంగానే రాజ్యాధికారం చేపట్టే చర్యలు ఆరంభించాడనీ అనుకోవచ్చు.

కోటరాణిని సమర్థించే లావణ్యులను కూడా షాహమీరు అణచివేశాడు. వారిని తన వైపు తిప్పుకున్నాడు. దాంతో షాహమీర్‍కు లొంగకూడదని కోటరాణి తలుపులను మూయించింది. అయితే, షాహమీరు నలువైపులా దిగ్బంధనం చేసి, రాణి తన మందిరం దాటి బయటకు రాలేని పరిస్థితిని కల్పించాడు. రాణి భయంతో వణికిపోయిందని రాస్తాడు జోనరాజు.

నృసింహేనా భజత్ కోటాసృగాలీవ మూహుర్భయమ్॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 302)

‘సృగాలం’ అంటే తోడేలు. ఆడతోడేలు భయంతో వణికినట్టు వణికిందట కోటరాణి. షాహమీర్ పురుషులలో ‘సింహం’ లాంటి వాడట!

సింహానికి తోడేళ్లంటే భయం లేదు. కానీ తోడేళ్ళ గుంపు వల్ల సింహానికి ప్రమాదం ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితులలో, ఒంటరి తోడేలు సింహానికి ప్రమాదకారి కాదు. కానీ క్షణాలలో సింహం ఒంటరి తోడేలును చీల్చి చెండాడుతుంది. ఒంటరి అయిన కోటరాణి షాహమీర్‍కు చిక్కక తప్పనిసరి పరిస్థితి వచ్చింది.

షాహమీర్‍ను సింహంతో జోనరాజు పోల్చినా, అతడివి నక్క జిత్తులు.

సింహాసనే మయా సాకం శ్రియా సాకం మమోరసి।
క్షమయా సహ చిత్త మే రాజ్ఞీవి శతాం స్వయమ్॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 303)

రాణి తన హృదయంలో నివసించవచ్చు, తనతో సింహాసనంపై కూర్చోవచ్చు, తనతో ఖ్యాతిని, రాజ్యాన్ని అనుభవించవచ్చు అని దూతల ద్వారా రాణికి నివేదనలు పంపాడు షాహమీర్.

(ఇంకా ఉంది)

Exit mobile version