Site icon Sanchika

జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-26

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

ఏకస్మిన్ శయనే రాత్రిమతి వాహ్య తయా సమమ్।
స ప్రాతరుద్ధితో జాతు తీక్ష్ణైర్దేవీ మరోధయత్॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 305)

[dropcap]కో[/dropcap]టలో చిక్కుకున్న కోటరాణిని తనతో పాటు సింహాసనంపై కూర్చోమని, తనతో కలిసి రాజ్యం చేయమని ఆహ్వానించాడు. అతని మాటలు నమ్మడం మినహా మరో దారి లేదు కోటరాణికి. నమ్మింది. అతనితో కలసి ఒక రాత్రి గడిపింది. తెల్లారే షాహమీరు కోటరాణిని తీక్ష్ణులకు అప్పగించాడు.  పదిరోజుల  తరువాత శ్రావణమాసం, శుక్లపక్షం ఏడవ రోజున, ఆకాశం నుంచి నక్షత్రం నేల రాలినట్టు కోటరాణి కశ్మీర సామ్రాజ్యం నుంచి అదృశ్యమయింది.

కశ్మీరంలో భారతీయ సామ్రాజ్యం నిలపాలని ప్రయత్నించిన చివరి జ్యోతి ఆరిపోయింది. చివరి ఆశ ఆవిరై పోయింది.

“This was the fate of last Hindu sovereign of Kashmir. She rose like a star but disappeared like a shooting star” [History of Muslim Rule in Kashmir]

“Thus ended one of the most romantic figures in the history of Kashmir.” [Cultural and Political History of Kashmir, Vol. II]

“Kotarani’s wisdom, strength of character and administrative capabilities are golden pages of the history of Kashmir. After the sacrifice of Kotarani, Shahmir was the first Muslim Sultan to occupy the throne of Kashmir.” [The Converted Kashmir]

జోనరాజు ప్రకారం ముట్టడిలో ఉన్న కోటలో చిక్కుబడి ఉన్న కోటరాణిని రకరకాల మాటలతో, వాగ్దానాలతో షాహమీర్ మభ్యపెట్టాడు. షాహమీర్ మాటలకు ముగ్ధురాలై ‘తమోవమాది సందేశైర్ముగ్ధా సంమోహ్య’ అన్నాడు జోనరాజు. ముగ్ధురాలై, సమ్మోహితురాలైన కోటరాణిని షాహమీర్ ‘హస్తే చకార’, అంటే అదుపులోకి తీసుకున్నాడు. ఇది జోనరాజు రాసింది. నిజానికి జోనరాజు ప్రకారం కోటరాణి శాహమీర్ మాటలకు ముగ్ధురాలయింది. కానీ, మొదటి నుంచీ జరుగుతున్నది తెలుసుకుంటూ, కోటరాణి, శాహమీర్‍ల వ్యక్తిత్వాలను, మనస్తత్వాలనూ పరిశీలిస్తే, కోటరాణి శాహమీర్ మాటలను నమ్మటం కల్ల అన్నది తెలుస్తూంటుంది. అలాగే, శాహమీర్ కోటరాణిని నమ్మే ప్రసక్తీ లేదనిపిస్తుంది. గతంలో, రించనుడిని వివాహమాడినట్టు కోటరాణి శాహమీర్‍ను వివాహమాడటమూ కుదరదని తెలుస్తుంది. బహుశా, ఇద్దరు పిల్లల ప్రాణాలు కాపాడతానని శాహమీర్ వాగ్దానం చేస్తే కోటరాణి లొంగివుంటుంది. ఆమె లొంగుదలలో నిజాయితీ లేదని గ్రహించిన శాహమీర్ ఆమెని తెల్లారే జైలుపాలు చేసివుంటాడు. ఎందుకంటే, కోటరాణి ఎంతకాలం ప్రాణాలతో వుంటే, శాహమీర్‍కు అంత ప్రమాదం. వ్యక్తిగతంగానే కాదు, ప్రజలవైపునుంచి కూడా ప్రమాదమే. అందుకే, ఆమెను జైలుపాలు చేసి చంపించేసివుంటాడు. ఆమె ఇద్దరు పిల్లలు ఏమయ్యారో జోనరాజు రాయలేదు. ఏమయ్యారో ఊహించేందుకు పీద సృజనాత్మకత అవసరం లేదు. శాహమీర్‍కు కొడుకులు మనమళ్ళు వున్నారు. వారికి కాక రాజ్యం మరొకరికి దక్కే పరిస్థితులు శాహమీర్ రానీయడు. వారిద్దరినీ చంపించేసివుంటాడు.

పర్షియన్ రచయితలు మాత్రం జోనరాజుకు భిన్నంగా రాశారు.

వాకియత్-ఇ-కశ్మీర్, తారిఖ్-ఇ-హసన్‍ల ప్రకారం కోటరాణి, షాహమీర్‍తో గడపాల్సిన రాత్రి అతని గదిలోకి వెళ్ళి కత్తి తో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. ఆమె తన పొట్ట లోంచి ప్రేగులను తీసి షాహమీరుకు చూపిస్తూ ‘కాబూలియత్ మన ఇన్ అస్త్’ అంది. అంటే, ‘ఇదే నేను నిన్ను స్వీకరించటం’ అని అర్థం. జోనరాజు రాజతరంగిణి తరువాత  రాసిన  ‘బహరిస్తాన్-ఇ-షాహి’లో ఇలాంటి సమాచారం ఏమీ లేదు. అయితే కోటరాణి, షాహమీర్‍ల వివాహం కాలేదన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. జోనరాజు ప్రకారం ఒక రాత్రి గడిపిన తరువాత తెల్లారే షాహమీర్  కోటరాణిని జైలు అధికారులకు అప్పగించాడు. పది రోజుల తరువాత ఆమె జైలులో మరణించినట్లుంది. ఎందుకంటే, జోనరాజు, ఈ విషయం స్పష్టంగా చెప్పలేదు. ‘తన రాజ్యం నుంచి నక్షత్రంలా రాలిపోయింది’ అన్నాడు. ‘మరణించింది’ అనుకోవచ్చు.

కానీ తరువాత కాలంలో కోటరాణి గురించి పలు కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. కోటరాణి, షాహమీర్‍ను వివాహమాడటానికి ఒప్పుకున్నది, అతడిని చంపాలన్న పథకంతో. కానీ అతడిని చంపటం కష్టం అనుకుని తనని తాను పొడుచుకుని చచ్చిపోయింది. అంతే తప్ప, షాహమీర్‍ను తాకనివ్వలేదు అన్న గాథ ప్రచారంలోకి వచ్చింది. కోటరాణి ఆధారంగా అనేక గాథలు ప్రచారంలోకి వచ్చాయి. ఆమె కోటగోడలు ఎక్కి తప్పించుకోవటం, వీరోచిత పోరాటాలు చేయటం వంటివి ప్రచారంలోకి వచ్చాయి. కానీ ‘జోనరాజు’ను ప్రామాణికంగా తీసుకుంటే, కోటరాణి, షాహమీర్‍తో ఏకశయ్యపై ఒక రాత్రి గడిపింది. మరుసటి రోజు ఆమెని జైలు అధికారులకు అప్పగించాడు షాహమీర్. పదవ రోజున తారలా రాలిపోయింది. అంతే! షాహమీర్‍ని చంపాలని ప్రయత్నించటం, పొడుచుకుని చచ్చిపోవటం వంటివి ఏవీ లేవు. ఇలా అంతం అయింది కశ్మీరుపై భారతీయ రాజుల పాలన. కశ్మీరుపై ఇస్లామీయుల రాజ్యం ఆరంభమయింది.

కోటరాణి వ్యక్తిత్వాన్ని పలువురు పలు కోణాలలో విశ్లేషించారు. కొందరు ఆమెను అవతారం స్థాయికి ఎదిగించారు. మరి కొందరు ఆమెను దూరదృష్టి లేని, అధికార దాహం గల వ్యక్తిగా అభివర్ణించారు. ఏది ఏమైనా కశ్మీరు ఇస్లామీయుల వశం కాకుండా దాదాపుగా 18 ఏళ్ళు అడ్డుకున్న వ్యక్తిగా కోటరాణి పేరు చరిత్రలో సుస్థిరంగా నిలుస్తుంది. భారతీయుల సామ్రాజ్యన్ని కొనసాగించాలని చివరి వరకూ ప్రయత్నించిన రాణిగా నిలుస్తుంది. కోటరాణి మరణంతో షాహమీర్‍కు ఎదురన్నది లేకుండా అయింది. కశ్మీరుపై సుల్తానుల పాలన ప్రారంభమయింది. కశ్మీరుపై అధికారం సంపూర్ణంగా భారతీయుల చేజారిపోయింది. ఇకపై కశ్మీరు చరిత్ర స్వరూపం సంపూర్ణంగా ఇంతవరకూ జరిగిన చరిత్రకు భిన్నంగా వుంటుంది.

(ఇంకా ఉంది)

Exit mobile version