Site icon Sanchika

జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-28

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

నీత్యవస్థాన్తరం దౌః స్థ్యా శామాత్మశ్మరమండలమ్।
శ్రీ శమ్సదేవ ఇత్యాఖ్యామన్యాం స్పస్య వ్యథాన్నృపః॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 310)

[dropcap]క[/dropcap]వులు కావ్య రచనలో పలు పద్ధతులను అనుసరిస్తారు. తమ మనసులోని మాటలను కొన్ని స్థలాలలో స్పష్టంగా చెప్తారు. మరికొన్ని సందర్భాలలో నిగూఢంగా విభిన్నమైన భావాల నడుమ,  పదాలవెనుక  గోప్యంగా దాచి ప్రదర్శిస్తారు.

షాహమీరు రాజ్యానికి వస్తూనే లావణ్యులను అదుపులో పెట్టాడు. వారిని తన వశం చేసుకున్నాడు. నలుదిశలా తన ఖ్యాతిని వ్యాపింప చేశాడు. మొత్తం కశ్మీర దేశాన్ని తన అదుపాజ్ఞలలోకి తెచ్చుకున్నాడు. కోటరాణిని కారాగారం పాలు చేశాడు. అదృష్టలక్ష్మిని తన హృదయంపై నిలుపుకున్నాడు. కశ్మీరం లోని సమస్యలను పరిష్కరించాడు. కశ్మీర పరిస్థితిని మార్చాడు. రూపాంతరం చెందించాడు. తనను తాను శ్రీ శమ్సదేవ అన్న పేరుతో పిలుచుకోవటం ప్రారంభించాడు.

‘శంసుద్దీన్’ను జోనరాజు ‘శమ్సదేవ’ అన్నాడు. రాజయిన తరువాత షాహమీర్ శంసుద్దీన్ అయ్యాడు. కానీ ఆ విషయం చెప్పే ముందు జోనరాజు పలు ఇతర విషయాలు చెప్తాడు. లావణ్యులను అదుపులో పెట్టాడు. కోటరాణిని జైలులో పెట్టాడు. కశ్మీరును రూపాంతరం చెందించాడు. ఇవన్నీ చెప్పి తన పేరును ‘శంసుద్దీన్’ అని ప్రకటించుకున్నాడు అని చెప్తాడు. పేరు మార్చుకోవటం కన్నా ముందు కశ్మీరును మార్చాడు అని చెప్పటం ఎందుకని ఆలోచిస్తే,  ఏ రకమైన మార్పును షాహమీర్ సాధించాడో అర్థమవుతుంది.

‘Converted Kashmir’ అన్న పుస్తకంలో షాహమీర్ రాజు అయిన సందర్భాన్ని ఇలా వర్ణించారు.

“People remained impartial. They were uprooted. They were destroyed. The ancient Kashmir was destroyed. If it was a sad event for Hindus, it was a day of happiness for Shahmir and the Muslim world. It was an auspicious time for the Muslims. It was an occasion of festivity and delight. It was a new birth of Kashmir   from Darul Harb (area of peace) to Darul Islam. It was an end of ‘kufr’ (infidelity) and the rise of ‘Imaan’ (faith).”

ఇదీ జోనరాజు స్పష్టంగా చెప్పలేని కశ్మీరులో మార్పు. జోనరాజు స్పష్టంగా ఎందుకు చెప్పలేడంటే, కల్హణుడిలా జోనరాజు స్వతంత్రంగా, స్వీయప్రేరణతో రాజతరంగిణిని రచించటం లేదు. జైనులాబిదీన్ ఛత్ర ఛాయలో రక్షణ పొందుతూ, జైనులాబిదీన్ కోరికపై, ఇస్లామీ సుల్తానుల గొప్పతనం భావితరాలకు సజీవంగా అందించేందుకు రాజతరంగిణి రచనకు ఉపక్రమించాడు. కాబట్టి జోనరాజు ఎలాంటి చేదు నిజం చెప్పినా, అది జైనులాబిదీన్‌కే కాదు, అతని చుట్టూ ఉండి, జోనరాజు అనే ‘కాఫిర్’కు సుల్తాన్ ఇస్తున్న ప్రాధాన్యం నచ్చని ఇస్లామీయులకు సైతం అభ్యంతరాలు తోచని రీతిలో చెప్పాలి. ఒక్క కత్తి మీద సాము కాదిది, పలు కత్తులపై ఒకేసారి చేసే సాము. అందుకే జోనరాజు సుల్తానుల నెవరినీ విమర్శించలేదు. వారి దుశ్చర్యలను కూడా గొప్ప కార్యాలుగా పొగుడుతూ, అక్కడా, ఇక్కడా అసలు విషయాన్ని ఎంతో నర్మగర్భితంగా చెప్తాడు.

ఇప్పటికి కూడా అదే పరిస్థితి దేశంలో కొనసాగుతోందని చుట్టూ చూస్తే స్పష్టమవుతుంది. కశ్మీరు నుండి ఒక పద్ధతి ప్రకారం కశ్మీరీ పండితులను తరిమి వేశారన్నది కాదనలేని సత్యం. కానీ కాదనలేని సత్యాన్ని కూడా కాదని ఈనాటికీ నమ్మించాలని ప్రయత్నించటం చూస్తున్నాం. మతం, పాటించే ధర్మం ఆధారంగా వివక్షతకు గురి చేసి, కశ్మీరు నుంచి ఇస్లామేతరులను తరిమివేశారన్నది, చంపి,  బెదిరించి కశ్మీరువదలి వెళ్ళేట్టు చేశారన్నది  కాదనలేని సత్యం. ఇప్పుడు కూడా ఇతర ప్రాంతాలనుంచి పొట్టకూటికోసం  కశ్మీరు వచ్చినవారిని వెతికి వెతికి, ఏరి ఏరి చంపటం చూస్తున్నాం.   కానీ దీన్ని కూడా నిరాకరించటం చూస్తున్నాం. కశ్మీరులో పాకిస్తాన్ జెండాలు ఎగరటం, తీవ్రవాదులను ఈనాటికీ తీవ్రవాదులుగా అనకపోవటం చూస్తున్నాం. ఈనాటికీ టీవీల్లో చర్చలలో ‘బుర్హాన్ వానీని తీవ్రవాది అనండి చూద్దాం’ అన్న ఛాలెంజ్‍లు, ఆ విషయం తిన్నగా ప్రస్తావించకుండానే చర్చలు సాగటం చూస్తూనే ఉన్నాం. అంటే, దేశంలో ఇస్లామీయుల పాలన ఆరంభమైన తొలి రోజుల్లో ఏ రకమైన భయాలు, లౌక్యాలు, అబద్ధాలు  – భారతీయులు తమ ప్రాణాలు కాపాడుకోవటం కోసం, మనుగడ సాగించటం కొసం ఆరంభించారో – ఈనాటికీ, అంటే, దాదాపుగా వెయ్యేళ్ళ తరువాత కూడా అవే భయాలు, లౌక్యాలు, అబద్ధాలు చలామణీలో ఉన్నాయన్న మాట. నిజాన్ని నిర్భయంగా ప్రకటించటం, సమస్యను తిన్నగా ఎదుర్కోవటం  ఈనాటికీ భారతీయులకు అలవడలేదన్న మాట. ఆనాడు కోల్పోయిన ధైర్యస్థైర్యాలు, ఆత్మ విశ్వాసం, ఆత్మగౌరవం  ఈనాటికీ భారతీయులు తిరిగి సాధించలేకపోతున్నారన్న మాట. ఈ నిజం అర్థమయ్యేందుకు కళ్ళు తెరచి చుట్టూ చూస్తే చాలు, నిజాన్ని నిర్భయంగా ప్రకటించలేక  అడుగడుగునా అవే అబద్ధాలు, లౌక్యాలు, ఆత్మగౌరవ రాహిత్యం, ఆత్మవిశ్వాస రాహిత్యం, ఆత్మవంచనలు కనిపిస్తాయి.

ఈ సందర్భంగా, అంటే, కశ్మీరు సంపూర్ణంగా ఇస్లామీయుల మయం అవటం ఆరంభమయిన సందర్భంలో టూకీగా, కశ్మీరులో ఇస్లాం ప్రవేశించిన విధానాన్ని ప్రస్తావించుకోవల్సి ఉంటుంది.

సింధురాజ్యంపై అరబ్బులు దాడి చేసినప్పుడు, సింధు రాకుమారుడు జైసింగ్ కశ్మీరులో ఆశ్రయం పొందాడు. అతనితో పాటు అతని స్నేహితుడు ‘హమీద్’ కూడా కశ్మీరులో ఆశ్రయం పొందాడు. కశ్మీరులో అడుగుపెట్టిన తొలి ఇస్లామీయుడు ‘హమీద్’. జైసింగ్ మరణం తరువాత అతనికి కశ్మీరు రాజు ఇచ్చిన భవంతి ‘హమీద్’కు సంక్రమించింది.  అతడికి తన మతాన్ని ప్రచారం చేసుకునే స్వేచ్ఛను కశ్మీర రాజు ఇచ్చాడు. వారికి రాజాస్థానంలో పదవులు కూడా ఇచ్చాడు. కశ్మీరంలో ఇస్లాంకు ఆదరణ లభిస్తోందన్న విషయం ఇస్లాం దేశాలలో ప్రాకిపోయింది. దాంతో పలు దేశాల నుండీ ఇస్లామీయులు కశ్మీరు రావటం, కశ్మీరు సమాజంలో భాగమయి ప్రభావం చూపటం మొదలయింది. కశ్మీరు రాజు కలశుడు ఓ ముస్లిం వనిత ప్రేమలో పడటంతో రాజ్యంలో ఇస్లామీయుల ప్రాబల్యం పెరిగింది. హర్షుడు ఇస్లామీయుల ప్రభావంలో పడి రాజ్యంలోని కీలకమైన పదవులలో, సైన్యంలో ఇస్లామీయులను నియమించాడు. కల్హణుడు అతడిని ‘తురుష్క హర్షుడు’ అని విమర్శించాడు. హర్షుడి కాలంలోనే కశ్మీరులో ‘ఇస్లామీయుల కాలనీలు’ ఏర్పాటయ్యాయి. కశ్మీరు ప్రజలను ఇస్లామీయులుగా మార్చేందుకు పెద్ద ఎత్తున ఇస్లాం మత ప్రచారకులు కశ్మీరు రావటం ఆరంభయింది.

కశ్మీర రాజు సూహదేవుడి పాలనలో టర్కీ నుంచి ‘సయ్యద్ శంసుద్దీన్ బుల్‍బుల్ షా’ అనే సూఫీ కశ్మీరు వచ్చాడు. అంతకు ముందు తిబ్బత్తు నుంచి రింఛనుడు, పర్షియా నుంచి షాహమీర్ కశ్మీరు వచ్చారు. సూహదేవుడు రింఛనుడు, షాహమీర్ లకు ప్రధాన పదవులిచ్చాడు. రాజు అయిన తరువాత రింఛనుడు ఇస్లాం స్వీకరించటంలో షాహమీర్, బుల్‍బుల్ షాలు ప్రధాన పాత్ర పోషించారు. జస్టిస్ కిలామ్ పుస్తకం ‘The History of Kashmir Pandits’ లో రింఛనుడు మతం మారటం వల్ల కశ్మీరులో ఇస్లాం ఆధిక్యానికి ఊపు వచ్చిందని రాశాడు. “With the religious conversion of Rinchan and with the adoption of Muslim name Malik Sadruddin,  his son   and many others adopted Islam. This way there emerged a Muslim ruling class. This class also needed support and they adopted many ways for propagating Islam.”

 ఇస్లామ్‍ను ప్రచారం చేయాలనుకునేవారికి రింఛనుడి తరువాత ఉదయనుడు  , కోటరాణిల పాలన కాలంలో కష్టం కలిగినా, షాహమీర్ కోటరాణిపై విజయం సాధించటంతో ఇస్లాం ప్రచారానికి అభ్యంతరాలు, అడ్డంకులు లేకుండా పోయాయి.

ఇదీ షాహమీర్ శంసుద్దీన్ పేరును స్వీకరించటంతో కశ్మీరులో జరిగిన మార్పుల రూపు. ఇది తిన్నగా చెప్పలేడు జోనరాజు. అందుకని షాహమీర్ కశ్మీరును రూపాంతరం చెందించాడు అని చెప్పి అతడు శంసుద్దీన్ అన్న పేరును స్వీకరించాడు అని చెప్పటంతో షాహమీర్ సాధించిన మార్పును చెప్పీ చెప్పకుండా చెప్పినట్లవుతుంది.

పైపైన చూస్తే షాహమీర్ కశ్మీరు సమస్యలను పరిష్కరించాడు. కశ్మీర్‍ను మార్పు చేశాడు. శంసుద్దీన్ అన్న పేరును స్వీకరించాడు. తరచి చూస్తే, జోనరాజు చెప్పదలచుకున్న అసలు విషయం అర్థమవుతుంది. అంతకు ముందు 307వ శ్లోకంలో మరో విషయం చెప్పాడు జోనరాజు. ఎంతో అమాయకంగా, అసలు విషయం, పట్టి చూస్తే కానీ కనబడని రీతిలో చెప్పాడు.

రాజ్యానికి వచ్చిన షాహమీర్ కోటరాణి ఇద్దరు కుమారులను కారాగారంలో బంధించాడు అని చెప్పేకన్నా ముందు ‘బంధు సంబంధ కల్పవృక్షో’ అన్నాడు. బంధువులకు, సంబంధీకులకు షాహమీర్ కల్పవృక్షం లాంటి వాడన్నాడు జోనరాజు. అంటూ, అలాంటి వాడు కోటరాణి కుమారులిద్దరినీ జైలు పాలు చేశాడని చెప్పాడు.  షాహమీర్ బంధు, సంబంధీకులంతా ఇస్లామీయులే. వారికి కల్పవృక్షం లాంటి వాడు షాహమీర్. కశ్మీరులో అప్పుడు రాచరికం అమలులో ఉంది. ఒక వ్యక్తి రాజు అయ్యాడంటే, అతని బంధువులు రాచకుటుంబీకులు అవుతారు, లబ్ధి పొందుతారు. కానీ ఇప్పుడు జోనరాజు ఈ విషయం ప్రత్యేకంగా చెప్పటం ఎందుకంటే, గతంలో రాజు అయినా సరే, అతని మంత్రులుగా, సలహాదార్లుగా వేరే వారుండేవారు. రాచకుటుంబీకులకు మర్యాదలు లభించినా, వారు మంత్రుల మాట వినాల్సి వచ్చేది. కానీ షాహమీర్ అధికారానికి రావటంతో ఆ పరిస్థితి మారిపోయింది. అన్ని పదవులు బంధువులు, సంబంధీకులకే! అంటే, రాజ్యపాలన సర్వం ఇస్లామీయుల వశం అయిందన్న మాట. ఇలా సంపూర్ణంగా రూపాంతరం చెందటంతో, సంపూర్ణంగా భిన్నమైన సంస్కృతి సంప్రదాయాలు, ధార్మిక వ్యవస్థతో కశ్మీరుపై ఇస్లామీయుల పాలన ఆరంభమయింది.

(ఇంకా ఉంది)

Exit mobile version