Site icon Sanchika

జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-29

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

చిరం ధురం పరిన్యస్య పుత్రయోః స్యాదనూనయోః।
నయోచ్చిత యశా రాజ్యసుఖం భుంక్తే స్మ భూపతిః॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 314)

[dropcap]త[/dropcap]న పట్ల మంత్రులకు ఉన్న సంశయాలను పటాపంచలు చేసి తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాడు షాహమీర్. ‘కాష్టవాల్’ వద్ద షాహమీర్ రాజపుత్రులను ఓడించాడు. దీనితో షాహమీర్ ఖ్యాతి నలుదిశలా వ్యాపించింది. రాజ్యాన్ని సుస్థిరం చేసిన షాహమీర్ తన రాజ్యాన్ని సమాన శక్తిమంతులైన తన ఇద్దరు కొడుకుల చేతుల్లో పెట్టాడు. అయిదు సంవత్సరాల మూడు రోజులు రాజ్యం చేసిన తరువాత షాహమీర్ ప్రాణాలు విడిచాడు.

షాహమీర్ కశ్మీర రాజ్యలక్ష్మిని చేపట్టినా, ఆయన ప్రశాంతంగా రాజ్యం చేయలేదని, లావణ్యులతో పోరాటం, రాజపుత్రులతో (వీరు కశ్మీరు అధికారులు – రాజస్థానీ రాజపుత్రులు కారు) యుద్ధం వంటివి నిరూపిస్తాయి. కానీ చరిత్ర రచయితలు, భారతీయులు ఇస్లామీయుడు సుల్తాన్ కావటాన్ని కశ్మీరు ప్రజలు ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఆమోదించారని రాస్తారు. చరిత్ర రచయితలు షాహమీర్ పాలన చక్కనిదని, ఆయన కశ్మీరుకు శాంతిమయం చేశాడనీ రాస్తారు. కానీ ఈ విషయం జోనరాజు చెప్పలేదు. తనను నమ్మినవారికి కల్పవృక్షం లాంటి వాడని, తన శౌర్యంతో శత్రువులని అణచివేశాడని, మంత్రుల సంశయాలు తొలగించాడని చెప్పాడు తప్ప ఇంక ఏమీ అనలేదు. జోనరాజు రాజతరంగిణి లోని శ్లోకంగా పలువురు పండితులు ఆమోదించని ఓ శ్లోకాన్ని ఆధారం చేసుకొని ఐన్-ఇ-అక్బరి, తబాఖాత్-ఇ-అక్బారి, తారీఖ్-ఇ-ఫెరిస్తా వంటి పుస్తకాలు షాహమీర్ పరిపాలనా విధానంపై వ్యాఖ్యానించాయి. ఈ శ్లోకం ప్రకారం దుల్చ దాడి తరువాత షాహమీర్ శాంతిభద్రతలను చేకూర్చాడు. కశ్మీరంలో ఉత్పత్తి అయిన వాటిలో ఆరవ వంతు భాగం పన్నుగా స్వీకరించాడని ఈ ఆమోద యోగ్యం కాని శ్లోకం అనువాదాన్ని ఆధారం చేసుకొని కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ఇండియా, కశ్మీర్ అండర్ సుల్తాన్స్, హిస్టరీ ఆఫ్ కశ్మీర్ వంటి పుస్తకాలు షాహమీర్ పాలనా పద్ధతిని కొనియాడాయి. కానీ ఈ శ్లోకం ఎవరో రాజతరంగిణిలో చొప్పించిన శ్లోకం తప్ప, జోనరాజు రాసిన శైలిలో లేదని భారతీయ పండితులు అభిప్రాయపడతారు. 1887లో ప్రచురితమైన జోనరాజ రాజతరంగిణి జె.సి.దత్ అనువాదంలో ఈ శ్లోకాన్ని ప్రామాణికంగా భావించలేదు. కానీ ప్రస్తుతం చరిత్ర పుస్తకాలన్నీ ఇస్లామీయులు కశ్మీరులో అధికారం చేపట్టి పన్నుల సేకరణలో సంస్కరణలు ఆరంభించారని రాస్తాయి.

షాహమీర్ గానే అధికులు గుర్తించే శంసుద్దీన్ మరణం తరువాత జామ్‍షేర్ రాజ్యాధికారం స్వీకరించాడు. సామంతులను అదుపులో పెట్టి, వారు తన మాట వినేట్టు చేసుకుని, సతీసర ప్రాంతానికి రక్షణను, భద్రతను ఇచ్చాడు. రాజు, అతని సోదరుడు,  అలీషేర్‍, ఇద్దరూ రెండు స్తంభాలలా కశ్మీరు తరఫున నిలిచారు. సోదరుడి తెలివి, శక్తి సుల్తాను మనసులో సోదరుడి పట్ల భయాన్ని, అనుమానాల్ని కలిగించాయి. సుల్తాన్ సోదరుడు సుల్తాన్‍కి ఏ మాత్రం తీసిపోని విధంగా ఎదిగాడు. బహుమతులు ఇవ్వటంలో, బహుమతులు స్వీకరించటంలో, దోషులను శిక్షించటంలో, మంచివారికి సహాయం చేయటంలో, ఐశ్వర్యాన్ని అనుభవించటంలో,   సుఖంలో సోదరుడు సుల్తాన్‍కి ఏ మాత్రం తీసిపోలేదు. దాంతో సుల్తాన్ గతంలోలా తన సోదరుడితో వ్యవహరించటం మానేశాడు. అతడిని అపనమ్మకంగా చూడటం ఆరంభించాడు. గతంలోలా విశ్వాసాన్ని, సాన్నిహిత్యాన్ని ప్రదర్శించలేదు. ఇది జామ్‍షేర్ సోదరుడు అలీషేర్‍కు ఆగ్రహం కలిగించింది. అతని చుట్టూ ఉన్నవారు అగ్నికి ఆజ్యం పోశారు. జామ్‍షేర్‍ను వ్యతిరేకించే వారందరికీ అలీషేర్ కేంద్రం అయ్యాడు. రాజపుత్రులు కూడా అలీషేర్‌ను ఆశ్రయించారు. అతడికి తన మద్దతు తెలిపారు. తనకు ఎదురు లేదన్న ధీమాతో, తన శక్తి పట్ల అమితమైన విశ్వాసంతో రాజపుత్రుల రక్షణను వదిలి అలీషేర్ అవంతి నగరం చేరుకున్నాడు. యుద్ధంలో సుశిక్షి తులైన సైనికులతో సుల్తాన్ ఉత్పలపురం చేరి, అక్కడి నుంచి సోదరుడి ఓ వర్తమానం పంపాడు.

“నీ చుట్టూ చేరి నీ మనసులో విషం నింపుతున్న దుష్టుల మాటలకు ప్రాధాన్యం ఇచ్చే సమయంలో,   సోదరుడిపై కత్తి కడుతున్న నీకు ప్రజల దూషణలు, విమర్శలు వినబడడం లేదా? మనం ఒకరికొకరు రక్షణగా నిలవాలన్న – స్వర్గానికి వెళ్ళిన తండ్రి గారి అభీష్టానికి ఏ మాత్రం విలువ లేదా? ఈ విషయాలు గుర్తు తెచ్చుకో. పరిశీలించు. నాతో చేతులు కలుపు” అన్నది ఆ సందేశం.

అయితే అలీషేర్ చుట్టూ ఉన్నవారు ఆ వార్తాహరుడిని ఏదో ఓ నెపం మీద అడ్డుకుని, అలీషేర్‍ని కలవనీయలేదు. కోట కెళ్ళాడనీ, స్నానం చేస్తున్నాడని, విశ్రమిస్తున్నాడని ఏదో ఓ వంకన జామ్‍షేర్ సందేశం అలీషేర్‍కు అందకుండా చూశారు.

ఎంతకీ వార్తాహరుడు వెనక్కి రాకపోవటంతో మంత్రి లక్ష్మణభట్టు కలవరపడ్డాడు. రాజును సమీపించి, అలీషేర్ తిరుగుబాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాడనీ, ఏదో ఓ నెపం మీద సుల్తాన్ పంపిన సందేశం అలీషేర్‍కు చేరకుండా అడ్డుకుంటున్నారనీ, విప్లవం తప్పదని అన్నాడు. అంతేకాదు, సుల్తాన్ కొడుకును చంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనీ చెప్పాడు. కాబట్టి అలీషేర్ శ్రీదేవసరస చేరగానే రక్షకుడు లేని అవంతిపురపై దాడి చేసి దాన్ని నాశనం చేయాలన్న సలహా ఇచ్చాడు. ఈ సలహాను సుల్తాన్ స్వీకరించాడు.  తన కొడుకును అలీశేర్ పై యుద్ధానికి పంపాడు. అలీశేర్ ఆ యుద్ధంలో మునిగివుండగా  అవంతిపుర చేరుకుని, దాన్ని ముట్టడించాడు. వితస్త నది ప్రవహానికి మృతదేహాలు అడ్డుపడటంతో అతని సైనికులంతా యుద్ధంలో మరణిస్తున్నారన్న వార్తను అల్లీశ్వరుడికి చెప్పేందుకు వితస్త వ్యతిరేక దిశలో ప్రయాణించింది. ఈ సమయంలో అల్లీశ్వరుడు (అలీషేర్‌ను జోనరాజు అల్లీశ్వరుడు అన్నాడు) సోదరుడి కొడుకును యుద్ధంలో ఓడించి వెనక్కు వచ్చాడు. అల్లీశ్వరుడు ససైన్యంగా రావటంతో, యుద్ధంలో అలసి విశ్రాంతి తీసుకుంటున్న జామ్‍షేర్ పారిపోయాడు. రెండు నెలల పాటు యుద్ధ విరమణ పాటించాలని అల్లీశ్వరుడు సుల్తాన్‍తో ఒప్పందం చేసుకున్నాడు. తన సైనికులను, అవంతిపురను వదిలి అల్లీశ్వరుడు ‘క్షిరి’ మార్గంలో ‘ఇక్షికా’కు వెళ్ళాడు.

యుద్ధ విరమణ అవటంతో సంతోషంతో జామ్‌షేర్, రాజధానిని మంత్రి సయ్యరాజుకు అప్పగించి క్రామ రాజ్యానికి వెళ్ళాడు. తనకు సహాయం చేస్తే గొప్ప పదవులిస్తానన్న ఆశ పెట్టి అలీషేర్ సయ్యరాజును తన వైపు తిప్పుకున్నాడు. సుల్తాన్ రాజధానిని వదిలి వెళ్లగానే, అల్లీశ్వరుడు రాజధానిని ఆక్రమించుకున్నాడు. దాంతో జామ్‌షేర్ నామమాత్రపు రాజుగా మిగిలాడు. కొన్నాళ్ళకు మరణించాడు. కశ్మీర రాజుగా ఒక సంవత్సరం పది నెలలు పాలించిన జామ్‍షేర్ నానా కష్టాలు పడ్డాడు. తన అధికారాన్ని నిలుపుకోవాలన్న ప్రయత్నాలు సోదరుడి శక్తిని చూసి కలిగిన న్యూనతాభావం, అసూయల వల్ల దెబ్బ తిన్నాయి.

తన పాలనా కాలంలో జామ్‌షేర్ వితస్తపై సుజ్జపుర వద్ద వంతెన నిర్మించాడు. కానీ తన కష్టాలను దాటే వంతెనను నిర్మించుకోలేకపోయాడు. ప్రయాణీకులకు విశ్రాంతి కోసం భవనాలు కట్టించాడు. నీటి వసతి ఏర్పాటు చేశాడు. ఇంత ఉపయోగకరమైన కార్యం నిర్వహించినందుకు శివస్వామి  రాజు నుంచి ‘ద్వార’పై అధికారాన్ని బహుమతిగా పొందాడు. ఈ రకంగా షాహమీర్ సంతానం ఇద్దరిలో జామ్‌షేర్ సుల్తాన్ అయి, సంవత్సరం పైన పాలించి మరణించాడు. అతని మరో సంతానం అలీషేర్, లేక, అల్లీశ్వరుడు కశ్మీరుపై మూడవ సుల్తాన్ గా రాజ్య భారం  స్వీకరించాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version