Site icon Sanchika

జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-31

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

తస్స వర్ణయతాం శౌర్యై ప్రసంగదవి మానుషమ్।
అస్మాకం చాటుకారిత్వం జ్జాస్యతే భావిభిర్జనైః॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 391)

[dropcap]ఇం[/dropcap]తవరకు ఒక  రాజు గురించి చెప్పగానే అతని కాలం అయిపోయి మరొక కొత్తరాజు సింహాసనాన్ని అధిష్ఠించడం జరుగుతూ వచ్చింది. అంటే జోనరాజుకు  ఏ రాజు గురించి ఎక్కువ  సేపు చెప్పే అవసరం కలగలేదు. కానీ ‘శాహవాదిన’ (శహబుద్దీన్) అధికారానికి రావటంతో జోనరాజుకు ఆ బాధ తప్పింది. ఒక శక్తిమంతుడైన రాజు గురించి చెప్పే అవకాశం దొరికింది. జోనరాజు శహబుద్దీన్‌ను ‘శాహవాదిన’, ‘శిర్లష్తాతక’ అని సంబోధించాడు. ఈ పదం అర్థం ‘పాలు త్రాగే పసిపిల్లవాడు’. బహుశా ఇది సుల్తాన్ ముద్దు పేరయి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ఎందుకంటే పర్షియన్లు జోనరాజు ‘శిర్లష్తాతక’ను ‘శిరషామర్’గా మార్చారు. ‘శహబుద్దీన్’ పాలనను జోనరాజు అతిశయోక్తులతో వర్ణించాడు. ఒళ్ళు పై మరచిపోయి వర్ణించాడు.

శహబుద్దీన్ రాజయిన తరువాత కశ్మీరీ ప్రజలు లలితాదిత్యుడి పాలన నాటి ఐశ్వర్యాన్ని, ఆనందాలను మరచిపోయారట. అంత గొప్పగా ఉందన్నమాట ‘శహబుద్దీన్’ పాలన. దీన్ని ఆధారం చేసుకుని ఆధునిక చరిత్ర రచయితలు శహబుద్దీన్‌ను లలితాదిత్యుడితో పోల్చి – ప్రాచీన కశ్మీరుకు లలితాదిత్యుడు ఎలాగో, ముస్లిం పాలనా కాలానికి శహబుద్దీన్ అలాగ అని తీర్మానించారు. జోనరాజు ఎందుకని శహబుద్దీన్‌ను లలితాదిత్యుడితో పోల్చాడో అని చర్చించే కన్నా ముందు శహబుద్దీన్ పాలన గురించి జోనరాజు చెప్పిన విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది.

ఎలగాయితే అనేక ఋతువులు మారిన తరువాత ఆకాశంలో ఎండాకాలం నాటి శక్తిమంతుడయిన సూర్యుడు రాజ్యం చేస్తాడో, అలాగ, అనేక రాజుల పాలన తరువాత కశ్మీరుకు శక్తిమంతుడైన రాజు శహబుద్దీన్ లభించాడు అంటాడు జోనరాజు. ఎలాగయితే వజ్రాలు పొదిగిన గొలుసులో కేంద్రంలో ఉండే వజ్రం ఇతర అన్ని వజ్రాల కన్నా ప్రాధాన్యం వహిస్తుందో, అలాగ, భూత భవిష్యత్ కాలాలన్నింటిలోకి అత్యుత్తమైన రాజుగా శహబుద్దీన్ నిలుస్తాడంటాడు జోనరాజు. ఎలాగయితే సముద్రం ఎంత నిండుగా ఉన్నా, ఇంకా నదుల నీళ్ళు వచ్చి చేరేందుకు సముద్రం ఉత్సాహపడుతుందో, అలాగే, అడుగడుగునా విజయాలు పొందుతున్నా శహబుద్దీన్ సంతృప్తి చెందక ఇంకా విజయాలు సాధించాలని యుద్ధానికి ఉవ్విళ్ళూరుతున్నాడు. ఒక విజయానికి, మరొక విజయానికి నడుమ ఉన్న కాలం వ్యర్థంగా గడిచిందని బాధపడతాడు శహబుద్దీన్. వయసు మళ్ళిన వాడికి యుక్త వయసులో ఉన్న భార్య ఎంత ప్రీతిపాత్రమో సైన్యంతో కలసి   యుద్ధానికి ప్రయాణమవటం శహబుద్దీన్‌కు అంత ప్రీతి. లేడి కళ్ళున్న యువతులంటే అతనికి మోజు లేదు. చంద్ర వదనలంటే ఇంపు లేదు. మద్యపానం మత్తు అంటే మోజు లేదు. రాజు దృష్టి ఎంత సేపూ సైన్యంతో కలిసి యుద్ధాలకు వెళ్ళటం పైనే ఉంటుంది. ఎండ లేదు, చలి లేదు, రాత్రి లేదు, పగలు లేదు, ఆకలి లేదు, దాహం లేదు.. ఏది కూడా సైన్యంతో యుద్ధానికి వెళ్ళడానికి రాజుకు అడ్డురాదు. దాటలేని నదులను దాటటం, అధిరోహించలేని పర్వతాలను అధిరోహించటం, నడవలేని ఎడారులను దాటి నడవటం రాజుకు ఏ మాత్రం కష్టం అనిపించేది కాదు. తన జైత్రయాత్రలో రాజు ముందుగా ఇంతవరకూ ఏ రాజు కూడా గెలవని ఉత్తర రాజ్యాలపై దాడి చేశాడు. పారశీకులు ఉండే ప్రాంతాలపై దాడులు చేశాడు.

ప్రపంచాన్ని గెలిచే కాముడు వసంతం, మద్యం, మహిళలను తన తోడు తీసుకుని వెళ్లేట్టు శహబుద్దీన్ యుద్ధాలలో తన వెంట చంద్ర, లౌలక, శూరులను వెంట  తీసుకుని వెళ్ళేవాడు. శత్రు అహంకార నాశకుడయిన శహబుద్దీన్ తన సైనికుల శక్తిని ఇనుమడింపజేసేవాడు. శత్రువులను విషాదం పాలు చేసేవాడు. అన్ని దిక్కులను ధూళితో నింపేవాడు. గోవిందఖానుడు రాజ్యం చేసే ఉదభాండపురంలో ముందుగా బాణాలు దూసుకుపోయాయి. ఆ తరువాత శహబుద్దీన్ అడుగుపెట్టాడు. శహబుద్దీన్ సేనలు పర్వత శిఖరం చేరుకోగానే శత్రు సేనలు భయంతో శిఖరం వదిలి పర్వతం దిగిపోయేందుకు పరుగులిడతాయి.

శహబుద్దీన్ శౌర్యానికి తగ్గ బహుమతులు ఇవ్వలేని సింధు రాజు, తన కూతురే రాజుకు తగ్గ బహుమతి అని భావించి తన కూతురుని శహబుద్దీన్‌కు సమర్పించాడు. శహబుద్దీన్ యశస్సు భారాన్ని గాంధారం దేశ బరువు పెంచింది.  అదే సమయానికి శహబుద్దీన్ శత్రువుల గుండెల్లో భయం బరువు వారి గుండెలను దిగజార్చింది.  ‘శింగు’  దేశీయుల అహంకారాన్ని అణచివేశాడు శహబుద్దీన్. కానీ, వారి కత్తులను నాశనం చేయలేదు. శహబుద్దీన్ సేనల సింహనాదం విన్న గజనీవాసులు గర్వం వదిలి భయంతో గజగజాలాడారు. అష్టినగర లోని వేదపండితులు, క్షత్రియులు భయంతో కన్నీళ్ళు పెట్టారు. వారి శౌర్యాగ్ని ఆరిపోవటం వల్ల ఎగసిన పొగ వాళ్ళ కళ్ళ లోకి దూరటం వల్ల వాళ్లు కన్నీళ్ళు పెడుతున్నట్లు అనిపించింది. ‘పురుషవీర’ దేశం ధనాన్ని, ప్రతిష్ఠను సుల్తాన్ దోచిన తరువాత ఆ దేశం పేరు అర్థవిహీనం అయిపోయింది. మరణించిన వారికి తిలోదకాలు వదులుతున్నట్లు, జీవిస్తున్న వారికి పిండాలు ప్రదానం చేస్తున్నట్టు గ్రామాలలో బ్రాహ్మణ స్త్రీలు కన్నీళ్ళు కార్చారు. గుర్రాలకు చికిత్స చేసే నెపం మీద అశ్వదళం ఘోషద్రామ్ నదికి వెళ్ళినప్పుడు ఉదక్పతికి తీవ్రమైన ఓటమిని అందించాడు శహబుద్దీన్.

ఉత్తర ప్రాంతాల జైత్రయాత్ర ముగించుకుని తిరిగి వచ్చిన రాజు, దక్షిణ దిశకు ప్రయాణం ఆరంభించాడు. ప్రయాణాల అలసటను శతద్రు నదీ నీటితో తీర్చుకున్నాడు. ఢిల్లీ పై జయం సాధించి వచ్చి, తన మార్గంలో అడ్డు నిలిచిన ఉదక్పతిని ఓడించాడు. తన వెంట ఉన్న సామంతులకు గుర్రాలను, వస్త్రాలను కానుకలుగా ఇచ్చి వారి వారి దేశాలకు వారిని పంపివేశాడు శహబుద్దీన్. నలుదిశల ప్రయాణమవుతున్నవారు విస్తరిస్తున్న రాజు కీర్తిలా అనిపించారు. ‘సుశర్మపుర’ రాజు, శహబుద్దీన్ వల్ల తనకు ఉన్న ప్రమాదాన్ని గ్రహించి, తన గర్వాన్ని వదిలాడు. పరాజయ రాణిని ఆశ్రయించాడు. భౌట్టులు రాజుకు విధేయత ప్రకటించటంతో రాజు గుర్రాలు పర్వతాలను అధిరోహించలేదు.  సింధునది ఒడ్డు చేరుకున్న రాజుకు నదిని దాటటం కష్టం అనిపించింది. కానీ దేవుడు సింధునది అలల తీవ్రతను తగ్గించాడు. ఈ వింతను పెద్దలు ఇప్పటికీ చెప్తారు.

ఇతర దేశాలను గెలుస్తూ పోవటం వల్ల రాజుకు పరాయి దేశాలు స్వదేశాలయ్యాయి, స్వదేశమైన కశ్మీరం పరాయి దేశమయ్యింది. నలుదిక్కులను జయించిన శహబుద్దీన్ కశ్మీర్ తిరిగి వచ్చాడు. ప్రజల కన్నుల పండుగలా సంబరాలను ప్రకటించాడు.

ఇలా శహబుద్దీన్ గొప్పలను వర్ణిస్తూండటం భవిష్యత్తు తరాలకు అతిశయోక్తులుగా అనిపించవచ్చు. మేమూ రాజును పొగిడి పబ్బం గడుపుకునే వారిలా అనిపించవచ్చు అంటాడు జోనరాజు, శహబుద్దీన్ విజయ విహార పరంపరను వర్ణించిన తరువాత.

జోనరాజు వర్ణించిన శహబుద్దీన్ వీర విహార వివరాలు చరిత్ర పరిశోధకులకు బోలెడంత పని కల్పించాయి. పర్షియన్ రచయితలు, ఇరాన్, తిబ్బెత్తు, అఫ్ఘనిస్తాన్, ఢిల్లీ వంటి ప్రాంతాలలో ఆ కాలం నాటి చరిత్ర రచనలను జోనరాజు రచనతో పోల్చి శహబుద్దీన్ గెలిచిన ప్రాంతాలు ఏమిటి? ఓడించిన రాజులెవరెవరు? జోనరాజు చెప్పిన దాంట్లో నిజాలు ఎంత? కల్పన భాగం ఎంత? ఎన్ని అతిశయోక్తులున్నాయి అన్న అంశాలను విస్తృతంగా పరిశోధించారు.

(ఇంకా ఉంది)

Exit mobile version