Site icon Sanchika

జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-34

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

యాః పూర్వైర్నిరమీయన్త యశః సుకృత్ లబ్ధయే।
అంగీకర్తాసి తా దేవ ప్రతిమా భంగ్తుమంజసా॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 464)

[dropcap]‘లా[/dropcap]సా’ రాజు హృదయంలో స్థానం ఏర్పర్చుకోవటాన్ని జోనరాజు చక్కటి పోలికలతో వర్ణించాడు. సూర్యునికి వ్యతిరేక దిశలోనే నీడ ఏర్పడుతుంది. సూర్యుడు రోజంతా వెలుగు పంచుతాడు. కానీ నీడ చీకటిని తెస్తుంది. సూర్యుడి అందాన్ని దెబ్బ తీస్తుంది. ఈ సందర్భంలో జోనరాజు గమనార్హమైన శ్లోకం రాశాడు.

స్త్రీలకు బుద్ధి పురుషుల కన్నా నాలుగు రెట్లెక్కువ. అలాంటి స్త్రీలు కాపట్యాన్ని ప్రదర్శిస్తే వారిని ఎవరూ ఎదుర్కొనలేరని అంటాడు జోనరాజు. సాధారణంగా పలు నాగరికతల ప్రాచీన రచనలలో స్త్రీని పురుషుడి కన్నా తక్కువ చేసి చూపటం కనిపిస్తుంది. స్త్రీ భౌతికంగానే కాదు, మేధ పరంగా పురుషుడి కన్నా తక్కువ అన్న భావన కనిపిస్తుంది. కానీ భారతీయ ప్రాచీన కావ్యాలలో, రచనలలో స్త్రీకి, ఆమె మేధకి పెద్ద పీట వేయటం కనిపిస్తుంది. ‘సౌందర్య లహరి’ ఆరంభ శ్లోకంలోనే శక్తితో కూడకపోతే శివుడు నిర్వీర్యుడు అన్న భావన కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే, ఆధునిక మేధావులు, సంస్కర్తలు నొక్కి వక్కాణిస్తున్నట్టు భారతదేశ నాగరికతలో స్త్రీ అణచివేత అన్నది ఆరంభం నుంచీ లేదనిపిస్తుంది. ఇది బహుశా కాలక్రమేణా విదేశీ సంపర్కంతో వచ్చి చేరిన మలినమే అనిపిస్తుంది. రాజతరంగిణిలో కూడా అడుగడుగునా మహిళల ఆధిక్యత స్పష్టంగా తెలుస్తూంటుంది.

రాజు లాసా దాసుడవటం అతని అసలు భార్య లక్ష్మికి బాధ కలిగించింది. ఆమె సామాన్య భల్లుడయిన అవతార అనే అతని కూతురు. కానీ ఆత్మాభిమానం అధికంగా కల ఆమె రాజు లాసా దాసుడవటం భరించలేకపోయింది. ఆగ్రహంతో ఆమె సింధు రాజు దగ్గరకు వెళ్ళిపోయింది. ఇది కశ్మీరు రాజుకు అవమానకరంగా అనిపించింది. ఆమెపై ప్రేమ లేకున్నా ఆమెను సగౌరవంగా కశ్మీరానికి తెచ్చాడు. బాధ కలిగినప్పుడు ఏనుగు నీళ్ళను అల్లకల్లోలం చేస్తుంది. నీటిలో ఉన్న పూలను ఊసేస్తుంది. చెట్లను పీకేస్తుంది. అయితే, రాజు లక్ష్మిని మళ్ళీ కశ్మీరానికి రప్పించటం లాసాకి నచ్చలేదు. తన తల్లి సోదరి, తనను చిన్నప్పటి నుంచీ ప్రేమగా పెంచింది అని కూడా చూడకుండా లక్ష్మికి వ్యతిరేకంగా కుట్రలు పన్నింది.

ఒకరోజు రాజు ఆనందంగా ఉన్నప్పుడు, విషనాగులా లాసా మాట్లాడింది – “మీరు నాపై చూపిస్తున్న ప్రేమను సహించలేక లక్ష్మి నన్ను నాశనం చేయాలని కుట్రలు పన్నుతోంది. నాపై గూఢచారులను నియమించింది. నా ప్రతి కదలికను గమనిస్తుంది. నాతో శత్రుత్వం వహిస్తోంది. ఆమెకు ఇష్టుడయిన మంత్రి ఉదయశ్రీ తో కలిసి నాకు వ్యతిరేకంగా దుష్టశక్తులను ప్రయోగిస్తోంది” అంది. కానీ రాజు ఆమె మాటలను విశ్వసించలేదు. ఉదయశ్రీకి దేవుడంటే నమ్మకం లేదనీ, అతడు దైవ వ్యతిరేకి కాబట్టి దుష్టశక్తులను ప్రయోగించే ప్రసక్తే లేదని ఆమె మాటలను కొట్టివేశాడు. లాసా పట్టు వదలలేదు. అవకాశం దొరికినప్పుడల్లా లక్ష్మి, ఉదయశ్రీలు ఇద్దరూ తనకు వ్యతిరేకంగా దుష్టశక్తులను ప్రయోగిస్తున్నారని ఆరోపిస్తూ వచ్చింది. చివరికి విసిగిన రాజు, ఉదయశ్రీకి దైవంపై విశ్వాసం లేదని, అతను దుష్ట ప్రయోగాలను నమ్మడని నిరూపించాలని నిశ్చయించాడు.

ఓ రోజు ఉదయశ్రీని పిలిచి అతడితో – “ఓ ఉదయశ్రీ, ఖజానా ఖాళీ అయిపోయింది. అనవసర వ్యయం ఈ పరిస్థితి కల్పించింది. కానీ ప్రజలు రాజును కల్పవృక్షం అనుకుంటున్నారు. ప్రతి విషయాన్నీ రాజునే అభ్యర్థిస్తున్నారు. ఖజానాని నింపటానికి నాకు ఒక్కటే మార్గం తోస్తోంది. శ్రీ జయేశ్వరుడి ఇత్తడి విగ్రహాన్ని కరగించి, నా పేరుతో నాణేలు వేయిస్తే, మన ఖర్చులకు సరిపడా ధనం వస్తుంది. మనకు మరణం లేని ఖ్యాతి వస్తుంది” అన్నాడు రాజు.

దానికి సమాధానంగా ఉదయశ్రీ, “మీ ఆలోచన గొప్పది. కానీ మీరు చెప్పిన జయేశ్వరుడి విగ్రహం తేలికయినది, అంత బరువైనది కాదు. దాన్నుంచి ఎంత ఇత్తడి వస్తుంది? దీని బదులు బుద్ధుడి విగ్రహాన్ని కరిగిస్తె బోలెడన్ని నాణేలు తయారు చేయవచ్చు” అన్నాడు. బుద్ధుడి విగ్రహాన్ని కరిగించేందుకు సర్వ సన్నాహాలు పూర్తయ్యాయి. దాంతో ఉదయశ్రీకి దైవంపై ఎలాంటి విశ్వాసం, గౌరవం లేవని లాసాకు నమ్మకం కుదిరింది. అప్పుడు రాజు ఉదయశ్రీని పిలిచాడు.

“గత తరాలు విగ్రహాలను ప్రతిష్ఠించి బోలెడంత ప్రతిష్ఠను పొందాయి. పుణ్యం సంపాదించాయి. వాటిని విరగగొట్టాలని నువ్వు ప్రతిపాదిస్తావా? విగ్రహాలు ప్రతిష్ఠించి పేరు సంపాదించారు కొందరు. ఆ విగ్రహాలను పూజించి మరి కొందరు అమరులయ్యారు. ఆ విగ్రహాలను పోషిస్తూ ఇంకొందరు పేరు సంపాదించారు. ఇంకొందరు వాటిని ధ్వంసం చేసి శాశ్వత అపకీర్తి మూట గట్టుకున్నారు. విగ్రహాలను ధ్వంసం చేయటం ఎంత గొప్ప నేరమో తెలుసా? సముద్రాలను, నదులను సృజించి సగరుడు శాశ్వత కీర్తి సంపాదించాడు. సగరుడి సంతానం కోసం భగీరథుడు గంగను భూమిపై ప్రవహింపజేసి కీర్తి పొందాడు. ఇంద్రుడి పై అసూయతో ప్రపంచాన్ని జయించి దుష్మంతుడు పేరు సంపాదించాడు. తన భార్యను అపహరించిన రావణాసురుని సంహరించి రాముడు ఖ్యాతి పొందాడు. శాహవాదినుడు దైవ విగ్రహాలను కొల్లగొట్టాడన్న నిజం, యుముడి పేరు చెప్తే ప్రపంచం వణికినట్టు, భవిష్యత్తు తరాలను వణికిస్తుంది. ఆ అపకీర్తి నాకు వద్దు” అన్నాడు. రాజు మాటలు విన్న ఉదయశ్రీ తల వంచుకున్నాడు. భూమి చీలి తనని మింగేస్తే బాగుండును అనుకున్నాడు.

ఈ సంఘటన చదవగానే శహబుద్దీన్ ఎంత గొప్పవాడు అనిపిస్తుంది! తరచి చూస్తే జోనరాజు శహబుద్దీన్ ఈ మాటల ద్వారా సుల్తానులందరికీ సందేశం ఇస్తున్నాడనిపిస్తుంది. ముఖ్యంగా, పరమత సహనం ప్రదర్శిస్తున్న జైనులాబిదీన్ గొప్పతనాన్ని మరింత విస్పష్టం చేసేందుకు శహబుద్దీన్‌తో జోనరాజు ఈ మాటలు అనిపించాడనిపిస్తుంది.

జోనరాజు రాజతరంగిణి రాసే నాటికి సికందర్ బుత్‌షికన్ కశ్మీరులో అల్లకల్లోలం సృష్టించాడు. ఆయన పేరు ‘బుత్‌షికన్’ లోనే విగ్రహ విధ్వంసకుడు అని స్పష్టంగా ఉంది. సుల్తాన్  ఆశ్రయంలో ఉన్నాడు కాబట్టి జోనరాజు విగ్రహ విధ్వంసాన్ని ఖండించలేడు. అది నీచమైన చర్య అని స్పష్టంగా చెప్పలేడు. ఎందుకంటే, విగ్రహ విధ్వంసం సుల్తానుల మతప్రేమను ప్రదర్శించటంలో ఒక భాగం. కాబట్టి, సుల్తాన్ జైనులాబిదీన్ దయా దాక్షిణ్యాలపై ఆధారపడి జీవిస్తున్న జోనరాజు, విగ్రహ విధ్వంసాన్ని విమర్శించలేడు. అందుకని – కొందరు విగ్రహాలు ప్రతిష్ఠించి పేరు పొందితే, కొందరు పూజించి పేరు పొందుతారు, మరికొందరు వాటిని ధ్వంసం చేసి పేరు సంపాదిస్తారు – అని అనిపించాడు. ఇంత కన్నా స్పష్టంగా విగ్రహ విధ్వంసం ఎంత ఘోరమైన చర్యనో జోనరాజు ప్రకటించలేడు. దీనికి తోడు, ఉదయశ్రీని దైవ వ్యతిరేకిగా చూపిస్తూ, ఏ రకంగా భారతీయులలోనే కొందరు సుల్తానులు చెప్పినట్టు విని తమ ధర్మానికే ద్రోహం చేస్తున్నారో అన్నది భావి తరాల ముందుంచాడు. దైవాన్ని నమ్మకపోవటం వ్యక్తిగతం. కానీ తాను నమ్మడు కాబట్టి, ఇతరులెవరూ నమ్మకూడదని, ఎదుటివారి విశ్వాసాలను హేళన చేయటం ఎంత నీచమో జోనరాజు అతి చక్కగా చూపించాడు. ఉదయశ్రీకి దైవంపై విశ్వాసం లేదు. సుల్తానుకు విగ్రహాలపై విశ్వాసం లేదు. అంటే, ఉదయశ్రీని విమర్శించడం ద్వారా జోనరాజు, పరోక్షంగా విగ్రహ విధ్వంసానికి పాల్పడే సుల్తానులను విమర్శించాడన్న మాట. విగ్రహాలను ధ్వంసం చేసినవాడి పేరు చెప్తేనే భవిష్యత్తు తరాలు యముడి పేరు చెప్తే వణికినట్టు భయంతో వణుకుతాయని అనటం, ఎలాంటి ఖ్యాతి సాధించాలో సుల్తానులు నిశ్చయించుకోవాలని సున్నితంగా సూచించాడు. జోనరాజు అదృష్టం ఏమిటంటే, ఆయన జీవితకాలంలో జైనులాబిదీన్, జోనరాజు సూచనను అనుసరించి విగ్రహాలను తాకలేదు. జైనులాబిదీన్ మందిరాలను నేలమట్టం చేయటం జోనరాజు చూడలేదు. ఒక రచన సమకాలీన సమాజంపై ప్రభావం చూపిస్తూ, భవిష్యత్తు తరాలకు గత చరిత్రను నిక్కచ్చిగా చెప్తూ, హెచ్చరించటం జోనరాజు రాజతరంగిణిలో స్పష్టంగా కనిపిస్తుంది. శహబుద్దీన్ మందిరాలను ధ్వంసం చేసి, విగ్రహాలను కరిగించినా, అతని ద్వారా ఈ మాటలు అనిపించటం జోనరాజుకు  ఒక అవసరం. ఆయన విగ్రహాలను ధ్వంసం చేయటం జోనరాజు రాస్తే, అప్పటికే భారతీయులతో సానుభూతిగా వ్యవహరిస్తూ, కాఫిర్‍లకు మద్దతు నిస్తున్నాడని జైనులాబిదీన్ పై ఒత్తిడి తెస్తున్న మత ఛాందసవాదులకు బలం వస్తుంది. గతంలో సుల్తానులు చేసిన పని జైనులాబిదీన్ ఎందుకు చేయటం లేదని అతడిపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకని కూడా జోనరాజు శహబుద్దీన్ విగ్రహ విధ్వంస కార్యకలాపాలను చెప్పలేదు. నేరం ఉదయశ్రీపై నెట్టివేసి సుల్తాన్ మంచివాడన్నట్టు చూపించాడు. ఇదే పద్ధతిని ‘సికందర్ బుత్‌షికన్’ గురించి రాసేటప్పుడూ జోనరాజు అవలంబించాడు.

పర్షియన్ రచయితలు, బహరిస్తాన్, తారిఖ్-ఇ-అజామ్, తారిఖ్-ఇ-హసన్, తారిఖ్-ఇ-బీర్బల్ ఖమ్ర అనే గ్రంథాలలో శహబుద్దీన్ అనేక హిందూ మందిరాలను ధ్వంసం చేశాడని, హిందువులను తీవ్రంగా హింసించాడనీ ప్రమాణాలతో సహా రాశారు. నిజాముద్దీన్, అబుల్ ఫజల్‍లు రాసిన చరిత్రలో శహబుద్దీన్ దయామయుడని, హిందూ దేవాలయాలను పునరుద్ధరించాడనీ రాశారు. జోనరాజు కూడా శహబుద్దీన్ విగ్రహ విధ్వంసం కేవలం ఉదయశ్రీ దైవ వ్యతిరేకతను నిర్ధారించుకునేందుకు మాత్రమే ప్రతిపాదించాడని రాశాడు. కుథియార్ ప్రాంతంలో జరిపిన తవ్వకాలలో ఒక శిలాఫలకం లభించింది. శారద భాషలో ఆ ఫలకంపై శహబుద్దీన్ మందిరాన్ని పునరుద్ధరించాడని రాసి ఉంది. శిలాఫలకంపై ఆ అక్షరాలను చెక్కింది గణ యక్షుడని, ఇది 12 బైశాకి 4445 సంవత్సరంలో.. అంటే 1369 సంవత్సరంలో చెక్కారని రాసి ఉంది. ఈ శిలాఫలకం ఆధారంగా సుల్తాన్ శహబుద్దీన్ మందిరాలను ధ్వంసం చేయలేదని, ఆయన మందిరాలను పునరుద్ధరించాడని వాదిస్తారు.

భారతదేశ చరిత్రలో ఇలాంటి సందర్భాలు అడుగడుగునా తటస్థపడతాయి. ఒక రాజు చక్కగా పాలిస్తుంటాడు. అంతలో మెదడులో పురుగు కదులుతుంది. దుష్టుడయిపోతాడు. అతను చక్కగా పాలిస్తున్నప్పుడు ఆయన గురించి కవులు ఒక రకంగా రాస్తారు. ఆయన దుష్టుడిగా ప్రవర్తించినప్పుడు రాసేవారు మరొక రకంగా రాస్తారు. దీనిలో ఏది నిజం? ఏది ప్రామాణికం? అన్నది తేల్చి చెప్పటం కష్టం. మౌలికంగా సుల్తానుల పాలన తమ మతానికి చెందిన వారిని సంతృప్తి పరిస్తేనే ప్రశాంతంగా కొనసాగుతుంది. శహబుద్దీన్ పాలన కాలంలో కశ్మీరులో ఇస్లామీయుల సంఖ్య పెరిగే దశలో ఉంది కానీ వారి సంఖ్య అధికం కాదు. కాబట్టి, అధిక సంఖ్యాకులయిన వారికి ఆగ్రహం కలగకుండా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. శహబుద్దీన్ మంత్రులు ఇస్లామేతరులు. అతని భార్య లక్ష్మి. అతని ప్రేయసి లాసా. ఈ కోణం లోంచి చూస్తే, తప్పనిసరి పరిస్థితులలో శహబుద్దీన్‌కు పరమత సహనం చూపించాల్సి వచ్చిందని తెలుస్తుంది. కానీ, తమ మతం వారిని సంతృప్తి పరచాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఇస్లామీయులు అధికంగా ఉన్న ప్రాంతాలలో కొన్ని మందిరాలు ధ్వంసం చేసి ఉండవచ్చు. పర్షియన్ రచయితల దృష్టికి అవి వచ్చి ఉండవచ్చు. పర్షియన్ రచయితల దృష్టిలో ఎన్ని విగ్రహాలు ధ్వంసం చేసి, ఇస్లామేతరులను ఎంతగా హింసిస్తే అంత గొప్ప సుల్తాన్. ఇస్లామేతరులు అధికంగా ఉన్న ప్రాంతాలలో, వారిని సంతృప్తి పరిచేందుకు మందిరాల పునరుద్ధరణ చేసి ఉండవచ్చు. ముఖ్యంగా అతని బార్య, ప్రేయసి ఇద్దరూ హిందువులు అవటం కూడా మందిరోద్ధరణకు ప్రేరేపించి ఉండవచ్చు. కాబట్టి, ఏ సుల్తాన్‌నూ సంపూర్ణంగా  ఉత్తముడని, అధముడనీ తేల్చి చెప్పటం కుదరదు. మొత్తంగా చూస్తే అవకాశం లేక సుల్తాన్ శహబుద్దీన్ పరమత సహనం ప్రదర్శించిన సుల్తాన్‌లా మిగిలి పోయాడనిపిస్తుంది. కానీ సుల్తాన్ శహబుద్దీన్ పరమత సహనం ద్వారా భావి సుల్తాన్‍లకు, భావి తరాలకు సందేశం అందించే అవకాశం జోనరాజుకు లభించింది. దాన్ని ఆయన సంపూర్ణంగా ఉపయోగించుకున్నాడు.

సూర్యుడు ఉదయించినప్పుడు ఆయన తన సంతానానికి, శనితో సహా ఇతర గ్రహాలకు హాని చేస్తాడు. అలాగే లాసా, రాజు కుమారులకు వ్యతిరేకంగా రాజుకు చాడీలు చెప్పడం, ఆమె పై ఉన్న అభిమానంతో రాజు, తన ఇద్దరు కుమారులను వేరే దేశానికి పంపించాడు. తన సంతానాన్ని శత్రువులలా భావించాడు. ఇద్దరు కొడుకులూ యోగినీపురం వెళ్లారు. అక్కడ అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించారు. యోగినీపురం, ఢిల్లీకి దగ్గరలో ఉన్న ఒక నగరంగా చరిత్రకారులు కూడా నిర్ధారించారు.

రాజు తనకు వ్యతిరేకంగా విప్లవం లేవదీసిన హిందుకులను సంహరించాడు. మ్లేచ్ఛులను, శాకంధరనూ అణచివేశాడు. వారిపై జాలి దలచి వారికి నెల నెలా జీతంలా  ధనాన్ని మంజూరు చేశాడు. రాజతరంగిణిలో ‘హిందవ’ అన్న పదం తొలిసారిగా వాడటం కనిపిస్తుందీ సందర్భంలో. రాజు ‘హిందువుల’ను సంహరించాడు అని జోనరాజు రాసిన దాన్ని ఆధారం చేసుకొని పర్షియన్ రచయితలు శహబుద్దీన్ హిందువులను హింసించాడని తీర్మానించారు. ఈ సందర్భంగా గమనార్హమైన మరో విషయం ఏమిటంటే, సుల్తాన్ శహబుద్దీన్ పాలనను హిందువులు మౌనంగా స్వీకరించలేదు. కశ్మీరు ప్రజలు నిర్వీర్యులై, ఎవరు రాజయితే తమకేమిటని అన్నట్టున్నారని, వారిలో పోరాట పటిమ నశించిందని చరిత్ర రచయితలు నమ్మించాలని ఎంత ప్రయత్నించినా అక్కడక్కడా లభించే ఇలాంటి ఆధారాలవల్ల  కశ్మీరు ప్రజలు సుల్తాన్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ వచ్చారని, వారి ఆధిక్యాన్ని ఏ రోజూ మౌనంగా స్వీకరించలేదనీ తెలుస్తుంది.

ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే, ఆ కాలంలో జరిగిన సంఘటనల గురించి లభించే సమాచారం అస్పష్టం. దాంతో ప్రధానమైన విషయాలను ప్రస్తావించుకుంటూ ఇలాంటి విషయాలను వదిలేస్తారు. శాకంధరుడు, మ్లేచ్ఛులనూ కూడా రాజు అణచివేశాడు. కానీ వారికి జీతభత్యాలు జాలిపడి ఇచ్చాడు. శాకంధరుడు అన్నది  ‘షేక్’ అన్న పేరుకు సంస్కృతీకరణంగా భావిస్తారు కొందరు. హిందువులను సంహరించాడు కానీ శాకంధరుడు, మ్లేచ్ఛులకు క్షమాభిక్ష పెట్టాడు సుల్తాన్. దీన్ని బట్టి తన మతానికి చెందినవారు విప్లవం లేవదీస్తే విప్లవాన్ని అణచివేసి వారిని క్షమించాడు, హిందువులను మాత్రం సంహరించాడు అని తెలుస్తుంది. కొందరు చరిత్ర రచయితలు, సుల్తాన్ న్యాయబద్ధమైన పాలన చేశాడు, హిందువులను, ఇస్లామీయులను సమానంగా అణచివేశాడు విప్లవం లేవదీస్తే – అని రాజు సమ దృష్టిని పొగుడుతారు. కానీ విప్లవం లేవదీసిన వారిని అణచివేసి అధికారాన్ని కాపాడుకోవటం రాజు ధర్మం. అక్కడ మతంతో పని లేదు. ఆ తరువాత పట్టుబడిన వారితో ఎలా వ్యవహరిస్తాడన్నది రాజు వ్యక్తిత్వం. హిందువులను సంహరించి, మ్లేచ్ఛులకు క్షమాభిక్ష పెట్టడం గమనార్హం. జోనరాజు ఇస్లామీయులనే మ్లేచ్ఛులనే సంబోధిస్తూండటం గమనార్హం. అంటే, ఇస్లామీయుల దయా దాక్షిణ్యాలపై ఆధారపడి జీవిస్తున్నా, వారి పాలనలో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని జీవిస్తూన్నా  జోనరాజు దృష్టిలో, అంటే, కశ్మీరీయుల దృష్టిలో – పాలకులయినా సరే – ఇస్లామీయులు మ్లేచ్ఛులే అన్న మాట.

(ఇంకా ఉంది)

Exit mobile version