జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-37

2
2

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

యోగినో బ్రహ్మనాథస్య కశ్మీరానాగతస్యః।
ప్రసాదేన మహీపాలః సంతతిః ప్రాప్తవంశ్చిరంత్॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 531)

[dropcap]త[/dropcap]న సోదరుడి కుమారుడు హస్సన్ విచిత్ర ప్రవర్తనను, అహంకారపూరిత ప్రవర్తనను గమనించకుండా కశ్మీర రాజు ఉపేక్షించాడు. తన సోదరుడి కుమారుడిపై ఎలాంటి చర్య తీసుకోవటానికి ఇష్టపడలేదు. అయితే రాజుకు హస్సన్ పట్ల ఆగ్రహం కలుగుతోందని ఉదయశ్రీ గ్రహించాడు. హస్సన్‌ను చిన్నప్పటి నుంచి పెంచిన లోల డామరుడి భార్యను హెచ్చరించాడు.

“సుల్తాన్ శాహవాదనుడి పై అభిమానంతో డామర లోలకుడు తన ప్రాణాలను త్యాగం చేశాడు. తన రాజు పట్ల ఉన్న అభిమానం వల్ల మరో రాజుకు సేవ చేసేందుకు సిద్ధపడలేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న దుష్టబుద్ధి రాజు నుంచి ఎలాంటి ఐశ్వర్యం పొందే వీలు లేదు. కానీ, నువ్వు చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ పెంచిన రాకుమారుడు హస్సన్ ప్రాణాలకు ప్రమాదం ఉంది. కాబట్టి నువ్వు రాజుకు నీ ఐశ్వర్యం అప్పజెప్తానని ప్రలోభపెట్టి నీ ఆంతరంగిక మందిరానికి ఆహ్వానించు. ఐశ్వర్యం పట్ల, మహిళల పొందు పట్ల ఉన్న వ్యామోహం వల్ల రాజు నువ్వు ఆహ్వానించగానే వస్తాడు. అతడు నీ ఇంట్లో అడుగుపెట్టగానే మేము అతడిపై దాడి చేస్తాం. అతడిని చంపేస్తాం.” అని ఆమెను ఒప్పించాడు ఉదయశ్రీ.

తన పథకం లక్ష్మణుడికి చెప్తాడు ఉదయశ్రీ. లక్ష్మకుడు అంగీకారం తెలిపాడు. కానీ హస్సన్ తల్లి లక్ష్మి గతంలో లక్ష్మకుడిని అవమానించింది. ఆ అవమానానికి రగులుతున్న లక్ష్మకుడు పైకి ఉదయశ్రీ పథకానికి ఆమోదం తెలిపాడు. కానీ తిన్నగా రాజు దగ్గరకు వెళ్ళి అతడిని సంహరించేందుకు ఉదయశ్రీ, డామర లోలకుడి భార్యతో కలిసి పన్నిన పన్నాగం సంగతి చెప్పాడు. ఇది విని రాజు క్రుద్ధుడయ్యాడు. తనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్న వారిపై ప్రతిచర్య తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. కానీ సుల్తాన్ భార్య సూదా, ఉదయశ్రీ బాలుడిగా ఉన్నప్పుడు అతడికి స్తన్యం ఇచ్చి పెంచింది. ఆ ప్రేమతో ఉదయశ్రీకి హాని తలపెట్టవద్దని సుల్తాన్‍ను వేడుకొంది. అలాగే, హస్సన్ తండ్రి సుల్తాన్‍గా ఉన్నప్పుడు తమకు చేసిన మంచిని మరిచిపోవద్దని హస్సన్‌ను శిక్షించవద్దని ప్రాధేయపడింది.

తమ పథకం సుల్తాన్‍కు తెలిసిందని గ్రహించగానే ఉదయశ్రీ కశ్మీరు వదిలి పొమ్మని హస్సన్‍కు చెప్తాడు. హస్సన్ కశ్మీరు వదిలి పారిపోయాడు. ఉదయశ్రీ లాంటి వారు అరుదని, చాలా తెలివైన వారని వ్యాఖ్యానిస్తాడు జోనరాజు. తన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని తెలిసి కూడా, తన ప్రభువు కుమారుడి ప్రాణాలు కాపాడటంపైనే దృష్టి పెట్టిన ఉదయశ్రీ లాంటి వారు ప్రశంసాపాత్రులని అంటాడు. రాజు ఉదయశ్రీని క్షమించాడు. శిక్షించలేదు. దాంతో ఉదయశ్రీ తన జీవితాన్ని పంకంలో పద్మంలా గడపటం ప్రారంభించాడు. తన దోషాలను సత్ప్రవర్తనతో మరిపిస్తూ జీవితం గడపసాగాడు ఉదయశ్రీ.

కశ్మీరు వదిలి పారిపోయిన హస్సన్ బుద్దేలా ప్రభువు కూతురుని వివాహమాడేడు. లోహారంలో స్థిరపడ్డాడు. దాంతో కశ్మీరం నుంచి ప్రమాదం ఉందన్న భావన తగ్గిపోయింది. వర్షాకాలంలో విపరీతంగా ఎదిగే వరి పంటలా హస్సన్ అభివృద్ధి చెందసాగాడు. చంద్రకాంత మణి నీటిలో ఉన్నా, చంద్రుడికి ఎంతో దూరంలో ఉన్నా, ఎలాగయితే వెన్నెల కిరణాలు తాకగానే చల్లదనం వెలువరిస్తుందో, అలా, తాను హస్సన్ దగ్గరకు వెళ్తేనే తనకు సార్థకత లభిస్తుందని భావించాడు ఉదయశ్రీ. తన సలహాలతో దూరం నుంచే హస్సన్‍కు లాభం చేయటం ఆరంభించాడు. ఈ విషయం తెలిసిన సుల్తాన్ కోపం పట్టలేకపోయాడు. జైలులో పెట్టాడు. అంతటితో అతడి ఆగ్రహం చల్లారలేదు. అతడి ఉద్దేశం గ్రహించిన దేవతలు ప్రేరేపించినట్టు, అతడు జైలులోనే ఉదయశ్రీని సంహరించాడు. గంధం చెట్టును ధ్వంసం చేసే పెనుగాలి, కలువను నలిపివేసే ఏనుగు, మంచివారిని నాశనం చేసే రాజులు ముల్లోకాలలో నిందార్హులు.

జోనరాజు రాజతరంగిణి పాఠ్యాంతరంలో ఈ సందర్భాన్ని వివరిస్తూ మరో కథ ఉంది. జైలు నుంచి తప్పించుకుని హస్సన్‌ని చేరేందుకు ఉదయశ్రీ రహస్యంగా పథకం వేశాడు. మాధవ పథం ద్వారా కశ్మీరు వదిలి పారిపోవాలని నిశ్చయించుకున్నాడు. మాధవ పథం అన్నది కశ్మీరు నుంచి బుద్దేలా వరకు మాధవ రాజ్యం గుండా ఉన్న దారి. ఈ మార్గం గుండా ప్రయాణించేందుకు మాధవ రాజ్య సైన్యాధికారి గంగరాజు అనుమతిని రహస్యంగా కోరాడు ఉదయశ్రీ. తాను ఉదయశ్రీ తప్పించుకునేందుకు సహాయం చేసినట్టు తెలిస్తే, కశ్మీర రాజు నుంచి తన ప్రాణాలకు ప్రమాదం ఉంటుందని భావించిన గంగరాజు ఈ విషయం కశ్మీర రాజుకు వెల్లడించాడు. దాంతో తాను క్షమాభిక్ష పెట్టినా తనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్న ఉదయశ్రీ పై పట్టరాని కోపంతో కశ్మీర రాజు అతడిని సంహరించాడు. ఉదయశ్రీ మరణంతో కాళ్ళూ, చేతులు కోల్పోయినవాడిలా అయ్యాడు హస్సన్. పిరికివాడయ్యాడు. కశ్మీర రాజు ఇచ్చే బహుమానాలకు ఆశపడి ఖుసా దుష్టులు హస్సన్‍ను సుల్తాన్‍కు అప్పగించారు.

ఇలా శత్రువుల ప్రమాదాన్ని తొలగించుకున్న రాజు తన దృష్టి ప్రజలపై ప్రసరింప చేశాడు. వితస్త నది ఒడ్డున తన పేరుతో ఒక మహానగరాన్ని నిర్మించాడు. ఆ నగరంలోని భవనాలపై నిలిపిన బంగారు ఛత్రాలు ఆకాశాన్ని వెక్కిరిస్తున్నట్టున్నాయి. కరువు కాటకాల వల్ల ప్రతి సంవత్సరం ప్రజలు ప్రాణాలు కోల్పోవటాన్ని గమనించిన రాజు భాద్రపద మాసంలో ఒక యజ్ఞం చేశాడు. భూరి విరాళాలిచ్చాడు.

ఈ శ్లోకం చదవగానే వెంటనే కాసేపు ఆగాలనిపిస్తుంది. కశ్మీర రాజు సుల్తాను. మహ్మదీయుడు. అతని భార్యలు భారతీయ వనితలు. అతని మంత్రులు భారతీయులు. అతను పాటిస్తున్న పద్ధతులు భారతీయం. ఆ కాలంలో ఇస్లామీయుల సంఖ్య అంత అధికంగా లేకపోవటం వల్ల, ఇస్లామీయులు ఇస్లామేతరులతో తప్పనిసరిగా సహజీవనం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయానికి సుల్తాన్, ప్రజల సంరక్షణ కోసం, కరువు కాటకాలను తొలగించే వర్షాల కోసం, వర్షాకాలంలో యజ్ఞం చేయటం బలం ఇస్తుంది. యజ్ఞం చేయటమే కాదు, భూరి దానాలు చేశాడనీ రాశాడు జోనరాజు. ఈ దానాలు సాధారణంగా బ్రాహ్మణులకు చేస్తారు. యజ్ఞంలోను బ్రాహ్మణులు పాల్గొంటారు. ఇది గమనార్హం. దోపిడీదారులుగా, విజేతలుగా కశ్మీరులో అడుగుపెట్టకపోవడం వల్ల ఇంకా ఆధిక్య భావన, మత సంకుచిత భావనలు తీవ్రంగా ప్రదర్శించని  కశ్మీరీ ఇస్లామీయులను తనలో కలిపివేసుకోగల భారతీయ ధర్మం గొప్పతనం స్పష్టం అవుతుంది. రాజును గంధర్వుడితో పోల్చటం, భారతీయ పురాణ పురుషుల ఉపమానాలు వాడటం ద్వారా, వారి పాలనకు ప్రామాణికత కల్పిస్తూ వారిని తమలో ఒకడిగా కలిపివేసుకునే ‘ప్రతిచర్య’కు తిరుగులేని నిదర్శనాలు కశ్మీరులో సుల్తానుల పాలన ఆరంభయిన తొలిదినాలలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, తమ ప్రత్యేకతను నిలుపుకుంటూ, నీళ్ళల్లో కలిసే పాల లాంటి వారు కాదు తాము,   నీటితో ఎన్నటికీ కలవని ‘నూనె’ లాంటి వారం తామని ఇస్లామీయులు నిరూపించుకోవటం జోనరాజు తన రాజతరంగిణిలో ప్రదర్శించలేదు. ఈ విషయం తెలుసుకోవటానికి జోనరాజు రాజతరంగిణి కాక ఇతర పర్షియన్ల రచనలు, ఆ కాలంలో ఇరాన్ లోనూ, తజికిస్థాన్‍తో సహా పలు ‘సూఫీ’ల ఆధిక్యం కల ప్రాంతాలలోని చరిత్ర రచనలనుంచి    తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం జోనరాజు రాజతరంగిణి లోని విషయాలను చర్చిస్తూ, వీలును బట్టి, రాజతరంగిణేతర ఆధారాలను తెలుసుకోవాల్సి ఉంటుంది.

ఆయూర్ వాయు చలద్వీచి చంచలమ్ కాలయున్నాథ్।
సర్పాగ్రహరణి నిశ్వాణమ్ అవరోత పుత్రలిప్స్యయా॥

ఇది ఇటీవలి కాలంలో లభించిన జోనరాజు రాజతరంగిణి పాఠ్యాంతర ప్రతి లోని 640వ శ్లోకం. ఈ శ్లోకం ప్రకారం పుత్ర సంతానం లేని కశ్మీర రాజు పుత్ర సంతానం కోసం తపిస్తూ, ఈ జీవితాన్ని పవన తాడన వల్ల జీవించే ఉత్తుంగ తరంగాల లాంటి చంచలమైనది భావిస్తూ, పుత్ర సంతానార్థి అయి, భూములు దానాలు చేశాడు. అనేక గ్రామాల పన్నును నిషేధించాడు.

ఇక్కడ మరో విషయన్ని మనం ఊహించవచ్చు. రాజుకు సంతానం లేదు. తన సోదరుడి సంతానం రాజ్యం కబళించేందుకు పొంచి ఉంది. ఇది ఏ రాజుకయినా దుర్భరమైన స్థితి. అందుకోసం తన తరువాత రాజ్యాధికారం పొందే వారసుడి కోసం రాజు తపించడం సహజమే. ఈ తపన మానసికంగా రాజును బలహీనం చేస్తుంది. అప్పటికే కరువు కాటకాల నివారణ కోసం రాజు యజ్ఞం చేశాడు. యజ్ఞం వల్ల వర్షాలు పడ్డాయో లేదో జోనరాజు చెప్పలేదు. కానీ, తరువాత కరువు కాటకాల ప్రసక్తి లేకపోవటం, రాజు సంతానం కోసం తపించటం వల్ల యజ్ఞం తరువాత వర్షాలు పడ్డాయని, రాజుకు కశ్మీరు ప్రాచీన పద్ధతుల పట్ల విశ్వాసం కుదిరిందనీ భావించవచ్చు.  అందుకే సంతానం కోరిన రాజు భూములు దానాలు చేయటం, గ్రామాలపై పన్నులపై పన్నును తొలగించటం వంటి చర్యలు చేపట్టాడు. నిజానికి గ్రామాలు అనటం తప్పు. జోనరాజు ‘అగ్రహారాలు’ అన్న పదం వాడేడు. అగ్రహారం బ్రాహ్మణులకు చెందినది. కాబట్టి రాజు బ్రాహ్మణుల గ్రామాలపై పన్ను తొలగించాడని అర్థం. ఇది సుల్తాన్‍కు బ్రాహ్మణులపై విశ్వాసం కుదిరిందని, నెమ్మదిగా అతడు తన మతం అయిన ఇస్లాం పద్ధతుల కన్నా భారతీయ పద్ధతులను విశ్వసించటం ఆరభించాడని భావించవచ్చు. ఈ భావనను మరింత బలపరుస్తుంది తరువాతి శ్లోకం. రాజు చేసిన సత్కర్మల ఫలితంగా చివరికి బ్రహ్మనాథుడనే యోగి కశ్మీరుకు వచ్చాడు. అతడి పేరును బట్టి అతడు స్వామి గోరఖ్‍నాథ్ స్థాపించిన ‘నాథ్’ సంప్రదాయానికి చెందిన వాడని తెలుస్తోంది [ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్య నాథ్ కూడా ‘నాథ్’ సంప్రదాయానికి చెందినవాడే].

‘నాథ్’ సంప్రదాయం ప్రధానంగా శివుడిని నాథుడిగా, దైవంగా భావించే సంప్రదాయం. ప్రాచీన ‘సిద్ధ’ సంప్రదాయం ఆధారంగా ఎదిగిన సంప్రదాయం ఇది. మధ్య యుగంలో భారతదేశంలో మహ్మదీయుల ప్రాబల్యం అధికమై భారతీయ ధర్మం ప్రమాదంలో పడిన సందర్భంలో, భారతీయ ధర్మం పరిరక్షణకు, దేశంలో నలుమూలలా స్వచ్ఛందంగా ఉద్భవించిన పలు విభిన్నమైన ప్రతిక్రియలలో ఒక ప్రతిక్రియగా స్వామి మత్స్యేంద్రనాథ్ ‘నాథ్’ సంప్రదాయానికి రూపాన్నిచ్చాడు. ఆ తరువాత స్వామి గోరక్షనాథ్, (గోరఖ్‍నాథ్‍గా ప్రసిద్ధుడు) ‘నాథ్’ సంప్రదాయాన్ని స్థిరపరిచాడు. నాథ్ సంప్రదాయంలో సర్వం త్యజించిన సన్యాసులుంటారు. కుటుంబ వ్యవస్థలో ఉంటూ ధర్మ రక్షణ కోసం సర్వం త్యజించేందుకు సిద్ధంగా ఉండే గృహస్థులూ ఉంటారు. ‘నాథ్’ సన్యాసులు దేశమంతా తిరుగుతూ తమ సంప్రదాయాన్ని బోధించటంతో పాటుగా, సంతానలేమితో బాధపడేవారిని ఆశీర్వదించి సంతానం ప్రాప్తింపచేస్తారు. అలాంటి నాథ్ సంప్రదాయానికి చెందినవాడు కశ్మీరుకు వచ్చిన బ్రహ్మనాథుడు. ఈయన కశ్మీరు రాజును ఆశీర్వదించాడు. ఫలితంగా కశ్మీర రాజుకు సంతానం కలిగింది.

ఇవన్నీ చూస్తుంటే, పరిస్థితులు ఇలాగే కనుక కొనసాగి ఉంటే, కాలక్రమేణా కశ్మీరులో మళ్ళీ భారతీయ సంప్రదాయం ఆధిక్యం సాధించి ఉండేదనిపిస్తుంది. ఎందుకంటే, కశ్మీర సుల్తాన్ మరణం తరువాత సింహాసనం కోసం జరిగిన పోరులో భారతీయ ధర్మానుయాయులు కీలకమైన పాత్ర పోషించారు. ఇది, చరిత్ర రచయితలు, భారతీయులు ఇస్లాం పాలనను ఎలాంటి ప్రతిఘటన లేకుండా తలవంచి స్వీకరించారని చేసిన తీర్మానాలన్నీ దురుద్దేశపూర్వకంగా జరిపిన పొరపాట్లని స్పష్టం చేస్తుంది. ఇదంతా భవిష్యత్తులో.

ప్రస్తుతం యోగి బ్రహ్మనాథుడి అనుగ్రహం వల్ల కశ్మీర రాజుకు సంతానం కలిగింది. బాలుడు జన్మించాడు. రాజు ఆనందానికి అంతు లేదు. రాజు కళ్ళకు తన కొడుకు మన్మథుడిలా కన్పించాడు. అందుకని తన సంతానానికి ‘శృంగార’ అని పేరు పెట్టుకున్నాడు.

శృంగార మంగళ వాసమవలోక్య వపుః శిరోః।
శృంగార ఇతి నామాస్య వ్యథాద్ భూలోక వాసవః॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 433)

కొందరు విదేశీ వ్యాఖ్యాతలకు ఈ ‘శృంగార’ పదం అర్థం కాలేదు. తన శిశువుకు ‘శృంగార’ (శృంగం అంటే కొమ్ము  అని అర్థం ఉంది), ‘కొమ్ములు ఉన్నవాడు’ అని పేరు పెట్టాడని అనువదించారు. సంస్కృతంతో పరిచయం లేని అవిద్యావంతులు, నిరక్షరాస్యులు కూడా ‘శృంగార మంగళ వాసమవలోక్య’ అంటే ‘కొమ్ములతో మంగళరూపంలో ఉన్నవాడు’ అనుకోరు. కానీ పాశ్చాత్య పండితులు, పాశ్చాత్య పండితుల అనువాదాలను ప్రామాణికంగా భావించేవారు మాత్రం కొమ్ములనే అనుకుంటారు. తమ కొమ్ములను పెంచుకుంటారు. వాటితో సామాన్య జనాన్ని బెదిరించి నమ్మిస్తారు. రాజుకు సంతానం కలిగిన తరువాత జరిగిన సంబరాల సందర్భంగా జైళ్లలో మ్రగ్గుతున్న వారందరినీ రాజు విడుదల చేశాడు.

ఇంతలో రాణి మరో కొడుకుకు జన్మనిచ్చింది. అతడి పేరు హైబతుడు. ఇది ముస్లిం పేరు హైబత్. ‘హైబత్’ అంటే కష్టాలు, భయంకరం అన్న అర్థాలతో పాటు తీవ్రమైన ప్రతాపం కలవాడు అన్న అర్థం కూడా ఉంది. ‘హైబత్ ఖాన్’లు చరిత్రలో ఎంతో మంది ఉన్నారు. నాథ్ యోగి వల్ల జన్మించిన సంతానానికి ‘శృంగార’ అని పేరు పెట్టడం, రెండవ సంతానానికి ‘హైబత్’ అని పేరు పెట్టటం గమనార్హం. దీనికి కారణం, మొదటి సంతానం, రెండవ సంతానం కలగటానికి నడుమ కశ్మీరులో ధార్మికంగా, సామాజికంగా కలిగిన మార్పులు. వారి రెండవ సంతానం ఎంత అందగాడంటే, చంద్రుడిని కూడా వెక్కిరించేంత అందం! అయితే, సంతానం కలిగిన తరువాత ఎక్కువ కాలం రాజు బ్రతకలేదు. అప్పటికే కణతల వద్ద అతని జుట్టు తెల్లబడిందని, అతను ముసలివాడయి పోయాడని వర్ణించాడు జోనరాజు. భాద్రపద మాసం, కృష్ణపక్షంలో రాజాధిరాజు కుంభాదీనుడు మరణించాడు. 16 ఏళ్లు కశ్మీరుపై రాజ్యం చేసిన తరువాత ఖుతుబ్-ఉద్-దీన్ క్రీ.శ.1389వ సంవత్సరంలో మరణించాడు. రాజు మరణించే నాటికి అతని సంతానం ఇంకా చిన్నపిల్లలు. దాంతో సింహాసనం ఎవరికి దక్కుతుందోనని ప్రజలు భయపడ్డారు. రాజు లేని కశ్మీరం భయంతో వణికిపోయింది. భర్తను కోల్పోయిన రాణి, ఇద్దరు చిన్నపిల్లలతో తీవ్రంగా దుఃఖిస్తు కన్నీళ్లు కార్చింది. ఆమె కన్నీళ్లు వర్షాకాలంలో వర్షాలలా తోచాయి. మంత్రులు ఆ వర్షపు నీటిలో చేపల్లా అనిపించారు. ఈ సమయంలో ఉద్దక్, సాహక్  అనే వారిద్దరూ, రాణిని ఓదార్చారు. వీరిలో ఉద్దకుడు రాణికి తల్లి వైపు బంధువు. రాజ్యంలో కోశాధికారి. వీరు రాణికి ధైర్యం చెప్పి, రాజు ‘శృంగార’ అని పేరు పెట్టిన తొలి సంతానాన్ని  సికందర్‍ అన్న పేరుతో  సింహాసనంపై కూర్చుండబెట్టారు. రాజు లేని కశ్మీరుపై దుష్టులు కన్నేస్తారని, రాజు ఆవశ్యకత కశ్మీరానికి ఉందని రాణిని ఒప్పించారు. ఈ సికందర్ భవిష్యత్తులో సికందర్ బుత్‍షికన్‍గా, అంటే, విహ్రహాలను ధ్వంసం చేసేవాడిగా  పేరుపొందాడు. కశ్మీరును సంపూర్ణంగా ఇస్లాం మయం చేశాడు.

భారతీయధర్మాన్ని  నమ్ముతూ నెమ్మదిగా భారతీయ ధర్మంవైపు మొగ్గు చూపుతున్న ఇస్లామీయులు, సుల్తానులు సంపూర్ణంగా చాందస ఇస్లామీయులుగా రూపాంతరం చెంది, కశ్మీరులో మందిరాలను ధ్వంసం చేసి, వాటి స్థానే మసీదులను నిలిపేందుకు, కశ్మీరులో వున్న భారతీయ ధర్మానుయాయులను, బౌధ్ధులను మతం మార్చి, లేక, సంహరించి, నామరూపాల్లేకుండా చేసేందుకు ఇస్లామీయులలో సంకుచిత భావనలను ధార్మిక భావనల రూపంలో ప్రచారం చేసి, కశ్మీరును ఇస్లామ్ సామ్రాజ్యంగా  రూపాంతరం చెందించి, కశ్మీరు సామాజిక, ఆర్ధిక, ధార్మిక సంస్కృతి, సంప్రదాయాలను సమూలంగా నిర్మూలించి, మానసిక వ్యవస్థను అస్తవ్యస్థం చేసిన  సూఫీలు  హమదానిల గురించి తెలుసుకోవాల్సి వుంటుంది.

కాస్సేపు జోనరాజుకు విరామమిచ్చి ఆ సమయానికి చెందిన ఇతర గ్రంథాలను పరామర్శించాల్సివుంటుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here