జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-39

1
2

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

మరుద్భిరివ వృక్షాణాం శాలీనాం శలభైరివ।
కశ్మీరదేశాచారణాం ధ్వంసోధ యవనౌః కృతః॥

స్వామినో దానమానాఛ్ఛాం వైశద్యగుణ వత్తయా।
కశ్మీరాన్ విశాన్ మ్లేఛ్ఛాః సుక్షేత్రం శలభా  ఇవ॥

(జోనరాజతరంగిణి 575, 756)

[dropcap]ఇ[/dropcap]లాంటి శ్లోకాలు రాయాలంటే మామూలుగా అంత ధైర్య సాహసాలు అవసరం లేదు. కానీ సుల్తానుల నీడలో ఉంటూ, కశ్మీరులో పెరుగుతున్న సంకుచిత మత ఛాందసవాదాన్ని అనుభవిస్తూ, ఆ మత ఛాందసవాదం హద్దులు దాటితే ఎలాంటి దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలిసి కూడా ఇలాంటి శ్లోకం రాసేవాడు మూర్ఖుడయినా అయి ఉండాలి, మరణ కాంక్ష అధికంగా కలవాడయినా అయి ఉండాలి, లేక తనపై తనకు విశ్వాసం కలవాడయి ఉండాలి. సుల్తాన్‌‌కు తనపై నమ్మకం ఉందన్న విశ్వాసంతో, సుల్తాన్ తనకు హాని తలపెట్టడన్న ధీమా అయినా ఉండాలి. రాజతరంగిణి రచనలో జోనరాజు పద్ధతిని విశ్లేషిస్తే చివరి రెండు కారణాలు నిజమైనవి అనిపిస్తాయి. రాజుకు తనపై అచంచల విశ్వాసం, గౌరవాలు ఉన్నాయన్న నమ్మకంతో పాటూ, రాజు మనస్సును గ్రహించి అందుకు తగ్గట్టు రాజు తన మాట వినేట్టు చేసుకోగలనన్న ఆత్మవిశ్వాసాలు జోనరాజు రాజతరంగిణి రచనలో కనిపిస్తాయి.

పిల్లలకు బురదపై ఆసక్తి ఉండేటట్టు రాజుకు యవనుల పట్ల ఆసక్తి పెరిగిందని వ్యాఖ్యానించిన తరువాత జోనరాజు కొన్ని శ్లోకాలు రాశాడు. వాటిల్లో కొన్ని ప్రధానమైన విషయాలను ప్రస్తావించాడు. ఒక పద్ధతి ప్రకారం కశ్మీరులో మారుతున్న ఇస్లామీయుల సంఖ్యను గురించి ప్రస్తావించాడు, నర్మగర్భితంగా! భావి తరాలకు కశ్మీరులో సంభవిస్తున్న, మార్చలేని పరిణామాల స్వరూపాన్ని అతి సున్నితంగా ప్రదర్శించాడు. కశ్మీరులో భారతీయుల సంఖ్య క్రమంగా తగ్గిపోతూ, ఇస్లామీయులు సంఖ్యాపరంగా ఆధిక్యం సాధించేందుకు దారితీసిన పరిస్థితులను అతిచక్కగా చూపించాడు. భవిష్యత్తులో, అనేకులు కశ్మీరులో మత మార్పిళ్ళ గురించి, ఇస్లామీయుల ఆధిక్యం గురించి ప్రచారం చేసే కట్టుకథలు ఒట్టి కథలని నిరూపించే అవకాశాన్ని భావితరాలకు కలిగించాడు జోనారాజు.

తేనెటీగలు పుష్పాలను వదలి ఏనుగులపై స్థిరపడ్డట్టు, పలు యవనులు ఇతర రాజులను వదలి కశ్మీరం వచ్చి చేరారు. సుల్తాన్ సికిందర్ దానగుణం దేశ విదేశాలలో వ్యాపించటం వల్ల వీరు ఇతర రాజ్యాలు వదలి కశ్మీరం వచ్చి చేరటం ఆరంభించారు. ఇలా కశ్మీరం వచ్చి చేరిన వారిలో ‘మేర’ దేశానికి చెందిన మహమ్మద్ ఒకడు. అతడు పిల్లవాడయినా, అపారమైన విజ్ఞానాన్ని గ్రహించాడు. దాంతో యవనులందరిలోకి ప్రముఖుడయ్యాడు. వారికి నాయకుడు అయ్యాడు. రాజు అతడి దర్శనం కోసం ఎదురుచూసేవాడు. సేవకుడిలా సేవలు చేసేవాడు. మహమ్మద్ శిష్యుడై అతడి దగ్గర పాఠాలు నేర్చుకునేవాడు. ఒక బానిసలా అతడు చెప్పిన ప్రతి పనీ చేసేవాడు. సుడిగాలి చెట్లను నాశనం చేసినట్టు, పంటను మిడుతల దండు నాశనం చేసినట్టు, యవనులు కాశ్మీరపు ఆచార వ్యవహారాలను సంపూర్ణంగా నాశనం చేశారు.

రాజు ఇచ్చే దానాలు, బహుమతులు, చేసే సన్మానాల పట్ల ఆకర్షితులై బాగా పండిన పంట పొలాల్లోకి మిడుతల దండులు ప్రవేశించినట్టు మ్లేచ్ఛులు కశ్మీరంలోకి అడుగుపెట్టారు.

ఎంత గుండె ధైర్యం ఉండాలి! ఎంత విశ్వాసం ఉండాలి! సుల్తానుల పాలనకాలంలో నిజం చెప్పాలన్నా  ధైర్యం అవసరం. వారికి నచ్చని నిజం చెప్తే మేడమీద తలకాయ మిగలదు. అయినా సరే, జోనరాజు, ఈ రెండు మూడు శ్లోకాలలో చేదు నిజాలను నిర్భయంగా, నిక్కచ్చిగా చెప్పాడు.

బాల్యంలో బురదంటే మక్కువ కల రాజు, ఎదిగిన తరువాత యవనులపై మక్కువ చూపాడు. అంటే యవనులను, బురదతో పోలుస్తున్నాడు. రాజు దానధర్మాల పట్ల, ఆదరణ పట్ల ఆకర్షితులై యవనులు పెద్ద సంఖ్యలో కశ్మీరు రావటం ఆరంభమయింది. గాలి చెట్లను పెళ్ళగించినట్టు, మిడుతలు పంటలను సమూలంగా నాశనం చేసినట్టు, యవనులు కశ్మీరం ఆచార వ్యవహారాలను ధ్వంసం చేశారు. ‘కశ్మీరదేశాచారాణాల ధ్వంసోథ యువనైః కృతః’. అంతేకాదు, మిడుతలు ఏపుగా పెరిగిన పంటపొలాల్లో ప్రవేశించినట్ , మ్లేచ్ఛులు కశ్మీరంలో ప్రవేశించారనటానికి సామాన్యమైన ధైర్యం సరిపోదు.

The period which followed the  Punch victory and the execution of Prince Hasan khan and his accomplice for treason is one of the most memorable periods in the history of Kashmir. It coincided with the arrival of Saiyid Ali Hamadani’ (muslim rule in kashmir by k. parma)

‘The  immediate result  of these  successes  was a heavy influx  of sayyid theologians into kashmir from persia from where they were being driven  out  due to political reasons , by the persecution of  Timur. Sikandar  treated then well and gave then land and jagirs to settle on by Sayyid Ali Hamadani’s  son,  Sayyid Muhammad Hamadani entered  kasmir accompanied by 700  sayyids by coming in contact  with these orthodox Sunnis ,  the king was fired with religions zeal and he resolved to run the state on purely islamic law and  propagate  the faith by force.’

(cultural and political history & kashmir vol -2 by PNR .Bamzai)

భారతదేశ చరిత్ర   రచనలో ఎవరయినా  ప్రధానంగా ఎదుర్కొనే సమస్య ఇది. సాధారణంగా చరిత్ర రాసేప్పుడు అందుబాటులో ఉన్న విశ్వసనీయ ఆధారాలను పరిశీలించి, వాటి ద్వారా గ్రహించిన విషయాలను ఇతర లభ్యమవుతున్న ఆధారాలతో పోల్చి నిగ్గుతేల్చి ‘ఇది సత్యం’,  ‘ఇలా జరిగి ఉంటుంది’ అని తీర్మానిస్తారు. ఇందుకు విరుద్ధమైన ఆధారాలు లభ్యమయ్యేంతవరకు ఇదే చరిత్రగా కొనసాగుతుంది. ఇతర   దేశాల  చరిత్ర రచన విషయంలో సమస్య రాదు కానీ, భారతదేశ చరిత్ర విషయంలో అందుబాటులో ఉన్న ఆధారాలను ప్రామాణికంగా పరిగణించటం దగ్గర నుంచి సమస్య వస్తుంది. చరిత్రను నిర్ధారించే వారి దృష్టి, విశ్లేషించే వారి వ్యక్తిగత  అభిప్రాయాల నుంచి ప్రతీదీ చరిత్రలో సత్యాన్ని నిర్ధారించటం పై ప్రభావం చూపిస్తుంది. ఈ విషయానికి చక్కటి నిరూపణ జోనరాజ రాజతరంగిణి ఆధారంగా సేకరించి, విశ్లేషించి, నిర్థారించి అందిస్తున్న సత్యాలు.

కల్హణుడి రాజతరంగిణిలోని  విషయాన్ని అర్థం చేసుకుని సత్యాలను ఆవిష్కరించే విషయంలో రాని సమస్య  జోనరాజ రాజతరంగిణిని అవగాహన చేసుకుని, సత్యాలను గ్రహించటంలో వస్తుంది. కల్హణుడి రాజతరంగిణిని అర్థం చేసుకోవటంలో విదేశీయులకు ‘అహం’ ప్రధాన పాత్ర వహించింది. భారతీయులు,  అంటే,  పాలితులు, తమకన్నా, అంటే,  పాలకుల కన్నా  గొప్పవారన్న విషయాన్ని అంగీకరించేందుకు యూరోపియన్లు సిద్ధంగా లేరు. అనాగరికులు, అవిద్యావంతులు, బలహీనులు, దుర్బలులు అయిన భారతీయుల కంటే తాము అధికులము అన్న భావన ఉంటే కానీ యూరోపియన్లు అధికారం చలాయించలేరు. తాను ఉద్ధరించాలనుకుంటున్న వాడు తనకంటే అధికుడు అయితే, తాను ఉద్ధరించటం అటుంచి, తానే ఉద్ధరింపుకు గురవుతాడు. కాబట్టి కల్హణ రాజతరంగిణిలో అభూతకల్పనలు, అసంబద్ధాలు, అతిశయోక్తులు, అద్భుతాలు చోటు చేసుకున్నాయని తీర్మానించారు. అయినాసరే ఎన్నో తప్పులు ఉన్నా సరే, కాస్త చరిత్ర ఉందని ప్రకటించి, తేదీలను సవరించి రాజతరంగిణిని చరిత్రగా ఆమోదించారు.

జోనరాజు విషయంలో సమస్య స్వరూపం వేరు. కల్హణ రాజతరంగిణి విషయం పాలకులు, పాలితులు, యూరోపియన్లు, భారతీయుల సమస్య మాత్రమే. జోనరాజు కాలం వచ్చేసరికి యూరోపియన్లకు, పర్షియన్లు, ఇస్లామీయులు తోడయ్యారు. భారతదేశంలో హిందూ, ముస్లిం మతాల నడుమ ఉద్విగ్నతలు హెచ్చయ్యాయి. దాంతో జోనరాజు రాజతరంగిణిని విశ్లేషించి దానిలోని చారిత్రక సత్యాలను విమర్శించే దృష్టి మారిపోయింది.  ‘సికిందర్’ గురించి జోనరాజు రాసిన నాలుగు శ్లోకాలను విశ్లేషించి, వివరించటం లోని  సత్యం స్వరూపం  చూసే వారి దృష్టిని బట్టి  మారుతుంది.

సికిందర్ యవనులను చేరదీశాడని, ఆయన ఇచ్చే కానుకలు చేసే ఆదరణ వల్ల యవనులు పెద్ద సంఖ్యలో తమ రాజ్యాలు వదలి కశ్మీరం వచ్చి చేరారని, వారు కశ్మీరం ఆచార వ్యవహారాలను నాశనం చేశారని, వారిని  మిడుతల దండులతో పోల్చాడు జోనరాజు. అంతేకాదు అలా వచ్చిన ఓ యువకుడు మహమ్మదాకు  బానిసలా, సేవకుడిలా వ్యవహరించాడు రాజు అని రాశాడు జోనరాజు. జోనరాజు దృష్టి భారతీయుల దృష్టి, జోనరాజు దృష్టి స్థానిక కశ్మీరీయుల దృష్టి. జోనరాజు దృష్టిలో యవనులు (అరబ్బులు), మ్లేచ్ఛులు (పర్షియన్లు) మిడుతల దండులు, కశ్మీరు ఆచార వ్యవహారాలను నాశనం చేసినవారు. 

ఇక్కడ మనం, ప్రస్తుతం  సమాజంలో నెలకొని ఉన్న ఒక అపోహను ప్రస్తావించుకోవాలి. ప్రస్తుతం అనేకులు అరబ్బులు, పర్షియన్‍లను సమానార్థకమైన పదాలుగా వాడుతున్నారు. ఇది పొరపాటు. జోనరాజు రాజతరంగిణిలో ఈ తేడాను స్పష్టంగా చూపించాడు. అరబ్బులను యవనులు అన్నాడు. పర్షియన్లను మ్లేచ్ఛులు అన్నాడు. పర్షియన్లు అధికంగా ఇరాన్‍లో ఉంటారు. వీరు మాట్లాడేది పర్షియన్ భాష. పర్షియన్ భాషకు గ్రీకు, లాటిన్ భాషలకు దగ్గర సంబంధం ఉంది. ఆ పర్షియన్ భాషను ‘ఇండో – యూరోపియన్’ భాషగా పరిగణిస్తారు. భారతీయ వాఙ్మయంలో గ్రీకులను యవనులు అనటం ఉంది. బహుశా పర్షియన్ భాషలో గ్రీకు, లాటిన్ భాషల సామ్యం చూసిన జోనరాజు పర్షియన్ లను ‘యవనులు’ అన్నట్టున్నాడు.

అరబ్బు భాషను ‘ఆఫ్రో  ఏషియాటిక్ భాష’గా భావిస్తారు. అందుకని వీరిని ‘మ్లేచ్ఛులు’ అని అంన్నాడు. ముస్లింలు, పర్షియన్లపై దాడి చేసి విజయం సాధించిన తరువాత పర్షియన్ భాషపై అరబ్బుల భాష ప్రభావం చూపించింది. అరబ్బు భాషలోని అనేక పదాలు పర్షియన్ భాషలో చేరాయి. చివరికి పర్షియన్ భాషను అరబిక్ లిపిలో రాస్తున్నారు. అరబ్బులు అధికంగా సున్ని ముస్లింలు. పర్షియన్లు అధికంగా ‘షియా’ ముస్లింలు. సున్ని, షియాల నడుమ ఉద్విగ్నతలున్నాయి. వాటి ప్రభావం కూడా కశ్మీరంపై పడింది. ఇది భవిష్యత్తులో వివరంగా చర్చించుకుందాం.

ఈ యవనులు, మ్లేచ్ఛుల వల్ల కశ్మీరంలో స్థానిక ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలు, ధర్మం సంపుర్ణంగా రూపాంతరం చెందాయి. దాదాపుగా అంతరించాయి. జోనరాజు ఈ అంతరిస్తున్న సంస్కృతి సాంప్రదాయాల ప్రతినిధి. వాటిని నమ్మేవాడు. కాబట్టి దాన్ని  ధ్వంసం చేసిన యవనులు, అరబ్బులు అతని దృష్టిలో మిడుతలు.  కానీ పర్షియన్ చరిత్ర రచయితల దృష్టి ఇందుకు పూర్తిగా భిన్నం. వారి దృష్టిలో స్థానిక ‘కాఫిర్’ లను ‘ఇస్లామీయులు’గా మార్చటం ఒక పవిత్ర కార్యం. దైవకార్యం. కాబట్టి మనం మ్లేచ్ఛులుగా అనుకుంటున్న వారు వారి దృష్టిలో  ధర్మ ప్రచారకులు, దైవ సేవకులు. అందుకని, ప్రజల పాప ఫలంగా  రాజు యవనుల పట్ల ప్రేమ ప్రదర్శిస్తున్నాడని, సంస్కృతి సాంప్రదాయాలు నాశనం అయిపోతున్నాయని జోనరాజు వాపోయిన కాలాన్ని ముస్లిం చరిత్ర రచయితలు ‘most memorable period in the history of kashmir’ అని అభివర్ణించారు. ‘ఆచారాలు ధ్వంసం’ అని మిడుతల  దండులతో జోనరాజు ఎవరినైతే పోల్చాడో, ఎవరి సంపర్కాన్ని ప్రజల పాపాల  ఫలితం అని జోనరాజు అన్నాడో, వారి ప్రభావంతో రాజు ‘fired with religious zeal and resolved   to run the state purely on islamic law and propagate  the faith by force’ అని వర్ణించారు ముస్లిం చరిత్ర రచయితలు. భారతదేశ చరిత్ర రచనలో ఇది పెద్ద సమస్య. భారతీయ దృక్కోణంలో చూస్తే ఇస్లామీయులు దోపిడీదారులు. బయటనుంచి వచ్చి ఆక్రమించినవారు. ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలను నాశనం చేసిన వారు. స్థానిక దైవాలను నిర్జించి వాటి స్థానంలో తమ దైవాన్ని నిలిపినవారు. అదే ఇస్లామీయుల దృక్కోణంలోంచి చూస్తే, ఇస్లాం ధర్మాన్ని వ్యాప్తి చేసినవారు అవుతారు.  గొప్పవారవుతారు.  దృష్టిలో తేడా వల్ల కలిగే తేడా ఇది. దాంతో వారిని ‘దోపిడీదార్లు’ అంటే భారతదేశంలో స్థిరపడి ఉన్న ఇస్లామీయుల మనోభావాలు దెబ్బతింటాయి. వారిని మహానుభావులు, గొప్పవారు, అనటం భారతీయులను  లెక్కచేయనట్టు, వారిని హింసించి, దోచుకున్నవారిని, అమానుషంగా ప్రవర్తించినవారిని గొప్పవారిగా భావిస్తున్నట్టు అవుతుంది. సమస్యఅల్లా ఇక్కడే పుట్టిపెరిగి తరతరాలుగా భారతదేశం జన్మభూమిగా కలిగి భారతీయులుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నవారు , కేవలం మతం ఆధారంగా  దోపిడీదార్లు, భారతీయ సమాజాన్ని సర్వనాశనం చేయాలని ప్రయత్నించినవారితో తమనితాము ఐడెన్టిఫయ్ చేసుకోవటం.  అందుకని ‘భారతీయ’ అన్న పదాన్ని ‘హిందూ’ అన్న పదం ఆక్రమించింది. ‘భారతీయ’ అంటే విశాలార్థం వస్తుంది. ‘హిందూ’ అన్నది ఒకప్పుడు ’భారతీయ’ అన్న అర్థంలో వాడినా, ఇప్పుడు ‘హిందూ’ అన్నది ఒక సంకుచితార్థంలో,  కేవలం ఒక ధర్మాన్ని అనుసరించే వారికే  పరిమితం అయింది. దాంతో భారతదేశ చరిత్ర రచనలో ఇస్లామీయులను దోపిడీదార్లనటం, వారు మహనీయులనటం  హిందూ, ముస్లింల మనోభావాలు, మతాలకు, ఆత్మాభిమానాలకు,  ధర్మానికి సంబంధించిన విషయం అయింది. చరిత్ర రచన మనోభావాలను రెచ్చగొట్టే సాధనం అయింది. ఒకరిపై ఒకరు ఆధిక్యం సాధించేందుకు ఒక సాధనం అయింది.  కానీ ఎలాంటి  భావాలు లేకుండా చరిత్రను మానవ సమాజ పరిణామ క్రమాన్ని తెలిపేదానిగా చూసే పరిస్థితి లేకుండా ఉంది. ఇప్పుడు ఇంత సమస్యగా ఎదిగిన ఈ విషయాన్ని జోనరాజు ఆ కాలంలో, సుల్తానుల నీడలో ఉంటూ నిక్కచ్చిగా చెప్పాడు. అదీ జోనరాజు గొప్పతనం. అరబ్బులను యవనులు అన్నాడు. పర్షియన్లను ‘మ్లేచ్ఛులు’ అన్నాడు. వారిని ‘మిడుతల దండు’ అన్నాడు. వారి ప్రభావంలో  రాజు పడటం ‘ప్రజల పాపఫలం’ అన్నాడు. కానీ జోనరాజు రాజతరంగిణి ఆధారంగా భారతదేశం చరిత్ర రాసిన వారు మాత్రం ఈ పదాలను వదిలేశారు. జోనరాజు భావాలను విస్మరించారు. పర్షియన్ల రచనలను, పరిగణలోకి తీసుకున్నారు. భారతీయ ముస్లింలకు నిజానిజాలు చెప్పే బదులు, ‘ఇది చరిత్ర’, ‘చరిత్రలో ఇలా జరిగింది’ అని నిర్మొహమాటంగా సత్యాలను ప్రజల ముందు పెట్టే బదులు,  వాటిని మసిపూసి మారేడుకాయ చేసి భారతీయుల దృక్కోణం వదలి, దోపిడీదార్ల దృక్కోణంలో చరిత్ర రాశారు. దాంతో ఆధునిక సమాజంలో ‘చరిత్ర’ ఒక రాజకీయ సాధనంగానూ ఎదిగింది. జోనరాజు దృక్కోణంలో, అంటే భారతీయుల దృక్కోణంలో చరిత్ర చెప్తే అది ‘హిందూ’ దృక్పధంగా ముద్రవేసి, మత భావనలు రెచ్చగొడుతున్న ఆరోపణలకు గురవుతుంది. అదే పర్షియన్ల దృక్పథంలో చరిత్ర రచిస్తే, అది లౌకిక చరిత్రగా పరిగణనకు గురవుతోంది. ఆనాడు ఎంతో చాకచక్యంగా జోనరాజు నిక్కచ్చిగా ప్రదర్శించిన నిజాలు, ఈనాడు, మరుగునపడి, ప్రచారంలో వున్న ఆబద్ధాలు భారతీయ సమాజాన్ని రెండుగా చీల్చే స్థాయికి ఎదిగాయి. నిజం అబద్ధంగానూ, అబద్ధం నిజంగానూ చలామణీ చేయటంవల్ల వచ్చిన సమస్య ఇది. ఎందుకంటే, ఒకరి నిజం మరొకరికి ఆబధ్ధం. వారి నిజం, వీరికి ఆబధ్ధం. దాంతో,  ఇంకా దేన్ని నిజంగా పరిగణించాలో, దేన్ని ఎవరి దృష్టితో చూడాలో ఏకాభిప్రాయం కుదిరే పరిస్థితి లేదు. అణిచివేతకు గురవుతున్న వారి పక్షం వహించాలని ప్రపంచ వ్యాప్తంగా తీర్మానించే వారు కూడా భారతదేశ చరిత్ర విషయానికి వచ్చేసరికి ’ఎవరు అణచివేతకు గురయ్యారు’ అన్న విషయాన్ని దాటివేస్తారు. అత్యంత అమానుష స్థాయిలో అణచివేతకు గురయిన భారతీయ సమాజాన్ని నేరస్థుడిలా పరిగణించి చరిత్రకు సంబంధించిన  తీర్మానాలు చేస్తున్నారు.  జోనరాజు రాజతరంగిణి ఈ సమస్యలోని  ద్వంద్వ ప్రవృత్తిని ఎత్తి చూపిస్తుంది. నిజం నిప్పులాంటిదని అది దాన్ని అణచిపెట్టినవారినే కాదు, వారి తరతరాల భవిష్యత్తునూ దహించివేస్తుందని నిరూపిస్తుంది. 

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here