జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-4

1
2

[box type=’note’ fontsize=’16’] జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

మద్వాక్ కల్హణ కావ్యాన్తః ప్రవేశాదేయ్ చర్వణమ్।
నంగ్వాలంబు సరిత్తోయో పతితం పీయతే న కిమ్॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 26)

[dropcap]క[/dropcap]ల్హణ కావ్యం చివర నుంచి రచనను నేను ఆరంభించాను. దాంతో నా రచన కల్హణుడి రచనతో మిళితమైనట్టయింది. కాబట్టి కల్హణుడి కావ్యంలానే నా రచనను కూడా స్వీకరించండి. ఎలాగయితే రెల్లుగడ్డి మొలిచిన నీటిలో నది నీరు వచ్చి కలిస్తే, ఆ నీటిని త్రాగటానికి స్వీకరిస్తారో, అలాగే రెల్లుగడ్డి లాంటి నా రచన కల్హణుడి కావ్యంతో కలవటం వల్ల ఆమోదయోగ్యం అవుతుంది.

జోనరాజుకు తెలుసు తాను రచిస్తున్న రాజతరంగిణి ఎంత ప్రయత్నించినా కల్హణుడి రాజతరంగిణితో సరిపోలదని. కల్హణుడు స్వేచ్ఛగా కావ్యం రచించాడు. కానీ జోనరాజు రాజతరంగిణిని జైనులాబిదీన్ సంతోషం కోసం రచిస్తున్నాడు. అదీ గాక జోనరాజు రాజతరంగిణి గురించి ఎలాంటి వ్యాఖ్య చేయాలన్నా, ఆయన తురుష్కుల నీడలో ఉంటూ, తురుష్కరాజు ఆజ్ఞానుసారం, ఆ రాజును సంతోషపరిచి, సంతృప్తిపరచటం కోసం రాజతరంగిణిని రచిస్తున్నాడన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వైజ్ఞానికంగా ప్రపంచం ఇంతగా అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాల్లోనే మతమౌఢ్యం వికృతంగా పడగ విప్పి నర్తిస్తూ ప్రజలను విహ్వలులను, నిస్సహాయులను చేస్తున్నదంటే, మధ్యయుగంలో బలమున్న వాడిదే రాజ్యం, కత్తి ఉన్నవాడిదే న్యాయం అనే కాలంలో రాజు ఎంత దయాళువు, దయార్ద్రహృదయుడయినా, ఏ మాత్రం అప్రియమైన సత్యాన్ని ప్రకటించే వీలు లేదు. దీనికి తోడు, సుల్తాను చుట్టూ చేరి ‘కాఫిర్’ను ఎలాగయినా బయటకు తరమాలనే మౌఢ్యుల దృష్టికి పట్టుబడకుండా జాగ్రత్తగా చూసి చూసి అడుగేయాల్సి ఉంటుంది. అందుకే జోనరాజు తన రచనను కావ్యం అని కూడా అనలేదు. ‘మద్వాక్’ అన్నాను. ‘కల్హణ కావ్యం అంతంలో ఉండే తన మాటలు’ అన్నాడు. ఎక్కడయినా పొరపాటున తనను తాను పొగడుకుంటే, జోనరాజుకు గర్వం పెరిగింది, అహంకారం ఉట్టిపడుతోందంటూ రాజుకు చేరవేసేవాళ్లు; రాజు మనసును విరిచి జోనరాజును ఇబ్బంది పెట్టేవాళ్ళూ బోలెడంతమంది ఉంటారు. అయినా సరే రాజతరంగిణి రచించటం ఎందుకంటే, రాజాజ్ఞ అన్నదానితో పాటుగా, కశ్మీర చరిత్రను భావితరాల ముందు ఉంచాలన్న దురాశ కూడా ఉండి ఉంటుంది.

జోనరాజు కల్హణ రాజతరంగిణిని కొనసాగిస్తున్న సమయంలోనే జైనులాబిదీన్ పలు సంస్కృత గ్రంథాలను పర్షియా భాషలోకి అనువదింపజేశాడు. అంటే, జైనులాబిదీన్ కాలంలో సంస్కృత కావ్యాలు, పర్షియన్ కావ్యాల సృజనతో పాటుగా, అనువాదాలు కూడా సంస్కృతం నుంచి పర్షియన్ భాషలోకి; పర్షియన్ నుంచి సంస్కృతం లోకి జోరుగా సాగుతూండేవని అనుకోవచ్చు. దీనితో పాటు అనువాదకుల నడుమ, కవుల నడుమ వాగ్వివాదాలు, అసూయలు కూడా జోరుగా సాగుతూండి ఉంటాయని ఊహించవచ్చు. జైనులాబిదీన్ సంస్కృత గ్రంథాలను పర్షియన్ భాషలోకి అనువదింపజేసాడనేందుకు ఆధారాలు గమ్మత్తుగా లభించాయి.

కశ్మీరు చరిత్రలో ‘మౌల్వీ హసన్ షా’ పేరు అందరికీ తెలుసు. కశ్మీరుకు చెందిన ‘బండిపూర్’లో 1832 సంవత్సరంలో జన్మించాడు. 66 ఏళ్ళ వయసులో 1898లో మరణించాడు. ఈయనకు ఏడు తరాల ముందరివాడు భారతీయుడు,  కశ్మీరీ పండితుడు. అతని పేరు గణేశ్ కౌల్. ఈయన ఇస్లాం పుచ్చుకుని ‘షేక్ గాజీయుద్దీన్’ అయ్యాడు [ఇటీవలి కాలంలో కొందరు మేధావులు ఎలాంటి ఆధారాలు లేకుండా, ఇస్లాం పుచ్చుకున్న భారతీయులంతా నిమ్నవర్గాల వారనీ, అగ్రవర్ణాల దౌష్ట్యం భరించలేక, తిరుగుబాటుగా సర్వజన సమానమైన ఇస్లాం స్వీకరించారని ప్రవచిస్తూంటారు. వారు కశ్మీరు చరిత్ర చదివితే, ఒక్కొక్క ఇస్లామీయుడి పూర్వీకుల గురించి తెలుసుకుంటే, ఇలాంటి సిద్ధాంతాలు ఆధార రహితమనీ, చెడు లక్ష్యంతో చరిత్రను వక్రీకరిస్తూ చేస్తున్న తీర్మానాలనీ అర్థమవుతాయి]. ఆయన గొప్ప సంస్కృత పండితుడు. అతని కొడుకు షేక్ యాకూబ్ కూడా సంస్కృతంలో, పర్షియన్‍లో గొప్ప పండితుడిగా పేరుపొందాడు. అతని పాండిత్యానికి మెచ్చి మొఘల్ రాజు ‘షాహ్-ఇ-జహాన్’ ఆయనను తన దర్బారులో చేర్చుకొన్నాడు. హసన్ షా తండ్రి మౌల్వీ గులామ్ రసూల్ గొప్ప పర్షియన్ కవి. ఆయన తన కొడుకు ‘మౌల్వీ హసన్ షా’కు అరబిక్, పర్షియన్‍లు నేర్పాడు. గొప్ప పండితుడిని చేశాడు. ‘మౌల్వీ హసన్ షా’ వైద్యం కూడా నేర్చుకున్నాడు. ‘పీర్’ల వంశంలో జన్మించేనని చెప్పుకున్నాడు. భారతీయ ధర్మంలో పండితులుగా ఉంటూ, పూజలు జరిపించినవారు మతం మారి మౌల్వీలయి ఇస్లామీ ‘పీర్’లు అయ్యారంటారు. ఇందుకు ‘మౌల్వీ హసన్ షా’ చక్కని ఉదాహరణ.

హసన్ షా కూడా చక్కని రచయిత. కశ్మీర రాజు మహారాజ రణ్‍బీర్ సింగ్ – హసన్ షా సాహిత్య సేవలు గుర్తించి – ఖిలాత్ (సిల్క్ లేక కాటన్ దుస్తులు) ఇచ్చి సత్కరించాడు. హసన్ ఒకసారి ‘రావల్పిండి’ వెళ్ళాడు. అక్కడ ఆయనకు పర్షియన్ భాషలో రాసిన కశ్మీరు చరిత్ర పుస్తకం ఉన్నట్టు తెలిసింది. ఆయన ఆశ్చర్యపోయి మరిన్ని వివరాలు సేకరించాడు. రావల్పిండి జిల్లాలో పిండోరి గ్రామానికి చెందిన ములా మహమూద్ అనే వ్యక్తి దగ్గర ములా అహ్మద్ అనే ఆయన పర్షియన్ బాషలో రాసిన కశ్మీరు చరిత్ర పుస్తకం ప్రతి ఉన్నదని కనుగొన్నాడు. ఆ పుస్తకం చాలా పాతదని తెలుసుకున్నాడు. అరుదైన ఆ పుస్తకం ప్రతిని సంపాదించాడు. అది ప్రాచీన కశ్మీరు చరిత్రను సంస్కృత భాషలో రచించిన ‘రత్నాకర పురాణం’ అనే గ్రంథానికి అనువాదం. అయిదువేల ఏళ్ళ క్రితం కశ్మీరును పాలించిన 35 మంది రాజుల చరిత్ర అది. అంతే కాదు, క్రీ.శ. రెండవ శతాబ్దం నుండి ఆరవ శతాబ్దం వరకు కశ్మీరును పాలించిన ఏడుగురు రాజుల చరిత్ర కూడా ఆ పుస్తకంలో ఉంది. జైనులాబిదీన్ పాలనాకాలంలో ఇలాంటి పుస్తకం ఒకటి ఉన్నదని తెలియటంతో జైనులాబిదీన్ ఆ పుస్తకం కోసం విస్తృతంగా వెతికించాడు. ప్రతి దొరకగానే ‘ములా అహ్మద్’తో దాన్ని పర్షియన్ భాషలోకి అనువదింపజేశాడు. ఆ పుస్తకం ప్రతిని సంపాదించిన ‘హసన్’ దాని ఆధారంగా తానో కశ్మీర చరిత్ర రచించాడు. కల్హణుడు రాజతరంగిణిలో వివరాలు దొరకలేదని రాయని రాజుల చరిత్ర ‘రత్నాకర పురాణం’లో లభించటంతో, ఆ వివరాలు పొందుపరుస్తూ రచించాడు. అయితే  హసన్  ప్రయాణిస్తున్నప్పుడు బోటు తిరగబడింది. అతి కష్టం మీద హసన్‍ను రక్షించారు కానీ, ‘రత్నాకర పురాణం’ అనువాద ప్రతి నదిలో కొట్టుకుపోయింది. విషయం తెలిసిన కశ్మీరు రాజు ‘రత్నాకర పురాణం’ అనువాద ప్రతి కోసం అంతా వెతికించాడు. చివరికి రావల్పిండి లోని ‘పిండారి’ గ్రామానికి మనుషులను పంపించాడు. ములా మహమూద్ దగ్గర కాపీ సంపాదించి – దాని ప్రతులు చేసేవారు పిండారి చేరారు. కానీ అఫ్ఘనిస్థాన్‌కు చెందిన అమీర్ అబ్దుల్ రహమాన్ ఖాన్ ఆహ్వానాన్ని పురస్కరించుకుని ములా మహమూద్ అఫ్ఘనిస్థాన్ వెళ్లాడని తెలిసింది. అక్కడ ఏమయ్యాడో ఎవ్వరికీ తెలియదు. దాంతో చరిత్ర విశ్లేషకులు హసన్ అనువాదాన్ని ప్రామాణికంగా తీసుకుని కశ్మీరు చరిత్రను నిర్మించారు.

ఈ సంఘటన ద్వారా రెండు విషయాలు తెలుస్తాయి. కల్హణుడు ఎంత ప్రయత్నించినా దొరకని ‘రత్నాకర పురాణం’ అన్న కావ్యం జైనులాబిదీన్ కాలంలో లభించిందనీ, దాన్ని పర్షియన్ భాషలోకి ఆయన అనువదింప చేశాడని. అయితే, అసలు ‘రత్నాకర పురాణం’ సంస్కృత ప్రతి తరువాత ఏమయిందో ఎవ్వరికీ తెలియదు. భారతదేశ చరిత్ర గురించి తీర్మానాలు చేసేవారు, సూత్రీకరించేవారు, సిద్ధాంతాలు చేసేవారు గమనించాల్సిన విషయం ఇది.

కల్హణుడు ఎంత ప్రయత్నించినా 35 మంది రాజుల చరిత్ర లభించలేదు. చివరికి వారి వివరాలు తెలియలెదని చెప్తూ రాజతరంగిణిని కొనసాగించాడు కల్హణుడు. జైనులాబిదీన్ కాలంలో కల్హణుడికి తెలియని రాజుల వివరాలు ఉన్న గ్రంథం లభించింది. దాన్ని పర్షియన్ భాషలోకి అనువదింపజేశాడు. ఆ తరువాత కాలక్రమేణా సంస్కృత గ్రంథం కానీ, అనువాదం కానీ మరుగున పడ్డాయి. 19వ శతాబ్దంలో హసన్‍కు సంస్కృత గ్రంథానికి పర్షియన్ అనువాదం దొరికింది. దాని ఆధారంగా హసన్ కశ్మీరు చరిత్రను రచించాడు. కల్హణ రాజతరంగిణిలోని ఖాళీలను పూరించాడు. అయితే అతని చరిత్ర రచనకు ఆధారమైన అనువాదం నీళ్ళలో కలిసిపోయింది. అంటే అసలైన సంస్కృత గ్రంథం లేదు, దాని అసలు అనువాదం లేదు. కానీ అనువాదం ఆధారంగా రాసిన కశ్మీరు చరిత్ర ఉంది. చరిత్ర విశ్లేషకులు హసన్ రాసిన కశ్మీరు చరిత్రను ప్రామాణికంగా భావించి కశ్మీరు చరిత్రను రచిస్తున్నారు. కల్హణుడు రాసిన చరిత్రలో తప్పులు వెతుకుతూ కల్హణుడి చరిత్ర ప్రామాణికం కాదంటున్నారు. కానీ   అనువాదం ఆధారంగా రచించిన గ్రంథాన్ని ప్రామాణికం అంటూ తీర్మానాలు చేస్తున్నారు. ఇదీ మన చరిత్రను నిర్ణయిస్తున్న విధానం. కల్హణుడి రచన మీద నమ్మకం లేదు. జోనరాజు రచనను నమ్మరు. కానీ వీరి రచనలను అనువదించిన వారి రచనలను నమ్ముతారు. వాటిని ప్రామాణికంగా భావించి భారత చరిత్రను నిర్మిస్తారు.

పర్షియన్ అనువాదకులు సంస్కృత కావ్యాలను పర్షియన్ భాషలోకి అనువదించారు. కానీ వారి అనువాదాలు మూలానికి దగ్గరలో ఉన్నవి కావు. వారు నమ్మే సిద్ధాంతాల ప్రకారం కాఫిర్ల గొప్ప పలకకూడదు. మరో దైవాన్ని పొగడకూడదు. అంతే కాదు, తమ గొప్ప కాక, ఎదుటివారి గొప్పతనాన్ని అధికంగా ప్రస్తావించకూడదు. వారి అనువాదాలు ఈ నియమాలకు లోబడి జరిగినవి. భారతీయుల కావ్యాలలో దైవ ప్రార్థనలు ప్రస్తావించి వదిలేశారు. రాజుల ఐశ్వర్యం, వైభవం, గొప్పతనం వంటి వాటిని నమ్మలేదు. కాబట్టి అనువదించలేదు. ఏమయినా అంటే, భారతీయులకు అతిశయోక్తులు ఎక్కువ అని వ్యంగ్యం చేస్తారు. ‘అవునవును’ అని మనం ఒప్పేసుకుంటాం. కాబట్టి పర్షియన్ అనువాదాన్ని ప్రామాణికంగా తీసుకోవటం ప్రమాదకరం. తమ ఇష్టానుసారం అనువదించారు. ఆ అనువాదం ఆధారంగా రచించిన చరిత్రను ప్రామాణికంగా భావించటం ఇంకా ప్రమాదం. ఎందుకంటే, వ్యక్తిగతంగా హసన్, మతబోధకుడు మాత్రమే కాక వైద్యుడు కూడా. తెలివైన వైద్యుడు.  రోగుల మనస్తత్వం ఆధారంగా వారిని మాయ చేసి రోగం నయం చేసేవాడు. అటువంటివాడు ఏఅయినా చెప్పి ఎలాగయినా నమ్మించగలడందరినీ.  కాబట్టి అతను చరిత్రను రచించే సమయంలో తన స్వీయ ఆలోచన లన్నెటిని పొందుపరిచాడో తెలియదు. అదీగాక, ఇలా ఎన్నెన్ని చరిత్ర పుస్తకాలు ఆ అల్లకల్లోల సమయంలో అదృశ్యం అయ్యాయో తెలియదు. అవి అదృశ్యం అవటంతోటే ఎన్నెన్ని నిజాలు, ఎంతెంత సమాచారం అదృశ్యమయిందో తెలియదు. ఇవన్నీ తెలియకుండా, తాము అనుకున్నదే ‘నిజం’ అని భారతదేశ చరిత్రను నిర్ణయించేస్తూ వస్తున్నారు.

జోనరాజు రాజతరంగిణిని గమనిస్తే, జోనరాజు పాలకుల మనస్సును గ్రహించినట్టు తెలుస్తుంది. కాఫిర్‍ల గొప్పతనం వినటం వారికి ఇష్టం లేదు. అందుకని జోనరాజు హిందూరాజుల పాలనా కాలాన్ని గబగబా ముగించేస్తాడు. కేవలం సమాచారం అందిస్తూ సాగుతాడు. ఏ రాజు ఎంతకాలం పాలన చేశాడు? ఏ రాజు తరువాత ఏ రాజు సింహాసనం అధిష్ఠించాడు చెప్తూ అక్కడక్కడా కొంత సమాచారం పొందుపరుస్తాడు. వీలయినంత వరకూ ఇస్లామేతర పాలనాకాలాన్ని విమర్శిస్తూ ముందుకు సాగుతాడు. ఇది సుల్తానుల అహాన్ని సంతృప్తి పరుస్తుంది. వారికి ఆనందం కలిగించే రీతిలో రాస్తేనే జోనరాజు ప్రాణం నిలుస్తుంది. జోనరాజు రాజతరంగిణి రచనలో వాడిన పదాలను, ప్రతీకలను, వెలిబుచ్చిన భావాలను జాగ్రత్తగా విశ్లేషిస్తూ ముందుకు సాగాలి. అప్పుడు పైన కనబడే భావం నీడలో ఒదిగిన జోనరాజు హృదయాన్ని గ్రహించే వీలు చిక్కుతుంది.

జగదానన్దనో దేవాద్విజాతి కృత వన్దనః।
క్షితి సంక్రందనః సాక్షాదాసీత్ సుస్సల నందనః॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 27)

జోనరాజు తిన్నగా కశ్మీరు చరిత్ర చెప్పటం ఆరంభించాడు. కల్హణుడు ఎక్కడ వదిలాడో అక్కడ నుంచి ఆరంభిస్తున్నాడు. సుస్సలుడి కొడుకు జయసింహుడు గొప్ప రాజు. ఐశ్వర్యవంతుడయిన రాజు. ఆయన పాలనలో ప్రపంచం అంతా ఆనందించింది. దేవతలను గౌరవించాడు. బ్రాహ్మణులను గౌరవించాడు.

జయసింహుడిని సరస్వతీదేవి స్వంత తల్లిలా ఆదరించింది. ధన దేవత, అదృష్టదేవతలు అతడి వెన్నంటి ఉన్నారు. లక్ష్మీ సరస్వతులు జయసింహుడి అత్తగారు కోడలులా అతడితో సామరస్యంతో కలసి ఉన్నారు. ఒక రోజు జయసింహుడి రాజ్యానికి త్రిగర్త రాజు సుశర్మ కుమారుడు మల్ల వచ్చాడు. మల్లను అతని శత్రువులు రాజ్యం నుంచి తరిమేస్తే, ఆశ్రయం కోరి కశ్మీరు వచ్చాడు. ఈ సందర్భంగా చక్కటి శ్లోకం రచించాడు జోనరాజు.

ఔషధాలను గడ్డిగా భావిస్తారు. మణులను రాళ్ళుగా పొరపడతారు. ఎవరు దేశం వదిలి పరదేశంలో తల దాచుకున్నా, ప్రతిభావంతులను కూడా వారి ప్రతిభ గుర్తించనంత వరకూ సామాన్యులనే అనుకుంటారు. ఇది కశ్మీరుకు చేరిన మల్ల గురించి రాసినా, అందరికీ వర్తిస్తుంది. ఒక వ్యక్తి గొప్పతనం ప్రకటితమైతే కానీ ఆ వ్యక్తి ప్రత్యేకతను గుర్తించలేరు. ఒక వ్యక్తి గుర్తింపు పొందటంలో కర్మ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒక వ్యక్తికి ప్రతిభ ఉంది. కానీ ఆ ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభించకపోతే, అతనిలో ఎంత ప్రతిభ ఉన్నా ప్రజలు గుర్తించలేరు. అయితే, తన ప్రతిభ ప్రదర్శించి తన ప్రత్యేకతను నిరూపించుకునే అవకాశం మల్లకి త్వరలోనే లభించింది.

వసుధా వాసవే యాతే జీతుం యవన మేదినీమ్।
సైన్యస్య వల్లభో మల్లః శౌర్యోద్రేవాదథా అభవత్॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 32)

యవన రాజ్యాన్ని అదుపులో పెట్టేందుకు జయసింహుడు సైన్యంతో బయలుదేరినప్పుడు మల్ల అత్యంత శౌర్య సాహసాలను ప్రదర్శించాడు. అందరి హృదయాలను తన శౌర్య ధైర్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. సైనికులందరికీ ప్రియతముడయ్యాడు. అత్యంత ధైర్య సాహసాల ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు.

అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో మల్ల చంద్రుడు ఒంటరిగా చీమలు కూడా దూరలేని, గాలి కూడా చొరబడని శత్రుశిబిరంలోకి రహస్యంగా చొరబడ్డాడు. యుద్ధంలో ఎంతమంది తురుష్కులు మరణించారు, మరణించిన వారు మరణించగా, ఎంతమంది తురుష్క సైనికులు మిగిలారో అంచనా వేశాడు. అయితే నిద్రిస్తున్న సైనికులను సంహరించే పాపం చేయలేదు. తిన్నగా నిద్రిస్తున్న తురుష్కరాజు శిబిరంలోకి వెళ్ళాడు. తురుష్క రాజు తల దగ్గర తన పేరు రాసి ఉన్న చెప్పులను తలపాగా లాగా పెట్టి వచ్చేశాడు. శత్రు దుర్భేద్యమయిన తురుష్క శిబిరాల్లోకి మల్ల చంద్రుడు మాయమంత్రాలతో ప్రవేశించినట్టున్నాడు అంటాడు జోనరాజు. తెల్లారి లేచి, తల దగ్గర చెప్పులను చూసిన తురుష్క రాజు భీతిభ్రాంతుడవుతాడు. తన ఐశ్వర్యాన్నంతా కశ్మీరు రాజు పాదాల వద్ద ఉంది, లొంగిపోయాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here