జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-40

0
2

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

కశ్మీర మండలే మ్లేచ్ఛ దురాచారేణ దూషితే।
మహిమా బ్రాహ్మణైర్శస్త్రిర్దేవైశ్చ స్వ సముజ్ఞతః॥
(జోనరాజ రాజతరంగిణి 591)

[dropcap]ఇ[/dropcap]క్కడి నుండి జోనరాజ రాజతరంగిణి పఠనం ఒక బాధాకరమైన అనుభవం. ‘బాధ’ అన్నది సామాన్య పదం. మనసులో చెలరేగే పలు విభిన్నమైన భావాలను సరిగ్గా ప్రతిబింబించదు. సుడిగాలిలో చిక్కుకున్నవాడిపై పెను తుఫాను విరుచుకు పడి, దానితో పాటు కాళ్ళ క్రింద భూమి కంపించి, అగ్నిపర్వతం బ్రద్ధలై నిప్పు కణికలు వర్షంలా కురుస్తూ, అన్నిటినీ ముంచెత్తే బూడిద వెల్లువైతే ఎలా ఉంటుందో, ఇక పై రాజతరంగిణి చదవటం అంతకన్నా ఘోరంగా ఉంటుంది.

ఇప్పుడు మనకు ఆ కాలంలో మ్లేచ్ఛ రాజుల పాలనలో, యవనుల అధికారంలో ఉన్న భారతీయులు ఎంతటి క్షోభను, దైన్యాన్ని, భయాన్ని, వేదనను, దురదృష్టాన్ని, నైచ్యాన్ని, రాక్షసత్వాన్ని అనుభవించారో బోధపడదు. ఊహకు కూడా అందదు. మనల్ని మనం ఆ కాలంలోని వారి స్థానంలో ఊహించుకుని, ఆ కాలం నాటి వారి మానసిక స్థితిని, వారు అనుభవించిన దుర్భర శోక సముద్రాల తుఫానులను ఎంతగా అనుభవించాలన్నా మనకు అందదు. జోనరాజ రాజతరంగిణి ఆనాటి భారతీయ సమాజ అంతరంగాల లోతుల్లో బ్రద్దలవుతున్న బడబానలాల స్వరూపాన్ని అత్యంత సూక్ష్మంలో ప్రదర్శిస్తుంది. అంత దానికే అనంతమైన దుఃఖవీచికల తాకిడికి ఉక్కిరి బిక్కిరి అవుతాము. ఇది కూడా సుల్తానుల నీడలో ఒదుగుతూ వీలయినంత సౌమ్యంగా, ఎవ్వరికీ కోపతాపాలు రాకుండా, ఎవ్వరి మనోభావాలు దెబ్బ తినకుండా, ప్రదర్శించాడు జోనరాజు. అంత దానికే ఇంతగా వేదన కలిగితే, ఇంకా నిక్కచ్చిగా నిజాలు ప్రదర్శిస్తే ఎలా ఉండేదో ఊహించాలంటేనే భయం వేస్తుంది. ఈనాడు, ప్రపంచంలో ఏ చిన్న అన్యాయానికైనా స్పందించి, ఉద్యమాలు చేసే వారి ఊహకు కూడా అందనంత రాక్షసత్వాన్ని, అణచివేతను, నైచ్యాన్ని ఆనాటి భారతీయ సమాజం అనుభవించింది. కానీ, ఈ చరిత్రను ప్రస్తావించేందుకు కూడా ఈనాటి ‘స్వేచ్ఛ’వాదులు సిద్ధంగా లేకపోవటం, భారతీయ సమాజం ఎంతగా రూపాంతరం చెందిందో తెలుపుతుంది.

మిడుతల దండులా యవనులు, మ్లేచ్ఛులు కశ్మీరంలో ప్రవేశించారని రాసిన తరువాత జోనరాజు ఈ విషయంలో లోతుగా వెళ్ళకుండా, కథలోకి దిగుతాడు. సికందర్ ఉదభాండపురం పై దాడి చేసి రాజును ఓడించాడు. ఉదభాండపురం రాజు భారతీయుడు. ఉదభాండపురం రాజును జయించి, అతని కూతురుని వివాహమాడేడు సికందర్. ఆమె పేరు శ్రీమేరా. ఆమె  విజయలక్ష్మి లాంటిది. రాజుల వంశంలో జన్మించిన ఆమె దేవత వంటిదని అంటాడు జోనరాజు. కారణం, దేవుడి లాంటి జైనులాబిదీన్‍కు జన్మనిచ్చింది ఆమె. ఇక్కడే జోనరాజు రచనా చాతుర్యం తెలుస్తుంది.

ఓ వైపు మ్లేచ్ఛులు, యవనులు మిడుతల్లా వచ్చి పడుతూ కశ్మీరును ధార్మికంగా, సాంస్కృతికంగా రూపాంతరం చెందిస్తున్నారని దూషిస్తు, అంతలోనే, అంటే, ఈ దూషణల్లోని మర్మం బోధపడేలోగా, సికందర్ వీరుడని పొగిడి, అతడి సంతానం జైనులాబిదీన్‍ను దైవం అని పొగిడేడు. జోనరాజు ఉన్నది జైనులాబిదీన్ ఆశ్రయంలో. అతడి తండ్రి సికందర్. సికందర్ తన మత ఛాందసంతో కశ్మీరును అల్లకల్లోలం చేశాడు. మందిరాలను ధ్వంసం చేశాడు. కనబడ్డ వాడినల్లా మతం మార్చాడు. మారని వాళ్ళను క్రూరంగా చంపించి మారణహోమం సృష్టించాడు. సర్వనాశనం చేశాడు. కానీ అతని సంతానం జైనులాబిదీన్ తండ్రి చేసిన ఘోర కృత్యాలన్నింటినీ సవరించాడు. తుఫాను తాకిడికి అల్లకల్లోలమైన ప్రాంతాన్ని పునర్నిర్మించినట్టు, కశ్మీరు పునర్నిర్మాణం గావించాడు. అందుకని మ్లేచ్ఛులను, యవనులను దూషించిన జోనరాజు వెంటనే సికందర్ గొప్పతనం వర్ణించాడు. అతని భార్యను దేవత అన్నాడు. ఆమె సంతానం, తన రాజు జైనులాబిదీన్‍ను దైవం అన్నాడు.

అవతారచ్ఛాహికులే నూనం సా కాపి దేవతా।
యోజయిష్యతి తత్పుత్రః కశ్మీరాన్ మ్లేచ్ఛనాషితాన్॥

శ్రీజైనోల్లాభిదీఈనాభ్యో మూర్తోం ధర్మః కలావపి।
రాజాపి యోగిరాజోయం రాజచూడామణే ప్రియః॥
(జోనరాజ రాజతరంగిణి 578, 579)

ఈ రెండు శ్లోకాలతో అంతకు ముందు విమర్శలు కలిగించే చెడు భావనను కొట్టిపారేశాడు జోనరాజు. ఈ రెండు శ్లోకాలు విన్న తరువాత ఎటువంటి కోపమైనా కరిగిపోవాల్సిందే. సికందర్ భార్య శ్రీమేరా తప్పనిసరిగా దేవతనే అయి ఉంటుంది. ఎందుకంటే, ఆమెకు కలిగిన సంతానం భవిష్యత్తులో- మ్లేచ్ఛులు నాశనం చేసిన కశ్మీరును ఏకత్రితం చేసి శక్తిమంతం చేశాడు. ఆ జైనులాబిదీన్ అనే పిల్లవాడు, కలియుగంలో మూర్తీభవించిన ధర్మం. యోగిరాజులలో యోగిరాజు వంటి వాడు జైనులాబిదీన్.

ఎంతో తెలివిగా జోనరాజు, జైనులాబిదీన్‍ను దేవుడిని చేశాడు. మ్లేచ్ఛులను రాక్షసులను చేశాడు. తనను దైవం అన్నందుకు పొంగిపోయిన రాజు, తనవారిని రాక్షసులు అనటాన్ని విస్మరిస్తాడు. మనల్ని రాక్షసులు అంటున్నాడని ఇతరులు రాజుకు ఫిర్యాదు చేయలేరు. ఎందుకంటే, వాళ్ళు రాక్షసులయితేనే కదా, రాజు దేవుడయ్యేది. ‘మిమ్మల్ని దైవం అనటం’ వారికి ఆగ్రహం కలిగిస్తోందని రెచ్చగొట్టే వీలు చిక్కుతుంది. ఇది తెలుసు కాబట్టి తమని రాక్షసులన్నా చిరునవ్వుతో భరించి, రాజును దైవం అన్నందుకు ‘వహ్వ’, ‘వహ్వ’ అనాల్సి వస్తుంది. సుల్తానుల పడగ నీడలో ఇలాంటి ‘తెలివి’ ప్రదర్శించటం వల్ల ‘చేదు నిజాలు’, ‘చక్కెర పూసిన నిజాల్లా’ చెప్తూ కూడా బ్రతికి బట్టకట్టగలిగాడు జోనరాజు.

కలియుగంలో మూర్తీభవించిన దైవం అని జైనులాబిదీన్‍ను వర్ణిస్తూ ‘యోజయిష్యతి తత్పుత్రః కశ్మీరాన్ మ్లేచ్ఛనాషితాన్’ – మ్లేచ్ఛుల వల్ల నాశనమైన కశ్మీరాన్ని రక్షించాడట ఆమె పుత్రుడు జైనులాబిదీన్. ఈ వ్యాఖ్యతో అంతకు ముందు చేసిన వ్యాఖ్యలన్నీ కొట్టుకుపోతాయి. ఆ మ్లేచ్ఛులు, యవనులు, తాను భిన్నం అని పొంగిపోతాదు రాజు. యీ కశ్మీరాన్ని మ్లేచ్ఛులు, యవనులు సర్వనాశనం పట్టించారన్న నిజాన్ని భావితరాల ముందుంచాడు జోనరాజు.  జోనరాజు ఇది చెప్పకపోతే, ఆధునిక చరిత్ర రచయితలు, అరబ్బులు, పర్షియన్లు, అనాగరికంగా ఉన్న కశ్మీరును నాగరీకం చేశారని నమ్మించగలిగేవారు. ఇప్పటికీ అలా నమ్మించాలని ప్రయత్నిస్తూనేవున్నారు.

మహాదేవుడనే కుత్సిత రసాయనవాది,  రాజుకు కొన్ని మూలికలు ఇచ్చి రసవాదం గురించి గొప్పగా చెప్పాడు. బంగారు మేరు పర్వతం రాజు భూభాగాన్ని మోస్తున్నందుకు కృతజ్ఞతగా ఉంటుందని పొగిడాడు. తన ద్వారా మేరు పర్వతం, రాజుకు  బంగారాన్ని ప్రసాదిస్తుందని నమ్మించాడు. ఇక్కడ మహాదేవుడి గురించి వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తాడు జోనరాజు. అన్నింటినీ బంగారంగా మార్చి రాజుకు ఇస్తానని నమ్మించిన మహాదేవుడి పేదరికాన్ని ఏ బంగారమూ తొలగించలేకపోయిందంటాడు. రాళ్లను బంగారంలా మార్చే మహాదేవుడు పేదరికంలో ఉండటం, అతని విద్య అబద్ధం అనీ, అతడు మోసగాడనీ నిరూపిస్తుందంటున్నాడు జోనరాజు.

మహాదేవుడు కనికట్టు విద్యతో రాజును మభ్యపెట్టాడు. అతడి ప్రభావం రాజుపై చాలా కాలం ఉంది. అయితే, రాజు కొద్ది కాలానికి అతడి మోసం గ్రహించాడు. మహాదేవుడి మోసాన్ని తాను గ్రహించినట్టు స్పష్టం చేశాడు. దాంతో మహాదేవుడు భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

బద్ధరాజు, వైద్యుడు శంకర, భట్టసూహ లు రాజుకు సన్నిహితులు. ఆంతరంగిక సలహాదార్లు. రాజు ఆంతరంగిక సలహాదార్లందరూ ఇస్లామేతరులే అవటం గమనార్హం. ఇదికూడా భవిష్యత్తులో కరడుగట్టిన ఛాందసవాదులకు ఒక ఆయుధం అయింది. ఇది ముందు ముందు తెలుస్తుంది.  మేరరాణికి ముగ్గురు పుత్రులు కలిగారు. మన్మథుడి అంతటి అందగాళ్ళు. ధర్మం, ఐశ్వర్యం, కోరికలకు ప్రతిరూపాల్లాంటి వారు ఆ ముగ్గురు. వారి పేర్లు మేరా ఖానా, శాహి ఖానా, మహమ్మద్ ఖానా. గంగా తరంగాలు ముల్లోకాలను సౌందర్యమయంగా మలిచినట్టు ఈ ముగ్గురూ అందరినీ అలరించారు. శోభారాణి కొందరు శిశువులను దత్తత తీసుకుంది. అందుకని మహారాజు వారిని విస్మరించాడు. వారిలో ‘ఫిరుజా’ అనేవాడిని మాత్రం రాజు నగరంలో ఉండనిచ్చాడు. అలకా నగరం మానస సరోవరంలో ప్రతిఫలించినట్టు ప్రద్యుమ్న పర్వతం మరోవైపు, ఉత్తములు నివసించే ఓ అందమైన నగరాన్ని నిర్మించాడు రాజు. హరిపర్వతం దగ్గర ఉన్న ‘నౌహట్ట’ ప్రాంతాన్ని ఆనాడు సికందర్ నిర్మించిన నగరంగా భావిస్తున్నారు.

ఇంత వరకూ జోనరాజు వివరించిన అంశాలు వేరు. సికందర్ సంతానం గురించి చెప్తున్న జోనరాజు హఠాత్తుగా రెండు మూడు శ్లోకాలలో కశ్మీరులో మ్లేచ్ఛులు, యవనుల వల్ల కలిగిన మార్పుల పట్ల అత్యంత అవేదనను ప్రదర్శిస్తాడు.

సికందర్ దయాగుణానికి ఆకర్షితులై యవనులు, మ్లేచ్ఛులు మిడుతల దండుల్లా కశ్మీరు వచ్చి చేరారని గతంలో రాశాడు. ఇప్పుడు హఠాత్తుగా, కశ్మీరం వచ్చి ఐశ్వర్యవంతులైన యవనులకు రాజు ఖజానా నిండుగా ఉందా? ఖాళీగా ఉందా  అన్న విషయం పట్టలేదు అని వ్యాఖ్యానిస్తాడు. వీరు, కాకుల్లాంటి వారంటాడు.

మ్లేచ్ఛుల దురాచారాల వల్ల కశ్మీరం కలుషితమై పోయిందని ప్రకటించాడు జోనరాజు. ‘మ్లేచ్ఛుల దురాచారాలు’ అనటం రెండు వైపులా పదునైన కత్తి వంటిది. ఆంగ్ల చరిత్ర రచయితలు ‘దురాచారం’ అన్న పదాన్ని ‘ill conduct’ (Kings of Kashmir, Walter Slaje) అనీ, ‘evil practices’ (Kings of Kashmir, J. C. Dutt) అనీ అనువదించారు. ‘ఆచారం’ అన్న పదానికి ఆంగ్లంలో ‘convention’, ‘ritual’, ‘custom’ అన్న అర్థాలున్నాయి. ‘Convention’ అంటే సంప్రదాయకమైన, ‘ritual’ అంటే ఆచార ప్రకారమైన కర్మ, ‘custom’ అంటే అలవాటు లేక ఆచారం. కానీ ఈ పదాలను వదిలి ‘ill conduct’, ‘evil practices’ అన్న పదాలు వాడటంలో ‘దురాచారం’ అన్న పదం వల్ల కలిగే గాఢమైన, సాంద్రమైన అర్థాన్ని పలచన చేయటం కనిపిస్తుంది. ఇక్కడే భారతీయ చరిత్ర రచనలో ‘లౌక్యం’ కనిపిస్తుంది.

మ్లేచ్ఛుల దురాచారాల వల్ల కశ్మీరం కలుషితమయి పోయిందన్న జోనరాజు భావాన్ని  వారి ‘దుష్ప్రవర్తన’, ‘దుష్ట వ్యవహారాల’ వల్ల కశ్మీరం కలుషితమై పోయిందని అనువదించటంతో జోనరాజు భావం పలుచనయిపోయింది.

ఒకవేళ ‘దురాచారా’న్ని ‘దుష్ట ఆచారం’ అని అనువదిస్తే, ఒక మతం వారి ఆచారాలను విమర్శించినట్లు అవుతుంది. మనోభావాలు దెబ్బతింటాయి. ఈమధ్య అయితే, ఎవరో, ఎలావుండేవాడో, ఎప్పటివాడో కూడా  తెలియని ‘మనువు’ను ఎవరు బడితే వారు,  ఎందుకో కూడా తెలియకుండా ఇష్టం వచ్చినట్లు దూషించి, మానవత్వంలో ఓ మెట్టు ఎక్కేసినట్టు భావించుకుంటున్నారు. అలాంటిది ‘మ్లేచ్ఛుల దురాచారాలు’ అన్న దాన్ని ఉన్నదున్నట్టు అనువదించి వివరిస్తే, జోనరాజును వెతుకుతూ గతంలోకి దూకుతారేమోనన్న భయంతో ఆ కాలంలోనే ‘దురాచారా’న్ని, ‘చెడు ప్రవర్తన’, ‘చెడు అలవాట్లు’ అని మార్చేసినట్టున్నారు.

ఆలోచించవలసిన విషయం ఏమిటంటే అరబ్బులు, పర్షియన్లు, ఆంగ్లేయులు, భారతదేశం వచ్చి భారతీయుల అలవాట్లు ‘అనాగరికం’ అని వారి దృష్టితో తీర్మానించి రాసిన గ్రంథాలు ప్రామాణికం. వారు రాసినవన్నీ తు.చ. తప్పకుండా నమ్మేస్తాం. పాఠ్యపుస్తకాలలో చేర్చి పిల్లల మెదళ్ళలోకి మన అలవాట్లు అనాగరికం అని చొప్పిస్తాం. కానీ, అదే భారతీయులు తమ దృక్కోణంలో విదేశీయులను చూసి, వారి అనాగరికతకు  జాలిపడి, అసహ్యించుకుని, నవ్వుకుంటే, మనోభావాలు దెబ్బతింటాయని ‘లౌక్యం’ ప్రదర్శిస్తాం. ఎదుటివాడికి మన అలవాట్లు విచిత్రంగా, అనాగరికంగా కనిపిస్తే అభ్యంతరపెట్టని మనం; ఎదుటివారి  అలవాట్లు మనకు విచిత్రంగా, అనాగరికంగా కనిపిస్తాయంటే ఆమోదించం, ఆక్షేపిస్తాం. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయని మన కళ్ళు మూసేస్తాం, నోళ్లు నొక్కేస్తాం, ముక్కులు మూసేసుకుంటాం. ఇదే మనస్తత్వం ఈనాటికీ భారతీయ సమాజంలో కనిపిస్తున్నది. ‘మ్లేచ్ఛ దురాచారాలు’ ఏమిటో జోనరాజు రాయలేదు. రాస్తే తని మెడ మీద తల నిలవకపోవటమే కాదు, రాజతరంగిణి మనకు మిగిలేది కూడా కాదు. ఆనాటి పరిస్థితులు భావితరాలకు అందాలంటే నిజంతో రాజీ పడక తప్పదు. నిజాన్ని అందమైన పదం  నీడలో ఒదిగించి రాయక తప్పదు.

జోనరాజు కసి, కోపం, నిస్సహాయ ఆక్రోశం, వేదన, దుఃఖం సర్వం తరువాతి శ్లోకంలో స్పష్టమవుతాయి.

మ్లేచ్ఛుల దురాచారాల వల్ల కశ్మీరంలో బ్రాహ్మణులు, మంత్రాలు, దేవతలు, తమ శక్తిని త్యజించారట! తమ మహిమను విసర్జించారట!

ప్రతి కర్మకు ఫలితం ఉంటుంటన్నది భారతీయ సిద్ధాంతం. కర్మ ఫలాన్నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. కశ్మీరీ ప్రజలు మ్లేచ్ఛుల దురాచారాలు పాటిస్తున్నారు. ఇప్పుడు వారికి బ్రాహ్మణులతో పని లేదు. మంత్రాలతో పనిలేదు. అంటే దైవంతోనూ పని లేదు. ఇక వారి మహిమలతో పని ఏముంటుంది? అందుకని తమ మహిమనూ వారు త్యజించారు.

ఎలాగయితే మిణుగురు పురుగులు తమ వెలుగును దర్శింపజేస్తాయో, అలా తమ శక్తిని ప్రదర్శించే దేవతలు, ఇప్పుడు తమ గొప్పతనాన్ని దేశంలో పెరుగుతున్న పాపాన్ని చూసి దాచేశారు. తమ అవసరం ప్రజలకు ఇక  లేదని దేవతలు గ్రహించారు. తమ శక్తిని ప్రదర్శించటం మానేశారు దేవతలు. దాంతో, కశ్మీరం దుర్భరమైన స్థితికి దిగజారింది. అతి దయనీయమైన వర్ణన ఇది!

ప్రభావతేజో యైర్దేవైః సతతం ప్రకటీకృతమ్।
ఖద్యోతైరివ తైరేవ దేశాదోషాద్ వినిహృతమ్॥
(జోనరాజ రాజతరంగిణి 592)

తమ ప్రభావ తేజాన్ని ప్రకటీకృతం చేసే దేవతలు, దేశదోషం వల్ల తమ ప్రభావ తేజాన్ని దాచేశారట! దేవతలు అదృశ్యం అవలేదు. దేశం వదిలి పారిపోలేదు. అంతరించలేదు. తమ ప్రభావాన్ని దాచారు. ఆయుధాలను జమ్మిచెట్టులో దాచిన పాండవులలా, దుర్దశ ప్రాప్తించినప్పుడు దేవతలు తమ ప్రభావాన్ని దాచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఎంత దయనీయమైన స్థితి వర్ణన ఇది! ఈ శ్లోకాన్ని సృజించే సమయంలో జోనరాజు ఎంతటి వేదనను, రంపపు కోతను అనుభవించి ఉంటాడో ఊహించటానికే భయం వేస్తుంది. ఇంకా జోనరాజు అదృష్టవంతుడు. కశ్మీరులో ఉంటూ తన దేవతలను ఏదో ఒక రకంగా పూజించుకోగలుగుతున్నాడు. ఇంకా ధర్మదీపాన్ని వెలిగించగలుగుతున్నాడు. కానీ ఆ దీపాన్ని పూర్తిగా ఆర్పేసి, మ్లేచ్ఛమతాన్ని స్వీకరించిన వారి మానసిక స్థితి, ఆ దీపాన్ని సజీవంగా కాపాడుకునే తపనలో ప్రాణాలు కోల్పోయిన వారి క్షోభ, ఆ దీపాన్ని సజీవంగా నిలిపే తపనతో  ప్రాణాలు అరచేత పట్టుకుని మాతృభూమికి శాశ్వతంగా దూరమై ఇతర ప్రాంతాలలో కాందిశీకుల్లా బ్రతుకుతున్నవారి మానసిక దుస్థితి, ఎటు పారిపోయినా, అటు మ్లేచ్ఛ మూకలు రాక్షసుల్లా విరుచుకుపడుతుంటే, కొడకట్టుతున్న దీపాన్ని ఆరనీయకుండా ఆపాలని విఫల ప్రయత్నాలు చేస్తూ, చిక్కటి చీకటి లాంటి భవిష్యత్తులో ఎక్కడో ఆశాదీపాన్ని దర్శించి, ధర్మాన్ని పళ్ళ బిగువున కాపాడుకుంటూ జీవికను సాగించే వారి నిరాశలో ఆత్మస్థయిర్యం.. ఈనాడు అన్ని సౌఖ్యాల నడుమ జీవిస్తూ, ధర్మాన్ని దూషిస్తూ, దైవాన్ని దూషిస్తూ, శాస్త్రాన్ని విమర్శిస్తూ ఎంతో గొప్పవాళ్ళమనుకుంటున్న మనకు అర్థం కాదు. మనలాంటి మూర్ఖ కృతఘ్న మూర్తులను చూస్తూ జోనరాజుతో సహా నాటి భారతీయుల ఆత్మలు ఎంతగా ఘోషిస్తున్నాయో! ఇలాంటి వాళ్ళ కోసమా ధర్మదీపాన్ని సజీవంగా నిలిపిందని ఎంతగా ఆక్రోశిస్తున్నాయో!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here