Site icon Sanchika

జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-43

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

[dropcap]‘జా[/dropcap]తి’ అన్న పదాన్ని ‘కులం’కు  పర్యాయ పదంలా విదేశీయులు అర్థం చేసుకోవటం వెనుక చరిత్ర ఉంది.

‘మైలవరపు సుధా మోహన్’ అనే రచయిత ఎంతో లోతైన పరిశోధన చేసి ‘శివస్య కులం’ అనే పరిశోధనాత్మక పుస్తకం రాశారు. ఆ పుస్తకం ప్రకారం ‘అలెగ్జాండర్ డౌ’ 1768లో ‘వర్ణం’ను ‘tribe’ అని, ‘జాతి’ని ‘caste’ అని అన్నాడు. 1776లో Nathaniel Braffey Halhed ‘వర్ణం’ను ‘tribe’ అని అనువదించాడు. జె. హెచ్. నెల్సన్ ప్రకారం ‘caste’ అన్న పదం భారతీయ సమాజంలో అంశాలను సూచిస్తుంది. కొందరు ‘caste’ అన్న పదాన్ని తెలుగు వారిని సూచించటానికి ‘Gentoo Caste’ అని వాడేరు. మరికొందరు వృత్తి సూచకంగా వాడేరు. 1868లో ‘caste’ అంటే, భారతీయుల సంప్రదాయాలు, వృత్తులు, జాతి, ధర్మం వంటి అర్థాలుండేవి [శివస్య కులం, పేజీ 19, 20లలోని పేరాల సంక్షిప్త అనువాదం]. అంటే, బ్రిటీష్ వారు సంస్కృతం నుంచి తర్జుమా చేసేప్పుడు ఆ పదాలకు నిర్దిష్టమైన అర్థాలు లేవన్న మాట.  ఎవరికి ఎలా అర్థమయితే అలా వాడేవారు. ఇప్పుడు పదాలు ఘనీభవించి, నిర్దిష్టార్థం ఏర్పడిన తరువాత ఈ అనువాదాలు అపార్థాలకు, అనవసర ఉద్విగ్నతలకు తావిస్తున్నాయి. కాబట్టి జోనరాజు ‘జాతి విధ్వంసే’ అంటే కులభ్రష్టులను చేస్తున్నట్లుగా అర్థం చేసుకోకూడదు. ఇప్పుడు మతాంతరీకరణకు వాడుతున్న పదం అప్పుడు లేదు. భారతీయులను మహమ్మదీయులుగా బలవంతంగా మార్చటాన్ని జోనారాజు ‘జాతి విధ్వంసం’ అని సంబోధించాడనుకోవటం సమజంసంగా ఉంటుంది. ‘జాతి విధ్వంసం’ అన్న పదానికి ఈ కాలంలో ‘మతాంతరీకరణ’ అన్న పదం దగ్గరగా ఉంటుంది. ఇది కూడా సరైన పదం కాదు. కానీ, ఆ కాలంలో జోనరాజు తన కళ్ళ ఎదురుగా కశ్మీరీయులు మహ్మదీయులుగా బలవంతంగా మారటాన్ని ‘జాతి విధ్వంసం’గా అభివర్ణించటం సమంజసంగా అనిపిస్తుంది. ఈ ఆలోచనకు తరువాత శ్లోకం బలమిస్తుంది.

జాతి ధ్వంసే మరిష్యామో ద్విజేశ్వతి వదత్స్వథ।
జాతి రక్షా నిమిత్తం స తాన్ దుర్దండ మజి గ్రహత్॥
(జోనరాజ రాజతరంగిణి 606)

బ్రాహ్మణులు తమ జాతిని వదులుకొనేందుకు ఇష్టపడలేదు. వారు మరణించేందుకు సిద్ధమయ్యారు, కానీ జాతిని వదులుకొనేందుకు సిద్ధపడలేదు. దాంతో సూహభట్టు వారిని కఠినంగా శిక్షించాడు. వారిపై అధికంగా పన్నుల భారం మోపాడు. ఇక్కడ ‘జాతి ధ్వంసే’ – తన జాతిని ధ్వంసం చేసుకునే బదులు మరణించేందుకే బ్రాహ్మణులు సిద్ధమయ్యారు. అంటే అర్థం ‘కులం’ వదులుకోవటం కాదు. తమ ధర్మాన్ని వదులుకోవటం కన్నా మరణం మేలు అని భావించారని అర్థం. భగవద్గీతలో కూడా ‘స్వధర్మే నిధనం శ్రేయః’ అని ఉంటుంది. దాన్ని సంకుచితార్థంలో తీసుకుని కుత్సితంగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రాచీన గ్రంథాలలోని పదాల అర్థాలు విశ్లేషించే ముందు ‘నన్నయ నాటి కంపు నేడు ఇంపు కాదు’ అన్న సూత్రాన్ని గుర్తుంచుకోవాలి. నిత్యచంచలమైన ప్రపంచంలో, అతి చైతన్యవంతమైన సమాజంలో, క్షణక్షణం మారిపోయే పరిస్థితుల నడుమ ఇప్పటి అర్థంలో అప్పటి పదాలను అర్థం చేసుకుంటే అపార్థం, అనర్థం తప్ప సరైన రీతిలో అర్థం కాదు. కాబట్టి బ్రాహ్మణులు తమ జాతిని త్యజించే కన్నా మరణించటం మేలు అని అనుకున్నారంటే, కులం వదులుకోవటం అని అర్థం చేసుకోవటం పొరపాటు. ‘ఇస్లాం’ స్వీకరించిన మరుక్షణం వారు కోల్పోయేది కేవలం, కులం మాత్రమే కాదు, వారు కోల్పోయేది ధర్మం, ఆ ధర్మానికి చెందిన ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రాచీన విజ్ఞానం, వాఙ్మయం.. ఒకటేమిటి సర్వం కోల్పోయిన వారవుతారు. సంపూర్ణంగా నూతన జన్మను ఎత్తినవారవుతారు. అందుకే ‘జాతి రక్షా నిమిత్తం’ అంటే కేవలం తమ కులాన్ని కాపాడుకోవటమే కాదు, తమ ధర్మాన్ని, తమ దైవాన్ని, తమ సంస్కృతిని, తమ సాంప్రదాయాలను, తమ వాఙ్మయాన్ని కాపాడుకోవటం. దాన్ని కాపాడుకోవటం కోసం ఎన్ని కష్టాలైనా భరించేందుకు సిద్ధంగా ఉన్నారన్న మాట.

ఆ కాలంలో ఎలాంటి అణచివేతను, ఎలాంటి దమనకాండను, ఎంతటి క్రౌర్యాన్ని, ఎంతెంత దౌష్ట్యాన్ని, ఎలాంటి దుర్భరమైన అమానుష పరిస్థితులను భారతీయులు ఎదుర్కున్నారో ఊహించాలంటేనే రక్తం గడ్డ కట్టుకుపోతుంది. ప్రశాంతంగా తమ మానానా తాము బ్రతుకుతూ, సత్యాన్వేషణ చేస్తున్న సాత్విక  సమాజంపై ఆకాశం నుంచి పడిన పిడుగులా, విరుచుకుపడ్డ తుఫానులా, కర్కష  మూకలు విరుచుకుపడి అల్లకల్లోలం చేస్తుంటే, మానసికంగా వారెంతగా గాయపడి ఉంటారో, అయినా విశ్వాసాన్ని కూడదీసుకుని ఎలా నిస్సహాయ స్థితిలోనూ ధర్మ రక్షణ కోసం, జాతి రక్షణ కోసం నిలబడి ఎదురునిల్చి పోరాడేరో తలచుకుంటే గర్వంతో ఎద ఉప్పొంగుతుంది. ఎలాంటి మహాత్ములు వారు! ఎంతటి అకుంఠిత ధర్మ రక్షణా దీక్షాపరులు వారు అనిపిస్తుంది. ఏ ధర్మాన్నయితే కాపాడడానికి వారు ప్రాణాలు పణంగా పెట్టారో, రాక్షసుడి లాంటి వారితో, నిరాయుధులైనా పోరాడేరో , ఆ ధర్మాన్ని ఈనాడు చులకన చేసి, తీసి పారేస్తున్నాం, అదీ కష్టం అంటే తెలియని మొబైల్ గాడ్జెట్లు, ఎసి కార్ల తరం, అంటే బాధ ద్విగుణీకృతమవుతోంది. కశ్మీరులో ప్రజలు స్వచ్ఛందంగా ఇస్లాం స్వీకరించారన్న వాదనకు చెంపపెట్టు లాంటిది జోనరాజు రాసిన శ్లోకం. ప్రాణాలు వదులుకుంటాం కానీ, ధర్మాన్ని వదులుకోం అన్న వారిని పన్నుల భారం క్రింద అణచివేసి, జీవికను దుర్లభం చేస్తే, చచ్చినట్టు ఇస్లాం స్వీకరిస్తారన్న ఆలోచనతో వారిపై పన్నులు పెంచారన్న మాట. కథ ఇంతే కాదు, ఇంకా ఉంది.

బ్రాహ్మణులు జాతి ధ్వంసం కన్నా ప్రాణాలు కోల్పోయేందుకు సిద్ధమయ్యారని జోనరాజు రాశాడు. దానికి ఆంగ్ల అనువాదం ఇది:

“When the [members of the] twice-born [classes] exclaimed they would seek death if the abolishment of [their] classes [was enforced, Suha] imposed the heavy [gizya] tax on them, when they retained [their affiliation to their] classes.” [Kingship of Kashmir, Translation of Jonaraja Rajatarangini by Walter Slaje, P. No. 86].

వాళ్ళ కులం రద్దు చేస్తే ప్రాణాలు త్యాగం చేస్తామని బ్రాహ్మణులు పట్టుబట్టినప్పుడు సూహభట్టు వాళ్ళపై ‘జిజియా పన్ను’ విధించాడు, బ్రాహ్మణులు వాళ్ళ కులాన్ని వదలనందుకు.

మొత్తం అర్థం మారిపోయింది. ధర్మం కోసం ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధపడి కూడా ధర్మాన్ని వదలనందుకు, పన్నుల భారం క్రింద నలుగుతూ కూడా తమ ధర్మాన్ని నిలుపుకున్నావారు  కాస్తా,  తమ కులం వదలకుండా ఉన్నందుకు శిక్షగా  సుల్తాన్ వారిపై పన్నుల భారం విధించినట్టయి పోయింది. అంటే, కులాన్ని పట్టుకుని వ్రేలాడే బ్రాహ్మణుల ఛాందసత్వాన్ని వదలగొట్టేందుకు సుల్తాన్ వారిపై పన్నులు విధించాడన్న మాట. సుల్తాన్ సంఘ సంస్కర్త. బ్రాహ్మణులు, కులాన్ని, ఆచారాన్ని పట్టుకొని వ్రేలాడే మూర్ఖులు, ఛాందసులు. ఇదే ఈనాటికి కొనసాగుతోంది. బ్రాహ్మణ ద్వేషం, వెరసి, భారతీయ ధర్మ ద్వేషంగా పరిణమించి దేశానికి పెనుముప్పుగా ఎదిగింది. సమాజంలో ఉద్విగ్నతలకు కారణమవుతోంది.

జోనరాజు చెప్పినదాన్ని ఫరిస్తా మరింత ముందుకు తీసుకుపోయాడు:

“Suhabhatta strove hard that the sultan at his suggestions ordered that all Brahmanas and learned Hindus should become Musalman, and those who did not accept Islam should leave (i.e. the valley). The qashqa (holy mark) was not to be put on forehead, widows were not to be buried with the corpse of their husbands, and idols of gold and silver were to be melted  in the royal mint and the metal used for the currency. Owing to this, a great calamity to fell on the Hindus of the region, who are mostly Brahmanans. Many Brahmanas who could not neither accept Islam or leave the country, committed suicide. Others left their homeland and went to foreign countries.”

ఈ రాతలు చూస్తుంటే సుల్తాన్ నేరం ఏమీ లేదన్న భావన కలుగుతుంది. సుల్తాన్‍కు ధనం అవసరమయింది. ధనం ఎందుకు అవసరమైందంటే, తైమూర్ దాడికి వచ్చాడు. అతనికి ధనం ఇవ్వాలి. సుల్తాన్ వద్ద ధనం లేదు. అందుకని మందిరాలలో ఉన్న బంగారం, వెండి కరిగిస్తే తైమూర్‍కి ఇచ్చేందుకు సరిపడా ధనం లభిస్తుంది. దాంతో మందిరాలను ధ్వంసం చేయమన్నాడు సుల్తాన్. ఇది హిందువులకు కష్ట కాలం అయింది. పన్నులు విధించాడు. పన్నులు కట్టలేని వారు ఇస్లాం స్వీకరించారు. ఇష్టం లేని వారు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రాణాలు అరచేత పట్టుకుని వేరే దేశాలకు వెళ్ళారు.

ఎంత సులువుగా, తేలికగా చెప్పేశారు, కానీ అక్కడ అనుభవించిన వారికి బాధ తెలుస్తుంది. ఆధునిక సమాజంలో కూడా కట్టుబట్టలతో ప్రాణాలు అరచేత పట్టుకుని తమ స్వంత దేశంలో కాందిశీకులుగా బ్రతుకులు గడుపుతున్న కశ్మీరీ పండితుల వ్యథను కూడా ఇలాగే తేలికగా కొట్టేస్తారు. ఇతర దేశాల నుండి వలసలు వస్తున్న వారికి ఇస్తున్న ప్రాధాన్యం కూడా కశ్మీరీ పండితులకు ఇవ్వటం లేదు. ఇది చూస్తుంటే అనిపిస్తుంది – కశ్మీరీ పండితులు, ప్రజలు శాపగ్రస్తులేమో అని. జోనరాజు వర్ణించినట్టు ఆనాడు, సికందర్ బుత్‍షికన్ కాలంలో కశ్మీరును వదిలి వెళ్ళిన దేవతలు ఇంకా కశ్మీరులో అడుగుపెట్టలేదేమో అనిపిస్తుంది. ఆనాడు మంత్రాలను వదిలి వెళ్ళిన శక్తి, ఇంకా అక్షరాలలో ప్రవేశించలేదనిపిస్తుంది.

శ్రీ సింహభట్ట కస్తూట వణిజౌ శ్లాఘ్యతాం గతౌ।
శ్రీ నిర్మలాచార్య వర్య స్త్రి జగ చ్ఛ్లాఘ్యతాం గతః॥
(జోనరాజ రాజతరంగిణి 608)

ఆ కాలంలో, ఏ కాలంలో అయితే బ్రాహ్మణులు, వారిపై ఆధారపడిన వారంతా, సుల్తాన్ మెప్పు కోసమని, తమ జాతిని త్యజిస్తున్నప్పుడు, శ్రీ సింహ, భట్టకస్తూట అనే ఇద్దరు వ్యాపారులు శ్లాఘనీయులయ్యారు. ముల్లోకాలలో ప్రశంసనీయుడయ్యాడు శ్రీ నిర్మలాచార్య వర్యుడు, ఎందుకంటే తన ఆస్తినంతా తృణప్రాయంగా వదిలివేశాడు కానీ సుల్తాన్ మెప్పు కోసం జాతిభంగం చేయలేదు.

తక్త్వా జాతిగ్రహం యత్తావన్య దర్శన సేవినౌ।
శుష్కం తురుష్క దండం చ విన్యవారయతాం యతః॥

నిర్మలాచార్య వర్యః స సర్వస్వం తృణవత్ క్షణాత।
త్యజేన రాజప్రసాదేన న జాతిం స్వామద్దూషయత్॥
(జోనరాజ రాజతరంగిణి 609, 610)

తమ ధర్మం వదలని ఇద్దరు వ్యాపారులు శ్రీ సింహ, భట్టకస్తూటల గురించి చెప్పాడు జోనరాజు. తమ చుట్టూ ఉన్న వారంతా రాజు మెప్పు పొందటం కోసం ధర్మాన్ని త్యజిస్తున్నా, వీరు ధర్మం వదలలేదు. నిర్మలాచార్య వర్యుడు తురుష్క సూహుడి దండనకి సిద్ధమయ్యాడు, ఆస్తిని తృణప్రాయంగా వదిలేశాడు. కానీ తన జాతిని వదలలేదు.

ఇక్కడ జోనరాజు రాజతరంగిణిలో పలువురు ప్రక్షిప్తాలుగా భావిస్తున్న శ్లోకాలు కొన్ని ఉన్నాయి. వీటి ప్రకారం, సికందర్ శిరస్సు పై బ్రహ్మదండం  పడింది. అందువల్ల అతని తలకు గాయమైంది. అది వ్రణంలా మారింది. నరకంలో పడాల్సిన బాధలు అలవాటయ్యేందుకన్నట్లు, తీవ్రమైన బాధలను భూమిపై అనుభవించాడు సికందర్. పలువురు ఇవి ప్రక్షిప్త శ్లోకాలుగా భావిస్తారు. కల్హణ రాజతరంగిణిలో కూడా దుష్టరాజు తలపై బ్రహ్మదండం పడి తలపై గాయమయి, పురుగులు పడి తీవ్రమైన బాధలను అనుభవిస్తూ రాజు మరణిస్తాడు. తాను చేసిన దుష్కర్మల ఫలితంగా సికందర్ తలపై బ్రహ్మదండం వల్ల గాయమై, నరక బాధలు అనుభవిస్తూ, మరణించాడన్నది ఎవరో కసి తీర్చుకోవటం కోసం జోడించి ఉంటారని భావిస్తున్నారు. ఎందుకంటే, తరువాత జోనరాజు రాసిన శ్లోకాలకు ఈ శ్లోకాలకు అన్వయం కుదరదు.

స్వామీ భృత్యా పరాధీన దండనీయ ఇతి స్థితే।
సూహభట్టా పరాధేన కాలో భూపే కరోత కృధమ్॥
(జోనరాజ రాజతరంగిణి 611)

సేవకుడి పొరపాటుకు అధికారి బాధ్యుడు అవుతాడన్నది నిరూపితమైన సూత్రం. కాబట్టి సూహభట్టు దుష్కర్మల ఫలితంగా మృత్యువు రాజు పట్ల ఆగ్రహం ప్రదర్శించింది.

ఈ శ్లోకం కన్నా ముందరి శ్లోకం జోనరాజు రాసినట్లయితే ఈ శ్లోకం రాసేవాడు కాదు. ఎందుకంటే ఈ శ్లోకంలో జోనరాజు తనకి అలవాటయిన రీతిలో రాజును తప్పు పట్టడం లేదు. సేవకుల దోషం ప్రభువుకు అంటుకుంటుంది. ఫలితం ప్రభువు అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి, సూహభట్టు చేసిన దుష్కర్మల ఫలితంగా మృత్యువు రాజు పట్ల కోపం వహించింది అంటున్నాడు జోనరాజు. మొదటి నుంచి జోనరాజు రచన పద్ధతిని గమనిస్తూ వచ్చిన వారికి సూహభట్టును జోనరాజు దోషిగా నిలపటంలో ఆశ్చర్యం కలగదు. కానీ రాజు చేసిన నేరాలకు ఫలితంగా ధర్మదండం పడి రాజు దుర్భరమైన వేదనను అనుభవించి మరణించినట్టు రాయటం కుదరదు. ఎందుకంటే జోనరాజు చెప్తున్నది తనకు ఆశ్రయమిచ్చిన సుల్తాన్ తండ్రిని గురించి కాబట్టి.

మొత్తానికి సికందర్ మరణించాదు. మరణించే ముందు తన పెద్ద కొడుక్కి సింహాసనం కట్టబెట్టాడు. సికందర్ 1413 సంవత్సరంలో మరణించాడు. 1389లో రాజ్యానికి వచ్చాడు. అంటే మొత్తం 24 ఏళ్ళు కశ్మీరాన్ని పాలించాడన్న మాట సికందర్. కశ్మీరుపై అత్యంత ప్రభావం చూపిన కాలం ఇది. సికందర్ పెద్ద కొడుకు అల్లీ షా.

అల్లీ షా పాలనా కాలం ఆరేళ్ళు. ఈ ఆరేళ్ళలో అల్లీ షా జరిపిన అకృత్యాలకు లెక్క లేదు. సికందర్ బుత్‍షికన్ మరణించాడని ఊపిరి పీల్చుకునే లోగా అతని భూతంలా అల్లీ షా రాజ్యానికి వచ్చాడు. అయితే, అల్లీ షా పాలన గురించి జోనరాజు ఏమన్నాడో తెలుసుకునే ముందు సుల్తానుల పాలన ఆరంభమయినప్పటి నుంచీ కశ్మీరుపై తీవ్రమైన ప్రభావం చూపిస్తున్న ఇస్లామీ ప్రవక్తల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది.  ముఖ్యంగా సికందర్‍ను తీవ్రంగా ప్రభావితం చేసిన ‘మహమ్మదా’ గురించి వివరంగా తెలుసుకుంటేనే కశ్మీరులో తరువాత జరిగిన పరిణామాలు మరింత సులభంగా బోధపడతాయి.

(ఇంకా ఉంది)

Exit mobile version