Site icon Sanchika

జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-44

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

[dropcap]ఒ[/dropcap]కే విషయాన్ని అవగాహన చేసుకోవటంలో, అర్ధం చేసుకోవటంలో ఆ విషయాన్ని చూసే దృష్టి ప్రధాన పాత్ర వహిస్తుంది. పిల్లి ఎలుకతో చెలగాటం ఆడి చంపుతుంది. పిల్లి వైపునుంచి చూస్తే అది సాధారణమైన విషయం. ఎలుకవైపు నుంచి చూస్తే అది అన్యాయం. కశ్మీరులో  ఇస్లామీయులు అధికారానికి వచ్చారు. కానీ, వారు పరమత సహనం పాటిస్తూ వచ్చారు. ఇది ఇతర ఇస్లామీయులకు నచ్చలేదు. దాంతో వారు కశ్మీరులో వున్న ఇస్లామీయులకు ఇస్లాం నేర్పేందుకు కశ్మీరు వచ్చారు. ఫలితంగా, కశ్మీరులో వున్న ఇస్లామేతరుల మనుగడ ప్రమాదంలో పడింది. కొన్ని వేల సంవత్సరాలుగా తాము నమ్మి అనుసరిస్తున్న ధర్మాన్ని వదలి నూతన జన్మ ఎత్తిన వారిలా సంపూర్ణంగా రూపాంతరం చెందాల్సివచ్చింది. లేదా, ప్రాణాలు అరచేతపట్టుకుని, తరతరాలుగా తాము జీవిస్తూ వస్తున్న మాతృభూమిని వదలి సురక్షితమైన మరో భూమిని వెతుక్కుంటూ పోవాల్సివచ్చింది. ఈలోగా అనేకానేక అకృత్యాలను భరించాల్సివచ్చింది. ఈ విషయాన్ని ఇస్లామీయుల దృష్టితో చూస్తే ఒక రకంగా కనిపిస్తుంది. ఇస్లామేతరుల దృష్టితో చూస్తే మరో రకంగా కనిపిస్తుంది. కశ్మీరును సంపూర్ణంగా ఇస్లాం మయం చేయటంలో ప్రధాన పాత్ర పోషించిన మీర్ సయ్యద్ అలీ హమదాని గురించిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి.

“Mir Sayyid Ali Hamadani is the founder of the Hamadaniyyeh branch of the Kubraviyyeh order centered in Kashmir. The order was established as a part of the Islamization of the region.”

– Mir Sayyaid Ali Hamadani Era and His Significance in the History of Civilization of the Peoples of Central Asia by Iraj Bashiri.

~

“The year 1384 C.E marks a turning point in the history of Islam in Kashmir as it witnessed the arrival of a well-organized Islamic mission under the leadership of a great Sufi master, erudite scholar, versatile writer Saiyid Ali Hamadani who was accompanied by about seven hundred followers, a majority of whom were themselves scholars in different branches of knowledge, art and craft. Although there are scholarly differences among historians about the number of times Syed Ali Hamadani came to Kashmir but at the same time all the scholars and historians  are unanimous about his undisputed revolutionary role in Islamization of Kashmir.”

– Mir Sayyaid Ali Hamadani Era and His Contribution towards Islamization of Kashmir, by Muhammad Shafi Bhat

~

“The story of how Hamadani arrived in Kashmir to find the king married to two sisters figures prominently as an example of the degeneracy of the Kashmiri community in most modern accounts of Hamadani’s attempts to spread ‘true’ Islam in Kashmir and Baltistan.”

– A Second Ali – The Making of Sayyid ‘Ali Hamadiini in Popular Imagination, by Jamal J. Elias

~

“Capitalising on his position of authority and influence as a Sayyid, he issued fiats to the Muslim ruler, Qutub-ud-Din, to Islamise his state by placing it on the foot-stool of Sharia (Islamic law) and also impose ‘twenty humiliating conditions’ on the Hindu Kafirs with the express intent of coercing them to get converted to Islam at pain of death.”

– Kashmir – Wail of the Valley, Mohan Lal Kaul

~

“As a result of the efforts of Syed Ali Hamdani a new generation of converted Muslims was born. The people of this generation supported not only the foreign religious preachers on the religious plank but also contributed fully in their activities connected with forcible conversion. These people left no stone unturned in demolishing monasteries and temples built by their ancestors. The eagerness with which these converted people demonstrated their faith in foreign religious practices by destroying the established ancient practices is a highly dark chapter of the history of Kashmir.”

– Converted Kashmir – A Bitter Saga of Religious Conversions by Narender Sehgal

~

Ali Hamadani was a great reformer and a visionary who has impacted  almost all the aspects of the lives of Kashmiris. Be it religious or spiritual dimension or social and political, be it the economic activity by introducing the arts and crafts of Iran and Central Asia in Kashmir or the instructions to the Kings and rulers ,in all these matters the influence and impact of Syed Ai Hamadani cannot be undermined

-Syed Ali Hamadani and his influence on the society and life in Kashmir by Prof Hamid Naseem Rafiabadi.

***

ఏదైనా విషయాన్ని అర్థం చేసుకోవటంలో ‘దృష్టి’ ప్రాధాన్యాన్ని పైన ఉదహరించిన వ్యాఖ్యలు స్పష్టం చేస్తాయి. కశ్మీరు ఇస్లామీమయం అయిన విధానాన్ని స్పష్టం చేస్తాయి. కశ్మీరు ఇస్లామీకరణ పట్ల విభిన్నమైన దృక్కోణాలను ప్రదర్శిస్తాయి ఈ వ్యాఖ్యలు. ముఖ్యంగా కశ్మీరు సంపూర్ణంగా ఇస్లాంమయం అయి, ఇస్లామీయులు భారతీయుల నడుమ నెలకొని ఉన్న సున్నితమైన స్నేహ సౌహార్ద్ర భావనలు అదృశ్యమై మత ఛాందసం విజృభించి, కశ్మీరులో మరో ఆలోచనకు తావు లేని విధంగా ఇస్లాం మత ఛాందసాన్ని నెలకొల్పేందుకు కారణాలను అత్యంత స్పష్టంగా ప్రదర్శిస్తాయీ వ్యాఖ్యలు. తండ్రీ కొడుకులు మీర్ అలీ హమదానీ, మీర్ మహమ్మద్ హమదానీలు కశ్మీరు సంపూర్ణంగా ఇస్లామీకరణ చెందడంలో ప్రధాన పాత్ర వహించిన వారు. వీరి గురించి, కశ్మీరును వీరు సంపూర్ణంగా ఇస్లామీకరణ చెందించిన విధానాన్ని గురించి తెలుసుకోకపోతే, కశ్మీరు చరిత్ర పట్ల అవగాహన కలగటం కష్టం. జోనరాజ రాజతరంగిణి మాత్రమే కాదు, తరువాత కశ్మీరు చరిత్ర ఆధారంగా వచ్చిన ఏ రాజతరంగిణిని కూడా సంపూర్ణంగా అర్థం చేసుకోవటం సాధ్యం కాదు. కశ్మీరును సంపూర్ణంగా ఇస్లామీమయం చేసిన హమదాని తండ్రీ కొడుకులు గురించి తెలుసుకోవాలంటే ఇరాన్ లోని ‘హమదాన్’ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది.

ఇరాన్‍కు చెందిన అతి ప్రాచీన ప్రాంతం హమదాన్. క్రీ.పూ. 11వ శతాబ్దం నుంచీ హమదాన్ నగరం చలామణీలో ఉన్నట్లు ఆధారాలున్నాయి. భైబిల్‌లో ‘బుక్ ఆఫ్ ఎజ్రా’లో యూదులకు ఒక మందిరం నిర్మించుకునే అనుమతి ఇచ్చినట్టు ‘హమదాన్’ వద్ద దొరికిన తాళపత్రాలలో ఉంది. హమదాన్‍ను మంగోలులు నాశనం చేశారు. అది మళ్ళీ తలెత్తేలోగా, తైమూరు దండయాత్రలు నగరాన్ని సర్వనాశనం చేశాయి. పేరు పొందిన కవులకు, మత ప్రచారకులకు హమదాన్ పెట్టింది పేరు. ఇరాన్ చరిత్రకు సంబంధించిన ప్రధాన గ్రంథం ‘జామి అల్-తవరిఖ్’ రచించిన రషీద్ అల్-దిన్ తబీబ్ హమదాన్‌కు చెందినవాడే. ఈ పుస్తకంలో భారత్ ప్రస్తావన, ముఖ్యంగా కశ్మీర్ ప్రస్తావన ఉంది. ‘కితాబ్ ఉల్ హింద్’ లేదా ‘తాహ్‌కిక్ అల్ హింద్’ అన్న అబు అల్-యహాన్ అల్-బెరనీ పుస్తకం నుంచి భారత్‌కు సంబంధించిన సమాచారాన్ని గ్రహించాడీయన. ఈయనకు కశ్మీరు బౌద్ధానికి సంబంధించిన సమాచారాన్ని అందించినది ‘కమల శ్రీ’ అనే బౌద్ధ శ్రమణకుడు. కశ్మీరు శారదా మందిరంలో దొరికిన 1236 సంవత్సరానికి చెందిన శాసనాలలో, కమల శ్రీ ప్రసక్తి ఉంది. రషీద్ పుస్తకంలో కశ్మీరుకు చెందిన ‘ప్రవరసేనుడి’ ప్రస్తావన ఉంది. అయితే కమల శ్రీ బౌద్ధుడవటంతో రషీద్ పుస్తకం పుస్తకంలోని కాలగణన కల్హణ రాజతరంగిణి కాలగణనతో సరిపోలదు. దీని ఆధారంగా కూడా పలువురు రచయితలు రాజతరంగిణిని విమర్శిస్తారు. రషీద్ తన చరిత్ర పుస్తకంలో కశ్మీరు రాజుల గురించి రాశాడు కానీ, 1251-59 నుంచీ, అంటే ఇరాన్‍పై మంగోలులు ఆధిక్యం సాధించినప్పటి నుంచీ ‘మంగోలు ఖాన్’లు, కశ్మీరులో ఎవరు రాజ్యం చేయాలో నిర్ణయిస్తారని రాశాడు. ఆసియాకి చెందిన ముస్లిం చరిత్ర రచయితలు ‘జామి అల్-తవరిఖ్’ ను ప్రామాణికంగా తీసుకుని భారత చరిత్రను, ముఖ్యంగా కశ్మీరు చరిత్రను రాశారు. ‘అలీ హమదానీ’కి కశ్మీరు పరిచయం ఈ గ్రంథం ద్వారా సంభవించిందని పలువురు చరిత్ర రచయితలు భావిస్తారు.

కశ్మీరులో ఇస్లాంకు ఊపు – మధ్య ఆసియా నుంచి కశ్మీరు వచ్చిన మత ప్రచారకుల వల్ల లభించింది. వీరిలో అధికులు ‘సూఫీ’లవటం గమనార్హం. ‘సూఫీ’లు అధికంగా ‘సున్నీ’ ముస్లింలు. ఇస్లాంలో సున్ని ముస్లింలు, షియా ముస్లింల నడుమ పలు రకాల ఉద్విగ్నతలు ఉంటాయి. ‘సూఫీ’లు పెద్ద ఎత్తున కశ్మీరు వచ్చి చేరటం వల్ల కశ్మీరులో షియా, సున్నీల నడుమ ఉద్విగ్నతలు చెలరేగాయి. ఇది భవిష్యత్తుకు సంబంధించిన అంశం. కశ్మీరులో ‘ఇస్లాం’కు ఊపు – కశ్మీరులో బుల్‍బుల్‌ షాగా  ప్రసిద్ధి చెందిన షేక్ షర్ఫ్-ఉద్-దిన్ సుహ్రావర్ది వల్ల లభించింది. కశ్మీరుకు చెందిన బౌద్ధ రాజు రింఛనుడిని ‘సుల్తాన్ సద్రుద్దీన్’గా మార్చటంతో కశ్మీరులో సుల్తానుల పాలన ఆరంభమైంది. బుల్‍బుల్ షా మత ప్రచారకుడు కాదని చరిత్ర రచయితలు నమ్మించాలని ప్రయత్నిస్తారు. రింఛనుడికి శైవంలో ప్రవేశం నిరాకరించటంతో యాదృచ్ఛికంగా బుల్‍బుల్ షా అతడిని ఇస్లాంకు మార్చాడు తప్ప,  మత ప్రచారం బుల్‍బుల్ షా ఉద్దేశం కాదని అంటారు. కానీ రింఛనుడిని మతం మార్చటంతో పాటు కశ్మీరంలో ఇస్లాం మత ప్రచారాన్ని చేయటమే కాకుండా పలు మసీదులను నిర్మింపచేశాడు బుల్‍బుల్ షా.

బుల్‍బుల్ షాని అనుసరిస్తూ సయ్యద్ జలాలుద్దీన్ బుఖారి, సయ్యద్ తాజుద్దీన్, సయ్యద్ హుస్సేన్ సిమ్నానీ వంటి వారు కశ్మీరు వచ్చి చేరారు. కశ్మీరులో తమ వంతు మత ప్రచారం చేశారు. కానీ క్రీ.శ. 1384లో సయ్యద్ అలీ హమదాని కశ్మీరులో అడుగు పెట్టడంతో కశ్మీరులో ఇస్లాం ప్రచారం స్వరూపం రూపాంతరం చెందింది.

క్రీ.శ. 1314లో సయ్యద్ అలీ హమదాని జన్మించాడు. హమదాని తండ్రి రాజు దగ్గర ఉద్యోగం చేసేవాడు. తండ్రి వైపు పూర్వీకుల వివరాలు 19 తరాల వరకూ తెలుస్తున్నాయి. అతని తండ్రి ‘షియా’ల తొలి ఇమామ్ ‘అలీ ఇల్ఫ్ అబి తాలిబ్’కూ, అతని కొడుకు ‘అల్-హుస్సేన్’ ల వంశానికి చెందినవాడు. తల్లి గురించి 17 తరాల వరకూ తెలుస్తోంది. ఆమె మహమ్మద్ ప్రవక్త   వంశానికి చెందినది. మహమ్మద్ ప్రవక్త రక్త సంబంధీకులను ‘సయ్యద్’ లంటారు. అందుకే అలీ హమదానీ, సయ్యద్ అలీ హమదానీ అయ్యాడు. అతని తండ్రి బాల్యంలోనే మరణించాడు. దాంతో మేనమామ సయ్యద్ అలా అల్‍దీన్ వద్ద పెరిగాడు. ఆయన ధనవంతుడు. అలీ హమదానీకి విద్యాబుద్ధులు చెప్పించాడు. కుబ్రవియ్యే సూఫీ తత్త్వానికి చెందిన అలా అల్‍దీన్ సేమ్నానీ శిష్యుడు,  షేక్ మహ్మద్ మజ్జఖానీ వద్ద శిష్యరికం చేశాడు అలీ హమదానీ. 12 ఏళ్ళ వయసులో అలీ హమదానీ ఖురాన్‍ను కంఠస్థం చేశాడు. ‘సూఫీ’ తత్త్వంలో నిష్ణాతుడయ్యాడు. గ్రంథాలను బహిరంగంగ వల్లె వేసే ‘సమా’లలో పాల్గొని పేరు ప్రఖ్యాతులు పొందాడు.

సూఫీపథం (తారీఖు)లో పలు స్థాయిలను దాటిన తరువాత అలా అల్‍దీన్ సేమ్నానీ ఇతర పెద్దలు, అలీ హమదానీ ప్రయాణాలు చేయవచ్చనీ, మత ప్రచారం చేయవచ్చని ‘ఫత్వా’ జారీ చేశారు. 34 ‘షేక్’‍లు ఏకగ్రీవంగా హమదానీకి ‘ఖిర్నా’ (పట్టా)ను అందజేశారు. సూఫీల సంప్రదాయాన్ని అనుసరించి ఆయన పర్యటనలు ప్రారంభించాడు. 12 మార్లు మక్కాను సందర్శించాడు. బాగ్దాద్, రోమ్, సిరోన్, బల్ఖ్, ఖట్టాలన్, బదక్షణ్, మా వాఆ అల్ నహర్ వంటి పలు ప్రాంతాలలో పర్యటించాడు. దాదాపుగా 1400 మంది సూఫీ పండితులలో చర్చలు చేశాడు. తన జీవితం చివరి దశలో ఆయనకు కశ్మీరు గురించి తెలిసింది.

కశ్మీరులో రాజులు ఇస్లాం స్వీకరించారనీ, ఇస్లామీయులను, ఇస్లాం ప్రచారకులను ఆదరించి, ఆశ్రయమిస్తున్నారని తెలిసింది. అయితే, అక్కడి రాజులు ఇస్లాం సరిగ్గా పాటించటం లేదని, కలుషితం చేస్తున్నారనీ తెలిసింది. షరియాను అమలు పరచటం లేదని తెలిసింది. ఈ విషయాల్లో నిజానిజాలు తెలుసుకునేందుకు తన బంధువులు తాల్ అల్ దిన్, హుస్సేన్‍లను కశ్మీరు పంపించాడు. వారు రాజకీయ, సామాజిక, ధార్మిక పరిస్థితులపై నివేదికను సమర్పించారు. వారి అభిప్రాయం ప్రకారం కశ్మీరు మతాంతీకరణకు అనుకూలంగా ఉంది. దాంతో 1372లో మీర్ అలీ హమదానీ కశ్మీరు ప్రయాణమయ్యాడు. తనతో 700 మంది తన అనుచరులను వెంట తీసుకుని వచ్చాడు కశ్మీరుకు.

మరో కథనం ప్రకారం, ఇరాన్ పై తైమూరు దాడులు తీవ్రమయ్యాయి. తైమూరు ప్రధాన లక్ష్యం సయ్యద్‍లను నామరూపాల్లేకుండా చేయటం. తైమూరు  హమదాన్‌పై కూడా దాడి చేసి, నగరాన్ని సర్వనాశనం చేశాడు. అక్కడి ప్రజలను ఊచకోత కోశాడు. తైమూరు నుంచి తప్పించుకునేందుకు, ప్రాణాలు అరచేత పట్టుకుని హమదానీ, తన 700 మంది అనుచరులతో సురక్షితమైన స్థలం వెతుకుతూ కశ్మీరు వచ్చాడని అంటారు.

మరో కథనం ప్రకారం, సయ్యద్ అలీ హమదానీ మత ప్రచారం చేస్తూ ప్రయాణాలు చేస్తున్నప్పుడు, అతని బంధువుల నుంచి కశ్మీరులో ఇస్లాం సరిగా పాటించటం లేదని, స్థానిక ధర్మ ప్రభావంతో కలుషితమై ఇస్లాం ప్రమాదంలో పడిందనీ తెలిసింది. ఎనిమిదవ శతాబ్దం నుంచీ కశ్మీరుకు  ‘షరియా’  సరైన రీతిలో అందలేదని, కశ్మీరీ ముస్లింలకు ఇస్లాం గురించి నేర్పాల్సిన అవసరం ఉందనీ వర్తమానం అందింది. దాంతో కశ్మీరులో ఇస్లాం సమాజానికి మార్గదర్శనం చేసి, సరైన ఇస్లాం పద్ధతులు బోధించి, ‘షరియా’ గురించి సంపూర్ణంగా విద్యావంతులను చేయాలన్న ఉద్దేశంతో ఏడు వందల మంది అనుచరులతో కలిసి కశ్మీరు ప్రయాణమయ్యాడు సయ్యద్ అలీ హమదానీ. ఏడు వందల మంది అనుచరులతో కశ్మీరులో అడుగుపెట్టి కశ్మీరును ఇస్లాంమయం చేసిన హమదానీ రాకను జోనరాజు ప్రస్తావించలేదు. ఎందుకంటే, Muhammad Shafi Bhat ప్రకారం “except some Sanskrit Chronicles who due to their biased approach had not mentioned visits of great Sayyid in Kashmir”. జోనరాజు, ఇతర సంస్కృత రచయితలు పక్షపాత బుధ్ధితో హమదానీ గురించి ప్రస్తావించలేదని తీర్మానించటంలోనే షఫి భట్ దృష్టి తెలుస్తోంది. ఇస్లామీయుల దృక్కోణంలో హమదానీ గొప్ప ఇస్లామ్ మత ప్రచారకుడు. కానీ, భారతీయుల దృష్టిలో భారతీయ సంస్కృతిని, ధర్మాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకుని, పధ్ధతి ప్రకారం కశ్మీరీయుల మతం మార్చినవాడు, మతాంతరీకరణలకు, సంకుచిత భావనలకూ ఊపునిచ్చి, ఆ భావనలకు మతానుమతివున్నదని బోధించినవాడు. అదీగాక, హమదాని కశ్మీరులో వున్నది మూడునెలలు మాత్రమే. అతని ప్రభావాన్ని జోనరాజు గుర్తించకపోవటంలో ఆశ్చర్యంలేదు. కానీ, జోనరాజు, ముహమ్మద హమదానీని, సికందర్ బుత్‍షికన్ పై అతని ప్రభావాన్నీ ప్రస్తావించాడు. కాబట్టి, పక్షపాత బుధ్ధితో సంస్కృత రచయితలు హమదానీ గురించి రాయలేదనటం, సంస్కృతం, సంస్కృత పండితులపై సమాజంలో ఒక పధ్ధతి ప్రకారం చెడు అభిప్రాయాన్ని సృష్టించటంలో భాగం తప్ప మరొకటి కాదు.

(ఇంకా ఉంది)

Exit mobile version