Site icon Sanchika

జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-45

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

“Sultan Qutub-ud-Din, to Sayyid Ali, appeared tolerant and liberal unto the Hindus who as a measure of expediency were permitted to be the government functionaries and being Kafirs were neither hounded out nor persecuted and as such had failed to draw a leaf from his religiopolitical culture to divide his subjects into the strait-jacket of Muslims and Kafirs granting them the rights and privileges that flowed from the religions they espoused.” (Kashmir – Wail of the Valley, by Mohan Lal Kaul).

కశ్మీరు చరిత్రలో సయ్యద్ మీర్ అహ్మద్ హమదాని ప్రధాన పాత్ర వహిస్తాడు. ఆయన ఇస్లాం మత శాస్త్రంలో, విధి విధానాల పట్ల నిష్ణాతుడు మాత్రమే కాదు, సూఫీ మతానికి సంబంధించిన సూత్రాలు, నీతులు, తత్త్వం వంటి విషయాల గురించి పలు గ్రంథాలు రచించాడు. ఈయన తన పర్యటనలో పలు దేశాల రాజులతో సన్నిహితంగా మెలిగాడు. వారికి ఇస్లాం నీతి నియమాలను తమ రాజ్యాలలో అమలు చేయటంలో సలహాలు, సూచనలు ఇచ్చాడు. ఇరాన్, మధ్య ఆసియా వంటి పలు ప్రాంతాల రాజులు ఇతని వల్ల ప్రభావితులయ్యారు. ఇస్లాం సిద్ధాంతాల ప్రకారం రాజ్యపాలన నెరపటం విషయంలో రాజులకు మార్గదర్శకంగా ఉండేందుకు ‘జకిరాత్-అల్-ములుక్’ (రాజ్య దర్పణం) అన్న పుస్తకం రాశాడు.

1334 నుంది 1353 వరకు ఈయన ఇరాన్, హిజాజ్, సిరియా, ఖ్యారజమ్, ట్రాన్సోన్సియానా, కశ్మీరు నుంచి శ్రీలంక వరకూ ప్రయాణించాడు. తరువాత హమదాని తిరిగి వచ్చాడు. వివాహం చేసుకున్నాను. ఈలోగా తైమూర్ దండయాత్రల తీవ్రత పెరగటంతో తన అనుచరులతో ఇరాన్ వదిలి ‘బదక్షిణ్’ చేరాడు. బదక్షణ్‍లో ‘ఖట్టాలన్’ అనే నగరంలో స్థిరపడ్డాడు. ఇక్కడే ఆయనకు మహమ్మద్ అనే కొడుకు పుట్టాడు 1372 సంవత్సరంలో. సయ్యద్ హమదాని జీవిత చరిత్ర రచించిన ‘జాఫర్ బదాక్షి’ ఇక్కడే ఆయన శిష్యుడయ్యాడు. ఖట్టాలన్ నుంచి సయ్యద్ హమదాని కశ్మీరుకు ప్రయాణం చేశాడు. తుర్కిస్తాన్, ఖతాయ్ వంటి ప్రాంతాలకు కూడా ఖట్టాలన్ నుండే ప్రయాణమయ్యాడు. కశ్మీరులో ఆయన మూడు నెలలు ఉన్నాడంటారు. కొందరు ఆయన కశ్మీరుకు మూడు మార్లు వచ్చాడంటారు. ఇంకోందరు ఆయన కశ్మీరులో మూడేళ్ళు వున్నాడంటారు.  కానీ ఒక్కసారైతే వచ్చినట్టు నిర్ధారణగా తెలుస్తోంది. సయ్యద్ హమదాని కశ్మీరుకు వచ్చిన సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం, కశ్మీరులో ఒక ‘ఖన్‍ఖా’ను నిర్మించారు. ‘ఖన్‍ఖా’ అన్నది సూఫీ ప్రయాణీకుల విశ్రాంతి స్థలం మాత్రమే కాదు, సూఫీ పండితులు సభలు నిర్వహించే  స్థలం కూడా.

హమదాని కశ్మీరులో అడుగుపెట్టే సమయానికి సుల్తాన్ ఖుతుబ్-ఉద్-దీన్ కశ్మీరులో రాజ్యం చేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు భార్యలు. ఇద్దరూ భారతీయులే. అతనికి సంతానం ఇద్దరు. జోనరాజు వాళ్ళిద్దరి పేర్లు – శృంగార, హైవత్ – అన్నాడు. కానీ పర్షియన్ చరిత్ర రచయితలు మాత్రం వీరి పేర్లు సికందర్, హైబత్ అని అన్నారు.

ఖుతుబ్-ఉద్-దీన్‍ను జోనరాజు ‘కుంభాదీన్’ అన్నాడు. ఈయన పాలనా కాలంలో కశ్మీరులో ఇస్లామీయుల సంఖ్య స్వల్పం. కాబట్టి  ఈయన పరమత సహనం ప్రదర్శించాడు. అతడి రాజ్యంలో కీలకమైన అన్ని పదవులలో భారతీయులే ఉండేవారు. రాజు ఇస్లామీయుడైనా అధిక సంఖ్యలో ఉన్న ఇస్లామేతరులకు ఆగ్రహం కలిగితే తన మనుగడ ప్రమాదంలో పడుతుందని ఆయన ఇస్లాం సూత్రాలను నిక్కచ్చిగా అమలు పరచలేదు. అతని పై అతని భార్యల ప్రభావం అధికంగా ఉండేది. భారతీయ మంత్రుల ప్రభావం అధికంగా ఉండేది. ఆయన ఇతర మతాల ప్రార్థనలలో, సంబరాలలో పాల్గొనేవాడు. గుళ్ళకు, గోపురాలకు దానాలు ఇచ్చేవాడు. హమదాని కశ్మీరులో అడుగుపెట్టే సమయానికి ఇదీ పరిస్థితి. హమదానికి సుల్తాను పరమత సహనం ప్రదర్శించటం నచ్చలేదు. అక్కచెల్లెళ్ళు భార్యలుగా ఉండటం నచ్చలేదు.

మీర్ సయ్యద్ హమదాని రచించిన ‘జకిరాత్-అల్-ములుక్’ ప్రకారం ఇస్లేమేతరులతో అంటే, ‘జిమ్మి’లతో వ్యవహరించేందుకు 20 సూత్రాలున్నాయి. వీటిని ‘ఖలీఫా ఓమర్’ ఏర్పాటు చేశాడు. ఆ సూత్రాలను తు.చ. తప్పకుండా అమలు చేయాలి. ఆ 20 సూత్రాలు :

  1. ముస్లిం రాజులు ఎట్టి పరిస్థితులలో, విగ్రహారాధనను ప్రోత్సహించకూడదు. విగ్రహారాధకులు మందిరాలను, పవిత్ర స్థలాలను నిర్మించకూడదు.
  2. ముస్లిమేతరుల మందిరాలు ఒకవేళ మొదటి నుండీ ఉంటే, వాటికి ఎట్టి పరిస్థితులలోనూ కొత్తగా మరమ్మతులు చేయనీయకూడదు. పునర్నిర్మాణాలు కూడదు. పాడయిన వాటిని అలాగే వదిలేయాలి.
  3. మందిరాలలో, ఇస్లామేతరుల పవిత్ర స్థలాలలో ముస్లిం ప్రయాణీకులు విశ్రాంతి తీసుకోవటాన్ని అడ్డుకోకూడదు.
  4. ముస్లిం యాత్రికులకు తమ ఇళ్ళల్లో మూడు రోజుల వరకు ఆతిథ్యం ఇవ్వాలి. వారికి ఆశ్రయం ఇవ్వటాన్ని తిరస్కరించకూడదు.
  5. గూఢచారులకు సహాయం చేయకూడదు. తాము గూఢచర్యం చేయకూడదు.
  6. తమ బంధువులలో ఎవరయినా ఇస్లాం స్వీకరించేందుకు మొగ్గు చూపితే, వారికి అడ్డుపడకూడదు.
  7. ముస్లింలను గౌరవించాలి.
  8. వాళ్ళు ఒకవేళ ప్రార్థనలు, సమావేశాలు నిర్వహిస్తూన్నట్లయితే, ముస్లింలు కనుక అక్కడికి వస్తే వారికి అన్ని మర్యాదలు చేసి ఆహ్వానించాలి.
  9. ముస్లిమేతరులు ముస్లింల లాంటి దుస్తులు వేసుకోకూడదు.
  10. ముస్లిమేతరులు ముస్లిం పేర్లు పెట్టుకోకూడదు.
  11. జీను వేసిన గుర్రం ఎక్కకూడదు.
  12. కత్తులు, బాణాలు , బల్లేలు ముస్లిమేతరులు ధరించకూడదు.
  13. ఉంగరాలు ధరించకూడదు. వజ్రాలు ఉండకూడదు.
  14. మాదక ద్రవ్యాలను సేవించకూడదు. అమ్మకూడదు.
  15. ముస్లిమేతరులు తమ సంప్రదాయ దుస్తులను ( జాహీలియ్యాహ్)  విసర్జించకూడదు. ఎందుకంటే వారి దుస్తులు వారిని ముస్లింల నుంచి వేరుగా చూపించాలి.
  16. ముస్లింల ముందు వారు తమ సంప్రదాయాలను పాటించకూడదు.
  17. ముస్లింలున్న పరిసర ప్రాంతాలలో ఇళ్ళు కట్టుకోకూడదు.
  18. మృతులను ఇస్లామేతరులు ముకబరాల దగ్గర పాతిపెట్టకూడదు.
  19. ముకబరాల సమీపంలో  మరణించినవారికి కోసం వారు శబ్దాలు చేస్తూ రోదించకూడదు.
  20. ఎట్టి పరిస్థితులలో ముస్లింలను బానిసలుగా కొనకూడదు.

ఒకవేళ ‘జిమ్మి’లుగా గుర్తింపు పొందిన ఇస్లామేతరులు ఈ ఇరవై సూత్రాలలో ఏ ఒక్కదాన్ని ఉల్లంఘించినా వారి ఆస్తులను ముస్లింలు స్వాధీనం చేసుకోవటం న్యాయబద్ధమే (హాలాల్). [జకిరాత్-అల్-ములుక్, అయిదవ అధ్యాయం]

కశ్మీరులో ఇస్లామేతరుల పట్ల సుల్తాన్ సామరస్యం ప్రదర్శించటం హమదానికి నచ్చలేదు. హమాదాని ఖ్యాతి వల్ల, ఆయనకున్న గొప్ప పాండిత్యాన్ని పరిగణనలోకి తీసుకోవటం వల్ల ఆయన మాటలను సుల్తాన్‍కు మన్నించాల్సి వచ్చింది. హమదాని మాట ప్రకారం ఒక భార్యకు విడాకులు ఇచ్చాడు. కానీ ఇస్లామేతరులను హింసించి ఇస్లామీయులుగా మతాంతరీకరణం చేయటంపట్ల ఉదాసీనంగా వ్యవహరించాడు.  రాజు తన సూచనలు సరిగ్గా పాటించటం లేదని, తాను చెప్పినట్లు సంపూర్ణంగా ఇస్లాం సూత్రాలను తన రాజ్యంలో అమలు పరచేందుకు సుల్తాన్ సుముఖంగా లేడని ఆగ్రహించిన హమదాని తన వెంట వచ్చిన 700 మంది అనుచరులను కశ్మీరు నలుమూలలా పంపించాడు. కశ్మీరులో ఉన్న ముస్లింలకు తమ మత సూత్రాలు చెప్పి, నిక్కచ్చిగా తు.చ. తప్పకుండా వాటిని అమలు పరిచేట్టు బోధించమన్నాడు. అంతే కాదు, ముస్లింల నడుమ నివసిస్తూ తమ ఆదర్శమైన ప్రవర్తన ద్వారా ముస్లింలకు మార్గదర్శనం చేయమన్నాడు. రాజుకు, అతని అనుచరులకు ఇస్లాం బోధించాడు హమదాని.

రఫీకి ప్రకారం ‘అన్ని రకాల లాభాలను ముస్లింలకే వర్తింప చేశాడు సయ్యదు అలీ. తాను ఏర్పాటు చేసిన నియమాలను తు.చ. తప్పకుండా పాటించినా, ‘జిమ్మి’ల పట్ల ఎలాంటి స్నేహ భావన ప్రదర్శించకూడదు. పై సూత్రాలను పాటించటం తప్ప జిమ్మిలకు మరో ఆస్కారం లేదు’.

మీర్ అలీ హమదాని ‘జకిరాత్-అల్-ములుక్’ అధారంగా కశ్మీరులో ఇస్లామేతరులను హింసించటం మొదలయింది. అంతే కాదు, హమదాని రచించిన ఈ పుస్తకం కశ్మీరులో ఇస్లామేతరులను సంపూర్ణంగా నిర్మూలించేందుకు ప్రాతిపదిక అయింది.

“The book in its contents is highly subversive and set the ground for unleashing an orgy of violence, commotion, disorder and anarchy aimed at corroding and dismantling a social and religious ethos, which had a humanistic base and was high above religious bigotry and myopia,” (Kashmir – Wail of the Valley, by Mohan Lal Kaul).

సాధారణంగా సూఫీలు ప్రేమతత్త్వం బోధిస్తారని, ప్రజలపై కరుణ వర్షం కురిపిస్తారన్న ఆలోచన ప్రచారంలో ఉంది. ముఖ్యంగా ‘రూమీ’ పేరుతో ప్రచారంలో ఉన్న పలు కవితలను ఉటంకిస్తూ ‘సూఫీ’ల తాత్త్వికతను ప్రశంసించటం ఆనవాయితీ. రూమీ కవిత్వం వదలి సూఫీగా అతని మత జీవితం గమనిస్తే ఆయన మతచాందసం, ప్రపంచాన్ని ఇస్లాం మయం చేయాలన్న ఆకాంక్షలు మనకు తెలియని మరో రూమీని పరిచయం చేస్తాయి.   కశ్మీరులోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా తాము పర్యటించిన ప్రతి ప్రాంతంలోనూ సూఫీలు కావించిన మత ప్రచారం, ఆ మత ప్రచారం కోసం వారి ప్రోద్బలంతో జరిగిన మారణహోమం, నశించిన నాగరికతలు, సంస్కృతి సాంప్రదాయాలను పరిగణనలోకి తీసుకుంటే, సూఫీల ప్రేమ తత్త్వంగా  ప్రచారంలో ఉన్న ప్రేమ తత్త్వానికీ , వారు ప్రదర్శించిన ప్రేమ తత్వానికీ  నడుమ హస్తిమశకాంతరం ఉన్నదన్నది స్పష్టమవుతుంది. కశ్మీరులో సూఫీల విస్తరణ ఇందుకు తిరుగులేని ఉదాహరణ.

కశ్మీరులో హమదాని ఆగమనం వల్ల, ఆయన అనుచరులు జరిపిన సూఫీ మత ప్రచారం వల్ల, ముఖ్యంగా హమదాని ‘జిమ్మి’ల పట్ల సూఫీలు పాటించాల్సిన వివక్షతలు పొందుపరిచిన పుస్తకం వల్ల కశ్మీరులో సంభవించిన దుష్పరిణామాలు అత్యంత దారుణంగా ఉన్నాయి.

“The charter of conditions is shocking and stunning and ironically enough framed and conceived by a sufi, whose role in Kashmir on religious grounds has been trumpeted beyond credible limits. As a prelude to the policy of death and destruction against the native Hindus, it, in fact, contained seed ideas of Muslim vintage for re-modelling of the Kashmiri society by forcibly transmuting its religious complexion and colour by unjust and unkind means, thus causing a yawning hiatus by tearing it away from its historical and socio-cultural moares.” (Kashmir – Wail of the Valley, by Mohan Lal Kaul).

హమదాని రచించిన రాజుకు పాలనా సూత్రాల పుస్తకం ప్రకారం ముస్లింల రాజ్యంలో ముస్లిమేతరులు ముస్లింల ఆస్తులు. ముస్లింలకు బానిసలు. వారి ఇళ్ళల్లోకి అనుమతి లేకుండా ప్రవేశించే హక్కు ముస్లింలకు ఉంది. వారి ప్రార్థనా స్థలాలను విశ్రాంతి స్థలాలుగా వాడుకోవచ్చు. కాదనే వీలు లేదు. ముస్లింల నివాస స్థలాలున్న ప్రాంతాల నుంచి మతపరమైన ఊరేగింపులు వెళ్ళకూడదు. నినాదాలు చేయకూడదు. చివరికి మరణించిన వారి కోసం శబ్దం చేయకుండా రోదించాలి.

తన సిధ్ధాంతాలను ప్రచారంచేస్తూ, కశ్మీరీలకు ఇస్లాం జీవన విధానాన్ని  పధ్ధతులను బోధించేందుకు కశ్మీరు నగరాలు, గ్రామాలలో విస్తరించిన కొందరు హమదానీ అనుచరులు, వారి కార్య క్షేత్రాల వివరాలను పర్షియన్ రచయితలు తమ పుస్తకాల్లో పొందుపరచారు.

మీర్ సయ్యద్ సమానీ లేక సయ్యద్ సామ్నాని- కుల్గామ్

మీర్ సయ్యద్ హైదర్-కుల్గామ్

సయ్యద్ జలాలుద్దీన్ అత్తయీ- కెజ్మాహ, బారాముల్లహ్

సయ్యద్ కమల్ థానీ- నైద్ ఖాయ్, అనంతనాగ్

సయ్యద్ జలాలుద్దీన్ ముహద్దిథ్-దథ కదల్, శ్రీనగర్

సయ్యద్ ఫీరోజ్-సామ్పుర్( పాంపుర్)

సయ్యద్ ముహమ్మద్ కాజిమ్-లత్తపోరా( పాంపుర్)

సయ్యద్ ర్క్నుద్దిన్- అవన్ పోరా, బారాముల్లహ్

సయ్యద్ ఫక్రుద్దీన్- అవన్ పోరా, బారాముల్లాహ్

సయ్యద్ ముహమ్మద్ ఖురేశీ- బిజ్బిహారా, ఇస్లామాబాద్

ఇలా సయ్యద్ హమదానీ వెంట వచ్చిన ఏడువందలమంది మత ప్రచారకులు కశీరు అంతటా విస్తరించి మత సంకుచితత్వాన్నీ, మత ఛాందసాన్నీ కశ్మీరు ముస్లీములకు బోధించారు.

హమదాని ప్రభావంతో సుల్తానుతో సహా ప్రజలంతా హమదాని ఏర్పరిచిన దుస్తులు ధరించే నియమాన్ని పాటించటం ఆరంభించారు. ముస్లింలు ఎలాంటి రంగు దుస్తులు ధరించాలి, ఇస్లామేతరులు ఏ రంగు దుస్తులు ధరించాలి, దుస్తులు ఏ రకంగా ఉండాలి అన్నది హమదాని సూచించినట్టు పాటించారు. దాంతో అంతవరకూ తాము పాటిస్తున్న మతంతో సంబంధం లేకుండా కలిసి ఉండే కశ్మీరీయులను దుస్తుల ఆధారంగా వేర్వేరుగా గుర్తించే వీలు చిక్కింది. హమదాని సూత్రాల వల్ల ఇస్లామీయులకు లభించిన ప్రత్యేక అధికారాలు, హక్కుల వల్ల, ఇస్లామేతరులు కశ్మీరులో ద్వితీయ శ్రేణి పౌరులయ్యారు. ఎలాంటి హక్కులు లేని వారయ్యారు. ఇస్లామీయులకు బానిసలు అయ్యారు.

అందుకే జోనరాజు యవనులు మిడుతల్లా కశ్మీరులో ప్రవేశించారని అన్నాడు. పచ్చని పంట పొలాలను మిడతలు సర్వనాశనం చేసేట్టు, కశ్మీరులో మిడుతల దండులా ప్రవేశించే యవనులు కశ్మీరు సంస్కృతిని, సంప్రదాయలను, చరిత్రను నామరూపాల్లేకుండా నాశనం చేస్తున్నారని వాపోయాడు. జోనరాజు మిడుతల దండులా వర్ణించిన యవనులు – ‘బహరిస్తాన్-ఇ-షాహి’ ప్రకారం ఉలేమాలు (పండితులు), పుజాలాలు (విజ్ఞానవంతులు), ఖజాత్‍లు (న్యాయమూర్తులు), సాదత్‍లు (సయ్యద్‍లు). వీరు ఒకరొకరుగా కశ్మీరులో ప్రవేశించి కశ్మీరు సామాజిక, ఆర్థిక, ధార్మిక రూపురేఖలతో సహా, ప్రజల మనస్తత్వాలను సంపూర్ణంగా రూపాంతరం చెందించారు.

మీర్ అలీ హమదానిని సుల్తాన్ ఖుతుబ్-ఉద్-దీన్ గౌరవించాడు. ఆయన చెప్పినవి పాటించాడు. కానీ ఇస్లామేతరులకు సంబంధించిన అనేక విషయాల్లో ఆయన హమదాని మాటలను పెడచెవిన పెట్టాడు. ఎందుకంటే, ఇంకా రాజ్యంలో ఇస్లామీయుల సంఖ్య అంత ఆధిక్యంలో లేదు. అధిక సంఖ్యాకుల ఆగ్రహానికి గురయి ఆయన తన మనుగడను ప్రశ్నార్థకంలోకి నెట్టాలనుకోవటం లేదు. అందుకని హమదాని సూచనలు విన్నాడు. ఆజ్ఞలకు తల ఊపాడు. కానీ గతంలో అంత కాకున్న కొద్దిగానయినా పరమత సహనం పాటించాడు. ఇదీ సూఫీ హమదానికి నచ్చలేదు. ఆయనకు కోపం వచ్చింది. ఆగ్రహంలో కశ్మీరు వదిలి ఖట్టలాన్ ప్రయాణం అయ్యాడు. తిరుగు ప్రయాణంలో ఇప్పటి పాకిస్తాన్ లోని హజూరా జిల్లాలోని మన్షేరా నగరం దగ్గర ఉన్న ‘పాఖ్లీ’ ప్రాంతం వద్ద అనారోగ్యానికి గురయి మరణించాడు. కొందరు ఆయనపై కుట్ర జరిగి, విషం ఇచ్చి చంపేశారని అంటారు. అందుకు కశ్మీరీయులు దోషులని అంటారు. ఇప్పటికీ ఆయన మరణించిన స్థలంలో ఒక మందిరం ఉంది. అతని శవాన్ని ఆయన అభిమానులు ‘ఖట్టాలన్’ తీసుకువెళ్ళి అక్కడ పాతిపెట్టారు.

హమదాని జీవితం గురించి అతని శిష్యుడు జాఫర్ బదాక్షి ‘ఖులాసత్-ఉల్-మునాకిబ్’ అనే పుస్తకం రచించాడు. ఖట్టాలన్‍లో ఓ ‘ఖన్‍ఖా’ నిర్మించాడు. హైదర్ బక్షీ అనే ఆయన ఎంతో పరిశోధించి ‘మున్ఖాబత్ -అల్-జవాహిర్’ అని హమదాని జీవిత చరిత్ర రాశాడు. హమదాని గురించి మరో రచన ‘అల్-మువాద్దయేత్ ఖుర్బా’లో హమదానిని షియాల దైవంగా భావించే ‘అలీ’తో సమానంగా భావించటం కనిపిస్తుంది. హమదానీని రెండవ అలీగా భావించటం కనిపిస్తుంది.

తండ్రి మరణించినప్పుడు మీర్ మహమ్మద్ హమదాని వయసు 12 ఏళ్ళు. కొడుకు కోసం హమదాని రెండు పత్రాలను వదిలి వెళ్ళాడు. ఒకటి వసీయత్ నామా, రెండాది  ఖిలాఫత్ నామా.

(ఇంకా ఉంది)

Exit mobile version