Site icon Sanchika

జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-46

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

“It took five years (1393-98) for Saiyaid Muhammad Hamadani and his fanatic followers to gain complete control over the mind of the young sultan and his renegade Prime Minister. They seized the opportunity to launch jihad in Kashmir when Timur invaded India.” [A History of Muslim Rule in Kashmir, 1320-1819, R. K. Parmu]

[dropcap]మీ[/dropcap]ర్ మహమ్మద్ హమదానీ 12 ఏళ్ళ వయసులో తండ్రిని కోల్పోయాడు. అతడి తండ్రి మరణించిన తరువాత ఎలాంటి వ్యతిరేకతను ఎదుర్కోకుండానే మహమ్మద్ హమదాని తండ్రి ఆస్తికి వారసుడయ్యాడు. ముందుగా అతని గురువులు అతనికి ‘వసీయత్ నామా’ను అందజేశారు. నాలుగేళ్ళు మత సిద్ధాంతాల విషయంలో శిక్షణనిచ్చారు. ఖ్వాజా ఇఖత్ ఖట్లానీ, ముల్లా నూరుద్దీన్ బదక్షాహిలు మహమ్మద్ హమదాని తండ్రికి ప్రియ శిష్యులు మాత్రమే కాదు, ఆయన ప్రయాణాల్లో ఆయన వెంట ఉన్నవారు. మహమ్మద్ హమదానికి అన్ని సూత్రాలు క్షుణ్ణంగా వచ్చాయన్న నమ్మకం కలిగిన తరువాత, వాళ్ళు అతడికి ‘ఖిలాఫత్ నామా’ను అందజేశారు. ‘ఖిలాఫత్ నామా’లో కొడుకు మహమ్మదాకు తండ్రి సయ్యద్ ఇచ్చిన సలహాలు, సూచనలు ఉన్నాయి. ముందుగా ఇస్లాం విద్యను పూర్తి చేసుకున్న తరువాత ఇస్లాంను ప్రచారం చేస్తూ ప్రపంచ పర్యటన (సయాఫత్)కు వెళ్ళమన్న ఆజ్ఞ ఉంది. ఈ పర్యటనల వల్ల వ్యక్తిత్వం అభివృద్ధి చెందటమే కాదు, ఆత్మ పరిశుద్ధమవుతుందని రాశాడు సయ్యద్ హమదాని. తండ్రి ఆజ్ఞలను అనుసరిస్తూ అన్ని రకాల విద్యలలో నిష్ణాతుడయి, తరువాత ప్రపంచ పర్యటన ప్రారంభించాడు మహమ్మద్ హమదాని. అతడి దృష్టి తన తండ్రి అసంపూర్ణంగా విడిచిన కశ్మీరును ఇస్లాంమయం చేయటంపై పడింది. మూడు వందల మంది అనుచరులతో ఆయన కశ్మీరు ప్రయాణమయ్యాడు (Hayat-e-Mir Muhammad Hamadani by Dr. Syed Farooq Bukhari).

మహమ్మద్ హమదాని కశ్మీరులో అడుగుపెట్టేసరికి అతని వయసు 22 ఏళ్లు. ఆ సమయంలో కశ్మీరు సుల్తాన్ సికందర్ ఆధీనంలో ఉంది. సికందర్ తల్లి హిందువు. ఆమె పేరు శోభ. శోభ సోదరుడు కశ్మీరును సుల్తానుల బారి నుండి తప్పించాలని పద్ధతి ప్రకారం ఒకరినొకరిని మట్టుపెట్టుకుంటూ వస్తున్నాడు. సికందర్ ఇంకా బాలుడు కావడంతో అతని తల్లి శోభ సర్వాధికారాలను చేతిలోకి తీసుకుంది. ఈ రకంగా కశ్మీరును సుల్తానుల బారినుండి తప్పించేందుకు అంతిమ పోరాటం సాగింది. జరుగుతున్న రాజకీయాలను అర్థం చేసుకున్న సికందర్ తన చుట్టూ బహకీ సయ్యద్‍లు, ముల్లాలు, మౌల్వీలు, ఉలేమాలను చేర్చుకున్నాడు. వారి ప్రభావంతో మామ ఆట కట్టించాడు. తల్లి అధికారం తొలగించాడు. తన పేరు మీద ‘ఖుత్బా’ చదివించాడు. నాణేలు ముద్రించాడు. ఈ విషయంలో సుల్తాన్‍కు బహకీ సయ్యద్‍లు అండగా నిలిచారు. బహకీ సయ్యద్‍లు ‘సబ్జావార్’ ప్రాంతానికి చెందినవారు. వారి ప్రాంతంపై తైమూరు దాడి చేసినప్పుడు ప్రాణాలు అరచేత పట్టుకుని సయ్యద్ మహమూద్ బహాకీ నేతృత్వంలో కశ్మీరు వచ్చి చేరారు. వారికి రాజు ఆదరణ లభించటంతో, ప్రాణాలు అరచేత పట్టుకుని ఇతరులు కూడా కశ్మీరు వచ్చి చేరారు. ఈ విషయన్ని జోనరాజు ప్రస్తావించాడు.

మ్లేచ్ఛుల రాజు ఢిల్లీని కొల్లగొట్టి, రక్షణ లేని విధవలా ఢిల్లీని మార్చాడు అన్నాడు జోనరాజు. ఆ మ్లేచ్ఛరాజు కశ్మీరు రాజుకు భయపడి రెండు ఏనుగులను బహుమతిగా ఇచ్చాడని రాశాడు జోనరాజు. అంటే తైమూర్ దాడినీ. ఆ దాడి ఫలితంగా ఇతర రాజ్యాలనుండి ఇస్లామీయులు కశ్మీరు వచ్చి చేరటం గురించీ ప్రస్తావించాడన్నమాట జోనరాజు. అలా వచ్చిన మ్లేచ్చులు, యవనులు రాజుకు చేరువ అయి, రాజుపై ప్రభావం చూపించటం ఆరంభించారు. తాము ఏయే ప్రాంతాల  నుంచి వచ్చారో  ఆయా ప్రాంతాలలో తమకలవాటయిన ఇస్లామీ పద్ధతులను కశ్మీరులో అమలుపరచటం ఆరంభించారు, రాజును ప్రభావితంచేసి.  అందుకే జోనరాజు  తరువాత అసలు విషయం చల్లగా చెప్తాడు. బాల్యం నుంచీ రాజుకు బురద అంటే ఇష్టం. ఇప్పుడు రాజుకు యవనుల పట్ల ఇష్టం పెరిగింది అని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తాడు జోనరాజు. దీనికి కారణం ప్రజల పాపభీతి అనీ అంటాడు. ఎందరో యవనులు వారి రాజుల ఆశ్రయం వదిలి – పుష్పాలను వదిలి ఏనుగులపై స్థిరపడే తేనెటీగల్లా – రాజు చూపే ఆదరణ, ఇచ్చే బహుమతుల పట్ల ఆకర్షితులై కశ్మీరు వచ్చి చేరారని వ్యాఖ్యానించాడు జోనరాజు. ఇలా వచ్చిన వారిలో మేర దేశానికి చెందిన మహమ్మదా చంద్రుడి వంటి వాడని, అతడు పసివాడయినా, విజ్ఞానం వల్ల అందరి మర్యాదను పొందేవాడని, రాజుకు అతడంటే ఇష్టమనీ, రోజూ ఆయన వద్ద పాఠాలు చెప్పించుకుని, సేవకుడిలా అతని కోసం ఎదురు చూసేవాడని, మహమ్మద్‍కు బానిసలా వ్యవహరించేవాడని రాశాడు జోనరాజు.

అనేకే యవనా దాన ప్రసిద్ధ తమాధాశ్రయమ్।
విహయాపార భూపాలాన్ పుష్పాణీవాలయో ద్విపమ్॥

ప్రజాపాప వినాశేన తతో యవన దర్శనే।
బాలస్సేవ మృది క్షోణిపత్ రుచిరవద్దత్॥

దీప్తేందురివ ఋవాక్షాణం తేషాం బాలోపి విద్యయా।
యవనానామ మూజ్జేష్ఠో మేరసైద మహమ్మదః॥

అనమద్భుత్య వచ్మిక్షాం శిష్యవన్నిత్య మగ్రహీత।
దాసవశ్చ పురో నీత్యా రాజ తత్ర న్యవిక్షత॥
(జోనరాజ రాజతరంగిణి, 571-574)

ఈ నాలుగు శ్లోకాలలో జోనరాజు నర్మగర్భితంగా కశ్మీరు ప్రజల పాప ఫలితంగా రాజు యవనుల ప్రభావంలో పడ్డాడనీ, వారందరిలోకీ మహమ్మద్ హమదానీని అధికంగా గౌరవించి, అతని దగ్గర శిష్యరికం చేస్తూ, దాదాపుగా అతని సేవకుడిలా, బానిసలా ప్రవర్తించాడని రాశాడు జోనరాజు. ఆ తరువాత మిడుతల దండు పంటలను నాశనం చేసినట్టు యవనులు, మ్లేచ్ఛులు కశ్మీరు సంస్కృతిని, సమాజాన్ని, సంప్రదాయాలను, ధర్మాన్ని సంపూర్ణంగా నాశనం చేశారనీ రాశాడు. దేవతలు విగ్రహాలు వదిలివెళ్లారు, దాంతో విగ్రహాలు రాళ్లయిపోయాయని, మంత్రాలను వాటి శక్తి వదిలి వెళ్ళటం వల్ల మంత్రాలు కేవలం శబ్దాలుగా మిగిలాయనీ రాశాడు. అంటే, ఏం జరిగిందో స్పష్టంగా రాయలేడు కాబట్టి, ప్రతీకలను ఆధారంగా చేసుకుని జరిగిన దాన్ని సూచన ప్రాయంగా చెప్పి వదిలేశాడన్న మాట. జోనరాజు సూచించిన దాన్ని పర్షియన్ రచయితల రచనలు మరింత వివరంగా, విపులంగా వర్ణించి చెప్తాయి. పర్షియన్  రచయితలు రాసిన విషయాలను జోనరాజు స్పృశించి వదలి, సూచన ప్రాయంగా చెప్పిన విషయాలతో పోల్చిచూస్తే బిందువులో సింధువును ఇమడ్చటం అంటే ఏమిటో తెలుస్తుంది.

1393లో సికందర్ కశ్మీరు పాలనపై పట్టు సంపాదిస్తున్న సమయంలో మూడు వందల మంది అనుచారులతో మీర్ మహమ్మద్ హమదాని కశ్మీరులో అడుగుపెట్టాడు. అతని తండ్రి జ్ఞాపకార్థం కశ్మీరులో ఒక పెద్ద మందిరం నిర్మించారు. దాంతో తండ్రి పేరు ప్రఖ్యాతుల వల్ల కశ్మీరులో అడుగుపెట్టే సమయానికే మహమ్మద్ హమదానీ అంటే కశ్మీరు సుల్తానులో, ఇస్లామీయులలో భయభక్తులు ఏర్పడి ఉన్నాయి. సుల్తాన్ సికందర్ అతడికి  ఓ చక్రవర్తికి ఇచ్చే గౌరవం ఇచ్చాడు. ఎర్ర తివాచీ పరిచి ఆహ్వానించాడు. బహరిస్తాన్, తారీఖ్-ఇ-హైదర్ మాలిక్, తారీఖ్-ఇ-ఆజామ్ ల ప్రకారం సుల్తాన్ మహమ్మద్ హమదానీకి ఘన స్వాగతం పలికాడు. అతడికి జాగీర్లు ఇచ్చాడు. వన్షి, త్రాల్, నూనవాని అనే ప్రాంతాలను మహమ్మద్ హమదానికి, అతని శిష్యులకు అర్పించాడు సికందర్. అంతే కాదు, జోనరాజు చెప్పినట్లు హమదానీకి శిష్యరికం చేస్తూ, సేవకుడిలా సేవలు చేశాడు. బానిసలా చెప్పిన పనల్లా చేశాడు.

మహమ్మద్ హమదాని నుంచి ‘షరియా’ చట్టం నేర్చుకున్నాడు సికందర్. సుల్తాన్‍కు మహమ్మద్ అంటే ఎంత గౌరవాభిమానాలంటే, తన మంత్రులలో ఒకరైన సయ్యద్ హసన్ బైహాభీ కూతురు సయ్యిదా తాజ్ బీబీని ఇచ్చి వివాహం చేశాడు. తద్వారా హమదానీని రాజకుటుంబీకులలో ఒకడిగా చేశాడన్న మాట. అయిదేళ్ళ తరువాత తాజ్ బీబీ మరణించింది. అప్పటికి సికందర్ అంతరంగికుడు సూహభట్టు సైఫుద్దీన్ అయ్యాడు. దాంతో సూహభట్టు కూతురుని వివాహమాడాడు హమదానీ. ఈ రకంగా రాజాస్థానంలో సూహభట్టు పరిస్థితి సుస్థిరం అయిందన్న మాట. హమదాని ప్రేరణతో సైఫుద్దీన్ అయిన తరువాత సూహభట్టు అనేక అకృత్యాలు నెరపాడు. సికందర్‍తో కలిసి మందిరాలు ధ్వంసం చేశాడు. మతమార్పిళ్ళు చేశాడు. మతం మారని వారని ‘జిమ్మి’లుగా భావించి ‘జిజియా’ పన్ను విధించేట్టు చేశాడు. మతం మారని వారి ఆస్తులను మతం మారిన వారికి అప్పగించాడు. మతం మారకపోతే జీవిక గడవని పరిస్థితి తెచ్చాడు. తమ ధర్మం నిలుపుకునేందుకు ప్రాణలు అరచేత పట్టుకుని కశ్మీరు వదిలిపోయే వారిని వెంబడించి వెంబడించి మతం మార్చాడు,  లేకపోతే,  హతమార్చాడు. సూహభట్టు కూతురు కూడా కొద్దికాలానికి మరణించింది. అయితే ఇలా మహమ్మద్ హమదాని ఎన్ని రకాలుగా రాజాస్థానంలోని ఉన్నతాధికారులతో సంబంధాలు నెరపినా, అతని ప్రధాన ఉద్దేశం కశ్మీరును సంపూర్ణంగా ఇస్లాంమయం చేయటం.

“..the most important development of the reign of Sultan Sikander was the conversion to Islam of a great number of people including many Brahmins and the Prime Minister and Commander-in-Chief of the Sultan. On account of the conversion of the large population including the ruling class, it became possible to Islamise the State craft, which was one of the main concern of Mr Muhammad Hamadani.” (Islam in Kashmir by Muhammad Ashraf Wani)

సికందర్, సూహభట్టు, హమదానీల మత ప్రచార ఛాందసాన్ని వివరిస్తూ “By his tacit approach of the wicked deeds of his minister, history has held Sikander responsible for those. Hindus in their thousands were put to the sword and the major portion of the Brahmin population of Kashmir migrated to the South” అన్నారు PNK Bamzai (Culture and Political History of Kashmir, Vol 2).

ఏ రకంగా యవనులు, మ్లేచ్ఛులు కశ్మీరును సర్వనాశనం చేశారో జోనరాజు రాయలేదు. తమ ధర్మాన్ని వదిలే కన్నా ప్రాణాలు వదలటానికే తాము సిద్ధమని బ్రాహ్మణులు ప్రకటించారని ఆయన రాశాడు. వారిపై సూహభట్టు అన్యాయమైన రీతిలో పన్నుల భారం వేశాడన్నాడు. ఆ సమయంలో రాజు ఆశ్రయం పొందటం కోసం అందరూ ఇస్లాం స్వీకరిస్తుంటే, శ్రీ సింహ, భట్ట కస్తూట అనే వారిద్దరూ, శ్రీ నిర్మలాచార్య వర్యుడు, రాజు ఆశ్రయం తృణప్రాయంగా భావించి తమ ఆస్తులను ఇస్లామీయుల వశం చేశారు.  కానీ తమ ధర్మాన్ని కాపాడుకున్నారంటాడు జోనరాజు.

అయితే సూహభట్టు ఏ రకంగా భారతీయులను హింసించాడో పర్షియన్ రచయితలు గొప్పగా రాశారు. హమదానీ ప్రేరణతో కశ్మీరును ఇస్లాం మయం చేసేందుకు కంకణం కట్టుకున్న సికందర్ కోరికను ఆచరణ రూపంలో పెట్టిన మతవీరుడని సూహభట్టును పొగిడారు. సికందర్ ఎంత క్రూరుడో, ఎంత ఘోరంగా వ్యవహరించాడో హసన్ ‘History of Kashmir’ పుస్తకంలో వివరించాడు.

తమ ధర్మ గ్రంథాలను రక్షించేందుకు ప్రయత్నిస్తున్న వారిని దొరకబుచ్చుకుని వారి మెడలపై కత్తులుంచి మతం మార్చాడు సూహభట్టు. తనకు లొంగనివారిని చిత్రహింసలు పెట్టాడు. అంతటితో సంతృప్తి పడలేదు. వారు  పవిత్రంగా భావించిన పవిత్ర గ్రంథాలను, ‘దాల్ లేక్’లో విసిరేశాడు. మిగిలిన వాటిని తగలబెట్టాడు. భారతీయ ప్రాచీన గ్రంథాల గురించి విశ్లేషించేవారు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎన్నెన్నో విలువైన గ్రంథాలు నాశనమయ్యాయో తెలియదు. ఎంతెంతమంది మేధావుల మేధామథన ఫలితాలు భవిష్యత్తు తరాలకు అందకుండా ఆవిరైపోయాయో తెలియదు. మతగ్రంథాలను, ప్రాచీన వాఙ్మయాల్ని నాశనం చేయటంతో ఆగలేదు సూహభట్టు. బ్రాహ్మణులను జీవచ్ఛవాలుగా చేసేందుకు వారి శిఖలను కత్తిరించాడు. వారి యజ్ఞోపవీతాలను నేలకేసి రాశాడు. తాను చంపిన వారి తలలను,  వారి శరీరాల నుంచి యజ్ఞోపవీతాలను వేరు చేసి, కుప్పలా పోసి, వాటి బరువు కొలిచి మరీ కాల్పించాడు. అలా ఒకసారి దాదాపుగా 275 కిలోల యజ్ఞోపవీతాలను కాల్చి బూడిదను దాల్ లేక్‍లో పారవేయించాడు సూహభట్టు. సూహభట్టు ఆధ్వర్యంలో సికందర్ ‘షేక్-ఉద్-ఇస్లామ్’ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. వీరి పని ప్రజలను భయభ్రాంతులని చేసి, హింసించి, మతం మార్చటమే. మారని వారిని చిత్రహింసలు పెట్టి చంపుతారు.

సికందర్   క్రౌర్యానికి  ప్రత్యక్ష సాక్షి హజ్రత్  అమీర్ కబీర్. ఈ సంఘటనను హసన్ తన పుస్తకంలో పొందుపరిచాడు. నగర వీధులలో సికందర్ ప్రకటనలిప్పించాడు. ‘ఇస్లాం స్వీకరించండి, స్వీకరించని వారు మరణాన్ని స్వీకరించండి. లేకపోతే, దేశం వదిలిపొండి’ అన్న ప్రకటనతో వీధులు దద్దరిల్లేయి. అధిక సంఖ్యలో బ్రాహ్మణులు తమ ధర్మం వదలటం కన్నా దేశం వదలటానికే, ప్రాణాలు వదలటానికో సిద్ధపడ్డారు. అలా ప్రాణాలు కోల్పోయిన వారి 275 కిలోల యజ్ఞోపవీతాలను సూహభట్టు కాల్పించాడు. మతం మారిన వారి 180 కిలోల యజ్ఞోపవీతాలను సికందర్ తగులబెట్టించాడు. ఈ అత్యాచార కాండను చూసి చలించిన హజ్రత్ అమీర్ కబీర్ సుల్తాన్‍కు ఒక సూచనను ఇచ్చాడు. ‘కాఫిర్‍ల మతం మార్చటం తప్పనిసరి. అందుకు ఇంత మారణకాండ జరపవలసిన అవసరం లేదు. వారి బ్రతుకు దుర్భరమయ్యే రీతిలో పన్నుల భారం వెయ్యి. పన్నులు చెల్లించలేని వారి ఆస్తులను హస్తగతం చేసుకో. తినటానికి తిండి లేక ప్రాణాలు కాపాడుకునేందుకయినా వారు మతం మారుతారు’ అని సూచించాడు హజ్రత్ కబీర్. అతని సూచన విన్న సికందర్, హిందువులందరి దగ్గర ఉన్న పవిత్ర గ్రంథాలకు రాళ్ళు కట్టి దాల్ సరస్సులోకి విసిరేయించాడు.

మందిరాల ధ్వంసం గురించి జోనరాజు ఒక శ్లోకం రాసి వదిలేశాడు. ఆ శ్లోకంలో కూడా మందిరాల పేర్లు చెప్పి ఊర్కున్నాడు. కానీ పర్షియన్ చరిత్ర రచయితలు మందిరాల విధ్వంసాన్ని, దాని వెనుక ఉన్న తాత్వికపు టాలోచనను వివరించారు.

సూఫీ మహమ్మద్ హమదానీ ప్రోత్సాహంతో సూహభట్టు మందిరాల విధ్వంసం ప్రారభించాడు. మందిరాలను ఎందుకు ధ్వంసం చేయాలన్న సికందర్ ప్రశ్నకు సమాధానంగా హమదానీ ‘అవన్నీ దైవదూషకుల నిలయాలు’ అంటాడు. అంతేకాదు, అవి కళ్ళకు కనబడినంత కాలం, ఇస్లాం స్వీకరించిన వారి మనస్సుల్లో  తమ గతం గుర్తుకు వస్తునే ఉంటుంది. కాబట్టి వాటిని ఆనవాళ్ళు లేకుండా చేస్తే, మతం మారిన తర్వాత వారికి గతంతో సంపూర్ణంగా సంబంధం తెగిపోతుంది. వారు సంపూర్ణంగా ఇస్లామీయులుగా మెలగగలుగుతారు. ఇది అర్థమైన తరువాత సికందర్ మరింత ఉత్సాహంగా మందిరాల విధ్వంసంలో పాల్గొన్నాడు. సూహభట్టుకు సహాయంగా సైన్యాన్ని ఇచ్చాడు. ఆ రకంగా ప్రపంచంలోని అద్భుతమైన కట్టడాలుగా ఎన్నదగిన అనేక అద్భుతమైన మందిరాలు ఆనవాళ్ళు కూడా లేకుండా పోయాయి. వాటి స్థానే మసీదులు వెలిశాయి.

మార్తాండ మందిరాన్ని ధ్వంసం చేయటానికి ఒక సంవత్సరం పాటు నిర్విరామంగా కష్టపడాల్సి వచ్చింది. సంవత్సరం కష్టపడ్డా, మందిరం పూర్తిగా ధ్వంసం కాకపోవటంతో, మందిరంలో చెక్క దుంగలను పేర్చి వాటికి నిప్పు పెట్టించాడు. అలా మందిరం కాలి బూడిద అవుతుంటే, సికందర్ సంతోషంగా వికటాట్టహాసం చేశాడనీ, ‘ఇది దైవాజ్ఞ’ అని ప్రకటించాడనీ పర్షియన్ రచయితలు రాశారు. మందిర పరిసర ప్రాంతాలలో వారిని బలవంతాన మతం మార్చారనీ, అందుకు వ్యతిరేకించిన వారిని మంటల్లోకి విసిరేశారనీ చెప్పుకున్నారు.

ఇంకా బిజ్‍బీహార్ వద్ద విజయేశ్వర మందిరంతో పాటుగా 300 మందిరాలను ధ్వంసం చేశారని హసన్ తన కశ్మీరు చరిత్ర పుస్తకంలో రాశాడు. విజయేశ్వర మందిరంలోని విగ్రహాల శకలాలతో అక్కడ ఒక మసీదు నిర్మించారనీ రాశాడు. ఇలా గ్రామగ్రామంలో కశ్మీర సైనికులు, సయ్యద్‍ల పర్యవేక్షణలో మందిరాలను ధ్వంసం చేశారు, మత మార్పిళ్ళు చేశారు. దాన్ని జోనరాజు ఒక్క శ్లోకంలో వర్ణించాడు.

న పురం పత్తనం నాపిన గ్రామో న చ తద్ధనమ్।
యాత్ర సూహ తురుష్కేణ సురాగా రమశేష్యత॥
(జోనరాజ రాజతరంగిణి 603)

ఎక్కడ సూహభట్టు అడుగుపెడితే అక్కడ భంగం కాకుండా ఒక్క మందిరం కూడా నిలవలేదు. పల్లె, పట్టణం, గ్రామం, అడవి ఎక్కడా కూడా ఒక్క మందిరాన్ని కూడా సూహభట్టు వదలలేదు.

ఈనాడు కుహానా చరిత్రకారులు-  భారతీయులు, తమ సమాజంలోని అన్యాయం, అంటరానితనాల వల్ల బాధితులు, ఇస్లాంను రెండు చేతులా స్వీకరించారని చరిత్రను తిరగరాస్తున్నారు. ప్రజలను నమ్మించాలని చూస్తున్నారు. ఇది,  ఆనాడు ధర్మం కోసం ఎన్నో హింసలను అనుభవించి ప్రాణాలు కోల్పోయి ధర్మాన్ని నిలుపుకున్నవారినీ , ప్రతికూల పరిస్థితులను ఎదుర్కుంటూ, ఎన్నో హింసలను అనుభవిస్తూ కూడా   ప్రాణాలను నిలుపుకుని ధర్మాన్ని నిలుపుకున్నవారినీ, ధర్మ రక్షణ పోరాట వీరులనూ , వారి త్యాగాలనూ అవమానించినట్టు. చరిత్రను మరచి  భారతీయ సమాజం ఇలాంటి దుష్ప్రచారాన్ని నమ్మటం అత్యంత తీవ్రమైన విషాదం. కానీ, నిజం తెలియని వారు, ఆత్మ గౌరవం, ఆత్మ విశ్వాసం లేనివారు ఎవరేం చెప్తే దాన్ని నమ్ముతారు. ప్రస్తుతం ఇలాంటి దుస్థితిని మనం అనుభవిస్తున్నాం.

(ఇంకా ఉంది)

Exit mobile version