Site icon Sanchika

జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-47

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

[dropcap]“B[/dropcap]ut the fanatical zeal of the Saiyids was not quenched by the destruction of Hindu temples and desecration of their images. They rocked the land with their tempests and thunderbolts. They were determined to destroy Hindudism in Kashmir root and branch.” (A History of Muslim Rule in Kashmir 1320-1819 – R.K.Parmu)

సయ్యద్ అలీ హమదానీ, అతని తనయుడు మహమ్మద్ హమదానీలు కశ్మీరు సంపూర్ణంగా ఇస్లాంమయం అయ్యేందుకు ప్రధాన కారకులుగా చరిత్ర రచయితలు నిర్ధారించారు. పర్షియన్ రచయితల రచనలు, జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టుల రచనలను విశ్లేషించిన తరువాత వారీ నిర్ణయానికి వచ్చారు. ముఖ్యంగా భారతీయ రచయితలు, ఇస్లామీ మత ప్రచారం కోసం జరిగిన దారుణ మారణకాండను, దౌష్ట్యాల పరంపరను, అమానవీయ కరాళ నృత్యాలను సూచనప్రాయంగా ప్రస్తావించి వదిలేస్తే, పర్షియన్ రచయితలు ఈ చర్యలను మరింత విపులంగా, అత్యంత ఆనందంతో వర్ణించారు. దాంతో  కశ్మీరులో ఇస్లామేతరుడన్నవాడు లేకుండా  చేసిన పద్ధతి పై  ఒక అవగాహన ఏర్పర్చుకునే వీలు చిక్కింది.

‘బహరిస్తాన్’లో,  ఫరిష్తా  రచనలో లభించిన వివరాల ప్రకారం మతం మారిన సూహభట్టు సికందర్ అనుమతితో, మహమ్మద్ హమదానీ సూఫీ ఆశీస్సులతో కశ్మీరులో ఇస్లామేతర మతస్థుడన్నవాడు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నాడు. భారతీయులు పాటించే సంప్రదాయాలను నిషేధించారు. అలా నిషేధించిన వాటిల్లోంచి ఆధునిక చరిత్ర రచయితలు ‘సతి’ నిషేధం గురించి అధికంగా ప్రస్తావిస్తారు. ఎందుకంటే సతి నిషేధం ద్వారా ఒక దురాచారాన్ని అంతం చేసే ప్రయత్నాలు జరిగేయని, మహిళల పరిస్థితిని ఇస్లాం మెరుగుపరిచించని నిరూపించే వీలు చిక్కుతుంది. అయితే, సికందర్ నిషేధించిన అనేకానేకమైన భారతీయ సంప్రదాయాలలో సతి ఒక అంశం  మాత్రమే. ఇంకా తిలకం, విభూతి వంటి ధర్మాన్ని సూచించే అన్ని చిహ్నాలను నిషేధించారు. జిజియా పన్ను విధించారు. అది కూడా నిర్దిష్టమైన పన్ను కాదు. ఎదుటివాడు ఎంత పన్ను చెల్లించగలడో చూసి, అంతకన్నా ఎక్కువ మొత్తంలో పన్ను నిర్ణయించేవారు. ఏదైనా పండుగ జరుపుకోవాలంటే పన్ను కట్టాలి. పెళ్ళి వంటి సంబరాలు జరుపుకోవాలంటే పన్ను కట్టాలి. తీర్థయాత్రలు చేయాలంటే పన్నులు కట్టాలి. పన్ను కట్టలేకపోతే ఆస్తులన్నీ ఇస్లామీయుల పరం అవుతాయి. ఆస్తి ఉన్నప్పుడే పన్ను చెల్లించలేనివాడు ఆస్తులు లేనప్పుడు పన్ను కట్టడం కుదరని పని. దాంతో కుటుంబాలు వీధిన పడేవి. పైగా కశ్మీరు ఇస్లాంమయం అవటంతో సాంప్రయాయిక ఉద్యోగ వ్యవస్థ దెబ్బతిన్నది. ఇస్లామీయుల అవసరాల ఆధారంగా కొత్త వృత్తులు ఏర్పడ్డాయి. సామాజిక సమీకరణాలు మారేయి. సాంప్రదాయిక వృత్తులు, జీవన విధానం దెబ్బతిన్నది. ఊరేగింపులు, సంబరాలు, పెళ్ళిళ్ళు, నృత్యాలు, సంగీతం, భజనలు, ధార్మిక ప్రసంగాలు, పూజలు  వంటి వన్నీ నిషేధానికి గురవటంతో వాటిపై ఆధారపడిన ప్రతి ఒక్కరి జీవన విధానం దెబ్బతిన్నది. ఈ స్థానంలో ఇస్లామీ వృత్తులు, వ్యాపారాలు, వ్యవహారాలు వచ్చి చేరాయి.

దానికి తోడు ఇల్లిల్లూ శోధించి, మూలమూలలా వెతికి భారతీయుల పవిత్ర గ్రంథాలు, శాస్త్రాలు అన్నింటినీ దాల్ సరస్సులో రాళ్ళు కట్టించి ముంచి దానిపై ‘సద్-ఇ-ఇష్‍బరీ’ అనే వంతెనను నిర్మించారు. రైనావరి (శ్రీనగర్) ను ఇష్‍బరీ (నిశత్‍బాగ్)తో కలిపే వంతెన ఇది. దీన్ని ‘విటలన్ మార్గ్’ అంటారు. ‘తారీఖ్-ఇ-ఆజామ్’, ‘తారీఖ్-ఇ-హసన్’ లలో ఈ మార్గం (వంతెన) ప్రస్తావన ఉంది. అంటే ఒక వంతెన నిర్మాణానికి  సరిపడినన్ని   శాస్త్రగ్రంథాలను సరస్సులో ముంచారన్న మాట.

సికందర్ నెరపిన ఈ విధ్వంసకాండ బ్రాహ్మణ చరిత్ర రచయితల (జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టు వంటి వారు) కల్పనలని, సికందర్ శాంతియుతంగా ఇస్లాం ప్రచారం చేశాడని, ప్రజలు ఇస్లాం గొప్పతనం గుర్తించి స్వచ్ఛందంగా ఇస్లాం స్వీకరించారని మొహిబ్-ఉల్-హసన్ తన గ్రంథంలో రాశాడు.

“..the most important development of the reign of Sultan (Sikandar) was the conversion to Islam of a great number of people including many Brahmins and the Prime Minister and Commander-in-Chief of the Sultan. On account of the conversion of the large population including the ruling class, it became possible to Islamise the State craft, which was one of the main concern of Mir Muhammad Hamadani.” (Islam in Kashmir by Muhammad Ashraf Wani)

మతం ఎలా మార్చారన్నది ఆధునిక చరిత్ర రచయితలు చెప్పటం లేదు. ప్రజలు స్వచ్ఛందంగా మారేరని అంటున్నారు. సమకాలీన చరిత్ర మేధావులు అల్పవర్గాలవారు స్వచ్ఛందంగా అధిక సంఖ్యలో ఇస్లాం స్వీకరించారని నమ్మించాలని ప్రయత్నిస్తున్నారు.  కానీ ఆనాటి చరిత్ర రచయితలు, ప్రాణాలు నిలుపుకోవటం కోసం, గతిలేక ఉన్నత  స్థానాలలో ఉన్నవారు,  బ్రాహ్మణులు మతం మారేరని, భయభ్రాంతులయి మరో గతి లేక ఇతరులు మతం మారేరని, మారణకాండను భరించలేక మతం మారేరని పర్షియన్ రచయితలు రాస్తున్నారు.

“Qutb-ud-din was succeeded by his son Sikandar, who established the Musalman faith and destroyed all the idol temples.” (Tariq-i-Rashidi, P 432)

“Sultan overthrew Idolatrous shrines and persecuted people not of his faith.” (Ain Jarrent, P 387)

“Sultan completed the destruction of the Hindu temples and their idols.” (Tabaqual, Nizamuddin, P 432)

“The Sultan offered to Hindus choice between Islam and exile. He forbade them the use of tika and the performance of Sati. Idols made of gold and silver were melted down. Many Brahmins committed suicide rather than lose their caste; since in those days travelling out of the country was more dangerous, some became Musalmans out of fear.” (Farishta, P 341)

“The Sultan used his energy and resources to destroy Hinduism. Under his orders many temples with their Idols were broken and the Hindus were made to pay Jiziya.” (Tariq-i-Haider Malik, P 30)

ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. కశ్మీరులో ఇస్లామేతరులపైన జరిగిన మారణకాండకు సూహభట్టు బాధ్యుడని జోనరాజు తన రాజతరంగిణిలో రాశాడు. కశ్మీరులో జరిగిన మారణకాండకు, విధ్వంసానికి, సికందర్ కారణమని పర్షియన్ రచయితలు అందరూ, ఒక్క ‘బహరిస్తాన్’ రచయిత తప్ప, మిగతా  అందరూ రాశారు. జోనరాజు బ్రాహ్మణుడు. సూహభట్టు మతం మారిన బ్రాహ్మణుడు. మతం మారిన తరువాత తాను వదిలిన ధర్మాన్ని నాశనం చేసేందుకు కంకణం కట్టుకుని తన ఇస్లామీ విశ్వాసాన్ని నిరూపించుకోవాలని తపన పడ్డవాడు సూహభట్టు. కాబట్టి జోనరాజు సూహభట్టును ద్వేషిస్తాడు. అందుకని నేరం అతడిపై నెట్టివేశాడు అని పర్షియన్ చరిత్రకారులు వాదిస్తారు. జరిగిన మారణకాండకు సికందర్ బాధ్యుడు కాడు, సూహభట్టే బాధ్యుడు. సికందర్‍ను అనవసరంగా దూషిస్తారని ఆధునిక చరిత్ర రచయితలు వాదిస్తారు. వీరు జోనరాజు రాజతరంగిణిని రచించిన కాలం నాటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే జోనరాజు హృదయం అవగతమవుతుంది.

చుట్టూ ద్వేషించే ఇస్లామీయుల సముద్రం. ఏ మాత్రం అవకాశం దొరికినా ఇస్లామేతరులను ముంచెత్తేందుకు సిద్ధంగా ఉన్న ద్వేష సముద్రం అది. దాన్లో రక్షణగా ద్వీపం లాంటి సుల్తాన్ జైనులాబిదీన్. తమ గొప్ప ప్రదర్శించేందుకు రాజతరంగిణిని కొనసాగించమని  తన ఆశ్రయంలో ఉన్న జోనరాజును ఆజ్ఞాపించాడు. తమ వారిని నాశనం చేసి, భవిష్యత్తులో ఆనవాళ్ళు లేకుండా అదృశ్యం చేయాలని మారణకాండ నెరపిన వారి గొప్ప రాయాలి జోనరాజు. అదీ ఎలాంటి ద్వేషం, క్రోధం, బాధ, ఆవేదనలు కనబరచకుండా. అలాంటి పరిస్థితులలో జైనులాబిదీన్ తండ్రి సికందర్‍ను దోషి అని రాయటాన్ని మించిన మూర్ఖత్వం మరొకటి ఉండదు. తాను బ్రతకాలన్నా, తన రచన భావి తరాలకు అందాలన్నా, దోషం సుల్తాన్‍ది కాదు, మతం మారిన సుల్తాన్ మంత్రిది అని ఒకప్పటి తనవాడిని దోషిగా నిలపటమే సమంజసం. పైగా నిన్నటి దాకా తమవాడిగా ఉండి, మతం మారగానే తమను నాశనం చేయాలని కంకణం కట్టుకుని పరాయివాడిలా, శత్రువులా ప్రవర్తించేవాడిని విమర్శించటం సులభం, క్షేమకరం. దీన్ని విడిచి సూహభట్టు, సికందర్ నడుమ ఎవరు బాధ్యులని చర్చించటం అసలు విషయాన్ని తప్పుదారి పట్టించటమే అవుతుంది. అయితే ఇలా తప్పుదారి పట్టించటం వల్ల రాజకీయ లాభాలున్నాయి. అందుకే జరిగినదాన్ని ఇలా ఊహించి, మతం మారినవారు తమంతట తామే తమ పాత ధర్మానికి చెందిన పవిత్ర కట్టడాలను కూల్చి వాటి స్థానాల్లో కొత్త మతం పవిత్ర కట్టడాలను నిలిపేరని రాస్తున్నారు. దీనివల్ల, ఆధునిక చరిత్ర రచయితలకు సుల్తానులు మంచివారు, ప్రజలు తమ పాత ధర్మంపట్ల ద్వేషంతో మందిరాలు కూలిస్తే సుల్తానుల తప్పేంటి? అని వాదించి నమ్మించే వీలు చిక్కింది.

“The iconoclastic activities of Sikandar have been greatly exaggerated. In many instances it was not Sikandar who pulled down the temples, but what really happened was that when the inhabitants of a certain locality embraced Islam, the temple was converted into a mosque, or it went into ruins due to sheer neglect.” (Kashmir Under the Sultans, Mohib-ul-Hasan, P 68)

అంతే కాదు, సికందర్ మందిరాలను ధ్వంసం చేయించలేదటానికి నిరూపణగా, సికందర్ పాలన తరువాత నాశనం కాకుండా నిలిచి ఉన్న 150 మదిరాలను చూపుతాడు మొహిబ్ ఉల్ హసన్. అడుగడుగునా మందిరం ఉండి,  వేల సంఖ్యలో మందిరాలున్న కశ్మీరులో, కేవలం 150 నాశనం కాని మందిరాలను చూపి, సికందర్ మంచివాడని నిరూపించాలన్న తాయత్రయం లోనే అసలు రాజకీయం దాగి ఉంది. ఈ రాజకీయాలాటలలోని అసలు లక్ష్యాన్ని ఎత్తి చూపిస్తుంది జోనరాజ రాజతరంగిణి.

(ఇంకా ఉంది)

Exit mobile version