Site icon Sanchika

జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-50

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

[dropcap]హ[/dropcap]మదానీ తండ్రీ, కొడుకులు కశ్మీరుపై చూపిన ప్రభావ ఫలితాలను ఈనాటికీ కశ్మీరు అనుభవిస్తోంది. కాబట్టి, కశ్మీరు జీవన విధానంపై వారి ప్రభావాల్ని చర్చించటం ఒక ప్రత్యేకమైన పుస్తకం అవుతుంది. ఇంతవరకూ చర్చించినది కేవలం హమదానీ తండ్రీ కొడుకుల ప్రభావానికి పరిచయం లాంటిది మాత్రమే. ఇకపై జోనరాజు రచించిన రాజతరంగిణిని తెలుసుకుంటూ, అవసరమైన చోట హమదానీల ప్రభావాన్ని విశ్లేషిస్తూ ముందుకు సాగుతుంటే, ఆ కాలంలో కశ్మీరు రూపాంతరం చెందిన విధానాన్ని గమనించవచ్చు. ఆపై, భవిష్యత్తు కశ్మీరును ఈ కాలం నాటి మార్పులు ఏ రీతిలో ప్రభావం చేశాయో విశ్లేషించవచ్చు.

ఆలీషాహః స వసుధా సుధాం శు జగతస్తమ।
ప్రదోషా మధ్యమ జైత్సీద్ భాస్వతోస్తే పితుస్తతః॥
(జోనరాజ రాజతరంగిణి 613)

సేవకుడి దోష ప్రభావం యజమానిపై పడుతుందంటారు. ఆ ప్రకారం సూహభట్టు దుశ్చర్యల ప్రభావం వల్ల మృత్యువు కోపం వహించినట్టు సికందర్ మృత్యువు పాలయ్యాడు. తన పెద్ద కొడుకు అల్లీ ‘అలీషాహ’కు సింహాసనం అప్పచెప్పి సికందర్ బుత్‌కిషన్ మరణించాడు.

సికందర్ మరణించేనాటికి అతని తొలి సంతానం ‘అలీషాహ’ బాలుడు. ‘అలీషాహ’ సింహాసనం అధిష్ఠించటాన్ని జోనరాజు – సూర్యుడు అస్తమించిన తరువాత, జగతికి వెలుగు పంచేందుకు చంద్రుడు ఉదయించినట్టు, సికందర్ మరణం తరువాత ‘అలీషాహ’ రాజయ్యాడు అన్నాడు.

సింహాసనం అధిష్ఠించే సమయానికి ‘అలీషాహ’ ఇంకా బాలుడే. కాబట్టి  యువకులు  పొందే ప్రేమానందాలకు అతడు దూరం అయినా సరే, అదృష్ట దేవత అతనిని పదే పదే కౌగిలించుకున్నది. ఇతర రాజులందరూ అతడికి వంగి వంగి నమస్కారాలు చేశారు. మందిరాలను ధ్వంసం చేయటం, దేవతా విగ్రహాలను ముక్కలు ముక్కలు చేయటంలోనే తన శక్తినంతా వెచ్చించే సూహభట్టు రాజుకు ప్రధానమంత్రి అయ్యాడు. మార్గపతి లద్ద, ఎలాంటి సంశయాలు లేకుండా ఆయుధాలు విసర్జించాడు. వెంటనే, అతడిని, అతడి కొడుకులందరినీ బంధింపచేశాడు సూహభట్టు. అతడి కొడుకులలో మహమ్మదా ఒక్కడే తప్పించుకున్నాడు. లద్దకు, సూహభట్టుకు నడుమ పలు భేదాభిప్రాయాలు, అపనమ్మకాలు ఉండేవి. అందుకని, అతడిని నమ్మించి ద్రోహం చేశాడు సూహభట్టు. రాజవైద్యుడు శంకరుడిని కూడా బంధించాలని ప్రయత్నించారు. కానీ అతడి ధైర్యం, తెలివి ముందు సాయుధ సైనికుల ఆటలు సాగలేదు. ఇక్కడ ఒక గమ్మత్తయిన పోలికను వాడేడు జోనరాజు.

ప్రమాదాన్ని పట్టించుకోని సింహం వేటగాడి వలలో చిక్కటంలో ఆశ్చర్యం లేదు. కానీ ఎత్తు నుంచీ, ఎంతో దూరం  చూడగలిగే పక్షి కూడా వలలో చిక్కుకోవటం ఆశ్చర్యం అంటాడు జోనరాజు.

జోనరాజు ఈ వ్యాఖ్యను బట్టి గ్రహించాల్సిందేమిటంటే, ఇంకా కశ్మీరులో భారతీయులు  ఆశలను సంపూర్ణంగా వదిలేసుకోలేదని. ఇలా వారు తమ అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు పోరాడుతున్నారన్న విషయం ఈ సంఘటన వల్ల తెలుస్తుంది. లద్దరాజు, శంకరుడు వంటి వారు ఇస్లామేతరులు. లద్దరాజు సంతానంలో ఒకడి పేరు మహమ్మదా. అంటే, సంతానం ఇస్లామీయులైనా, తండ్రి ఇస్లామేతరుడు. కశ్మీరులో ఇస్లామేతరులు లేకుండా చేయాలన్నది సూహభట్టు ఆశయం. సూహభట్టు, సయ్యద్ హమదానీకి తన కూతురిని ఇచ్చి వివాహం చేశాడు. హమదానీ ప్రభావంతో కశ్మీరులో కాఫిర్ అన్నవాడిని  ఉండనీయకూడదని పంతం పట్టాడు. అయినా సరే, రాజ్యంలో కొందరు శక్తిమంతమైన ఇస్లామేతరులు, కీలకమైన స్థానాలలో ఉన్నారు. వారిని సంహరించేందుకు సూహభట్టు చేసిన ప్రయత్నాలు ఇవి. అతడిని ఎదుర్కునేందుకు లద్దరాజు, శంకరుడు విఫల పోరాటం చేశారు. అందుకే, సింహం, పక్షుల ఉపమానంతో పరిస్థితిని వివరించాడు జోనరాజు. వేటగాడు వలవేస్తాడు. చూస్తూ చూస్తూ లద్దరాజు ఆ వలలో పడ్డాడు. శంకరుడు కూడా చిక్కిపోయాడు.

జరుగుతున్న పరిణామాలను తెలుసుకుంటున్న మహమ్మదా బాధపడ్డాడు. కశ్మీరు ప్రయాణమయ్యాడు. ప్రయాణంలో విశ్రాంతి కోసం నమ్మకస్తుడయిన గోవింద అనే అతడి ఇల్లు చేరాడు. అతడి ఇల్లు దుర్డాండపురంలో ఉంది. ఇక్కడ మళ్ళీ చక్కటి వర్ణనలతో పరిస్థితిని వివరిస్తాడు జోనరాజు.

నీటి పొగతో ఏర్పడిన మేఘం, మంటను ఆర్పుతుంది. అదే ఘర్షణలో జనించిన నిప్పు అడవినంతా బూడిద చేస్తుంది. అలాగే విషవృక్షం తానున్న భూమిలో ఉన్న వృక్షాలన్నింటినీ చంపి, మరుభూమిలా మలుస్తుంది. అలాగే స్వార్థంతో నిండిన మనుషులు ఇతరులు తమకు చేసిన మంచిని మరచి స్వార్థం కోసం వారికి నష్టం చేస్తారు. గోవిందను మహమ్మదా నమ్మాడు. అతడి దగ్గర ఆశ్రయం పొందాడు. కానీ ఖాసా నాయకుడు  గోవింద మరో రకంగా ఆలోచించాడు.

సూహభట్టు కశ్మీరు రాజ్యం అల్లకల్లోలం కాకుండా విప్లవాలను అణచివేస్తున్నాడు. కాస్త సైన్యం సమకూర్చుకుని కశ్మీరును అల్లకల్లోలం చేసే ఉద్దేశంతో ఉన్నవాడు మహమ్మదా. ఇలా రాజ్యాన్ని అల్లకల్లోలం చేయాలనుకుంటున్న దుష్టుడు నా దగ్గర ఆశ్రయం పొందుతున్నాడు, అతనికి రక్షణను ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకున్నాడు గోవింద. ఈలోగా మహమ్మదాను వెతికి పట్టుకుని చంపేందుకు సూహభట్టు పంపిన మనుషులు అతడిని వెతుకుతూ గోవింద ఇంటికి వచ్చారు. ఖాసాల నాయకుడు గోవింద. అతడు తనను నమ్మిన మహమ్మదాను మోసం చేశాడు. నమ్మి వచ్చిన వాడిని రక్షించాలన్న ఆలోచన కూడా లేకుండా మహమ్మదాను అతడిని వెతుకుతూ వచ్చినవారికి అప్పగించాడు.

వేటగాడు నిద్రిస్తున్న సింహాన్ని బంధించినట్టు, మహమ్మదాను, ఓ జంతువులా కట్టి వదిలేశాడు. అతడిని వెతుకుతూ వచ్చిన వారు అతడిని కశ్మీరు తీసుకుపోయారు. మంత్ర ప్రయోగం వల్ల స్థాణువైన సర్పంపై కోతి దాడి చేసినట్టు, మరణించిన సింహం జూలును వేటగాడు కోసి వెదజల్లినట్టు, బంధించిన వీరుడిని అవమానించి సాధించేదేముంది? మహమ్మదా తప్పించుకుంటాడన్న భయంతో వారు అతడిని బహురూప కోటలో బంధించారు.

రాత్రిపూట మెరుపులు మెరిసే మేఘం, ప్రయాణీకులకు దారి చూపి ఆశ కల్పించి, వారిపై పిడుగులు కురిపిస్తుంది. సింహం కూడా పారిపోయేట్టు వెనక్కు చూసి, ధైర్యం కలిగించి, ఆపై వారిపై దూకి చంపుతుంది. శనిగ్రహం సైతం వక్రగమనంతో ఇతర గ్రహాలను వెనక వదిలేసి ముందుకు సాగుతాడు. అలాగే అదృష్టం కూడా దుష్టులలో తాము ఆధిక్యం సాధించామన్న నమ్మకం కలిగించి, వారిని దెబ్బ తీస్తుంది.

జైలులో ఉన్న మహమ్మదాను ఓ సేవకురాలు ఓదార్చింది. అతడిని తప్పించే పథకం వేసింది. మహమ్మదా ఒళ్ళంతా చెమటలు పట్టగానే, తనను కాపలా కాస్తున్న వారితో స్నానం చేస్తానని చెప్పి, స్నానశాలలోకి వెళ్లాడు. అక్కడ స్నానశాల గోడలో అతడు తప్పించుకుపోయేందుకు వీలుగా రంధ్రం చేసి ఉంది. అలా హంస ఒక ద్వీపం నుంచి మరో ద్వీపానికి వెళ్ళినట్టు మహమ్మదా గోడ రంధ్రం లోంచి ఒక దేశం లోంచి మరో దేశానికి అడుగుపెట్టినట్టు అడుగుపెట్టాడు బయటకు. కొండ అంచున ఉన్న కోట నుండి కోపంతో పెద్ద శబ్దంతో దూకుతున్న జలపాతం హోరు, అతని కాళ్ళకు ఉన్న సంకెళ్ళు చేసే శబ్దాన్ని ముంచివేస్తుంటే కాపలాదార్లు గమనించకుండా తప్పించుకున్నాడు మహమ్మదా. అతడికి సహాయం చేసినవారు అతడి కాళ్ళకు ఉన్న సంకెళ్ళను త్రెంచి వేశారు. మహమ్మదాను తప్పించటం వల్ల సూహభట్టుతో తమ స్నేహం శాశ్వతంగా చెడిపోయిందని వారికి తెలుసు. మహమ్మదా తప్పించుకోవటం సూహభట్టుకు భయం కలిగించింది. అందుకే లద్దరాజు ఆస్తినంతా కొల్లగొట్టి, అతడిని చంపించేశాడు. మార్గపతి లద్దరాజు మరణం పట్ల ప్రజలు తీవ్రంగా దుఃఖించారు. సూహభట్టును శాపనార్థాలు పెట్టారు. తమ స్వంత తండ్రి మరణించినట్టు రోదించారు. ప్రజలు రాత్రి పూట ఎక్కడ తనపై దాడి చేసి చంపేస్తారోనన్న భయంతో, సూహభట్టు, తన అంగరక్షకులను వెంటబెట్టుకుని రాత్రిపూట భయం భయంగా తిరిగేవాడు, గూడు నుంచి క్రింద పడిన పిట్ట పిల్లలా! అతడికి పగలు రాత్రిలా, రాత్రి పగలుగా గడిచేది. పగలు ప్రజలు పెద్ద సంఖ్యలో తిరుగుతుంటారు కాబట్టి  బయటకి రావలంటే సూహభట్టు భయపడేవాడు. రాత్రిళ్ళు ప్రజలు పెద్ద సంఖ్యలో ఉండరు  కాబట్టి అంగరక్షకుల నడుమ దాక్కుని బయటకు వచ్చేవాడు.

మహమ్మదా తప్పించుకోవటం సూహభట్టుకు తీవ్రమైన విచారం కలిగించింది. ఎలాగయితే తనకు చిక్కిన పెద్ద చేప, పడవలోంచి నీళ్ళలోకి దూకి పారిపోతే చేపలు పట్టేవాడు బాధపడతాడో, అలా బాధపడ్డాడు సూహభట్టు మహమ్మదా తప్పించుకోవటం వల్ల.

ఇక్కడ జోనరాజు ఎంతో నర్మగర్భంగా చెప్పిన విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. జోనరాజు వర్ణించిన సూహభట్టు పరిస్థితి, దేశవ్యాప్తంగా, ఆ కాలంలో, ఇస్లామేతరులపై ఆత్యాచారాలు నెరపే ఇస్లామీయుల పరిస్థితి; భారతీయులపై వారు అధికార మదంతో, విజేతలమన్న అహంతో, మతాంతరీకరణ ఉత్సాహంతో అనేకానేక అత్యాచారాలు జరిపేవారు. కానీ అవకాశం దొరికినప్పుడు, అత్యాచారాలకు గురయినవారు కానీ, వారి బంధువులు, ఇత్రులు కానీ,  తమపై దాడి చేసి చంపేస్తారన్న భయం వారిని వేధించేది. అలాంటి సంఘటనలు అనేకం జరిగాయి. ఆ భయంతో ఇస్లామీయులు ఒంటరిగా తిరిగేవారు కాదు. గుంపులు గుంపులుగా తిరిగేవారు. రాత్రి పూట బయటకు వెళ్ళేవారు కాదు. ఇళ్ళల్లోనే రక్షణగా ఉండేవారు. తప్పనిసరిగా బయటకు వెళ్ళాల్సివస్తే, రక్షకులను వెంటపెట్టుకుని వెళ్ళేవారు. ఒక సిద్ధాంతం ప్రకారం, ఇలా అర్ధరాత్రిళ్ళు బయటకు వెళ్ళాలంటే ఉన్న  భయం వల్ల ‘బహిర్భూములు’ ఇళ్ళ దగ్గరకు, ఇంటి ఆవరణ పరిధిలోకి వచ్చాయి. ఇది భారతీయ సమాజంలో అంత వరకూ లేని ఓ నూతన వృత్తికి శ్రీకారం చుట్టిందని అంటారు.  ఇంటి ఆవరణలోని మల విసర్జన గదిలోని మలాన్ని ఎత్తి ఊరవతల విసిరివేయటం ఓ వృత్తిలా ఎదగటానికి దారి తీసిందని అంటారు. జోనరాజు వర్ణించిన సూహభట్టు పరిస్థితి   ఆ ఆలోచనకు బలమిస్తుంది.

(ఇంకా ఉంది)

Exit mobile version