Site icon Sanchika

జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-51

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

సంధ్యక్షణ ఇవోదగ్రే సూహే రంజిత భూ భృతి।
నాభూతాముదితా రాజ యువరాజౌ రలీన్తుదుకత॥
(జోనరాజ రాజతరంగిణి 650)

[dropcap]దే[/dropcap]శంలో అల్లకల్లోలాన్ని అణచి శాంతిని సాధించాలని సూహభట్టు తిరుగుబాటుదారులను అణచివేస్తున్నాడని ప్రజలు భావిస్తున్నట్లు జోనరాజు రాశాడు. అందుకనే తన దగ్గర ఆశ్రయం పొందిన మహమ్మదాను ఖాసా నాయకుడు కారాగారానికి పంపాడు. అయితే రాజ్యానికి అసలయిన మరో వారసుడు ఉన్నాడు. అతని పేరు పీరుజా. సికందర్‍కూ, అతని హిందూ భార్య శోభాదేవికీ జన్మించిన ‘పీరూజా’ని చూసి ప్రజలందరూ ‘సికందర్’‍ను చూసినట్లుగా భ్రమ చెందేవారు. అయితే, రాజ్యంలో సింహాసనం కోసం సోదరుల నడుమ పోరు జరగరాదని సికందర్ ఇతడికి దేశబహిష్కారం విధించాడు. ఇతడికి ఉత్తర దేశ రాజు ఆహ్వానం పలికి ఆశ్రయం ఇచ్చాడు. ఇప్పుడు పీరూజా మహమ్మదాతో కలిసి కశ్మీరాన్ని గెలుచుకునేందుకు ప్రయాణమయ్యాడు. జోనరాజు ‘పీరూజా’ అని రాసిన రాకుమారుడి పేరు ఫిరోజ్. కశ్మీరీయులు ఫిరోజ్‍ను ‘ఫిరూజ్’ అని పలుకుతారు. దాంతో జోనరాజు ‘పీరూజా’ అన్నాడు.

కశ్మీరులో ఇదొక విచిత్రమైన పరిస్థితి. భారతీయులు తిరిగి కశ్మీరును హస్తగతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. వారికి తురుష్కులు సహాయం చేస్తున్నారు. ఇస్లామీయులు కశ్మీరుపై పట్టు బిగించాలని చూస్తున్నారు. వారి వైపు సహాయంగా ఉండి పోరాడే సేనానులంతా భారతీయులే! దాంతో యుద్ధంలో ఇస్లామీయులు ఇస్లామీయులను సంహరించారు. భారతీయులు భారతీయులను ఓడించారు. రాజ్యం పై అధికారం ఇస్లామీయులకు దక్కింది. వారి తరఫున నిలబడి భారతీయులపై అత్యాచారాలు జరిపింది ఇస్లాం స్వీకరించిన భారతీయులే. అంటే, ఎవరి లక్ష్యం ఏమిటో, ఆ లక్ష్య సాధనకు మార్గం ఏమిటో, ఎవరికీ స్పష్టంగా అవగాహన లేదు. కానీ తాత్కాలికంగా శత్రువులను దెబ్బతీయటం కోసం ఏం చేయాలో అది చేసేయటం తప్ప, శాశ్వతంగా జరిగే దుష్పరిణామాల గురించిన ఆలోచనలు, దూరదృష్టి ఎవరూ కనబరచలేదన్న మాట. అందుకే సయ్యద్ మీర్ హమదానీ శిష్యులు, మహమ్మద్ హమదానీ శిష్యులు ఒకరికొకరు వ్యతిరేకంగా పోరాడుకున్నారు.

పీరూజా, మహమ్మదాలు చేతులు కలిపి కశ్మీరుపైకి దందయాత్రకు వస్తున్నారని తెలియగానే సూహభట్టు శ్రీ లద్దను, గౌరకుడిని వారిని ఎదుర్కునేందుకు ససైన్యంగా పంపాడు. ఇప్పటి కశ్మీరు చరిత్రను చూస్తే కూడా అప్పటి విచిత్రమైన పరిస్థితే కనబడుతుంది.

సూహభట్టు ఇస్లాం స్వీకరించిన వాడు. అతడు ఇస్లాం రాజు అధికారం నిలపాలని ప్రయత్నిస్తున్నాడు. ఆ రాజును సింహాసనం నుండి తప్పించాలని పీరూజా ప్రయత్నిస్తున్నాడు. అతడికి సహాయం చేస్తున్నాడు మహమ్మదా. మహమ్మదా తండ్రి లద్దరాజు మార్గపతి ఇస్లామేతరుడు. అతడిని సంహరించింది సూహభట్టు. మహమ్మదాను పట్టించింది ఖాసా గోవింద. ఇప్పుడు పీరూజా, మహమ్మదాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నది శ్రీలద్ద, గౌరకుడు. ఎవరు ఓడినా ఎవరు గెలిచినా రాజ్యం మాత్రం ఇస్లామీయులదే.

ప్రస్తుతం కూడా కశ్మీరులో పోరు జరుగుతోంది. కశ్మీరును భారతదేశంలో భాగంగా నిలపాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సంఖ్యాబలం వల్ల కశ్మీరు ఇస్లామిక్ దేశం పాకిస్తాన్‍కు చెందాలని భావించేవారు కశ్మీరు ప్రజలను ‘మతం’ ఆధారంగా భయభ్రాంతులను చేసి కశ్మీరుపై అధికారం సాధించాలని ప్రయత్నిస్తున్నారు. భారతీయ ప్రభుత్వం తరఫున సైన్యం కశ్మీరు చేయి దాటిపోకుండా ప్రయత్నిస్తోంది. కానీ భారతీయ సైన్యాన్ని విమర్శిస్తున్నదెవరు? భారతీయులే! కశ్మీరు భారత్ చేయి దాటిపోకూడదని ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న  భారతీయ సైన్యాన్ని చూసి దేశభక్తి పాలు విరిగిపోతున్నట్టు విరిగిపోతున్నదెవరిది? భారతీయులదే! తీవ్రవాదులను గౌరవించి, తీవ్రవాద  దాడులు చేసేవారి హక్కుల కోసం పోరాడుతున్నదెవరు? భారతీయులే! ప్రాణభయంతో స్వంత కశ్మీరును వదిలి తమ స్వదేశంలోనే కాందిశీకుల్లా బ్రతుకుతూ ఎవరి సానుభూతి పొందకుండా, స్వదేశంలో అనాథలయిన వారెవరు? భారతీయులే! వారిని నిర్దాక్షిణ్యంగా ఉపేక్షిస్తూ, ప్రాణాలు అరచేత పట్టుకుని ఇతర దేశాల నుంచి భారత్ వస్తున్న ఇస్లామీయులపై సానుభూతి కురిపిస్తూ అక్కున చేర్చుకుంటున్నదెవరు? భారతీయులే!

శ్రీ లద్దరాజు, గౌరకుడు – పీరూజా, మహమ్మదాలను, వారి వెంట వచ్చిన తురుష్క సేనను ఓడించి తరిమివేశారు. ఈ తిరుగుబాటు సేనను శ్రీ లద్దరాజు, గౌరకులు ఎలా అణచివేశారంటే – ప్రార్థన, అర్పణలు ఎలా రోగాన్ని నాశనం చేస్తాయో అలా అంటాడు జోనరాజు. వీరు సాధించిన విజయంతో సంతుష్టుడయిన సూహభట్టు – శ్రీ లద్దరాజును కంపన రాజ్యానికి, గౌరభట్టును క్రామ రాజ్యానికి అధిపతులను చేశాడు. ఈ విజయంతో సూహభట్టు కశ్మీరులో తిరుగులేని శక్తిమంతుడిగా ఎదిగాడు. ఎలాగయితే చీకటి పడగానే, పర్వతాలు నలుపు రంగులోకి మారి కనబడవో, సూర్యచంద్రులు  కనబడరో, అలాగే సూహభట్టు శక్తి ముందు రాజు కానీ, రాజ్యానికి వారసులు కానీ తల ఎత్తలేకపోయారు అంటాడు జోనరాజు. అంటే, అంతగా శక్తిమంతుడయ్యానన్న మాట సూహభట్టు. గతంలో సికందర్ వల్ల సూహభట్టు కాస్తయినా అదుపులో ఉండేవాడు. ఇప్పుడు సర్వశక్తిమంతుడవటంతో సూహభట్టుకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.

ఈ సందర్భంగా జోనరాజు అద్భుతమైన శ్లోకం రాశాడు. ఈనాటికీ వర్తించే చేదు నిజాన్ని నిక్కచ్చిగా చెప్తుందీ శ్లోకం.

శ్యేనో హంతి పతత్రిణో మృగపతిర్నిష్పాత యిష్ణుర్మృగాన్
బాధ్యన్తే మణయోపి వజ్రమణినా ఖాతా ఖనిత్ర్రైర్మహీ।
పుష్పాణీవ నభస్వతా గ్రహగణః సూర్యేణ నిర్ధంనితా
ప్రాయేణాత్ర విలోక్యతే పరిభవత్రోసః సజాతీయతః॥
(జోనరాజ రాజతరంగిణి 651)

గ్రద్ధ ఇతర పక్షులను చంపుతుంది. సింహం ఇతర జంతువులను చంపుతుంది. వజ్రం  ఇతర మణులను కోస్తుంది. సూర్యుడు ఇతర గ్రహాలను ఆకాశంలో పువ్వుల్లా వెదజల్లుతాడు. దీన్ని బట్టి చూస్తే ఈ ప్రపంచంలో సజాతీయుల వల్లనే సర్వనాశనం సంభవిస్తుంది.

దీన్నే ఒక అమెరికన్ సైన్యాధికారి “We have found the enemy and the enemy is us” అని అన్నాడు. దీన్నే, జోనరాజు ఇంకా వివరంగా ఉదాహరణలతో సహా చెప్పాడు. జోనరాజు ‘సజాతీయులు’ అన్న పదం వాడేడు.

జోనరాజు కాలంలో భారతీయులపై అత్యాచారాలు జరిపింది, మందిరాలు ధ్వంసం చేసింది, బలవంతంగా మత మార్పిళ్ళు చేసింది ఇస్లామీయులు. కానీ వారి కన్నా ఘోరంగా భారతీయులపై అత్యాచారాలు చేసింది మతం మారి ఇస్లాం స్వీకరించిన భారతీయులే! ఇందుకు చక్కని ఉదాహరణ మతం మారిన సూహభట్టు. సికందర్ కాలంలో అతను చేసిన అత్యాచారాలు ఒక ఎత్తైతే, సికందర్ మరణం తరువాత కశ్మీరులో అత్యంత శక్తిమంతుడయి ఎలాంటి నియంత్రణ లేని కాలంలో సూహభట్టు జరిపిన అకృత్యాలు మరో ఎత్తు.

ద్విజాతి పీడనే తేన ప్రేరితోపి ముహుర్ముహుః।
శ్రీ సికంధర భూపాలః కరుణాకోమల శయః॥
యవనాబ్ధి మహావేలాం యామకార్షిత్ కథంచన।
ఉల్లంఘితా ద్విజాతీనాం తేన దండస్థితిస్తతః॥
(జోనరాజ రాజతరంగిణి 652, 653)

సూహభట్టు ఎంతగా ప్రేరేపించినా, సికందర్‍లో సహజంగా ఉన్న కరుణ భావన వల్ల భారతీయులను హింసించటం పట్ల కొన్ని పరిమితులు విధించాడు సికందర్. అంటే, హింసపై పరిమితులు విధించి, సూహభట్టును అదుపులో వుంచాడన్న మాట సికందర్. దూసుకువస్తున్న యవన సముద్రానికి అడ్డుకట్ట కట్టాడన్న మాట. కానీ ఇప్పుడు సికందర్ లేకపోవటంతో ఆయన విధించిన హద్దులన్నీ దాటి సూహభట్టు హింసించటం తీవ్రతరం చేశాడట

జోనరాజు సికందర్‍ను కరుణామయుడన్నాడు. ఆయన కరుణ భావన వల్ల ఇస్లామేతరులను హింసించటం పట్ల హద్దులు విధించాడన్నాడు. కానీ పర్షియన్ చరిత్ర రచయితలు సికందర్ అపార కరుణ గుణం గురించి ఏ మాత్రం ప్రస్తావించలేదు. ఇస్లామేతరులను హింసించటం పట్ల ఆయన ఉత్సాహాన్ని, ఇస్లాం ప్రచారం పట్ల అయన దీక్షను పొగిడారు.

“Immediately after his (Sufi Mir Mohammad’s) arrival, Sultan Sikandar, peace be on him, submitted to his supremacy and proved his loyalty to him by translating his words into deeds. He eradicated aberrant practices and infidelity. He also put an end to the various forbidden and unlawful practices throughout his kingdom. Thus during the entire period of his rule, all traces of wines and intoxicants and instruments of vice and corruption, like the cord of canticle, lyre, and tambourine were wiped out. The clamor of the drum and the trumpet, the shrill notes of the fife and the clarion no longer reached people’s ears, except in battles and assaults.” (from Baharistan-i-Shahi)

అంటే అన్ని రకాల వాయిద్యాలను నిషేధించాడన్న మాట సికందర్. అన్ని రకాల నేరాలు.. సురాపానంతో సహా నిషేధానికి గురయ్యాయి. అంతే అడుగడుగునా గుడి ఉండి, ప్రతి గుడికీ వాయిద్యకారుల అవసరం ఉన్న దేశంలో అన్ని రకాల వాయిద్యాలను నిషేధించడమంటే, ఎన్ని వృత్తులు ఎలా నాశనమైపోయి ఎంత అల్లకల్లోలం అయి ఉంటుందో కశ్మీర సమాజం – ఊహించవచ్చు.

“Towards the end of his life, he (Sultan Sikandar) was infused with a zeal for demolishing idol-houses, destroying the temples and idols of the infidels. He destroyed the massive temple at Beejbehara. He had designs to destroy all the temples and put an end to the entire community of infidels,” (Bharistan-i-Shahi)

కశ్మీరులోని మందిరాలన్నింటినీ నాశనం చేయాలని, ఇస్లామేతరులందరినీ నిర్మూలించాలనీ కంకణం కట్టుకున్నాడన్న మాట సికందర్.

“And Sikandarpura was laid out on the debris of the destroyed temples of the Hindus. In the neighborhood of the royal palaces in Sikandarpur, the Sultan destroyed the temples of Maha-Shri built by Praversena and another by Tarapida. The material from these was used for constructing a ‘Jami’ mosque in the middle of the city.” (History of Kashmir, by Hasan)

రైనావారి ప్రాంతంలో ప్రస్తుతం ‘బట్ట  మజార్’ (హిందువుల శ్మశానవాటిక)గా గుర్తింపు పొందిన ప్రాంతంలో సికందర్ లక్ష మంది హిందువులను సజీవ దహనం చేశాడు. వారి అస్థికలను కనీసం దగ్గరలో ఉన్న ఝీలమ్ నదిలో కలపనివ్వలేదు. దాంతో వారి బంధువులు తమ వారి ఎముకలను ఇంటి ఆవరణలోనే  పాతిపెట్టారు. ‘మజార్’ అంటే సమాధి అని అర్థం. ‘భట్ట’ అన్నది కశ్మీరీ పండితులను సూచించే పదం. ‘భట్టు’, ‘భట్ట’ సమానార్థకంలో వాడతారు. ‘భట్ట మజార్’ అంటే ‘భట్టుల సమాధి’ అని అర్థం. అంతటి క్రూరుడయిన సికందర్‍ను జోనరాజు కరుణామయుడు అని అనటం అనృతం అనిపిస్తుంది. కానీ జోనరాజు రాజతరంగిణిని రచించినది సుల్తాన్ జైనులాబిదీన్ కోరిక వల్ల, ఆయన ఆశ్రయంలో ఉంటూ. ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి తాను రాజతరంగిణిని రచిస్తున్నాడో, అతని తండ్రిని క్రూరుడు, కర్కోటకుడు అని దూషించకూడదు. కాబట్టి సికందర్‍ను కరుణామయుడిని చేసి దోషమంతా సూహభట్టుపై నెట్టివేశాడు. సుల్తాన్ ఖుష్, జోనరాజు బతికిపోయాడు. ఇలాంటి పరిమితులు, భయాలు లేని పర్షియన్ చరిత్ర రచయితలు మరో రకంగా రాశారు. వారు సూహభట్టును తక్కువ చేసి, సికందర్‍ను గొప్పవాడిగా చూపించారు. సూహభట్టును దుష్టుడిగా చూపితే జోనరాజుకు లాభం. సికందర్‍ను గొప్పగా చూపటం పర్షియన్ రచయితల ధర్మం. చరిత్ర రచయితల దృష్టి చరిత్రను ప్రభావితం చేయటం స్పష్టంగా తెలుస్తుంది. భారతదేశ చరిత్ర రచయితలు ఈ విషయంలో జోనరాజు నిజం చెప్తున్నట్టుగా భావించి సికందర్‍ను మంచివాడన్నారు. అలా చెప్పటం వారికి లాభం. భారతదేశ చరిత్రను రచించటంలో ఇలాంటి పలు అంశాలను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. రాసి ఉన్న ప్రతి అక్షరాన్ని ‘శిలాశాసనం’లా భావించకూడదు. నిజానిజాలు నిర్ధారించేముందు విచక్షణను ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే ఒకటి మాత్రం నిజం. సికందర్ రాజుగా ఉన్నప్పుడు భారతీయులపై జరిగిన అకృత్యాలను, సికందర్ మరణం తరువాత సూహభట్టు జరిపిన అమానుషమైన చర్యలతో పోలిస్తే, జోనరాజు అన్నట్టు యవన సముద్రం ముంచెత్తకుండా కట్టిన అడ్డుగోడ పగిలి, యవన సముద్రం కశ్మీరాన్ని సికందర్ మరణం తరువాత ముంచెత్తినట్టు అనిపిస్తుంది.

(ఇంకా ఉంది)

Exit mobile version