జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-52

0
2

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

యవనాబ్ధి మహావేలాం యామకార్షిత్ కథంచన।
ఉల్లంఘితా ద్విజాతీనాం తేన దండస్థితిస్తతః॥
(జోనరాజ రాజతరంగిణి 653)

[dropcap]ఇ[/dropcap]స్లామేతరులను హింసించటం పట్ల సికందర్ విధించిన హద్దులను దాటి సూహభట్టు భారతీయులను హింసించటం ఆరంభించాడు. వారిని శిక్షించటం ఆరంభించాడు. ఇక్కడ జోనరాజు ‘ద్విజాతి’ అన్న పదం వాడటంతో బ్రాహ్మణులు అన్న పదాన్ని అనువాదాలలో సమానార్థకంగా వాడుతున్నారు. కానీ ఈ పదం కశ్మీరులో భారతీయులందరికీ వర్తిస్తుంది. ‘పండితులు’ అన్న పదం ఎలా ‘హిందువులు’ అన్న పదానికి పర్యాయ పదం అయిందో, కశ్మీరు వ్యవహారాలలో అలా జోనరాజు పలు సందర్భాలలో ‘ద్విజాతి’ అన్న పదాన్ని విస్తృతార్థంలో వాడటం చూడవచ్చు. భారతీయులపై రకరకాల దండోపాయాలను ప్రయోగించాడు సూహభట్టు.

దర్శనాంతర విద్వేషీ ప్రదోషస్త మసాం నిధిః।
యాగయాత్రాది నాగానాం దుర్వృత్తః స న్యావారయత్॥
(జోనరాజ రాజతరంగిణి 654)

ఎలాగయితే రాత్రివేళల చీకటిని తప్ప దేన్నీ చూసే వీలుండదో, అలా విద్వేష మనస్కుడైన సూహభట్టు నాగుల సంబరాలను, యాగ, యాత్రలను నిషేధించాడు.

ఇలా ఇతర మతస్తుల మత సంబంధ ఆచార వ్యవహారాలను నిషేధించటం వెనుక ప్రధానంగా ఒక ఆలోచన కనిపిస్తుంది. ఇతర మతస్తులు తమ ధర్మాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుసరించగలిగితే, తమ ధర్మం వదలాల్సిన అగత్యం వారికి పట్టదు. కష్టమో, నష్టమో స్వధర్మాన్ని అనుసరిస్తారు. కానీ తమ ధర్మాన్ని అనుసరించటం కుదరక, పరాయి ధర్మాన్ని అనుసరిస్తే అనేక లాభాలు కనిపిస్తే, స్వతహాగా మనిషి స్వధర్మాన్ని వదిలి పరాయి ధర్మాన్ని స్వీకరిస్తాడు. అదీ గాక, ఇలా పరాయి మతాన్ని స్వీకరించిన వారికి, తమ స్వధర్మాన్ని అనుసరిస్తున్న వారిని చూస్తే కంటకప్రాయంగా ఉంటుంది. స్వధర్మాన్ని అనుసరిస్తున్న వారు కనిపిస్తుంటే, అది అనుక్షణం పరాయి ధర్మాన్ని స్వీకరించినవారి దౌర్బల్యాన్ని, ప్రలోభాల్ని, బలహీనతలను ఎత్తి చూపిస్తూ, నేరభావనను కలిగిస్తుంది. మరో బలహీన క్షణంలో పరాయి ధర్మాన్ని వదిలి స్వధర్మాన్ని పునః స్వీకరించాలన్న భావన కలిగే వీలుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో వీరికి స్వధర్మాన్ని గుర్తు చేసే చిహ్నాలు కనబడకూడదు. స్వధర్మం స్వీకరిస్తే సుఖంగా బ్రతకగలరన్న విశ్వాసం కలగకూడదు. అలాంటి పరిస్థితులో తమ బలహీనతలను, దౌర్బల్యాన్ని ఎత్తి చూపిస్తున్న వారంటే క్రోధం, కసి కలగటంలో ఆశ్చర్యం లేదు. వారినీ తమ లాగా ధర్మభ్రష్టులను చేయాలని తీవ్రమైన తపన ప్రదర్శించటం లోనూ ఆశ్చర్యం లేదు. అందుకే స్వధర్మం వదిలిన వారే తమ పాత ధర్మానుయాయుల పట్ల  అత్యంత క్రౌర్యం ప్రదర్శించారు. తాము వదలిన ధర్మాన్ని దూషిస్తూ, చులకన చేసి మాట్లాడుతూ, లేని దోషాలు వెతికి చూపిస్తూ, ఇతరులను ధర్మ భ్రష్టులను చేయాలని చూస్తారు.  భారతీయులు తమ ధర్మాన్ని పాటించటం పట్ల నిషేధాజ్ఞలు విధించటం, వారిపై పన్నుల భారం పెంచటం వంటివి కూడా ఇలాంటి కసి, ద్వేషాల లోంచే జనిస్తాయి.

శంకమానః కృతాలంక సంకోచానాం ద్విజన్మనామ్।
విదేశాగమనాత్ జాతిరక్షా మక్షా మమత్సరః॥
(జోనరాజ రాజతరంగిణి 655)

ఇదే మానసిక శాస్త్ర సంబంధిత విషయాన్ని జోనరాజు స్పష్టంగా చెప్పాడు. కశ్మీరులో పరిస్థితి దుర్భరంగా ఉందని, తమ ధర్మం కాపాడుకునేందుకు కశ్మీరు వదిలిపోతున్న వారిని పోనియకుండా అడ్డుకున్నాడు సూహభట్టు. కశ్మీరు వదిలిపోయి వారు వేరే దేశాల్లో తమ ధర్మాన్ని స్వేచ్ఛగా పాటిస్తారన్న అసూయతో ఇలాంటి ఆజ్ఞలు జారీ చేశాడు – ‘విదేశాగమనాత్ జాతిరక్షా మక్షా మమత్సరః’!

అందుకే తాము ఆధిక్యం సాధించగానే, ఆధిక్యం సాధించిన వారు, ఓడినవారికి తమ గత చరిత్ర జ్ఞాపకం ఉందకూడదని, దాని తాలూకూ ఆనవాళ్ళు లేకుండా చేస్తారు. మతం మారినప్పుడు ‘పేరు’ మారటంతో ఆరంభమయిన ఈ గత జ్ఞాపకాల నాశన ప్రక్రియ – మందిరాలు ధ్వంసం చేసి నామరూపాల్లేకుండా చేయటం, గ్రామలు, నగరాల పేర్లు మార్చటం, పాత ఆచార వ్యవహారాల స్థానంలో వాటిని మరపించే కొత్త ఆచార వ్యవహారాలు స్థాపించటం వంటి చర్యలు చేపడతారు. ఎట్టి పరిస్థితిలోనూ గతం తాలూకు చిహ్నాలను మిగల్చరు.

రెడ్ ఇండియన్లు, మెక్సికన్లపై ఆధిపత్యం సాధించిన యూరోపియన్లు ఇదే చేశారు. రష్యాపై, చైనాపై అధికారం సాధించిన కమ్యూనిస్టులు అదే చేశారు. తాము ఆధిక్యం సాధించిన దేశాలలోని స్థానిక సంస్కృతి సంప్రదాయాలను సమూలంగా తుడిచిపెట్టి వాటి స్థానాన్ని తాము ఆక్రమించారు క్రిస్టియన్లు, ఇస్లామీయులు. కశ్మీరులోనూ అదే జరిగింది. దానికి ప్రత్యక్ష సాక్షి జోనరాజు.

ఎట్టి పరిస్థితులలోనూ భారతీయులు తమ ధర్మం నిలుపుకోకుండా చూడాలన్న పట్టుదలతో సూహభట్టు ప్రవర్తించాడు. కశ్మీరు వదిలివెళ్తే, వేరే దేశంలో తమ ధర్మాన్ని అనుసరిస్తారన్న అసూయతో, వారు కశ్మీరు వదిలిపోకుండా అడ్డుపడ్డాడు. అంటే, తమ మతం తప్ప మరో మతం సజీవంగా ఉండకూడదన్న మూర్ఖపు పట్టుదల అన్న మాట ఇది. ఇప్పుడు విరివిగా వినిపిస్తున్న fanatic అన్న పదం సూహభట్టుకు సరిపోతుంది. ఇటువంటి fanatic కి ప్రేరణ సూఫీ హమదానీ, అతని మతం ఇచ్చిందన్న విషయాన్ని విస్మరించకూడదు.

మోక్షాక్షరం వినా మార్గో దాతవ్యో నైవ కస్సచిత్।
ఇత్యాది శద శేషాన్ స మార్గ రక్షాధికారిణః॥
(జోనరాజ రాజతరంగిణి 656)

  అనుమతి పత్రం లేనివారిని కశ్మీరు  సరిహద్దులను దాటి పోనివ్వద్దని మార్గరక్షక అధికారులకు ఆజ్ఞలు జారీ చేశాడు సూహభట్టు.

ఆ కాలంలో కశ్మీరులో ఇస్లామేతరుల దుర్భర స్థితిని ఊహించటం కష్టం కాదు. కానీ వారి దౌర్భాగ్యాన్ని తలచుకుంటే మాత్రం అంతులేని వేదన కలుగుతుంది. కొన్ని రోజులక్రితం  వరకూ స్వధర్మంలో తమ సరసన ఉన్న స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు మతం మారిన మరుక్షణం శత్రువుల కన్నా ఘోరంగా, దౌష్ట్యంగా ప్రవర్తిస్తూ తమను మతం అన్నా మార్చాలి, లేక అంతం అన్నా చేయాలి అన్నట్టు ప్రవర్తిస్తుంటే, దాన్ని తట్టుకుని నిలబడగలగడం ఊహించాలంటేనే భయం వేస్తుంది. ఇలాంటి పరిస్థితులలో బ్రతకటం కష్టం అని ప్రాణాలు అరచేత పట్టుకుని స్వదేశాన్ని, జన్మభూమిని వదిలి పరాయి దేశానికి పారిపోవాలనుకుంటే, పారిపోనీయకుండా అడ్డు పడటం ఎంతటి క్రౌర్యం! దౌష్ట్యం! అంటే, జీవిస్తే తమ మతం స్వీకరించాలి లేకపోతే ప్రాణాలు వదులుకోవాలి. అంతే తప్ప తమ స్వధర్మాన్ని రక్షించుకునే ప్రయత్నాలు చేయకూడదు. ఎలాంటి మత ఛాందసం ఇది! ఎలాంటి దౌష్ట్యం ఇది! రాక్షసత్వం సైతం భయపడే నైచ్యం ఇది! ఇలాంటి ఛాందసాన్ని, దౌష్ట్యాన్ని, నైచ్యాన్ని భరిస్తూ కూడా తమ ధర్మాన్ని సజీవంగా తరువాతి తరాలకు అందించిన భారతీయుల పూర్వీకుల గొప్పతనం మాటలలో వర్ణించటం కుదరదు. ప్రపంచంలో పలు నాగరికతలు అంతరించాయి ఇలాంటి ప్రతికూల పరిస్థితులలో. ఇలాంటి పరిస్థితులను తట్టుకుని నిలబడింది కేవలం భారతీయ ధర్మం మాత్రమే!

తతో మీనా నివ వ్యాధో దత్త బంధే సరిజ్జలే।
ద్విజాతీనతి దుర్జాతో దేశోస్మిన్ న్యగ్రహీత్తరామ్॥
(జోనరాజ రాజతరంగిణి 657)

ఎలాగయితే చేపలు పట్టేవాడు వలలో బంధించి చేపలను హింసిస్తాడో, అలా ఈ దుర్జాతికి చెందినవాడు భారతీయులను హింసించాడు.

కశ్మీరులో బ్రతకనివ్వడు. కశ్మీరు దాటి పోనివ్వడు. ‘బంధే సరిజ్జలే’ అన్నాడు జోనరాజు. అంటే వల ద్వారా పరిమితమైన పరిధిలో ఒదిగిన నీటిలోని చేపలను వేటగాడు ఎలా బంధిస్తాడో, అలా బంధించాడన్న మాట సూహభట్టు భారతీయులను. అంటే కశ్మీరు బంధిత సరిజ్జలం. అలా పరిమిత స్థలంలో భారతీయులను బంధించి బయటకు పోనీయకుండా అడ్డుకుని  బాధించాడన్నమాట.  ఇక్కడ జోనరాజు ‘ద్విజాతీనతి దుర్జాతో’ అన్నాడు. దీన్ని అనువాదకులు ‘low born man’ గా అనువదించారు. ‘దుర్జాతి’ అన్న సంస్కృత పదానికి ‘low born’ అన్న పరిమిత అర్థం ఇవ్వడం ద్వారా జోనరాజు వాడిన పదాలలోని భావాన్ని తప్పుదారి పట్టించారు. సూహభట్టు ఇస్లాం స్వీకరించక ముందు బ్రాహ్మణుడు. కాబట్టి ఇక్కడ ‘low born’ అనే వీలు లేదు. కాబట్టి ఇక్కడ జోనరాజు ఎంతో తెలివిగా ‘ద్విజాతీనతి దుర్జాతో’ అని ద్విజాతి, దుర్జాతి అన్న పదాలను వాడి అపరిమితార్థాన్ని పొందుపరిచాడు. ‘దుర్జాతి’ ‘low born’ కాదు. సూహభట్టు ను  ఆధారంచేసుకుని  జోనరాజు ఎవరిని దూషిస్తున్నాడో అర్థం చేసుకోవటం కష్టం కాదు.

తద్భయానలజం తాపం పాపంచ వషవో ద్విజాః।
అగ్నిజ్వాలా ప్రవేశేన సహసైన న్యవారయన్॥
(జోనరాజ రాజతరంగిణి 658)

భారతీయులు ఇస్లాం లోని విశాలత్వాన్ని, సమభావనను గమనించి స్వచ్ఛందంగా భారతీయ ధర్మం వదిలి ఇస్లాంను స్వీకరించేరని ప్రచారం చేసేవారంతా పదే పదే చదివి అర్థం చేసుకోవాల్సిన శ్లోకాలివి.

సూహభట్టు పాల పడకుండా ఉండేందుకు, స్వధర్మాన్ని వదిలి భయావహమైన పరధర్మాన్ని స్వీకరించే పాపాన్ని మూట కట్టుకోకుండా ఉండేందుకు భారతీయులు అగ్నిప్రవేశం చేసి తప్పించుకున్నారు.

కేచిద్వేషేణ పాశేన పరే తోయేన చాపరే।
భ్రుగుణా వహ్నినా చాన్యో విప్రా భీత్యా విపోదిరే॥
(జోనరాజ రాజతరంగిణి 659)

కళ్ల నీళ్ళు చిప్పిల్లుతాయి. మనసు దహించుకుపోతుంది. తీవ్రమైన ఆవేదన అగ్నిలా శరీరాన్ని, మనసును, హృదయాన్ని, మెదడును మండిస్తుంది.

పాపాన్ని స్వీకరించాల్సి వస్తుందన్న భయంతో కొందరు విషాన్ని ఆశ్రయించారు. కొందరు ఉరితాడును కౌగలించారు. మరికొందరు నీటిలో మునిగిపోయారు. ఇంకా కొందరు కొండ శిఖరాల నుంచి దూకారు. ఇంకొందరు అగ్నిలో దగ్ధమైపోయారు.

ఈ శ్లోకాలు రాయటానికి జోనరాజు ఎంత బాధపడ్డాడో ఊహకందదు. ఎలాంటి దుస్థితిని, క్రౌర్యాన్ని, దౌష్ట్యాన్ని ఆనాటి భారతీయులు అనుభవించి ఉంటారో! సూహభట్టు పాలపడి పరాయి ధర్మాన్ని స్వీకరించే కన్నా, విషాన్ని స్వీకరించటం నయం అని విషాన్ని ఆశ్రయించారు. తాడును కౌగిలించారు. నీటిలో దూకారు. కొండ పై నుంచి జారిపోయారు. అగ్నిలో దగ్ధమయ్యారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉరిని కౌగిలించుకున్న ఏ వీరుడికీ తీసిపోరు ఆనాటి ధర్మరక్షకులు. ప్రాణాలు కాపాడుకోవటానికి పరధర్మం స్వీకరించే కన్నా స్వధర్మంలోనే ప్రాణాలు వదిలేందుకు సిద్ధపడ్డ మహనీయులు, త్యాగధనులు ఆనాడు ప్రాణాలర్పించిన ఒక్కొక్కరూ. ఇలాంటి పరిస్థితులను తట్టుకుంటూ కూడా ధర్మాన్ని భావితరాల కోసం సజీవంగా నిలిపి అందించిన వారి మహనీయత, ధైర్యాలు ఊహకు కూడా అందవు. అలాంటి వారి వల్ల వారసత్వంగా పొందిన భారతీయ ధర్మం విషయంలో ఈనాడు ఆ ధర్మానుయాయులే ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే, కృతఘ్నులు, మూర్ఖులు, అంధులు  అన్న పదాలకు నిర్వచనాలు వెతకనవసరం లేదనిపిస్తుంది. గొప్ప వీరులు, ధీరులు, శూరులు   ఎలాంటి ప్రతికూల పరిస్థితులలోకూడా మనోబలం కోల్పోకుండా, తమ ధర్మంపై విశ్వాసం చెదరకుండా తరం తరం నిరంతరంగా జరిపిన పోరాట ఫలితంగా ఈనాడు మనం భారతీయ ధర్మాన్ని పాటించగలుగుతున్నాం. ఇందుకు గర్వించే బదులు మన పూర్వీకులను చూసి మనం న్యూనతా భావానికి గురవుతున్నాం. ఒక పద్ధతి ప్రకారం ఏ రకంగా మన ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, ధర్మం పట్ల గౌరవాభిమానాలను  దెబ్బ తీశారో ఆలోచించాల్సి వస్తుంది.

రాజద్రోహి సహసేణ రక్షితుం రాజవల్లభః।
న త్వేకమశకద్వి ప్రమేతస్మిన్ ద్వేషదూషితే॥
(జోనరాజ రాజతరంగిణి 660)

కశ్మీరు దేశం ద్వేషభావనతో కలుషితమైపోయింది. రాజుకు ఎంతో ఇష్టులైన వారు కూడా ఒక్క బ్రాహ్మణుడిని కూడా రక్షించలేకపోయారు. సూహభట్టు ఎంతగా భారతీయులను ద్వేషించాడంటే, తన చేతికి చిక్కకుండా వెయ్యిమందిలో ఒకడు ఆత్మహత్మ చేసుకున్నా తీవ్రంగా నష్టపోయినట్టు బాధపడేవాడు. రాజ్యభారం వహించటం ఎంత కష్టంగా తోచినా, ‘ద్విజాక్రంద శ్రవణానందం’ కోసం సూహభట్టు తపించేవాడు. అంటే భారతీయులు చేసే హాహాకారాలు అతనికి శ్రవణానందకరంగా ఉండేవన్న మాట.

రాజతరంగిణిలో క్రౌర్యం అనగానే చరిత్ర రచయితలు ‘మిహిరకులుడి’ గురించి మాట్లాడుతారు. అతడు ఎంత క్రూరుడంటే, కొండ శిఖరాల నుంచీ జారిపడే సమయంలో ఏనుగుల ఘీంకారం అతనికి నచ్చటంతొ , ఆ అరుపు వినేందుకు ఏనుగులను శిఖరం పై నుంచి త్రోయించి, ఆ శబ్దం వింటూ ఆనందించేవాడు. ఇప్పుడు మతం మారిన సూహభట్టుకు బ్రాహ్మణుల ఆక్రందనలు కలిగించే ఆనందం కోసం, ‘ద్విజాక్రంద శ్రవణానందం’ కోసం, బ్రాహ్మణులను హింసించి వారు పెట్టే ఆక్రందనలు వింటూ ఆనందించేవాడు. ఈ ఇద్దరిలో ఎవరు క్రూరుడు అన్న ప్రశ్న వేస్తే, ఆధునిక మేధావులు, భూతదయాళువులు మిహిరకులుడే అంటారు. బ్రాహ్మణులకు నోరు ఉంది కాబట్టి వారిని హింసించటంలో క్రౌర్యం లేదు. ఏనుగులు మూగజీవాలు. వాటిని హింసించి ఆనందించేవాడే క్రూరుడు. పైగా తరతరాలుగా సమాజంలో అణచివేతకు పాల్పడ్డ బ్రాహ్మణులను హింసించటంలో క్రౌర్యం లేదని తీర్మానిస్తారు. ఇదీ ప్రస్తుతం  ఆనాడు ధర్మాన్ని కాపాడి ,  వారు అందించిన ధర్మాన్ని అందుకున్న వారసుల ఆలోచన.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here