Site icon Sanchika

జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-53

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

గృహద్భూమ్యేవ విప్రాణాం పంక్తిర్జాత్యభిమనినీ।
రుద్ధద్వారాత్తతో దేశాదపమార్గైరపాసరత్॥
(జోనరాజ రాజతరంగిణి 662)

[dropcap]సి[/dropcap]కందర్ మరణం తరువాత భారతీయులను హింసించటంలో సూహభట్టు విశృంఖలంగా వ్యవహరించాడు. సూహభట్టు అత్యాచారాలు, వాటి నుంచి తప్పించుకునేందుకు కశ్మీరీయులు పడ్డ కష్టాలను జోనరాజు ఉన్నదున్నట్టు వర్ణించాడు. సాహిత్యంలో ఉన్న వర్ణన విధానాలను వాడి ఉంటే ఇంకా ఎంత భయంకరంగా ఉండేదో! కానీ ఈ వర్ణనలను చదువుతుంటే, ఎందుకని జోనరాజు మతం మారినా సూహభట్టును మారిన పేరుతో కాక, సూహభట్టు అనే పూర్వనామం మాత్రమే వాడేడో తెలుస్తుంది. సూహభట్టు కశ్మీరీయులను హింసించాడు అనటానికీ, సైఫుద్దీన్ హింసించాడు అనటానికీ చాలా తేడా ఉంది. సూహభట్టు హింసిస్తే అది స్వజాతీయులను హింసించినట్టు అవుతుంది. సైఫుద్దీన్ హింసించాడు అంటే ‘మతం’ రంగప్రవేశం చేస్తుంది. ఇస్లామేతరులను హింసించి అయినా ఇస్లాం లోకి మార్చటం దైవకార్యం అవుతుంది. దైవకార్యం నిర్వహిస్తున్న వ్యక్తిని ‘దుష్టుడు’ అని తిట్టే వీలుండదు. అలా తిడితే, ఆ మతస్తులకు ఆగ్రహం కలుగుతుంది. రాజ్యం వారిది. వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి జీవిస్తున్నాడు జోనరాజు. కాబట్టి సైఫుద్దీన్ క్రౌర్యాన్ని క్రౌర్యం అంటే జోనరాజు మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి, జోనరాజు ఎక్కడా, సూహభట్టును ‘సైఫుద్దీన్’ అని ప్రస్తావించలేదు. దాంతో ఆ కాలంలో రాజతరంగిణిని విన్న ఇస్లామీయులకు కూడా ఎలాంటి అభ్యంతరం అనిపించి ఉండదు. ఇంకా స్వజాతీయుల నాశనానికి స్వజాతీయులే కారణం అన్న శ్లోకం కూడా రాశాడు జోనరాజు.

సూహభట్టుకు చిక్కకుండా తప్పించుకోవాలని కశ్మీరు వదిలి వెళ్ళటం ప్రారంభించారు కశ్మీరీయులు. ‘జాత్యభిమానం’ వల్ల విప్రులు రాజమార్గాలు వదిలి పక్క మార్గాల ద్వారా, రహస్య దారులలో దేశం వదిలి పారిపోవటం ఆరంభించారు. తమకు అలవాటు అయిన రీతిలో ఆంగ్లంలోకి అనువదించినవారు ‘జాత్యభిమానాన్ని’ ‘who prided on their caste’ అని అనువదించారు. వారికి ‘ధర్మంపై అభిమానం’, ‘జాతి పై అభిమానం’ అన్న ఆలోచనల్లో ‘caste’ తప్ప మరేమీ కనిపించలేదు.

ఇళ్ళ తలుపులు మూసివేసి, తప్పించుకునేందుకు మరో మార్గం లేకపోతే, ఏ మార్గం కనిపిస్తే అటు, చివరికి సొరంగ మార్గం గుండా కూడా ప్రయాణించినట్టు బ్ర్రాహ్మణులు కశ్మీరు వదిలి సూహభట్టుకు దొరకకుండా సవ్యం, అపసవ్యం లేకుండా ఎటుపడితే అటు ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోయారు.

త్యమ్తువాపి పితరం పుత్రస్తం పితాచాగమద్ ద్విజః।
సూహంతకే కృతాక్షేపే విదేశం పరలోకవత్॥
(జోనరాజ రాజతరంగిణి 663)

పైపైకి చూస్తే మామూలుగా అనిపించే శ్లోకం; జోనరాజు వాడిన పదాల లోతులకు వెళ్ళి చూస్తే కంటనీరు తెప్పించే దయనీయమైన దుస్థితిని ప్రతిబింబిస్తుంది.

‘సూహంతుడు’ – మృత్యువు లాంటి సూహను తప్పించుకునేందుకు బ్రాహ్మణులు పరుగులు తీశారు. ప్రాణాలు కాపాడుకునే సమయంలో ప్రధానంగా ఎవరి ప్రాణాలు వారు కాపాడుకోవటం పైనే దృష్టి పెడతారు. తన ప్రాణాలు నిలిచిన తరువాతనే తన వారు, మరొకరి గురించి ఆలోచిస్తారు. స్వీయ ప్రాణ రక్షణ ప్రపంచంలో అన్నిటికన్నా ప్రాధాన్యం.

సూహభట్టు అనే మృత్యువు నుంచి తప్పించుకునేందుకు కొడుకులు తండ్రులను వదిలి పరుగులు పెట్టారు. తండ్రులు కొడుకులను వదిలి ప్రాణాలను రక్షించుకునేందుకు పరుగులు తీశారు. వాళ్ళు ప్రాణాలను రక్షించుకునేందుకు పారిపోవటాన్ని జోనరాజు, ఎలాగయితే మనుషులు ఈ లోకం వదిలి పోతారో, అలా వారు విదేశాలకు పరుగులు తీశారని వర్ణించాదడు!  ఒక్క ముక్కలో చెప్పవలసిందంతా చెప్పేశాడు. అర్థం చేసుకోగలిగిన వారికి అర్థం అవుతుంది. లేనివారికి అక్షరాలు కనిపిస్తాయి. శబ్దాలు వినిపిస్తాయి అంతే!

మనిషి ఈ లోకాన్ని వదిలి వెళ్ళటం ప్రాకృతికం. కానీ ఈ లోకాన్ని వదిలి వెళ్లటం అంటే మరణం. మరణించిన తరువాత మనిషి ఏమవుతాడో తెలియదు. అతనికి అస్తిత్వం ఉండదు. ‘నేను’ అనే వాడుండడు. అతడికి గతం తెలియదు. వర్తమానం లేదు. భవిష్యత్తు ఊహకందదు. కశ్మీరు వదిలి విదేశాలకు పారిపోతున్నవారు మరణించిన వారితో సమానం అని అంటున్నాడు జోనరాజు. కొత్త దేశం ఎలా ఉంటుందో తెలియదు. అక్కడి పద్ధతులు, ఆచార వ్యవహారాలు తెలియవు. ఇప్పుడున్న జీవితానికి సంపూర్ణంగా స్వస్తి చెప్పి, కొత్త స్థలంలో, కొత్త జీవితం ప్రారంభించాలి. గతాన్ని చెరిపి వేసి వర్తమానంలో జీవించాలి. గతంలో లభించిన గౌరవం, సంపాదించిన ఆస్తి, కుటుంబం ఏమీ మిగలవు. అంటే దాదాపుగా మరణించి కొత్త జన్మ ఎత్తినట్టే. దేశ విభజన సమయంలో సర్వం వదిలి, కట్టుబట్టలతో ప్రాణాలు గుప్పిట్లో  దాచుకుని భారత్ వచ్చిన భారతీయులకు ఆనాటి కశ్మీరీ పండితుల పరిస్థితి, ఈనాటి కశ్మీరు పండితుల ఆవేదనలు అర్థమవుతాయి. ఇతరులు అక్షరాలు చూసి, శబ్దాలు వింటారు కాబట్టి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతారు. మనిషి ఈ లోకం వదిలి పరలోకం పోయినట్టు కశ్మీరీయులు విదేశాలకు వెళ్ళారు అని జోనరాజు అనటం వెనుక ఊహకందని దైన్యం ఉంది. ప్రపంచం పట్టనంత విషాదం ఉంది. మానవ హృదయం భరించలేనంత దుఃఖం ఉంది. రాక్షసులు సైతం కదిలిపోయెంత క్రౌర్యం, ద్వేషం, దౌష్ట్యం ఫలితాన్ని ప్రదర్శించటం వుంది.

క్ష్మా రూక్షా క్షామమశనం వ్యాయోమో వేదనామయః।
జీవన్నరకతా తేషాం విదేశోగాద్ ద్విజన్మనామ్॥
(జోనరాజ రాజతరంగిణి 664)

కశ్మీరు నుంచి తప్పించుకుంటున్న వారు ఎదుర్కునే అనుభవాలు వారికి నరకం అంటే ఉన్న భయాన్నుంచి విముక్తులను చేశాయట. వారికి నరకం అంటే భయం పోయిందట. సాధారణంగా నరకం అంటే మనుషులు భయపడటానికి ప్రధాన కారణం అక్కడ యమకింకరులు పెట్టే కష్టాలు. ఆ కష్టాలు పడటం కన్నా పాపాలు చేయటం మాని ధర్మబద్ధంగా బ్రతికితే స్వర్గ సౌఖ్యాలు అనుభవించ వచ్చనిపించే రీతిలో ఉంటాయి ఆ కష్టాలు. కానీ ఇక్కడ కశ్మీరు వదిలి పారిపోతున్న భారతీయులు అలాంటి గరుడ పురాణంలో చెప్పిన 28 రకాల శిక్షలంటే భయం పోయేంతగా కష్టాలు అనుభవించారన్న మాట. కొరడాలతో కొట్టటం, విష సర్పాలతో కరిపించటం, నలిపివేయటం, లోయల్లోకి విసిరివేయటం, సూదులతో గుచ్చటం, సలసల కాగుతున్న నూనెలో వేయించటం, బరువుల క్రింద అణచివేయటం, కత్తి లాంటి పళ్లున్న జంతువుల బారిన పడటం, ఏనుగులు, పులులు, సింహాలు, విషపు క్రిమికీటకాలు ఉన్న బావుల్లో పడటం, తలక్రిందులు, కాళ్ళుపైకి వేలాడగట్టి మంటల్లో కాల్చటం.. ఇలా పలు రకాల భయంకరమైన శిక్షలుంటాయి నరకంలో.  అవి చదువుతుంటేనే భయానికే భయం వేస్తుంది. అలాంటి భయాలన్నీ పోయాయట. కశ్మీరు వదిలి పారిపోయే అనుభవం ఈ నరకంలో శిక్షలన్నిటి కన్నా భయంకరమైనదన్న మాట. వారికి దారిలో తిండి దొరకలేదు. తిండి పెట్టేవారు లేరు. ఎవరినైనా ఆహారం అడిగితే, వారు సైనికులకు సమాచారం చేరవేస్తే ఇంత శ్రమా వ్యర్థం అవుతుంది. తిండి లేదు. దాంతో రోగాలు విజృంభించాయి. ఆ రోగాల వల్ల బాధ, ఆహార లేమి వల్ల బాధలన్నీ కలిపి వారికి నరకం అంటే భయాన్ని పోగొట్టాయి అన్నమాట. అంత బాధ పడ్డారు వారు తమ ధర్మాన్ని రక్షించుకునేందుకు. ఇంత కష్టపడే బదులు మతం మారిపోతే రాజాలా బ్రతకవచ్చు. ఇంకా తమ ధర్మం పట్టుకుని వేలాడుతున్న మూర్ఖులను రాక్షసుల్లా హింసించవచ్చు. అయినా సరే అసంఖ్యాకులు నరక బాధలు పడి తమ ధర్మాన్ని రక్షించుకునేందుకే ఇష్టపడ్డారు. ఇష్టంగా కష్టపడ్డారు. ఆనాటి ధీరోదాత్తులు, త్యాగధనుల వల్లే ఈనాడు ఇంకా మనం మన ధర్మాన్ని పాటించగలుగుతున్నాం. ధర్మం సజీవంగా నిలిచింది.

ఘాటీ ఫణీంద్ర భీతీవ్రతాప స్వల్పాశనాతురైః।
మార్గే అనేకైర్ద్విజైర్మృత్యులాభాత్ సుఖమలభ్యత్॥
(జోనరాజ రాజతరంగిణి 665)

దారిలో అనేక బాధలు పడ్డారు. కష్టాలు ఎదుర్కున్నారు. శత్రువులు ఎదురుపడ్డారు. దారిలో విషసర్పాలు తగిలాయి. భరించలేనంత వేడి, దొరికీ దొరకని ఆహారం – వీటి వల్ల మార్గంలోనే బ్రాహ్మణులనేకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోవటం వల్ల వారు బ్రతికిపోయారు. మరిన్ని కష్టాలు అనుభవించటం నుంచి తప్పించుకున్నారు. నరకం అంటే భయం పోయింది. ఎందుకంటే బొంది తోనే నరక బాధలు అనుభవించారు. ఇక ఇంతకన్నా భయంకరమైనవి లేవు. అందుకే ప్రాణాలు కోల్పోవటం వల్ల వారికి బాధల నుంచి విముక్తి కలిగినట్లయింది. ఇన్ని కష్టాలు పడటం ఎందుకంటే, భయావహమైన పరధర్మం స్వీకరించటం కన్నా స్వధర్మంలో ప్రాణాలు కోల్పోవటం మేలు అన్న విశ్వాసం వల్ల!

క్వచ స్నానం క్వచ ధ్యానం తపః క్వచ జపః క్వచ।
భిక్షార్థమటతాం గ్రామానగాత్ కాలో ద్విజన్మనామ్॥
(జోనరాజ రాజతరంగిణి 666)

వాళ్ళకి స్నానం లేదు; ధ్యానం లేదు; తపస్సు లేదు; జపం లేదు. వాళ్ళు భిక్షమెత్తుకుంటూ గ్రామాలలో తిరిగారు.

నరక బాధలు అనుభవించి ప్రాణాలు కాపాడుకుని విదేశాలు చేరినవారి పరిస్థితి ఇది. బ్రాహ్మణులు అనగానే గుర్తుకువచ్చేవి స్నానం, ధ్యానం, జపం, తపం. అవే లేవు వారికి. అందుకే వారిని ఈ లోకం వదిలి పరలోకం వెళ్ళేవారితో పోల్చాడు జోనరాజు. జీవచ్ఛవాలు వారు. కశ్మీరులో వారు అనుభవించిన ఐశ్వర్యం, వైభోగం, గౌరవాలు, అన్నీ గత జన్మకు సంబంధించినవి. ఇప్పటి నూతన జన్మలో వారు స్నానం, ధ్యానం, జపం, తపం ఏమీ లేని భిక్షగాళ్లు. భిక్షమెత్తుకుంటూ ఊళ్ళు తిరిగేవారు. అయితే ఇస్లామీయులు తాము తమ మత  ప్రచారం చేసుకోవటం వల్ల భారతీయులు కష్టాలు పడ్డారంటే కశ్మీరుపై అధికారం ఉన్న ఇస్లామీయులు ఒప్పుకోరు. అందుకని బ్రాహ్మణులను కశ్మీరు నుంచి తరిమివేయటం కూడా వారికి లాభకరంగా పరిణమించింది అంటున్నాడు జోనరాజు.

ద్విజానాముపకారో భూదపకార ముఖాదహో।
యత్తోన్నిర్వాసితాః సర్వే పాపం తీర్థేష్వనాశయన్॥
(జోనరాజ రాజతరంగిణి 667)

బ్రాహ్మణులకు జరిగిన అన్యాయం ఓ రకంగా వారికి లాభకరంగా పరిణమించింది. భిక్షమెత్తుతూ ఊళ్లు తిరుగుతూ వాళ్ళు అనేక పవిత్ర స్థలాలను దర్శించారు. ఇలా పవిత్ర స్థలాలు దర్శించటం వల్ల తమ పాపాన్ని ప్రక్షాళనం చేసుకున్నట్టు అయింది. ‘వంకర ముఖాన్ని కూడా ఎంత అందంగా వంకర్లు తిరిగిందో’ అని మెచ్చుకోవడం లాంటి వ్యంగ్యం ఇది. కుంటివాడిని ఎంత బాగా కుంటుతున్నాడో అని ప్రశంసించటం, బూజు పట్టిన ఇల్లు చూస్తూ ‘ఆహా! సాలీళ్లు ఎంత అందంగా గూళ్లు కట్టాయో’ అని ఆనందించటం లాంటిది జోనరాజు దర్శించి ప్రదర్శించిన ఈ అపకారం వల్ల జరిగిన ఉపకారాన్ని వివరించే శ్లోకం.

విదేశమగతాః శుష్యత్కళత్ర త్రాణ చింతయా।
మ్లేచ్ఛవేషా ద్విజాః కాచిత్కామీరేష్వేవ చాభ్రమన్॥
(జోనరాజ రాజతరంగిణి 668)

తండ్రి కొడుకులను, కొడుకు తండ్రిని వదిలి ప్రాణాలు కాపాడుకునేందుకు కశ్మీరం వదిలిపోతున్న సమయంలో కొందరు భార్యలను కాపాడుకోవటం కోసం విదేశాలు వెళ్ళలేకపోయారు. అలాంటి వాళ్ళు మ్లేచ్ఛుల దుస్తులు ధరించి, మ్లేచ్ఛ వేషాలలో కశ్మీరులోనే తిరుగుతున్నారు.

జోనరాజు ఎలాంటి అతిశయోక్తులు, విపరీత వర్ణనలు లేకుండా, ఒక వార్తాపత్రికలో వ్యాసంలా రాస్తున్నా, ఒక్కో శ్లోకం చదువుతుంటే అంతులేని శోకం, భరించలేని ఆగ్రహావేశాలు, పట్టరాని నిస్సహాయతలు చుట్టుముడతాయి.

పరాయి ధర్మం స్వీకరించేందుకు సిద్ధంగా లేరు. ప్రాణాలు కోల్పోయేందుకయినా సిద్ధం. కానీ భార్యలను కాపాడుకోవటం ధర్మంలో భాగం. అందుకని వారిని వెంట తీసుకుని వెళ్ళలేరు. ఎందుకంటే మార్గం దుర్గమం. అందుకని, కశ్మీరులోనే ఉంటూ, మ్లేచ్ఛుల వేషాలు వేసుకుని తిరుగుతున్నారు కొందరు.

ఇక్కడ జోనరాజు రాయకున్నా ఊహించగలిగే విషయం ఒకటుంది. మ్లేచ్ఛ వేషంలో తిరిగినంత మాత్రాన మ్లేచ్ఛుడయిపోడు. అనుమానం వచ్చినవారిని పరిశీలించటం, అతనిది దొంగ వేషం అని నిరూపితమైతే, మతం మార్చటం లేదా చంపేయటం వంటి పలు సంఘటనలు జరిగి ఉంటాయి. జోనరాజు వాటిని ప్రస్తావించలేదు. కేవలం వారు కశ్మీరులో మ్లేచ్ఛ వేషాలతో తిరుగుతున్నారని రాశాడు.

ఇదంతా చదువుతుంటే ఒక ఆలోచన వస్తుంది. భారతదేశ చరిత్ర గమనిస్తే, తమపై ఎన్ని అత్యాచారాలు జరిగినా భారతీయులు మౌనంగా సహించటం, ప్రాణాలు అరచేత పట్టుకుని పరాయి ప్రాంతాలకు పారిపోవటం కనిపిస్తుంది. చివరికి ఇటీవల పండితులు  కశ్మీరు వదిలి పారిపోవటం, దేశంలో  మతకల్లోలాలు జరిగిన ప్రాంతాల్లో ఇళ్ళూ వాకిళ్ళూ అమ్మేసి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవటం కనిపిస్తుంది. అంతే కానీ, గెరిల్లా దళాలు ఏర్పాటు చేసుకుని, తీవ్రవాద దాడులు చేస్తూ హింసకు దిగటం కనిపించదు. ఆనాటి భారతీయులయినా , ఈనాటి భారతీయులయినా అంతే!

విచ్ఛేత్తుమిచ్ఛతా విద్యాం తేనాపహృత వృత్తిభిః।
లడితం ప్రతివేష్నాగ్రే పిండీలోభాద్ ద్విజైః శ్వవత్॥
(జోనరాజ రాజతరంగిణి 669)

ఇది మరీ ఘోరం. భారతీయ విద్యను జ్ఞానాన్ని సంపూర్ణంగా నాశనం చేసేందుకు సూహభట్టు బ్రాహ్మణులకు జీవనోపాధి లేకుండా చేశాడు. దాంతో ఆహారాన్ని అడుక్కుంటూ, బ్రాహ్మణులు ఇల్లిల్లూ తిరుగుతూ కుక్కల్లా నాలుకలను వ్రేలాడదీసేవారు. కశ్మీరులో ఉంటూ ఇంకా విద్యాబోధన చేస్తూన్న వారిని దెబ్బ తీసేందుకు సూహభట్టు జోవనోపాధి లేకుండా చేశాడు. దాంతో వారు ఒక్క ముద్ద కోసం కుక్కల్లా ఇల్లిల్లూ తిరిగి అడుక్కున్నారట. అయినా మతం మారలేదు. తమ ధర్మాన్ని రక్షించుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు.

ఇలా మతం మారమని హింసించటం, ఒత్తిడి చేయటం, జీవనోపాధి లేకుండా చేయటం, సరిహద్దులు దాటనీయకుండా కట్టుదిట్టాలు చేయటం, మతం మారకపోతే చంపటం – సూహభట్టు ఎందుకు చేశాడో కూడా జోనరాజు తన లౌక్యాన్ని ఉపయోగించి అతి గొప్పగా చెప్పాడు తరువాతి శ్లోకంలో.

(ఇంకా ఉంది)

Exit mobile version