Site icon Sanchika

జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-55

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

Brahman brother
You always remained tied to the other
hooked for idol-houses and springs
having done so, reached no where
better bind yourself to Allah at his Apostle
Tell me how else you can reach the shore.

– షేక్ నూరుద్దీన్ కవిత

షేక్ నూరుద్దీన్ జన్మించిన సమయం కశ్మీరులో నిర్ణయాత్మక సమయం. ఆయనకు రెండేళ్ళ వయసున్నప్పుడు, సుల్తాన్ ఖుతుబుద్దీన్ పాలనా కాలంలో కశ్మీరు సామాజిక-సాంస్కృతిక పరిస్థితులు సంపూర్ణంగా రూపాంతరం చెందే విప్లవాత్మక మార్పులకు బీజం పడింది. ఆయనకు ఆరేళ్ళ వయసప్పుడు, సయ్యద్ అలీ హమదానీ తన ఏడువందల మంది అనుచర గణంతో కశ్మీరు వచ్చాడు. హమదానీ షేక్ నూరుద్దీన్‍ను కలిశాడనీ, ఆయనపై ప్రభావం చూపించాడనీ పలువురు కశ్మీరులో ఇస్లాం ఎదుగుదల పరిశోధకులు అభిప్రాయపడతారు.

షేక్ నూరుద్దీన్ ఖాయ్ గ్రామం పెద్ద భూములలో వ్యవసాయం చేసేవాడు. ఆయన వ్యవసాయం ఆరంభించినప్పటి నుంచీ గతంలో ఎన్నడూ లేని విధంగా విపరీతంగా పంటలు పండాయి. అందరూ షేక్ నూరుద్దీన్‍ పట్ల దైవానికి ఉన్న అభిమానం వల్లనే ఇది సాధ్యమయిందనీ, అతనికి మానవాతీత శక్తులున్నాయని నమ్మటం ఆరభించారు. కొద్ది రోజుల్లోనే ఆయన ‘బద్ మోహ్నూ’గా గుర్తింపు పొందాడు. కశ్మీరులో ధనవంతులను ‘బద్ మోహ్నూ’ లంటారు. పదిహేనేళ్ళ వయసులో ఆయన ఓ జమీందారీ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వివాహం అయినా, పంటపొలాల్లో పని చేస్తున్నా, ఆయన దైవ ధ్యానం వదల లేదు. రోజూ గ్రామం దగ్గర ఉన్న గుహలలో కాసేపయినా తపస్సు చేసేవాడు.

కొన్ని రోజుల తరువాత తానే గుహను తొలుచుకుని ఆ గుహలో తపస్సు చేస్తూ ఉండిపోయాడు. అతడి కొడుకులు ఇద్దరూ గుహ దగ్గర ఉన్న గుంటల్లో పడి చనిపోయారు. అయినా ఆయన గుహను వదిలి రాలేదు. కొన్నళ్ళకి ఆ గుహ ఓ తీర్థస్థలం అయింది. ప్రజలు అతని దర్శనం కోసం గుంపులు గుంపులుగా రావటం ఆరంభించారు.

నూరుద్దీన్‍కు ఇలా ప్రజాదరణ లభించటం నచ్చని అనేకులు   దుష్ప్రచారం ఆరంభించారు. ఆయనపై లేని పోని నేరాలు మోపి ఇబ్బందుల పాలుచేయాలని ప్రయత్నించారు. సుల్తాన్ ఆస్థానంలో ఉన్న జ్యోతిష్యులు ఆయనపై చాడీలు చెప్పి సుల్తాన్‍కు ఆయన పట్ల వ్యతిరేకతని కలిగించాలని ప్రయత్నించారు. చేయని నేరాలను ఆయనపై మోపి ఆయనను ఇబ్బందుల పాలుచేయాలని ప్రయత్నించారు. నూరుద్దీన్ సైతం కశ్మీరు ప్రభుత్వం పట్ల విమర్శలు గుప్పించేవాడు. సాంఘిక అసమానత్వం, విలువల రాహిత్యం, నైతిక విలువల పతనం వంటి అంశాలు కశ్మీరు సమాజాన్ని దిగజారుస్తున్నాయని విమర్శించేవాడు. సమాజంలో నైతిక విలువలు పునురుద్ధరించాలంటే ప్రజలందరూ ఇస్లామ్‍ను స్వీకరించాలని ప్రచారం చేశాడు నూరుద్దీన్. ఆ సందర్భంలో రాసినదే పై కవిత. బ్రాహ్మణులను ఇస్లాం స్వీకరించి సంసార సాగరం దాటమని ఉద్బోధిస్తూ రాసిన కవిత. అంటే, నూరుద్దీన్ కూడా కశ్మీరును ఇస్లాం మయం చేయాలన్న లక్ష్యంతో ఉన్న ముస్లిం మత గురువు అన్నమాట.

ఇస్లామీయులలో నూరుద్దీన్‍ను వ్యతిరేకించేవారు అనేకులుండేవారు. కొందరి ప్రకారం నూరుద్దీన్ పై – ఆ కాలంలో కశ్మీరు హిందూ సమాజాన్ని జాగృతం చేసేందుకు సులభ శైలిలో వచనాలను ప్రవచిస్తూ ఆకర్షిస్తున్న లల్లాదేవి ప్రభావం ఉంది. సుల్తాన్ శహబుద్దీన్ ఓ ‘యోగిని’ని చూసినట్లు జోనరాజు ప్రస్తావిస్తాడు. ఆ యోగిని లల్లాదేవినే అని కొందరి అభిప్రాయం. మరికొందరు లల్లాదేవి, నూరుద్దీన్‍ను కలవలేదని, వారిద్దరికీ ఎలాంటి పరిచయం లేదని అంటారు. ఏది ఏమైనా, నూరుద్దీన్ జీవిత చరిత్ర రాసిన వారంతా నూరుద్దీన్ పై లల్లాదేవి ప్రభావం ఉందని అంటారు. ఆ ప్రభావం వల్లనే నూరుద్దీన్, కశ్మీరు ఇస్లాంకే ప్రత్యేకమైన ‘ఋషి’ వ్యవస్థను ఏర్పాటు చేశాడంటారు. సర్వ మానవ, సర్వ మత సమానత్వాన్ని ప్రవచించే ఋషి వ్యవస్థ ఇస్లాం ప్రపంచంలో కశ్మీరులో తప్ప మరెక్కడా కనపడదు.

హజ్రత్ షేక్ నూరుద్దీన్ ప్రవచించిన ఇస్లాం ఋషి వ్యవస్థకు మానవత్వం కేంద్రం అంటారు. శైవ సిద్ధాంతాలను సూఫీ తత్వంతో ముడి వేసి ఇస్లాంకు ఈయన నూతన దిశను ఇవ్వటం వల్లే కశ్మీరులో సెక్యులర్ భావనలు అమలులోకి వచ్చాయని పలువురు నిపుణుల అభిప్రాయం.

“He (Hazrat Shaik Noor-ud-din Noorani) founded a philosophy, which is an admixture  of the Sufi-thought and the Saivait thought. This, composite philosophy has been the hallmark of Kashmir for centuries.” [‘The Impact of Muslim Rule on the Kashmir Society during the 14th and 15th Centuries’ – by Prof. Fida Hussain]

షేక్ నూరుద్దీన్ నూరానీ సిద్ధాంతాలు ఆనాటి కశ్మీరు సుల్తానులకు రుచించలేదు. నూరుద్దీన్ ఇస్లామ్‍ను తప్పుదారి పట్టిస్తున్నాడన్న ఆరోపణలు కూడా ఆయన ఎదుర్కున్నాడు. ఒక కథనం ప్రకారం హమదానీ కూడా నూరుద్దీన్ పట్ల ఆగ్రహం ప్రదర్శించాడు. కానీ నూరుద్దీన్‍ని కలిసి చర్చించిన తరువాత నూరుద్దీన్ ఇస్లాంకు గొప్ప సేవ చేస్తున్నాడని ప్రశంసించాడంటారు.

సుల్తాన్ సికందర్ మత మార్పిడుల కోసం ప్రజలను హింసిస్తుంటే అతడిని ఎదిరించి నిలిచాడు నూరుద్దీన్ నూరానీ. మతం మార్చేందుకు ప్రజలను ఇంతగా హింసించనవసరం లేదని ఆక్షేపించాడు. అంటే, మత మార్పిడిని వ్యతిరేకించలేదు. హింసించకుండా మతమార్పిడి చేయమని బోధించాడు. తనను వ్యతిరేకించినందుకు సికందర్ ఇతడిని నిర్బంధించమని ఆజ్ఞలు జారీ చేశాడు. అప్పుడు స్వచ్ఛందంగా రాజాస్థానానికి వెళ్ళి లొంగిపోయాడు నూరుద్దీన్ నూరానీ. తనని శిక్షించమని కోరాడు. దాంతో సికందర్ అతడి అభిమాని అయ్యాడు.

సూహభట్టు హింసను కొనసాగించటాన్ని కూడా వ్యతిరేకించాడీయన. హింసించి మతం మారటం కన్నా, ఎదుటి మతంలోని లోపాలను, దోషాలను ప్రదర్శించి స్వధర్మం పట్ల విముఖత కలిగించి వారు స్వచ్ఛందంగా ఇస్లాం స్వీకరించేటట్టు చేయాలి తప్ప హింసించి, బెదిరించి, చంపి మతం మార్చకూడదని చెప్పి సూహభట్టుకు కూడా వ్యతిరేకమయ్యాడు. ఎక్కడ ఈయన తనకు వ్యతిరేకంగా విప్లవం లేవదీస్తాడోనన్న భయంతో సూహభట్టు నందఋషి నూరానీని బంధించాడు.

నందఋషిని వదిలి మళ్ళీ జోనరాజు రాజతరంగిణి వైపు మళ్ళే ముందు మరో విషయం ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. కశ్మీరులో మతమార్పిళ్ళు జోరుగా సాగుతున్నాయి. వేల సంఖ్యలో రోజూ ప్రజలు ఇస్లాం స్వీకరిస్తున్నారు. దాంతో కశ్మీరు ఇస్లాంలో ఓ రకమైన సంఘర్షణ మొదలయింది. కొత్త మతం పుచ్చుకున్న వాళ్ళని, అంతకు ముందే మతం స్వీకరించిన వారు అనుమానించటం, అవమానించటం, అసూయతో చూడటం సర్వసాధారణమయింది. దీనికి తోడు భారతీయ సమాజంలోని వర్ణవ్యవస్థకు సమాంతరంగా కొత్త మతం స్వీకరించిన వారిలోను వర్ణవ్యవస్థ రూపొందటం ప్రారంభమయింది. ఇది పసికట్టిన నందఋషి ఇస్లాం స్వీకరించిన వారిలో నెలకొంటున్న కులభావనలు, వాటి వల్ల చెలరేగుతున్న భేదభావనలను నిరసించాడు.

The believer in caste superiority
lacks wisdom and is inferior in the world,
nor received rewards in the other world,
of you be a Musalman in the real sense,
this is the highest caste for you.

అంటూ కొత్తగా ఇస్లాం స్వీకరించిన వారిలోని కుల భావనలను వ్యతిరేకించాడు. ముసల్మాన్ అవటాన్ని మించిన పెద్ద కులం మరొకటి లేదని వారికి బోధించాడు.

What advantage that of the high caste.
After all, your bones shall dissolve in earth
When two angels meet you in the grave
You shall be ashamed if you have propagated higher caste,
Do not spread hatred on access of your superior caste.

షేక్ నూరుద్దీన్ నూరానీ ఇస్లామీయులలో ఏర్పాటవుతున్న కుల భావనలు, తద్వారా చెలరేగుతున్న ఉద్విగ్నతలను తగ్గించాలని ప్రయత్నించాడు. కానీ ఈయనను హిందూ ముస్లింల స్నేహ సౌభ్రాతృత్వ భావనలను ప్రచారం చేసిన లౌకిక మానవత్వవాదిగా ప్రచారం చేశారు. భారతీయ సమాజంలోని కుల భావనలను వ్యతిరేకించి, అసమానతలను నిరసించిన సంఘ సంస్కర్తగా పరిగణించారు. కానీ నూరుద్దీన్ నూరానీ వచనాలను, కవితలను గమనిస్తే, ఆయన దృష్టి ప్రధానంగా ఇస్లామీయులలోని భేదభావాలను రూపుమాపి, ఉద్విగ్నతలను తగ్గించి అందరూ కలిసికట్టుగా ఉండేటట్టు చేయటంపై కేంద్రీకృతమైందని తెలుస్తుంది. ఇస్లాంలో నెలకొంటున్న కుల భావనలను విమర్శించాడు తప్పించి, భారతీయ సమాజం గురించి వ్యాఖ్యానించలేదు. కానీ అతని కన్నా ముందున్న లల్లాదేవి, తన వచనాల ద్వారా భారతీయులందరినీ ఏకం చేసి, వారిలోని ధార్మిక భావనలను జాగృతం చేయాలని ప్రయత్నించిన పద్ధతిలోనే నూరుద్దీన్ ప్రయత్నించటంతో ఇద్దరినీ ముడిపెట్టి, సంఘ సంస్కర్త, మానవత్వవాది, లౌకికవాది వంటి విశేషణాలు నూరుద్దీన్‌కు ఆపాదించారు. గమనిస్తే, లల్లాదేవి భారతీయులను జాగృతం చేయాలని ప్రయత్నించింది. నూరుద్దీన్ నూరానీ ఇస్లామీయులలో కులం పరంగా భేదాభిప్రాయాలను అణచివేయాలని ప్రయత్నించాడు. ఇందుకోసం ఇద్దరూ ఆధ్యాత్మికతను ఆశ్రయించారు. లల్లాదేవిని ఈనాటికీ కశ్మీరు స్మరిస్తుంది. కశ్మీరీ భాషలో సాహిత్య సృజనకు శ్రీకారం చుట్టిందని ఆమెని గౌరవిస్తుంది. ఆ కాలంలో నందఋషిగా ఓ వైపు నుంచి భారతీయులను శైవులను ఇస్లాం లోకి ఆహ్వానిస్తూ, నూరుద్దీన్ నూరానీగా, ఇస్లామీయుల మన్ననలు అందుకుంటూ ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయగల శక్తిమంతుడిగా ఎదిగాడు. ఇస్లామీయులనూ, భారతీయులను ఆకర్షిస్తున్న నూరుద్దీన్ నూరానీని చూసి కొత్తగా మతం స్వీకరించి, ఇస్లాం పట్ల తన విధేయతను భారతీయులను హింసించటం ద్వారా నిరూపించుకోవాలనుకుంటున్న సూహభట్టు అనుమానించటం, భయపడటంలో ఆశ్చర్యం లేదు.

Two children from the same parents
the Muslims and the Hindus,
why this guilt of hatred between the two
be pleased with thy servants, oh my Lord.

ఇలా అందరినీ ఆకర్షిస్తున్న నూరుద్దీన్, రాజుపై తిరుగుబాటు హిందువులు చేసినా, ముస్లింలు చేసినా పై చేయి అతనిదే అవుతుందని భయపడ్డాడు. నూరుద్దీన్ – పలు సందర్భాలలో రాసిన కవితలలో ధనవంతులను, రాజును దూషించాడు.

Allah, how great your secrets of indifference
these secrets are exposed by your indifference
It is this indifference or carefree attitude of yours
that a donkey becomes a King.

ఇలాంటి కవితలలో గాడిదలు రాజులవుతాయి. ఈ ప్రపంచాన్ని ఎందుకని పట్టించుకోవడం లేదు, ఎందుకని ఈ ప్రపంచాన్ని ఉపేక్షిస్తున్నావని భగవంతుడిని ప్రశ్నించటాన్ని – పలువురు సుల్తాన్‍ను గాడిద అన్నాడని అర్థం చేసుకున్నారు.

The source of fountains shall dug up,
the street gutter shall flow brim full
And then, monkeys shall rule the country.

ఇక్కడ ‘కోతులు రాజ్యం చేస్తాయి’ అన్నదాన్ని ఎవరికి తోచినట్టు వారు ఈనాటికీ అర్థం చేసుకుని వ్యాఖ్యానిస్తారు. జాగ్రత్త పడకపోతే, భగవంతుడికి ఆగ్రహం వస్తే, కోతులు రాజ్యం చేస్తాయనటం ఇస్లామీయులకు హెచ్చరిక లాంటిదని కొందరు వ్యాఖ్యానిస్తారు. ఇస్లామీయులు కలిసి మెలిసి లేకపోతే, భగవంతుడు నిర్దేశించిన విధివిధానాలు పాటించకపోతే కోతులు (ఇస్లామేతరులు) రాజ్యం చేస్తాయన్నది నందఋషి నూరానీ ఉద్దేశంగా వ్యాఖ్యానిస్తారు కొందరు. ఇది ఆనాటి రాజులపై విమర్శగా వ్యాఖ్యానిస్తారు ఇంకొందరు. ఇలాంటి వ్యాఖ్యానాలు, అర్థాలు, అపార్థాల ఆధారంగా ‘నందఋషి నూరానీ’ ప్రజలను రెచ్చగొడుతున్నాడనీ, విప్లవం లేవదీస్తాడేమోనన్న భయంతో అతడిని బంధించాడు సూహభట్టు.

ఆ కాలంలో సూహభట్టు అత్యంత శక్తిమంతుడు. సుల్తాను కూడా సూహభట్టును చూసి భయపడే పరిస్థితులు ఆ కాలంలో కశ్మీరులో నెలకొన్నాయి. మంత్రులు అధికారాన్ని అందుకోవటమో, మృత్యువును కౌగిలించుకోవటమో సూహభట్టు ఇష్టాయిష్టాల ప్రకారం సంభవించేది. ఎలాగయితే చెట్లు పళ్ళతో నిండుగా ఉండటమో నిర్ణయించే ఋతువులు సూర్యుడిపై ఆధారపడి ఉంటాయో, అలాగే కశ్మీరులో అందరి భవిష్యత్తు సూహభట్టు దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండేదంటాడు జోనరాజు. శక్తి అంతా సూహభట్టులో కేంద్రీకృతమవటం సుల్తాన్ షాహిఖానాలో భయం కలిగించింది. ఆయనకు నిద్రపట్టలేదు. విషసర్పం లాంటి సూహను తలచుకున్నప్పుడల్లా సుల్తాన్ మనస్సును ఛేదించలేని చిక్కటి చీకటి అలముకునేది. అలా బ్రాహ్మణులను హింసిస్తూ, మందిరాలను కూలగొడుతూ, శాస్త్రాలను దూషిస్తూ, తనను ఎవరు వ్యతిరేకించి విప్లవం లేవదీస్తారోనని భయపడుతూ, తనను పట్టిన వ్యాధికి చికిత్స చేయించుకుంటూ ఇంకో మూడు నాలుగేళ్ళు సూహభట్టు జీవించాడు.

ద్విజాతి పీడయా శాస్త్రానిందయా ద్రోహ చింతయా।
చికిత్సయా చ తస్యాబైర్ద్యాతం త్రిచతురైస్తథా॥
(జోనరాజ రాజతరంగిణి 679)

ఇలా మూడు నాలుగేళ్ళు కాలం గడిపిన సూహభట్టు చివరకు చికిత్సకు లొంగని రోగానికి లొంగిపోయాడు.

ప్రజాపుణ్యోదయేనేవ ప్రేరితో దుష్కృతోత్యితః।
క్షయామయో దుశ్చకిత్స్యో ద్విజరాజమశోషయత్॥
(జోనరాజ రాజతరంగిణి 680)

ప్ర్రజల పుణ్యం వల్లనో, చేసిన పాపాలన్నీ కలగలిసి శక్తిమంతమయినందు వల్లనో, సూహభట్టు రోగం చికిత్సకు లొంగలేదు. చివరకు సూహభట్టు మరణించాడు. వెన్నెల వెలుగుల చల్లదనం భూమి వేడిని చల్లార్చకపోతే, సూర్యుడు ఇంకా ఏమేమి సాధించేవాడో కదా అంటాడు జోనరాజు సూహభట్టు మరణం గురించి. సూహభట్టు ఇంకో మూడు నాలుగేళ్ళు ఎందుకు బ్రతికి ఉండలేదని ప్రశ్నిస్తాడు. సూహభట్టు తర్వాత షాహిఖానా శక్తిమంతుడయ్యాడు. అప్పుడు సూహభట్టు తన పాపాల ఫలితాలు అనుభవించేవాడు. అందుకని ఇంకొంత కాలం సూహభట్టు బ్రతికి ఉండాల్సిందని అంటున్నాడు జోనరాజు.

సూహభట్టు మరణం తరువాత మళ్ళీ కశ్మీరులో అధికారం కోసం పోరు ఆరంభమయింది.

(ఇంకా ఉంది)

Exit mobile version