[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
శాఖాభంగేన సచ్ఛాయ ముద్యానం ప్లవగా ఇవ।
మండలం క్షోభయా మాసుస్తురుష్కా రాజసేవకాః॥
(జోనరాజ రాజతరంగిణి 720)
[dropcap]సు[/dropcap]ల్తాన్ అలీషాహ్ తీర్థయాత్రలకని బయలుదేరాడు. కానీ ఆయన వెంట ఉన్న దుష్టులు అడుగడుగునా ఆయనకు పవిత్ర స్థలాల దర్శనం వల్ల లాభం లేదని బోధిస్తూ, పవిత్ర స్థలాల పట్ల ఆయనకు ఉన్న భక్తిని తొలగించారు. ‘మాద్ర’ దేశ రాజు ‘బిల్లదేవుడు’, తన అల్లుడు రాజ్యం వదిలి తీర్థయాత్రలకు వెళ్తే ఎంతో నష్టపోతాడని గ్రహించి అతడు తీర్థయాత్రలో కొనసాగకుండా అడ్డుపడ్డాడు. ‘బిల్లదేవుడు’ హిందువు అయినా అతని కూతురును సుల్తాన్ ‘అలీషాహ్’కు ఇచ్చి వివాహం చేసినట్టున్నాడు. ఆ కాలంలో హిందూ రాజులనేకులు తురక రాజులకు తమ కూతుళ్ళను ఇచ్చి వివాహం చేయటం ద్వారా తమ సామ్రాజ్యాన్ని తాత్కాలికంగా తురకల దాడుల నుంచి కాపాడుకున్నారు. కానీ ఈ సంబంధం వల్ల ఒక్కోసారి సాటి హిందూ రాజులకు వ్యతిరేకంగా తురక రాజుల వైపు పోరాడవలసి వచ్చింది. మాద్ర రాజు బిల్లదేవుడు, ‘అలీషాహ్’కు మద్దతుగా నిలవటం, జోనరాజు ఎంతగా మసిపూసి మారేడు కాయ చేయాలని ప్రయత్నించి దాచాలనుకున్నా దాగని సత్యాన్ని బట్టబయలు చేస్తుంది. భారతీయ ధర్మం ప్రకారం సోదరుల నడుమ రాజ్యం కోసం పోరు ప్రసక్తి ఉండదు. రాజ్యంపై హక్కు పెద్దవాడిదే. పెద్దవాడు వద్దనుకుంటేనే చిన్నవాడికి రాజ్యం దక్కుతుంది. రామాయణం లోను, భారతంలోనూ ఇదే పద్ధతి కనిపిస్తుంది. సుల్తానుల చరిత్ర రాస్తూ కూడా జోనరాజు సోదరుల నడుమ రాజ్యం కోసం పోరు జరిగిందని చూపించకుండా, సోదరుల నడుమ స్నేహ సౌభ్రాతృత్వ భావనలున్నాయని చూపిస్తూ, భారతీయ సంప్రదాయాన్ని కొనసాగించినట్టు చూపించి, సుల్తానులకు గౌరవం ఆపాదించాలనుకున్నాడు. కానీ అబద్ధం చాటు నుంచి సత్యం వెలుగురేకలు తొంగిచూస్తూనే ఉంటాయి.
సోదరుడు శాహిఖానా శక్తిని చూసి అలీషా భయపడ్డాడు. ప్రమాదాన్ని శంకించాడు అని జోనరాజు రాశాడు. కానీ సోదరుడికి రాజ్యం అప్పగించి తీర్థయాత్రలకు వెళ్ళాడనీ జోనరాజే రాశాడు. ఇప్పుడు మాద్ర రాజుకి, తన అల్లుడు రాజ్యం విడిచి తీర్థయాత్రలకు వెళ్ళటం నచ్చక, అతడు తిరిగి కశ్మీరు వెళ్ళేట్టు ఒత్తిడి చేశాడని రాస్తున్నాడు. కశ్మీరుకు ప్రయాణం చేసేందుకు అనువైన వాతావరణం నెలకొనగానే ససైన్యంగా సుల్తానును వెంటబెట్టుకుని కశ్మీరంలో ప్రవేశించాడు బిల్లదేవుడు.
ఈ సంఘటనలు జోనరాజు దాచాలని ప్రయత్నించిన సత్యాన్ని స్పష్టం చేస్తాయి. అందుకే ‘బహర్-ఇ-స్తాన్’లో ఈ కథ మరో రకంగా ఉంటుంది. రాజ్యంపై సోదరుడి కన్నుందని సుల్తాన్ గ్రహించాడు. సోదరుడు శక్తిమంతుడు. అతడి ముందు తాను నిలవలేడని గ్రహించాడు. అందుకని సోదరుడితో సింహాసనం కోసం యుద్ధం చేసి ఓడిపోయి అవమానాల పాలయ్యే బదులు, తీర్థయాత్రల నెపంతో రాజ్యం సోదరుడికి అప్పగించి, కశ్మీరం వదిలి వెళ్ళాడు ‘అలీషాహ్’.
Heike Franke అనే రచయిత అభిప్రాయం ప్రకారం “The actual motive for his pilgrimage is dubious. He might have been pressed to leave for this pilgrimage as a face saver of resigning”. బహరిస్తాన్ ప్రకారం “Pretending to set out for a pilgrimage to Mecca, as a pretext for leaving the country, he goes via Baramulla. Ali Shah descended from Baramulla via Poonch down to Rajauri, the capital of Madra rulers.”
కాబట్టి తన సోదరుడి శక్తికి భయపడి ‘అలీషాహ్’ తన మామ రాజ్యం అయిన మాద్ర రాజధాని రాజౌరికి చేరుకున్నాడు. మామ సైన్యం సహాయంతో తన సింహాసనం కోసం కశ్మీరు వచ్చాడు. సోదరుడి శక్తికి భయపడుతున్న అలీషాకు మాద్ర రాజు బిల్లదేవుడు ధైర్యం చెప్పి వెంట వచ్చి ఉంటాడు. దాన్ని జోనరాజు, తీర్థయాత్రల పట్ల అలీషాకు విముఖత కల్గించి, రాజ్యం వదలడం అవమానకరం అని బోధించి ససైన్యంగా కశ్మీరుకు వెంట వచ్చాడు అని రాశాడు. అబద్ధం చెప్పలేదు జోనరాజు. నిజం చెప్పాడు, కానీ అసలు నిజం దాచాడు.
సుల్తాన్ కశ్మీరుకు తిరిగి రావడం ‘శాహిఖానా’కు ఆనందం కలిగించింది. కానీ మాద్ర రాజు సహాయంతో, అతని సైన్యాన్ని వెంట తీసుకుని రావటం బాధ కలిగించింది. కానీ సోదరుడి పట్ల ప్రేమతో రాజ్యాన్ని త్యాగం చేశాడు. సింహాసనాన్ని సోదరుడికి అప్పగించాడు. సాయంత్రం కాగానే సూర్యుడు తనలో ఉన్న వెలుతురును అగ్నికి ఇచ్చేస్తాడు. మళ్ళీ తెల్లవారుతూనే అగ్నిని తాను తీసుకుంటాడు. ప్రజల మెప్పు పొందుతాడు. నీరాజనాలు అందుకుంటాడు. శక్తిని పుంజుకుంటాడు. అలా ‘శాహిఖానా’ రాజ్యాన్ని సోదరుడికి ఇచ్చేశాడు.
ఇదీ నిజమే చెప్పాడు జోనరాజు. అసలు సత్యాన్ని తరువాతి శ్లోకంలో పొందుపరిచాడు.
ఠక్కురైరన్వితో రాజా పవనః కుసుమైరివ।
కశ్మీరేభ్యో గతః సర్వైర్దేశాధీశైర్నతస్తతః॥
(జోనరాజ రాజతరంగిణి 716)
‘శాహిఖానా’, ఠక్కురాలతో కలిసి కశ్మీరంలో అలజడిని అణచివేశాడు. ఠక్కురాలెవరంటే, కశ్మీరులో తొలి దశలో ఇస్లాం స్వీకరించినవారు. ఇప్పుడు మాద్ర సైన్యంతో సుల్తాన్ కశ్మీరానికి రాగానే తన వెంట వచ్చిన ఠక్కురాలను తీసుకుని రాజ్యాన్ని సోదరుడికి వదిలి, కశ్మీరం వదిలి వెళ్ళిపోయాడు శాహిఖానా. దీన్నిబట్టి చూస్తే జోనరాజు సోదరుల నడుమ రాజ్యం కోసం పోరు జరగలేదని చిత్రించాలని ఎంతగా ప్రయత్నించినా, తనకు ఆశ్రయం ఇచ్చిన సుల్తాన్ జైనులాబిదీన్‍కు సింహాసనం మీద ఆశ లేదని ఎంతగా చూపించాలని ప్రయత్నించినా జరిగిన నిజం తేటతెల్లం అవుతునే ఉంది. సింహాసనం కోసం పోరు సాగుతున్నదని, సోదరులిద్దరూ రాజ్యం కోసం ఒకరినొకరు చంపుకునేందుకు సిద్ధంగా ఉన్నారనీ తెలుస్తుంది. తరువాత జరిగిన సంఘటనలు జోనరాజు దాచినా దాగని సత్యస్వరూపాన్ని ప్రకటితం చేస్తాయి.
ఠక్కురాల సైన్యం కశ్మీరును వదిలివెళ్ళటంతోటే, శాంతంగా కశ్మీరులోకి మాద్ర సైన్యం ప్రవేశించింది, మొసళ్ళు లేని నదిలా – అంటాడు జోనరాజు. అంటే, ఠక్కురాలకూ, మాద్ర సైన్యాలకూ పడదన్న మాట. ఠక్కురాలు మొసళ్లు. వాళ్ళున్నప్పుడు మాద్ర సైన్యాలు వస్తే అల్లకల్లోలం అవుతుంది. ‘శాహిఖానా’కు ప్రజల మద్దతు ఉంది. కానీ మాద్ర సేనతో యుద్ధంలో గెలవగలనన్న ధైర్యం లేదు. అందుకని అతడు సోదరుడు మాద్ర సేనలతో వస్తున్నాడనగానే, కశ్మీరం వదిలి వెళ్ళిపోయాడు. అతడు, అటు వెళ్లగానే, ఇటు మాద్ర సేనలు కశ్మీరంలోకి ప్రవేశించాయి.
అలీషా సింహాసాన్ని సాధించాడు కానీ ప్రజల హృదయాలను గెలువలేకపోయాడు. ప్రచండంగా వెలుగుతున్న సూర్యుడు అస్తమించనిదే మచ్చలున్న చంద్రుడు ఆకాశంలో కనబడడు కదా! అంటాడు జోనరాజు. శాహిఖానా సూర్యుడు. అలీషాహ్ చంద్రుడు. శాహిఖానా పట్ల ప్రజలకు అభిమానం ఉంది. కాబట్టి శాహిఖానా ఉన్నంత వరకూ ప్రజలు అలీషాహ్‍ను మెచ్చలేరు. దానికి తోడు, అలీషా శక్తిహీనుడు, బలహీనుడు. అలాంటి వాడిని మరొకడు తన శక్తితో సింహాసనంపై కూర్చోబెడితే, తన స్వశక్తితో సింహాసనం సాధించానని, అదంతా తన శక్తి ఫలితమే అని గర్విస్తాడు. మిగతా అందరినీ గడ్డిపోచల్లా భావిస్తాడు అని వ్యాఖ్యానిస్తాడు జోనరాజు. ఈ వర్ణన కూడా జోనరాజు దాచిపెట్టాలన్న సత్యాన్ని బట్టబయలు చేస్తుంది.
ఒక వీరుడి సహాయంతో సింహాసనం పొందినవాడు ‘సంభావ్య స్వపరాక్రమేణ విజయం విశ్వం తృణం మాన్యతే’ అనుకుంటాడు. విజయం తన శక్తి వల్లనే సాధ్యమయిందని భ్రమ పడతాడు. ఎవరినీ లెక్క చేయడు అనటంలో, అలీషాకు సింహాసనం మాద్ర రాజు సహాయం వల్ల దక్కిందని చెప్పకనే చెప్తున్నాడు జోనరాజు. ఈ రాజు బలహీనుడు. ఇతరుల సహాయంతో సింహాసనానికి ఎక్కాడు. కాబట్టి అతడు ఎవరిని ఏమీ అనలేడు. ముఖ్యంగా, తన శక్తి వలన తనకు సింహాసనం కట్టబెట్టిన వారిని ఏమీ అనలేడు. దాంతో రాజసేవకులు శక్తిమంతులై, చక్కటి ఉద్యానవనంలోని చెట్ల శాఖలు విరిచి సర్వనాశనం చేసే కోతుల్లా రాజ్యాన్ని అల్లకల్లోలం చేయటం ఆరభించారు.
ఈ సందర్భంలో జోనరాజు మ్లేచ్ఛులు, తురుష్కులు అన్న పదాలను ఎంతో జాగ్రత్తగా వాడేడు. రాజసేవకులైన తురుష్కులు కోతుల్లా ప్రవర్తిస్తూ రాజ్యాన్ని అల్లకల్లోలం చేస్తున్నాడంటాడు జోనరాజు. రాజసేవకులు తురుష్కులు. రాజు కాదు. రాజు సుల్తాన్.
‘యవనో మేరకేసారో వ్యధాన్మండల విప్లవం’.. యవనుడైన మేరకాసరుడు రాజ్యంలో అల్లకల్లోలానికి కారకుడయ్యాడు. మేరకాసురుడిని ‘యవనుడు’ అన్నాడు జోనరాజు. రాజ సేవకులను ‘తురుష్కులు’ అన్నాడు. అంటే ఇరాన్ నుంచి వచ్చిన వారికీ, టర్కీ నుంచి వచ్చిన వారికీ నడుమ తేడాను జోనరాజు గ్రహించి పాటిస్తూనే ఉన్నాడన్న మాట. మేరకాసురుడు దుష్టుడని ముందే చెప్తాడు జోనరాజు. మేరకాసారుడి ప్రభావం అలీషా పై అధికంగా ఉందని గతంలో రెండు మూడు సందర్భాలలో చెప్తాడు. ఇప్పుడు రాజ్యానికి మరో వారసుడు శక్తిమంతుడైన ‘శాహిఖానా’ తన సమర్థకులతో రాజ్యం వదిలి పారిపోయాడు. దాంతో అలీషాకు ఎలాంటి ప్రతికూల శక్తి రాజ్యంలో లేదు. దాంతో మేరకాసురిడిలోని అసురీ లక్షణం అడ్డూ అదుపూ లేకుండా వెలికి వచ్చింది.
‘పౌరనారీరనార్థః స హఠసంభోగదూషితాః’
ఎలాగయితే, తేనెటీగ పద్మపత్రాలను కలుషితం చేస్తుందో, అలాగ, మేరకాసురుడనే యవన అనాగరికుడు పౌరుల స్త్రీలను బలవంతంగా అనుభవించి మలినం చేశాడు. మేరకాసురుడొక్కడే కాదు, రాజాశ్రయం కల ప్రతి ఒక్కడూ అన్యాయంగా ప్రవర్తించాడు.
మహాకరైర్మదేనాన్దైః పంక సంకులతాం భజత్।
అక్షోభి మండలం మ్లేచ్ఛైః సరో మరుగజైరివ॥
(జోనరాజ రాజతరంగిణి 723)
ఎలాగయితే, మత్తగజాలు కన్నుమిన్ను కానక సరోవరాన్ని అల్లకల్లోలం చేసి బురదమయం చేస్తాయో, అలాగ మ్లేచ్ఛులు కశ్మీరాన్ని అల్లకల్లోలం చేసి ప్రజలను భయభ్రాంతులను చేశారు.
ఈ అకృత్యాలు, అల్లకల్లోలాలు ఎవరిపై జరిగాయో ఊహించటం కష్టం కాదు. స్పష్టంగా చెప్పటానికి ‘లౌక్యం’ అడ్దు వస్తుందంతే!
రక్షసామేవ కశ్మీరాస్తదా హస్తవశం గతాః॥
(జోనరాజ రాజతరంగిణి 724)
కశ్మీరం సంపూర్ణంగా రాక్షసులకు హస్తగతం అయినట్టయిపోయింది. మంత్రులతో సహా ఎవరికీ వీరిపై నియంత్రణ లేకుండా పోయింది. పట్టపగలే అత్యాచారాలు జరగకుండా నిరోధించే వారెవరూ లేకుండా పోయారు. అందుకే కశ్మీరం సంపూర్ణంగా రాక్షసుల హస్తగతం అయినట్టు అయింది.
ఈ సందర్భంలో జోనరాజు చెప్పని, పర్షియన్ రచయితలు తమ గొప్పతనం, కశ్మీరీయుల అనాగరికతను ఎత్తి చూపించేందుకు రాసిన ఓ సంఘటనను ప్రస్తావించుకోవాలి.
తమపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా పండితులను పోరాటపథంలో నడిపించాలని ప్రయత్నించాడు పండిత రత్నాకరుడు. ఈయన పండితులకు ఆయుధ శిక్షణనిచ్చి తమపై జరుగుతున్న అత్యాచారాలను ఎదుర్కుని ప్రాణాలు త్యాగం చేసేందుకు సిద్ధం చేశాడు. ఇతడికి సహాయంగా, మతం మారిన మరో కశ్మీరీ మౌలానా దీన్ ముందుకు వచ్చాడు. ఆయుధ శిక్షణనిచ్చాడు. కశ్మీరులో అత్యాచారాల పర్వం నెరపుతున్న తురుష్కులకు సింహస్వప్నం అయ్యారు. కానీ, కొత్తగా మతం మారిన కశ్మీరీ వీరి గుట్టుమట్లు సుల్తాన్ సేనకు చెప్పేశాడు. దాంతో వారిద్దరినీ రాజభటులు బంధించి, క్రూరంగా హింసించి, సంహరించారు. జోనరాజు ఇవన్నీ స్పష్టంగా చెప్పలేదు. చెప్పలేడు. చెప్తే జోనరాజుకే నష్టం. అందుకని ఎంతో నిగూఢంగా, సూచనప్రాయంగా, మతం మారకుండా తమ ధర్మాన్ని ఇంకా పట్టుకుని వ్రేలాడుతున్న వారిపై జరుగుతున్న అత్యాచారాలను చెప్తాడు.
మ్లేచ్ఛులు కానీ, తురుష్కులు కానీ అత్యాచారాలు తమ వారిపై చేయరు. అధికారంలో ఉన్నది, రాజాశ్రయంలో ఉన్నదీ వారు. కాబట్టి వారు ఇతరులపై అత్యాచారాలు చేస్తారు. తమ అమానవీయ రాక్షసత్వానికి వారు బలి చేసేది ఇంకా మతం మారని వారినే. వారి స్త్రీలను ఎత్తుకుపోవటం, చెరచటం, ఆస్తులను కాజేయటం అంతా, ఇంకా మతం మారని వారిపైనే. ఈ అకృత్యాల నుంచి రక్షణ కావాలంటే మతం మారాలి. సికందర్, అలీషాల పాలనా కాలం పూర్తయ్యేసరికి కశ్మీరు సర్వం ఇస్లాంమయం అయిపోయింది. కశ్మీరులోని వారంతా ప్రాణాలు కోల్పోయారు, లేదా మతం మారిపోయారు. జైనులాబిదీన్ పాలనా కాలానికి కశ్మీరులో మిగిలింది కేవలం 11 ఇస్లామేతర కుటుంబాలు మాత్రమే. వీరూ కశ్మీరీ పండితులు! అంటే, మొత్తం సమాజాన్ని, ఒక దేశంలోని జనాభా మొత్తాన్ని, ఒక దేశ సంస్కృతి సంప్రదాయాలను, ఉజ్జ్వలమైన గతాన్ని, ఆ గతానికి సంబంధించిన చిహ్నాలను సంపూర్ణంగా, సమూలంగా నాశనం చేసి రూపాంతరం చెందించారన్న మాట. కశ్మీరమంతా ధ్వనించిన వేదఘోషలు, శివభజనలు, శివస్తోత్రాలు, విష్ణు మంత్రాలు సర్వం గాలిలో కలిసిపోయాయి. జోనరాజు ఇంత విపులంగా చెప్పలేడు. అందుకని మార్మికంగా, నిగూఢంగా చెప్తాడు.
అరాజకం వరం రాజ్యం న స్వామీ తాహశః పునః।
అభూషణో వరం కర్ణో న పునర్లోహ కుండలః॥
(జోనరాజ రాజతరంగిణి 725)
రాజ్యం రాజు ఉండి అరాచకం పాలయ్యేట్టయితే, అలాంటి రాజు లేకపోవటమే మంచిది. చెవికి ఇనుప ఆభరణం ధరించే కన్నా, ఆభరణం లేకపోవటమే మేలు కదా!
ఈ శ్లోకం ఆనాటి కశ్మీరులో ఇస్లామేతరుల దుస్థితిని స్పష్టం చేస్తుంది.
సద్మ తుంగం వరో వాజీ స్వచ్ఛం వాసో మణిర్మహాన్।
స్వీకృతం యవనైస్తత్తద్యధ్యచ్ఛోభావహం ప్రభోః॥
(జోనరాజ రాజతరంగిణి 726)
ఈ ఒక్క శ్లోకం చాలు, కశ్మీరులో జరిగిన దాన్ని కళ్లకు కట్టినట్టు ప్రదర్శించటానికి. కశ్మీరంలో ఆనాడే కాదు, ఈనాడు కూడా జరిగిన దాన్ని నిక్కచ్చిగా చూపిస్తుంది.
ఒకప్పుడు రాజులకు చెందిన పెద్ద భవంతులు, మేలైన అశ్వాలు, అందమైన దుస్తులు, విలువైన వస్తువులు అన్నీ ఇప్పుడు యవనుల పాలపడ్డాయి. యవనులు వాటిని లాక్కున్నారు. ఆక్రమించారు. దేశవిభజన సమయంలో హింస చెలరేగినప్పుడు, ఇప్పుడు పాకిస్తాన్‍గా గుర్తింపు పొందుతున్న భూభాగాన్ని కట్టుబట్టలతో వీడి ఎందరో భారత్ చేరుకున్నారు. వారందరి ఆస్తులను పాకిస్తానీయులు ఆక్రమించారు. కానీ భారత్ నుంచి పాకిస్తాన్‍కు ఇక్కడ ఆస్తులను వదిలి వెళ్ళిన వారికి నష్టపరిహారం అందింది. వారి ఆస్తుల గురించి ఇప్పటికీ కోర్టుల్లో వివాదాలు సాగుతున్నాయి. ఇది రెండు జాతుల నడుమ ఉన్న తేడాను స్పష్టంగా చూపిస్తుంది.
ఆనాడు కశ్మీరులో మతం మారని వారు ప్రాణాలు అరచేత పట్టుకుని సర్వం వదిలి కశ్మీరు వదిలి పారిపోయారు. వాటన్నింటినీ యవనులు ఆక్రమించారంటున్నాడు జోనరాజు. ఈనాడు కశ్మీరు నుంచి పండితులు ప్రాణాలు అరచేత పట్టుకుని కశ్మీరు వదిలి వచ్చారు. వారు తిరిగి వస్తే వారి ఆస్తులు వారికి అప్పగించాల్సి వస్తుందని కశ్మీరీ పండితులు కశ్మీరు తిరిగి రావటాన్ని వ్యతిరేకిస్తున్నారు కొందరు. కానీ ఇదే సమయంలో కొందరు పండితుల ఆస్తుల్ని కాపాడుతున్నారు, వారు తిరిగి వస్తే అప్పగించేందుకు. ఇటువంటి సహృదయుల వల్లనే ఇంతటి ఘోరాలు అనుభవిస్తూ కూడా ఆనాడు 11 పండిత కుటుంబాలు కశ్మీరులో మిగిలి ఉన్నాయి, అలీషా పాలన పూర్తయ్యేసరికి. అలా అయిదారు నెలలు అలీషా రాజ్యం చేశాడు ప్రజల దౌర్భాగ్యం వల్ల, అంటాడు జోనరాజు. నిప్పు వెలిగే వరకూ పొగ మనల్ని బాధిస్తూనే ఉంటుంది. పొగ వల్ల పూలు వాడిపోతాయి. అన్ని దిశలా పొగ అలముకుని చీకటి అవుతుంది. కళ్లు బలహీనం అవుతాయి. సూర్యకాంతిని అడ్డుకుంటుంది పొగ.
(ఇంకా ఉంది)