[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
అసంఖ్యానత్ర సంక్షిప్త్రే తద్గుణాన్ వర్ణయామి కిమ్।
సృగులానామ్ గుహమధ్యే కథం హస్తిపతిర్వసేత్॥
తస్మాత్‍చ్ఛైలేంద్రవచ్చిత్రే మకురే సూర్యబింబవత్।
న్యాస్యామి తద్గుణాఖ్యానమత్ర చిత్రే త్రిలోకవత్॥
(జోనరాజ రాజతరంగిణి 766, 767)
[dropcap]జో[/dropcap]నరాజు కవిత్వ రచన పటిమ, సృజనాశక్తి జైనులాబిదీన్ కశ్మీరు సింహాసనాన్ని అధిష్టించినప్పటి నుంచీ ప్రస్ఫుటమవుతుంది. అంతవరకూ ఎంతో జాగ్రత్తగా పదాలను వాడేడు. అలంకారాలను ఆచితూచి ప్రయోగించాడు. కానీ జైనులాబిదీన్ అధికారానికి వచ్చిన తరువాత నుంచీ రాజతరంగిణి రచన హృదయంతో చేశాడనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం కూడా జైనులాబిదీన్ సుల్తాన్ పదని చేపట్టే సమయంలోనే స్పష్టం చేశాడు జోనరాజు.
దుర్య్వవస్థాం నివార్యాహం దేశేస్మిన్ మ్లేచ్ఛవాశిత।
(జోనరాజ రాజతరంగిణి 762)
మ్లేచ్ఛులు నాశనం చేసిన దేశం నుంచి దుర్వ్యవస్థను బహిష్కరించాడు జైనులాబిదీన్.
కశ్మీరు సుల్తానుల పాలనలోకి రాకముందు కశ్మీరులో కొన్ని వేల యేండ్లుగా ఒక పటిష్టమైన వ్యవస్థ స్థిరపడి ఉంది. కాలక్రమేణా బలహీనమైన రాజులు, తురుష్క ప్రభావంలో పడి ఈ పటిష్టమైన వ్యవస్థను దెబ్బతీశారు. ఫలితంగా బలహీనమైన కశ్మీరం సుల్తానుల పాలనలోకి వచ్చింది. పాలనలోకి వచ్చిన తరువాత మిడతల దండు పచ్చని పంటపొలాలను ధ్వంసం చేసినట్టు కశ్మీరులో అధికారం సాధించిన సుల్తానులు కశ్మీరు సంస్కృతి సంప్రదాయాలను, ధార్మిక సంపదను, రాజకీయ వ్యవస్థను సంపూర్ణంగా ధ్వంసం చేశారు.
కొన్ని తరాలుగా అలవాటయిన సాంప్రదాయక వృత్తులు దెబ్బతిన్నాయి. వ్యవస్థ చిన్నాభిన్నమయింది. ఇస్లాం ఆమోదించిన జీవన విధానం, వృత్తులు మాత్రమే అవలంబించాలన్న నియమంతో అనేక వృత్తులు, వాటిపై ఆధారపడిన వారి జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. కొత్త జీవన విధానం, కొత్త వృత్తులు రంగప్రవేశం చేశాయి. సమాజం అల్లకల్లోలమయింది. ముఖ్యంగా ఇస్లాం మతం స్వీకరించని వారంతా కశ్మీరం వదిలి వెళ్ళాల్సి రావటంతో, వీరిలో అధిక సంఖ్యాకులు కశ్మీరు సమాజానికి కీలకమైనవారు కావటంతో కశ్మీర దేశం నాశనం అయింది. జోనరాజు వ్యాఖ్యానించిన ‘దుర్వ్యవస్థ’ ఇది.
గమనిస్తే, జైనులాబిదీన్ అధికారానికి వచ్చే వరకూ ఏ సుల్తాన్ కూడా కశ్మీరంలో పాలనపై దృష్టి పెట్టలేదు. హమదానీల ప్రభావంతో ఇస్లాం మత ప్రచారం, ఇస్లాం పద్ధతుల అనుసరణపైనే వారు దృష్టి పెట్టారు. మతం మార్చటం, మారని వారిని వెతికి వెంటాడి చంపటం, దేశం వదిలి పారిపోకుండా కట్టుదిట్టం చేయటం, మందిరాలు ధ్వంసం చేయటం, మసీదులు, ఖన్‍ఖాలు నిర్మించటం, సింహాసనం కోసం పోరాడటం వంటి వాటిపై తప్ప, పాలనపై దృష్టి పెట్టలేదు. సింహాసనం చేజిక్కించుకున్న తరువాత పాలనపై దృష్టి పెట్టిన తొలి సుల్తాన్ జైనులాబిదీన్. ఒక రకంగా చెప్పాలంటే, ఈనాటికీ కశ్మీరు ప్రజల జీవన విధానంపై జైనులాబిదీన్ ఆనాడు తీసుకున్న నిర్ణయాలు, అమలు పరిచిన విధానాల ప్రభావం కనిపిస్తుంది. అందుకే జైనులాబిదీన్ గురించి ఆరంభంలోనే ‘మ్లేచ్ఛుల వలన నాశనమైన కశ్మీరంలో దుర్వ్యవస్థలని నిర్మూలించాడు’ అన్నాడు జోనరాజు. కలియుగంలో సత్యయుగాన్ని తలంపుకు తెచ్చే పాలన జైనులాబిదీన్‍ది అని స్పష్టంగా చెప్పాడు. అంటే, మిడతల దండు వల్ల పంటలు నాశనమైనట్టు నాశనమైన కశ్మీరు వ్యవస్థను, సంస్కృతిని, సాంప్రదాయాలను పునరుద్ధరించి, దుష్ట వ్యవస్థను నిర్మూలించాడన్న మాట జైనులాబిదీన్. అయితే, విధి జోనరాజు పట్ల చల్లని చూపు చూసింది. జైనులాబిదీన్ పాలనా కాలంలో చివరిదశను చూడకుండానే జోనరాజు మరణించాడు. ఆ స్థితిని వర్ణించింది జోనరాజు శిష్యుడు శ్రీవరుడు.( జోనరాజ రాజతరంగిణి అనువాదం పూర్తయిన తరువాత శ్రీవరుడి రాజతరంగిణి అనువాదం ఆరంభమవుతుంది)
అధికారానికి వచ్చిన వెంటనే వ్యవస్థలోని లోపాన్ని అర్థం చేసుకున్నాడు జైనులాబిదీన్. అందుకని చక్కని అధికారులను ఎన్నుకుని వారికి సంపూర్ణమైన అధికారాలు ఇచ్చాడు. దుష్టులను, వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేసే వారిని ఎటువంటి సంశయాలు, సందిగ్ధాలు లేకుండా నిక్కచ్చిగా శిక్షించే శక్తినిచ్చాడు. మంచివారికి సముచితంగా సత్కరించి ఐశ్వర్యవంతులను చేశాడు. ఈ రకంగా నలు దిశలా తన గొప్పతనపు బీజాలు నాటాడు జైనులాబిదీన్. భవిష్యత్తులో అతని యశస్సు మహావృక్షమై ఎదిగింది. ప్రజలు ధనవంతులయ్యారు. సుఖంగా జీవించారు. అతని శత్రువులు నామరూపాల్లేకుండా పోయారు. దుష్టులను ఏరివేశాడు. ఈ రకంగా జైనులాబిదీన్ సాధారణమైన వ్యవసాయ పద్ధతికి వ్యతిరేకమైన పద్ధతిలో వ్యవసాయం చేశాడని చమత్కరించాడు జోనరాజు.
సాధారణ వ్యవసాయం ఆరంభంలో పొలం దున్నుతారు. కలుపు మొక్కలని వ్రేళ్ళతో సహా పెళ్ళగించి, ఆ తరువాత విత్తనాలు నాటుతారు. అప్పుడు చెట్లు మొలుస్తాయి. కానీ జైనులాబిదీన్ ముందుగా తన యశస్సు విత్తనాలు నాటాడు. తరువాత రాజ్యంలో దుష్టులను కూకటి వ్రేళ్ళతో పెళ్ళగించి వేశాడు. అతని యశస్సు బీజాలు పెరిగి వృక్షాలు అయ్యాయి.
సూర్యుడు ఎప్పుడూ శక్తిమంతుడు. ప్రచండుడు. చంద్రుడు చల్లనివాడు. వెన్నెల వెలుగులు వెదజల్లుతాడు. వారిద్దరినీ మించిపోయే రీతిలో జైనులాబిదీన్ ఈ రెండు లక్షణాలను తనలోనే ప్రదర్శించాడు.
ఇలా జైనులాబిదీన్‍ను వర్ణించిన తరువాత తన సందిగ్ధాన్ని వ్యక్తపరిచాడు జోనరాజు.
జైనులాబిదీన్‍లో ఉన్న అనంతమైన అద్భుత లక్షణాలను సంక్షిప్త కావ్యంలో ఎలా వ్యక్తపరచాలి నేను? అది అసంభవం అంటాడు. నక్కలు నివసించే చిన్న గుహలో ఏనుగుల రాజు పట్టగలదా? దాన్లో ఏనుగు దూరటం సంభవమా? కాదు. అలాగే, ఒక సంక్షిప్త రచనలో జైనులాబిదీన్ అనంతమైన గుణాలను పొందుపరచటం కూడా కుదరని పని. కానీ ఆకాశాన్ని తాకే హిమాలయాలను ఒక చిత్రంలో ప్రదర్శించవచ్చు. అలాగే ముల్లోకాలను చిత్రపటంలో చిత్రించవచ్చు. అద్దంలో సూర్యుడిని ఒదిగింప చేయవచ్చు. అలా రాజతరంగిణి పరిమిత పరిధిలో జైనులాబిదీన్ గుణగణాలను వర్ణిస్తాడన్న మాట జోనరాజు.
శీతోష్ణయోరివోర్జాదౌ విషువే హర్నిశోరివ।
తస్య మనోభవత్తుల్యః స్వే పరే వాపి దర్శనే॥
(జోనరాజ రాజతరంగిణి 768)
ఎలాగయితే ఉదయం పూట వేడిమి, శీతలగాలుల ప్రభావం సమంగా ఉంటుందో, ‘విషవత్తు’ (equinox) నాడు రాత్రింబవళ్లు సమానమో, అలాగే రాజు తన వారినీ, పరులనూ అందరినీ సమానంగా చూసేవాడు.
జైనులాబిదీన్ దృష్టిలో స్వపర భేదం లేదన్న మాట. అందరూ సమానమేనన్న మాట. జోనరాజు ఈ మాట అనటం గమనార్హం.
అంతవరకూ అధికారానికి వచ్చిన సుల్తానులు మతమార్పిడి, హింస, దేవాలయాల ధ్వంసం పైనే దృష్టి పెట్టారు. కానీ జైనులాబిదీన్ దృష్టిలో తన మతం వారు, పర మతం వారూ అందరూ సమానమే. అందరినీ సమానంగా చూసేవాడు. ఈ శ్లోకాన్ని 763వ శ్లోకం –
తావద్ ద్రోహచింతం కర్మ ద్రోగ్ధారో రాజవల్లభైః।
అపృష్టవైవ మహీపాలం నీతా వీతభయైః స్ఫుటమ్॥
అన్న శ్లోకంతో కలిపి చదివితే జోనరాజు ప్రస్తావించిన ద్రోహులు ఎవరో బోధపడుతుంది.
అంతకు ముందు ప్రస్తావించిన ‘మ్లేచ్చవాశిత’ అన్న భావన ఈ ఆలోచనకు బలమిస్తోంది. గతంలో సుల్తానుల అండతో మతపరంగా తీవ్రమైన హింస జరిగింది. ఇస్లామేతరులతో ఘోరంగా వ్యవహరించారు. వారందరిని అదుపులో పెట్టి, వారి చర్యలను అదుపులో పెట్టి అందరినీ సమానంగా చూశాడన్న మాట జైనులాబిదీన్. భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే స్వచ్ఛందంగా పరమత సహనం పాటించిన ప్రథమ సుల్తాను జైనులాబిదీన్!
భారతదేశ చరిత్రలో అక్బరుకు పెద్దపీట వేశారు. కారణం, ఆయన భారతదేశంలో అధికభాగంపై రాజ్యం చేశాడు కాబట్టి. ఆయనను పరమత సహనానికి ఆదర్శంగా నిలబెట్టటం వల్ల కొంత లాభం ఉంది కాబట్టి, అక్బరుకు పేరు ప్రఖ్యాతులు లభించాయి. కానీ అక్బరు పరమత సహనం వెనుక రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయి. అతనికి పరమత సహనం ప్రదర్శించటం అవసరం అయింది. కాకపోతే, ఇంతపెద్ద రాజ్యంపై పట్టు బిగించటం వీలవదు. ఎలాగయితే బ్రిటీషు వారి సైన్యంలో భారతీయులు అధిక సంఖ్యలో ఉండి, వారికి సేవ చేయకపోతే, భారతీయులను అదుపులో ఉంచటం బ్రిటీష్ వారికి కుదిరేది కాదో, అలాగే, ఆ కాలంలో రాజపుత్రులతో స్నేహం చెయ్యకపోతే అక్బరుకు స్థిరంగా రాజ్యం చేయటం వీలయ్యేది కాదు. కాబట్టి పరమత సహనం అతనికి ఒక అవసరం. కానీ జైనులాబిదీన్‍కు పరమత సహనం ప్రదర్శించాల్సిన అవసరం లేదు. అయినా అతను పరమత సహనం ప్రదర్శించాడు. అందరినీ సమదృష్టితో చూశాడు. ఇస్లామేతరులపై అత్యాచారాలను అదుపులో పెట్టాడు. బలవంతపు మతమార్పిళ్ళను అడ్డుకున్నాడు. కశ్మీరు వదిలి పారిపోయిన పండితులను కశ్మీరుకు వెనక్కి పిలిచాడు. వారికి కశ్మీరంలో భద్రతనిచ్చాడు. తన ఆస్థానంలో చోటిచ్చాడు. తమ ధర్మాన్ని నిశ్చింతగా, నిర్భయంగా పాటించే వీలు కల్పించాడు. అందువల్లనే కశ్మీరు వదిలి వెళ్ళిన జోనరాజు వెనక్కు రాగలిగాడు. రాజాస్థానంలో స్థానం సంపాదించాడు. ఇప్పుడు రాజతరంగిణి రాయగలుగుతున్నాడు, సంస్కృతంలో. దీనికి దారితీసిన పరిస్థితులు కూడా వివరించాడు జోనరాజు. ముందుగా అందుకే ఆయన స్వపరభేదం లేని జైనులాబిదీన్ సమాన దృష్టిని ప్రస్తావించాడు.
ఎలాగయితే వ్యాపారులు త్రాసుతో తూచేటప్పుడు అసమతౌల్యం రానీయకుండా సూచిక మధ్య భాగంలో స్థిరంగా ఉండేట్టు చూస్తారో, అలా పాలనలో రాజు సమతౌల్యం పాటించేవాడు. అందరికీ న్యాయం చేసేవాడు.
శాన్తే సిద్ధాశ్రమే సింహైర్మృగా ఇవ న పీడితాః।
తురుష్కైః పుష్కల భయైర్బ్రాహ్మణాః పూర్వవత్తదా॥
(జోనరాజ రాజతరంగిణి 770)
ఇక్కడ బయటపడ్డాడు జోనరాజు.
సిద్ధాశ్రమంలో ఉండే శాంతి వాతావరణంలో క్రూరమృగమైన సింహం కూడా ఎలా ఇతర జంతువులను పీడించదో, అలాగ, తురుష్కులు జైనులాబిదీన్ భయానికి బ్రాహ్మణులను గతంలో లాగా పీడించటం మానేశారు!
ఒక కవి ప్రతిభ – అతను పైకి స్పష్టంగా ద్యోతకమయ్యేట్టు రచించిన భావం కన్నా, పదాలలో నిగూఢంగా పొందుపరచి అస్పష్టపు నీడలో ఒదిగి ఉండేట్టు రచించిన అర్థాల వల్ల, స్పష్టంగా కనిపించే భావం నేపథ్యంలో ఒదిగి ఉన్న ఆలోచన బోధపడేట్టు చేయటంలో కనిపిస్తుంది.
ఈ శ్లోకం చదివితే జైనులాబిదీన్ గొప్పతనం ముందుగా కనిపిస్తుంది. అది ముని ఆశ్రమం. అక్కడ అంతా శాంతం. ఎలాంటి వారయినా అక్కడికి వస్తే సాధుజీవులయిపోతారు. సింహం సైతం ఆ ఆశ్రమ ఆవరణలో ఇతర జీవులను హింసించటం మానేస్తుంది. కశ్మీరులో జైనులాబిదీన్ పాలనలో తురుష్కులు సిద్ధాశ్రమంలో సింహాల్లా, గతంలో హింసించినట్టు బ్రాహ్మణులను హింసించటం మానేశారు. ఎందుకని? అంటే ‘పుష్కల భయై’.. గతంలోలా బ్రాహ్మణులను, ఇస్లామేతరులను హింసిస్తే సుల్తాన్ సహించడు, శిక్షిస్తాడు.. అన్న భయం వల్ల. ఇంతకు ముందు ఓ శ్లోకంలో ఎటువంటి భయం లేకుండా, బహిరంగంగా, రాజు ఆదేశాలు లేకున్నా దుష్టులను శిక్షించవచ్చన్నాడు జైనులాబిదీన్ అన్న శ్లోకాన్ని ఇక్కడ అన్వయించుకుంటే, తురుష్కుల భయం అర్థమవుతుంది. ఇస్లామేతరులను అణచివేయటంలో గత సుల్తానులు తురుష్కులకు సంపూర్ణమైన మద్దతునిచ్చారు. స్వేచ్ఛనిచ్చారు. కానీ ఇప్పుడు జైనులాబిదీన్ అలా ప్రవర్తించే వారిని శిక్షించేవారికి పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. దాంతో భయంతో తురుష్కులు, ఆశ్రమంలో ఇతర జంతువులని హింసించని సింహాల్లా, ప్రవర్తిస్తున్నారు.
సింహం సింహమే. అది క్రూర జంతువు. ఇతర జంతువులను హిసించి చంపటం దాని స్వభావం. కానీ ముని ఆశ్రమంలోని శాంతి వాతావరణం వల్ల అవి స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాయి. హింసించి అయినా మతం మార్చటం తురుష్క లక్షణం. దీనికి భిన్నంగా సుల్తాన్ భయం వల్ల తురుష్కులు బ్రాహ్మణులను హింసించటం మానేశారు. ఎలాగయితే ముని ఆశ్రమ పరిధి దాటితే సింహం తిరిగి తన హింస స్వభావం ప్రదర్శిస్తుందో, అలాగే, రాజ భయం తొలగితే, తురుష్కులు తమ పూర్వ ప్రవర్తనను ప్రదర్శిస్తారు.
ఇంత చతురతతో, ఎంతో జాగ్రత్తగా రాజతరంగిణిని రచించాడు కాబట్టే చేదునిజాలు చెప్తూ కూడా జోనరాజు సుల్తాను పాలనలో జీవించగలిగాడు.
దోషాకరేణ సూహెన యేషాం సంకోచితా స్థితిః।
వ్యకాసయత్తతో భాస్వాన్ గుణినస్తాన్ మహీహతిః॥
(జోనరాజ రాజతరంగిణి 771)
ప్రతిభ ఉన్నవారికి పట్టం కట్టాడు సుల్తాన్. సూర్యుడిలా ప్రకాశమానుడైన సుల్తాన్, చంద్రుడిలా సూహుడి వల్ల ప్రశ్నార్థకమైన ప్రతిభావంతుల ఉనికిని సంరక్షించాడు. మళ్ళీ వారికి పెద్దపీట వేశాడు. ఇక్కడ ప్రతిభావంతులను గుర్తించి వారికి సముచితమైన గౌరవం ఇవ్వటం అంటే బ్రాహ్మణులు అన్న అర్థంతో కొందరు వ్యాఖ్యానించారు. కానీ ప్రతిభావంతులంటే బ్రాహ్మణులే కాదు, ప్రతిభావంతులైన ఇస్లామేతరులు. సూహభట్టు బ్రాహ్మణులపైనే ద్వేషం ప్రదర్శించలేదు. మతాంతీకరణను వ్యతిరేకించిన ప్రతివారి మనుగడను ప్రశ్నార్థకంలో పడేశాడు. సూహభట్టు వల్ల ప్రమాదంలో పడ్డ ప్రతిభావంతులను సుల్తాన్ జైనులాబిదీన్ సముచితంగా సత్కరించి భద్రతనిచ్చాడన్న మాట. అలా జైనులాబిదీన్ పాలనను ఆరంభించినప్పుడు కేవలం 11 మాత్రమే పండితుల కుటుంబాలుండే స్థితి నుండి కశ్మీరులో తిరిగి పండితులు స్వేచ్ఛగా తిరిగే వీలును కల్పించాడన్న మాట సుల్తాన్ జైనులాబిదీన్.
(ఇంకా ఉంది)