[box type=’note’ fontsize=’16’] జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]
అప్స స్వ ప్రతిబింబేస్య కుర్వతో ముఖ వైకృతమ్।
రుషా చపేటామ్ దదతో న్యపతన్మణిముద్రవా॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 43)
[dropcap]కా[/dropcap]శ్మీర రాజు వోపదేవుడు మూర్ఖుడు. కానీ ప్రజలు అతడిని సింహాసనంపై కూర్చుండబెట్టారు. దాంతో అతడు ఎంతటి మూర్ఖత్వం ప్రదర్శించినా, భరించాల్సి వచ్చింది ప్రజలకు. అతడి మూర్ఖత్వాన్ని ప్రదర్శించే రెండు మూడు సంఘటలను జోనరాజు ప్రస్తావించాడు రాజతరంగిణిలో.
పాలు తాగితే పిల్లల శరీరం వృద్ధి పొందుతుంది. ఇది వోపదేవుడికి తెలుసు. ఒక రోజు అతడు పెద్ద బండరాళ్ళను చూశాడు. ఎంతో ఆనందంగా అనిపించింది. దాంతో చిన్న చిన్న రాళ్ళను కూడా పెద్ద బండరాళ్ళుగా ఎదిగించాలనుకున్నాడు. చిన్న రాళ్ళకు పశువుల పాలు పొయడం ద్వారా వాటిని పెద్ద బండరాళ్ళుగా మార్చమని ఆజ్ఞాపించాడు.
మరో సందర్భంలో సురేశ్వరి మందిరం గొప్పతనం గురించి విన్న రాజు, మంత్రులతో సహా ఆ మందిర దర్శనానికి వెళ్ళాడు. ఆ మందిరంలో దర్శనానికి పడవలో వెళ్ళాలి. పడవలో వెళ్తూ నీళ్ళల్లో తన ప్రతిబింబం, నీటి కదలికల వల్ల వికృత రూపాల్లోకి మారటం చూసి కోపం వచ్చింది రాజుకు. కోపంతో చేతులతో నీళ్లను కొట్టటం ఆరంభించాడు. అతడి వేలికి ఉన్న రాజముద్రిక ఉంగరం జారి నీళ్లలో పడిపోయింది. ‘రాజముద్రిక ఏద’ని మంత్రులు అడిగితే, ‘అలల్లో ఉంద’ని సమాధానం ఇచ్చాడు రాజు. అంతటి మూర్ఖుడు వోపదేవుడు. అతడు తొమ్మిదేళ్ళ నాలుగు నెలల రెండున్నర రోజులు రాజ్యం చేశాడు. వోపదేవుడు క్రీ.శ. 1171 నుండి 1180 వరకు కశ్మీరాన్ని పాలించాడు.
అతని తరువాత అతని సోదరుడు జస్యకుడు రాజయ్యాడు. ఇతడు అన్న కన్నా అధిక మూర్ఖుడు. రాజ్యభారం వహించటం ఇష్టం లేదు. ప్రజలు ఎంత ఒత్తిడి చేసినా రాజుగా ఉండేందుకు ఇష్టపడలేదు. లావణ్యకులకు ఇది చక్కని అవకాశంగా తోచింది. కీలుబొమ్మ లాంటి జస్యకుడిని సింహాసనంపై కూర్చుండబెట్టి తాము అధికారం చలాయించవచ్చని వారు ఆలోచించారు. ఈ సందర్భంగా జోనరాజు చక్కని శ్లోకం రాశాడు.
మానవుడి స్వరాన్ని అనుకరించే చిలుకను పట్టి బంధిస్తారు కానీ కాకిని ఎవరూ పంజరంలో బంధించరు. సారవంతమైన భూమిని తవ్వి దున్నినట్టు రాళ్ళతో నిండిన భూమిని ఎవరూ తవ్వరు. రాళ్ళ ఉప్పును పొడి కొట్టినట్టు రాళ్ళను ఎవరూ పిండి కొట్టరు. కాబట్టి ఒకోసారి మనుషుల బలహీనతలే వారికి లాభదాయకాలవుతాయి అంటాడు జోనరాజు. అంటే రాజ్యంపై ఇష్టం లేకపోవటం, చెప్పిన మాటలు విని తల ఊపి, చిలక పలుకులు పలకటం, మూర్ఖత్వం అనే బలహీనతలు ఉండటం వల్లనే జస్యకుడు రాజయ్యాడని వ్యంగ్యంగా అంటున్నాడు జోనరాజు.
జస్యకుడి రాజ్యంలో క్షుక్షకుడు, భీముడు అని ఇద్దరు బ్రాహ్మణ సోదరులుండేవారు. వారు అక్రమ పనుల ద్వారా రాజు మెప్పు పొందారు. రాజు ప్రాపకం లభించాక, వారు ఎవరినీ పట్టించుకోకుండా అహంకార పూరిత ప్రవర్తనను చూపసాగారు. బాగా ధనం సంపాదించారు. తాము ధనవంతులయ్యాం కాబట్టి రాజు తమనేమీ చేయలేడన్న ధైర్యం వారిలో పెరిగింది. వారి కన్ను రాజ్యాధికారంపై పడింది. కానీ లావణ్యకుల భయం వల్ల వారు రాజ్యాధికారం హస్తగతం చేసుకునేందుకు భయపడి ఆగారు.
క్షుక్షకుడి వయసయిపోయింది. అతడి శక్తి ఉడిగిపోయింది. అతడి భార్య క్షుక్షకుడికి విషం ఇచ్చి చంపేసింది. క్షుక్షకుడి సోదరుడు భీముడిని తన ఆంతరంగిక మందిరంలోకి ఆహ్వానించింది. కౌగిలిలో బంధించింది. ఈ పాపపు చర్య ఫలితంగా ఆమె శరీరంపై తెల్లటి మచ్చలు కనిపించాయి. తన తప్పు గ్రహించి పశ్చాత్తాప పడి ఆమె మాధవ మందిరంతో సహా పలు మందిరాలకు దానాలు ఇచ్చింది. ఈ పుణ్య కార్యం వల్ల ఆమె బాధ కాస్త తగ్గింది. పద్దెనిమిదేళ్ళ పదిరోజుల పాలన తర్వాత జస్యకుడు మరణించాడు. అతడు క్రీ.శ. 1180 నుండి 1198 వరకూ రాజ్యం చేశాడు.
జోనరాజు రాజతరంగిణిని గమనిస్తే ఏ రాజు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించే అంశాలు అధికంగా లేవనిపిస్తుంది. రాజులు మూర్ఖులు. వారికి పాలన పట్ల అవగాహన లేదు. ఆసక్తి లేదు. కేవలం ప్రజలు ‘రాజు’ అన్నారు కాబట్టి వారు సింహాసనంపై కూర్చుంటున్నారు తప్ప వారికి పాలన పట్ల ఎలాంటి ఆసక్తి లేదు. మూర్ఖుల చుట్టూ చేరిన దుష్టశక్తులకు రాజ్యాన్ని కొల్లగొట్టటం తప్ప భవిష్యత్తును గురించిన ఆలోచన ఉండదు. ఇదీ కశ్మీరం పరిస్థితి. తురుష్కులు సరిహద్దుల వద్ద పొంచి ఉన్నారనీ, రాజ్యంలో పలు మార్పులు జరుగుతున్నాయన్న గ్రహింపు లేని రాజులు కశ్మీరానికి కీలకమయిన సమయంలో రావటం కశ్మీరం దురదృష్టం.
జస్యకుడి తరువాత శ్రీ జగదేవుడు రాజ్యానికి వచ్చాడు. ఇతడు జస్యకుడి కొడుకు. కొన్ని కశ్మీర చరిత్ర పుస్తకాలలో జగదేవుడిని జయదేవుడని పేర్కొన్నారు. కానీ పరిష్కృతమైన రెండు జోనరాజ రాజతరంగిణి ప్రతులలో కూడా శ్రీ జగదేవుడనే ఉంది. కాబట్టి జయదేవుడు అన్నది పొరపాటు. జగదేవుడు శక్తిమంతుడు. కానీ ఎలాంటి అహంకారం లేనివాడు. కశ్మీరు ప్రజలకు మధుమాసం లాంటి వాడు. ప్రజలకు సంతోషం కలిగించాడు. అతడు తన ప్రజలందరినీ సమానంగా చూశాడు. సేవకుల నడుమ ఎలాంటి తేడాలు చూపలేదు. సాయంకాలంలో నీలికలువ అయినా, శ్వేతకలువ అయినా ఒకే రంగులో కనబడ్డట్టు సేవకుల నడుమ ఎలాంటి స్పర్ధలున్నా రాజు పట్టించుకోలేదు. అందరినీ సమానంగా చూశాడు. అతడు శాస్త్ర విజ్ఞానంలో నిష్ణాతుడు. ఒక నిపుణుడైన శస్త్రచికిత్సకారుడు, ఎలాగయితే శరీరం లోతుకు దిగిన బాణాన్ని చాకచక్యంగా శస్త్రచికిత్స చేసి తొలగిస్తాడో, అలాగ కశ్మీరంలో ఉన్న దుర్వ్యవస్థలను జగదేవుడు తొలగించివేశాడు. అతడు దూసుకుపోయే బాణం లాంటి వాడు. ప్రజల మెదళ్ళలోకి అతని పద్ధతులు, గుణగణాలు దూసుకుపోయాయి.
అయితే దుష్ట వ్యవహారాలకు అలవాటు పడ్డవారు, తమ పనులకు అడ్డువచ్చేవారిని సహించలేరు, భరించలేరు. రాజు దేశంలోని దుర్వ్యవస్థలను తొలగించి దేశాన్ని సన్మార్గంలో ప్రయాణింప చేయటం కొందరు దుష్ట మంత్రులకు నచ్చలేదు. వారు కలసికట్టుగా రాజు దేశం విడిచి వెళ్ళే పరిస్థితులు కల్పించారు. ప్రజలందరి మెప్పు పొందిన రాజు దేశం విడిచి వెళ్ళాల్సి వచ్చింది. అయితే, అడవిలో, వనవాసంలో, రాముడు – హనుమంతుడు, సుగ్రీవుడు వంటి వానరులతో చెలిమి చేసినట్టు, అతని మంత్రి గుణ రాహులుడిని రాజు గౌరవించాడు. జగదేవుడు రాజ్యం విడిచి వెళ్ళిన తరువాత గుణ రాహులుడు కూడా కశ్మీరం వదిలి రాజును అనుసరించాడు. వీరిద్దరూ మళ్ళీ రాజ్యాధికారం సంపాదించవచ్చని నమ్మినవారు. దాంతో సూర్యచంద్రుళ్ళలా వారు మళ్ళీ కశ్మీరంలో ప్రవేశించారు. ప్రజలు వారిని చూసి విస్మయం చెందారు.
చిరం భుక్తాం శ్రియం త్యక్తుమనీషాః సమరోద్యతాః।
తన్మన్త్రీ జోహులాశాన్తః ప్రాపుః శలభతాంద్విషః॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 71)
రాజు, అతడికి విధేయుడైన మంత్రితో తిరిగి కశ్మీరంలో అడుగుపెట్టటం దుష్ట వ్యాపారాలకు అలవాటు పడి రాజును కశ్మీరం నుండి తరిమివేసిన మంత్రులకు మింగుడు పడలేదు. తమ దుష్ట చర్యలు అప్రతిహతంగా కొనసాగించాలన్న లక్ష్యంతో వారు రాజుతో యుద్ధానికి సిద్ధం అయ్యారు. కానీ రాజు, అతని మంత్రుల శక్తియుక్తుల ముందు వారు అగ్నిలో దూకే శలభాల్లా మాడి మసయిపోయారు.
సాధారణంగా ఏదైనా కార్యం ద్వారా లబ్ధి పొందుతున్న వారు తమకు లాభకరమైన పరిస్థితులు మారేందుకు ఇష్టపడరు. వీలయినంత వరకూ తమకు లాభకరమైన పరిస్థితులే కొనసాగాలని అనుకుంటారు. అందుకు ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగానే వారు రాజును కశ్మీరం నుంచి తరిమివేశారు. ఎందుకంటే, రాజు అవినీతిని అరికట్టాడు. అణచివేతలను అడ్డుకొన్నాడు. ఇది నచ్చని మంత్రులంతా ఏకమై రాజును తరిమివేశారు. మళ్ళీ ఆ రాజు కశ్మీరంపై అధికారం కోసం వస్తుంటే వారు ప్రతిఘటించారు. వ్యతిరేకించారు. యుద్ధానికి సిద్ధం అయ్యారు. కానీ రాజు శక్తియుక్తుల ముందు వారు నిలవలేకపోయారు.
ఇది ఏ సమాజంలోనయినా జరిగేదే. ఆధునిక సమాజంలో మరింత స్పష్టంగా చూస్తున్నాం. తమ వ్యాపారానికి అనుమతివ్వని, అడ్డుపడే ఇతర దేశాల నేతలను అగ్రరాజ్యాలు అధికారంనుంచి తొలగించి, తమ మాట వినే వాడికి అధికారం కట్టబెట్టటం మనకు తెలుసు. అవసరమైతే అందుకోసం యుద్ధం చేసి, ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసేందుకు కూడా అగ్రరాజ్యాలు వెనుకంజ వేయకపోవటం మన కళ్ళ ముందే జరుగుతోంది. కాబట్టి, రాజ్యాధికారం సాధించటం కోసం జగదేవుడు, తమ అధికారం కొనసాగించేందుకు దుష్ట మంత్రులు తలపడటం స్వాభావికమే! కానీ తరచూ ఇలాంటి యుద్ధాలు సంభవించటం వల్ల కష్ట పడేది ప్రజలు, నష్టపోయినది భావితరాలు!
తమను వ్యతిరేకించే వారిని ఓడించి జగదేవుడు కశ్మీరు రాజయ్యాడు. అదృష్టాన్ని అనుభవించాడు. సింహాసనంపై కూర్చుండి అధికార ఛత్రం క్రింద చామరాలు వీస్తుండగా సకల భోగాలు అనుభవించాడు జగదేవుడు. అలాంటి రాజచిహ్నాలు లేకున్నా గుణ రాహులుడు రాజు అనుభవిస్తున్న ఐశ్వర్యం అనుభవించాడు. ధార్మికుడైన రాజు ‘రజ్జుపురం’లో ఒక అద్భుతమైన మందిరం కట్టించాడు. మందిరంలో దైవానికి వెండి ఛత్రాన్ని ఏర్పాటు చేశాడు.
ద్వారాధిపతి అయిన పద్ముడు నెమ్మదిగా జగదేవుడికి సన్నిహితుడయ్యాడు. రాజు జగదేవుడు, పద్ముడిని విశ్వసించాడు. కానీ రాజుతో స్నేహం నటిస్తూనే పద్ముడు రాజుకు రోజూ కాస్త విషం ఇస్తూ, రాజు మరణానికి కారకుడయ్యాడు. పధ్నాలుగేళ్ళ, ఆరు నెలల, మూడు రోజులు కశ్మీరాన్ని జనరంజకంగా పాలించిన జగదేవుడు మరణించాడు. క్రీ.శ. 1198 నుండి 1213 వరకూ కశ్మీరాన్ని పాలించాడు జగదేవుడు.
తండ్రి విషప్రయోగంతో మరణించటం తెలుసుకున్న రాజదేవుడు ప్రాణ భయంతో ‘కాష్టవాత’ ప్రాంతానికి పారిపోయాడు. కానీ పద్ముడి శత్రువులు రాజదేవుడిని పట్టుకుని కశ్మీరానికి తీసుకువచ్చారు. రాజదేవుడు తన సమర్థకులతో సల్హణ కోటలోకి అడుగుతుపెడుతున్న సమయంలో అతడికి ఆహ్వానం పలికేందుకు వస్తున్నట్టు నటించాడు పద్ముడు. అతని సేనలు జగదేవుడిని చుట్టుముట్టాయి.
జగదేవుడిని చూడటానికి పద్ముడు తయారవుతుంటే, అతనికి చక్కని చెప్పులు బహుమతిగా ఇచ్చారెవరో. వాటిని చూసి సంతోషించిన పద్ముడు, అప్పటి వరకూ తీసుకుంటున్న జాగ్రత్తలు వదిలి, చెప్పులు వేసుకునేందుకు సిద్ధమయ్యాడు. అదే అదనుగా భావించిన ‘చండాలుడు’, ద్వారాధిపతిపై దాడి చేసి చంపేశాడు. దాంతో భట్టు బ్రాహ్మణులు రాజదేవుడిని రాజుగా ప్రకటించారు. మంగళ వాయిద్యాలతో అతడికి రాజ్యాభిషేకం చేశారు. సామంతులంతా నూతన రాజుకు ప్రణమిల్లారు. జయజయధ్వానాలు చేశారు. తనకు విధేయులుగా ఉన్న వారందరిపై వరాల జల్లు కురిపించాడు రాజదేవుడు. రాజ్యభారాన్ని, బాధ్యతలను తనకు విధేయులుగా ఉన్న వారందరికీ సమానంగా పంచాడు రాజదేవుడు. గతంలో ఎలా కొనసాగిందో, అలాగే కొనసాగించాడు. లావణ్యకులతో కలిసి, సన్నిహితులైన బంధువులతో పని చేసినట్టు పని చేశాడు రాజదేవుడు. వేరేవారి శక్తి ఆధారంగా అధికారాన్ని సంపాదించిన వారు ఎప్పటికీ బలహీనులే. తనకు రాజ్యాధికారం దక్కేందుకు సహాయపడ్డ శక్తిమంతులందరికీ అతను కృతజ్ఞత చూపిస్తూ అణిగిమణిగి ఉండాలి. వారు ఎలాంటి అన్యాయం చేసినా నోరు విప్పకూడదు. ‘ఇదేంట’ని అడగకూడదు.
‘లహర’ అధికారి, శక్తివంతుడైన బలాఢ్య చంద్రుడు శ్రీనగరంలో సగం భాగంపై అధికారం చలాయించసాగాడు. అతడిని ఏమీ అనలేని అశక్తుడయ్యాడు రాజు రాజదేవుడు. బలాఢ్య చంద్రుడు శ్రీనగరం మధ్యలో ఒక పెద్ద మఠాన్ని నిర్మింపచేశాడు. ఆ మఠానికి తన పేరు పెట్టుకున్నాడు. అందరితో అణుకువగా ఉంటూ, భయభక్తులతో వ్యవహరిస్తున్న రాజు ఓ రోజు ‘భట్టు’లను అవమానించాడు. అవమాన భారంతో క్రుంగిన భట్టులు రాజుపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. వారు ‘ఖాసా’ జాతిలో రాజయ్యే అర్హతలున్న వారి కోసం వెతకటం ఆరంభించారు. అర్హుడయిన వాడు లభిస్తే వాడిని కశ్మీర రాజుగా నిలపాలన్నది వారి ఆలోచన. అంటే, అంత బలహీనుడిగా కశ్మీర రాజు ఆ కాలంలో ప్రజలకు అర్థమయ్యాడన్న మాట. తమకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు భట్టులు రాజద్రోహానికి కూడా సిద్ధమయ్యారు.
న భట్టోహం న భట్టోహం న భట్టోహమిదం వచః।
అశ్రూయతాపి భట్టేభ్యో నిర్దిష్టే భట్టలుంఠనే॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 84)
భట్టుల రాజద్రోహాన్ని శిక్షించాలని రాజదేవుడు నిర్ణయించాడు. భట్టులను వెతికి వెతికి హింసించటం మొదలుపెట్టాడు. వారి ఆస్తులను దోచుకుని, చంపేయమని ఆజ్ఞలు జారీ చేశాడు. దాంతో రాజభటుల నుంచి తప్పించుకోవటం కోసం ‘నేను భట్టును కాను’, ‘నేను భట్టును కాను’ అని అరుస్తూ భట్టులు తప్పించుకోవాలని ప్రయత్నించారు. జోనరాజు వర్ణించిన విషయాలను గమనిస్తే, కశ్మీరంలో మారుతున్న బ్రాహ్మణుల ప్రవర్తన వ్యక్తిత్వాలను అంచనా వేసే వీలు చిక్కుతుంది. అలాగే, సమాజంలో బ్రాహ్మణుడయినంత మాత్రాన నేరంచేస్తే, అధర్మానికి ఒడిగడితే, గతంలోలా సమాజం సహించటంలేదనీ అర్ధమవుతుంది. బ్రాహ్మణుడు అధర్మానికి పాల్పడితే దైవం రోగాలతో శిక్షించటాన్ని చూపాడు జోనరాజు. అలాగే, రాజు అవమానించాడని, వ్యక్తిగత అవమానానికి దేశాన్ని అల్లకల్లోలంచేసే రీతిలో ప్రతీకారం తీర్చుకోవాలని రాజద్రోహానికి సిద్ధమయితే, రాజు ఎట్టి పరిస్థితుల్లో క్షమించి వదిలేది లేదనీ తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే కొందరు వ్యాఖ్యానిస్తున్నంత గాఉరవాన్నీ, అగ్ర స్థానన్ని బ్రాహ్మణ సమాజం అనుభవించినట్టు అనిపించదు. హర్షుడి కాలానికే దిగజారుడు తనం కనిపిస్తుంది. పలు సందర్భాలలో కల్‌హణుడు బ్రాహ్మణ సమాజన్ని విమర్శించటం, వారి చర్యలపట్ల నిరసనను ప్రదర్శించటం కనిపిస్తుంది. ఈ సందర్భంలో నేను భట్టును కాను అని ప్రకటిస్తూ రాజు ఆగ్రహాగ్నినుంచి తప్పించుకోవాలని ప్రయత్నించటం కనిపిస్తుంది.
ఇదేమీ పట్టించుకోని రాజు రాజపురి, రాజలోకాలను నిర్మించాడు. 23 ఏళ్ళ, 3 నెలల 27 రోజులు కశ్మీరాన్ని పాలించిన తరువాత రాజదేవుడు మరణించాడు. రాజదేవుడి పాలనా కాలం క్రీ.శ. 1213 నుండి 1236 వరకూ.
(ఇంకా ఉంది)