Site icon Sanchika

జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-62

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

నాజిగీషత్ స తేజస్వీ శత్రూన్ విభవతృష్ణయా।
హరిర్మాం సాదిలోభేన హినస్తి నహి హస్తినః॥
(జోనరాజ రాజతరంగిణి 780)

జైనులాభదీనుడి గుణగణాలను వివరించటం కొనసాగిస్తున్నాడు జోనరాజు. జైనులాభదీనుడిని ఎంత పొగిడినా జోనరాజుకే కాదు, జోనరాజు తరువాత రాజతరంగిణిని కొనసాగించిన శ్రీవరుడికి కూడా సంతృప్తి కలిగినట్టులేదు. ఎందుకంటే, ఇస్లాంమయం అయిన కశ్మీరంలోకి , మళ్ళీ,  కశ్మీరు అసలు ప్రజలయిన సనాతన ధర్మానుయాయులను రప్పించి, కశ్మీరును వారికి నివాసయోగ్యంగా మలచిన మహాద్భుతమైన కార్యాన్ని నిర్వహించాడు జైనులాభదీనుడు.

ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే, ఇలాంటి ఘనకార్యం సాధించిన మరో రాజు ఏ దేశ చరిత్రలో, ఏ నాగరికతలో కనిపించడు. తమ జన్మస్థలం నుంచి పూర్తిగా బహిష్కృతులయిన వారిని మళ్ళీ రప్పించి వారికి భద్రత కల్పించటమనే అపూర్వము, అసంభవమూ అయిన పనిని సంభవం చేసినవాడు జైనులాభదీనుడు. అందుకే ఆనాడు జోనరాజు, శ్రీవరులకే కాదు ఈనాడు కూడా జైనులాభదీనుడిని ఎంత పొగిడినా సంతృప్తి కలగదు.

తమ దేశం నుంచి దైవశాపం వలన వెడల నడిచిన యూదులు మళ్ళీ తమ స్వదేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ దాని కోసం ఇంకా వారు నిరంతరం యుద్ధం కోసం సంసిద్ధంగా ఉండాల్సి వస్తోంది. చుట్టూ తమని కబళించేందుకు సిద్ధంగా ఉన్న శత్రుదేశాల నుంచి నిరంతరం రక్షించుకుంటూండాల్సి వస్తోంది. కానీ కశ్మీరంలో ఒక్క వ్యక్తి,  తన శక్తితో,  కబళించేందుకు సిద్ధంగా ఉన్నవారందరినీ అదుపులో పెట్టి పండితులకు నివాసం కల్పించాడు. ఇది ఒక అపురూపమైన సంఘటన మానవ చరిత్రలో. అందుకే జోనరాజు శ్లోకం శ్లోకంలో జైనులాభదీనుడి గుణగుణాలు పొగుడుతూనే ఉన్నాడు. వర్ణిస్తూ పరవశిస్తూన్నాడు. జైనులాభదీనుడిని పొగడటం ద్వారా ఇతర రాజులను విమర్శిస్తున్నాడు.

జైనులాభదీనుడు బాహ్య శత్రువులనే కాదు, అంతఃశత్రువులను కూడా జయించాడు. స్వతహాగా శక్తిమంతుడు, వీరుడు అయి ఉండి కుడా జైనులాభదీనుడు అవసరమైనప్పుడు తప్ప యుద్ధానికి సిద్ధమవలేదు. శక్తిమంతుడైన శత్రువు ఎదురుపడినప్పుడే యుద్ధం చేశాడు తప్ప పైశాచిక ఆనందం కోసమో, తన గొప్పను నిరూపించుకోవటం కోసమో యుద్ధాలు చేయలేదు. జైనులాభదీనుడి ఈ లక్షణాన్ని చక్కగా వర్ణించాడు జోనరాజు.

ఆకాశంలో నక్షత్రాలు, చంద్రుడు వంటి వారిని జయించేందుకు మాత్రమే సూర్యుడు ప్రకటితమవుతాడు. అలాగే, సరయిన శత్రువు ఉంటేనే జైనులాభదీనుడు యుద్ధం చేసేవాడు. చాలా ప్రధానమైన లక్షణం ఇది. ఎవరివరి పైననో ఆధిక్యం నెరపాలని, తన ఆధిక్యం చూపించుకోవాలని యుద్ధం చేయటం ‘రాజసం’ కాదు. అవసరమున్నప్పుడే బల ప్రదర్శన చేయటం వాంఛనీయం. కానీ పలు సుల్తానులు కేవలం పొరుగు రాజు తమ మతం వాడు కాదన్న నెపం మీద శత్రుత్వం నెరపుతారు. జైనులాభదీనుడు అలాంటి వాడు కాదు.

‘పొరుగు రాజు ధనాన్ని కాజేయాలన్న ఆశతో జైనులాభదీనుడు ఏ రాజుతో యుద్ధం చేయలేద’ని అంటాడు జోనరాజు. ఎలాగయితే సింహం మాంసం కోసం ఏనుగులపై దాడి చేసి చంపదో, అలాగ ఐశ్వర్యం కోరి జైనులాభదీనుడు యుద్ధం చేయలేదంటాడు జోనరాజు. ఇది ఇతర సుల్తానులపై అతి సున్నితమైన విసురు.

ఘజనీ, ఘోరీ లాంటి వారు భారతదేశంపై దాడులు చేయటం వారి రాజ్యవిస్తరణ కాంక్ష కన్నా మత ప్రచార లక్ష్యం, ఐశ్వర్యాన్ని దోచుకుని తరలించుకుపోవటం కోసమేనన్నది అందరికీ తెలిసిన విషయం.

ఒక్క భీమ్ కోట లోనే గజని దోచుకున్న ధనం వివరాలు తెలుసుకుంటే కళ్ళు తిరుగుతాయి. ఫరిస్తా ప్రకారం, “In Bheem were found 700,000 golden dinars, 700 muns of gold and silver plate, 200 muns of pure gold in ingots, 2000 muns of silver bullion, and twenty muns of various jewels, including pearls, corals, diamonds, and rubies, which had been collected since the time of Bheem, details of which would be tedious.”

ఒక్క కోటలోనే ఇంత ఐశ్వర్యం లభించి ఉంటే, ఇక కొల్లగొట్టిన మందిరాలు, వాటిలో లభించిన ధనం గురించి వివరాలు ఊహకి మించినవి. ఒక్క మధురను కొల్లగొట్టటం ద్వారా సుల్తాన్‍కు లభించిన ధనం వివరాల ఆశ్చర్యం కలిగిస్తాయి. ఫరిస్తా ప్రకారం,  “Among the temples at Mutra were found five golden idols, whose eyes were of rubies, valued at 50,000 deenars. On another idol was found a sapphire, weighing 400 miskals, and the image itself, being melted down, produced 98,300 miskals of pure gold; besides these images there were above 100 idols of silver, which loaded as many camels.” మధుర లోని గుళ్ళలోని కొన్ని విగ్రహాల ద్వారా లభించిన ఐశ్వర్యం వర్ణన ఇది. అయితే ఈ దాడులన్నీ రాజ్య విస్తరణ కాంక్షతో జరగలేదు. కేవలం ఐశ్వర్య లాలసతో జరిగాయి. మత విస్తరణ కాంక్షతో జరిగాయి. అందుకే గెలిచిన ప్రజల మతం మార్చారు. కొల్లగొట్టిన ఐశ్వర్యాన్ని తమ దేశానికి తరలించారు. ప్రజలను బానిసలుగా తమ దేశం తీసుకుపోయారు. అంతెందుకు భారతదేశంలో కొల్లగొట్టిన ధనం, బానిసలుగా తీసుకువెళ్ళిన ప్రజల వల్ల గజనీ ఐశ్వర్యవంతమైన భారతదేశపు నగరంలా భాసిల్లింది అని ఫరిస్తా అనటమే ఆనాటి భారత ఐశ్వర్యం, సుల్తానుల దాడుల వెనుక దాగిన ఐశ్వర్య లాలసలు స్పష్టం చేస్తాయి. “he returned peacefully to Ghizny. On this occasion, the Mahomedan army brought to Ghizny 200,000 captives, and much wealth, so that the capital appeared like an Indian city, no soldier of the camp being without wealth, or without many slaves.”

జైనులాభదీనుడి గుణగణాలు వర్ణిస్తూ, అతడిని ఇతర సుల్తానులతో వేరు చేసి చూపటమే కాదు, అతి సున్నితంగా వారి ప్రవర్తనపై విసురు విసిరాడన్న మాట జోనరాజు, ‘సింహం ఏనుగును మాంసం కోసం చంపదు’ అంటూ. ఇది ఐశ్వర్యంపై వ్యామోహంతో ఒక పరమాద్భుతమైన నాగరికతపై దాడి చేసి ధ్వంసం చేసే రాక్షసత్వంపై కవి విసిరిన విసురు. దోపిడీకి గురైన వారి పక్షం, అణచివేతకు గురైన వారి పక్షం, అన్యాయాల్ని అనుభవిస్తున్న వారి పక్షానే కవులు ఉండాలని కడివెడు కన్నీరు గుప్పిస్తూ బండెడు కవితలు ఎడా పెడా రాసే సాహిత్యకారులకు చరిత్రలో ఈ దోపిడీ, అణచివేత, అన్యాయాలు కనబడకపోవటాన్ని ఊహించి, భవిష్యత్తు తరాల కోసం జోనరాజు ఆనాడే సున్నితంగా ఎత్తి చూపించిన చేదు నిజాలు ఈ వర్ణనలు అనిపిస్తుంది. జైనులాభదీనుడిని ఇతర సుల్తానులతో పోల్చటం వల్ల జైనులాభదీనుడి గొప్పతనం చెప్తున్నట్టే కాదు, ఇతర సుల్తానుల అనౌచిత్య, అన్యాయపు ప్రవర్తనను ఎత్తి చూపిస్తున్నట్లవుతోంది.

కొండ ప్రాంతాలలోని శత్రువులను అయిదు అగ్నుల ద్వారా పరిశుద్ధులను చేశాడు జైనులాభదీనుడు. అగ్ని, కార్చిచ్చు, రాజు శౌర్యాగ్ని, దుఃఖాగ్ని, ప్రాయశ్చిత్తాగ్ని అనే అయిదు అగ్నుల ద్వారా శత్రువులను శుద్ధులను చేశాడు సుల్తాను. పూర్ణచంద్రుడయినా, రాత్రి మాత్రమే చంద్రుడు ఉదయించేట్టు ఎంత శక్తిమంతుడయినా జైనులాభదీనుడు నియమ నిబంధనలను ఉల్లంఘించలేదు.

గర్వం ప్రవృద్ధా వాస్తవ్యా హీనా మైవ క్షయం గమన్।
ఇతి నీతివిదా రాజ్ఞా తేభ్యో బలిరగృహ్యత్॥
(జోనరాజ రాజతరంగిణి 783)

నీతివిదుడైన రాజు, బలవంతుల గర్వం హెచ్చకుండా, బలహీనులకు కష్టం, నష్టం సంభవించకుండా పన్నులు విధించేవాడు.

ఇది కూడా గత సుల్తానులపై విసురు. ఆరంభంలోనే జైనులాభదీనుడు తన ప్రజలందరినీ సమానంగా చూశాడు, సమతౌల్యం తప్పనీయలేదు అని చెప్తాడు. దాన్ని ఇప్పుడు మరింత స్పష్టం చేస్తున్నాడు. జైనులాభదీనుడి కన్నా ముందరి సుల్తానులు తమ మతం వారికి ఒక న్యాయం, పరాయి మతం వారికి ఒక న్యాయాన్ని వర్తింపజేశారు. ఇస్లామేతరులపై పన్నుల భారం వేశారు. పన్నులను పెంచుతూ పోయారు. పన్నులు కట్టలేని వారి ఆస్తులను కాజేశారు. వారికి మతం మారటం తప్ప మరో మార్గం లేని పరిస్థితులు కల్పించారు. ఇస్లామీయుడు నేరం చేయలేడు. ఏం చేసినా నేరం కాదు. ఇస్లామేతరులు బ్రతకటమే నేరం అన్నట్లు ప్రవర్తించారు. దాంతో ఇస్లామీయుల అహానికి అంతు ఉండేది కాదు. ఇతరులకు బ్రతుకు దుర్భరమయ్యేది. ఇందుకు భిన్నంగా జైనులాభదీనుడు ఐశ్వర్యవంతుల గర్వం పెరగకుండా, పేదవారు నాశనం అవకుండా విచక్షణతో పన్నులు విధించాడు.

పలువురు వ్యాఖ్యాతలు ఈ శ్లోకం ఆధారంగా, జైనులాభదీనుడు ‘జిజియా’ పన్ను తొలగించాడు అని రాశారు. కానీ జైనులాభదీనుడు కనుక జిజియా పన్నును పూర్తిగా తొలగిస్తే విప్లవాన్ని ఎదుర్కోవలసి వచ్చేది. అందుకని ‘జిజియా’ పన్నును గణనీయంగా తగ్గించాడు తప్ప, పూర్తిగా రద్దు చేయలేదు. గతంలో మూడు ‘పాలలు’ ఉండే జిజియాను ఒక ‘మాసా’కు తగ్గించాడని పర్షియన్ రచయితల ద్వారా తెలుస్తుంది.

‘ఐన్-ఎ-అక్బారీ’ ప్రకారం ఒక ‘పాల’ అంటే నాలుగు తులాలు. కశ్మీరీ పద్ధతి ప్రకారం ఒక తుల 16 ‘మాసా’ లకు సమానం. కాబట్టి 3 పాలలు 12 తులాలతో సమానం,  12 తులాలు 192 మాసాలతో సమానం. అంటే, 192 మాసాలు ఉండే పన్నును ఒక్క మాసాకు తగ్గించాడన్న మాట జైనులాభదీనుడు. ఇస్లామేతరుడిగా కశ్మీరులో జీవిస్తున్నందుకు విధించే ఈ పన్నును దాదాపుగా మృగ్యం చేశాడనవచ్చు. అందుకే జైనులాభదీనుడిని ఎంతగా పొగిడినా సరిపోదు. పర్షియన్ రచయితలు అందుకే జోనరాజు జైనులాభదీనుడి ఒక పార్శ్వాన్ని చూపించాడని నిరసన వ్యక్తం చేశారు. ‘హస్ కస్ రా చా దిని ఖ్వాద్ ఇఖ్తియార్ దాదా’ [తారీఖ్-ఇ-సయ్యద్ అలీ].

సుల్తాన్ ఖ్యాతి దిగంతాల వరకూ ఎంతగా వ్యాపించిందంటే, అతడి శత్రువుల ఖ్యాతి, అదృష్టాలు, జైనులాభదీనుడి శౌర్యాగ్నిని మరింతగా ప్రజ్వలింప చేసి అందులో దగ్ధమైపోయాయి.

ఢిల్లీశ పీడితం జాతు జస్త్రయం శరణాగతమ్।
ద్రోణీ గుహసు సోరక్షత తమోద్రిరివ సో భాస్కరాత్॥
(జోనరాజ రాజతరంగిణి 785)

ఢిల్లీ సుల్తాన్ బాధ నుంచి తప్పించుకునేందుకు జస్రధ్ సుల్తాన్ జైనులాభదీనుడిని శరణు వేడాడు. గుహలలోని చీకటిని పర్వతాలు కాపాడినట్లు జస్రధుడిని సుల్తాన్ సంరక్షించాడు.

జోనరాజు  వాడిన ఉపమానం గమనించదగ్గది.  ‘గుహల లోని చీకటిని పర్వతాలు కాపాడినట్టు’. పర్వతం జైనులాబిదీన్; గుహ లోని చీకటి జస్రధుడు. చీకటి దౌష్ట్యానికి ప్రతీక. ఆ చీకటిని పర్వతం కాపాడుతోంది. ప్రతీకల ప్రకారం చీకటి చెడుకు ప్రతీక. అంత ఉత్తముడైన జైనులాభదీనుడు చీకటిని ఎందుకుకాపాడతాడు?

సింహాసనాన్ని అధిష్టించటంలో జైనులాభదీనుడికి సహాయపడ్డారు ఖుఖర్లు. వీరి నాయకుడు జస్రధుడు. అతడి పూర్తి పేరు మాలిక్ జస్రధ్. ఈయన జైనులాభదీనుడికి ఆశ్రయం ఇచ్చి, అప్పటి సుల్తాన్ ‘అల్లీ షాహ’ ఆగ్రహానికి గురయ్యాడు. అయితే ఖుఖర్లు వీరులు మాత్రమే కాదు, వారికి నాశనం చేయటం, కొల్లగొట్టటం అలవాటు. అదొక ఆట. ఇది కశ్మీరు ప్రజల శాంతికి భంగం కలిగిస్తుంది. అందుకని వారిని అదుపులో పెట్టాల్సి ఉంటుంది. దీనికి తోడు ‘అల్లీ షాహ’కు తన కూతురిని ఇచ్చిన జమ్ము రాజు ‘రాజా భీమదేవుడు’ తన అల్లుడి సింహాసనాన్ని ఆక్రమించిన జైనులాభదీనుడిపై కక్ష కట్టాడు. అతడికి ఖుఖర్లకు నడుమ ఎప్పటి నుండో వైరం. అందుకని భీమదేవుడి అడ్డు తొలగితే కానీ ఖుఖర్లని అణచటానికి వీలు లేదు. అయితే జైనులాభదీనుడికి కాలం అనుకూలంగా మారింది.

తన శక్తి పట్ల అమిత విశ్వాసం కల మాలిక్ జస్రధ్ దృష్టి ఢిల్లీ సింహాసనంపై పడింది. 1421లో ఖిజ్ర్‌ఖాన్ మరణంతో  జస్రధ్ ఆశలు చిగురించాయి. అప్పటికి తైమూర్, ఖిజ్ర్‌ఖాన్‍ను ‘ముల్తాన్’ అధికారిగా నియమించి వెళ్ళీపోయాడు. కాలక్రమేణ ఖిజ్ర్‌ఖాన్ ఢిల్లీపై అధికారం సాధించాడు. జస్రధ్ దృష్టి ఢిల్లీపై ఉందని గ్రహించిన జైనులాభదీనుడు అతనిని ప్రోత్సహించాడు. తన సైన్యంలో కొందరు వీరులను అతడికి అప్పగించాడు. దాంతో జస్రధ్ ఢిల్లీపై దాడికి వెళ్ళాడు. సయ్యద్ ముబారక్ షా II (1421-33)తో, సయ్యద్ ముహమ్మద్ షాహ (1433-43) లతో తలపడ్డాడు. జస్రధ్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు జమ్మూ రాజు భీమదేవుడు సుల్తాన్ సయ్యద్ ముబారక్ షాహకు సహాయంగా వచ్చి జస్రధ్‍తో తలపడ్డాడు. ఈ సంకుల సమరంలో భీమదేవుడు మరణించాడు. అతని తరువాత అధికారం చేపట్టిన రాజు మాల్దిక్ జైనులాభదీనుడితో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. తన కూతురిని జైనులాభదీనుడికి ఇచ్చి వివాహం చేశాడు.

అంటే, ఒక్క దెబ్బతో జైనులాభదీన్ అన్ని తలనొప్పులను వదిలించుకున్నాడన్న మాట. జస్రధుడు ఢిల్లీ సుల్తానులతో పోరులో తలమునకలై ఉన్నాడు. దాంతో కశ్మీరుకు ఖుఖర్ల బెడద వదిలింది. రాజా భీమ్‌దేవ్ బెడద తొలగిపోయింది. జమ్మూ కశ్మీరులకు స్నేహ సంబంధాలు బలవత్తరమయ్యాయి. ఈ సందర్భంగా కశ్మీరులో ప్రచారంలో ఉన్న రెండు సామెతలను స్మరించుకోవాల్సి ఉంటుంది. ‘లోగ్ నమ్ ఘా కుర్’, ‘ఖుఖర్ చుస్ లోగ్ మత్’. జలగలా పట్టి పీడిస్తారు, ఖుఖర్‍లలా పట్టి వ్రేలాడుతూ చిరాకు కలిగిస్తారు. జైనులాబిదీన్‍కు సహాయం చేసి, అతడిని పట్టుకుని వ్రేలాడుతూ జలగలా చిరాకు పెట్టిన ‘ఖుఖర్’ల ఆధారంగా ఈ రెండు సామెతలు ఉద్భవించాయని అంటారు. వీరిని జైనులాబిదీన్ తెలివిగా వదుల్చుకున్నాడు. ఢిల్లీ సుల్తానుల చేతుల్లో చావుదెబ్బలు తిన్న జస్రధుడికి జైనులాభదీనుడు చీకటిని పర్వతం రక్షించినట్టు శరణు ఇచ్చి కాపాడాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version