Site icon Sanchika

జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-63

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

తస్య దాక్షిణ్యదక్షస్య ప్రజానాం హితహేతునా।
పుత్రే మంత్రిణి మిత్రే వా దృష్టే నాలక్ష్యత క్షమా॥
(జోనరాజ రాజతరంగిణి 794)

[dropcap]జై[/dropcap]నులాబిదీన్ పాలనా కాలంలో కశ్మీరు ఎలా మారిందో కొన్ని సంఘటనల ద్వారా వివరించాడు జోనరాజు. ఈ సంఘటనలు జైనులాబిదీన్ వ్యవహార దక్షతకు, నిష్పాక్షికంగా చట్టాన్ని అందరికీ సమానంగా అమలు పరచటమూ వంటి విషయాలకు ఉదాహరణలుగా నిలుస్తాయి.

ఆ కాలంలో జయపీడా పురంలో ఓ బ్రాహ్మణుడు నివసిస్తుండేవాడు. అతడి వద్ద కామధేను లాంటి గోవు ఉండేది. ఒక రోజు ఆ ఆవు తిండిని వెతుక్కుంటునో, విధివశాత్తో ఆ బ్రాహ్మణుడిని వదిలి వెళ్ళిపోయిది. ఆ బ్రాహ్మణుడు గోవును వెతుక్కుంటూ వెళ్ళాడు. అలా మాధవ రాజ్యం చేరాడు. అక్కడ గుడి పుష్కరిణిలో స్నానం చేస్తున్న సమయంలో అతడికి ఆవు కనిపించింది. దాని లక్షణాలను బట్టి తన ఆవుగానే గుర్తించాడు. సాయంత్రం ఆ ఆవు ఇంటికి వెళ్తుంటే దాన్ని అనుసరించాడు. ఆ ఆవు ఎవరి ఇంట్లో ఉన్నదో ఆ యజమానిని కలిసి తన ఆవును తనకు ఇచ్చేయమన్నాడు. ఇద్దరి మధ్య వాదన జరిగింది. వాదన కొట్లాటగా పరిణమించింది. చివరికి వివాదం సుల్తానును చేరింది. వారిద్దరి వాదనలను సంపూర్ణంగా విన్నాడు సుల్తాను. పుట్టినప్పటి నుంచి  బ్రాహ్మణుడి ఇంట్లో ఆవు పెరిగిన విధానం అలవాట్లు విన్నాడు. కొత్త యజమాని ఇంట్లో అది నివసిస్తున్న విధానం విన్నాడు. ఆ ఆవు, దాని పిల్లల ముందు నీటిలో నానబెట్టిన గింజలను విసిరాడు. ఆవు పిల్లలకు ఆ గింజలను తినటం అలవాటు లేనందున, అవి ఆ గింజల వైపు చూల్ేదు. కానీ తల్లి ఆవు బ్రాహ్మణుడి దగ్గర ఉన్నప్పుడు, బాల్యంలో ఆ గింజలను తిన్నది. దానికి ఆ గింజలు చూడగానే బాల్యం అలవాటు జ్ఞాపకం వచ్చింది. వెంటనే వాటిని తినటం మొదలుపెట్టింది. దాంతో ఆ ఆవు ఎవరిదో అందరికీ అర్థమయింది. ఆవు తనదని వాదించిన వ్యక్తిని శిక్షించాడు రాజు. బ్రాహ్మణుడికి అతడి ఆవును ఇచ్చి పంపించాడు. ఈ వివాదాన్ని పరిష్కరించటంలో విఫలమైన వారంతా సుల్తాన్ తెలివిని పొగిడారు. ఇక్కడ పై వ్యాఖ్య చేశాడు జోనరాజు.

రాజు దయార్ద్ర హృదయుడే. కానీ ప్రజా సంక్షేమం, న్యాయం విషయంలో తన స్వంత కొడుకయినా, మంత్రి అయినా, స్నేహితుడయినా నేరం చేస్తే నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాడు అంటాడు జోనరాజు. నిజానికి ఇది ‘ప్రభువు’ అన్న ప్రతి ఒక్కడికీ ఉండాల్సిన లక్షణం. చిన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకూ నిష్పాక్షికంగా, నిర్మొహమాటంగా వ్యవహరించటం పాలకుడి లక్షణం. కానీ ఆ లక్షణాన్ని పాలకులు అరుదుగా ప్రదర్శిస్తుండటంతో, వాంఛనీయ లక్షణాన్ని ప్రదర్శించిన పాలకుడు ఉత్తముడిగా గుర్తింపు పొందుతాడు.

జైనులాబిదీన్ గొప్పతనాన్ని, నిష్పాక్షిక న్యాయ విధానాన్ని ప్రదర్శించటానికి జోనరాజు ఎంచుకున్న ఉదాహరణ, జోనరాజు ఉద్దేశాన్ని చెప్పకనే చెప్తుంది.

‘మేరష్కర’ అనే యవనుడు ఓ రోజు తాగిన మత్తులో అకారణంగా తన భార్యను వధించాడు. రాజు అతనికి మరణదండన విధించాడు. నిజానికి ‘మేరష్కర’ అనేవాడు రాజుకు అత్యంత ప్రీతిపాత్రుడు. కానీ నేరం చేసిన వాడిని క్షమించి వదలటం, ఇతరులను నేరం చేసేందుకు ప్రోత్సహించటమే అని నమ్మిన రాజు నేరస్థుడు ఎవరో పట్టించుకోకుండా, నేరాన్ని గ్రహించి, తగిన శిక్ష విధిస్తాడన్న మాట. అయితే, ఈ ఉదాహరణను జోనరాజు ప్రత్యేకంగా చెప్పటం ఎందుకంటే, ఇస్లామీయుల రాజ్యంలో ఇస్లాం మతస్తులు నేరం చేసినా, అన్య మతాలకు చెందిన నేరస్థులలా వారికి మరణ శిక్ష విధించటం కుదరదు. కానీ జైనులాబిదీన్ ఇస్లామీయులైనా, ఇతరులైనా నేరానికి తగిన  శిక్ష విధించాడన్న మాట. నేరస్థుడిని నేరస్థుడిలానే, మత రహితంగా చూసి, శిక్ష విధించేవాడన్న మాట.

అపరాధం వినా జాయం క్షీబో నిఘ్నన్ ప్రియోపి సన్।
మేరేష్కరోపి యవనో వధం భూపేన లంభితః॥
(జోనరాజ రాజతరంగిణి 795)

మిత్రుడు, మంత్రి, కుమారుడు అని చూడకుండా నేరానికి తగిన శిక్ష విధించి జైనులాబిదీనుడు ఇంద్రుడిలా శత్రువులను అవమానించేవాడు; యోగులను, విజ్ఞులను, పండితులను గౌరవించేవాడు. ఆయన శక్తిమంతుడు. విజ్ఞాన ఖని. అతనిలాంటి రాజు గతంలో ఎవ్వరూ లేరు అంటాడు జోనరాజు.

మదనుడు ప్రేమికులకు విరహవేదన కలిగిస్తాడు. కానీ రాజు విజ్ఞానవంతులను గౌరవించే మదనుడి లాంటి వాడు. ఈ శ్లోకంలో జోనరాజు ‘అపచితం’ అనే పదాన్ని రెండు సందర్భాలలో రెండు వేర్వేరు అర్థాన్నిచ్చేట్టు వాడాడు. మదనుడి సందర్భంలో వేదన అన్న అర్థంలో, రాజు సందర్భంలో ‘గౌరవం’ అన్న అర్థంలో వాడేడు.

ఎలాగయితే సముద్ర జలాలలో అమృతం, విషం రెండూ కలిసి ఉంటాయో, అలాగే జైనులాబిదీన్‍లో సౌమ్యత్వం, భీకరత్వం రెండూ కలగలిసి ఉన్నాయి.

చిరం స్థేయైరుపాత్తో అర్థప్రత్యర్థిభ్యాం ధనగ్రహః।
తేన ధర్మప్రవృత్తేన సద్ధృత్తేన నివారితః॥
(జోనరాజ రాజతరంగిణి 800)

కశ్మీరులో న్యాయమూర్తులు   ప్రత్యర్థుల నుండి ధనం గ్రహించి తీర్పులు చెప్పే పద్ధతి అలవాటుగా ఉండేది. ధర్మప్రవృత్తి కల రాజు ఈ పద్ధతిని మాన్పించాడు. అంటే, ధనం కారణంగా కాక న్యాయం ఆధారంగా తీర్పు చెప్పేట్టు చేశాడన్న మాట. ఈ శ్లోకాన్ని బట్టి కశ్మీరు న్యాయవ్యవస్థ ఎలాంటి దుస్థితిలో ఉండేదో ఊహించవచ్చు.

ఈ సందర్భంగా జైనులాబిదీన్ నిష్పాక్షికత్వాన్ని, న్యాయకాముకతను ప్రదర్శించే మరో సంఘటనను చెప్తాడు జోనరాజు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ సంఘటన ఆనాటి సామాజిక పరిస్థితులను పరోక్షంగా తెలుపుతుంది.

‘లౌలరాజు’ అనే బ్రాహ్మణుడు, వ్యక్తిగత కారణాల వల్ల తన దగ్గర ఉన్న పది భాగాల భూమిలో ఒక భాగాన్ని అమ్మేశాడు. ఈ అమ్మకం వ్యవహారం అంతా రాతపూర్వకంగా జరిగింది. అది అమ్మిన సంవత్సరమే లౌలరాజు మరణించాడు. అతని బంధువులయిన ‘నోనరాజు’ వంటి వారంతా బలహీనులు. దాంతో శక్తిమంతుడయిన ఆ భూమిని  కొన్న వ్యక్తి, వీళ్ళు అమ్మని మిగతా తొమ్మిది భాగాల భూమిని కూడా ఆక్రమించేశాడు. వాళ్ళు శక్తిమంతులు కావటంతో భూమి చిరకాలం వారి ఆధీనంలోనే ఉండిపోయింది. వారు నకిలీ అమ్మకపు పత్రాలు సృష్టించారు. నోనరాజు కుమారుడిని బెదిరించి, అతడితో పది భాగాల భూమిని అమ్మినట్టు రాయించుకున్నారు. ఈ వివాదం రాజును చేరింది.

ఆ సమయంలో జోనరాజు రాజసభలో ఉన్నాడు. కాబట్టి జోనరాజు చెప్తున్న దాన్ని ప్రత్యక్ష సాక్షి కథనంగా భావించవచ్చు.

అనవసరంగా, అన్యాయంగా పది భాగాల భూమిని బలవంతంగా వేరేవారు తీసుకుంటున్నారని జోనరాజు బాధపడ్డాడు.

రాజు దగ్గర వాద ప్రతివాదాలయ్యాయి. రాజు ఆ అమ్మకపు పత్రాన్ని తెమ్మన్నాడు. ఆ పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించాడు. తెలివైన రాజు, ఆ పత్రాన్ని నీళ్ళల్లోకి విసిరేశాడు. నీటిలో తడవటం వల్ల ఇటీవలే రాసిన అక్షరాలు చెరిగిపోయాయి. వాటి వెనుక ఉన్న పాత అక్షరాలు బయటపడ్డాయి. వాటి ఆధారంగా ఒకే భాగం భూమి అమ్మేరని రాజు గ్రహించాడు. సభికులతో ఆ పత్రాన్ని చదివింపజేశాడు రాజు. ఆ తరువాత ఆ భాగాలని బ్రాహ్మణుడికి ఇచ్చి నేరస్థుడిని కఠినంగా శిక్షించాడు. ప్రజలంతా రాజు వ్యవహార దక్షతను పొగిడారు. అతని ఖ్యాతి దశదిశలా వ్యాపించింది.

ఈ సంఘటనను చెప్పే సందర్భంలో ‘నేను’ అంటూ జోనరాజు ఏదో చెప్పాడు. కానీ అక్కడ శ్లోకం సరిగ్గా ఉండకపోవడంతో ఏం చెప్పాలనుకున్నాడో ఊహించటం తప్ప మరో మార్గం లేదు. నోనరాజు బహుశా జోనరాజు బంధువై ఉంటాడు. తన భూమి తనకు వచ్చిందని సంతోషం వ్యక్తపరిచి ఉంటాడు. లేదా, ఈ వివాదంలో తాను పోషించిన పాత్రను చెప్పి ఉంటాడు. ఇక్కడ కొన్ని శ్లోకాలు అస్పష్టంగా వుండటంతో ఇక్కడ ఏమి చెప్పాడో తెలియదు.   ఏది ఏమైనప్పటికీ జైనులాబిదీన్ న్యాయం చేసే నిష్పాక్షిక పద్ధతికి ఉదాహరణగా నిలుస్తుందీ సంఘటన.

అయితే జోనరాజు చెప్పనిదీ, పర్షియన్ రచయిల ద్వారా తెలిసినదీ ఏమిటంటే, నోనరాజు భూమిని కాజేయాలని చూసినది శక్తిమంతులయిన ఇస్లామీయులు. వారిని శిక్షించి బ్రాహ్మణుడి భూమి అతడికి ఇప్పించటంలో జైనులాబిదీన్ నిష్పాక్షిత్వం, మతం కన్నా న్యాయానికి పెద్ద పీట వేయటం కనిపిస్తాయి. జోనరాజు ఈ సంఘటనను అత్యంత ప్రధానంగా చెప్పటం వెనుక దాగి ఉన్న అసలు రహస్యం ఇది. అందుకే ‘శక్తిమంతులు’ అన్నాడు కానీ వారెవరో చెప్పలేదు.

ఇస్లామీయుల పాలనలో ఇతర మతాల వారికి హక్కులుండవనీ, ఎలాంటి హక్కులు లేని ద్వితీయ శ్రేణి పౌరుల్లా నివసించాల్సి వస్తుందనీ   ప్రాచీన చరిత్రనే  కాదు, వర్తమాన చరిత్ర కూడా   నిరూపిస్తుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలలో ఇస్లామేతరుల దుస్థితి అందరికీ తెలుసు. అందుకే జైనులాబిదీన్ లాంటి అరుదైన, అతి గొప్ప రాజు, ఇస్లామీ పాలకులలో అత్యున్నత స్థానం ఆక్రమిస్తాడు. కానీ పర్షియన్ రచయితలు జైనులాబిదీన్‍ను పొగడటంలో ఎంతో నియంత్రణను పాటించారు.

‘తూహ్‍ఫత్-ఉల్-అహబద్’ (Tohfat-ul-Ahbab) అనే పుస్తకంలో జైనులాబిదీన్‍ను ‘బేదీన్’ అని దూషించటం కనిపిస్తుంది. ‘బేదీన్’ అంటే ‘దైవరహితుడు’, దేవుడిని నమ్మనివాడు, ‘infidel’ అన్న అర్థం వస్తుంది. అదే సమయంలో జోనరాజు జైనులాబిదీన్‍ను ‘నారాయణావతారం’ అన్నాడు. దీన్ని బట్టి చూస్తే, జైనులాబిదీన్ గొప్పతనం అర్థమవుతుంది. ఎంత ఉక్కు పిడికిలితో తన రాజ్యంలోని మత ఛాందసాన్ని ఆయన అణచిపెట్టాడో అర్థమవుతుంది. మెజారిటీ మత ఛాందసాన్ని అణచిపెట్టి, మైనారిటీల హక్కులకు పెద్ద పీట వేయటం అసలు ‘లౌకిక వాదం’. కానీ ఆధునిక సమాజంలో లౌకిక వాదం అంటే – మెజారిటీ మతస్తులలో అభద్రతా భావం కలిగించి, మైనారిటీ మతస్తులలో తాము వివక్షతకూ, అణచివేతకూ గురవుతున్నామన్న అపోహలు, భయాందోళనలు కలిగించి ప్రజల మధ్య మతాల ఆధారంగా చిచ్చుపెట్టి ఒకరి పక్షం మాత్రమే  వహించటం ద్వారా మరింత ఆజ్యం పోసి సమాజాన్ని ఉడికిపోయే లావా స్థాయికి తేవటం ‘లౌకికవాదం’గా అర్థమవుతోంది.

చంద్రుడు ఎంతటి వాడయినా రాహువు అంటే భయపడతాడు. వర్షాన్నిచ్చే మేఘమే ఒకోసారి ఉరుములు, మెరుపుల ద్వారా బెదిరిస్తుంది. పిడుగులతో చెట్లను నాశనం చేస్తుంది. అలాగే, ప్రపంచం ఆనందించటం కోసం మంచి మనుషులను సృష్టించే దైవం కుడా అప్పుడప్పుడు వ్యాధుల ద్వారా వారిలో భయాందోళనలు కలిగిస్తుంది.

ఒకసారి రాజు చేయి పైన ఒక వ్రణం లాంటిది కనిపించింది. అది విషతుల్యమైనది. ఈ విషతుల్యమైన వ్రణం ప్రజల హృదయాలను తీవ్రంగా బాధించింది. ఇక్కడ మరో అత్యంత నిగూఢమైన శ్లోకాన్ని రచించాడు జోనరాజు. ఈ శ్లోకాన్ని చదివితే నిజాన్ని చెప్పటం ఎంత కష్టమో అర్థమవుతుంది.

మాఘమాసీవ పుష్పాణాం మ్లేచ్ఛప్రాలేయ బాధయా।
న లాభో విషవైద్యానాం దేశోస్మిన్నభవత్తదా॥
(జోనరాజ రాజతరంగిణి 811)

మాఘమాసంలో పుష్పాలు లభించటం కష్టమైనట్టు, మ్లేచ్ఛుల భయం వల్ల, వాళ్ళ చర్యల వల్ల, కశ్మీరంలో విషవ్రణాల గురించి తెలిసిన వైద్యులు లభించటం దుర్లభం అయింది.

అత్యంత నిగూఢంగా కశ్మీరు ఆనాడు ఎదుర్కున్న దుస్థితిని ప్రకటించాడు జోనరాజు.

ఇస్లామీయులు శక్తిమంతులైన తరువాత కశ్మీరులో ఇస్లామేతరమన్న ప్రతిదాన్ని వ్రేళ్ళతో సహా పెళ్ళగించి వేశారు. మనుషులను ఎలాగో మతం మార్చటమో, హతమార్చటమో చేశారు. మతం మారిన మనుషులతో పాటు వారి గతం మారిపోయింది. మనుషులు మారిపోవటంతో, లేదా, దేశం వదిలిపోవటంతో సామాజిక స్వరూపం మారిపోయింది. ముఖ్యంగా ‘విజ్ఞానం’ కశ్మీరాన్ని వదిలిపోయింది. గతంలో, ఓ శ్లోకంలో, కశ్మీరాన్ని విజ్ఞాన స్రవంతి వదిలిపోయిందనీ, వదిలిన విజ్ఞాన స్రవంతిని జైనులాబిదీన్ తిరిగి కశ్మీరు రప్పించాడనీ రాశాడు జోనరాజు. ఇప్పుడు దాన్ని మరింత వివరంగా చెప్తున్నాడు.

మ్లేచ్ఛుల దుశ్చర్యల వల్ల విజ్ఞానం కశ్మీరును వదిలిపోయిందంటున్నాడు. అదీ తిన్నగా అనకుండా, ‘విషం’ గుర్తించే వైద్యులు కశ్మీరంలో లభించకుండా అయిందంటున్నాడు. అంటే ఒకప్పుడుఈ విద్య కశ్మీరంలో వుండేది. ఇప్పుడు మ్లేచ్చులవల్ల ఆ విద్య అదృశ్యమయిపోయిందన్నమాట. అందుకని  మాఘమాసంలో పుష్పాలు లభించనట్టు కశ్మీరంలో వైద్యులు లభించటం లేదంటున్నాడు. మ్లేచ్ఛుల దుశ్చర్యల వల్ల వైద్యులు లభించకపోవటానికి ఒక ప్రధాన కారణం ఏమిటంటే, ఎలాగయితే కశ్మీరీయులకు ప్రత్యేక వైద్య పద్ధతి ఉందో, అలాగే కశ్మీరుపై అధికారం సాధించిన వారికి వారి మతపరమైన ప్రత్యేక వైద్య విధానం ఉంది. వారి మత నియమాల ప్రకారం వారి వైద్య విధానాన్ని అందరూ పాటించాలి. మరో వైద్య విధానం నిశిద్ధం.  దాంతో ఆ మతానికి చెందని వైద్యుల మనుగడ ప్రశ్నార్థకంలో పడింది. వారు కశ్మీరంలో ఉండాలంటే మతం ఆమోదించిన వృత్తిని చేపట్టాలి. లేదా కశ్మీరు వదిలి వెళ్ళాలి. అలా ఎంత అత్యద్భుతమైన విజ్ఞానం కశ్మీరమే కాదు, భారతదేశాన్ని వదిలి వెళ్ళిందో, ఇంకెంత విజ్ఞానం అదృశ్యం అయిపోయిందో చరిత్రలో ఎక్కడా వివరాలు లేవు. భారతదేశ విజ్ఞాన అభివృద్ధిని విశ్లేషించేవారు ఈ అంశాన్ని పరిగణన లోకి తీసుకోవాలి.

సాధారణంగా ప్రాకృతిక ప్రమాదాల వల్ల సంభవించే నష్టాన్ని అంచాన వేస్తాం. కనీసం, పదేళ్ళు, ఐదేళ్ళు వెనక్కి వెళ్ళాం ఈ విపత్తు వల్ల అని అంచనా వేస్తాం. అలాంటిది కొన్ని వేల ఏళ్ళు మ్లేచ్ఛుల ఆకతాయితనానికి గురవుతూ అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు పోరాటం చేయటంలో మునిగిన సమాజం వైజ్ఞానికంగా అభివృద్ధి చెందలేదని న్యూనతాభావాన్ని పెంచేట్టు వ్యాఖ్యానించే బదులు, ఎందుకని విజ్ఞాన శాస్త్రం  అభివృద్ధి పథంలో ప్రయాణించలేదో, ఆ పథంలో ప్రయాణించటంలో ఎలాంటి ప్రతిబంధకాలున్నాయో, అయినా ఎలా అభివృద్ధి వీలయిందో విశ్లేషించాల్సి ఉంటుంది తప్ప, మనం పనికిరామనో, విజ్ఞానమంతా పరాయి ఖండాలలోనే జరిగిందనో తీర్మానించటం వైజ్ఞానిక దృక్పథం కాదు. ఇందుకు జోనరాజు రాజతరంగిణిలో అనేక సందర్భాలలో ఆధారాలు వదిలాడు. ఇది అలాంటి ఒక సందర్భం.

(ఇంకా ఉంది)

Exit mobile version