[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
కలివాలేపి దేవ్యాః స ప్రభావోపి శమం గతః।
జాత్విత్యాగాన్నృపో దేవీం ద్రష్టుం తద్యాత్రికైః సహ॥
(జోనరాజ రాజతరంగిణి 1060)
[dropcap]ద్రో[/dropcap]హంతో, కపటంతో, మోసంతో ఆర్జించిన ధనాన్ని తనకు అర్పించటం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ దేవి కశ్మీరీ ప్రజలను అనుగ్రహించేందుకు విముఖంగా ఉందన్న శ్లోకం తరువాత పవిత్రమైన మనసుతో గడ్డి అర్పించినా దేవి సంతోషంగా స్వీకరిస్తుందన్న విషయం వస్తుంది. ఆ తరువాత వస్తుందీ శ్లోకం. దేవి కశ్మీరీయులను అనుగ్రహించటం మానివేసినా భక్తులు దేవిపై విశ్వాసాన్ని కోల్పోలేదు. వారు పెద్ద సంఖ్యలో దేవీ దర్శనం కోసం ప్రయాణం చేస్తూనే ఉన్నారు.
భారతీయ సమాజానికి ప్రత్యేకమైన లక్షణం ఇది. సాధారణంగా ఎవరైనా ఏదైనా నిషేధిస్తే ఆ నిషేధాన్ని ఉల్లంఘించాలని ప్రయత్నిస్తారు. అవసరమైతే ఆయుధాలు చేపట్టి పోరాడుతారు. కానీ భారతదేశంలో ఇలాంటి సాయుధ పోరాటాలు అరుదుగా సంభవిస్తాయి. సామాన్యుడు పైవారి ఆదేశాలను పాటిస్తాడు. ఆజ్ఞలకు తలవంచినట్టు కనిపిస్తాడు. కానీ తనదైన పద్ధతిలో ఆజ్ఞలను ఉల్లంఘిస్తాడు.
చరిత్రలో పలు సందర్భాలలో విదేశీ పాలకులు భారతీయ సంప్రదాయాలను నిషేధించారు. వారి పూజలు, తీర్థయాత్రలకు ప్రతిబంధకాలు కల్పించారు. పన్నులను విపరీతంగా పెంచారు. పూజ చేయాలంటే పన్ను, తీర్థయాత్రలపై పన్ను. ఇలా ప్రతి చిన్న విషయంలో అనేక ప్రతిబంధకాలు సృష్టించారు. కానీ భారతీయులు అన్నిటినీ సహించారు. ఇళ్ళు వాకిళ్ళు అమ్మి పన్నులు కట్టి మరీ తీర్థయాత్రలు చేశారు. పూజలు, సంబరాలు మానలేదు. ఎన్ని ప్రతిబంధకాలు విధిస్తే అంతగా ఆయా నియమ నిబంధనలను పాటిస్తూ కూడా తమ సంప్రదాయాలను అనుసరించారు. ధార్మిక విధులను నిర్వహించారు.
కశ్మీరులో కూడా అదే కనిపిస్తుంది. ఇస్లామేతరుల బ్రతుకు దుర్భరం చేశారు. వారిని తరిమి వేశారు. అయినా సరే, శారదా మందిర పర్యటన మాత్రం ప్రజలు వదలలేదు. దేవీదేవతల మహత్యం పోయింది. వారు కశ్మీరీ ప్రజలను అనుగ్రహించటం లేదు. అయినా సరే, ప్రజలు శారదాదేవి దర్శనం వదులుకోలేదు. ఆమె మహిమలను నమ్మటం మానలేదు. బహుశా, ఈ అచంచలమైన విశ్వాసం జైనులాబిదీన్‍కు ఆశ్చర్యం కలిగించి ఉంటుంది. దాంతో వారి విశ్వాసాన్ని పరీక్షించాలని ప్రయత్నించాడు. కలియుగంలో, దౌష్ట్యాన్ని భరించలేక దేవి ఎప్పుడో కశ్మీరాన్ని వదిలి వెళ్ళిపోయి ఉంటుందనుకున్నాడు. ఆమె మహత్మ్యాన్ని విశ్వసించి శారదా మందిరానికి తీర్థయాత్ర చేసున్న భక్తులతో కలిసి తానూ వెళ్ళాడు. శారదాదేవి మహత్యాన్ని పరిశీలించాలనుకున్నాదు.
ఇది కూడా పలు గాథలలో కనిపిస్తుంది. ఓ మహాత్ముడు ఉద్భవిస్తాడు. ప్రజలంతా అతడిని విశ్వసించి అతడి చుట్టూ చేరుతారు. రాజు విశ్వసించడు. పరీక్ష పెడతాడు. ఆ వ్యక్తి మహత్తును అర్థం చేసుకుని తానూ ఆ మహాత్ముడి శిష్యుడైపోతాడు. తుకారాం నుంచి రమణ మహర్షి వరకూ ఇలాంటి సంఘటనల కథలున్నాయి. రాజతరంగిణిలో జైనులాబిదీన్ ప్రవర్తన కూడా ఇదే కోవలోకి వస్తుంది. భయం, నమ్మకం, తూష్ణీంభావం అన్నీ కలగలిసిన ప్రవర్తన ఇది.
నదీం మధుమతీం స్నానపానాభ్యాం ఫలయన్నయమ్।
శారదాక్షేత్ర మాసిదత్సీదత్పరిషదాకులమ్॥
(జోనరాజ రాజతరంగిణి 1061)
మధుమతి నదిలో స్నానం చేశాడు. నీటిని తీర్థంలా సేవించాడు. దేవి విగ్రహం ముందు భక్తి శ్రద్ధలతో కూర్చున్న భక్తుల నడుమ తానూ ఓ భక్తుడిలా కూర్చున్నాడు.
దేవీభక్తాభయోద్యుక్తో వ్యక్తుం తచ్ఛక్తిముద్యతః।
యుక్తాయుక్త వివేక్తా స తత్ర రాజా న్యవిక్షత॥
(జోనరాజ రాజతరంగిణి 1062)
సుల్తాన్ అన్నిటినీ, అందరినీ సమదృష్టితో చూసేవాడు. ఆయన ఇప్పుడు స్వయంగా శారదా మందిరానికి వచ్చి, విగ్రహం ఎదురుగా భక్తుల నడుమ తానూ ఓ భక్తుడిలా కూర్చోవటం ఎందుకంటే, శారదా మాత శక్తిని పరీక్షించేందుకు. ఆమెకు నిజంగా అద్భుత శక్తులున్నాయో లేదా తేల్చుకునేందుకు. తద్వారా గుడ్డిగా నమ్ముతున్న భక్తుల భక్తి జ్ఞానమో, అజ్ఞానమో తేల్చి వారిని కాపాడేందుకు అన్న మాట. ఇది ఒక రకంగా ఇప్పటి (అ) జ్ఞాన జన వేదికల వంటి వారు, విశ్వసించేవారిని చులకన పరిచి, వారి విశ్వాసాన్ని మూర్ఖత్వమని నిరూపించి, తమ ఆధిక్యాన్ని ప్రదర్శించుకునేందుకు చేసే ప్రయోగంలా తోస్తుంది. జైనులాబిదీన్ ఇలాంటి ప్రయత్నం చేసి ఉంటాడా? అంటే, చేసి ఉండవచ్చు. ఎందుకంటే జైనులాబిదీన్ ఇస్లామీయుడు. ఇతర దేవీదేవతలను విశ్వసించడు. కాబట్టి, వీరు విశ్వసించే దేవతలకు ఎలాంటి ప్రత్యేక శక్తులు లేవని నిరూపించటం ద్వారా తమ దైవం ఆధిక్యం నిరూపించటమే కాకుండా భక్తులది మూర్ఖత్వం అని స్థిరపరచవచ్చు. కాబట్టి జైనులాబిదీన్ శారదా మందిరానికి – దేవి శక్తిని పరీక్షించేందుకు – వెళ్ళటంలో ఆశ్చర్యం కానీ అనౌచిత్యం కానీ ఏమీ లేదు.
చరితలో దారా షుకోను, ఔరంగజేబుతో పోల్చి దారాను లౌకికవాద ప్రతినిధిగా, పరమత సహనం కలవాడిలా చిత్రిస్తారు. ఆయన ఉపనిషత్తులు పర్షియన్ భాషలోని అనువదించాడు. వారణాసిలో సంస్కృత పండితుల వద్ద ప్రాచీన భారతీయ శాస్త్రాలను అధ్యయనం చేశాడు. కానీ దారాషుకో నిజంగా పరమత సహనం కలవాడా? అంటే పండితుల నుంచి కాదన్న సమాధానమే వస్తుంది.
“His (Dara’s) treatment of Upanishads as ‘islamic’ scripture suggests the possibility of denying some parts of Hinduism an independent religious basis outside an islamic theological framework. Thus, the final text of Dara Shukoh can also be read as a call to all Indian ‘believers in the unity of God’ (muvahhidan) and ‘realizers of the truth’ (muhaqqiqan) to accept their rightful place within the Islamic fold” [Religious Interactions in Mughal India, Ed. by Vasudha Dalmia, Munis D. Faruqui, P.78]
దీన్ని బట్టి చూస్తే, ఎంతగా పరమత సహనం ప్రదర్శించే వాడయినా, ఎంతగా కశ్మీరులోకి పండితులను మళ్ళీ రప్పించి, వారికి రక్షణను, జీవికను కల్పించిన వాడయినా, మౌలికంగా జైనులాబిదీన్ ఇస్లామీయుల ఆధిక్యతను నమ్మినవాడు, ఇస్లామీ మతాన్ని సమర్థించి, ఇతర మతాలను నమ్మనివాడేనని అర్థమవుతుంది. అయితే, ఇతర మతతత్వవాదులలాగా బెదిరించి, భయపెట్టి, హింసించి, మతం మార్చేందుకు ఆయన వ్యతిరేకి. ఇతర మతాలలోని అనౌచిత్యాలను, మూర్ఖత్వాన్ని ఎత్తి చూపటం ద్వారా ఇస్లాం ఆధిక్యతను నిరూపించి, పరాయిమతం వారు స్వచ్ఛందంగా ఇస్లాంను స్వీకరించేట్టు చేయాలన్నది ఆయన ఉద్దేశం అని అర్థమవుతుంది. అందుకే జోనరాజ రాజతరంగిణికి చెందనివిగా భావిస్తున్న శ్లోకాల జాబితాలో ఉన్న ఈ సంఘటన అనౌచిత్యం అనిపించదు.
తత్రాపి తేషాం దౌరామ్య దర్శనాద్విస్మితో నృపః।
భక్తి ప్రసమగాద్దేవ్యామ్ యాత్రికేషు చ కోపితామ్॥
(జోనరాజ రాజతరంగిణి 1063)
దేవి విగ్రహం సమక్షంలో కూడా భక్తులు జరిపే దృష్కృత్యాలను, దౌష్ట్యాన్ని దర్శించిన సుల్తాను ఆగ్రహోదగ్రుడయ్యాడు. అతనికి భక్తులపై ఆగ్రహం కలిగింది. దేవిపై విశ్వాసం నశించింది.
ఇది ఈనాటికీ జరుగున్నదే. మందిరానికి వెళ్ళినవాళ్ళు మందిరంలోనూ లౌకిక విషయాలు ముచ్చటిస్తుంటారు. దైవ దర్శన సమయంలోను కోపతాపాలు, చిరాకులు, అసహనం ప్రదర్శిస్తుంటారు. ఆలయ పవిత్రతను దృష్టిలో ఉంచుకోకుండా ప్రసాదాలు, పొట్లాలు పారేస్తుంటారు. పూజారిగా ఉన్నవారు సైతం, కారణాలేవైనా, డబ్బులిచ్చిన వాడిని కాసేపు అధికంగా విగ్రహం ముందు నిలబెట్టి, డబ్బులివ్వని వారిని తోసేయటం, డబ్బులు అడగటం, ఆలయం బయట వెంటపడే బిచ్చగాళ్లు.. ఇలాంటి అనేకానేక అంశాలు మందిర దర్శనంలోని పవిత్రతను నశింపజేసి, విసుగును, చిరాకును కలిగిస్తాయి ఎంత వీరభక్తులలో కూడా. ఇంకా తిరుమల లాంటి పుణ్యక్షేత్రాలలోనయితే గంటలు, రోజుల తరబడి దర్శనం కోసం పడిగాపులు కాయటంతో భక్తి భావన వెనుకబడుతుంది. తోపులాటలు, తన్నులాటలు, ఆత్రాలు, అపరిశుభ్రత, అవినీతి వంటివనేకం నేడు ‘భక్తి’ భావనను అపహాస్యం చేసి, విశ్వాసాన్ని వెక్కిరింతగా మారుస్తున్నాయి. భక్తుల పరిస్థితే ఇలా ఉంటే, నమ్మకం లేని వారి ఆలోచనలు ఎలా ఉంటాయో ఊహించనవసరం లేదు. కాబట్టి భక్తులపై ఆగ్రహం కలగటం, దేవిపై విశ్వాసం సడలటం, అదీ ఇస్లామీయుడైన జైనులాబిదీన్ విషయంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
సాక్షాత్త్వద్దర్శనం దేవీ దేవనామపి దుర్లభమ్।
అస్మాభిర్నార్మనీయం తత్ కలికాల కళంకితైః॥
(జోనరాజ రాజతరంగిణి 1064)
జైనులాబిదీన్ మనసులో దేవిని ఉద్దేశించి చేసిన ఆలోచనలివి.
ఓ దేవీ! నిన్ను కలికాలంలో ఈ దుష్ట ప్రపంచంలో, ప్రత్యక్షంగా దర్శించటం దేవతలకు కూడా దుర్లభం. కాబట్టి నీ దృష్టి మాపై ప్రసరించాలని వేడుకోవటం కూడా అనౌచిత్యం అవుతుందేమో!
అశక్తానం భవద్రూపం నిష్కలం ధ్యాతుమర్పితుమ్।
భక్తిభాజామనుక్రోశాధ్యత్తు రూపం త్వమగ్రహీః॥
(జోనరాజ రాజతరంగిణి 1065)
నీ సంపూర్ణ రూపాన్ని అవగాహన చేసుకోలేని సామాన్య భక్తుల సౌలభ్యం కోసం, వారిపై దయతో నీవు ఈ విగ్రహ రూపంలో దర్శనమిస్తున్నావు. నిన్ను పూజించుకునే అవకాశం సామాన్యులకు ఇస్తున్నావు.
తవాస్యం ప్రతిమాయం చేద్యపేతో నైవ సన్నిధిః।
పవిత్ర యతరామధ్య స్వప్నే తద్దర్శనేవ మామ్॥
(జోనరాజ రాజతరంగిణి 1066)
ఈ విగ్రహంలో నీ శక్తి ఇంకా నిక్షిప్తమై ఉంటే, నాకు స్వప్నంలో దర్శనమియ్యి అని వేడుకుంటున్నాడు జైనులాబిదీన్.
గతంలో, జోనరాజు కశ్మీరంలోని విగ్రహాల లోంచి దైవం ఎప్పుడో వెళ్ళిపోయాడు, మందిరాలలో మిగిలినవి దైవం లేని రాళ్ళు మాత్రమే అని రాశాడు. ఇప్పుడు జైనులాబిదీన్, దైవశక్తి ఇంకా విగ్రహంలో నిబిడీకృతమై ఉంటే, కలికాలంలో చిత్తశుద్ధి లేని భక్తులకు ప్రత్యక్షం కాకూడదని దేవి భావిస్తుంటే, తనకు మాత్రమే కనిపించేలా, స్వప్నంలో దర్శనమియ్యమంటున్నాడు జైనులాబిదీన్. అంటే, తాను మామూలు భక్తుల కన్నా ఓ మెట్టు పైనున్నట్టు భావించుకుంటున్నాడన్న మాట జైనులాబిదీన్.
అస్మాభిశ్చతతః సా త్వం యథాశక్తి నిషేధ్యసే।
మిధ్యాభక్త దురాత్మత్వాత్త్వం చేదూరమితో గతా॥
(జోనరాజ రాజతరంగిణి 1067)
దురాత్ములకు దర్శనం ఇవ్వటం ఇష్టం లేక ఈ విగ్రహం వదిలి దూరదేశాలకు తరలి వెళ్ళి ఉంటే, నేను చిత్తశుద్ధిగా నిన్ను ప్రార్థిస్తాను. ఈ రాత్రి కలలో నీ దర్శనంతో నన్ను తరింపచేయమని అభ్యర్థిస్తున్నాడు జైనులాబిదీన్.
ఇతరులంతా పాపాత్ములు, దురాత్ములు, దుష్టులు.. తాను పవిత్రుడు అన్న అహంకారం కనిపించినా, జీవితాంతం తపిస్తూ, తపస్సు చేసినా దర్శనం ఇవ్వని భగవంతుడు ఒక్కరాత్రి చిత్తశుద్ధితో పార్థించగానే కలలో కనబడాలని కోరుకోవటం సుల్తానుకు తన నిజాయితీ పట్ల ఉన్న అతి విశ్వాసంగా అనిపిస్తుంది. కానీ జనసామాన్యంలో ప్రచారంలో ఉన్న అనేక గాథలు ఇలాంటివే.
కిమర్మం ప్రతిమా తర్హి గల్లితా హిందువైరిభిః।
విజ్ఞాప్యేతి స సప్తామ్యాం భాద్రే రాజా జితేంద్రియః॥
(జోనరాజ రాజతరంగిణి 1068)
అశేత శారదాక్షేత్ర ప్రాసాదా స్థండిలోపరి।
దర్శితం న యదా స్వప్నే కించిత్ సన్నిధి సూచకమ్॥
(జోనరాజ రాజతరంగిణి 1069)
రాజ్ఞాష్టానవతే వర్షే స్యాం మూర్తిం దేవ్యచూర్ణయత్।
నాస్యా దా దర్శనం దేవీ మ్లేచ్ఛ సంసర్గతో ధృవమ్।
స్వామీ మృత్యాపరాధేన గర్హణీయ ఇతి స్థితిః॥
(జోనరాజ రాజతరంగిణి 1070)
తనకు స్వప్నంలో దర్శనం ఇమ్మని అభ్యర్థించిన సుల్తాన్ భాద్రపద మాసంలో ఏడవ రోజునాడు మందిరంలో, నేలపై, పవిత్రమైన శారదాదేవి విగ్రహం ముందు నిద్రించాడు. అతనికి స్వప్నంలో దేవి దర్శనం ఇవ్వలేదు. దాంతో హిందువులను ఇలాంటి వ్యర్థ విగ్రహారాధనా విషయం లోనే అందరూ నిందిస్తున్నారని ఆరోపించి, సుల్తాన్ శారదాదేవి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. చూర్ణం చేశాడు. దేవి అతనికి ఎందుకని దర్శనం ఇవ్వలేదంటే మ్లేచ్ఛులతో అతనికి ఉన్న సంపర్కం వల్ల. రాజు తనని తాను పవిత్రుడిగా భావించుకున్నా, దేవి అతడిని మ్లేచ్ఛుడిగానే గుర్తించిందన్న మాట. స్వతహాగా, ఇది రాజుకు ఆగ్రహం కలిగిస్తుంది. తనను తాను ప్రత్యేకంగా భావించుకున్నవాడిని, అందరిలానే చూస్తే, భరించలేడు. కాబట్టి సుల్తానుకు ఆగ్రహం రావటం సహజమే. ఆగ్రహంలో సుల్తాన్ తన అసలు స్వభావాన్ని ప్రదర్శించటమూ సహజమే. విగ్రహాలను ధ్వంసం చేయటం పవిత్రకార్యంగా భావించే సమాజానికి చెందినవాడు, విగ్రహాన్ని చూర్ణం చేయటం కూడా సహజమే. అయితే, ఈ సంఘటన నిజంగా జరిగిందో, లేక కల్పితమో ఎవరూ నిర్ధారణగా తేల్చలేకపోతున్నారు. జోనరాజు కనుక ఈ సంఘటనను రాసి ఉంటే, జైనులాబిదీన్‍కు దర్శనం ఇవ్వటం దేవి దోషం అని రాసేవాడేమో. ‘హిందు’ అన్న పదం వాడకం కూడా జోనరాజు ఈ శ్లోకాలు రాయలేదేమో అనిపిస్తుంది. అధిక శాతం జోనరాజు ‘హిందువు’ అన్న పదానికి పర్యాయపదంలా ‘పండితుడు’ అన్న పదం వాడేడు. కాబట్టి, ఈ సంఘటనలో నిజానిజాలెలా ఉన్నా, శారదాదేవి విగ్రహం ధ్వంసం అయిందనేది మాత్రం కాదనలేని సత్యం!
(ఇంకా ఉంది)