జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-7

1
2

[box type=’note’ fontsize=’16’] జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

స్వ మండలే విశార్ణేధ పరమండల మావిషన్।
న కైరమ మతో రాజా ప్రత్యాసన్న నవోదయః॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 97)

[dropcap]రా[/dropcap]జదేవుడి మరణం తరువాత అతడి కొడుకు సంగ్రామదేవుడు రాజు అయ్యాడు. సంగ్రామదేవుడు గొప్ప వీరుడు. ఆయన సింహం ఏనుగులను భయపెట్టినట్టు, శత్రువులను భయభ్రాంతులను చేశాడు. అంటే, కొద్దికాలమైనా కశ్మీర శౌర్యాగ్నిని ఉజ్జ్వలంగా ప్రజ్వలింపజేశాడన్న మాట సంగ్రామదేవుడు. అయితే సంగ్రామదేవుడు చిన్న పొరపాటు చేశాడు. తన సోదరుడు ‘సూర్య’ను రాజ ప్రతినిధిగా నియమించాడు. తన సోదరుడిని సంపూర్ణంగా నమ్మాడు. కానీ అతని సోదరుడు పర భావనల ప్రభావితుడయ్యాడు. రాజు ఐశ్వర్యం, గౌరవం, శక్తిని చూసి తాను అన్నీ అనుభవించాలన్న కోరిక అతడిలో జనించింది. రాజద్రోహ భావన అతడికి కలిగింది.

భారతీయ సమాజం నెమ్మదిగా పతనావస్థ వైపు పరుగులిడటం కశ్మీరు చరిత్రలో స్పష్టంగా తెలుస్తుంది. రాజ్యం వద్దని సర్వం వదిలి వెళ్ళిన రాజులను కశ్మీరం చూసింది. ప్రజలు వెంటబడి పట్టాభిషేకం చేస్తే, రాజధాని కవతల పర్ణశాల నిర్మించుకుని శివపూజ చేసిన తరువాతనే రాచకార్యాలు చూస్తూ, నిర్మోహంగా కర్తవ్యాన్ని నిర్వహించిన రాజులను కశ్మీరం చూసింది. రాజ్యాధికారం దైవదత్తంగా భావించి, తాము ప్రజల బాగోగులు చూసేందుకు దైవం నియమించిన సేవకులం మాత్రమే అని భావించిన రాజులను చూసింది. కానీ రాను రాను రాజ్యాధికారం అంటే ఐశ్వర్యం, భోగలాలస, అధికారం అనుకునే రాజులను కశ్మీరం అనుభవించింది. ఇప్పుడు సోదరుడి సామ్రాజ్యాన్ని భోగాలు అనుభవించే ఉద్దేశంతో కబళించాలని రాజ్యాధికారం కోసం ప్రయత్నించేవారినీ కశ్మీరం చూడాల్సి వస్తోంది. సూర్య తన సోదరుడిపై విప్లవం లేవదీయాలని ప్రయత్నించాడు. అయితే తన ఉద్దేశం సోదరుడికి తెలిసిపోయిందన్న భయంతో రాజ్యం వదిలి ‘లోహార’ రాజు చంద్ర దగ్గర ఆశ్రయం పొందాడు. అతడి సహాయంతో కశ్మీరంపై దాడి చేసి సింహాసనం చేజిక్కించుకోవాలన్నది అతని ఆలోచన. ఇక్కడ జోనరాజు చక్కటి శ్లోకం రాశాడు. సూర్య అనేవాడు చంద్ర అనేవాడిని చేరి ఆశ్రయం పొంది దుష్టపుటాలోచన  చేయటాన్ని గమ్మత్తుగా వర్ణించాడు.

దారుణే రణవాలే స సూర్య చంద్రాన్వితం తదా।
స్వర్భానురివ భూభానుశ్చిత్రం సమమీ మిలత్॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 81)

చంద్రుడి ‘చక్ర’పురంలోకి సూర్యుడు ప్రవేశించటాన్ని చంద్రమండలంలోకి సూర్యుడు ప్రవేశించినట్టు ప్రవేశించాడని పై శ్లోకంలో చెప్పిన జోనరాజు, రెండవ శ్లోకంలో మహావీరుడైన సూర్య – చంద్రతో కలిసినప్పుడు భూమిపై వెలుగు ప్రకాశించే సూర్య చంద్రులు, ఆకాశంలో వెలిగే సూర్యచంద్రులుగా గ్రహణానికి గురయ్యారంటాడు జోనరాజు.

శారుల రాజ్యాధిపతి ‘తుంగుడు’. సూర్యకు ఆశ్రయం ఇవ్వటమే కాదు అతటిని వెంట వేసుకుని గర్వంగా తిరిగాడు. భావి రాజ్యాధిపతి తనతో ఉన్నట్లు ప్రవర్తించాడు. ఇంకా ఉదాసీనంగా ఉంటే పరిస్థితి విషమిస్తుందని అర్థం చేసుకున్న సంగ్రామదేవుడు తుంగుడి పైకి దండెత్తి వెళ్ళాడు. సూర్యకు ఆశ్రయం ఇచ్చిన వారందరినీ ఓడించాడు. దాంతో అందరు మిత్రులు దూరమై, సూర్యచంద్రులు లేని దారిలో మిగిలిపోయాడు సూర్య. అతడిని పట్టి బంధించారు. సోదరుడని జాలి పడకుండా సంగ్రామదేవుడు సూర్యని చంపించాడు. గతంలో సోదరుడిని క్షమించి వదిలేవారు. కానీ ఇప్పుడు మారుతున్న సామాజిక పరిస్థితులు, వ్యక్తిత్వాల వల్ల సోదరుడు అన్నపై తిరుగుబాటు చేశాడు. అన్న సోదరుడిని పట్టి చంపించాడు.

ఇక్కడ కల్హణుడి సంతానం ప్రసక్తి వస్తుది. అయితే జోనరాజు చెప్పిన కల్హణుడి సంతానం – రాజతరంగిణి రచించిన కల్హణుడి సంతానమా? లేక ఈ కల్హణుడు వేరేనా? అన్న విషయంలో స్పష్టత లేదు.

కల్హణుడి సంతానం దుష్టులు. వారు రాజుకు చేరువై శక్తిమంతులయ్యారు. తన రాజ్యాన్ని కాపాడుకోవటంపై దృష్టి కల రాజు, కల్హణుడి సంతానాన్ని విషనాగులుగా భావించాడు. కానీ వారి నుంచి తన రాజ్యాన్ని కాపాడుకోలేకపోయాడు. వారు రాజ్యాధికారాన్ని సాధించటంతో, సంగ్రామరాజు కశ్మీరాన్ని వదిలి శాంతంగా ఉన్న ‘రాజ్‌పురి’లో ఆశ్రయం పొందాడు. కల్హణుడి సంతానం అధికారానికి రావటంలో సహాయపడిన డామరులు విజృంభించారు. అడ్డు అదుపు లేకపోవటంతో డామరులు ప్రజల రక్తాన్ని, ప్రాణాలను పీల్చివేయసాగారు. రాజు రాజ్యాన్ని వదిలి పారిపోయాడు. బ్రాహ్మణులు కూడా రాజ్యం వదిలి వెళ్ళిపోయారు. దాంతో అందరూ వదిలివెళ్ళిన ఆహారాన్ని దుష్టులు కాజేసినట్టు కశ్మీరాన్ని దోచుకు తిన్నారు. ఈ సందర్భంలో పైన ఉదహరించిన శ్లోకం రాశాడు జోనరాజు.

కశ్మీర దేశానికి చెందిన రాజు మరో దేశంలో తల దాచుకున్నాడు. అతని స్వదేశం అరాచకంలో కొట్టుకుపోతోంది. అతడు తిరిగి రాజ్యాధికారం సాధిస్తాడనీ, కశ్మీరంలో పరిస్థితులు చక్కబడతాయనీ ఆశ ఎవరికీ లేదు. ఎవ్వరి మనస్సులలో అలాంటి ఆలోచన  కూడా రాలేదు. అయితే, సంగ్రామరాజు కశ్మీరాధికారాన్ని వదులుకోలేదు. రాజ్‌పురి రాజు సహాయంతో కశ్మీరంపై దాడి చేశాడు. రాజ్‌పురి వద్ద జరిగిన భీకర సంగ్రామంలో శత్రువులను ఓడించాడు. తిరిగి కశ్మీరంపై అధికారాన్ని సాధించాడు. తన నుంచి అన్యాయంగా రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకున్న కల్హణుడి సంతానాన్ని,   బ్రాహ్మణులని కనికరించి చంపకుండా వదిలిపెట్టాడు. తన ధైర్య సాహసాల ఆధారంగా కశ్మీరంపై తిరిగి అధికారం సాధించాడు. తన విజయానికి సూచనగా విజయేశ్వరం వద్ద ‘శ్రీవిశాల’ అనే గొప్ప గృహాన్ని నిర్మించాడు. దాన్లో 21 గదులుంటాయి. ఆ గదుల్లో గోవులు, బ్రాహ్మణులు నివాసం ఉంటారు. అయితే సంగ్రామరాజును అతని శత్రువులు విపరీతంగా ద్వేషించారు. ఎలాగయితే దొంగలు దీపం అంటే భయపడి ద్వేషిస్తారో అలాగ, కల్హణుడి సంతానం, వారి అనుచరులు, వారి సమర్థకులు కశ్మీర రాజును ద్వేషించారు. కవులకు, కళాకారులకు కల్పవృక్షం లాంటి కశ్మీర రాజును, దుష్టులయిన కల్హణుడి సంతానం మోసంతో చంపేశారు. యశశనుడనే మహా పండితుడు కశ్మీరు రాజును నాయకుడిగా తన కావ్యాన్ని రచించాడు. ఇది పండితులకు భూషణం లాంటి కావ్యం. కశ్మీరానికి ఎంతో లాభం కలిగించి, క్షేమంగా పాలించిన రాజు భాద్రపద శుక్ల పక్షం అయిదవ రోజు వరకు 16 ఏళ్ళ పది రోజులు రాజ్యం చేశాడు. సంగ్రామదేవుడు కశ్మీరాన్ని 1236 నుండి 1252 వరకు పాలించాడు.

సంగ్రామదేవుడి తరువాత అతడి కొడుకు రామదేవుడు రాజయ్యాడు. అతడు తన తండ్రి హత్యకు కారకులయిన వారందరినీ దండించాడు. సంగ్రామదేవుడు, బ్రాహ్మణులని, కల్హణుడి సంతానాన్ని చంపకుండా వదిలాడు. కానీ అప్పటి కాలంలోని బ్రాహ్మణులు ఒకప్పటి కాలం నాటి బ్రాహ్మణులు కాదని గ్రహించలేకపోయాడు. వారు విషనాగుల్లాంటి వారని గ్రహించి కూడా వారిని చంపకుండా వదిలాడు. ఫలితంగా విషనాగు కాటుతో మరణించినట్టు మరణించాడు. ఈ సంఘటన నుంచి అతడి కొడుకు రామదేవుడు పాఠం నేర్చుకున్నాడు. అధికారానికి రాగానే ముందుగా కల్హణుడి సంతానాన్ని చంపించాడు.

జోనరాజు తన రాజతరంగిణిలో ‘కల్హణుడి సంతానం’ అని అన్నాడు తప్ప ఎక్కడా వారి పేర్లు రాయలేదు. దీన్ని బట్టి పలువురు, వీరు రాజతరంగిణి రచించిన కల్హణుడి సంతానం అనీ, అందుకే జోనరాజు ‘కల్హణుడి సంతానం’ అని ప్రత్యేకంగా పదే పదే చెప్పాడని అంటారు. జోనరాజు వారి పేర్లు ఎందుకని ప్రత్యేకంగా రాయలేదో తెలియదు. కానీ కల్హణుడి సంతానం అని ప్రత్యేకంగా చెప్పటం, ఓ రకంగా, కల్హణుడి లాంటి నిస్వార్థ వ్యక్తి సంతానం ఎంతటి దుష్టులుగా ఎదిగారో చరిత్రలో నమోదు చేసేందుకేనేమో అనిపిస్తుంది. కాబట్టి, జోనరాజు చెప్పిన కల్హణుడు, రాజతరంగిణిని రచించిన కల్హణుడు ఒకరే అని ఎలాంటి ఆధారాలు లేకున్నా, భావించాల్సి వస్తుంది. వారు కల్హణుడి సంతానం కాకపోతే అంత ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లేదా, ఆ కాలంలో కల్హణుడని పేరున్న మరో ప్రధాన వ్యక్తి ఎవరయినా ఉండి ఉండాలి. కానీ ఈ ఆలోచన అంత సబబు అనిపించదు.

రామదేవుడు రాజ్యపాలన భారాన్ని మంత్రి పృథ్వీరాజుకు అప్పగించాడు. అతను ‘లేదరి’కి కుడి వైపున ఉన్న ‘సల్లార’ వద్ద ఒక పటిష్టమయిన కోటను నిర్మించాడు. ఆ కోట రామదేవుడి పేరుతో ప్రసిద్ధి పొందింది. అతని ఖ్యాతికి ప్రతీకగా నిలుస్తుంది. రామదేవుడు, పృథ్వీరాజు సహాయంతో కశ్మీరుకు చక్కని పాలనను అందించాడు. సంగ్రామదేవుడు ‘షామా’లపై యుద్ధానికి వెళ్తున్నప్పుడు, పొరపాటున విరిగిన ఉత్పలపురం లోని విష్ణు మందిరాన్ని పునరుద్ధరించాడు. అయితే గంధం చెట్టుకు పూలను ఇవ్వలేదు దేవుడు. చంపక వృక్షానికి పళ్ళనివ్వలేదు. అలాగే, రామదేవుడికి సంతానాన్నివ్వలేదు. భిషాయకపురానికి చెందిన ఓ బ్రాహ్మణుడి  కొడుకును రాజు దత్తతకు తీసుకున్నాడు. వారిద్దరి నడుమ అసలైన తండ్రీకొడుకుల నడుమ ఉండేటటువంటి ప్రేమ ఉండేది. ఎలాగయితే అతి గొప్ప చిత్రలేఖనం అది ఏ అంశం ఆధారంగా గీసిందో ఆ అంశానికి అతి దగ్గరగా ఉంటుందో, అలాగే వీరిద్దరి నడుమ చక్కని ప్రేమ నెలకొంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here