Site icon Sanchika

జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-70

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

[dropcap]జో[/dropcap]నరాజు దాదాపుగా దైవసమానుడిగా భావించిన జైనులాబిదీన్‍ను పర్షియన్ రచయితలు అంత గొప్ప సుల్తానుగా పరిగణించలేదు.

“The one great fault of this Sultan consisted in this that heresy and idolatory and temple building, which had disappeared during the reign of Sultan Sikandar the iconoclast, nothing of them, were revived by Zain-ul-Abidin.. And in every village Jashns were organised on a particular occasions which gave birth to innumerable blasphemous innovations in the Islam of the Prophet.” (Baharistan).

“Many of the Brahmanas who had accepted Islam in the reign of Sikander abjured (the new faith) and no ulema could stop them.” (Tubagatall, by Nizam-ud-din)

జోనరాజు దృష్టికి పూర్తిగా విరుద్ధమైన కోణం ఇది. జోనరాజు దృష్టిలో జైనులాబిదీన్ అతి గొప్ప రాజు. దయామయుడు. కశ్మీరు నుంచి పారిపోయిన పండితులకు కశ్మీరులో ఆశ్రయం ఇవ్వటమే కాదు, గౌరవించి ఉన్నత స్థానాలను అందించాడు. తమ ధర్మాన్ని పాటించుకునే స్వేచ్ఛనిచ్చాడు. మందిరాలను పునరుద్ధరించాడు. సంబరాలు జరుపుకోనిచ్చాడు. సనాతన ధర్మ గ్రంథాలను గౌరవించాడు. వాటిని పర్షియన్ భాషలోకి తర్జుమా చేయించాడు. ఇలా గత కాలంలో ఇతర సుల్తానులు ఇస్లామీ సూత్రాలను అనుసరించి ధ్వంసం చేసిన స్థానిక ధర్మాన్ని, పద్ధతులను, విజ్ఞానాన్ని పునరుద్ధరించాడు. నూతన ఊపిరులూదాడు. ఇది ఇస్లామీ చరిత్ర రచయితలకు నచ్చలేదు. ఎందుకంటే ఇస్లామీ చరిత్ర రచయితల దృష్టిలో “The more feral the barbarian sultan is, the more pious Ghazi he is in the eyes of his contemporary chroniclers” (The Medieval Muslim Chroniclers by Sandeep Balakrishna).

ఇస్లామేతరుల పట్ల సుల్తాను ఎంత నిర్దయగా, క్రూరంగా ప్రవర్తిస్తే ఆ సుల్తాన్ అంత గొప్పవాడు. కాబట్టి పర్షియన్ రచయితల దృష్టిలో జైనులాబిదీన్ కన్నా సికందర్ బుత్‌షికన్ గొప్పవాడు. బలవంతపు మతమార్పిళ్ళకు అనుమతినిచ్చి ప్రోత్సహించిన సుల్తాన్ గొప్పవాడు. తమకు ఇష్టమైన ధర్మాన్ని అనుసరించే స్వేచ్ఛనిచ్చిన జైనులాబిదీన్ దోషి.

జైనులాబిదీన్ బలవంతపు మతమార్పిళ్ళను అడ్డుకోవటమే కాదు, విశ్వాసం లేకుండా బలవంతాన ఇస్లామ్ స్వీకరించినవారు, ఇస్లాం వదిలి తమ పూర్వ ధర్మాన్ని అనుసరించే అనుమతి కూడా ఇచ్చాడు. ఇది ఇస్లామీయులలో తీవ్రమైన నిరసనను కలిగించింది. ఇస్లామీ చరిత్ర రచయితల దృష్టి ప్రకారం [The Muslim] writer… sympathise with no virtues and abhor no vices…With him, a Hindu is “an infidel,” and a Muhammadan “one of the true faith,” and of the holy saints of the calendar, he writes with all the fervor of a bigot. With him, when Hindus are killed, “their souls are despatched to hell,” and when a Muhammadan suffers the same fate, “he drinks the cup of martyrdom.” [The Mindset of Muslim Chroniclers, by Sandeep Balakrishna]. దీన్ని బట్టి ఎందుకని పర్షియన్ చరిత్ర రచయితలు జైనులాబిదీన్ కాలంలోనూ, తరువాత కూడా జైనులాబిదీన్‌కు తమ రచనలలో అంత ప్రాధాన్యం ఇవ్వలేదో అర్థమవుతుంది.  పర్షియన్ రచయితలే ప్రాధాన్యం ఇవ్వనప్పుడు, వారి రాతలను ప్రామాణికంగా భావించే భారతీయ చరిత్ర రచయితలు ప్రాధాన్యం ఇవ్వకపోఅటాన్ని అర్ధం చేసుకోవచ్చు.

జైనులాబిదీన్ గురించి Vogel, Hutchinson లు ‘జర్నల్ ఆఫ్ పంజాబ్ సొసైటీ’లో రాస్తూ “సుల్తానులందరిలోకి జైనులాబిదీన్ భిన్నమైనవాడు” అని రాశారు. ఎందుకంటే, ఆ కాలంలో సుల్తానులకు అలవాటయినట్లు ఆయన ‘జనానా’ను ఏర్పాటు చేసుకోలేదు. బహు భార్యలతో , ఎత్తుకొచ్చిన అమ్మాయిలతో ‘జనానా’ను నింపలేదు. ఆయన ఏకపత్నీవ్రతం ఆచరించాడు. ఆమె మరణించిన తరువాత ఎవరెంత ఒత్తిడి తెచ్చినా పరస్త్రీ వైపు కన్నెత్తి చూడలేదు. చనిపోయిన భార్య జ్ఞాపకార్థం ‘తాజ్‍మహల్’ను నిర్మింపజేసి, దాని వైపు చూస్తూ జీవితం గడిపిన అమర ప్రేమికుడు ‘షాహ్‍జహాన్’ కూడా రోజుకో స్త్రీతో సంగమించేవాడని, చివరికి కూతురు జహాన్ ఆరాను మోహిస్తే, ‘విత్తు నాటిన వాడికి ఫలాన్ని అనుభవించే హక్కుంటుంద’ని ముల్లాలు సుల్తానును సమర్థించారనీ చరిత్ర చెప్తుంది. అలాంటి అమర ప్రేమిక సుల్తాన్‍లకు భిన్నంగా ‘సనాతన ధర్మానుయాయులలాగా ఏకపత్నీవ్రతం ఆచరించే సుల్తాన్‍ను కాఫిర్‍ల సమర్థకుడు, వారి ఆచారాలను పాటించేవాడ’ని పర్షియన్ చరిత్ర రచయితలు దూషించటంలో ఆశ్చర్యం లేదు.

అందుకే చారిత్రక ఆధారాలుగా పరిగణించే సమయంలో ఆ ఆధారాలను అన్ని కోణాల్లోంచి విశ్లేషించిన తరువాతనే వాటి ప్రామాణికతను నిర్ణయించాల్సి ఉంటుంది. చరిత్రను రాసే వాడి దృక్కోణం చాలా ప్రాధాన్యం వహిస్తుంది. అందుకే ఈనాటికి కూడా చరిత్రను ‘విజ్ఞానశాస్త్రం’గా పరిగణించాలా, ‘కళ’గా పరిగణించాలా అన్న విషయంపై వాదోపవాదాలు సాగుతున్నాయి. చరిత్రను ‘సామాజిక శాస్త్రం’ (Social Science) గా పరిగణించటం కూడా అందరికీ ఆమోదయోగ్యం కాదు. కాబట్టి ఓ వ్యక్తి ఓ పుస్తకంలో అలా రాశాడు కాబట్టి ‘అదే నిజం’ అని భావించే వీలు లేదు. అలా భావించేవారికి చరిత్ర అంటే ఏమిటో తెలియదు.

సమిజ్జతే శాయాదేశే క్రూరాదేశో మహీపతిః।
సువర్ణ బుద్ధ ప్రతిమాం యవనేభ్యో రరక్ష సః॥
(జోనరాజ రాజతరంగిణి 834)

జైనులాబిదీన్ వీరుడు అన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇతర సుల్తానుల వలె ఆయన సామ్రాజ్య విస్తరణ కాంక్షను ప్రదర్శించలేదు. కానీ అవసరమైనప్పుడు యుద్ధం చేసేందుకు వెనుకాడలేదు.

గాంధార, సింధు, మాద్ర, అద్రి దేశాలకు చెందిన రాజులు సుల్తాన్ మాటలు లెక్క చేయక పోవటంతో వారిని తన అదుపులోకి తెచ్చుకున్నాడు సుల్తాన్. వారు పెంపుడు జంతువుల్లా సుల్తాన్ మాటలను పాటిస్తున్నారు. తన శత్రువులందరిపై విజయం సాధించాడు సుల్తాన్. సుల్తాన్ మాట జవదాటని మాద్ర రాజును యుద్ధంలో ఓడించి, మాద్ర రాజు మాలదేవుడిని చెర పట్టాడు ఖూఖుర రాజు. జైనులాబిదీన్ మాలదేవుడిని చెర నుంచి విడిపించాడు. రాజ్‍పురి రాజు రణసింహుడి దుష్కృత్యాలకు అడ్దుపడుతూ సుల్తాన్ అతడిని ఓడించాడు. ఒక గులకరాయిని విసిరినట్టు, సింధు రాజు మద్దతు ఉన్న ఉదభాండపుర రాజును విసిరేశాడు జైనులాబిదీన్. భౌట్టు భూమిపై ఉన్న గొగ్గదేశ ప్రజల వేడి రక్తంలో ముంచిన  బాణాలతో సుల్తాన్ విజయం సాధించాడు. ఈ విజయాలతో, తన సుగుణాలతో ప్రజలకు ఆనందం కలిగించాడు. ఈ విధంగా జైనులాబిదీన్ జైత్రయాత్రను వర్ణిస్తూ ఎన్నో ఆలోచనలు కలిగించే ఒక శ్లోకం రాశాడు జోనరాజు.

‘శాయ’ ప్రాంతాన్ని గెలిచిన తరువాత, అక్కడ ఉన్న బంగారు బుద్ధుడి విగ్రహాన్ని సుల్తాన్ ‘యవనుల’ నుండి కాపాడాడు. ఈ విషయంలో సుల్తాన్ కఠినమైన ఆజ్ఞలను జారీ చేశాడు.

సుల్తాన్ ఆ ప్రాంతాన్ని గెలిచాడు,  కాబట్టి యవనుల నుండి కాపాడేడు అంటే, అతని సైనికులు బుద్ధ విగ్రహాన్ని ధ్వంసం చేయకుండా కాపాడేడని అర్థం చేసుకోవచ్చు. ఇది కూడా సుల్తాన్ పట్ల నిరసన కలిగించే అంశం. సాధారణంగా తాము గెలిచిన ప్రాంతాన్ని ధ్వంసం చేసి కొల్లగొట్టందే ఇస్లాం సైనికులకు సంతృప్తి ఉండదు. వారు గెలిచిన ఏ ప్రాంతాన్ని నాశనం చేయకుండా వదలలేదు. అందమైన కట్టడాలు, శిల్ప సౌందర్యం వంటి స్పృహను కనబరచలేదు. శత్రువును గౌరవించే ప్రసక్తి లేనే లేదు. కాబట్టి సహజంగానే సైనికులు ఆ ప్రాంతంలోని మందిరాలను, భవంతులను ధ్వంసం చేసి ఉంటారు. ఆ పనిలో భాగంగా బంగారు బుద్ధుడి విగ్రహంపైన కూడా పడి ఉంటారు. కానీ జైనులాబిదీన్ ఇతర సుల్తానుల వంటి వాడు కాదు. గెలిచిన ప్రాంతాన్ని దోచుకుని విలువైన వాటిని తన రాజ్యానికి తరలించుకునే తలంపు కలవాడు కాదు. కాబట్టి, బుద్ధ విగ్రహ విధ్వంసానికి అడ్డుపడి ఉంటాడు. ఏ ఇతర ధర్మాలకు చెందిన పవిత్ర స్థలాలను పాడుచేయకూడదని కఠినంగా ఆజ్ఞలను జారీ చేసి ఉంటాడు. ఈ అపూర్వమైన ఆజ్ఞలను అందుకే జోనరాజు ప్రత్యేకంగా ప్రస్తావించాడు.

జైనులాబిదీన్ జైత్రయాత్ర గురించి జోనరాజు ప్రస్తావించని వాటిని తరువాత శ్రీవరుడు ప్రస్తావించాడు. బహరిస్తాన్‍లో విపులంగా రాశారు.

జైనులాబిదీన్ పంజాబ్‍ను గెలుచుకున్నాడు. పశ్చిమ టిబెట్‍పై ఆధిక్యం సాధించాడు. గెలిచిన ప్రాంతాలలోని ప్రజలను వేధించవద్దనీ, అకృత్యాలు జరపవద్దనీ సైనికులను ముందే హెచ్చరించాడు. తాను గెలిచిన ప్రాంతాలలో తనకు విధేయులుగా ఉండేవారికి అధికారం అప్పగించాడు. తన పొరుగు రాజులతోనే కాదు, దూరంగా ఉన్న దేశాధిపతులందరితో సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకున్నాడు. దౌత్య ప్రతినిధులను ఆయా రాజ్యాలలో నియమించాడు. ఖోరసాన్, తుర్కిస్తాన్, తుర్కీ, ఈజిప్టు, ఢిల్లీ వంటి ప్రాంతాలకు జైనులాబిదీన్ దౌత్య ప్రతినిధులను పంపాడు. టిబెట్ రాజు జైనులాబిదీన్‌పై కానుకల  వర్షం కురిపించాడు. అయితే జైనులాబిదీన్, ఇతర సుల్తానులతో పోలిస్తే, యుద్ధాలపై అతి తక్కువ కాలం గడిపాడు. కశ్మీరును శక్తివంతమైన, సుభిక్షమైన దేశంగా మలచాలన్న ఆలోచనపై ఉన్న  దృష్టి, ఇతర ప్రాంతాలను కబళించటంపై లేదు. ఇది కూడా జైనులాబిదీన్‍ను ఇతర సుల్తానుల నుంచి వేరు చేసే అంశం.

జైనులాబిదీన్ నిష్పాక్షిక న్యాయగుణం గురించి జోనరాజు మరి రెండు గాథలు పొందుపరిచాడు రాజతరంగిణిలో. జైనులాబిదీన్ ఎంతటి దయామయుడైనా, ఎవరైనా తనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారన్నా, విప్లవం ప్రయత్నాలు చేస్తున్నారన్నా – వారిని క్షమించేవాడు కాదు. జాలి చూపేవాడు కాదు. భౌట్టుల లాత్ నగరాన్ని రాజు ధ్వంసం చేశాడు. భౌట్టుల హృదయాలలో రాజు పట్ల భయం నిండింది. ఎలాగయితే, రైతు ఎక్కడెక్కడ తిరిగినా, తన పంట ఎలా ఉందో అని చూసుకుంటాడో, రాజు జైత్రయాత్రలో ఏయే దేశాలు తిరిగినా, కశ్మీరు ప్రజల బాగోగులు తెలుసుకుంటూ ఉండేవాడు. జైనులాబిదీన్ విల్లు – నారాయణుడు, మహాదేవుడి విల్లులతో ఏ మాత్రం  తీసిపోని శక్తివంతమైనదైనా, సుల్తాన్ తన విల్లును అధికంగా వాడేవాడు కాదు. ఎందుకంటే దూరం నుంచి ఆయన దృష్టి సారిస్తే చాలు శత్రువులు గడగడ వణికిపోయేవారు. సుల్తానుకు విధేయులయ్యేవారు.

సూర్యుడితో పోల్చేందుకు సుల్తాన్ జైనులాబిదీన్ తప్ప మరో సుల్తాన్ లభించడు. సూర్యుడు అంధకారాన్ని పారద్రోలినట్టు, జైనులాబిదీన్ నిరంతరం దుష్టశక్తులను అణచివేయాలని ప్రయత్నిస్తూంటాడు. బలహీనుడిపై వరాల జల్లు కురిపించటం వల్ల అతడిని ఐశ్వర్యవంతుడిని చేస్తాడు. క్షీణిస్తున్న చంద్రుడికి వెలుగు రేఖలందించి బలాన్నిస్తాడు. వర్షం కురిపించటం ద్వారా – మోడవుతున్న వృక్షాలను చిగురింపజేస్తాడు. ఎలాగయితే సూర్యుడి కిరణాలు భూతలమంతా ఆక్రమించి రక్షిస్తాయో, అలాగే, జైనులాబిదీన్ కశ్మీరమంతా తన అదుపులో ఉంచుకుని – పరులు కశ్మీరులో అడుగుపెట్టకుండా  కాపాడుతాడు.

లద్దరాజు కొడుకు నోస్రతుడు రాజుకు వ్యతిరేకంగా విప్లవం లేవదీసే ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుసుకున్న జైనులాబిదీన్ అతడికి దేశబహిష్కారం విధించాడు. కానీ అతడి ఆస్తిని జప్తు చేయలేదు.

మక్క దేశగతో జాతు పుస్తవాడంబరం వహన।
సౌదల నామా యవనో రాజేంద్రం తముపాగమత్॥
(జోనరాజ రాజతరంగిణి 841)

మక్కా నుంచి సౌదల అని పేరున్న యవనుడు సుల్తాన్ దగ్గరకు వచ్చాడు. అతడు బోలెడు పెద్ద పెద్ద పుస్తకాలు పట్టుకుని వచ్చాడు.

ఇక్కడ జోనరాజ రాజతరంగిణి జైనులాబిదీన్‍లో ఉన్న విజ్ఞాన తృష్ణను తెలుపుతుంది. జైనులాబిదీన్‌కు ఎంతటి విజ్ఞాన తృష్ణ ఉందంటే, ఆయన తన అధ్యయనాన్ని ఇస్లామ్ పుస్తకాలకు పరిమితం చేయలేదు. ఆయన ఇతర ధర్మాల గ్రంథాలను కూడా తెలుసుకున్నాడు. వాటిని సంపూర్ణంగా అవగతం చేసుకునేందుకు ఆయా గ్రంథాలను పర్షియన్ భాషలోకి అనువదింప చేశాడు. పర్షియన్ భాషలోని ప్రముఖ గ్రంథాలను సంస్కృతం లోకి అనువదింప చేశాడు. జోనరాజు తరువాత రాజతరంగిణిని కొనసాగించిన శ్రీవరుడు ‘జులైఖా’ ప్రేమగాథను ‘కథాకౌతుకమ్’ పేరిట సంస్కృతంలోకి అనువదించాడు.

గణాన్ వికత్థమానం తం గుణిరాగీ నరేశ్వరః।
ఉపాగచ్ఛత్ ప్రతిదినం దర్శనాయేతరో యథా॥
(జోనరాజ రాజతరంగిణి 842)

జైనులాబిదీన్‍కు విజ్ఞాన గ్రహణ అత్యంత ఇష్టమైన విషయం. దాంతో తనకు ఎంతో జ్ఞానం ఉందని ప్రకటిస్తూ, పుస్తకాలను ప్రదర్శించిన ‘సౌదల’ పట్ల సుల్తాన్ ఎంతో గౌరవాన్ని కనబరిచాడు. రాజు అతని ఇంటికి వెళ్ళి, అతడి నుంచి విజ్ఞానాన్ని గ్రహించాలని తపన పడ్డాడు. అయితే, ఎవరూ అబద్ధాన్ని నిజంగా ఎక్కువ కాలం చలామణీ చేయలేరు. ఏదో ఓ రోజు నిజం ప్రకటితమవుతుంది. అదే జరిగింది.

(ఇంకా ఉంది)

Exit mobile version