జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-71

2
1

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

మ్లేచ్ఛమస్కరిణి క్షోణిప్రాణేశో నిర్గుణేపి సః।
ప్రేమాణాం నాముచత్ పుత్రే పితేవ కరుణార్ణవః॥
(జోనరాజ రాజతరంగిణి 844)

[dropcap]త[/dropcap]న దగ్గరకు పెద్ద పండితుడిలా వచ్చిన సదౌల దగ్గర నుండి విజ్ఞానాన్ని గ్రహించేందుకు జైనులాబిదీన్ రోజూ ఆయన ఇంటికి వెళ్ళేవాడు. కానీ కొన్ని రోజులలోనే ఆ ‘మ్లేచ్ఛమస్కరిణి’ అపండితుడని గ్రహించాడు. అయితే, ఎలాగయితే తన కొడుకు ఎంత పనికిరానివాడైనా తండ్రి  సహించి క్షమిస్తాడో, అలాగే ఆ మ్లేచ్ఛుడిని సుల్తాన్ క్షమించాడు.

ఈ సంఘటన జైనులాబిదీన్ విజ్ఞాన తృష్ణను తెలుపుతుంది. ఒకప్పుటి రాజులు ప్రపంచం నలుమూలల నుంచి పండితులను తమ సభలకు ఆహ్వానించేవారు. వారి పాండిత్య ప్రదర్శనను ఆనందంతో తిలకించేవారు. పండితుల నడుమ చర్చలు, వాదోపవాదాలను తిలకిస్తూ సంతోషించేవారు. అలాంటి వాడు జైనులాబిదీన్ అనిపిస్తుంది. అయితే, రాజుకు పాండిత్యం అంటే ప్రీతి, కవిత్వం అంటే అభిమానం అని గ్రహించి ప్రతి ఒక్కరూ తాను గొప్ప పండితుడనని, కవినని నిరూపించుకోవాలని తపన పడతారు. ప్రయత్నిస్తారు. ఇలా ప్రయత్నించే వారిలో అసలైన ప్రతిభావంతులు కొందరే ఉంటారు. వారిని గుర్తించటంలో రాజు ప్రతిభ ప్రస్ఫుటమవుతుంది. ఒకసారి ఇలా వచ్చి పడుతున్న అపండితుల తాకిడిని భరించలేక తనను కలిసేవారిని ముందే పరీక్షకు గురిచేస్తుంటాడు రాజు. మన చరిత్రలో ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయి. రాజ దర్శనం కోసం భటులకు లంచం ఇచ్చి ఒప్పందాలు చేసుకున్న కవుల గాథలున్నయి. జైనులాబిదీన్ కూడా అలా పండితులను ఆదరించే ప్రక్రియలో చేదు అనుభవాలను ఎదుర్కున్నాడని ఈ మ్లేచ్ఛుడు ‘సదౌల’ సంఘటన నిరూపిస్తుంది. అయిత, సదౌల కథ ఇంతటితో అయిపోలేదు. ప్రతిభ ఉన్నవాడు సరైన గౌరవం, గుర్తింపు పొందితే మరింతగా ప్రతిభను ప్రదర్శిస్తాడు. ప్రతిభ లేని వాడికి గుర్తింపు, గౌరవాలు లభిస్తే వాడు మిడిసిపడతాడు. తనంతటివాడు లేడని అహంకరిస్తాడు. అయితే, అతడి మనస్సాక్షికి  తెలుసు, తాను ఆ గౌరవానిని అర్హుడిని కానని. అందుకని ఇతర ప్రతిభావంతులను అణగద్రొక్కాలని ప్రయత్నిస్తాడు. ఏ కాస్త ప్రతిభావంతుడు పరిచయమైనా, అభద్రతా భావంతో అన్యాయంగా, అమానుషంగా ప్రవర్తిస్తాడు.

ప్రదోషస్యేవ తమసాం దుర్ఘవస్యేవ విద్యుతామ్।
దోషాణాం బహుతా తస్య ప్రజాః సుముదవేజయత్॥
(జోనరాజ రాజతరంగిణి 845)

నల్లటి మేఘాలు ఆకాశంలో దట్టంగా అలముకునప్పుడు చీకటి పడితే ప్రజలు ఎంతగా భయభ్రాంతులవుతారో, అసంఖ్యాకంగా ఉరుములు ఉరిమి, మెరుపులు మెరిసి భయంకరమైన మేఘాలు ప్రజలను ఎలా భయపెడతాయో అలా ఆ సౌదాల దుర్గుణాలు ప్రజలను బాధించాయి.

తస్మిన్నవసరే కశ్చిద్యోగిరాజో జితేంద్రియః।
న్యవిక్షతోన్నతే స్తంభే యోగాభ్యాసస్య సిద్ధయే॥
(జోనరాజ రాజతరంగిణి 846)

సదౌల (సయ్యద్ అలీ) కి పాండిత్యం లేదని గ్రహించి కూడా సుల్తాన్ చూసీచూడనట్టు వదిలేయటం వల్ల సయ్యద్ అలీకి గర్వం పెరిగింది. గర్వంతో పాటు అభద్రతాభావం పెరిగింది. ఈ సమయంలో మోక్షార్థి అయిన ఓ యోగి, యోగ సాధనలో భాగంగా ఓ స్తంభం పై ధ్యానం ఆరంభించాడు.

అలా ఆయన ఆహారరహితంగా తొమ్మిది రోజులు కళ్ళు  మూసుకుని స్తంభంపై ధ్యానంలో ఉండిపోయాడు. అతడి ఆశీస్సులతో రాణి పుత్రుడికి జన్మనిచ్చింది. దాంతో కశ్మీరమంతా సంబరాలు ఆరంభమయ్యాయి. అందరు ఆ యోగి మహిమను పొగడసాగారు. అతడిని గౌరవించటం ఆరంభించారు. ఇవేమీ పట్టని యోగి స్తంభం పై కళ్ళు మూసుకుని ధ్యానంలో నిశ్చలంగా ఉండిపోయాడు.

అత్యర్థదర్శనద్వేషాత్ మదిరామదమోహితః।
స మ్లేచ్ఛసహితో యోగిరాజం తమవధీచ్ఛరైః॥
(జోనరాజ రాజతరంగిణి 849)

అర్హత లేని వాడి అసహనం, అసూయలు ప్రతిభ ఉన్న వాడిపై క్రోధంగా పరిణమిస్తాయి. ప్రజలు యోగికి బ్రహ్మరథం పడుతున్నారు. కానీ యోగి తన ధ్యానంలో తాను ఉన్నాడు. అయినా సరే సయ్యద్ అలీ (సదౌల) యోగికి అందుతున్న ఈ గౌరవ మర్యాదలను సహించలేకపోయాడు. తాగిన మత్తులో క్రోధాన్ని అదుపులో పెట్టుకోలేక ‘మ్లేచ్ఛసహితంగా’ – ఇతర మ్లేచ్ఛులతో కలసి యోగిపై దాడి చేసి బాణాలతో అతడిని చంపేశాడు.

పైకి ఇది ఒక చిన్న సంఘటన. కానీ తరచి చూస్తే జోనరాజు ఈ సంఘటనను చెప్పటం వెనుక ఒక ఉద్దేశం కనిపిస్తుంది. జైనులాబిదీన్ తప్ప ఇతరులందరినీ ‘మేచ్ఛులు’ అనటం జోనరాజు ఉద్దేశాన్ని అర్థం చేసుకునేందుకు ఆధారమిస్తుంది. అనాడు, జైనులాబిదీన్ నీడలో పండితులు స్వేచ్ఛను అనుభవిస్తూ భద్రంగా ఉన్న వారిని ఆవరించి ఉన్న ద్వేషభావనలు, హింసాత్మక వాతావరణాలను ఈ సంఘటన ప్రతిబింబిస్తుంది. జోనరాజు ఉద్దేశం కూడా ఆనాడు తాము ఎలాంటి భయాలు, ఉద్విగ్నతల నడుమ జీవించారో, జైనులాబిదీన్ అండ లేకపోతే తమ పరిస్థితి ఎంత భయానకంగా ఉండేదో ప్రదర్శించటం అయి ఉంటుంది.

కశ్మీరు వదలి పారిపోయిన వారిని, అదీ తన మతం అనుసరించని కాఫిర్లను సుల్తాన్ కశ్మీరుకు పిలిపించటం, వారికి ఉన్నత పదవులిచ్చి ప్రాధాన్యాన్నివ్వటం, వారు చెప్పినట్టు రాజ్యం చేయటం – స్వమతస్తులలో నిరసన కలిగించటం ప్రాకృతికం. అంతెందుకు, దేశమంతా ఒక్కటే అని ప్రకటిస్తున్నప్పటికీ, కూడా ‘బొంబాయి మహారాష్ట్రీయులదే’ అని యూపి, బీహార్‍ల నుంచి వచ్చిన వారిపై దాడులు జరగటం మనం చూస్తూనే ఉన్నాం. ఈశాన్య ప్రాంతాల నుంచి వచ్చిన వారు ‘మా ఉద్యోగాలు లాగేసుకుంటున్నార’ని వారిపై జరుగుతున్న దాడులు చూస్తున్నాం. చివరికి ఒకే భాష మాట్లాడే తెలుగు వారిలోనూ భేదభావాలు చూస్తున్నాం. ఇంత అభివృద్ధి చెందిన ఆధునిక కాలంలోనే ఇలాంటి సంకుచితాలు, స్వార్థాలు, అభద్రతా భావాలు ప్రబలంగా కనిపిస్తుంటే, మధ్యయుగంలో, తమ దైవాన్ని నమ్మినవారికి తప్ప మరొకరికి జీవించే హక్కు లేదు, జీవించినా తమతో సమానంగా జీవించే అర్హత లేదని నమ్మే మతానికి చెందినవారు, అధికారం తమదయి ఉండి కూడా పరాయి ధర్మాన్ని అనసరించే వారికి ఉన్నత పదవులు కట్టబెట్టటాన్ని మౌనంగా, శాంతంగా సహించటం అనూహ్యం. కాబట్టి సమాజంలో పండితుల పట్ల నిరసన, సర్వత్రా వెల్లడవుతూండాలి. పండితుల విజ్ఞానం, పాండిత్యాలకు సుల్తాన్ నుండి లభిస్తున్న ఆదరణ – ఆవేశాలు రగిల్చి ఉండాలి. అసహనం కలిగించి ఉండాలి. ఫలితంగా జైనులాబిదీన్ రక్షణ కవచం ఉన్నా, పాము పడగ నీడలో జీవిస్తున్న భావన ప్రతి పండితుడూ అనుభవిస్తూండి ఉండాలి. అందుకే జోనరాజు ఒక్క జైనులాబిదీన్‍ను వదిలి మిగతా అందరినీ మ్లేచ్ఛులు అనటం కనిపిస్తుంది.

పండితులను గౌరవించి, వారి పాండిత్యాన్ని సుల్తాన్ మెచ్చుకోవటం చూసిన ఇస్లామీయుల లోనూ తమకు అలాంటి గౌరవం లభించాలన్న దుగ్ధ కలగటంలో ఆశ్చర్యం లేదు. తమ రాజ్యంలో తమ కన్నా అధికంగా గౌరవం పొందుతున్న పండితుల పట్ల ద్వేషం కలగటం లోనూ ఆశ్చర్యం లేదు. కాబట్టి, గౌరవం పొందుతున్న యోగిపై తోటివారితో కలసి సయ్యద్ అలీ దాడి చేయటం, అతడిని చంపేయటం లోనూ ఆశ్చర్యం లేదు. ఇలాంటి సంఘటనలు ఇప్పటికీ మన చుట్టూ జరుగుతూనే ఉన్నాయి. ప్రజాస్వామ్యం లోను ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పడు సంకుచితత్వం అధికంగా ఉన్న మధ్యయుగంలో ఇలాంటివి జరగటంలో ఆశ్చర్యం లేదు.

ఈ సంఘటన సంభవించిన విధానం పట్ల పాఠ్యాంతరం ఉంది. బాణాలతో కాదు, కత్తితో యోగిని నరికినట్టు, ఆయన ‘నన్నెందుకు చంపుతున్నావు?’ అని ప్రశ్నించినట్టు కొన్ని శ్లోకాలున్నాయి. కానీ ఈ శ్లోకాల కన్నా ముందు ఉంచినా, వెనక ఉంచినా – ఒకే వ్యక్తిని  కత్తితో నరికినట్టు, బాణాలతో చంపినట్టు ఒకే వ్యక్తి రాయటం కుదరదు. కాబట్టి, అధికులు  ప్రామాణికంగా  భావిస్తున్న   బాణాలతో చంపటాన్ని అధికంగా ప్రస్తావించుకున్నాం.

అయితే, ఈ హత్యకు జైనులాబిదీన్ స్పందనను గమనించాలి.

సంతప్తర్మలినైః స్ధూలైర్జనానాం తద్విలోకనాత్।
భూతలే పతితం బాష్పైరపావాదైశ్చ రాజని॥
(జోనరాజ రాజతరంగిణి 850)

ఈ సంఘటన దర్శించిన ప్రజలు విషాదపూరిత వేడి అశ్రువులు భూమిపై పడ్డాయి. వారంతా రాజును దూషించటం ఆరంభించారు.

ఇదీ ఈనాటికీ చూస్తున్నాం. కాశ్మీరులో తీవ్రవాదులు ఓ పండితుడిని హత్య చేసినా, వలస కూలీని హత్య చేసినా; దూషణలు తిన్నగా కేంద్ర ప్రభుత్వానికే. ఆ కాలంలో కూడా ఇస్లామేతరులకు రక్షణను, భద్రతను ఇస్తానని నమ్మించిన సుల్తాన్ వారికి రక్షణ కల్పించాలని ప్రజలు ఆశించారు. దానిలో ఏ మాత్రం పొరపాటు జరిగినా దానికి సుల్తాన్‍నే బాధ్యుడిని చేశారు. సుల్తాన్‌నే దూషించారు. హత్య చేసిన సయ్యద్ అలీని ఎవరూ ఏమీ అనలేదు. అతనికి సహాయం చేసిన ఇతర మ్లేచ్ఛులనూ ఏమీ అనలేదు.

పృథ్వీనాథోధ తచ్చృత్వా శుద్ధచర్థామివ మగ్నవాన్।
భీహ్రీశోక కృద్ధాశ్చర్యకృత్య చిన్తార్ణవేషు సః॥
(జోనరాజ రాజతరంగిణి 851)

జరిగిన సంఘటన జైనులాబిదీన్‌ను చేరింది. ఆ యోగి ఆశీస్సులతో తాను సుత్రుడిని పొందానన్న భావన జైనులాబిదీన్‍లో ఉంది. పైగా, తాను అందరికీ భద్రతను, రక్షణను కల్పిస్తానని వాగ్దానం చేశాడు. ఆ నమ్మకంతో కశ్మీరు వదిలి పోయిన వారంతా తిరిగి వస్తున్నారు. వారికి భద్రత కలించలేక పోవటం తన వైఫల్యం. ఎందుకంటే, ఓ రకంగా ఎక్కడో ఓ చోట భద్రంగా ఉన్న వారిని మృత్యువు వైపుకు ఆహ్వానించినట్టు అవుతుంది. ఆ పాపం రాజుదే. అందుకని సుల్తాన్ భయంతో, సిగ్గుతో, ఆగ్రహంతో , ఆశ్చర్యంలో మునిగి పోయాడు, తన పాపం ప్రక్షాళన చేసుకుంటున్నట్టు. ఇప్పుడు తన కర్తవ్యం ఏమిటని తీవ్రంగా ఆలోచించాడు.

బాధ్యత కల నాయకుడు ఇలా ఆలోచిస్తాడు. ప్రజలకు ఎలాంటి కష్టం కలిగినా దానికి తానే బాధ్యుడనుకుంటాడు. ప్రజల బాగోగులకు తనదే బాధ్యత అని నమ్మతాడు. ప్రజల ప్రతి ఇబ్బందినీ గ్రహించి వారి బాధలను తొలగించే ప్రయత్నం చేస్తాడు. శీర్యభట్టుతో సహా భారతీయ సంస్కృతి, సంస్కారాల ప్రభావంలో ఉన్న సుల్తాన్ కూడా భారతీయ రాజులలాగే ఆలోచించాడు. కర్తవ్యం గ్రహించాడు. నిర్ణయం తీసుకున్నాడు.

ఇది ఆసిధారపై పరుగు లాంటిది. ఎందుకంటే  సయ్యద్ అలీ ఇస్లామీయుడు. కాఫిర్లలను చంపటం పొరపాటు కాదు. కానీ సుల్తాన్ అభయంతో కశ్మీరుకు వచ్చిన వాడు యోగి. అతడి రక్షణ సుల్తాన్ బాధ్యత. ఇలాంటి పరిస్థితిలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఒక పక్షం వారికి ఆగ్రహం కలుగుతుంది. సయ్యద్ అలీకి మరణశిక్ష విధిస్తే ఇస్లామీయులు ఆగ్రహిస్తారు. కాఫిర్‍ను చంపటం పెద్ద దోషం కాదు. అతనిని శిక్షించకుండా వదిలేస్తే తనపై నమ్మకంతో కశ్మీరులో స్థిరపడినవారికి ఆగ్రహంతో బాటు అభద్రతా భావం కలుగుతుంది. ఇది సుల్తాన్ లక్ష్యాన్నే దెబ్బతీస్తుంది. అందుకనే ఎంతో ఆలోచన తరువాత సుల్తాన్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం పై పరోక్షంగా శీర్యభట్టు హస్తం కనిపిస్తుంది.

తనకు పుత్రోదయం అయిన సందర్భంగా సుల్తాన్ సంబరాలు జరపలేదు. శోకదినం గడిపాడు. ఆ రోజు స్నానం చేయలేదు. ఆహారం స్వీకరించలేదు. ఎవరితో మాట్లాడలేదు. మౌనం వహించాడు. ఏ పనీ చేయలేదు. నిశ్చలంగా, నిర్వ్యాపారంగా ఉన్నాడు. మరుసటి రోజు మత పెద్దలను, న్యాయాధీశులను, న్యాయశాస్త్రంలో పండితులను సంప్రదించాడు. సయ్యద్ అలీ నేరానికి తగిన శిక్ష మరణ దండననే అని నిర్ధారించుకున్నాడు. కానీ సయ్యద్ అలీకి మరణ శిక్ష విధించలేదు. ఇక్కడే ఇరు వర్గాల మనస్తత్వాలను గ్రహించిన శీర్యభట్టు మేధను గ్రహించాల్సి ఉంటుంది.

ప్రతీపం ఖరమారోప్య ప్రతిహట్టం పరిభ్రమమ్।
నరమూత్రభిషిక్తస్య కూర్చస్య పరికర్తనమ్॥
(జోనరాజ రాజతరంగిణి 854)

ష్టీవనం సర్వలోకానం ప్రేతాన్నైర్బాహుబంధనమ్।
జీవన్మరణమాదిక్షద్ దండం తస్య కృశాయతేః॥
(జోనరాజ రాజతరంగిణి 855)

మరణ దండన విధిస్తే ఇస్లామీయులు సహించరు. శిక్షించకపోత ఇస్లామేతరులు ఆగ్రహిస్తారు. వదిలేస్తే చట్టం పట్ల న్యాయం పట్ల గౌరవం కూడా పోతుంది. ఇలాంటి నేరాలు చేసి తప్పించుకోగలమన్న ధైర్యం కలిగితే, పలువురు ధైర్యంగా ఇలాంటి నేరాలు చేస్తారు. కాబట్టి నేరం చేసినవాడు శిక్ష తప్పించుకోలేడని నిరూపించేట్టు శిక్ష విధించాలి. శిక్ష ఎట్లుండాలంటే గాయపడిన మనస్సులు శాంతించాలి. కానీ మరణ శిక్ష నివ్వకూడదు. జీవచ్ఛవంలా వదిలేయాలి. అప్పుడు రాజు కరుణను పొగుడుతారు. రాజు న్యాయం చేశాడని స్తుతిస్తారు. మరొకరు నేరం చేసేందుకు భయపడతారు. అందుకని, గాడిద తోక వైపు ముఖం ఉండేట్టు నేరస్థుడిని గాడిద మీద కూర్చోబెట్టారు. అలా అతడిని బహిరంగంగా బజార్లలో ఊరేగించారు. అతడి తల గొరిగారు. మనుషులు అతడిపై పోసిన మూత్రంతో అతని గడ్డం తడిసి పోయింది. ప్రతీ ఒక్కరు అతనిపై ఉమ్మి వేశారు. చనిపోయిన మనిషి శవాన్ని అతని చేతులకు కట్టి ఊరేగించారు. ఈ శిక్ష వల్ల సయ్యద్ అలీ బ్రతికి ఉండీ శవంలా అయ్యాడు. ఇప్పడతడు సుల్తాన్ గౌరవం పొందలేడు. సుల్తాన్ గౌరవిస్తున్నాడని చెప్పుకోలేడు. ఈ అవమానం అతడి దగ్గర నుంచి మానం, గౌరవం సర్వం హరించింది. భౌతికంగా ప్రాణాలతో వదిలింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here