Site icon Sanchika

జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-74

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

తారామండలవత్తత్ర మహాపద్మ సరోవరః।
మహాపద్మాస్పదం తత్ర జ్యోతిర్మండల సోదరమ్॥
(జోనరాజ రాజతరంగిణి 910)

[dropcap]ఈ[/dropcap] విశ్వానికి కశ్మీరు కంటి వంటిదని, కశ్మీరు లోని హిమాలయ పర్వత శ్రేణులు కనురెప్పల వంటివనీ అనుకున్న జైనులాబిదీన్‌కు మరో ఊహ వచ్చింది. నక్షత్రాలు నీటిలో ప్రతిఫలించటంతో స్వర్గంలా, మరో ఆకాశంలా మెరిసిపోయే మహాపద్మ సరోవరం, కంటి లాంటి కశ్మీరుకు కనుపాప లాంటిది అనిపించింది. మహాపద్మ సరోవరం నీటిలో ప్రతిఫలించే తారలతో ఆ సరస్సు జ్యోతిమండలంలా తోచిందట జైనులాబిదీన్‍కు.

నీటి పారుదల వసతులకు సంబంధించిన నిర్మాణాల గురించి నిరంతరం ఆలోచిస్తుండే జైనులాబిదీన్‌కు ఈ నీటి నడుమ ఒక ద్వీపం లాంటిది నిర్మిస్తే తన పాలనా కాలాన్ని పది కాలాల పాటు అందరూ గుర్తుంచుకునే మహా కట్టడాన్ని నిర్మించిన వాడనవుతాననిపించింది. పెద్ద పెద్ద బండరాళ్ళు తెచ్చి ఆ సరస్సు నీటిలో పద్ధతి ప్రకారం వేయించి, రాళ్లతో నీటిని నింపటం వల్ల ఆ సరస్సు నీటి నడుమ ఓ ద్వీపం ఏర్పడుతుంది. ఆ ద్వీపంలో అద్భుతమైన కట్టడం నిర్మించాలన్న ఆలోచన వచ్చింది. ఆ కట్టడం రాజ నివాసానికి యోగ్యమైనదిగా నిర్మించాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆలోచనను ఆచరణలో పెట్టాడు.

అగాధ సలిలచ్ఛన్న క్రోశాష్టవింశతి ప్రమః।
సరోరజః స హి మహా నాశయో మహాతామపి॥
(జోనరాజ రాజతరంగిణి 912)

28 క్రోసుల దూరం వరకూ విస్తరించిన మహాపద్మ సరోవరంలో కట్టే నిర్మాణం గొప్ప వ్యక్తుల నివాసానికి అనువుగా ఉంటుంది. ‘వాల్టర్ స్లాజే’ అనే ప్రసిద్ధ ఇండాలజిస్టు ‘అష్టవింశంతి’ ని ’19’ క్రోసులుగా అనువదించాడు. 19 కి  సంస్కృతంలో నవదశ, ఏకోనవింశతి, ఊనవింశతి, ఏకాన్న వింశతి అన్న పదాలున్నాయి.  18 ని ‘అష్టాదశ’ అంటారు. ‘అష్ట వింశతి’ అంటే 28. కానీ ఈ ‘వాల్టర్ స్లాజే’ అనే పండితుడు ‘అష్ట వింశతి’ని 19గా అనువదించాడు. ఈయన అనువాదం ప్రమాణంగా భావించి, దాని ఆధారంగా కశ్మీరు చరిత్రను విశ్లేషిస్తున్నారు పండితులు. గమ్మత్తేమిటంటే ఆయన ఇచ్చి సంస్కృత శ్లోకంలో ‘అష్టవింశతి’ అనే ఉంది. ఆంగ్లానువాదాంలో మాత్రం 19 ఆనే వాడాడాయన.

ఈ సరోవరంలో పద్మాలు పెద్ద పెద్ద పరిణామం కలవి. అందుకని మహాపద్మ సరస్సు అంటారు.

ఈ సరోవరం నడుమ ద్వీపాన్ని నిర్మించాలని తలంపు రావటంతోటే రాజు ఓ నౌకను తీసుకుని సరోవరం పై ప్రయాణం ఆరంభించాడు.

విచింత్యేతి స విశ్పష్టం తత్రోపాయం సరోవరే।
నావాస్య గతవాన్మధ్యం యోగీవాత్మానమాత్మానా॥
(జోనరాజ రాజతరంగిణి 913)

యోగి స్వీయ ఆత్మ ద్వారా తన ఆత్మను తాను తెలుసుకునేట్టు, రాజు, మహాపద్మ సరస్సు మధ్య భాగానికి పడవలో బయలుదేరాడు.

సదైవోర్ధత కల్లోలం మహాపద్మసరో మహత్।
నాగాహన్తా నృపాః పూర్వే తరణీ భంగ శంకినః॥
(జోనరాజ రాజతరంగిణి 914)

మహాపద్మ సరోవరం అడుగున మహాపద్ముడని నాగరాజు ఉండేవాడు. ఈయన నిరంతరం చలిస్తుండటం వల్ల సరోవరం నిత్య కల్లోలంగా ఉంటుందనీ, కల్లోల తరంగాల వల్ల పడవ భంగమై మునిగిపోతుందన్న భయంతో గతంలో రాజులెవరూ ఈ సరస్సు పై నౌకలో విహరించలేదు. కానీ జైనులాబిదీన్ – ఒక యోగి తనని తాను తెలుసుకున్నట్టు, మహాపద్మ సరోవరం మధ్య భాగానికి ప్రయాణం చేశాడు.

రాజును – ఒక యోగి తనని తాను తెలుసుకున్నట్టు – అవి అనటం వెనుక ఉన్న కారణం ఈ శ్లోకం స్పష్టం చేస్తుంది. ఇతర రాజులంతా ఈ నిత్య కల్లోలిత తరంగిణి అయిన మహాపద్మ సరోవరంలో ప్రయాణించేందుకు భయపడ్డారు. కానీ తనని తాను తెలుసుకునే యోగి ప్రయాణంలా రాజు మహాపద్మ సరోవరంలోకి ప్రయాణించాడని. ఆ తపః ఫలం వల్లనో, లేక ఆయన ఓపిక వల్లనో రాజు ఎలాంటి కష్టం లేకుండా, సుఖంగా, నేలపై ప్రయాణించినట్టే సరస్సు నీటిలో కూడా ప్రయాణించాడని అంటాడు జోనరాజు.

ఈ సందర్భంగా ఒక అద్భుతమైన శ్లోకం రాశాడు జోనరాజు.

యచ్చేతసా చిరతరం పరిచింత్య మానం
చిన్తామణిః కిల దదాతి తదేవ నాన్యత్।
చిత్తస్త్య చాపి యదగోచర తాము పైతి
తత్తు ప్రయచ్ఛితి తరాం వత బుద్ధిరత్నమ్॥
(జోనరాజ రాజతరంగిణి 916)

మనసులోకి ఏదైనా ఆలోచన వచ్చిందంటే, కొంత కాలానికి  ఏదో విధంగా దాన్ని ఆచరణలోకి తీసుకురావచ్చు. కానీ మామూలు మనుషుల ఊహకు కూడా అందనివి మహా బుద్ధి కలవారు మాత్రమే ఊహించగలరు. ఆచరణలో పెట్టగలరు. అందరికీ ఆలోచనలు వస్తాయి. కానీ సామాన్యుల ఆలోచనలు ఆలోచనలుగానే మిగిలిపోతాయి. వాటిని ఆచరణలో పెట్టాలని ప్రయ్నంచేవారు తక్కువగా ఊంటారు. లేని ప్రతికూలతలను ఊహించి అడుగు ముందుకు కదపరు అధికులు. ఆరంభించరు నీచ మానవులు. కాని కొందరు కొంత కాలానికయినా తమ ఆలోచనలను అమలు చేయాలని ప్రయత్నిస్తారు. మధ్యములు. అయితే మామూలు మనుషుల ఆలోచనకు కూడా అందనివి  బుద్ధిమంతులు ఊహిస్తారు, ఆచరణలో పెడతారు. జైనులాబిదీన్ అదే చేశాడు.

తస్య హి క్షితిపాలస్య నిరాలాస్యమతేః సతః।
సరసః స్థలతాం కర్తుముపాయః ప్రత్యభాదయమ్॥
(జోనరాజ రాజతరంగిణి 917)

సరస్సు నడుమ ద్వీపం ఏర్పాటు చేసి దానిలో అద్భుతమైన భవనం నిర్మించాలన్న ఆలోచన రాజుకు వచ్చింది. కానీ దాన్ని ఆచరణలో ఎలా పెట్టాలన్నది తోచలేదు. కానీ పడవలో సరస్సు మధ్యకి చేరేసరికి రాజుకు ఆలోచన వచ్చింది. ఇతరులు ఊహించినది రాజు ఊహించటమే కాదు, సాధ్యం చేశాడు కూడా.

మహాపద్మ సరస్సు పవిత్రమైనది. సరస్సు అడుగున మహాపద్ముడున్నాడు. సరస్సు నిత్యం కల్లోలితంగా ఉంటుంది. కాబట్టి ఆ సరస్సు నడుమ ద్వీపం ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా ఎవ్వరికీ కలగకపోవటంలో ఆశ్చర్యం లేదు. రాజు జైనులాబిదీన్‍కు సరస్సు పవిత్రత పట్ల నమ్మకం లేదు. అతని దృష్టిలో సరస్సు నీరు. ఆ నీటిని ఎలా ఉపయోగించటం అన్నదే అతని ఆలోచన. ఎలా భవిష్యత్తరాలు సాధించలేనిది సాధించి తన పేరు చిరకాలం నిలిచేట్టు చేయాలన్నదే తపన. కాబట్టి, ఆయనకు సరస్సు నడుమ ద్వీపాన్ని కృత్రిమంగా ఏర్పాటు చేసి,  భవనం నిర్మించాలన్న ఆలోచన రావటంలో ఆశ్చర్యం లేదు. సుల్తాను కాబట్టి దాన్ని వెంటనే ఆచరణలో పెట్టటం స్వాభావికం.  నిర్మాణ కార్యక్రమం ఆరంభమైంది.

(ఇంకా ఉంది)

Exit mobile version