జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-78

3
2

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

గిరీశ ముకుటభ్రష్టాం గంగామివ భగీరథః।
లేదరీమబ్ది విస్తీర్ణాః మార్తాండక్ష్మా మవాపయత్॥
(జోనరాజ రాజతరంగిణి 1258)

[dropcap]ప[/dropcap]రవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్న లిద్దర్ నది ప్రవాహా దారికి ఒక పెద్ద బండ రాయి అడ్డు వచ్చింది. గతంలో ఇలా చంద్రకుల్య నది ప్రవాహానికి బండరాయి అడ్డు రావటం వల్ల ఆ ప్రవాహానికి ఆటంకం ఏర్పడినప్పుడు, పతివ్రత తాకితే బండ పగులుతుందని చెప్పటంతో మిహిరకులడనే కశ్మీర రాజు ఎందరో మహిళలను రప్పించి వారితో రాయిని తాకించాడు. రాయి అడ్డు తొలగకపోవటంతో వారంతా పతివ్రతలు కారని వారిని చంపించాడు. అలా వేల సంఖ్యలో మహిళలను మిహిరకులుడు చంపించాడు. మిహిరకులుడు ఎదుర్కున్న సమస్యనే జైనులాబిదీన్ ఇప్పుడు ‘లేదరి’ నది విషయంలో ఎదుర్కున్నాడు. అయితే, మిహిరకులుడికి భిన్నంగా, జైనులాబిదీన్ పలు రకాల యంత్రాలతో రాయిని ముక్కలు చేయించాడు. దాంతో లేదరి నది ప్రవాహానికి ఏర్పడిన ప్రతిబంధకం తొలగిపోయింది. అలా గంగను శివుని శిరస్సు నుంచి భూమికి ప్రవహింపచేసిన భగీరథుడిలా జైనులాబిదీన్ లేదరి నదిని మార్తాండ మైదానంలోకి ప్రవహింప చేశాడు.

మార్తాండ నగరం చుట్టూ ఓ ముత్యాల మాలలా మెరిసిపోయింది లేదరి నది. ఆ మెరుపు జైనులాబిదీన్ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది. ఆ నది తరంగాల నురుగు ‘సూర్యుడు కూడా నన్ను అణిచివేసి అదృశ్యం చేయలేడు’ అని గర్వంగా ప్రకటిస్తున్నట్టుంది. సూర్యుడు కూడా సాధించలేని పనిని జైనులాబిదీన్ చేశాడు. వంకరలు తిరుగుతూ ప్రవహిస్తున్న నదీమార్గాన్ని రేఖలా తిన్నగా మార్చమని బ్రహ్మదేవుడే ఆజ్ఞాపించి సాధించాడని అంటాడు జోనరాజు. మహిళ స్పర్శతో పురుషుడు సుఖాన్ని పొందినట్టు లేదరి నీటి స్పర్శతో ఆ ప్రాంతంలో ఎండిపోతున్న వృక్షాలన్నీ అమితానందాన్ని పొందాయి. ఉత్తుంగ తరంగాలతో ప్రవహిస్తున్న లేదరి నది మార్తండుడిని చూసి నవ్వుతున్నట్టు నురుగులు కక్కింది. సూర్యుడిని చూసి నవ్వుతున్నట్టు గలగల పారింది. వారు కలికాలంలో జీవిస్తున్నా లేదరి నదిలో ప్రతిబింబిస్తున్న సూర్యుడి వెలుతురు వారికి తాము పవిత్ర కాలంలొ జీవిస్తున్న భ్రమను కలిగించింది. అనేక ఉపనదులు కలవటంతో మరింత శక్తి పొందిన లేదరి నది ‘జైన ధర్మపురి’ అన్న పేరుతో ప్రసిద్ధి పొందింది.

ఈ సంఘటన తరువాత మరో సంఘటన ప్రస్తావన ఉంటుంది.

రాత్రి చీకటిని పారద్రోలిన సూర్య కిరణాలు స్వచ్ఛందంగా భూమిపై ప్రసరిస్తాయి. తన కర్తవ్యం నిర్వర్తించిన చంద్రుడు నిష్క్రమిస్తాడు. చంద్రుడి కర్తవ్యం ఏమిటంటే ఔషధాలను భూమిపై తయారు చేయటం.

మహాభారత యుద్ధం తరువాత అథర్వ వేద ప్రాబల్యం తగ్గింది. కర్ణాట ప్రజలను ఆశ్రయించింది అథర్వ వేదం ప్రాబల్యం కొరకు.  విజయనగర సామ్రాజ్యాన్ని కర్ణాట సామ్రాజ్యం అనికూడా అనేవారు.  విజయనగర సామ్రాజ్యం 1336 లో స్థాపితమయింది. జైనులాబిదీన్ పాలనా కాలం  1420 నుంచి  1470 వరకూ. కాబట్టి జోనరాజు ప్రస్తావించిన కర్ణాట విజయనగర సామ్రాజ్యంగా భావించవచ్చు. ఆ కాలంలో దేశవ్యాప్తంగా అణచివేతకు గురయిన భారతీయ ధర్మానుయాయులకు విజయనగరం ఆశ్రయమిచ్చి అక్కున చేర్చుకున్నదన్నది నిరూపితమైన సత్యం.

 శరణీకృతవాన్‍వేదః కర్ణాటన్పటు చేతనాన్॥
(జోనరాజ రాజతరంగిణి 1268)

ఈ శ్లోకం ఒక ప్రధానాంశాన్ని తెలుపుతోంది. ఉత్తర ప్రాంతాలు మహమ్మదీయుల దాడులకు గురై వారి పాలనలోకి వెళ్తున్న సమయంలో, భారతీయ విజ్ఞానం సజీవంగా ఉండేందుకు దక్షిణాది ప్రాంతాలను ఆశ్రయించింది. తురకల తాకిడికి  ఉత్తర ప్రాంతాలు గురయినంత  దక్షిణ ప్రాంతాలు గురికాలేదు. భారత దేశంలో తురకలు ఎన్నడూ సంపూర్ణ ఆధిక్యాన్ని సాధించలేదు. అంతకన్నా,  దక్షిణ ప్రాంతాలలో తురకల ప్రాబల్యం ఎన్నడూ సంపూర్ణం కాలేదు. చివరికి విజయనగర రాజ్య స్థాపన ఒక రకంగా, ముంచుకొస్తున్న తురకల ప్రవాహానికి అడ్డుకట్ట వేసి అక్కడే నిలిపి వేసింది. అథర్వ వేదం కర్ణాటకను ఆశ్రయించిందనటం ఈ ఆలోచనకు మద్దతు పలుకుతుంది.

శాస్త్రేణథర్వ వేదస్య మాహత్మ్యం పరిపశ్యతామ్।
కాశ్మీరికాణాం తత్ప్రాప్త్యో చిరమాసీన్మనోరథః॥
(జోనరాజ రాజతరంగిణి 1269)

ఈ శ్లోకం కూడా ఆనాటి వారి మానసిక స్థితిని ఊహించే వీలునిస్తుంది. కశ్మీరు నుంచి అథర్వ వేదం అదృశ్యమయిపోయింది. కానీ అథర్వ వేద ప్రాధాన్యం కశ్మీరీయులకు తెలుసు. కాబట్టి ఆ అథర్వ వేదాన్ని పొందాలని కశ్మీరీయులు చిరకాలం నుంచీ ప్రయత్నిస్తున్నారు. ఇది భారతదేశంలో పలు ప్రాంతాలకు వర్తిస్తుంది.

సాధారణంగా, రచయితలు యూదుల గురించి గొప్పగా చెప్తారు. తమ  దేశం విడిచి ప్రపంచమంతా చెల్లాచెదురైన యూదులు, ఏ ప్రాంతంలో ఉన్నా తమ భాషను, తమ సంస్కృతి సంప్రదాయాలను, దైవం పై విశ్వాసాన్ని కాపాడుకున్నారని వారి పట్టుదలను, దీక్షను, ధర్మంపై ప్రేమను పొగుడుతారు. కానీ స్వదేశంలో ఉంటూ కూడా స్వధర్మాన్ని కాపాడుకోవటం కోసం భారతీయులు చేసిన అత్యద్భుతమైన, అపూర్వమైన పోరాటాన్ని గమనించరు, ప్రస్తావించరు, పట్టించుకోరు. ఈ పోరాటం ఈ నాటికి కూడా సాగుతూండటం విశేషం!

కశ్మీరు పూర్తిగా ఇస్లామీయుల పరమయింది. ఇతర మతాల వారికి కశ్మీరంలో ఉనికి లేకుండా చేశారు ఇస్లామీయులు. కానీ జైనులాబిదీన్ వల్ల పండితులు కశ్మీరులో తిరిగి అడుగుపెట్టగలిగారు. జీవించగలుగుతున్నారు. కాస్త స్థిరపడగానే, కాస్త ధైర్యం రాగానే, వారు తాము కోల్పోయిన విజ్ఞానాన్ని తిరిగి కశ్మీరులో స్థిరపరచాలన్న ప్రయత్నాలు ప్రారంభించారు. అథర్వ వేదాన్ని కశ్మీరులో తిరిగి ప్రతిధ్వనించేట్టు చేయాలని వారు కోరుకోవటం, అందుకు ప్రయత్నంచటం ఈ నిజాన్ని బలపరుస్తుంది.

కాలేథ విపులే యాతే సూహభట్ట భయాకులః।
యుద్ధభట్టాభిధో మానీ దేశాంతర మగాద్ గుణీ॥
(జోనరాజ రాజతరంగిణి 1270)

సూహభట్టు నుంచి తప్పించుకునేందుకు పండితుడు యుద్ధభట్టు కశ్మీరును వదిలి పారిపోయాడు. అతడితో పాటు అతడి పాండిత్యం కూడా కశ్మీరు వదిలి పారిపోయి చాలా కాలం అయింది.

యజుషః పఠవాత్ర్పీతైః కర్ణాటౌః సోథ పాఠితః।
సరహస్య మథర్వణాం నిజాం ప్రత్యాగతో భువమ్॥
(జోనరాజ రాజతరంగిణి 1271)

అలా కశ్మీరు వదిలి పారిపోయిన యుద్ధభట్టు ఉత్తరం వదలి దక్షిణం చేరాడు. ఆ కాలంలో ఇలాంటి వలసలు అధికంగా సంభవించాయి. ఎక్కడెక్కడ ఇలా తురకల రాజ్యం ఏర్పడలేదో, ఎక్కడెక్కడ భారతీయులకు కాస్త రక్షణ దొరికే వీలుందో అక్కడక్కడకు వెతుక్కుంటూ చేరారు, ప్రాణాలు అరచేత పట్టుకుని ఉత్తర భారతాన్ని వదిలిన భారతీయులు దక్షిణ భారతం చేరారు. అలాగే కశ్మీరు వదలి  కర్ణాటక చేరాడు యుద్ధభట్టు. కర్ణాటలో తన యజుర్వేద పాండిత్యం ప్రదర్శనతో అందరినీ ముగ్ధులను చేశాడు. అతడి పాండిత్యానికి మెచ్చిన కర్ణాట పండితులు తాము రహస్యంగా ఉంచిన అథర్వ వేద రహస్యాలను యుద్ధభట్టుకు బోధించారు. అథర్వ వేదాన్ని పొందిన యుద్ధభట్టు, ఆ విజ్ఞానాన్ని విస్తరింప చేసేందుకు కశ్మీరు తిరిగి వచ్చాడు. జైనులాబిదీన్ వల్ల ఇప్పుడు కశ్మీరులో పరిస్థితులు మెరుగుపడ్డాయి. జ్ఞానానికి ఆదరణ లభిస్తోంది. అందుకని అథర్వ వేదాన్ని గ్రహించిన యుద్ధభట్టు కశ్మీరుకు తిరిగి వచ్చాడు.

ఇక్కడ ఒకసారి ఆలోచిస్తే, తమ ధర్మాన్ని సజీవంగా నిలపాలని ఆనాడు భారతీయులు జరిపిన ధర్మ పరిరక్షణ పోరాటం అత్యద్భుతమైనదని, అపూర్వమైనదని అనిపిస్తుంది. కశ్మీరు నుంచి యుద్ధభట్టు ఎన్నెన్ని విభిన్న ప్రాంతాలను, ప్రమాదాలను, మనుషులను దాటుకుని కర్నాట రాజ్యం చేరాడో! ఎన్నెన్ని విభిన్నమైన భాషల ప్రాంతాలలో, మనుషుల సహాయం పొందుతూ ముందుకు సాగాడో! వారితో ఎలా సంభాషించాడో! ఏ భాషలో మాట్లాడాడో! అప్పటికి సంస్కృతం ఇంకా కొందరికే ఫరిమితం కాలేదు. ప్రతి ప్రాంతంలోని వారికీ సంస్కృత పరిజ్ఞానం ఉండి ఉంటుంది. అప్పటికి హిందీ భాషకు ప్రాచుర్యం లేదు. ఉర్దూ ఇంకా స్పష్టమైన రూపు దిద్దుకోలేదు. పైగా దేశమంతా అనిశ్చిత పరిస్థితి నెలకొని ఉంది. అలాంటి పరిస్థితిలో యుద్ధభట్టు ఏమేం అనుభవాలు పొందాడో! ఎవరెవరు ఎలా సహాయం చేశారో! ఇది ఒక్క యుద్ధభట్టు గురించి మాత్రమే కాదు, తమ రాజ్యంపై తురుష్కులు దాడి చేసి అల్లకల్లోలం చేస్తుంటే, ఎన్ని కుటుంబాలు ప్రాణాలు అరచేత పెట్టుకుని, కట్టు బట్టలతో దక్షిణ ప్రాంతాలు చేరి ఆశ్రయం పొందాయో! ఒక సమాజం మొత్తం ఎలా అల్లకల్లోమయిందో ఊహకందనంత భయంకరమైన స్థితి అది. ఈనాడు, తాము దాడి చేసినందుకు తమపై ఎదురు దాడి చేయటంతో అల్లకల్లోలమవుతున్న గాజా ప్రజల కడగండ్లకు కన్నీళ్లు కారుస్తున్న వారెవరూ తమ పూర్వీకులు ఇంతకన్నా ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారన్న స్పృహ కూడా కనీసం ప్రదర్శించటంలేదు . ఈ ఆలోచనే వారు భరించలేరు. అది ఈ దేశ దౌర్భాగ్యం. ఈ దౌర్భాగ్య స్థితిని మరింతగా ఎత్తి చూపిస్తుంది జోనరాజ రాజతరంగిణి.

శ్రీ జైనుల్లాభ దేవస్య గుణినో గుణరాగిణః।
ఉపదీకృత్య తం వేదం పరాం తుష్టిమజీజనత్॥
(జోనరాజ రాజతరంగిణి 1272)

పాండిత్యానికి విజ్ఞానానికి పెద్ద పీట వేసి ఆదరించే జైనులాబిదీన్ యుద్ధభట్టు పాండిత్య ప్రదర్శనకు సంతోషించాడు. అతడిని ఆదరించాడు. యుద్ధభట్టు విజ్ఞానానికి జైనులాబిదీన్ సంపూర్ణంగా సంతుష్టుడయ్యాడు. అతడు సుల్తాన్‍కు అథర్వ వేద ప్రతిని అందజేశాడు. ఆ ప్రతి ఆధారంగా పండితులు అథర్వ వేదాన్ని తప్పనిసరిగా నేర్చుకోవాలని శౌర్యభట్టు ఆజ్ఞలు జారీచేశాడు. ‘తేనైవాథర్వవేదం తం ద్విజపుత్రానపాఠయత్‘. యుద్ధభట్టుకు ధనం, దుస్తులు, ఆహారం ఇవ్వటమే కాకుండా సుల్తాన్ అతడి నివాసానికి భూమి కూడా ఏర్పాటు చేశాడు. శౌర్యభట్టు సూచనల ప్రకారం అథర్వ వేదాన్ని కశ్మీరీయులు పఠించారు. ఈ వేదంలో వారు ఎంతగా నిష్ణాతులయ్యారంటే, కొంత కాలం తరువాత కర్ణాట నుంచి విద్యార్థులు అథర్వ వేదం అధ్యయనం చేసేందుకు కశ్మీరం వచ్చేవారు. కశ్మీరీయులు అథర్వవేద పఠనంలో తమను దాటిపోయారని అంగీకరించారు.

సా ధర్మిష్ఠా తు శాలాస్య శిర్యభట్టస్య ధీమతః!కర్ణాటానామపి పరమగమత్స్పృహణీయతామ్!! 

(జోనరాజ రాజతరంగిణి 1274)

యుధ్ధభట్టు సంఘటన చెప్పిన తరువాత ఒక చక్కని శ్లోకం రాశాడు జోనరాజు. (ఈ శ్లోకం ప్రక్షిప్త శ్లోకాల జాబితాలో వుంది).

మెరుపులు అందమైనవి. ఉరుములు వీనుల విందుగా ఉంటాయి. వర్షం అత్యంత ఆనందకరమైనది. అనునిత్యం మండించే సూర్యుడి ఎండ వేడి నుండి నీడ ఆశ్రయం ఇస్తుంది. గాలి కూడా మృదువుగా వీస్తుంది. రోజూ వర్షాన్ని కురిపిస్తూ సృష్టికర్త, ఎండ వేడికి బాధపడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగిస్తాడు.

రానురాను జైనులాబిదీన్‍కు ధనం పట్ల ఆసక్తి నశించింది. ధనమే కాదు, ఆభరణాలు అలంకరణలంటే  విరక్తి కలిగింది. గర్వం అన్నా, అహంకారం అన్నా విరక్తి కలిగింది. ఇక్కడ జైనులాబిదీన్ పై భారతీయ ధర్మం ప్రభావాన్ని గమనించవచ్చు. శౌర్యభట్టు వెనుక నుండి సుల్తాన్‌ను నడిపిస్తుంటే, భారతీయ ధర్మం గురించి తెలుసుకుంటున్న కొద్దీ సుల్తాన్ ఈ వైపు ఆకర్షితుడయి భౌతిక విషయ లాలస నుండి విముక్తుడవుతున్నట్టు తోస్తుంది.

అయితే, ఇలాంటి విరక్తి, వైముఖ్యాలు సుల్తాన్‍లో – ధనం, అధికారం వెంట పరుగులిడే వారి పట్ల విముఖత పెంచాయి. దాంలో సుల్తాన్‌కు తన పెద్ద కొడుకు పట్ల కూడా విముఖత కలిగింది. అతను తన పెద్ద కొడుకు, కాబోయే సుల్తాన్, అయినా జైనులాబిదీన్ అతడిని దూరం పెట్టాడు. కానీ జైనులాబిదీన్ అభీష్టానికి భిన్నంగా ఇతరులంతా ‘అదమ్ ఖాన్’ను కాబోయే సుల్తాన్‍లా అతనిని గౌరవిస్తూనే ఉన్నారు. అయితే అదమ్ ఖాన్ తన ఇద్దరు సోదరుల కోసం, హజీ ఖాన్ కోసం పోరాడినప్పుడు సుల్తానుకు అతడిపై కోపం నశించింది. నీరు మోడును చిగురింపచేసినట్టు సుల్తాన్ అతడిని మళ్లీ తనకు సన్నిహితుడిని చేసుకున్నాడు. సుల్తాన్ మాటలను అతని సన్నిహితులు సైతం ఖాతరు చేయకుండా అతని పెద్ద కొడుకు పక్షం వహించటం జైనులాబిదీన్ పాలనలో అతడి పట్ల, అతడి మతం వారిలో ఉన్న విముఖతను సూచిస్తుంది. జైనులాబిదీన్ పరాయి మతస్థులకు ప్రాధాన్యం ఇవ్వటం, వారి మాటలు వినటం అతని మతస్థులకు నచ్చకపోవటం స్వాభావికం. అతడిని గద్దె దింపటం కోసం ప్రయత్నించటం సర్వసాధారణం. ఈ సంఘటన సుల్తాన్ పట్ల వ్యతిరేకతకు నిదర్శనం.

సుల్తాన్ ‘మల్లా దర్యార్  ఖాన్’ కు తన తలపై చంద్రుడి స్థానాన్ని ఇచ్చాడు. ఈ మల్లా దర్యార్ ఖాన్ ఆరంభంలో బానిస. సుల్తాన్ దగ్గరకు అతడిని బానిసలా తెచ్చారు. సుల్తాన్ కాళ్ల దగ్గర కూర్చునేవాడు అతడు. తర్వాత సుల్తాన్ కుడి భుజం అయ్యాడు. కొన్నాళ్ళకు సుల్తాన్ కళ్ళు అయ్యాడు. ఇప్పుడు సుల్తాన్ తలపై చేరాడు. ఈ వర్ణనలో సుల్తాన్, ఈ మల్లా దర్యార్  ఖాన్‌కు ప్రాధాన్యం ఇవ్వటం భవిష్యత్తులో అధికార పోరుకు రంగం సిద్ధం చేయటం అన్న భావన కలిగిస్తుంది. ఇప్పటికే పండితులకు సుల్తాన్ ప్రాధాన్యం ఇవ్వటం, అతడి పట్ల వ్యతిరేతకతను పెంచి ఉంటుంది. దీనికి తోడు బానిసను నెత్తిన పెట్టుకున్నాడు. దాంతో అవకాశం కోసం ఎదురు చూస్తున్న సుల్తాన్ సంతానానికి క్రోధం కలగటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. డిల్లీ సుల్తానుల చరిత్రలో కూడా ఇలాంటి సంఘటనలున్నాయి.  సుల్తాన్ పాలనా కాలంలో సర్వగుణ సంపన్నుడయిన భట్ట వైశ్రావణుడు కుబేరుడితో సమానమైన ఐశ్వర్యవంతుడిలా వెలుగొందాడు.

ఇంతవరకు అంటే 1232 నుండి 1280 వరకూ ఉన్న 48 శ్లోకాలను జోనరాజ తరంగిణిని పరిష్కరించినవారు, అధ్యయనం చేసి విశ్లేషించినవారు ప్రక్షిప్తాలుగా భావిస్తారు. జోనరాజు రాసినా, మరొకరు రాసి రాజతరంగిణిలో చేర్చినా, ఈ శ్లోకాలు చరిత్రను అర్థం చేసుకోవటంలో, విశ్లేషించటంలో  తమ వంతు పాత్ర నిర్వహిస్తాయి.

ఇకపై ఈ ప్రక్షిప్తాలను వదిలి జోనరాజ రాజతరంగిణిలోని భాగంగా నిర్ధారితమైన శ్లోకాల వైపు దృష్టి సారించాల్సి ఉంటుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here