జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-8

0
2

[box type=’note’ fontsize=’16’] జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

కజ్జలేన తురుష్కేణ బహిరేత్సాధ మండలే।
మలినేన ప్రజాహృష్టి రుత్సా ట్యాస్ర వతాషతా॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 113)

[dropcap]సం[/dropcap]తానం లేకపోవడం వల్ల ఒక బ్రాహ్మణ పిల్లవాడిని రాజు దత్తతకు తీసుకున్నాడు. రాణి శ్రీసముద్ర, సముద్ర తనయ లాంటిది. లక్ష్మీ సమానురాలు. ఆమె నగరంలో తన పేరున ఒక మఠం నిర్మించింది. ఆమె నిర్మించిన మఠం వితస్త తీరంలో ఉంటుంది. కశ్మీర రాజు రామదేవుడు ఇరవై ఒక్క సంవత్సరాల ఒక నెల పదమూడు రోజులు రాజ్యం చేశాడు. రామదేవుడు క్రీ.శ. 1252 నుంచి 1273 వరకు రాజ్యం చేశాడు.

రామదేవుడు దత్తత తీసుకున్న బ్రాహ్మణ బాలుడు లక్ష్మణదేవుడు. తండ్రి మరణం తరువాత రాజయ్యాడు. ఆయన ఆరు శాస్త్రాలలో నిష్ణాతుడు, పండితుడు. కానీ రాజ్యభారం మోయటం అతనికి కష్టమయిపోయింది. జన్మ వల్ల బ్రాహ్మణుడు. దత్తత వల్ల క్షత్రియుడయ్యాడు. క్షత్రియుడయినంత మాత్రాన ఆయన బ్రాహ్మణ కుల లక్షణాలను, మనస్తత్వాన్ని  మార్చుకోలేకపోయాడు. రంగు వేసినంత మాత్రాన రాయి వజ్రం కానట్టు, క్షత్రియుడు దత్తత తీసుకున్నా, లక్ష్మణదేవుడికి క్షత్రియ లక్షణాలు రాలేదు. అతని రాణి ‘మహిళా’ వితస్త తీరాన, అత్తగారు నిర్మించిన మఠం పక్కనే తన పేరు మీద మరో మఠం నిర్మించింది. ఈ రకంగా కశ్మీరంలో అంతా సవ్యంగా, శాంతంగా సాగిపోతుందనుకుంటున్న తరుణంలో కజ్జలుడనే తురుష్కుడు కశ్మీరంపై దాడి చేశాడు. అంతా అల్లకల్లోలం చేశాడు.

జోనరాజు కజ్జల అని సంబోధించిన తురుష్కుడి అసలు పేరు ఖజ్లాక్ అని హిందు కశ్మీర్ అనే పుస్తకం లో ఎస్ ఎం హస్నైన్ రాశాడు. కశ్మీరులో అధికారం కోసం కొట్టుకుంటూ తురుష్క సైనికుల సహాయం తీసుకోవటం అధికమయిన తరువాత కశ్మీరులోకి ఇస్లామీయులు ప్రపంచంలోని పలు ప్రాంతాలనుంచి వచ్చి చేరటం వేగవంతమయింది. ముస్లీం సైనికులు, మెర్సెనరీలు, మత ప్రచారకులు కశ్మీరు వచ్చి చేరారు. వీరిని కశ్మీరు రాజులు ఆదరించి ఉన్నత పదవులు కూడా కట్టబెట్టారు. వారికి సర్వ స్వేఛ్ఛలనిచ్చారు. అల్లకల్లోలంలో ఉన్న కశ్మీరులో వీరు స్థిరపడటం వేగవంతమయింది. బలం వున్న ప్రతిఒక్కడూ కొందరిని కూడగట్టుకుని ఒక చిన్న ప్రాంతానికి అధికారి అయిపోవటం, ఆపై రాజకీయాల్లో పాల్గొని రాజ్యాధికారంకోసం అర్రులు చాచటం అలవాటయిపోయింది.

కజ్జలుడి దాడి వల్ల కశ్మీరం అల్లకల్లోలం అయింది.  కజ్జలుడితో యుద్ధంలో లక్ష్మణదేవుడు ప్రాణాలుకోల్పోయాడు.  లక్ష్మణదేవుడి మరణంతో అతడి కొడుకు సింహదేవుడు కశ్మీర సింహాసనాన్ని అధిష్టించాడు. అయితే కజ్జలుడి ఉపద్రవం వల్ల సింహదేవుడు  శ్రీనగరం వదలి కేవలం ‘లిద్దర్’ ప్రాంతం పైనే అధికారాన్ని నిలుపుకున్నాడు. అక్కడ కూడా ‘లోహార’ రాజు సంగ్రామచంద్రుడు కజ్జలుడితో చేయి కలిపి  అతడిని ప్రశాంతంగా ఉండనీయలేదు. సంగ్రామచంద్రుడి మరణం తరువాతనే, సింహదేవుడు ఊపిరి పీల్చుకోగలిగాడు. కజ్జలుడి సహాయంతో శ్రీనగరంపై అధికారం చలాయించాలని సంగ్రామసింహుడు  పోటీపడ్డాడు.  ఒకవైపు కజ్జలుడు కశ్మీర సామ్రాజ్యంలో ఓ ముక్కను ఆక్రమించుకున్నాడు. మరోవైపు సంగ్రామసింహుడు, సింహదేవుడికి అండగా నిలిచే బదులు కజ్జలుడితో చేయి కలిపి  అతడిపై దాడులు చేస్తూ చికాకు పరిచాడు. బలహీనుడిని చేశాడు .కజ్జలుడు 1287వరకూ కశ్మీరంలో తిష్ట వేశాడు. ఈ సమయంలో రాజు అధికారం లిద్దర్ ప్రాంతానికే పరిమితం అయింది. అయితే, శత్రువు ఆలోచనను పసిగట్టిన సిమ్హదేవుడు, లిద్దర్ నుంచే తానే కశ్మీర రాజునని ప్రకటించుకున్నాడు.  అయితే, కజ్జలుడికి కశ్మీరుపై ఆసక్తిలేదు. అతని దృష్టి దిల్లీ పై వుంది. సర్మక్, కిలి, బైదు అనే తన సైన్యాధికారులతో కలసి ఈయన దిల్లీ  సుల్తాన్ కుతుబుద్దీన్ ఐబక్ పై యుద్ధానికి వెళ్ళాడు.  ఎప్పుడయితే నాయకులు తమ తాత్కాలిక లాభాలు, అహంకారాల సంతృప్తులు అన్న హ్రస్వదృష్టితో వ్యవహరిస్తారో, అప్పుడు ఆ దేశం ప్రమాదంలో పడటం తథ్యం. కశ్మీరం ఇందుకు భిన్నం కాదు. ఒకరి తరువాత ఒకరుగా బలహీనులు కశ్మీర సింహాసనాన్ని ఆక్రమిస్తున్నారు. వారికి అండగా, శక్తిగా నిలబడేవారు లేరు. ఇరుగు పొరుగు రాజ్యాల వారు కూడా అవకాశం దొరికితే కశ్మీరంలో భూభాగాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నారు తప్ప, తురుష్కుల రూపంలో పొంచి ఉన్న ప్రమాదాన్ని వారు గమనించలేదు. ఎలాగయితే, తమ రాజ్యాలున్నాయో, అలాగే తురుష్కులూ, వారి రాజ్యాలూ అనుకున్నారు. పొరుగు రాజ్యాన్ని ఆక్రమించిన తురుష్కుడు తన రాజ్యంపై కన్నేస్తాడన్న ఆలోచనను వారు ప్రదర్శించలేదు.

సంగ్రామసింహుడి మరణం తరువాత ఊపిరి పీల్చుకున్న సింహదేవుడు పాలన వైపు దృష్టి పెట్టాడు. అప్పటికే కశ్మీర సామ్రాజ్య విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. సింహదేవుడు శాంతి లభించగానే మఠాలు, మందిరాల నిర్మాణంపై దృష్టి పెట్టాడు. ‘ధ్యానోద్ధార’ వద్ద నృసింహ విగ్రహాన్ని నిలిపాడు. విజయేశ్వర దేవుడి విగ్రహాన్ని లక్ష బంగారు నాణేల ఖర్చుతో తెచ్చిన పాలతో అభిషేకించాడు. తన గురువుకు 18 మఠాలపై ఆధిపత్యాన్ని అర్పించాడు. ఈ రకంగా అనేక పుణ్య కార్యాలు చేశాడు సింహదేవుడు.

శాంతి చిక్కగానే సింహదేవుడు మఠాలు, మందిరాలు నిర్మించటం, దైవపూజలు పెద్ద ఎత్తున చేయటం ఒక విషయం స్పష్టం చేస్తుంది. ఆది నుంచి, ఇప్పటి వరకూ భారత దేశంలో ‘మందిర నిర్మాణం’ అన్నది ఒక పవిత్ర కార్యం. అది సమాజంలో నెలకొని ఉన్న శాంతి సౌభాగ్యాలను సూచిస్తుంది. మందిర నిర్మాణం అన్నది సమాజాన్ని ఏకత్రితం చేయటంలో, ప్రజలలో ధార్మిక భావనలు జాగృతం చేయటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మందిర నిర్మాణం భారతదేశంలో ధార్మిక చర్య మాత్రమే కాదు, అది దీర్ఘకాల ప్రయోజనం కల ఆర్థిక చర్య కూడా. ప్రజలలో నిస్వార్థ సేవ భావనలు, ధార్మిక భావనలు కలిగిస్తుంది మందిరం. అందుకని ఆది నుంచీ అవకాశం లభించగానే దేశవ్యాప్తంగా రాజులు మందిరాలు నిర్మించేవారు. మఠాలు నిర్మించేవారు. వాటి పూజాదికాలకు తగు వసతులు కల్పించేవారు. అంటే, ఒక మందిరం వెలసిందంటే, ఒక ఊరు వెలుస్తుందన్న మాట. మొత్తం ఊరు ఆ మందిరంతో పాటు అభివృద్ధి చెందుతుంది. ప్రజలకు జీవిక గడిచిపోతుంది. జీవితం నడచిపోతుంది. దేశం అభివృద్ధి చెందుతుంది. ఇది భారతీయ జీవన విధానంలో ఒక ప్రధానమైన అంశం. ఇటీవలి కాలంలో మందిర నిర్మాణం, విగ్రహాల నిర్మాణాలను ఎగతాళి చేయటం, పూజా కార్యకలాపాలను హేళన చేయటం, అందుకు అయ్యే వ్యయాన్ని వ్యర్థమని వ్యాఖ్యానించటం ఆనవాయితీగా మారుతోంది. అలా వ్యాఖ్యానించేవారు తమని తాము విద్యావంతులుగా, మేధావులుగా భావించుకుని మిగతావారిని మూర్ఖుల్లా చూస్తున్నారు. కానీ భారతీయ జీవన విధానం, తత్త్వం, చరిత్రలు తెలిసినవారు ఎవ్వరూ అలా వ్యాఖ్యానించరు. అలాంటి వ్యాఖ్యలను సమర్థించరు. వారి అహంకార, అజ్ఞానాలకు నవ్వుకుని ముందుకు సాగిపోతుంటారు.

సింహదేవుడు గురుదేవుడు శంకరస్వామి వద్ద మంత్రోపదేశం పొందాదు. ప్రతి రోజు ఉదయం నిద్ర లేవగానే మంత్ర జపం చేసేవాడు.

పావక నిర్మల దృష్టిం విబుధగణై శ్చర్య మాన పాదమహమ్।
శశి శకలాద ర్శ్యాయుతం గౌరీశం శంకరం వందే॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 124)

నిర్మల దృష్టి కలవారు, ఎవరి పాదాలనైతే పండితులు, జ్ఞానులు పూజిస్తారో, ఎవరైతే అర్ధచంద్రుడిని అలంకారంగా అమర్చుకున్నారో, అలాంటి గౌరీశంకరులకు నమస్కారములు.

ఈ మంత్రం రోజూ ఉదయం లేవగానే చదివేవాడు. ఇలాంటి మంత్రాలు మనస్ఫూర్తిగా మననం చేయడం వల్ల అతని స్వర్గలోక దారి సుగమం అయింది. అతనికి ఆత్మబోధ లభించింది. ఇంత మంచి ధార్మిక రాజు కూడా దుష్టుల ప్రభావానికి గురయ్యాడు. ఇంత ధార్మికుడు కూడా దేవుడిని నమ్మనివాడయ్యాడు.  రాజు పై  దుష్ప్రభావం, దుష్టుల ప్రభావం అని మాత్రమే రాశాడు జోనరాజు . కానీ, చరిత్ర రచయితలు మాత్రం, రాజు తురుష్కుల ప్రభావంలో పడి దైవాన్ని నమ్మటం మానేశాడని రాశారు.  కూతురి దుష్ప్రవర్తనకి తండ్రిని శిక్షించాలనుకుని, ‘ఇడగలి’ అనే నృత్యాంగన అభ్యర్థను మన్నించి తండ్రిని శిక్షించకుండా వదిలిపెట్టాడు రాజు. తన సేవకురాలి కూతురిని చూసి మోహించాడు. ఆమె వివాహిత. ఆమె భర్త దర్య, కావ్యసింహ అనే వాడి సహాయంతో రాజును హతమార్చాడు. కొందరు చరిత్ర రచయితలు , రాజు రాను రాను తురుష్కుల ప్రభావానికి గురవటంతో రాజ్యంలో తమ బ్రతుకు దుర్భరం అయిందని కశ్మీరీ బ్రాహ్మణులు కుట్ర పన్ని రాజును చంపించారని అభిప్రాయపడతారు.  కొందరు  రాజు   తురుష్కుడిగా మతం మారేలోపు అతడిని బ్రాహ్మణులు హత్య చేయించారని రాశారు.  అప్పటికే ప్రజలు రాజు దుష్ప్రవర్తనతో విసిగి ఉన్నారు. ఈ రకంగా రాజు మరణాన్ని వారు ఆహ్వానించారు. పధ్నాలుగేళ్ళ, అయిదు నెలల, ఇరవై ఏడు రోజులు సింహదేవుడు రాజ్యం చేశాడు. అంటే, క్రీ.శ. 1286 నుంచి 1301 వరకూ సింహదేవుడు కశ్మీరాన్ని పాలించాడు.

ఇది కూడా కశ్మీర రాజులలో గమనించాల్సిన మరో అంశం. రాజులు   మంచివారుగా పేరు తెచ్చుకుంటారు, ధార్మికంగా ప్రవర్తిస్తారు. హఠాత్తుగా దుష్టుల ప్రభావానికి గురవుతారు. పాలనను విస్మరించి చెడు దారి పడతారు. నీరాజనాలర్పించిన ప్రజల ఛీత్కారాలకి గురవుతారు. అయితే, ఇందువల్ల అధికంగా నష్టపోయేది కశ్మీర ప్రజలు, కశ్మీర సమాజం!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here