జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-80

0
2

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

గతేష్వప్యేషు ధర్మోస్య రాజ్జో నైవాల్పతాం గతః।
క్ష్మాం దధానస్య శేషస్య దిగ్గజా హి పరిచ్ఛదః॥
(జోనరాజ రాజతరంగిణి 971)

ఇది అందరికీ అనుభవమే. చిన్న ధారలా ఆరంభమయిన నీటి ప్రవాహం ఉధృతమైన జలపాత దూకుడుతో  దూకుతూ కొండ దిగి  ప్రవాహంలా రూపాంతరం చెంది, దారిలో ఉన్న అన్ని ప్రతిబంధకాలను చీల్చుకుంటూ, ముందుకు సాగి, కాలక్రమంగా వేగం తగ్గి, ఉధృతి తగ్గి, ప్రవాహం చిన్న పాయ అయి, నేలలో ఇంకిపోయి అదృశ్యమయిపోతుంది. బాల సూర్యుడిలా ఆనందం కలిగిస్తూ, మధ్యాహ్న సూర్యుడై ప్రచండాగ్నిని వెదజల్లుతూ, సాయంత్రమయ్యేటప్పిటికి తీక్ష్ణత తగ్గి, సూర్యుడు  రాత్రికి వేడి చల్లారి దిగిపోవటం మనకు తెలుసు. అలాగే మనిషి కూడా బాల్యంలో అందరిపై ఆధారపడిన వాడు, యవ్వనంలో వ్యక్తిత్వం సంపాదించి, దూకుడుగా ముందుకు సాగి, నడి వయస్సులో శక్తిమంతుడై , తనకాళ్ళపై తాను నిలబడి, పదిమందీ తనపై ఆధారపడే  ఉచ్చస్థాయికి చేరుకుని, వయసుడుగుతున్న కొద్దీ శక్తివిహీనుడవుతూ ఓ రోజు అదృశ్యమై పోతాడు. ఇది ఈ విశ్యంలో అందరూ పాటించక తప్పని సూత్రం. నియమం. అందుకే అనేక  సామ్రాజ్యాలు, రాజ వంశాలూ  ఒకస్థాయికి చేరిన తరువాత పతనమై కాలగర్భంలో కలసిపోయాయి. ప్రతి ఒక్కరూ ఒక దశలో ఉచ్చస్థాయి అనుభవించి, చివరి దశలో దయనయమైన స్థితిని అనుభవించటం సంభవిస్తుంది. ఇదీ మనం చూస్తున్నాం. గమనిస్తున్నాం. అనుభవిస్తున్నాం. జైనులాబిదీన్ కూడా నెమ్మదిగా చివరి దశకు చేరుకుంటున్నాడు. జోనరాజు ఈ విషయం గ్రహించాడు. కానీ ఒప్పుకునేందుకు సిద్ధంగా లేడు.

భూమిని శేషనాగు తన తలపై మోస్తుందంటారు. సహాయంగా నలు దిక్కులా నాలుగు గజాలుంటాయంటారు. ఆ గజాలు సాయం పట్టకపోయినా, అసలు భారాన్ని మోసేది శేషనాగుయే! అలాగే ఎంతోమంది జైనులాబిదీన్ గొప్పరాజుగా, చరిత్రలో గుర్తుండిపోయే ప్రత్యేకత కల సుల్తానులా ఎదగటంలో తోడ్పడ్డారు. కానీ ఒకరొకరుగా వారు రాజును వదిలి కాలగర్భంలో కలవటం మొదలయింది. అంటే, ఉచ్చదశ అంతమై, పతన దశ ఆరంభమవుతున్నదన్న మాట. ఇది ఎంతటి వాడికైనా తప్పని స్థితి. జోనరాజు ఇది గ్రహించాడు. కానీ ఒప్పుకునేందుకు ఇష్టపడలేదు. నిజానికి ఈనాడు జరిగిన సంఘటన ప్రభావం, కొన్నాళ్ళకి కానీ తెలియదు. వెనక్కు తిరిగి చూసుకుంటే, పలు కీలకమైన సంఘటనలు ఏ రకంగా భవిష్యత్తును  ప్రభావితం చేశాయో తెలుస్తుంది. సమకాలికులు ఇది గ్రహించినా నిర్ధారణగా చెప్పలేరు. జోనరాజు కూడా భవిష్యత్తును ఊహించినా, ‘ఇలా అవుతుంద’ని నిర్దిష్టంగా చెప్పలేదు. నిస్సహాయంగా,  తన ఆలోచనలను శ్లోకాలలో పొదిగాడు. కాలం ప్రవాహ దారిలో ఓ పక్క నిలచి నిజాన్ని గుర్తించేందుకు ఇష్టపడక ఆశాభావాన్ని ప్రదర్శించాడు.

అసలు  భూభారం  మోసేది అనంతశేషుడు. సహాయంగా ఉన్న ఏనుగులు పోయినా  బాధలేదు అని రాశాడు. ఎందుకంటే, జైనులాబిదీన్ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ది, అతని ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసినవారు ఒకరొకరుగా మరణించారు.

ఆదౌ పాదతలే తిష్టన్ కరాలంబీకృతస్తతః।
అథ చాక్షుషతాం గచ్ఛన్ముత్తమాంగోర్ధ్యవర్తితామ్॥
(జోనరాజ రాజతరంగిణి 962)

నీతో దర్యావఖానోథ కృతజ్ఞేనేశ్వరేణ సః।
కలానిధిర్హిమరుచిః కౌముదీం హి తతాం వహన్॥
(జోనరాజ రాజతరంగిణి 963)

‘దర్వార్ ఖాన్’ అనే అతడు ముందుగా రాజు కాళ్ళ దగ్గర కూర్చునేవాడు. తరువాత రాజుతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగాడు. తరువాత రోజుల్లో రాజు కళ్లల్లో కళ్ళు పెట్టి  చూశాడు. చివరికి రాజు తలపై తిష్ట వేశాడు. రాజు ఇతడిని బానిసగా కొనుక్కున్నాడు. కానీ శివుడు తలపై చంద్రుడిని ధరించినట్టు, ఈయన తలపై దర్వార ఖానుడిని నిలుపుకున్నాడు.

రాజు కార్యనిర్వహణ భారంతో విసిగిపోయాడు. నిరంతరం కరవాలాల నీడన  బెదురుతూ జీవించాల్సి రావటం అతడికి నచ్చలేదు. కానీ మహమ్మద్ ఖాన్‍కు అందించిన ధనం చూసినప్పుడల్లా అతనికి సంతోషంగా కనిపించేది. మహమ్మద్ ఖాన్ మరణించాడు. మంచివారు త్వరగా మరణిస్తారు. అందరి మెప్పు పొందేవారి ఆయుష్షు తక్కువ. రాజ్యంలో మహిమశ్రీ అనే థక్కుర అడిగిన వారికి లేదనకుండా దానాలు చేసేవాడు. ఈయన కూడా తన పరివారమంతటితో స్వర్గం చేరుకున్నాడు. నిజానికి ఆయన మరణం ప్రాకృతికం కాదు. అతడు హత్యకు గురయ్యాడు.

అతడిని చంపింది ‘విన్నా’ అనే అతడి సోదరుడే. ఈయనను సుల్తాన్ పెద్ద పదవి ఇచ్చిన  నెపంతో వేరే దేశానికి పంపించాడు. వేరే దేశం నుంచి తిరిగి వస్తూ, ఉప్పు పన్నులు వసూలు చేసే సంఘౌల్  ప్రాంతం వద్ద విన్నా మరణించాడు. న్యాయ వ్యవహారాలను నిజాయితిగా పర్యవేక్షిస్తూ, సుల్తాన్ ఖ్యాతికి కారణమైన శీర్యభట్టు మరణించాడు. వీరంతా ఒకరొకరుగా తనని వదలి వెళ్లినా, సుల్తాన్ మంచి పనులు చేయటంలో ఎలాంటి మార్పు లేదు. ఎలాగయితే, సహాయంగా నిలబడిన ఏనుగులు లేకపోయినా భూభారాన్ని మోసే అనంతశేషుడికి ఎలా అలసట కలుగదో అలాగ, ఆయన ఆంతరంగికులు మరణించినా సుల్తాన్ సత్ప్రవర్తనలో ఏమీ మార్పు రాలేదన్న మాట.

ఒక్క రోజులో జయ్య భట్టు కోటి బంగారు నాణేలు పంచేట్టు చేశాడు సుల్తాన్. అందుకే జైనులాబిదీన్‍ను ప్రజలు విష్ణువు అవతారంగా భావిస్తారు. తన పాలన కాలంలో జైనులాబిదీన్ ఆశ్చర్యకరమైన పనులు సాధించాడు. మార్తాండ పీఠభూమిపై ఆయన చెరకు పంటలు పండించాడు. ఆ పంటల నుండి అమృతాన్ని చంద్రుడు భిక్షం ఎత్తి మరీ తీసుకునేవాడు. ఇలాంటి మంచి పనులు, ప్రజోపయోగ కార్యాలు చేయటం వల్ల సుల్తాన్ పై వయసు ప్రభావం పడలేదు. సాధారణంగా ఒక  వయసు వచ్చేసరికి ప్రతి వారి ముఖం ముడతలు పడటం, వెంట్రుకలు తెల్లబడటం సంభవిస్తుంది. కానీ సుల్తాన్ వదనం పై కానీ, శరీరం పై కానీ వయసు ఛాయలు ఏ మాత్రం కనబడలేదు.

సింధునదికి వరదలు వచ్చినప్పుడు పంటలకు నష్టం సంభవిస్తూండేది. అందువల్ల ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను తొలగించేందుకు సుల్తాన్ సింధు నదిని ‘తూలమూల’ నుండి ‘భారో స’ వైపుకు మళ్లించాడు.

కశ్మీరు వాతావరణం చెరకు పంటలకు సరిపోదు. కానీ జైనులాబిదీన్ చెరకు పంటలు పండించాడు. కానీ అలాగే సింధు నదికి వరదలు రాకుండా ‘తూలమూల’ నుండి ‘భారో స’ వైపుకు మళ్ళించాడు. ప్రస్తుతం గందెర్బల్  వద్ద ఉన్న ‘తూల్మాన్’ను ఆనాటి ‘తూలమూల’గా భావిస్తున్నారు. ఇక్కడ  క్షీర భవాని దేవి మందిరం ఉంది. కల్హణ రాజతరంగిణిలో తూలమూల బ్రాహ్మణులు జయాపీడుడి పాలనకు వ్యతిరేకంగా ధర్నా చేశారు. కాబట్టి చరిత్రలో తూలమూల ప్రాధాన్యం కల ప్రాంతంగా భావించవచ్చు. తూలమూల వద్ద ఉన్న నదిని చంద్రభాగ నదిగా  నీలమత పురాణం ప్రస్తావిస్తుంది. ఈ చంద్రభాగా నది ఇండస్ నది ఒక పాయ. ఇది ఝీలం నదిలో కలుస్తుంది.

ఇంతటితో హఠాత్తుగా జోనరాజ రాజతరంగిణి ఆగిపోతుంది. దీనికి కారణం శ్రీవరుని రాజతరంగిణి వల్ల తెలుస్తుంది.

జోనరాజు హఠాత్తుగా మరణించాడు. దాంతో రాజతరంగిణి హఠాత్తుగా ఆగిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే, జోనరాజు అదృష్టవంతుడు. జైనులాబిదీన్ ఉచ్చదశను చూశాడు. పతనారంభాన్ని గమనించాడు. జైనులాబిదీన్ ఖ్యాతికి కారణమైన వారందరూ ఆయనను వదిలి స్వర్గానికి వెళ్ళటం చూశాడు. ఎవరు వెళ్ళినా జైనులాబిదీన్ ఖ్యాతికి ఎలాంటి నష్టం లేదని ప్రకటించాడు. తానూ హఠాత్తుగా జైనులాబిదీన్‍ను వదిలి వెళ్ళాడు. దాంతో హఠాత్తుగా ఆగిపోయిన రాజతరంగిణిని శ్రీవరుడు కొనసాగించాడు. అయితే, జోనరాజ రాజతరంగిణికి , శ్రీవరుడి రాజతరంగిణికి నడుమ కొన్ని  శ్లోకాలు లభించాయి. అయితే, ఇవి జోనరాజు రాసినవేనా, కాదా అన్నదానిపై ఏకాభిప్రాయం లేదు. కానీ కొన్ని చారిత్రక సత్యాలను తెలుపుతాయవి. కాబట్టి శ్రీవరుడి రాజతరంగిణిని ఆరంభించే ముందు ఈ శ్లోకాలు తెలుసుకోవటం మంచిది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here