Site icon Sanchika

జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-81

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

పూర్వాబ్దతిథివారక్షసంక్రాన్త్యాద్యో కసాధనః।
తిథివారర్దసంక్రాంతీర్భావిన్యబ్దే క్షణోల్లిఖాన్॥
(జోనరాజ రాజతరంగిణి 1313)

‘Stray supplements’ గా భావించిన శ్లోకాలను ప్రత్యేకంగా, జోనరాజ రాజతరంగిణికి అనుబంధంగా పొందుపరిచారు. 1313 నుండి 1334 వరకూ ఉన్న ఈ శ్లోకాలు జైనులాబిదీన్ ఎవరెవరికి ఏయే పదవులు, ఎందుకు ఇచ్చాడో తెలుపుతాయి. వీటిని జోనరాజ రాజతరంగిణిలో భాగంగాను భావించలేకపోతున్నారు. ఎందుకంటే, ఇవి జోనరాజ రాజతరంగిణి లోని ఏ సందర్భంలోనూ ఎక్కడా సరిపోవు. అలాగని ఈ శ్లోకాలను విస్మరించలేకపోతున్నారు. ఎందుకంటే, ఈ శ్లోకాల ద్వారా కొన్ని చారిత్రక వ్యక్తుల పేర్లు, వారి పనులు తెలుస్తున్నాయి. అందుకని ఈ శ్లోకాలకు జోనరాజ రాజతరంగిణిలో భాగం చెయ్యలేదు. అలాగని వదిలి వేయకుండా జోనరాజ రాజతరంగిణి పూర్తయ్యాక, ప్రత్యేకంగా పొందుపరిచారు.

ఈ శ్లోకం ద్వారా భట్టుమయ్యకు గొప్ప జ్యోతిష పరిజ్ఞానం, ప్రావీణ్యాలు ఉన్నాయని తెలుస్తుంది. ఆయన సూర్యుని గమనాన్ని పరిశీలిస్తూ, గత సంవత్సరం కదలికల ద్వారా క్షణంలో ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం కాలగణనకు తయారు చేసేవాడు. ఈ సందర్భంలో ఆయన అప్పటికే ప్రఖ్యాతి పొందిన ‘ఖండఖాద్యక’ అనే గ్రంథాన్ని పట్టించుకునేవాడు కాదు.

ఈ శ్లోకం తరువాత ప్రకృతి వర్ణన శ్లోకం ఉంటుంది.

విధి నిర్దేశాన్ని అనుసరించి చంద్రుడు బాధలను ఉపశమింప చేసేందుకు రాత్రి ఉదయిస్తాడు. కానీ రాత్రి అనే అతని భార్య వేదనతో, సూర్యోదయం కాగానే సూర్యుడు అనే మండే అగ్నిగుండంలో ప్రవేశిస్తుంది. ఉదయం పూట ఉంటే మంచుతెరల మాటున ఆమె ఆకాశం చేరుతుంది. ఆకాశం చేరి ఆమె ఉజ్జ్వలంగా వెలుగునిస్తుంది. ఈ వెలుగును ఆమె సూర్యుడి నుంచి గ్రహిస్తుంది.

చలికాలం ఉగ్రరూపం ప్రదర్శిస్తుంది. చలికాలం అంతా నాశనం చేయకపోతే వసంతకాలం ఎలా భూమిని మళ్ళీ పుష్పింప చేయగలదు?

ఇలాంటి ఒకదానితో ఒకటి సంబంధం లేని శ్లోకాల తరువాత కొన్ని సాంఘికంగా ప్రాధాన్యం కల శ్లోకాలుంటాయి.

స్వయంగా పండితుడయినా సరే, భట్టు సూహ, సనాతన ధర్మ సూత్రాల ప్రకారం జరిపే  శవదహనాన్ని నిషేధించాడు. ఎందుకంటే ఆయన భారతీయ ధర్మద్వేషి కావటంతో ఇలాంటి కర్మకాండలను భరించగలిగేవాడు కాదు.సూహభట్టు భయంతో సనాతన ధర్మానుయాయులు కర్మకాండలు నిర్వహించేవారు కాదు. మరణించే వారిని దహనం చేసేవారు కాదు. వారి శవాలను రహస్యంగా నీళ్ళల్లోకి విసిరేసేవారు. అడవుల్లో రహస్యంగా వదిలివేసేవారు. ఎవరికీ తెలియకుండా శవాలను బంధువులు పాతిపెట్టేసేవారు. సూహభట్టు మరణం తరువాత, ధైర్యంగా మరణించిన వారికి కర్మకాండలు జరపకుండా – సయ్యద్ మేక్క అడ్డు పడ్డాడు. ఈ విషయం తెలిసిన జైనులాబిదీన్ సయ్యద్‌ను పదవి నుంచి తొలగించాడు. దాంతో ధైర్యంగా కర్మకాండలు చేసుకోవటం ఆరంభమయింది. తమ భర్తలకు అనుసరిస్తూ వారి భార్యలకు సహగమనం చేసే స్వేచ్ఛ లభించింది. అందువల్ల స్వర్గంలో అస్పరసల వెంటపడి చెడ్డ పేరు తెచ్చుకోవటం నుంచి వారి భర్తలను కాపాడుకునే వీలు భార్యలకు చిక్కింది.

థక్కురాలతో  కలిసి జైనులాబిదీన్ కశ్మీరుపై అధికారం సాధించాడు. యుద్ధంలో మరణించిన శవాల నుంచి ధనాన్ని, విలువైన వస్తువులను కాజేస్తున్నాడన్న కారణం వల్ల జస్రధుడిని జైనులాబిదీన్ పదవి నుంచి తొలగించాడు.

యుద్ధంలో ధైర్యాన్ని ప్రదర్శించి వీరోచితంగా పోరాడినందుకు సుల్తాన్ పలువురికి బహుమానాలు అందజేశాడు.

‘దానాత్ కథానా’ అధికారి సంతానం హనూమత్ ప్రదర్శించిన సాహసానికి మెచ్చి సుల్తాన్ అతనికి ఆ ప్రాంతంపై అధికారాన్ని అప్పచెప్పాడు. తెలివిగా సమస్యలను పరిష్కరించే మేరకుడికి వివాదాలను పరిష్కరిచే బాధ్యతను అప్పచెప్పాడు. ఫిర్యాదులలో నిజానిజాలు తేల్చే అధికారం ఇచ్చాడు. పలువురు ముస్లింలు భట్టుల వేషంలో వచ్చి తమ ఆస్తులను వేరేవారు దోచుకున్నారని చేసే ఫిర్యాదులకు ఈయన వారిలాగే మోసంతో పరిష్కరించేవాడు.థక్కుర సూరేజ్యాధిశాన కు కూడా అతని తెలివికి తగ్గ పదవిచ్చాడు. సైన్యంపై అధికారాన్ని మాలిక నౌరూజ్‌కు అప్పజెప్పాడు. లేదరి నది ఒడ్డున ఉన్న ప్రాంతాన్ని శతాజ రాజుకు ఇచ్చాడు. మల్లేశ  రాజుకు బాగా ఆదాయాన్నిచ్చే గ్రామాలను దానం చేశాడు.

అత్యద్భుతమైన శౌర్యం ప్రదర్శించినందున ఆదమ్‌కు ‘అర్ధవాన’ జిల్లాను దానం చేశాడు సుల్తాన్. మార్గపతి మహమ్మద్‍కు ప్రవదేశపురంపై అధికారాన్ని కట్టబెట్టాడు. ప్రవదేశపురంతో పాటు ‘భంగీలా’ ప్రాంతంపై కూడా ఆయనకే అధికారాన్ని ఇచ్చాదు. మహమ్మద్ సంతానానికి కూడా ఎన్నో కీలకమైన పదవులు ఇచ్చాడు సుల్తాన్. పర్వత కనుమలపై అధికారాన్ని తాజిక్‍కు ఇచ్చాడు. శ్రీజకట్టపై అధికారాన్ని, మసేస్కర ప్రాంతాన్ని అహ్మద్ అనే థక్కురాకు ఇచ్చాడు. మిగిలిన థక్కురాలకు వారు కోరినట్టు వేలకొలది గ్రామాలపై అధికారాన్ని అప్పజెప్పి సంతృప్తి పరిచాడు.

ఇంతటితో జోనరాజు రచించిన రాజతరంగిణి సంపూర్ణమవుతుంది.

ఇతి శ్రీ జోనరాజ కృత రాజతరంగిణీ సమాప్తః॥

***

కొద్ది విరామం తరువాత శ్రీవరుడు కొనసాగించిన ‘జైనరాజతరంగిణి’ వ్యాఖ్యాన సహిత అనువాదం ఆరంభవుతుంది.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version