నీలి నీడలు – ఖండిక 3: జూదము

    0
    3

    కోడి పందేలు, పేకాట, మూడు ముక్క
    లాట, పొట్టేళ్ళ పందేలు, లాటరీలు
    మట్క జూదంబు, కాటను మార్కెటులును
    అరయ గుఱ్ఱపుంబందేలు ననగజెల్లు
    ధాత్రి జూదంబులివి యని తద్దరీతి. (8)

    మాయమోసాలతో గూడినముజెపుడు
    అధికమొత్తంబువచ్చునంచహరహంబు
    మభ్యపెట్టెడి స్కీములున్మహిని గాంచ
    జూదసమమని జెప్పిరి వేదవిధులు. (9)

    పాలకుండు మొదలు, పాలితులైనట్టి
    పేదవాని వఱకు, వెఱ్ఱితోడ,
    జూదమాడుచుండ్రి చోద్యంబుగా నేడు
    కష్టములను గోరి కలియుగాన. (10)

    రాజిల్లుచుండెడి రాజ్యరమలు పోయె
    కోటపేటలు పోయె, గొప్పపోయె.
    అధికారములు పోయె, నందలంబులు బోయె
    వైభవంబులు బోయె, వాసి పోయె.
    అంతస్తులనుబోయె, నాస్తిపాస్తులు బోయె
    మాన్యంబులుంబోయె, మడులు బోయె.
    ఠావు దర్పముబోయె, ఠేవచేవయు బోయె
    నగల డాబు బోయె, నెగడు బోయె.
    కృతయుగము నుండి కలిని ప్రస్తుతముదనుక
    విస్తరించిన చరితల వెదకి జూడ
    ఎంతనాశంబు జరిగెనో యెంచలేము
    అధమమైనట్టి జూదంపుటాట వలన. (11)

    మానవత్వము పోవు, మమకారమునుబోవు
    మంచిచెడులు బోవు, మమత పోవు
    నీతిరీతులు బోవు, నిర్మలత్వము బోవు
    శాంతగుణము బోవు, దాంతిపోవు
    భక్తిరక్తులు బోవు, బంధుప్రేమయుబోవు
    ఆలోచనాశక్తి యసలుబోవు
    గౌరవంబును బోవు, గరుణభావము బోవు
    పాండిత్యమునుబోవు, పరువు బోవు
    కలుషములకును నెలవైన కలియుగాన
    ప్రళయనర్తన జేయుచుబ్రబలునట్టి
    చేటుగలిగించు జూదంపుటాటవల్ల
    మందబుద్ధులు దుఃఖింత్రు మహిని మిపుడు. (12)

    మంచి బుద్ధి పోయి వంచనంబును వచ్చు
    సంతసమును బోయి వంతగలుగు
    మానవత్వము బోయి దానవత్వము వచ్చు
    వసుధ జూదమాడు ప్రజలకెపుడు. (13)

    ఆలుబిడ్డల పట్ల ననురాగమును బోవు
    తల్లిదండ్రుల పట్ల ధ్యాస తగ్గు
    బంధుజాలంబుపై పట్టును గోల్పోవు
    హితుల వాక్యంబులు హేయమగును
    ఇంటి బాధ్యతలకునెంతో దూరమునౌను
    నీతిసూక్తులనిన రోత గలుగు
    ఆలోచనా జ్ఞానమంతరించసాగు
    పాపపు పనులపై చూపు గలుగు
    రోష భావంబు హెచ్చు సద్భాషలుదుగు
    పాడు యలవాట్లు జేరును బాధ లొడవు
    ఆర్తి కలుగును జగతిని కీర్తిదొలగు
    దుష్ట జూదంబునాడిన ధూర్తులకును. (14)

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here