కోడి పందేలలో దాడివేడియు రేగి
కయ్యాలకేనది కారణంబు
పొట్టేళ్ల పందేల బట్టుదలలు హెచ్చి
దానవత్వంబుకు దారితీయు
గుఱ్ఱపుపందేలు గోర్కులంబెంచును
సర్వముంగోల్పోవు స్థాయి దెచ్చు
మూడు ముక్కుల యాట, ముందర మురిపించి
వెనువెంట ధనమంత చనగజేయు
మట్క జూదంబు డబ్బుపై మరులు గొలిపి
ఆశలంబెంచి సతతంబు హానినిచ్చి
ఇల్లు గుల్లగ జేసి యిక్కట్లు గూర్చు
తినగ తిండి కరువగు తీరు రెచ్చు. (15)
ఆహారనిద్రలు అను మాట లేనట్టి
తీరును కల్పించి దీనుజేసి
పవలురాత్రిళ్లను భావమెంచగనీక
అనిశంబు నాడగ నాశగొల్పి
ఇల్లాలు పిల్లలునేమౌదురోయను
తలపైనరానీక తులువజేసి
ఇంటి పనుల నెపుడునే మాత్రమేనియు
పట్టించుకొననట్టి ఫణితినిచ్చి
ఆస్తులను అమ్ముకొనునట్టి యవసరమును
వింతరీతిగ గల్పించి, విభవమంత
తరిగిపోయెడి విధమును తనరజేసి
ఇలను పేకాట మనుజుని హీనుజేయు. (16)
తక్కువ ఖర్చుతో నెక్కుడు మొత్తమున్
పొందవచ్చనియెడి పూన్కెనిచ్చి
కాలాదికాలాననె కోట్లాది ధనమును
బడయగవచ్చను వాంఛ బెంచి
ఎంతమాత్రంబేని సుంతైన శ్రమ లేక
కోట్లు కూడగబెత్తు కోర్కెనిచ్చి
అత్యంత విలువైన అపరంజి వస్తువుల్
సులువుగా బొందెడు తలపునిచ్చి
ఆశ మితి మీరి కరము దురాశ హెచ్చు
నటుల జేసియు మనుజుల నవనియందు
మోసములుకును గురిజేసి యాసడుల్చు
మాయ లాటరీల్‌స్కీములు మహితరీతి. (17)
మోసములోన బుట్టియును, మోసము తోడుత వృద్ధి బొందుచున్
మోసముజేసి కొంపలను ముంచుచు గోట్లకు “ఐపి” బెట్టుచున్
మోసముచెత మానవుల మోదమడంచుచు ఖేదమిచ్చుచున్
గాసిలజేయుచున్మిగుల గ్రాలెడి స్కీములు నివ్వియిద్ధరన్. (18)
జూదమాడువాడు క్షోణీతలంబున
మంచిచెడ్డలెపుడు నెంచలేడు
ఉచ్ఛనీచములను నూహింపగాలేడు
ఒప్పుతప్పులరయుచుండ లేడు. (19)
కావున నిట్టి జూదముల గాలిని గూడను సోకనీయకన్
ధీ వినుత ప్రభావులగు దిట్టలతోడ మెలంగుచున్కడున్
భావనజేయుచున్మదిని భాసిలు మంచిని నెల్లవేళలన్
జీవితయాత్ర జేయవలె బెన్నగు రీతిని నెప్డు మానవుల్. (20)
పోరాడు జూదమాడగ
ఆరాటము చెందరాదు నధిక ధనముకై
తేరగ లాభార్జనమును
గోరుచు, మనుజాళి కరముకందురు రిలలోన్. (21)
ఇట్టి దుష్ట జూదమింక మీదటనైన
ధరణి తలమునుండి తరలిపోవు
నట్లు జేయమిగుల యత్నింపకున్నను
నరుల జీవితాలు నాశమగును. (22)