రచనలు చేయాలన్న ఆసక్తి, ఉత్సాహం వున్న యువ రచయితలకు ఆహ్వానం!!!!

1
2

[dropcap]ప్ర[/dropcap]తి సంచికతో సంచికకు ఆదరణ పెరగటం తెలుస్తోంది. ప్రతి సంచికను ఆకర్షణీయంగా అందించాలని ప్రయత్నిస్తున్నాము. పెరుగుతున్న పాఠకాదరణ సంతోషాన్ని కలిగిస్తున్నా ఇంకా వీలయినంతమందిని చేరాలన్న ప్రయత్నాలు చేస్తున్నాము. అనుక్షణం ఇంకా చేరని పాఠకులను చేరేందుకు ప్రణాళికలు వేస్తూ ముందుకు సాగుతున్నాము. ఈ విషయంలో పాఠకులు సైతం తమ అభిప్రాయాలను, సలహాలను సూచనలను అందచేస్తూ ముందుకు సాగటంలో తమవంతుగా తోడ్పడాల్సివుంటుంది.

ఈ సందర్భంగా ఒక విషయాన్ని ప్రస్తావించుకోవాల్సివుంటుంది. ప్రస్తుతం తెలుగు సాహిత్య ప్రపంచంలో చురుకుగా రచనలు చేస్తున్నవారి సగటు వయసు యాభై పైనే వుంటుంది. యువ రచయితలు అరుదుగా కనిపిస్తున్నారు. సాహిత్యసభల్లో కూడా ఎప్పుడూ పరిచయమైన వారే కనిపిస్తారు… వేదికపైన కానీ, క్రిందకానీ… వారిలో యువకులు అరుదు… అప్పుడప్పుడూ, అక్కడక్కడా ఎవరయినా యువరచయిత ప్రతిభను కనబరిస్తే, వెంటనే పొగడేవారు చుట్టూ చేరి ఆ యువ రచయితను అందని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. దాంతో ఇక నేర్పేదే తప్ప తాను నేర్చుకునేదేమీ లేదన్న భ్రమలో పడుతున్నారు యువ రచయితలు. నిప్పులుకక్కుకుంటూ నింగికి ఎగరాల్సినవారు, కొద్దికాలానికి ఫేస్‌బుక్ పొగడ్తలకు, సభల్లో శాలువాలకు పరిమితమైపోతున్నారు. ఇంకొందరు యువ రచయితలను పేరు రావాలన్నా, గుర్తింపు రావాలన్నా ఏదో ముఠాతో జతకట్టక తప్పనిసరి అని నమ్మించి దారి మళ్ళిస్తున్నారు. దాంతో ఆకాశంలో వుండి, ఎగసిపడుతున్న అలలను దాటి ముందుకు చూసే ద్రష్టలా ఎదగాల్సిన ప్రతిభావంతులు, ఎగసే అలతో ఎగిరి, విరిగే అలతో విరిగి కొన్నాళ్ళకు క్షణాలలో పేలిపోయే నురుగుల్లా అప్పుడప్పుడూ నినాదాల రచనలకు, గోడమీద రాసే రాతల్లంటి వాక్యల రచనలకు పరిమితమై పోతున్నారు. వారు కూడా వేదికలు, సభలు తప్ప రచనల జోలికి వెళ్ళనివారవుతున్నారు. అంటే ముందే యువ రచయితలు రావటంలేదు. వచ్చినా వారు దారి తప్పుతున్నారు.

ముఖ్యంగా యువ రచయితలకు, ఇంకా పరిణతి చెందకముందే అవార్డులిచ్చి అందలాలెక్కిస్తూండటం ఒక రకంగా ఇంకా పూర్తిగా వికసించని మొగ్గను ఇనుపపంజరాల్లో బంధించటం లాంటిది. ఇందువల్ల రచయితగా ఎదుగుదల ఆగటమేకాదు, ఇక తాము నేర్చుకోవాల్సిందేమీ లేదన్న భ్రమలోకి వచ్చేస్తున్నారు. అనుభవజ్ఞులయిన రచయితలను తూష్ణీంభావంతో చూస్తున్నారు. రచయిత పని రాయటమే తప్ప సన్మానాలు, శాలువలు, పొగడ్తల పందిళ్ళు కాదని మరచిపోతూ, రాయటం తప్ప మిగతావన్నిటి వెంట పడుతున్నారు. యువ రచయితలను ప్రోత్సహించటం వాంఛనీయమే అయినా ఇది పద్ధతి కాదేమో ఆలోచించాలి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆటగాళ్ళు యవ్వనంలో ఎత్తులు ఎదుగుతారు. వయసు ఎదుగుతున్నా కొద్దీ వారి పటిమ తగ్గుతుంది. కానీ, రచయితకు వయసు పెరుగుతున్నాకొద్దీ పరిణతి పెరుగుతుంది. వారి ప్రతిభ మరింత ప్రస్ఫుటంగా ప్రకటితమవుతుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా రచయితలకు గుర్తింపు అధిక సందర్భాలలో ఒక స్థాయి దాటిన తరువాతనే లభిస్తుంది. పెర్ల్ ఎస్ బక్ అనే రచయిత్రి అతి తక్కువ వయసులో నోబెల్ బహుమతి పొందిన రచయిత్రి. ‘ది గుడ్ ఎర్త్’ అనే నవలకు ఆమెకీ పురస్కారం లభించింది. అయితే, ఆ తరువాత ఆమె రచనలేవీ ఆ స్థాయిలో లేకపోవటమే కాదు, ఒక దశలో ఆమెకి పురస్కారం ఇచ్చినందుకు నోబెల్ బహుమతి నిర్వాహకులు సంజాయిషీలు ఇచ్చుకుని ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. యువస్థాయిలోనే పురస్కారాల ఫలితం ఇలావుంటుంది.

ప్రస్తుతం సాహిత్య ప్రపంచంలో నెలకొని వున్న ఈ పరిస్థితులను గమనించిన సంచిక రాయాలన్న తపన, ఆసక్తి వున్న వారికి ఉత్సాహ ప్రోత్సాహాలిచ్చే ప్రణాళిక సిద్ధం చేసింది. 16 నుంచి 40 ఏళ్ళలోపు వారెవరికయినా రాయాలని ఆసక్తి వుంటే వారు సంచికకు మెయిల్ చేస్తే… వీలు చూసుకుని సంచిక వారికి ఆసక్తికరంగా రచించటంలో మెళకువలు నేర్పుతుంది. వారికి ప్రోత్సాహాన్నిస్తూ వారి రచనలను సంచికలో ప్రచురిస్తుంది. ఔత్సాహికుల సంఖ్యను బట్టి ఆయాప్రాంతాలలో ఒక రోజు శిబిరాలను నిర్వహించి ఆసక్తికరంగా రచించటంలో అందెవేసిన రచయితలతో రచనా మెళకువలు నేర్పుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనవి. అయితే సంచిక ఒక విషయం ముందే స్పష్టం చేస్తుంది. సంచిక చూపిన బాటలో నడవటం వల్ల మీకు అవార్డులు రావు. ఇంటెర్వ్యూలు, పొగడ్తలు, శాలువాలు మీ దరికి చేరవు. కానీ, మీ రచనలు పాఠకులను అలరిస్తాయి. మీకు సంతృప్తికలిగే రీతిలో మీరు రచనలు చేస్తారు. మీ రచనలు సమాజానికి మేలు చేస్తాయి తప్ప విద్వేషాలు రెచ్చగొట్టి మనసులమధ్య అడ్డుగోడలు నిర్మించే ఇటుకకరాళ్ళుకావు. ఇప్పటికే పలు ప్రాంతాలలో పెద్దలతో, స్కూళ్ళు, కాలేజీలతో సంప్రతింపులు జరుపుతోంది సంచిక. యువ రచయితలను ప్రోత్సహించే పధకంలో భాగంగా ఈ సంచికలో ఇంకా స్కూల్లో చదువుతున్న విష్ణువర్ధన్ అనె యువ కవి కవిత రైతన్నా! ప్రచురితమయింది.

పాఠకులను ఆకర్షించటంలో భాగంగా త్వరలో సంచికలో మూడు విభిన్నమయిన నవలలు ఆరంభమవబోతున్నాయి. జూలై నెల రెండవ ఆదివారం విడుదలయ్యే సంచికలో ప్రఖ్యాత రచయిత్రి గంటి భానుమతి నవల, ఆగస్ట్ సంచికతో వేటూరి ఆనంద్ నవల, సెప్టెంబర్ సంచికతో స్వాతి శ్రీపాద అనువాద నవలలు ఆరంభమవుతాయి.. మరిన్ని కొత్త కొత్త రచనలతో అందరినీ అలరించాలని సంచిక ప్రయత్నిస్తోంది.

జూలై నెల ప్రచురితమవుతున్న సంచికలోని రచనల వివరాలు ఇవి.

కాలమ్స్:

  1. రంగుల హేల -4: రియాలిటీ చెక్ – అల్లూరి గౌరీ లక్ష్మి
  2. ఆకాశవాణి పరిమళాలు-13 – డా. రేవూరు అనంతపద్మనాభ రావు
  3. హిమాచల్ యత్రానుభవాలు -6: డి. చాముండేశ్వరి

ధారావాహికలు

  1. జీవన రమణీయం-13 – బలభద్రపాత్రుని రమణి
  2. నీలమత పురాణం-1 – కస్తూరి మురళీకృష్

పద్యకవిత:

  1. నీలి నీడలు – ఖండిక 4 – విద్వేషాలు: చేతన

కథలు:

  1. నేను నా బుడిగి – వాసవి పైడి (పెద్ద కథ)
  2. అడుగులు ముందుకు – భీమరాజు వెంకటరమణ
  3. అదృష్టం – జొన్నలగడ్డ సౌదామిని
  4. మినీ మూన్ – ఎం. వెంకటేశ్వరరావు

కవితలు:

  1. జీవనోత్సవం – పెరుగు రామకృష్
  2. రైతన్నా – ఆదిత్య విష్ణువర్ధన్
  3. అక్షరమై నీతో – రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
  4. జీరాడుతున్న గోడలు సి.హెచ్. ఉషారాణి
  5. జ్ఞాపకాల పరిమళం – శ్రీధర్ చౌడారపు

బాల సంచిక:

  1. నేటి సిద్ధార్థుడు – 4- సమ్మెట ఉమాదేవి
  2. మిథిలా నగర రాజులు – బెల్లంకొండ నాగేశ్వరరావు
  3. కోడి – పిల్లి: – శాఖమూరు శ్రీనివాస్
  4. అన్న ఎత్తు మరదలి చిత్తు – నారంశెట్టి ఉమా మహేశ్వరరావు

ప్రత్యేక వ్యాసం:

  1. గైడింగ్ లైట్ ఫౌండేషన్ – గురజాడ శోభ పేరిందేవి

వ్యాసాలు:

  1. ధృతరాష్ట్ర కౌగిలి – డా. గౌడ జనార్దన్
  2. ‘అధ్యయన భారతి’ ఉపాధ్యాయుల అప్పల నరసింహమూర్తి గారి రచనలు- ఒక అవగాహన: చివుకుల శ్రీలక్ష్మి
  3. కర్మ సిద్ధాంతం – డా. వి. ఎ. కె. కుమారస్వామి
  4. అరవై ఐదు ఏళ్ళ నాటి అలంపురం సభలు – డా. గుమ్మన్నగారి బాల శ్రీనివాస మూర్తి
  5. విశ్వనాథవారి హరిహరాద్వైతము – ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య

పుస్తక పరిచయాలు:

  1. విద్యారణ్య విజయం
  2. విశ్రాంతి కావాలి

పుస్తక సమీక్ష:

  1. లోపలా, బయటా వెతుకులాట “చిగురించే మనుషులు” – కొల్లూరి సోమ శంకర్

సంపాదకీయం

  1. రచనలు చేయాలన్న ఆసక్తి, ఉత్సాహం వున్న యువ రచయితలకు ఆహ్వానం!!!! – జూలై 2018 సంపాదకీయం – సంచిక టీం

సినిమాలు:

  1. ప్రాంతీయ సినిమా-12: పురులు విప్పిన మణిపురి – సికందర్
  2. మరో ప్రయోగాత్మక చిత్రం “అతడే” –  సినిమా రెవ్యూ – పరేష్ ఎన్. దోషి

భక్తి

  1. పరలోక విశ్వాసము – యం.డి. ఉస్మాన్ ఖాన్

సభలు:

  1. మూడు పుస్తకాల ఆవిష్కరణ – ఘంటికోట విశ్వనాథం

కార్టూన్లు

  1. కెవిఎస్
  2. సుధాకర్

సంచికలోని రచనలపై నిర్మొహమాటమయిన అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ సలహాలు సూచనలతో పాఠకులకు సంచిక మరింత చేరువ అవటంలో తోడ్పడాలని ప్రార్థన. ఈ సంచిక మిమ్మల్ని అలరిస్తుందని ఆశిస్తున్నాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here