Site icon Sanchika

కాజాల్లాంటి బాజాలు-90: జంప్ జిలానా…

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]మా[/dropcap] కజిన్ నందినికి అభ్యుదయ భావాలు చాలా ఉన్నాయి. అందుకేనేమో ఒక కథ రాసేసి ‘ఎలాఉందో చెప్ప’మంటూ నాకు పంపించింది. ఆ కథని నేను మీకు పంచుతున్నాను. చదివి మీ అభిప్రాయం కూడా చెపితే నందినీకి అందజేస్తాను. ఇంతకీ కథ పేరేంటంటారా…. ‘జంప్ జిలానా..’. భలే ఉంది కదా పేరూ!.. చదివి చెప్పెయ్యండి మరి..

జంప్ జిలానా…

ఇదివరకటి రోజులు కావు. మారిపోయేయి. ఈ రోజుల్లో అబ్బాయిలూ, అమ్మాయిలూ అని తేడా లేకుండా అందరూ అన్ని పనులూ చేసేస్తున్నారు.

ఇందూ ఈమధ్య ఈ విషయాన్ని గురించే తీవ్రంగా ఆలోచించేస్తోంది. చందూతో కూడా అస్తమానం చర్చలు జరిపేస్తోంది. ఇందూ ఆలోచనలకి చందూకి కాస్త గాభరా పుట్టింది.

అసలు విషయమేంటంటే…

ఈమధ్య ఏ కథ చదివినా, ఏ సినిమా చూసినా పెళ్ళికూతురు పెళ్ళి టైమ్‌కి ఇంట్లోంచి పారిపోతోంది. అలా పారిపోయారని చెప్పే పేరు కూడా బలే తమాషాగా వుంటుంది.. అదే జంప్ జిలానీ.. అంటారుట. అది కూడా ఇందూయే చెప్పిందతనికి.

అలా పెళ్ళి టైమ్‌కి జంప్ అయిపోయిన పెళ్ళికూతుర్ని హీరో కలవడం, ఆమెని బాధ్యతగా కాపాడడం, అసలు పెళ్ళి చేసుకోవలసిన పెళ్ళికొడుకు ఆమెని ప్రేమికుడికి త్యాగం చేసెయ్యడం… ఇలాంటివి ఇందూకి చాలా కనిపిస్తున్నాయి ఈమధ్య..

అందుకే ఇందూ ఇదివరకులా బావిలో కప్పలా ఆలోచించటంలేదు. చాలా విశాల దృక్పథంతో ఆలోచిస్తోంది.

మారిపోయిన రోజుల్ని ఒకటికి పదిసార్లు బేరీజు వేసుకుంటోంది. ఆమాటే చెప్పింది చందూతో…

“ఇదివరకు రోజులు కావండీ. ఏ ఆడపిల్లా ఇప్పుడు ఇష్టం లేని పెళ్ళికి తలూపటం లేదు. ఏ తల్లీతండ్రీ కూతురికి ఇష్టం లేని పెళ్ళి చెయ్యటం లేదు. కాని ఇప్పుడలా ఇష్టంలేని పెళ్ళిళ్ళకి బలైపోతున్నది పెళ్ళికొడుకులేనండీ..”

చందూకి ఠారెత్తింది. “పెళ్ళికొడుకులా..” అన్నాడు ఆశ్చర్యంగా.

“అవునండీ.. మగపిల్లాడు కదా.. ఇష్టం లేకపోతే వాడే చెప్తాడు కదా అని వాళ్ల అమ్మా, నాన్నా అనుకుంటున్నారు. కాని ఈ రోజుల్లో మగపిల్లలు మనసులో మాట బైటకి చెప్పలేక, ఇష్టం లేని పెళ్ళి చేసుకోలేక ఒడ్డున పడ్డ చేపల్లా గిలగిల్లాడిపోతున్నారు.”

ఇందూ మాటలు వింటూంటే చందూకి గొంతెండిపోయింది. ఇందూ కొనసాగించింది..

“మనం చూస్తూనేవున్నాం కదండీ. మీ పెదనాన్నగారి తోడల్లుడి మనవడు ఇలా ఇష్టంలేని పెళ్ళి చేసుకోలేక అమెరికా పారిపోలేదూ..? మళ్ళీ ఇప్పటిదాకా పత్తా లేడు.”

“ఛ.. అబ్బే.. అది పెళ్ళి ఇష్టం లేక కాదు. హఠాత్తుగా అమెరికా ఛాన్సొస్తే.. వెళ్ళే లోపల ఇంకా మూఢమి వెళ్ళలేదూ, ముహూర్తాలు లేవూ అంటే పెళ్ళి చేసుకోకుండానే వెళ్ళేడు.”

చందూ మాట పూర్తి కానేలేదు..

“ఆ.. పైకలా చెప్పుకుంటున్నారేమో. అప్పుడే ఆర్నెల్లయింది వెళ్ళీ.. ఆడపెళ్ళివారు ఇంకో సంబంధం చూసుకున్నారు. ఎందుకంటారూ..” నిలదీసింది మొగుణ్ణి.

 చందూకి సమాధానమేవీ తోచలేదు.

“అందాకా ఎందుకూ.. మా వదినా వాళ్ల మావయ్య బావమరిది కొడుకేం చేసేడూ..?” ఏదో చెప్పబోయింది ఇందు. నీరసమొచ్చింది చందూకి. “ఇంతకీ ఇప్పుడేమంటావ్?” డైరెక్టుగా అసలు విషయానికి రమ్మన్నట్టు అడిగేడు.

“ఇలా పెళ్ళికొడుకు సరిగ్గా పెళ్ళి టైమ్‌కి పెళ్ళింట్లో అందరి కళ్ళూ కప్పి పారిపోయినట్టు ఓ కథ రాస్తే బలే సెన్సేషన్ అవుతుంది కదండీ..” ఉత్సాహంగా అంది. నోరెళ్ళబెట్టేడు చందూ.

“రోజులు మారాయండీ… ఈ రోజుల్లో పెళ్ళికూతుళ్ళు వాళ్లకేం కావాలో చెప్పుకోగలుగుతున్నారు.. కానీ పాపం పెళ్ళికొడుకులే వాళ్ళు ప్రేమించేరనే మనసులో మాట బైటకి చెప్పుకోలేకపోతున్నారు. అందుకే పెళ్ళికొడుకే పెళ్ళి టైముకి ఇంట్లోంచి పారిపోతున్నాడు.”

చందూ నోట మాట లేదు.

“అలా పారిపోతున్న పెళ్ళికొడుకుని హీరోయిన్ కాపాడ్డం, అతని భవిష్యత్తుకి తను అడ్డు తొలగి, అతను ప్రేమించిన అమ్మాయి చేతిని అతని చేతిలో పెట్టి, సూట్‌కేస్ తీసుకుని అలా శూన్యంలోకి నడుచుకుంటూ దూరంగా వెళ్ళిపోవడం.. అబ్బ.. ఊహించుకుంటేనే ఇంత బాగుందే.. రాసేస్తే ఇంకెంత బాగుంటుందో..”

తనకింత చక్కటి ఆలోచన వచ్చినందుకు ఉత్సాహం ఆపుకోలేకపోతోంది ఇందూ.

“ఇప్పుడంతా ఆడవాళ్ళదే హవా.. ఈ సంవత్సరమంతా ఆడవాళ్లదేనని పంచాంగకర్తలు కూడా ఉగాదిరోజు పంచాంగ శ్రవణంలో చెప్పేరు. ఈ కథ చదవగానే నాకు ఎంతమంది ఫోన్లు చేస్తారో, ఎన్ని ఉత్తరాలొస్తాయో..

అవునండీ.. మహిళాసంఘాలు సన్మానం లాంటివి కూడా చేస్తారేమో కదా…”

ఎక్కడికో వెళ్ళిపోయింది ఇందూ.

“అవునూ.. దీనికి పేరు కూడా బలే వస్తుందండీ.. పెళ్ళికూతురు పారిపోతే ‘జంప్ జిలానీ’ అంటున్నాం కదా.. అదే పెళ్ళికొడుకు పారిపోతే ‘జంప్ జిలానా’ అన్నమాట.. ఎలా ఉందంటారూ..?”

చందూకి భయం వేసింది. అసలు ముందక్కణ్ణించి తను ‘జంప్ జిలానా’ ఎలా అవాలా అని ఆలోచనలో పడిపోయాడు.

Exit mobile version