[dropcap]మ[/dropcap]ర్రి ఊడల్లో ఉయ్యాలూగటం
మరిచిపోయిన మాట.
మనసు వేగాల్లో జీవితాన్ని ఊపటం ఇప్పటి ఆట.
ఏ చెరువు దగ్గరా ఆగి సేదతీరాలనుకోని పరుగులో
రమణీయ దృశ్యాలేముంటాయ్ విచిత్రం కాకపోతే.
ఎప్పుడో ఒకసారనుకుంటా; నది ఒడ్డున కూర్చుని
కాలాన్ని మర్చిపోయినట్లు గుర్తు.
మరోసారి సముద్ర తీరంలో
అలల హోరుకి
హృదయంతో సహా తడిచిపోయినట్లూ..
ఇక మరెప్పుడూ ఎటుకేసీ చూడని
నిర్లిప్తత ఆవహించేసి
మరబ్రతుకులకి మనసులు అర్పించేసి
ఎవరో చెప్పినప్పుడు గానీ తట్టని
జ్ఞాపకాల తేనెతుట్టని కదిపి
స్పందించవేం అని ఎవరన్నా సరే..
పిచ్చినవ్వొకటి వస్తుంది.
ఎట్లా ఈ జడత్వాన్ని వదిలించుకునేదీ..
ముసురుకున్న ఇన్ని మద్య
నాకులా నేను ఉండడమంటే
మరొకసారి ధైర్యంతో పుట్టడమే
కొంచం తెలివి కొంచం చదువు
కొంత స్వేచ్ఛ మరికొంత మెదడూ
ఇలా ఉన్నప్పుడు ఎవరుమాత్రం పక్షివాసన రారూ