Site icon Sanchika

కె. విశ్వనాథ్ చిత్రాలలో వాస్తవికత

[dropcap]క[/dropcap]ళాతపస్వి కె. విశ్వనాథ్ కీర్తిశేషులవటంతో తెలుగు సినిమా చరిత్రలో ఒక శకం ముగిసింది. వాస్తవికతని, కళాత్మకతని కలిపి జనరంజకంగా సినిమాలు తీయటం ఆయనకే చెల్లింది. కొన్ని చిత్రాల కథనంలో నాటకీయత ఎక్కువ ఉండేదని నా వ్యక్తిగత అభిప్రాయం. అయినా సన్నివేశాలలో వాస్తవికత ఉండేదనేది ఎవరూ కాదనలేరు.

‘సప్తపది’ చిత్రంలో చిన్న చిన్న విషయాలతో వాస్తవికతను దర్శింపచేశారు. యాజులు (జె. వి. సోమయాజులు) గారి కోడలు అన్నపూర్ణ (డబ్బింగ్ జానకి). వాళ్ళుండేది బ్రాహ్మణుల అగ్రహారం. వారింటి పక్కనే మరో ఇల్లు. పెరటి వైపు ఇళ్ళ మధ్య గోడలు ఏమీ ఉండవు. కొన్ని రాళ్ళు మాత్రం అడ్డుగా ఉంటాయి. పెరట్లో ఆమె మడిబట్ట ఆరేసుకుంటూ ఉంటుంది. రాళ్ళ దగ్గర పక్క పెరట్లో ఒక బ్రాహ్మణ బాలుడు స్నానం ముగించుకుని అక్కడ కిందపడ్డ రాయిని గమనిస్తాడు. ఆ రాయిని ఎత్తి పైన పెడుతూ అన్నపూర్ణతో “ఏమండీ. మీ రాయి మా దొడ్లో పడింది” అంటాడు. ఆమె నవ్వుతుంది. జాగ్రత్తగా గమనిస్తే పక్క పెరట్లో ఒక స్త్రీ చంటిబిడ్డకి సపర్యలు చేస్తూ ఉంటుంది. ఈ వాతావరణమంతా సహజంగా ఉంటుంది. పట్టింపులు, ఆచారాలు ఎలా ఉంటాయో ఈ చిన్న సన్నివేశంలో చూపించారు.

‘సాగరసంగమం’లో బాలు (కమల్ హసన్) తల్లి (డబ్బింగ్ జానకి) పెళ్ళిళ్ళలో వంటలు చేస్తూ ఉంటుంది. సాక్షి రంగారావు వంటపెద్ద. ఒక పెళ్ళికి అతిథిగా వచ్చిన బాలు స్నేహితురాలు మాధవి (జయప్రద) వంటశాలలో బాలు తల్లిని మొదటిసారి కలుస్తుంది. బాలుని త్వరలోనే నాట్యప్రదర్శన ఇవ్వాలని అడుగుతుంది. సాక్షి రంగారావు “ఆ.. ఇస్తాడు. ఎప్పుడు? జన్మంతా దేశంలో ఉన్నవి నేర్చుకోవాటానికి వాడికి సరిపోతుంది. ఇలా పెళ్ళిళ్ళలోనూ, పేరంటాలలోనూ మన బతుకు తీరిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ జన్మెత్తినప్పుడు. అప్పుడు వాడు చేస్తాడు, మనం చూస్తాం” అంటాడు. బాలు అభిలాషని, వారి పేదరికాన్ని స్థూలంగా ఇక్కడ చెప్పేశారు దర్శకుడు. సాక్షి రంగారావు వెంటనే బాలు తల్లితో “ముక్కలు తరిగినంతవరకు చాలు గానీ.. ఎప్పుడు భోజనాలంటారో ఏమిటో.. వెళ్ళి పప్పు రుబ్బు” అంటాడు. పని మీద ధ్యాస చెదిరిపోని వ్యక్తిత్వం. అక్కడే ఉన్న ఇంకో ఆమెతో “నువ్వేమిటమ్మా ఇంకా దుంపల్లోనే ఉన్నావు? కాడలు తరుగు కాడలు” అంటాడు. మళ్ళీ బాలుతో “నువ్వేమిట్రా? అక్కడెవరో గొప్పావిడ డ్యాన్సుట. వెళ్ళి మెళకువలు నేర్చుకో” అంటాడు. అతనికి బాలు మీద ఉన్న ఆపేక్ష కూడా తెలుస్తుంది. ఇంతలో ఒకతను అరిటాకులు తీసుకుని ఇతని దగ్గరకు వస్తాడు. ఇతను “ఆ.. చేస్తున్నావు.. చూస్తున్నా విస్తళ్ళు.. కానియ్” అంటాడు. వంటపెద్ద దృష్టిలో పడాలనే తాపత్రయం అతనిది. అది గమనించిన సునిశిత బుద్ధి ఇతనిది. ఒప్పుకున్న పని చక్కగా చెయ్యటం కోసం కాస్త కటువుగా ఉండక తప్పని పరిస్థితి. అలాగని ఆప్యాయత తక్కువేం ఉండదు. అతన్ని అర్థం చేసుకుని అందరూ నడుచుకుంటారు. ఈ సన్నివేశంలో నేపథ్యంలో వయొలిన్ నాదం వినిపిస్తూ ఉంటుంది. మాటల్లో జంధ్యాల, సంగీతంలో ఇళయరాజా తమ ప్రతిభను చూపించారు. పెళ్ళి అయ్యాక వచ్చే సన్నివేశంలో మాధవి తండ్రి అతిథిగృహం నుంచి కారులో వెళుతుంటే మాధవి మేడ పైనుంచి పిలిచి కారు ఆగిన తర్వాత “సరోజ వాళ్ళు వస్తామని అంటే రమ్మనండి. మనతో పాటు తీసుకువెళదాం. మళ్ళీ పిలవలేదని నిష్ఠూరాలు వెయ్యకుండా” అంటుంది. చుట్టాలు ఎలా ఉంటారో వాస్తవికంగా చూపించారు.

‘సాగరసంగమం’లోనే ఫొటో స్టూడియో సన్నివేశంలో యజమాని కూతురు లోపలి నుంచి మాటిమాటికీ “నాన్నా” అని పిలవటం, అతను “వస్తున్నా తల్లీ” అని వెళ్ళటం ముచ్చటగా ఉంటుంది. ఇంటికి ఆనుకుని ఉన్న స్టూడియో అప్పటి తీరుతెన్నులని కళ్ళకి కడుతుంది. బాలు తాగుడుకి బానిస అయినపుడు రఘు (శరత్ బాబు) అతని బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. కృష్టాష్టమి రోజున బాలుని ఇంటికి తీసుకెళితే వాకిట్లో ఉన్న కృష్ణపాదాలు చూసి తాను తాగి ఉన్నాడు కాబట్టి ఆ దారిలో లోపలికి రానని అంటాడు. రఘు లోపలికి వెళితే అతని భార్య “అతను రాలేదా” అంటుంది. “వచ్చాడు. ఈరోజు పండగ కదా. ఈ అవతారంతో లోపలికి రాలేను అని బయటే కూర్చున్నాడు” అంటాడు రఘు. ఆమె బయటకి వచ్చి బాలుకి ఆహారం పెడుతుంది. “నేనెక్కువగా తాగలేదు వదినా” అంటాడు బాలు. “నేనడగలేదే” అంటుందామె. బాలు ఆమె అవ్యాజప్రేమకు కన్నీళ్ళు పెట్టుకుంటాడు. అతను ఎందుకు తాగుబోతుగా మారాడో ఆమె అర్థం చేసుకుంది. ఈ సన్నివేశం మొదటిసారి చూసినపుడు అంత ప్రభావం ఉండకపోవచ్చు. కానీ చిత్రం మళ్ళీ చూసినపుడు బాలు మీద సానుభూతితో భావోద్వేగాలు కలుగుతాయి.

‘స్వాతిముత్యం’లో మల్లిఖార్జునరావుది చిన్న పాత్ర. సుత్తి వీరభద్రరావుకి రెండో పెళ్ళికి పిల్లనిచ్చిన మామగారు. మనసున్న పల్లెటూరి మనిషి. అతనికి అల్లుడు చెడ్డవాడని తెలుసు. అలాగే వీరభద్రరావు మేనల్లుడైన శివయ్య (కమల్ హసన్) మంచితనమూ తెలుసు. చుట్టరికం ఉంది కదా అని తన అల్లుడికి వత్తాసు పలకడు. శివయ్యకి మంచి సలహాలు ఇస్తూ ఉంటాడు. గుడి మెట్లు కడిగి పసుపు కుంకుమలు రాస్తే లలిత (రాధిక) కి మంచి జరుగుతుందని శివయ్య ఆమెని తీసుకువస్తాడు. ఎత్తైన కొండ మీద ఉన్న గుడికి కిందనుంచి ఉన్న మెట్లన్నీ కడగమంటాడు. ఆమె మధ్యలో సొమ్మసిల్లి పడిపోతుంది. తలపెట్టిన పని పూర్తి కాలేదని శివయ్య బాధపడుతుంటే “గోదారిలో మునిగితే పుణ్యవని ముక్కు మూసుకుని నీళ్ళల్లో అట్టాగే కూకుంటే అట్టాగే పైకెల్లిపోతాం. ఇన్ని మెట్లకి పూజలు చేయాలంటే ఆడకూతురు తట్టుకోవద్దా” అంటాడు మల్లిఖార్జునరావు. గుడ్డినమ్మకం పెట్టుకోకుండా వాస్తవికంగా ఆలోచిస్తాడు. “చెయ్యకపోతే కష్టం ఎలా తీరుతుంది” అంటాడు శివయ్య. “ఒరే! గుళ్ళో పూజలు చెయ్యాలంటే నువ్వే చేత్తన్నావేట్రా? పూజారి గోరు చేత్తన్నారు. మనమట్టా పూలు ముట్టుకుంతన్నామంతే, కానీ పుణ్యం మనకొచ్చేత్తన్నాది. ఆయమ్మ కష్టాలు పోవాలంటే ఆమె పేరు చెప్పి నువ్వయినా చెయ్యొచ్చు, నేనైనా చేయొచ్చు” అంటాడు మల్లిఖార్జునరావు. ఇతరుల కోసం మనం కూడా పూజలు చేయొచ్చనే మంచి సందేశం ఇస్తాడు.

‘స్వర్ణకమలం’లో మీనాక్షి (భానుప్రియ) తండ్రి చేయించే నృత్య సాధన చేయటం ఇష్టం లేక గజ్జెలు బావిలో పడేస్తుంది. పక్కింటి మేడ పైన అద్దెకుండే చందు (వెంకటేష్) అది చూసి బావిలోకి దిగి గజ్జెలు వెలికి తీస్తానని సిద్ధమవుతాడు. మీనాక్షి తండ్రితో సహా అందరూ వారిస్తారు కానీ చందు ధైర్యంగా దిగుతాడు. మీనాక్షి ఉండే ఇంట్లోని పక్క వాటాలో ఉండే అతను “మా స్టీలు పళ్ళెం బావిలో పడిపోయింది. చూడు బాబూ” అంటాడు. కొందరి స్వార్థాలు ఇలాగే ఉంటాయి. అందరూ ఆ సందట్లో సడేమియాని చీవాట్లేస్తారు. చందు ఎంతకీ బయటకి రాకపోతే అందరూ కంగారుపడతారు. కంటిచూపు సరిగా లేని మీనాక్షి తండ్రి గాబరాగా కుర్చీలోంచి పైకి లేస్తే సడేమియా గారు “వాళ్ళు చూస్తున్నారు. మీరు కూర్చోండి” అంటాడు. ఎంత స్వార్థం ఉన్నా పెద్దల పట్ల గౌరవం ఉండేది ఆరోజుల్లో. చందు బావిలోంచి ముందు ఎప్పుడో పడిపోయిన రాగిచెంబు పైకి విసురుతాడు. తర్వాత స్టీలు గిన్నె విసురుతాడు. అది చూసి “అది మాదే” అంటాడు సడేమియా. పనిమనిషి “మరి నానెత్తుకెల్లిపోనానని నా మీద పడిపోనారు” అంటుంది. పనిమనిషి మీద నిందలు వేయటం మామూలే కదా. సడేమియా గిన్నె అందుకోబోతుంటే అది జారి మళ్ళీ బావిలో పడిపోతుంది. అక్కడే ఉన్న పక్కింటి సాక్షి రంగారావు “ఇక మళ్ళీ తీయడు. కష్టార్జితమైతేగా దక్కేందుకు” అంటాడు. ఇరుగుపొరుగుల్లో ఇలాంటి దెప్పిపొడుపులు వింటూనే ఉంటాం. చివరికి గజ్జెలు దొరుకుతాయి. మీనాక్షి చందుని తిట్టుకుంటూ తండ్రిని తీసుకుని లోపలికి వెళుతుంది.

ఇలా చెప్పుకుంటూ పోతే అన్నో అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయి విశ్వనాథ్ గారి సినిమాల్లో. ఆయన దర్శకత్వం మానేశాక తనని చూడటానికి వెళ్ళిన ఒకాయనతో మాట్లాడుతూ “నాకు సన్నివేశాల గురించి, చిత్రం తీసేంత నిడివి ఉన్న కథల గురించి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. సినిమాని మర్చిపోవాలంటే నా ప్రాణం పోవాల్సిందే” అన్నారట. ఆ దిగ్దర్శకుడికి శ్రద్ధాంజలి!

Exit mobile version