Site icon Sanchika

కాగితం సంచీ

[జులై 12 పేపర్ బేగ్ డే సందర్భంగా ‘కాగితం సంచీ’ అనే కవితని అందిస్తున్నారు శ్రీమతి దివాకర్ల రాజేశ్వరి]

[dropcap]అ[/dropcap]తి సామాన్యమైన
కాగితం సంచీ
సరళ వినియోగ మాధ్యమంలో
సర్వ జన హితాన్ని కోరింది.

చెట్టు చాటున పుట్టింది.
అడవి తల్లి లాలనలో
గాలి ఊయలలూగింది.
సహజ ప్రకృతి స్నేహంతో
ప్రపంచాన్ని చుట్టింది.

పేదరాలి గుడిసెలో
రద్దు కాగితాలను
మెలకువగా మడచి చేసిన సంచీ
బడ్డీ కొట్టు చిల్లర కొనుగోళ్ళకు
వీలుగా అమరింది.

బజారు మలుపులో
కిరాణా అంగడి సరకుల
చేతి బదులు బేరాలకు
అలవాటుగా వచ్చే
సగటు జీతగాళ్ళకు
పర పర లాడే
పాత పత్రిక పుటలను
అతికించిన సంచీ
సరాసరి తూకానికి సరిగా
సమకూడింది.

రోడ్డు మలుపులో
బండి చక్రాల మీద
మిరపకాయి బజ్జీ ఘుమ ఘుమలు
ముకు పుటాలకు తాకి
చుట్టు మూగిన చిరుతిళ్ళ ఆశలకు
నూనె మరకల కాగితం సంచీ
గోరు వెచ్చని చురకలను అంటించుకుంది.

పేద ధనిక భేదమన్నది లేక
చనువును సంపాదించింది.
మోమాట పడని కలివిడితో
దినసరి వాడుకల కలిమిని పెంచింది

మిఠాయి కొట్టులో
తీపిని పంచేందుకు నునుపెక్కిన
మైనం పూతల కాగితంసంచీ
పాకం బిళ్ళల అద్దకాలతో
నోరు తెరుచుకుని ఊరించింది.

వజ్రాల దుకాణం లో
వెల కట్ట లేని హారానికి
దట్టపు నాణ్యాల అట్ట సంచీ
కంఠ పూర్తి
సొగసులను దాచి ఉంచింది.

పెద్ద భవంతిలో
బిడ్డ పుట్టిన రోజుకు
బహుమతు లొలికిన
భండాగారాన్ని విప్పిన
పాల మెరుపుల తాపడపు సంచీ
ఒక్కటొక్కటిగా
పాపకు స్వప్న లోకాల సందర్శన
సులభ ద్వారాలను తెరచింది.

పెళ్ళిళ్ళకు పేరంటాలకు,
అరటి పండు,సెనగల తాంబూలాలకు ,
పేపరు సంచీ ప్రమాణ సాక్షిగా
పసుపుకుంకుమలను
పంచింది.

హస్త కళల నైపుణ్యానికి
పేపర్ బేగ్ వివిధ భంగిమల రూపాలనెత్తింది.
శాస్త్రజ్ఞుల ఉద్ఘాటనలో
విద్యావేత్తల చర్చలలో
పండిత ప్రముఖుల గోష్టిలో
సభ లకు గౌరవమిచ్చిన
జ్ఞాపికలకు, శాలువలకు, సన్మాన ప్రదానాలకు
కలంకారీ కళలకాగితం సంచీ
కొలత లేని బరువుల సంప్రదాయాన్ని
అతిసులువుగ మోసింది.

రూపమున్నంతవరకు
సమసిపోనంటుంది.
విసిగి వేసారి విసిరివేసినా సరే
నేలతల్లి ఋణం తీర్చుకోలేనంటూ,
మట్టి సారమై మిగిలి
మరలి వచ్చే మూల ధాతువులతో
పచ్చని ఊపిరి శ్వాసల మర్మాలను తెలిపింది.

Exit mobile version